ప్రకృతితో మమేకమై సృష్టి వైచిత్రాలకి వింతపడి
గుండె గిన్నెలో పట్టక పొంగిపొరలి పోతున్న
దుఃఖమో,ఆనందమో,ఆహ్లాదమో,వేదనో, రోదనో
పంచబోయినప్పుడల్లా నాలుగు వాక్యాలొస్తాయి
ఆగక తోసుకొచ్చే అప్పటి జలప్రవాహానికి
దారీ, తెన్నూతెలీదు ఉరికే ఊపు తప్ప
పొంగి పొరలే ఆ తలపుల తరంగాలకు
వాక్య నిర్మాణమెక్కడ? ఆవేశం తప్ప!
కంఠస్థ పద్యాల్ని వల్లెవేసే పితామహులు
ముత్తాతల దోవలో లేవంటూ వెక్కిరిస్తారు
పాత నూతి పద్యాల్ని తోడుతుండే పండితులు
కొత్త నీటి ప్రతీకల్లో రుచిలేదని చప్పరిస్తారు
యువత కవితల రసాస్వాదనలొద్దంటారు
మనసుల్తో స్పందించే సమయం లేదంటారు
బతుకు తెరువుల పరుగుల్తో డస్సిపోయాం
బుర్రతో యోచించే భావనలు భారమంటారు
ద్వేషపునాదుల, అడ్డుగోడనిర్మాణ కవులూ
మా గుంపుకే పీటలు వెయ్యమనేవారూ
ప్రత్యేక సమూహాల సంగతేంటనే వారూ
సత్కారాల వరసల్లో ముందు సర్దుకుంటారు
అక్షరాల్ని కష్టంగా కూడబలుక్కుని చదివినా
అనుభూతి కొసనందుకుని మైమరచిపోతూ
పఠించి పలవరించే వారికోసమే కవితాపంక్తులు
భక్తిగా తపస్సుక్కూర్చుంటాయి ఏళ్లతరబడీ
అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.