[సంచిక పాఠకుల కోసం ‘దిల్ చాహతా హై’ అనే సినిమా లోని ‘తన్హాయీ, తన్హాయీ’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు.]
ఆధునిక కాలంలో హిందీలో వచ్చిన పాటలలో వాసి ఉన్న పాటల శాతం తగ్గినా రాశి గణనీయంగానే ఉంది. గుల్జార్‌తో పాటు ఆ వాసిని నిలబెట్టిన కవి జావెద్ అఖ్తర్. 1992లో ‘ఖేల్’ అని ఒక కామెడీ చిత్రం వచ్చింది. అందులో నాయకుడు అవిటివాడుగా నటించి ఒక సంపన్న మహిళ సానుభూతి పొంది డబ్బు కాజేయాలని చూస్తాడు. ఇది హాస్య సన్నివేశం. నాయకుడికి తన ప్రేయసి చేసిన మోసం వల్ల కాళ్ళు చచ్చుబడిపోయాయని మోసపూరితమైన సందర్భం సృష్టించి అక్కడొక విరహగీతం పెట్టాడు దర్శకుడు రాకేష్ రోషన్. ఈ సన్నివేశానికి జావెద్ అఖ్తర్ ఒక అద్భుతమైన పాట రాశారు. ఆ పాట ఒక ప్రేమ కావ్యంలో ఉండవలసిన పాట. పల్లవి ఏమిటంటే:
సూనే షామ్ సవేరే తబ్ సే హై మేరే జబ్ సే గయే తుమ్
సుబహోం కే యే ఉజాలే రాతోం సే కాలే తుమ్ జో హువే గుమ్
అనువాదం:
నీవు వెళ్ళాక ఉదయమూ సాయంత్రమూ శూన్యమైపోయాయి
నీవు మరుగయ్యాక పగటి కాంతులు కాళరాత్రుల కంటే నల్లబడ్డాయి
మనసు బాగాలేకపోతే ఎంత వెలుగు ఉన్నా ఆస్వాదించలేం. పగటి వెలుగులు కూడా చీకట్లతో సమానం అయిపోతాయి. ఎంత లోతైన భావం!
అదే పాటలో ప్రేయసిని దేవత అని సంబోధిస్తూ ‘మేరే ఆఁసూ ఫూల్ తేరే, మేరా లహూ తేరీ కుమ్‌కుమ్’ అంటారు జావెద్ అఖ్తర్. అంటే ‘నా అశ్రువులే నీకు పూలు, నా రుధిరమే నీకు కుంకుమ’ అని. హాస్యప్రధానమైన చిత్రంలో కూడా ఇంత భావగర్భితమైన పాట రాశారు. ‘ఖేల్’ చిత్రం విజయవంతం కాకపోవటంతో ఈ పాట మురుగునపడిపోయింది.
‘దిల్ చాహతా హై’ (2001) చిత్రం విజయవంతం కావటంతో అందులో జావెద్ అఖ్తర్ రాసిన పాటలు ప్రజాదరణ పొందాయి. ‘తన్హాయీ, తన్హాయీ’ పాట సోనూ నిగమ్ పాడాడు. సంగీతం శంకర్-ఎహసాన్-లాయ్. సాహిత్యం, సంగీతం, స్వరం పోటీ పడుతూ ఉంటాయి ఈ పాటలో.
‘దిల్ చాహతా హై’ ముగ్గురు స్నేహితుల కథ. ఆకాశ్‌కి ప్రేమా గీమా అంటే గిట్టదు. సమీర్ చూసిన ప్రతి అమ్మాయినీ ప్రేమించేస్తూ ఉంటాడు. సిద్ధార్థ్ మృదుస్వభావి. వయసు కంటే మనసు ముఖ్యం అనుకుంటాడు. అతనికి అతనికంటే పెద్ద వయసున్న స్త్రీ నచ్చుతుంది. అన్ని కథలూ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ‘తన్హాయీ, తన్హాయీ’ పాట ఆకాశ్ మీద చిత్రీకరించిన పాట. ఈ పాత్రని ఆమిర్ ఖాన్ పోషించాడు. అతనికి శాలిని (ప్రీతీ జింటా) పరిచయమవుతుంది. అయితే ఆమెకి నిశ్చితార్థం అయిపోయిందని ఆకాశ్‌కి తెలియదు. ఆకాశ్ సిద్దార్థ్‌తో గొడవపడి అతనితో మాట్లాడటం మానేస్తాడు. తర్వాత ఆస్ట్రేలియాలో తన తండ్రి కంపెనీ వ్యవహారాలు చూసుకోవటానికి వెళతాడు. అక్కడ శాలిని మళ్ళీ కనపడుతుంది. ఇద్దరూ స్నేహితుల్లా కలిసి తిరుగుతారు. ఇద్దరికీ ప్రేమ పుడుతుంది. కానీ శాలిని తన పెళ్ళి నిశ్చయమైందని అతన్ని వదిలి ఇండియా వచ్చేస్తుంది. తన కాబోయే మామగారు తన తలితండ్రులు చనిపోతే తనని సాకాడని, ఆ కృతజ్ఞతతో ఆయన కొడుకుని పెళ్ళి చేసుకోవటం తన ధర్మమని ఆమె భావన. ఆకాశ్ అనుకోకుండా ఆమె ప్రేమలో పడ్డాడు. ప్రేమ అనుకోకుండానే పుడుతుందని అతనికి తెలియదు. శాలిని వెళ్ళిపోయాక ఆమెని మరచిపోలేక బాధపడతాడు. స్నేహితులు లేక, ప్రేయసి లేక కుంగిపోతాడు. అప్పుడు వచ్చే పాటే ఇది.
తన్హాయీ.. తన్హాయీ
దిల్ కే రాస్తే మేఁ కైసీ ఠోకర్ మైనే ఖాయీ
టూటే ఖాబ్ సారే, ఏక్ మాయూసీ హై ఛాయీ
హర్ ఖుషీ సోగయీ, జిందగీ ఖోగయీ
తుమ్‌సే జో ప్యార్ కియా మైనే తో సజా యే పాయీ
తన్హాయీ, తన్హాయీ.. మీలోం హై ఫైలీ హువీ తన్హాయీ
ఖాబ్ మేఁ దేఖా థా ఎక్ ఆఁచల్ మైనే అప్‌నే హాథోం మేఁ
అబ్ టూటే సప్‌నోం కే షీషే చుభ్‌తే హైఁ ఇన్ ఆఁఖోం మేఁ
కల్ కోయీ థా యహీఁ, అబ్ కోయీ భీ నహీఁ
బన్‌కే నాగిన్ జైసే హై సాఁసోం మేఁ లెహరాయీ
తన్హాయీ, తన్హాయీ.. పల్‌కోం పే కిత్‌నే ఆఁసూ హై లాయీ
క్యోం ఐసీ ఉమ్మీద్ కీ మైనే జో ఐసే నాకామ్ హుయీ
దూర్ బనాయీ థీ మంజిల్ తో రస్తే మేఁ హీ షామ్ హుయీ
అబ్ కహాం జావూఁ మైఁ, కిస్‌కో సమ్‌ఝావూఁ మైఁ
క్యా మైనే చాహా థా ఔర్ క్యోం కిస్మత్ మేఁ ఆయీ
తన్హాయీ, తన్హాయీ.. జైసే అంధేరోం కీ హో గెహరాయీ
పల్లవి అనువాదం:
ఒంటరినే, నేనొంటరినే…
మనసు వేసిన బాటలో ఎదురుదెబ్బ తగిలింది
కలలన్నీ భగ్నమై ఒక నిర్వేదం మిగిలింది
ప్రతి ఆనందం సుప్తమయింది, జీవితమే వ్యర్థమయింది
నిన్ను వలచినందుకు నాకు పడిన శిక్ష ఇదే
ఒంటరినే, నేనొంటరినే.. కనుచూపు మేరలో ఎవరూ లేని ఒంటరినే
ఇక్కడ ‘హర్ ఖుషీ సోగయీ’ అనే ప్రయోగం కొత్తగా ఉంటుంది. అంటే ప్రతి ఆనందం నిదురించింది అని. మామూలుగా ఆనందాలు వస్తూ పోతూ ఉంటాయి. మనిషి జీవితంలో నిద్రావస్థ కూడా అలాంటిదే. నిద్ర వస్తూ పోతూ ఉంటుంది. మరణమొక్కటే తిరిగిరాని స్థితి. అతని జీవితంలో ఆనందాలు ఉన్నా అతను ఆస్వాదించలేడు. ఎప్పుడూ ఆమె తలపులే. మామూలుగా మనిషికి కష్టసమయంలో ఎవరో ఒకరు తోడుంటారు. అతను దేశం కాని దేశంలో ఉన్నాడు. తలిదండ్రులు, స్నేహితులు అక్కడ లేరు. దాంతో ఒంటరితనం ఇంకా గాఢంగా తయారయింది.
చరణం 1 అనువాదం:
కలలో చూశానప్పుడు ఒక పమిట కొంగు నా చేతిలో
ఆ కలల అద్దపు ముక్కలు గుచ్చుతున్నాయిపుడు నా కళ్ళలో
అపుడు నువ్వున్నావు, ఇపుడు ఎవరున్నారు?
నాగినియై నా శ్వాసలో బుసలుకొడుతోంది విరహమే
ఒంటరినే, నేనొంటరినే.. కళ్ళలో కన్నీళ్ళ కడలున్న ఒంటరినే
అతనికి నిద్ర కరువయింది. కలలే ముక్కలై కళ్ళలో గుచ్చుతున్నాయని అంటున్నాడు. నిద్ర లేని వారికి కళ్ళలో ఏదో గుచ్చుకున్నట్టు ఉండటం సహజం. దాన్ని కవితాత్మకంగా చెప్పారు. విరహం నాగినియై వేడి నిట్టూర్పులనే బుసలు కొడుతోంది. కళ్ళలో కన్నీళ్ళకి అంతులేదు.
చరణం 2 అనువాదం:
నే కట్టుకున్న ఆశల పందిరి ఎందుకిలా కూలింది?
సుదూర గమ్యానికి పయనంలో నడిదారిన పొద్దు గూకింది
ఇప్పుడెక్కడికి వెళ్ళను? ఎవ్వరినని బతిమాలను?
నే కోరుకున్నది ఎంతో ఉంది, నాకు ప్రాప్తమయినది ఇంతే
ఒంటరినే, నేనొంటరినే.. కమ్ముకున్నాయి దట్టమైన చీకట్లే
ప్రేమ మీద అతనికున్న అపనమ్మకం రూఢి అయింది. అందుకే ప్రేమని చేరుకోలేని గమ్యం అంటున్నాడు. ఆ ప్రయాణం చేయకూడదని అనుకున్నాడు. కానీ మనసు మాట వినదుగా. అనుకోకుండా ఆ ప్రయాణం మొదలు పెట్టాడు. దారిలో ఉండగానే పొద్దు గుంకింది. అంటే ఆమె వదిలిపోయింది. అతనికి అంతా చీకటిమయం అయిపోయింది.
ఈ చిత్రంలో కొసమెరుపు ఏమిటంటే శాలినికి కాబోయే మామగారు శాలిని వేరొకరిని ప్రేమించినా కృతజ్ఞతకి కట్టుబడి తన కొడుకుని పెళ్ళి చేసుకుంటోందని తెలిసి శాలినిని చీవాట్లేస్తాడు. “నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నది ఇంతేనా? మా పట్ల కృతజ్ఞత తప్ప ప్రేమ లేదన్నమాట. ప్రేమ ఉంటే మనసులో మాట మాకు చెప్పేదానివి” అంటాడు. అవతలివారి ప్రేమని తక్కువ అంచనా వేయటం కూడా తప్పే. శాలిని చేసిందదే. తనని సాకారు కాబట్టి వారి ఋణం తీర్చుకోవాలి అనుకుంది. కానీ వారు ఆమె ఆనందమే తమకి ముఖ్యం అనుకున్నారు. ప్రేమకి విలన్లు అవసరం లేదు. ఒక్కోసారి మన ప్రేమకి మనమే విలన్లు అయిపోతాం!