[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
281
దైవ భక్తి ఇతర జీవరాశిలో ఉండునా?
లేవగానే ఆహారం కోసం వేట
కేవలం జీవితాన్ని గడుపుతై
కావాలని దైవాన్ని పూజించవు కదా?
282
మూఢ నమ్మకాలకు ప్రజలు బలైపోతున్నారు
గాఢంగా నమ్ముతారు, ఆచరిస్తారు
వాడ వాడలా ఇదే జరుగుతుంది
అడ్డు కట్ట వేసే నాథుడేడీ?
283
యెంత ఎదురు చూసినా రాని ఫలితం
కొంత సమయంలోనే వచ్చు
పంతం పట్టి ప్రయత్నించినా ఫలితముండదు
అంతా సవ్యంగా ఉంటే వెంటనే రావచ్చు
284
బండ రాళ్లు ఒక దానిమీద ఒకటి పేర్చినట్లుంటాయి
ఒడిదుడుకులు తట్టుకుంటాయి
పడేట్లు కనిపించినా పడిపోవు
రోడ్ల వెంట చూడవచ్చు
285
తేనె పూసిన కత్తులు ఎందరో జనంలో
వాని నిజ స్వరూపం
తేనె తొలగితే గాని తెలియదు
కాని దాన్ని తొలగించటము అంత తేలిక కాదు
286
మౌన రాగం ఎందరిలోనో ఉంటుంది
తనలోని విషయాలు బైట పడకుండుటకు
కొన్ని సందర్భాల్లో అవసరమే
ఎన్నటికీ బైటకు రావు కొన్ని
287
అంగ రంగ వైభవముగా వివాహము
నగ నట్రతో అమ్మలక్కల ఒంపు సొంపులు
రంగంలోకి దిగిన చోరులు
తగినంత తస్కరించి పారిపోయె
288
వంపు సొంపుల వయ్యారి భామ
కొప్పులో పూలతో అలంకరించె
ముప్పులో ఉందని తెలియకపోయె పాపము
నిప్పులో ఇరుక్కుపోయి విల విలలాడే
289
భారత రామాయణ రచనా పటిమ యెంత గొప్పో
నేర్పుతో అప్పటి కాలమాన స్థితులు
ఓర్పుగా పొందుపర్చిరి
నేరుగా జనం మన్ననలందినవి
290
మానవ జీవితము వింత వింత నాటకాల సమ్మిళితం
తనని తాను మర్చిపోయే స్థితి
తానే గొప్ప అని విర్రవీగే స్థితి
మన్ననలు పొందే స్థితి
శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్‌గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.