[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
111
ఉన్నూరు వదలి వేరే దేశం వెళ్లే వాళ్ళు
ఎన్నటికీ తిరిగొచ్చే ఆలోచనుండదు
కన్న వారిని వదలి వెళ్తారు
అన్నీ వదలి హాయిగా వుంటారు
112
చందమామ రోజు రోజుకి తగ్గి పోతున్నాడు
ఎందుకో తెలియదు
అందమైన ముఖంలో కాంతి లేదు
అందాల చందురుని చూచి యెంతో దిగులు ప్రజకు
113
గ్రహాలు నిరాధారాలేనని తమకు తెలుసు
తహ తహలాడుతూ ప్రశ్నించె సూర్యుని
మహత్తరంగా సమాధానం
మహా వేగంగా చుట్టూ త్రిపుతున్నాగా
114
గ్రహాంతర వాసులు భూమిని చేరి
వాహనాలను భూమి మీద దించిరి
విహారం చేద్దామనే ప్రయత్నం
పహారా కాసే సైనికులు చూచిరి
115
వగలమారి వయ్యారి భామా
సొగసు అంతా నీ సొంతమేనా
పొగరుబోతు పోట్ల గిత్తలాగున్నావే
పొగ మంచు లాగా కరిగి పోవా నీ అంద చందాలన్నీ
116
ఏ జీవి యెంత ఎత్తుకెదగాలో
రాజీ పడవలసిన సంఘటనలెన్నో
ప్రజల మెప్పులెన్ని పొందాలో
వజ్రంలా వుండాలో అన్నీ ప్రకృతికే ఎరుక
117
ఎండ మావీ నీకెవరిచ్చారే ఆకారం
కొండల మాటున ఇసుక తిన్నెలలో
ఎండతో నా ఆకారాన్ని సంతరించుకున్నా
మండే ఎండలోనే నా ఆకారం
118
సాధు జంతువే ఒకనాటి మానవుడు
ఛేదిస్తే తేలిన సారాంశ మిదే గావచ్చు
క్రోధ, మద, మాశ్చర్యాలతో అలరారు వాడు
ఆధునిక మానవుడు
119
విద్యావంతుడై వుండి
హద్దు మీరు ప్రవర్తించి
ఎదుటి వారిని కించ పరచడం సమంజసమా ?
కాదనగలరా తన ప్రవర్తన మంచిది కాదని
120
పొగరు తలకెక్కిన మానవులందరూ
తగరు మంచి పనులు చేయుటకు
వగరు బోతులు అందరూ
తగునే తీర్పు చెప్పుటకు సిద్ధమైనందుకు
శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్‌గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.