[శ్రీ పాణిని జన్నాభట్ల రచించిన ‘తనలో నన్ను’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు శ్రీ యం.వి.రామారావు.]
తన మనసును కుదిపేస్తున్న భావాలు ఇతరులతో పంచుకోవాలన్న కుతూహలమే కథారచనకు పురికొల్పాయని రచయిత చెప్పకనే చెప్పారు. తనకు ఎదురైనా వాస్తవం సంఘటనలే తన తొలి కథా వస్తువులని చెప్పారు. తన కథలు వైవిధ్యంగా ఉండడానికి కారణం తనకున్న ఆసక్తి వల్ల కాకతాళీయంగా జరిగిందని చెప్పడం ఆయన వినమ్రతకు దర్పణం. ఏదైనా రచయిత పాణిని జన్నాభట్ల కథల్లో ఆధునికతతో పాటు కథావైవిధ్యమే ప్రధాన శిల్పం. తన రచనలపై ఇతర రచయితల ప్రభావం ఉందని ఒప్పుకునే నిజాయతీ ఆయనకు ఉంది. విదేశాల్లో ఉంటున్నా భారతీయత మరువని యువ రచయిత విన్నూతంగా కథలు పాఠకులకు అందించడం నిజంగా మన అదృష్టమే. ఆయన కథ, కథనం కొత్తగా ఉన్నాయి. కథా వస్తువు ఎంపిక, ఆలోచన, విశ్లేషణ లలో ప్రాణిని ప్రత్యేక శైలి ఆయన ఏమిటో చెబుతాయి.
‘ఎందుకీ అగాధం’ తో సాహితీ ప్రస్థానం ప్రారంభించినా ‘మరో కురుక్షేత్రం’ తో ఉగాది కథల పోటీలో బహుమతి పొందారు. అలాగే ‘తనలో నన్ను’లో రచయిత పరిణతి, ‘ఎయిత్ సిన్’ లో తాత్విక ధోరణి కనిపిస్తుంది.
‘మరో కురుక్షేత్రం’ కథలో ప్రజాస్వామ్యంలో డొల్లతనం విశదీకరించారు. పేరుకే ప్రజాభిమతం, నాయకుల మనోభీష్టమే చివరికి గెలుస్తుందని నేటి రాజకీయ క్రీడను తేటతెల్లం చేసారు. త్రిపాలకులను రంగంలోకి దింపి కౌరవ, పాండవుల కురుక్షేత్ర యుద్ధానికి కొత్త కథాంశం అద్దారు. భద్రబాహు శంతనుడి సోదరుడు. కాశ్మీరు దేశానికి రాజుగా వెళ్లిపోయాడు. ఆయన మనవళ్లు ముగ్గురు. వారు త్రిమూర్తుల అంశంతో జన్మించిన వజ్రహస్తుడు, సూత్రకుడు, చతుర్భుజుడు. వారు మహావీరులు. మళ్లీ ఇన్నాళ్లకు దాయాదులైన పాండవులు, కౌరవులగూర్చి తెలుసుకుని యుద్ధానికి బయలుదేరారు. మహావీరులైన త్రిపాలకులను చూడగానే కౌరవ, పాండవ సైన్యం లోని చాలా మంది రాజులు తోకముడిచారు. దుర్యోధనుడి సైన్యంలో సగం తగ్గింది. అయినా పైకి డాంబికంగా ఆచార్యుడు ద్రోణుడు, తాత భీష్ముడు, అశ్వద్ధామ ఉన్నారు కదా చాలు పాండవులను, త్రిపాలకులను మట్టి కరిపించడానికని అన్నాడు. భీష్ముడు “తొందరపడకు నాయనా పాండవులతో సమాలోచన చెయ్యి” అని సలహా ఇచ్చాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ధర్మరాజు కూడా త్రిపాలకుల వరాలు, పరాక్రమం గుర్తుచేస్తూ అర్జున, భీమసేనులు వారిస్తున్నా, ‘ఏమిటి కర్తవ్యం?’ అని తాత భీష్ముడి వంక చూసాడు. త్రిపాలకులకు భీష్ముడు కౌరవ పాండవుల యుద్ధంలో జోక్యం చేసుకోవద్దని నచ్చచెప్పినా వారు వినలేదు. స్వతంత్ర రాజులుగా యుద్ధం చేయడంలో అధర్మం లేదన్నారు. ప్రస్తుత కర్తవ్యం విదురుడు మాత్రమే తెలుపగలరన్నారు. విదురుడు ఆలోచించి ప్రజాభిమతం మేరకు ఎవరు రాజో నిర్ణయం జరగడమే ఈ సమస్యకు పరిష్కారమన్నారు. ప్రభువును ఎన్నుకోవడం వారి హక్కు అని తీర్పు చెప్పాడు. ఎన్నికల విధి విధానాలు ప్రకటించాడు. నెల రోజుల్లో స్వయంగా రాజులు ప్రచారంలో పాల్గొనాలి. ప్రజలకు ఆశ చూపరాదని విదురుడు ప్రకటించాడు. ఎన్నికల వల్ల యుద్ధం వల్ల జరిగే ప్రాణనష్టం అపవచ్చన్నాడు.
కర్ణుడు దుర్యోధనుడికి గత 13 ఏళ్లపాలన చూసి ప్రజలు మనవేపేనని నచ్చచెప్పి ఒప్పించాడు. విదురుడి సలహాకు వజ్రహస్తుడు సమ్మతమనగానే, ధర్మరాజు అర్ధాంగీకారంగా తలూపాడు.
ఎన్నికల ప్రచారానికి నగరంలో సభామండలాలు వెలిసాయి. యుద్ధపతాకాలే ప్రచార జెండాలుగా మారాయి. భీష్మద్రోణులు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. దుర్యోధనుడు బలవంతం పెట్టలేదు. వారికి యుద్ధం నైపుణ్యం తప్ప ప్రజాకర్షణ లేదని తెలుసు. మొదటిసారి రాజును బహిరంగంగా చూడడంతో ప్రజలు జేజేలు పలికారు. దుర్యోధనుడు మాట్లాడుతుంటే ఈ రాజ్యం పాండురాజు భిక్ష అని ప్రజల్లోంచి ఒక గొంతుక వినిపించింది. దాంతో కౌరవులు ఆగ్రహం పెరిగి కొందరి చెంపలు చెళ్లుమన్నాయి. దాంతో గందరగోళం రేగి జనం వేరేచోటికి తరలిపోవడం కనిపించింది. ఆ కూడలిలో వజ్రహస్తుడు మాట్లాడుతున్నాడు. సుత్రకుడు బాణాన్ని ఎక్కు పెడుతున్నాడు. చతుర్భుజుడు నిజంగా నాలుగు చేతులతో రెండు ధనుస్సు లతో బాణాలు ఎక్కుపెట్టాడు. వీరిద్దరి బాణాలు ఢీకొని ఆకాశంలో మెరుపులు మెరిసాయి. జనం కేరింతలు కొట్టారు. చతుర్భుజుడు పది తలలతో రావణుడిలా కనిపించాడు. మిగిలిన సోదరులు అతనిపై బాణవర్షం కురిపించారు. దాంతో ప్రజలు శ్రీరాముడికీ జై అనిపెద్దగా అరిచారు. వారు రామాయణం ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకున్నారు .అదంతా చూసిన కర్ణుడు డీలాగా శిబిరం వేపు వెళుతుండగా మెరుపులాంటి ఆలోచన స్ఫురించింది.
ఇక పాండవులు ఈ రెండు సభల విషయం తెలుసుకుని కొత్త తరహా ప్రళాణిక వేసారు. కౌరవుల అన్యాయం మీద నాటకం వేసారు. భీముడు, అర్జునుడు గదాయుద్ధం చేసారు. ఉన్నట్టుండి నలుగురు యువకులు “చవటలు, దద్దమ్మలీ పాండవులు, పెళ్లాన్ని ముట్టుకున్న వాడి చెయ్యి నరకలేని ఆడంగోళ్లు” అని అరిచారు. దాంతో వారిని పాండవులు చితక్కొట్టారు. చివరకు పాండవులకూ నిరాశే మిగిలింది. అలా మూడు వారాలు గడిచాయి. పాండవులను దూషిస్తూ రహస్యంగా ధనాన్ని పంచాడు దుర్యోధనుడు. పాండవులు తాము చేసిన కీచక, బకాసుర సంహారం చెప్పి వీరత్వాన్ని ప్రచారం చేసుకున్నారు. త్రిపాలకులు చిత్రవిచిత్రమైన సభలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. మళ్లీ పాడ్యమి వచ్చింది. ఎన్నికలు షురూ అయ్యాయి. విదురుడు కురుక్షేత్రంలో ఒక కొండ మీద నులుచున్నాడు. మరో మూడు కొండలపై దాయాదులు ముగ్గురు చేరారు. మైదానం జనంతో నిండింది. ఎవరి కొండ క్రింద ఎక్కువ జనం చేరితే వారే విజేతలు. స్పష్టంగా కనిపిస్తోంది త్రిపాలకుల కొండ వద్ద జన సమూహం. పాండవ, కౌరవుల ముఖాల్లో నిరాశ. త్రిపాలకుల్లో విజయగర్వం. ఇక విదురుడి తీర్పే తరువాయి. కర్ణుడు దుర్యోధనుడి చెవిలో ఎదో చెప్పాడు. వెంటనే కౌరవ చతుష్టయం కొండ దిగి పాండవుల వేపు కదిలారు. విదురుడికి అయోమయంగా ఉంది. పాండవులు ఇదుగురితో కలిసి నాలుగు చేతులు గాల్లో లేచాయి. అది చూసి త్రిపాలకులు అదిరిపడ్డారు. కౌరవ మద్దతు జనం పాండవుల వేపు పరుగెత్తారు. ఒక్క క్షణంలో తారుమారైన ఆధిక్యత. మనిషి ఆలోచన ఎప్పుడూ కొత్తగా ఉంటుందన్న నిజానికి సాక్ష్యం. విదురుని వేపు తొమ్మిదిమంది గర్వంగా చూసారు. దాయాదులు ఒక్కటయ్యారు. పాండవులకీ జై, కౌరవుల కీ జై అని జనం జయజయధ్వానాలతో కురుక్షేత్రం ప్రతిధ్వనించింది. ధర్మరాజుని చూసి శకుని నీకేమైనా అర్థమైందా ప్రజలకు ఏమి కావాలో? అని అడిగాడు. తల అడ్డంగా ఊపాడు ధర్మజుడు. అలా ముగించారు రచయిత.
మరో కథ ‘తనలో నన్ను’లోఎదురు కమ్యూనిటీలోని యువతి శైలజలో తనను చూసుకుంటున్న గృహిణి కథ ఇది. ‘డోపమైన్’ భావంతో ఆమె తల్లడిల్లడం రచయిత చాలా హృద్యంగా చూపారు. డోపమైన్ అంటే మెదడులో ఉండే పదార్థం. అది మనకు నచ్చిన పని పదే పదే చేయిస్తుంది. మన మనస్సును వేరే ఆలోచన చేయనివ్వదు. తన అపార్ట్మెంట్ నుంచి శైలజ కదలికలు గమనిస్తూ ఆమెలో తనను ఊహించుకోవడం దినచర్య. తాను భర్తతో గట్టిగా మాట్లాడలేకపోవడం, ప్రతి విషయంలో రాజీ పడడం అలవాటైపోయింది. శైలజను చూసి, ఆమె ఆధునికతను చూసి తాను అలా ఉండలేకపోయానని మొదట బాధపడేది. రవి, శైలజ దాంపత్యం అన్యోన్యంగా ఉందని మొదట భ్రమ పడింది. పెళ్ళిరోజు విందు అనంతరం వారి మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఆమెను కలచివేసింది. వారి సంసారం మేడిపండని గ్రహించింది. ఆ తరువాత శైలజ ఆలోచనలు ఆత్మహత్య వైపు పయనిస్తున్నాయని గ్రహించింది. సూపర్ మార్కెట్లో శైలజతో ఇలాంటి పిచ్చిపనులు చేయవద్దని వారించాలని ప్రయత్నించింది. కాని శైలజ అప్పటికే వెళ్లిపోయింది. శైలజ పిచ్చి పనులకు కోపం వస్తోంది. ఒకసారి కత్తితో పొడుచుకోబోయిన శైలజను భర్త రవి వద్దని ప్రాధేయపడ్డాడు. వారిద్దరి మధ్య కలతలు ఎంతవరకూ వెళతాయోనని భయం వేసింది. అప్పుడు తన గురించి ఆలోచన వచ్చింది. ఎంతో అర్ధం చేసుకున్నామనుకున్న తను, భర్త ఎలా ఉన్నారో చూస్తే తమ బంధం అబద్ధమా, నిజమా అనేది అర్థం కాని అర్ధసత్యంగా గోచరించింది. ఏది ఏమైనా వారిద్దరూ బాగుండాలని, జీవితమంటే రాజీ, లేకపోతే అగాధంలో పడతావని చెప్పాలనిపించింది. ఆ రాత్రి ఎప్పుడు తెలవారుతుందా అనే ధ్యాసలో కలత నిద్ర పట్టింది. తెల్లవారగానే ఆ కమ్యూనిటీకి పరుగుపరుగున వెళ్ళింది. అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. శైలజ దేహం నేలమీద ఉంది. ఆమె నోట్లోంచి చిన్న అరుపు, కళ్ల వెంట కన్నీరు. తన ఏడుపు చూసి శైలు భర్త తలెత్తి చూసాడు. ఆ కళ్లు తీక్షణంగా నీవే కారణం అన్నట్లు చూసిన చూపుతో అతను తలదించుకున్నాడు. అచేతనంగా, మూగగా పడి ఉన్న శైలును చూడలేకపోయింది. “ఆమె ఒక అందమైన నా రహస్యం. ఎడారిలో జలపాతం. ఆమెలేని కమ్యూనిటీ నేడు నా రహస్యాన్ని పాతిపెట్టిన శ్మశానంగా కనిపిస్తోంది” అని బరువుగా తన అపార్ట్మెంట్ వేపు నడిచింది.
పాణిని జన్నాభట్ల
‘శబరి’ కథలో వృద్ధురాలు తన మనవరాలిని బలి తీసుకున్న కామాంధుడ్ని శబరిలా పండ్లు తాను తిని నమ్మించి చంపే కథనం ఆకట్టుకుంది. అతను రాముడు కాదు రావణాసురుడు. శబరి నమ్మించి చంపే కథనం ఉత్కంఠతో సాగింది. ఎంతో బిగువు ఉంది. పాఠకుల కళ్ళను అక్షరాల వెంట చక చక పరుగెత్తిస్తాయి. ఒక హర్రర్ సినిమాలా, ఒక అపరాథ పరిశోధన కథలా నడస్తూ మనకు ఒక ఆశ్చర్యానుభూతిని మిగులుస్తుంది.
‘ఎందుకీ అగాధం’లో సారా, క్రిస్ల సంసారం కూలిపోవడానికి స్వయంకృతమా లేక అతని తప్పా అనేది కూతురు మిషెల్ చేత చెప్పించడం కథలో కొత్తదనం. మనుషుల మనసులో పొరల్లో దాగున్న రహస్యాలు బయటకు రావడం అసంభవమని రచయిత తన కథాంశంతో తేటతెల్లం చేసారు.
‘ఎయిత్ సిన్’ కథలో మనలోని హిపోక్రసీని ఒక భూతంలా చూపించడం రచయిత సృజనాత్మకతకు నిదర్శనం. నరకంలో ఏడు పాపాలకు శిక్ష ఉంటుంది. కాని ఎనిమిదోది నీలోని హిపోక్రసీ. రచయిత ఈ కథ ద్వారా మనసుకు నచ్చని పనులు చేసే వారి అంతర్మథనం చక్కగా వివరించారు. అలా ప్రతి కథలోనూ కొత్తదనం చొప్పించి పాఠకుల హృదయాలను గెలుచుకున్న పాణిని సీనియర్ రచయితలకు ఏమాత్రం తీసిపోరు. కథా వైవిధ్యంతో, మరింత సృజనాత్మకతతో పాఠకులను అలరిస్తారని ఆశిద్దాం.
***
రచన: పాణిని జన్నాభట్ల
ప్రచురణ: అన్వీక్షికీ ప్రచురణలు, హైదరాబాద్
పేజీలు: 140
వెల: ₹ 150/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్లైన్లో:
https://www.amazon.in/Tanalo-Nannu-Telugu-Short-Stories/dp/B0B38LZ9MJ
యం.వి.రామారావు గారు ఎ.పి. వెటరన్ జర్నలిస్ట్స్ యూనియన్ ట్రెజరర్.