[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన బి. కళాగోపాల్ గారి ‘తమసోమా జ్యోతిర్గమయ..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
సన్నగా రోదిస్తుందా అమ్మాయి. గదిలో ఓ మూల చీకటిలో కూర్చొని తన గొంతు తనకే విన్పడేలా సణుక్కుంటూ, ఉబికి వచ్చే కన్నీటిని ఆపుకుంటూ గద్గద స్వరంతో ప్రశ్నించింది. “అమ్మీ! నేను మీకేం అపకారం చేశాను. ఈ కుటుంబంలో పెద్దదానిగా పుట్టడమేనా? నేను చేసిన నేరం. ఇన్నాళ్ళు హాయిగా చదువుకొంటున్నాను. మరికొన్ని రోజుల్లో పదవ తరగతి పరీక్షలు ఉన్నాయి. నన్ను మంచిగ చదువుకోనీయండమ్మా. నాకిప్పుడే షాదీ ఇష్టం లేదు. షాదీ తర్వాత వాళ్ళు నన్నేం చదువనియ్యరు. అమ్మీ! నువ్వే చెప్పు, నాకు ఈ నిఖా మంజూర్ లేదని” వెక్కిళ్ళ మధ్య తన బాధను వెళ్ళగక్కింది ఘంఘ్రు.
ఫాతిమాబీ నిట్టూర్చింది. కూతురి తలపై చేయివేసి నిమురుతూ “అరే బచ్చీ! నువ్వు బేవజా పరేషాన్ ఎందుకు అవుతవ్? నీ తర్వాత ముగ్గురు చెల్లెండ్రు ఉన్నరు. ఒక తమ్ముడు ఉన్నడు. ఈళ్ళందరిని పెంచి పోషించాలంటే మీ అబ్బాజాన్కి ఎంత కష్టమవుతుందో! జెర సంఝో! ఈడొచ్చిన పిల్ల ఇంట్ల ఉంటే మన కుటుంబాల్లో అందరూ ఏమనుకుంటారు. నేను బీడీలు చుట్టి సంపాదించినా, అబ్బా కూలీపనికెళ్ళినా, రెక్కాడితే, డొక్కాడని బతుకులు మనవి. ఇంతమందికి పై సదువులు చెప్పించుడు మావల్ల కాని పని. మన పక్క ఊరి పిల్లగాడు షౌకత్ అలీ చాలా మంచోడు. రహ్మతుల్లా కుటుంబం మనకంటె జర పై అంతస్తులో ఉండే కుటుంబం. ఏదో విధంగా మీ అబ్బాజాన్ మంచితనం జూసి ఈ నిఖాను వాళ్ళు మంజూర్ చేసుకున్నారు. నువ్వు మంచి ఇంటికి పడుతున్నందుకు అల్లాకు కృతఙ్ఞతలు చెప్పాలి. అంతేగాని గిట్లా ఏడుపు ముఖం పెడ్తావెందుకు? ఐతే గియితే ఆ పిల్లగాడు మంచోడు కాబట్టి నిన్ను ఇంకా సదువుపించినా సదుపిస్తడు, లే, లేచి ముఖం కడుక్కొని మంచి సల్వార్ కుర్తీ వేసుకొని జెల్ది తయారుగా అవతల అందరు కూచున్నరు” అని ఓదార్పుతో బాటు నాలుగు మంచి మాటలు చెప్పి, హెచ్చరించి బయటకు వచ్చింది ఫాతిమా బీ.
రహీం, ఫాతిమాలు నిరుపేదలు. ఒక చిన్న పెంకుటింట్లో వీరి నివాసం. పెద్దది ఘుంఘ్రు తర్వాత వరుసగా నసీమా, జరీనా, వహిదా ఆడపిల్లల తర్వాత మగపిల్లాడు రఫీక్ పుట్టాడు. ఉపాధి కూలీ పనితో బాటు చిన్న కిరాణా కొట్టులో ప్యాకింగ్ చేసేవాడు రహీం. ఫాతిమా నాలుగు ఇళ్ళలో పాచిపని చేస్తూ, బీడీలు చుడుతూ ఏదో విధంగా గుట్టుగా సంసారాన్ని ఈడుస్తున్నారు. ఘుంఘ్రు చాలా తెలివైన అమ్మాయి. చూడచక్కని ముఖవర్చస్సు పెద్ద పెద్ద కళ్ళతో అందంగా ఉండేది. చదువులో చురుగ్గా ఉండేది. బాగా చదువుకొని అమ్మీ, అబ్బాను బాగా చూసుకోవాలని ఘుంఘ్రు లక్ష్యం. ఏడ్చి మొత్తుకున్నా ఘుంఘ్రు నిఖా షౌకత్‌తో ఖాయం చేశారు తల్లిదండ్రులు. అర తులం బంగారం, పదివేలు చదివింపులు అయ్యాయి. రహీం దంపతులకు పెద్ద బిడ్డ పెళ్లి అప్పుల కుప్పయి కూర్చుంది. పెళ్ళయి అత్తవారింటికి వెళుతున్న ఘుంఘ్రుతో తల్లి, “మేరీజాన్ బచ్చీ, ససురాల్ వెళ్తున్నావు. జాగ్రత్తగా ఉండు. అత్తమామలు, మరిది, ఆడబిడ్డలను గౌరవించు. భర్తతో సఖ్యతగా వ్యవహరించు. ఫోను చేయి. మేము అప్పుడప్పుడు వచ్చి సూచిపోతం. పయిలం బిడ్డా ఖుదాఫీస్” అంది. రహీం బిడ్డా, అల్లుడిని దీవించారు. కండ్లనిండా నీటితో మసక మసక దృశ్యంతో ఉన్న ఊరును, కన్న తల్లిదండ్రులను వదలి ఘుంఘ్రు కాపురానికి బయలుదేరింది.
మరో వారం పదిరోజులు హాయిగా జరుగుబాటైంది ఘుంఘ్రుకి అత్తవారింట్లో. తనకంటే చిన్నవారైన మరిది, ఆడబిడ్డలను ప్రేమగా చూసుకొనేది. ఒకరోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక తీరిగ్గా ఉన్న సమయంలో పక్కింటి తస్లీమా హడావిడిగా వచ్చింది. “అరే ఘుంఘ్రు, పదో తరగతి పరీక్షల టైం టేబుల్ వచ్చింది. నీకు తెలుసా? షాదీ అయినా గూడా నువ్వు అక్కడికి పోయి పరీక్షలు రాసిరా. నా మాటవిను. ఫస్ట్‌ల పాస్ అవుతావు” అని ఒక వార్త చెవిన వేసి అంతే హడావిడిగా నిష్క్రమించింది తస్లీమా. నివ్వెరపోయింది ఘుంఘ్రు. భర్త అనుమతి ఎలాగైనా సంపాదించుకోవాలని గట్టిగా నిశ్చయించుకొంది.
ఆ రాత్రి భోజనాల వేళ మౌనంగా ఉన్న ఘుంఘ్రుతో షౌకత్ “క్యా హువా ఘుంఘ్రు? ఎవరైనా ఏమన్నా అన్నారా? ఎందుకలా ముఖం వేలాడేసుకున్నావ్” అన్నాడు.
“ఆ.. ఏముందీ గా ఇంటిపక్క పోరి లేదూ తస్లీమా. గా పిల్ల అచ్చి ఏవో పరీక్షలు ఉన్నాయని చెప్పింది. గప్పటి నుండి సూత్తున్నాం ఘుంఘ్రు బేచైన్గా ఉంది” అంది అత్త రబియా దీర్ఘాలు తీస్తూ.
“ఘుంఘ్రు ఇధర్ దేఖో! నిన్ను చదివిపించుడు భాద్యత నాది. ఎన్ని తరగతులైనా సదువుకో, మన ఫటిచర్ బతుకులు ఇంకా ఎంత కాలమో తెలియదు. నాకా మంచి చదువు అబ్బలేదు. ఎంతసేపని ఎలక్ట్రానిక్ షాపుల రిపేర్లు చేసినా నెల తిరిగే సరికి పదివేలు కండ్ల సూత్తలేను. నాకు తెల్సిన దోస్తు బషీర్ భాయి సాయంతో నేను వచ్చేనెల దుబాయి పోతా. నీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టు విడువకుండా పెద్ద చదువులు చదువుకో” అన్నాడు ఘుంఘ్రును మెచ్చుకుంటూ షౌకత్.
అన్నం తినకముందే కడుపు నిండిపోయింది ఘుంఘ్రుకి అతని మాటలతో.
ముక్కు విరిచి, మూతి మూడు వంకర్లు తిప్పిoది రబియా వీరిద్దరి సఖ్యతకి. “ఏం సదువులో ఏం ఖర్చులో సదివి ఏం సేత్తదని” అని సన్నగా గొణుగుతూ అంట్ల గిన్నెలను ఎత్తసాగింది.
మర్నాడు ఘుంఘ్రు పెందలకడనే నిద్రలేచి కళ్ళాపి చల్లి, ఇంటి పనంతా చకచకా పూర్తికానిచ్చింది. చక్కగా తలారా స్నానం చేసి తనకు నచ్చిన మంచి రంగున్న సల్వార్ కమీజ్ ధరించింది. కడిగిన ముత్యంలా మెరుస్తున్న ఘుంఘ్రు అత్తవారింట సెలవు తీసుకొని షౌకత్‌తో కన్నవారింటికి బయలు దేరింది. గుమ్మంలో ప్రత్యక్షం అయిన బిడ్డ అల్లుడిని చూసి ఏం ముంచుకొచ్చిందోనని ఫాతిమా బీ తల్లడిల్లింది.
“మీకు చెప్పకుండా వచ్చాం. ఘుంఘ్రుకి పరీక్షలు దగ్గర పడ్డాయి. ఒక నెల తర్వాత తీసుకుపోతా. ఈ పరీక్షలన్నీ రాయనీయండి” అంటున్న షౌకత్‌ను చూసి ఊపిరి పీల్చుకున్నారందరూ. తల్లిగారింట్లో ఘుంఘ్రు పరీక్షలు. పుస్తకాలే లోకంగా గడిపింది.
అక్కడ షౌకత్ అప్పుతెచ్చి డబ్బులు బషీర్ చేతిలో పోశాడు. ఎలాగైనా తనకు వర్కింగ్ వీసా రావాలని ఎక్కడో ఒకచోట ఎడారి దేశంలో ఒక కంపెనీలో పనికి కుదర్చమని బతిమిలాడుకున్నాడు. మరో నెల, మరో నెల అంటూనే బషీర్ అరచేతిలో స్వర్గాన్ని చూపుతున్నాడు. ఇంతలో ఓరోజు ఘుంఘ్రు ఫోను చేసింది షౌకత్కి. “షౌకత్ నా పరీక్షలు అయిపోయాయి. వచ్చి తీసుకెళ్ళు. దుబాయ్ ప్రయాణం ఎప్పుడు?” అని అడిగింది. “అలాగే వస్తా కాని దుబాయ్ గురించి అడగకు” అంటూ విసురుగా ఫోను కట్ చేశాడు షౌకత్. కళ్ళనీళ్ళు తిరిగాయి ఘుంఘ్రుకి.
***
పరీక్షలు రాసి వచ్చిన సంతోషం ఎంతోకాలం నిలువలేదు ఘుoఘ్రుకి. చీటికీ మాటికి రబియా సణుగుడు ఎక్కువయింది. దానికి తోడూ ఇంటెడు చాకిరీ ఘుంఘ్రుకి అప్పజెప్పి, తాను మాత్రం హాయిగా కాలం వెళ్ళబుచ్చింది రబియా. ఈ మధ్య ఆర్థికపరమైన చిక్కుల వల్లనో ఏమో షౌకత్ కూడా మాటిమాటికి ‘నీకేం బాగా చదువుకున్నావని పొగరు’ అంటూ దెప్పి పొడవసాగాడు. వీటన్నిటికి తోడు ఆ రోజు జరిగిన సంఘటనను మాత్రం ఘుంఘ్రు మర్చిపోదామన్నా మరువలేకపోయింది.
ఆ రోజు ఉదయమే పనుందంటూ వెళ్ళిన షౌకత్ తిరిగి తిరిగి చాల పొద్దుపోయాక వచ్చాడు. ఎంతో అలసటగా, నిస్త్రాణగా మంచంపైన వాలిపోయిన షౌకత్‌తో ఘుంఘ్రు, “ఈ మధ్య మీకు పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. డబ్బులు తెచ్చి ఆ మాయమాటలు చెప్పే బషీర్ చేతిలో పోసి, అప్పులకుప్ప అయ్యాము. నేను కూడా ఎక్కడైనా పని వెతుక్కుంటాను లేదంటే..” అంటూ సాగుతున్న ఘుంఘ్రు మాటలకు అడ్డుపడుతూ ఏదో చెప్పబోయిన షౌకత్ విపరీతమైన ఛాతినొప్పితో విలవిలలాడాడు. అనుకోకుండా జరిగిన ఈ హఠాత్ పరిణామానికి ఘుంఘ్రు భయకంపితురాలైంది. పరుగున వెళ్లి అత్తమామలను వెంటబెట్టుకొచ్చింది. గబగబా ఆటో తీసుకొని హాస్పిటల్‌కు వెళ్లారoదరూ. షౌకత్‌కు ముందు నుండి ఆస్తమా వుంది. అది కప్పిపుచ్చి వేరే ఊరినుండి సంబంధం ఖాయం చేసుకున్నారు రబియా, రహ్మతుల్లాలు. ఎలాంటి భావోద్వేగాలకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలి. ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటూ మంచి ఆహారాన్ని తీసుకోవాలని డాక్టర్ సలహాను తు.చ తప్పకుండా పాటించాలని నిశ్చయించుకొంది ఘుంఘ్రు. ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడతారని ఫోన్ కూడా చేయలేదు ఘుంఘ్రు.
***
మరో ఏడాది గిర్రున తిరిగింది. ఇప్పుడు ఘుంఘ్రు ఒక బిడ్డకు తల్లి. ప్రొద్దున్నే చాయ్ తాగుతున్న షౌకత్ తో “ఏమండీ, మన ఖర్చులు పెరిగాయి. వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. చేదోడు వాదోడుగా నేను ఏదైనా పని చేస్తాను. కుట్టుపని నేర్చుకొంటా. మధ్యాహ్నం మున్నీని అత్తయ్యకు అప్పజెప్పి రేపటినుండి కుట్టుసెంటర్కు వెళ్తామనుకొంటున్నా.” అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది ఘుంఘ్రు. అటుగా వెళ్తూ ఆ మాటలు విన్న రబియా “ఆడోళ్ళు బయటకు వెళ్లి పనులు చేసుడు మా యింటా వంటాలేదు. చదువుకొంటా, చదువుకొంటా అంటూ మావాడి పాణం తినేశావు. గందుకే నా బిడ్డ నెత్తిల ఏం పెట్టుకున్నాడో ఏమోగాని, బహుత్ పరేషాన్ ఐనడు. మళ్ళీ గిప్పుడు సక్కగా పిల్లవోణ్ణి, మున్నీని చూసుకుంట ఇంట్లో ఉండక ఏం పని చేస్తవు. గల్లీలకు పోయి కుట్టుపని నేర్చుకొనుడు వద్దు. నీవేం మామీద రహమ్ చూపించుడు అక్కర్లేదు.” అంటూ విసురుగా వెళ్లిపోయింది.
“మీరైనా చెప్పండి నేను బయటకు వెళ్లి పని చేసుడు నిజంగా మీకు ఇష్టంలేదా? ఆ రోజు నాతోని పరీక్షలు రాయించిన అచ్ఛా ఆద్మీ మీరు. మీ జవాబు ఏంటో చెప్పండి.” అంటూ నిలదీసింది ఘుంఘ్రు.
షౌకత్ నిట్టూరుస్తూ.. “అమ్మీ జాన్‌కి ఖిలాఫ్గ నేనేం చేయలేను ఘుంఘ్రు. అవసరమైతే నీవు ఇంటివద్ద నుండి డిగ్రీ కట్టు. మళ్ళీ చదువుకో. అప్పుడైతే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందేమో అన్న ఆశ.” అన్నాడు ముభావంగా.
తనపై చదువులకు అనుమతి లభించబోతుందన్న సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయింది ఘుంఘ్రు. కాని అదే రోజు రాత్రి షౌకత్కి ఆస్తమా ఎక్కువయి సడెన్ హార్ట్ అరెస్ట్ అయి కన్ను మూశాడు. గుండె పగిలేలా రోదించింది ఘుంఘ్రు. అప్పటికి ఆమె కడుపులో మరో బిడ్డ. “ఎన్నో డాక్టర్లకి చూపించినం. మస్తు మందులు వాడినం. ఐనా మా బిడ్డ మాకు దక్కకపాయె. ఈ ముదనష్టపు మహాతల్లి ఏ నిమిషంలో మాయింట్ల అడుగుపెట్టిందో ఏమోగాని మా పిల్లగానే మింగేసింది. నీది పుట్టువడి పాడుగాను” అని కోడల్ని తిడుతూ ముక్కు చీదసాగింది రబియా.
పెళ్ళయి హాయిగా అత్తవారింట్లో ఉంటుందనుకొన్న బిడ్డ ఇలా ఇద్దరు బిడ్డలతో తన భవిష్యత్ ను ఎలా గడుపుతుందోనన్న బెంగ ఫాతిమాబీకి. “మా బచ్చీని ఓ వారం రోజుల పాటు ఇంటికి తీసుకువెళ్తాం, ఆ అల్లా దయవలన మంచిగ కావాలిగా. మళ్ళీ మీరు కబురు చేసినప్పుడు వస్తాం” అంటూ సెలవు తీసుకుంది ఫాతిమా రహ్మతుల్లా వద్ద.
పుట్టింటికి చేరుకున్న ఘుంఘ్రు మనసు మనసులో లేదు. షౌకత్ మాటలే చెవుల్లో మారు మ్రోగసాగాయి. “బాగా చదువుకో ఘుంఘ్రు. నీవు డిగ్రీ పట్టా పొందితే. నీ తెలివికి తప్పకుండా ఒక మంచి ఉద్యోగం వస్తుంది” అన్న మాటలను పదే పదే మననం చేసుకుంది. తన ఇద్దరు బిడ్డలను ధైర్యంగా పెంచాలని తీర్మానించుకుంది ఘుంఘ్రు.
ఓరోజు ఉదయమే బయటకు తయారవుతున్న ఘుంఘ్రుతో తల్లి “క్యా ఘుంఘ్రు! భర్త చనిపోయిన తర్వాత ఒక్కదానివే ఎక్కడకని బయలుదేరుతున్నావ్? నీకు మరో నెల కాంగనే డాక్టరమ్మ దవాఖానకి రమ్మంది. ఇప్పుడు ఎక్కడికి పోవద్దు” అంది.
“అమ్మీ! నాకన్నీ తెలుసు. దయచేసి నన్ను ఈ రోజు బయటకు వెళ్ళనీ. కాలేజీల ఫాం ఇస్తున్నారంట. తస్లీమా చెప్పింది. తనూ వస్తానంది. పోయి తెచ్చుకొని ఫాం నింపుత అపుడు డిగ్రీ కట్టొచ్చు. ఇంట్లనే ఉండి సదువుకుంట. షౌకత్ చివరి కోరిక అమ్మీ! నన్ను డిగ్రీ పాస్ చేయిస్తనన్నడు.” అంది ఘుంఘ్రు. చివరి వాక్యాన్ని డగ్గుత్తికతో చెప్పింది.
బిడ్డ యిష్టాన్ని బేఖాతర్ చేయవద్దని మిన్నకుండిపోయింది ఫాతిమా బీ. ఆరోజు తస్లీమాతో కల్సి కాలేజీకి వెళ్లి చేయవలసిన పనులన్నీ పూర్తి చేసుకొని ఓ చెట్టు క్రింద సేద తీరారు స్నేహితురాళ్లిద్దరూ.. “తస్లీం..! డిగ్రీ కట్టినందుకు ఓ పక్క ఆనందంగాను. నా సంతోషంలో భాగం పంచుకునే భర్తను కోల్పోయినందుకు దుఃఖంగాను ఉంది. ఈ లోకంలో ఉన్న నష్టజాతకురాలిని నేనేనేమో!” అంది ఘుంఘ్రు విచారంగా.
“ఎన్ని రోజులని ఇలా బాధపడుతూ కూర్చుంటావు? ఘుంఘ్రు! బయట ప్రపంచంలో నీకంటూ నీవొక గుర్తింపు తెచ్చుకోవాలి. నీ బిడ్డల ఉజ్వల భవిష్యత్తుకైనా సగం ఆపిన సదువును పూర్తి చేసి గుర్తింపు తెచ్చుకోవాలి. నీ ముందున్న లక్ష్యాన్ని అందుకో. వారూ నీలా పేదరికంలో మగ్గకుండా నీ బిడ్డల్ని మంచిగ పెంచుకో” అంటూ ఓదార్పు వచనాలు పలికింది తస్లీం. అప్పటికే వారు వెళ్ళాల్సిన బస్సు రెడీగా ఉంది. “ఘుంఘ్రు ఇక వెళ్దామా” అంటూ ఏదో ఆలోచనలో ఉన్న స్నేహితురాలిని బయలు దేరదీసింది తస్లీం.
***
మరో నెల్లాళ్ళు గడిచాక ఘుంఘ్రు పండంటి ఆడపిల్లని ప్రసవించింది. ఇద్దరు పిల్లల ఆలనా, పాలనతో ఘుంఘ్రుకి ఆరు నెలలు ఇట్టే గడిచిపోయాయి. ఓరోజు రహీం హడావుడిగా మధ్యాహ్నమే ఇంటికి వచ్చాడు. “అరే గింత జెల్ది వచ్చినవేం? ఈరోజు కూలీలు తక్కువ ఉన్నారు. నాకు ఎక్కువ పని ఉన్నదంటివి కదా” అన్నది ఫాతిమా. “అది కాదే మన రహ్మతుల్లా మనూరి ఒక పోల్లగానితో కబురు చెప్పి పంపించాడు. రేపు ఘుంఘ్రును అత్తగారింటికి పంపించాలట” అన్నాడు.” ఏందీ? అప్పటికప్పుడు బావి తవ్వుకున్నట్టు రేపే ప్రయాణం అంటే ఎట్లా?” అంది ఫాతిమా ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ.. “నిజమే! నాకూ అలాగే అనిపించింది. గబగబా ఇంటికి వస్తిని మన పిల్ల కిస్మత్ అక్కడ ఎట్లా రాసిపెట్టి ఉంటే అట్లా జరుగుతది. ఈ ఇద్దరు చిన్న బిడ్డలతో ఎలా రోజులు గడుపుతుందో ఏమో చూడబోతే రబియా దీదీ మన పిల్ల మీద మస్తు కోపంతో ఉంది. దాన్ని ఎంత రాచిరంపాన బెడతదో ఏమో? పోనీ మరికొన్ని రోజులు ఐన తర్వాత పంపుదామంటే, మేము చెప్పినప్పుడుగాక తన ఇష్టమైనప్పుడు ఎట్లా పంపుతరు? లేదంటే మనకు మళ్ళీ మన పిల్ల మొకం చూసుడూ గూడా ఎల్లదు. ఏందో దాని జిందగీ అంతా గిట్లా కిందామీద గావట్టే. ఇగ అంతా ఆపైవాడి దయ అనుకొనుడు తప్పితే మనం ఏం చేస్తాం చెప్పూ” అన్నాడు నిట్టూరుస్తూ రహీం. చాటుగా తల్లిదండ్రుల సంభాషణ వింటున్న ఘుంఘ్రు నిశ్శబ్దంగా రోదించింది. ఫాతిమా సహాయంతో తనవి, పిల్లలవీ పెట్టేబేడా సర్దుకొని ప్రయాణమైంది. తస్లీం బస్ స్టాండ్ వరకూ వచ్చి వీడ్కోలు పలికింది. “ఘుంఘ్రు అల్విదా, మంచిగా చదువుకో, మరో రెండు నెలల్లోనే పరీక్షలు, పిల్లలు జాగ్రత్త” అంది.
***
బిక్కుబిక్కుమంటూ అత్తవారింట్లో అడుగుపెట్టిన ఘుంఘ్రును మొదట్లో రబియా దంపతులు బాగానే ఆదరించారు. పిల్లలను పాపం పసివారు అంటూ మురిపెంగా చూసుకున్నారు. మరో వారం రోజులు గడిచాయి. ఈ వారం రోజులపాటు ఘుంఘ్రును నిశితంగా గమనించసాగింది రబియా. పిల్లలను జోకొడుతూ, ఇంటిపనులు, వంటపనులు చేస్తూ ఏదో మననం చేసుకోవడం, తనలో తాను గొణుక్కోవడం, అప్పుడప్పుడూ, ఏదో గుర్తొచ్చిన దానిలా ఆదరాబాదరాగా పుస్తకాలు తిరగేయడం వంటివి చాలా చిత్రంగా తోచేవి రబియాకి. ఓరోజు ఉండబట్టలేక కోడలితో “అరే బేటీ, ఏమైంది నీకు, ఏ పనిలోనూ పూర్తిగా మనస్సు లగ్నం చేయడం లేదు. ఓపక్క చంటిది ఏడుస్తున్నా ఏదో లోకంలో ఉన్నట్టు ఉన్నవ్ ఏమైంది. మీ అమ్మీ, అబ్బాగాని యాదికి వచ్చినారా ఏంటి?” అని ప్రశ్నించింది. “అదేo లేదు అత్తయ్యా. మరో రెండు నెలల్లో పరీక్షలు ఉన్నాయి. అందుకే..” అంటూ నసగసాగింది. రబియాకి అసలు విషయం అర్థమయ్యింది. తన కొడుకు అనారోగ్యమో, మరో కారణమో గాని అంతంగా చదువు అబ్బలేదు. తమవా ఎదుగూ బొదుగూ లేని బతుకులు. ఘుంఘ్రు చదువులో చాకులాంటి పిల్ల. బాగా చదివితే చూడాలని తన కొడుకు చివరి కోరికను నిజం చేయాలనే ఘుంఘ్రు తపనను మనస్సులోనే అభినందించకుండా ఉండలేక పోయింది. చిన్న వయసులోనే జీవితంలో అతిపెద్ద విషాదాన్ని తట్టుకొని నిలబడిన ఘుంఘ్రు పోరాట పటిమను చూసి ఆశ్చర్యపోయింది రబియా. పోనీ తనైనా బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకుంటే తన పిల్లలని బాగా చూసుకోగలదని నమ్మకం ఏర్పరుచుకొంది రబియా. అందుకే కోడలితో “చూడమ్మా, నీవు పరీక్షల కొరకు కష్టపడుతున్నవు. నీ కష్టంలో మేమూ భాగం పంచుకొంటాం. పిల్లలని ఆడించే బాధ్యత మాది. ఎంతైనా మా పిల్లలే గదా” అంది భరోసాగా. ఘుంఘ్రు కళ్ళు ఆనందంతో మెరిశాయి. మరో నాలుగేళ్ళు తర్వాత ఘుంఘ్రు ఐ.సి.డి.యస్ ఆఫీసులో ప్రాజెక్ట్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తించసాగింది.
***
“ఇది మీముందున్న ఘుంఘ్రు కథ.. అసతోమా సద్గమయ.. తమసోమా జ్యోతిర్గమయ.. అంధకార బంధురమైన జీవితాల్లో వెలుగులు నింపేది చదువొక్కటే. మన వ్యక్తిత్వాలను చక్కదిద్ది.. జీవితానికి పరిపూర్ణత నిచ్చే జ్ఞాననిధి..!” అంటూ కళ్ళు తుడుచుకుందా అమ్మాయి. నీలం రంగు కాటన్ చీరలో ఎంతో హుందాగా ఉందామె. ఒక నిముషం నిశ్శబ్దం ఆవరించిందా హాలుని. తర్వాత అందరూ కరతాళ ధ్వనులతో ఆమెను అభినందించారు. ఆరోజు మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన మీటింగ్‌లో మహిళల చదువు అన్న అంశంపై ఘుంఘ్రు తన స్పందనను తెలియజేసిందిలా. మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంలా ఘుంఘ్రు జీవితం ఆదర్శప్రాయమైంది. “నాలాంటి ఎన్నో వేలమంది ఆడపిల్లలకు చదువు విలువ తెలియజేయాలి అందుకు నా జీవితమే ఒక ఉదాహరణ” అంటూ స్పూర్తిని నింపుతూ తన గాథను ముగించింది ఘుంఘ్రు.
శ్రీమతి బి. కళగోపాల్ గత దశాబ్ద కాలంగా కవితలు కథల్ని రాస్తున్నారు. పుట్టింది నిజామాబాద్ జిల్లాలో. ఎం.ఎ ఇంగ్లీషు, బిఎడ్ చేసిన వీరు ఆంగ్ల సహ ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. ఇంతవరకు వీరివి 450కి పైగా కవితలు వివిధ వార, మాస సాహిత్య పత్రికలలో ప్రచురితమయ్యాయి. కవితా సంపుటి ‘మళ్లీ చిగురించనీ..’ 2015లో 74 కవితలతో ప్రచురించారు. అంతేగాక స్థానిక నిజామాబాద్ రేడియో ఎఫ్.ఎం.లో 20 కథానికలు ప్రసారమయ్యాయి. 25 వ్యాసాలు వివిధ పత్రికల్లో వచ్చాయి. 50 కథలు వివిధ పత్రికల్లో అచ్చు అయ్యాయి. వాటిల్లో 20 కథలు వివిధ సందర్భాల్లో అవార్డులను పొందాయి. వీరి కవితలు కూడా అనేక సందర్భాల్లో పలు అవార్డులను పొందాయి. రాధేయ, ఎక్స్ రే, భిలాయ్ వాణి, కలహంస, భూమిక, సాహితీకిరణం, ద్వానా, వాల్మీకి, మల్లెతీగ వారి కవితా పురస్కారాలు పొందారు. సోమేపల్లి, వట్టికోట ఆళ్వారు స్వామి, జలదంకి పద్మావతి కథా పురస్కారాలను పొందారు.