Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తమసోమా జ్యోతిర్గమయ-10

“మరణించిన తరవాత తమ శరీరావయవాలను ఇతరుల ప్రయోజనార్థం దానం చేసిన వారు మరణంలోనూ జీవిస్తారు” అని గంటి భానుమతితమసోమా జ్యోతిర్గమయ’ ధారావాహిక చివరి భాగం చెబుతుంది.

రాధ కదల్లేదు. ఆమెకి మాధవ్ చనిపోయినట్లుగా అనిపించడం లేదు. నిద్ర పోతున్నట్లుగా అనిస్తోంది. ఏదో ఓ క్షణాన లేస్తాడు. ఓ శక్తి, లేకపోతే, ఏదో ఒక అద్భుత శక్తి, ఆగిపోతున్న మాధవ్‌ని, ఆగిపోతున్న జీవితాన్ని, ఆ గుండెని కదిలించదా…..

సౌమ్య రాధ చేతిని పట్టుకుని ముందుకి నడిపించింది. ఇద్దరూ ఆ చిన్న కారిడార్‌లోకి వచ్చారు. బయటికి వెళ్ళిపోడానికి, మూసి ఉన్న తలుపులు తీస్తూంటే, వెనక నుంచి ఎవరో చిన్నగా పిలిచినట్లయింది. ఇద్దరూ ఆగారు. ఓ ఇద్దరు డాక్టర్లు ఆమె వైపుగా వస్తున్నారు.

“మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాము. అది రిక్వెస్ట్… మీరు తలుచుకుంటే ఓ మనిషి ప్రాణాలు నిలబెట్టగలరు….”

నేనా అన్నట్లు ఆశ్చర్యంగా చూసింది.

“మీతో కొంచెం మాట్లాడాలి… రండి… అక్కడ గదిలో కూచుని మాట్లాడుకుందాం. …ఇలాంటివి ఇలా థియేటరు, ఈ గది దగ్గర  నుంచుని మాట్లాడేవి కావు” అంటూ తలుపులు తీసి, ఓ రెక్కని పట్టుకుని నుంచున్నాడు.

వాళ్ళిద్దరూ బయటికి వచ్చారు. ఓ గదిలోకి తీసుకెళ్ళాడు. అక్కడ అప్పటికే మరో నలుగురు కూచుని ఉన్నారు.

“మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాము. మాధవ్ బ్రెయిన్ డెడ్ అయిన మనిషి. మీరు అనుమతి ఇస్తే ఓ నలభై ఏళ్ళ మనిషికి అతని గుండెని పెట్టాలనుకుంటున్నాము….. ఈ కేసు రాగానే రిపోర్టులన్నీ చూసాకా ఆపరేషన్ చేస్తున్నప్పుడే అర్థం అయిపోయింది. కానీ మా ప్రయత్నం మేము చేసాం. అది ఫలించదని మాకు తెలుసు. రక్తం చాలా పోయింది. మెదడుకి సరఫరా కావడం లేదు. యాక్సిడెంటు అయిన వెంటనే వచ్చి ఉంటే మరోలా ఉండేదేమో… ఓకే అయిపోయినదాని గురించి మాట్లాడి లాభం లేదు.”

డాక్టరు ఏం చెప్పదలుచుకున్నారో… వాళ్ళకి తెలీడంలేదు. కాని, ఏం మాట్లాడలేదు.

“మీకు అసలు విషయం చెప్పేస్తాను. ఇప్పుడు మాధవ్ గుండె ఇంకా ఆర్టిఫిషియల్ మెథడ్‌తో కొట్టుకోనిస్తున్నాం. మీరు కాదనరన్న ధైర్యంతోనే.. జీవన్‌దాన్ వాళ్ళని కాంటాక్ట్ చేసాం..”

రాధ అపనమ్మకంగా చూసింది. అంటే మాధవ్ గుండె కొట్టుకోడం ఆగిపోలేదా… కొట్టుకుంటోందా… అదే తనకి కావల్సింది. అలాగే చెప్పండి అన్నట్లు తలఊపింది.

“…ఎవరికి గుండె అమర్చాలనుకుంటున్నామో ఆ మనిషి ఈ సిటీలోనే ఉన్నారు. సాధారణంగా వాళ్ళని దాతలతో మాట్లాడనివ్వము. ఎవరికి గుండెని ఇస్తున్నారో దాతలకి తెలియనివ్వము. అంటే ఒకళ్ళకొకళ్ళు తెలియనివ్వము అన్నమాట. తెలిస్తే ఏదైనా సమస్యలొస్తాయని, అంతే, కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. ఆ మనిషి బంధువులు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు మీతో మాట్లాడాలనుకుంటున్నారు” అంటూ సెల్‌లో ఎవరితోనో మాట్లాడాడు.

మరో ఐదు నిమిషాలకి ఓ ముప్పై ఏళ్ళ స్త్రీ ని తీసుకొచ్చారు. ఆమె వెనకాల ఇద్దరు మరీ చిన్న పిల్లలు. ఈ పిల్లల తండ్రికా, ఆ తండ్రి గుండెల మీద ఆడుకునే అవకాశం మాధవ్ ఇచ్చాడు. అంతకన్నా కావలసినది ఏం ఉంది….” రాధ చలించిపోయింది.

“ఈమె భర్త ఆరు నెలల నుంచి డోనర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీరు అనుమతి ఇస్తే” రాధ,ఆ పిల్లలని చూస్తూ, తన కడుపు మీద చేయి వేసుకుంది. ఆ పిల్లలకోసం మాధవ్ గుండె కొట్టుకుంటుంది.

“ఈమె భర్త, మనకి డోనర్ హార్ట్ లభించేందుకు, సహకరిస్తున్న మహా మనిషి,ఆమె మహనీయురాలు. ఓ మనిషికి, జీవితాన్నిస్తున్నారు…” అని అనగానే వాళ్ళ ముగ్గురూ చేతులు జోడించారు. వాళ్ళ కళ్ళల్లో నీటిపొర రాధకి కనిపించింది.

“మా సంసారాన్ని నిలబెడుతున్న దేవతలు మీరు” అని ఆమె అంది.

తరవాత మాధవ్ తల్లిదండ్రులని లోపలికి పిలిచారు. ఆ చిన్నపిల్లలు, ఆ స్త్రీ అందరికీ కన్నీళ్ళతో దండం పెట్టారు.

“నాకభ్యంతరం ఏం లేదు”అని ఆంజనేయులు గారన్నారు.

“నాకుంది. వాడిని ముట్టకోడానికి వీల్లేదు. గుండె లేకపోతే ఎలా”.. అని ఏడుస్తున్న ఆమెని బయటికి తీసుకొచ్చారు. అక్కడ చాలా మంది ఉన్నారు.

“మీ అందరికీ ఓ చిన్న కథ చెప్తాను…..”

“ఇది కథలు చెప్పుకునే సమయమా… మీకు మతి లేదా….” సుందరి గట్టిగా అంది.

“అవును, మతిపోయింది.వాడిని అలా చూసి, మరి కొన్ని గంటల్లో పంచభూతాల్లో కలిసిపోయేవాడికి మరో రకంగా జీవితాన్నిస్తామంటే వద్దంటున్న నిన్ను, నీ మాటలు వింటూంటే మతి పోయింది. అందుకే ఓ చిన్న కథ చెప్తానంటున్నా. ఎవరు విన్నా నినకపోయినా రాధ వింటే చాలు…” అని రాధని చూసారు.

“పూర్వం దుర్మార్గుడైన వృత్తాసురుడనే రాక్షసుడిని చంపడానికి ఒక మహాదాత యొక్క వెన్నెముకతో వజ్రాయుధాన్నితయారుచేస్తే దానితో ఆ రాక్షసుడిని చంపచ్చని విష్ణువు చెప్తే.. దేవేంద్రుడు దధీచి మహర్షిని యాచిస్తాడు. అప్పుడు దధీచి తన వెన్నెముకనిస్తూ ఏం అన్నాడో తెలుసా…! లోక శ్రేయస్సు కోసం శరీర అవయవాలను దానం చెయ్యడం కన్న ఉన్నతమైన కార్యం ఏం ఉంటుంది..! మరణించిన తరవాత మనతో వచ్చేది మన శరీరం కాదు, మనం చేసిన మంచి చెడుల కర్మలు మాత్రమే….. ఇది మన పురాణాల్లో ఉన్నదే కావచ్చు, ఓ కథే కావచ్చు. కానీ అందులోని సందేశం ఈనాటికీ వర్తిస్తుంది… ” అని సుందరిని చూసారు. సుందరి భర్తని చూసింది. ఆంజనేయులుగారు అందరిని ఓసారి చూసారు.

“సుందరీ, రాధ పర్మిషన్ చాలు…  రాధా నువ్వెళ్ళి డాక్టర్లకి చెప్పు…. సంతకాలు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టు… నేనూ నీ వెనకాల వస్తాను…” అంటూ మాధవ్ తండ్రి ఆంజనేయులు గారు ముందుకి కదిలారు.

“అయితే  జీవన్‌దాన్.. వాళ్ళకి మెసేజ్ ఇచ్చేస్తాను. వాళ్ళు వచ్చి, బాడీని తీసుకెళ్తారు…”

“రాధగారూ మీరు అంగీకరిస్తే అవయవదానం….” అంటూ ఆగిపోయారు

“వద్దూ ఇంకేం వద్దూ……” అంటూ గట్టిగా అరిచింది మాధవ్ తల్లి.

“ఎంతో మందికి ఎన్నో అవయవాల అవసరం ఉంది. కాదు, ఉంటుంది. అందరూ అన్నీ ఇవ్వరు. వాళ్ళ సెంటిమెంట్లు వాళ్ళకుంటాయి. మీరు అంగీకరిస్తే…. ఒక్క గుండె కాకుండా కళ్ళు, మూత్రపిండాలు, పాంక్రియాస్, లివరు, ఊపిరితిత్తులు, బోన్ మ్యారో….. మీ యిష్టం మీరు అంగీకరిస్తేనే…..”

మాధవ్ తన కళ్ళతో కన్న కలలు, ఆ కళ్ళతో చూసిన ప్రపంచం, ఆ కళ్ళల్లోని పాజిటివ్ యాటిట్యూడ్స్ వాటన్నింటిని అలా గాలికి, ధూళికి, నేలకి, అగ్నికి, నీటికి ధారపొయ్యాలా…. అలా చేస్తే మాధవ్‌కి తృప్తిగా ఉంటుందా…. ఏ దయనీయ దృశ్యం చూసినా చలించిపోయే ఆ కళ్ళు ఈ లోకాన్ని చూస్తాయంటే…. అంతకన్నా కావలసినది ఏం ఉంటుంది…..

“తప్పకుండా డాక్టర్ మీకు ఏది కావాలో తీసుకోండి. మాధవ్ సంతోషిస్తాడు. ఈ మరణం నిజమైనది కాదు. శాశ్వతమైనది కూడా కాదు. కొంతమందిని సంతోషపెడుతున్న దానికి మరణం ఎందుకుంటుంది డాక్టర్.. ఉండదు. ఓ పది మందికి కొత్త జీవితాన్నిస్తూ కొత్త ఆశలనిస్తున్నాడు. కొంతమంది చీకటి జీవితాలకి వెలుగునిస్తున్నాడు. ఇంతకన్నా కావలసినది యేం ఉంటుంది….?”

సుందరి రాధ దగ్గరికి కోపంగా వెళ్ళింది. సౌమ్య ఆమె దగ్గరికి వెళ్ళింది.

“రాధని ఏం అనకండి. ఆమె అసలే ఉట్టి మనిషి కూడా కాదు. ఇప్పటికే మాధవ్ మరణం ఆమెని కుంగదీసింది. ఇప్పుడు మీరంతా…. ఇలా… ఆమె కడుపులో ఉన్న చిన్న మాధవ్ వింటే బాధ పడతాడు. జీవితాలని త్యాగం చేసినవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందులో మాధవ్ కూడా ఒకరు….”అని అంది సౌమ్య.

సుందరి ఉలిక్కి పడింది. ఏదో అనబోయి ఆగిపోయి, వెంటనే రాధ కడుపు చూసింది. ఒక్క క్షణంలో ఆమెలో కలిగిన మార్పులు అక్కడున్న వాళ్ళు గమనించారు. ఆ ముఖంలో ఓ రకమైన ఆశ్చర్యం. నిజమా అన్నట్లు చూసింది.

“మాధవ్ చిరంజీవి అని తెలుసుకుంటారు. కళ్ళిచ్చి, చీకటి జీవితాలకి వెలుగునిచ్చాడు. గుండెనిచ్చి, ఊపిరి పోసాడు. కిడ్నీలిచ్చి, జీవిత గమనానికి దారినిచ్చాడు. కాలిపోయిన వాళ్ళకి తన చర్మాన్నిచ్చి, శరీరానికి మెరుగునిచ్చాడు. ఎముకలనిచ్చి, రక్త హీన రోగులకి, ఆయువు పెంచబోతున్నాడు. ఇంతకన్నా ఏం కావాలి…. ఓ మనిషి జన్మకి ఇంతకన్నా సార్థకత ఏఁవుంది….”

అంబులెన్స్ వచ్చింది. మిషన్‌తో సహా మాధవ్‌ని ఎక్కించారు. ఓ విధంగా తీసుకెళ్ళారు అన్నది నిజం. ఇది ఆఖరుసారి, ఈసారి మాధవ్‌ని చూడడం ఇలా నిర్జీవంగా….. ఇప్పుడు కూడా అంతే… ఓ విధంగా వచ్చేటప్పుడు క్లినికల్లీ డెడ్. అంబులెన్స్ దగ్గర నుంచున్న రాధని, మాధవ్ తల్లి గబ గబా వచ్చి పట్టుకుంది. ఆ వెంటనే రాధ తల్లి కూడా వచ్చి మరో వైపు పట్టుకుంది. ఆ గెశ్చర్ చాలు రాధని జాగ్రత్తగా చూసుకునే ఓ ఇద్దరు తల్లులు ఆమె పక్కన ఉన్నారు. లోకం చూడని చిన్న మాధవ్ వాళ్ళని కలిపాడు.

ఆరుమంది డాక్టర్లున్న బృందం వెంటనే రెడీ అయిపోయారు. అందరికీ ఎలా తెలిసిందో తెలిసింది. రిపోర్టర్లూ, జర్నలిస్టులు అందరూ వచ్చారు. అంబులెన్స్ కదిలింది. వాళ్ళవెనకాలే రిపోర్టర్లూ, జర్నలిస్ట్‌లు, ఫొటోగ్రాఫర్లూ, వీడియో వాళ్ళూ అంతా వాళ్ళ వాళ్ళ వాహనాల్లో వెళ్ళారు. మరో రెండు రోజుల తర్వాత తెలిసింది ఆపరేషన్ సక్సెస్, హార్ట్‌ని యాక్సెప్ట్ చేసింది అన్న సంగతి పేపర్లలో చదివితే తెలిసింది.

అది తెలుసుకున్న రాధ మాధవ్ ఫొటోని తన పర్సులోంచి తీసింది.

నీ గుండె ఆగిపోలేదు మాధవ్, కొట్టుకుంటోంది, ఈ ఉదయం నీ హృదయం మామూలుగా  అయింది. పైన శరీరం నీది కాకపోవచ్చు. కాని అది నువ్వే…. నిన్ను ఫిజికల్‌గా మృత్యువు తీసుకెళ్ళి ఉండచ్చు, కాని నువ్వు మృత్యువుని జయించిన వాడివి. నీ అవయవాల దానం నిన్ను పైలోకంలోకి దారి చూపిస్తాయి. అసతోమా సద్గమయః  లోని ఈ పదాలు నీకు  సరిపోతాయి.

… ఈ మృత్యువు నిన్ను అమరుడినే చేసింది, చీకటి జీవితాలకి వెలుగునిచ్చింది. అంటే ఇదే….. నీకు మరణం లేదు. తమసోమా జ్యోతిర్గమయః అంటే ఇదే…….

పోస్ట్ మార్టం చేసాకా ఓ మూటని ఇచ్చారు. బాడీలోని వన్నీ తీసుకున్నాక మిగిలింది ఇది. అవయవాలు తీసుకున్నారు కదా ఏ కులం వాళ్ళకిచ్చారని అడగలేదు. అవి ఏ మతం వాళ్ళ కిచ్చారని రాధ అడగలేదు.

ఈ బాడీకి పేరుండేది అది మాధవ్. నిన్న పొద్దున్న వరకూ మాధవ్. ఓ ముప్పైయ్యారు గంటల్లో పేరు పోయింది. పేరు మారి పోయింది. శవం లేకపోతే బాడీ…. అసలు పేరుని యాక్సిడెంట్ తీసుకెళ్ళిపోయింది.

 “థాంక్స్ రాధా…. నన్ను ఈ యాక్సిడెంట్ ఏం చెయ్యలేదు. ఈ మృత్యువు నాపై ఓ ముసుగు వేసింది. కానీ నన్ను ఏం చెయ్యలేకపోయింది. నాకు ఎన్నో భయాలు ఉన్నాయి. కాని ఇప్పుడేం లేవు. కెరటం చివరి వరకూ తీసుకెళ్ళిందే కానీ,సముద్రంలో ముంచలేదు… నా అవయవాలన్నీ దానం చేసి, స్వర్గం నాకోసం ఎదురుచూసేలా చేసావు. నా దారిని సుగమమం చేసావు” అన్న మాటలు గాల్లోంచి తేలి వస్తూంటే గోడలు ప్రతిధ్వనించాయి.

నిజం పుణ్యకర్మలు చేస్తే ఉత్తమ గతి కలుగుతుంది. మరణించిన తరవాత తమ శరీరావయవాలను ఇతరుల ప్రయోజనార్థం దానం చేసిన వారు మరణంలోనూ జీవిస్తారు. ఇతరుల జీవితాల్లో వెలుగు నింపిన వారు నిజంగా ధన్యులు.

జీవితాంతం మనం గడిపేది మనతోనే. మన శక్తియుక్తులను రసాయనక చర్యలుగా వాడేసుకోకుండా, మన జీవ శక్తిని అమృతంగా మరుద్దాం. మృత్యోర్మా అమృతం గమయః అన్నది అందుకే…..

(సమాప్తం)

Exit mobile version