[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
హరే రామ హరే కృష్ణ-10
82. కృతజ్ఞః
ప్రాణులు చేసే కర్మలు తెలిసిన వాడు అగుట చేత కృతజ్ఞః అని కీర్తించబడ్డవాడు. జీవులు చేసే పాప పుణ్యాలు ఎరిగి ఉన్నవాడు. కేవలం పత్రపుష్పాలు మాత్రమే సమర్పించి అర్చించినా కూడా మహోత్కృష్టమైన మోక్షమును ప్రసాదించు వాడు. భక్తులు చేసిన సేవను మరువని వాడు. ఆపదలలో చిక్కిన భక్తులను వదలడు. తనను నమ్మినవారిని విడువడు. తననే కావాలని వాంఛించు భక్తులను క్షణం కూడా వదలడు.
ఒక్కసారి తనను ఆశ్రయించిన భక్తులను వారి పూర్వ కర్మలను బట్టీ వేరు చేసి చూడడు. వారి పూర్వకర్మలను తలువడు. ఆపద నుంచీ కాపాడటం మీదే ఆయన దృష్టి. దరి చేరుస్తాడు. కరుణ చూపి, సంరక్షిస్తాడు.
విభీషణుడు, కుంతి, అర్జునుడు ఉదాహరణలు. పురాణ కాలంలో ప్రహ్లాదుడు.
ఇక పరాశర భట్టర్ ప్రకారం..
॥ప్రాణినాం పుణ్యాపుణ్యాత్మకం కర్మ కృతం జానాతి ఇతి కృతజ్ఞః॥
॥అర్చనాత్ మోక్షం దదాతీచ కృతజ్ఞః॥
అర్చించుట చేతనే మోక్షమిచ్చివాడు కనుక కృతజ్ఞః అని పిలువబడుతున్నాడు.
॥కృతం జానాతీతి కృతజ్ఞః॥ – ఆత్మకోటి అనగా జీవులన్నీ ఆయన గురించి ఏ మాత్రం చింతన చేసినా కూడా వారిని ఆదరించి మోక్షాన్ని ఒసగువాడు కనుక కృతజ్ఞః.
***
శ్రీ రామాయణంలో వాల్మీకి మహర్షి తనకు కావలసిన గొప్ప లక్షణములను నారద మునికి చెప్పి, అలాంటి వాడు ఉన్నాడా? అని అడుగుతాడు. వాటిలో ఒక లక్షణం కృతజ్ఞత. అది కూడా ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అని ఆ రెండిటినీ కలుపుతాడు. ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు అయిన వ్యక్తి.
ఇక్కడో విశేషం గ్రహించాలి. వాల్మీకి మహర్షి ఉన్నది త్రేతాయుగం. అంతకు పై కాలాన్ని కూడా చూసే ఉంటాడు. ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన కృతయుగం గురించి తెలియకుండా, అవగాహన లేకుండా ఉండడు. ఆ కాలంలో కనీసం కొందరైనా ధర్మజ్ఞులు, కృతజ్ఞులు ఉండి ఉంటారు. అయినా ఆయన ఇలా ఎందుకు అడిగాడు?
రెండు కారణాలు.
శ్రీరామావతారం పరిపూర్ణం కాబోతోంది. ఇంకా కొన్ని సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నది రామచంద్రమూర్తిగా ఉన్న (అప్పటికి సీత ప్రక్కన లేదు, కనుక శ్రీ లేదు) శ్రీమహావిష్ణువు వైకుంఠధామానికి వెళ్ళవలసిన సమయం వస్తోంది. కనుక ఆయన చరిత్రము లిఖితమవ్వాలి.
రెండు. అంటే, సీతమ్మ మీద అపవాదు వేసే స్థాయికి దిగజారిన జనాలు ఆ కాలంలో వచ్చారంటే త్రేతాయుగం కన్నా అప్పటి సమయం ద్వాపరానికి దగ్గరగా ఉందని. అంటే ధర్మ నిష్పత్తి తగ్గుతున్నదని. అందుకే ఒక సర్వేక్షణ సంపన్నుడైన మానవుని గురించి వాల్మీకి మహర్షికి దిగులు పట్టుకుని ఉంటుంది. ఆ విషయాన్నే ఆలోచిస్తుంటే నారదముని వచ్చాడు. మహర్షి అడిగాడు. శ్రీ రామాయణానికి బీజం పడింది.
వాల్మీకి మహర్షి 16 లక్షణాలు అడిగితే, నారదుడు మరికొన్ని లక్షణాలను కలిపి మరీ చెప్పీ, ఆయన నీ సమకాలికుడే అంటాడు. అంటే, త్రేతాయుగం దాటి ద్వాపరం దగ్గర పడుతున్నా, ఆ పైన ద్వాపరం దాటి కలియుగం వచ్చినా, శ్రీరామచంద్రుడు ఒక ఆదర్శ మానవుడిగా నిలుస్తాడు. ఆయనే పరతత్వమని ఇది వరకే ఋజువయ్యింది కనుక అలాంటి అవతార్ పురుషుని చరిత్ర తెలుసుకుని తీరాలి.
వాల్మీకి మహర్షి అడిగిన లక్షణాలలో ప్రముఖమైనది, నారదముని ప్రత్యేకంగా చెప్పినదీ కృతజ్ఞత గురించి. కనుక శ్రీరాముని పరంగా కృతజ్ఞః అనే నామము ఆయనకు ఒప్పుకుంది. దృఢత ఎపిసోడ్లో మనం దీనికి సంబంధించిన నిదర్శనాలు ఐతిహ్యాల నుంచీ తీసుకున్నాము. పరిశీలించాము.
ఇప్పుడు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య వ్యాఖ్యానం తత్త్వపరంగా చేసినది చూద్దాము.
***
ఎత్తుకోవటమే అద్భుతంగా ఎత్తుకున్నారు.
“నరులకు (జీవులకు అని కూడా గూఢార్థము) ఉండవలసిన ప్రధాన లక్షణము కృతజ్ఞత.”
ఒకరు చేసిన ఉపకారము స్వల్పమైనను, అనుకోకుండా చేసినది అయినను, దానిని అధికంగా భావించుట కృతజ్ఞత. ఉపకారమును స్మరించుట, ఎవరైనా చేసిన అపకారమును మరచియుండుట ఉదాత్తమైన లక్షణాలు. ఈ విధంగా చూస్తే శ్రీరాముడు కృతజ్ఞుడు.
దశరథుడు శ్రీరామునకు పట్టాభిషేకం చేయదలచి ఆ విషయమును ప్రజలకు, పురప్రముఖులకు, మంత్రి సామంతులకు తెలుపగా వారు శ్రీరాముని గుణగణాలు కీర్తిస్తూ, అందులో ఆయన చూపే కృతజ్ఞతను గురించి ఇలా అంటారు.
కధంచిత్ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి।
నస్మరస్య పకారాణాం శతమప్యాత్మవత్తయా॥
ఎవరైనా అనుకుని కానీ, అనుకోకుండా కానీ, తెలిసి కానీ, తెలియకుండానే అయినా, ఏదో ఒక విధంగా ఆయనకు ఒక చిన్న ఉపకారం చేస్తే శ్రీరాముడు మనసులో పొంగిపోతాడు. వంద అపకారాలు చేసినా వాటి గురించి తలువను కూడా తలువడు (ఆఖరికి సిద్ధాంతానికి వచ్చిన సమయంలో రావణుని కూడా, “నేడు పోయి రేపు రమ్ము,” అన్నాడు కదా.
ఇక్కడ ఒక చమత్కారం ఉన్నది.
కధంచిత్ ఉపకారేణ ఏకేన
ఏదోక రూపంగా ఏ ఒక్క ఉపకారం చేసినా అని. ఇక్కడ సంస్కృతంలో ఉపకారేణ ఏకేన అన్నది విశేషంగా చూడాలి. ఏకవచనము, దేవి వచనము, బహువచనం ప్రత్యేకంగా ఉండే ఈ భాషలో ఉపకారేణ ఏకేన కధంచిత్ అన్నది ప్రాధాన్యం.
మనం పురాణ కథలు, వ్రత కథలు చూస్తుంటాం. అక్కడ కొందరు ఎన్ని తప్పుడు పనులు చేసిన వారైనా, ఏదోక సమయంలో ఆ దేవతాశక్తినో, సాధారణంగా పరబ్రహ్మనో (విష్ణు, శివ) అర్చించటమో, ఒక బిల్వమునో, పద్మపు రేకుని సమర్పించటమో, ఒక ఉపపురాణపు గాథలో శివరాత్రి అను గుర్తుకు వచ్చి, తన ప్రక్కన ఉన్న వేశ్య స్థనమునే శివలింగముగా భావించి అర్చించిన మనిషికి కైవల్యం ప్రసాదించటం ఉంటుంది. లేదా మోక్షం అందిస్తాడు భగవానుడు. అది ఈ కృతజ్ఞత అనేదానికి సరిపోయే ఉదాహరణ. అంటే మనసా వాచా కర్మణా తదేక దృష్టితో తెలిసి కానీ, తెలియక కానీ, చేసిన ధర్మకార్యం (భగవదర్చన) గొప్ప ఫలితాన్ని ఇవ్వటానికి కారణం భగవానుడు కృతజ్ఞుడు కావటం. అదే లక్షణాలను శ్రీరాముడు కూడా చూడగలిగినవాడు కనుక కూడా ఆయన పరబ్రహ్మ అని అంగీకరించాలి. బ్రహ్మ రావణునికి ఇచ్చిన వరం ప్రకారం ఆయన తన పరతత్వాన్ని ప్రకటించుకోకుండా ఉన్నాడంతే.
అలా ఆయన కృతజ్ఞత అనే లక్షణాన్ని అలుసుగా తీసుకుంటే కాకాసురుడిలా దెబ్బతింటారు. లేదా శ్రీకృష్ణుని మాదిరి ఆ వ్యక్తులకు తగిన శిక్ష వేస్తాడు భగవానుడు.
శ్రీరాముడు ఇచ్చినన్ని అవకాశాలు శ్రీకృష్ణ భగవానుడు ఇవ్వడు. అంతమాత్రాన ఆయనకు కృతజ్ఞత లేదని కాదు. అవతార భేదమే కాక కాల భేదము కూడా ఉంది.
శ్రీరాముని అలుసుగా తీసుకున్నవారు దాదాపు లేరు. కలియుగానికి దగ్గరపడిన సమయం కాబట్టి శ్రీకృష్ణుని అలుసుగా తీసుకుని దెబ్బతిన్న వారు కోకొల్లలు.
ఇంతటితో శ్రీరామ-కృష్ణావతారాల భేదాలను సాదృశ్యాలను చూడటం ముగిసింది.
॥హరే రామ హరే కృష్ణ॥
(సశేషం)
నా గురించి నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా (SSSA). వేరే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తారు. కనుక నేను రాసిన దాన్ని బట్టీ నా రచనల గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. అది చాలు. భవిషత్ లో కలవాల్సి వస్తే అప్పుడు నా గురించి ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకోవచ్చు. ఠీక్ హైఁ? 🙂
తెలుగు వాడినే అని చెప్పేందుకు సాక్ష్యం: నాకు తెలుగు రాదు.
గీతాచార్య
