Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తల్లివి నీవే తండ్రివి నీవే!-91

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

హరే రామ హరే కృష్ణ-9

మకు ఎంతో మేలు చేయి, అనేక విజయాలను సమకూర్చి, రాజసూయ యాగం విజయవంతంగా పూర్తి కావటానికి పర్యవేక్షణ చేసి, అగ్రపూజను అందుకున్న శ్రీకృష్ణుని, జూదానికి వెళ్ళబోయే ముందే కాదు, కనీసం సర్వం కోల్పోతున్న సమయంలో అయినా పాండవులు తలువలేదు. ఆయన సహాయం కానీ, సలహా కానీ కోరలేదు. అదే కారణం చేత అంత అవమానింపబడ్డా కూడా స్వామి సహాయం అందలేదు. తలువలేదు అంటే గుర్తించలేదు అని.

ఈ విషయం విధి విలాసం అనుకోవాల్సినదే! భగవంతుడు దుష్ట శిక్షణకు సన్నద్ధం చేసిన ప్రణాళికలో భాగమనుకోవాలి. కానీ మానవులుగా మనం భగవచ్ఛక్తిని ఎల్లవేళలా ఎరుకలో ఉంచుకొనుట పాడి.

సహస్రాదిత్యసంకాశం సహస్రవదనం పరమ్।
సహస్రదోస్సహస్రారం ప్రపద్యేఽహం సుదర్శనమ్॥ 1 ॥

హసంతం హారకేయూర మకుటాంగదభూషణైః।
శోభనైర్భూషితతనుం ప్రపద్యేఽహం సుదర్శనమ్॥ 2 ॥

స్రాకారసహితం మంత్రం వదనం శత్రునిగ్రహమ్।
సర్వరోగప్రశమనం ప్రపద్యేఽహం సుదర్శనమ్॥ 3 ॥

రణత్కింకిణిజాలేన రాక్షసఘ్నం మహాద్భుతమ్।
వ్యుప్తకేశం విరూపాక్షం ప్రపద్యేఽహం సుదర్శనమ్॥ 4 ॥

హుంకారభైరవం భీమం ప్రణాతార్తిహరం ప్రభుమ్।
సర్వపాపప్రశమనం ప్రపద్యేఽహం సుదర్శనమ్॥ 5 ॥

ఫట్కారాస్తమనిర్దేశ్య దివ్యమంత్రేణసంయుతమ్।
శివం ప్రసన్నవదనం ప్రపద్యేఽహం సుదర్శనమ్॥ 6 ॥

ఏతైష్షడ్భిః స్తుతో దేవః ప్రసన్నః శ్రీసుదర్శనః।
రక్షాం కరోతి సర్వాత్మా సర్వత్ర విజయీ భవేత్॥ 7 ॥
(సుదర్శన షట్కం)

ఇక్కడికి రాగానే భీష్మాచార్యుడు ఆలోచనలో పడ్డాడు.

ఇక్కడ ఇంకో విశేషాన్ని పరిశీలిద్దాము.

The Narayaniya Sahasranama is a condensed form of Narayaniyam consisting of 1000 names of Vishnu. It is carefully compiled from all the namas (names) of Vishnu’s avatars, that appear sequentially and chapter-wise in the Narayaniyam. It was composed by Dr. Ayyappan Kariyat, an Ayurveda vaidya.

ఈ నారాయణీయ సహస్రనామం చాలా విశేషమైనది. పారాయణం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. వింటే సమస్యలు తీరుతాయి. ప్రత్యేకించి వారానికి ఒక్కసారైనా విన్న వారికి మానసిక చీకాకులు తీరటం గురించి ప్రత్యక్ష సమాచారం ఉన్నది.

డాక్టర్ కరియత్ చేసిన కృషి ఎన్నదగినది. నారాయణ భట్టాతిరి చేసిన కృషికి సమానమైనదిగానే భావించాలి.

ఈ నారాయణీయ సహస్రనామంలో 82వ నామం..

ఓం సర్వతాపప్రశమనాయ నమః

సర్వతాపప్రశమన – అన్ని తాపాలను ప్రశమనం చేయువాడు. హరించువాడు.

విష్ణు సహస్రనామంలో 82వ నామం

ధురాధర్షః – తననెదిరింపగల గల శక్తి వేరెవ్వరికి లేనట్టివాడు.

అలాంటి వాడు మాత్రమే అందరి తాపాలను తగ్గించగలడు. పోగొట్టగలడు.

నారాయణీయ సహస్రనామం 1990లలో వెలికితీయబడినది.

2023లో పుస్తకరూపంలో వచ్చింది. Apple Music subscription ఉంటే.. అందులో శ్రీమతి రాధికా గోపాలకృష్ణన్ గానం చేసినది వినవచ్చు.

ప్రధానంగా ఈ తాపాలు మూడు. వాటినే తాప త్రయాలు అంటారు.

తాపత్రయము అంటే మన సనాతన ధర్మం ప్రకారం దర్శనాలలో మానవుడు అనుభవించే మూడు రకాల బాధలు లేదా దుఃఖాలు. ఈ తాపాలు మనిషి యొక్క శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక స్థితులతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ మూడు తాపాలు ఈ క్రింది విధంగా వివరించబడతాయి:

  1. ఆధ్యాత్మిక తాపము (ఆధ్యాత్మికం): ఇది మనస్సు మరియు ఆత్మకు సంబంధించిన బాధ. ఉదాహరణకు, అజ్ఞానం, అహంకారం, కోరికలు, భయం, ఆందోళన, ద్వేషం వంటి మానసిక సంఘర్షణల వల్ల ఏర్పడే దుఃఖం. ఇది ఆత్మ యొక్క జ్ఞాన లేమి లేదా సత్యాన్ని గ్రహించలేకపోవడం వల్ల కలుగుతుంది. గ్రహించగలిగితే పోతుంది.
  2. ఆధిభౌతిక తాపము (ఆధిభౌతికం): ఇది బాహ్య ప్రపంచంలోని జీవులు లేదా వస్తువుల వల్ల కలిగే బాధ. ఉదాహరణకు, ఇతర మనుషులు, జంతువులు, కీటకాలు, లేదా ప్రకృతి విపత్తుల వల్ల వచ్చే హాని లేదా బాధ. ఇందులో సామాజిక సంఘర్షణలు, శత్రుత్వం, లేదా పర్యావరణ కారణాల వల్ల కలిగే బాధలు కూడా ఉంటాయి.
  3. ఆధిదైవిక తాపము (ఆధిదైవికం): ఇది దైవిక శక్తులు లేదా అదృశ్య శక్తుల వల్ల కలిగే బాధ. ఉదాహరణకు, భూకంపాలు, తుఫానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు లేదా గ్రహాల స్థానాలు, దైవ ఆగ్రహం వంటి ఆధ్యాత్మిక కారణాల వల్ల కలిగే దుఃఖం. ఇవి మానవ నియంత్రణకు అతీతమైనవి.

సారాంశం: తాపత్రయము అనేది మానవ జీవనంలో మూడు రకాల బాధలను సూచిస్తుంది – ఆధ్యాత్మికం (మనస్సు మరియు ఆత్మ), ఆధిభౌతికం (బాహ్య జీవులు లేదా వస్తువులు), మరియు ఆధిదైవికం (దైవిక లేదా ప్రకృతి శక్తులు). ఈ తాపాల నుండి విముక్తి పొందడానికి జ్ఞానం, ధర్మం, ఆధ్యాత్మిక సాధన ద్వారా సాధ్యమని సనాతన తత్వశాస్త్రం చెబుతుంది. దానికి సాధన ప్రధానం.

ఈ తాపాలను పోగొట్టేవాడు శ్రీహరి. తాపాలు కూడా ఆరోగ్య సమస్యలకు కారణమౌతాయి. కనుక ఈ తాపాలు పోవాలన్నా శ్రీమన్నారాయణ సహస్రనామం చదువవచ్చు. లేదా వినవచ్చు.

ఇక్కడ భీష్మాచార్యునికి శారీరక బాధ లేదు. అది ఎప్పుడో ప్రశమనం అయింది. మానసిక బాధను కూడా చాలా వరకూ పోగొట్టుకున్నాడు. అహంకార, మమకారాలను దాదాపుగా జయించాడు. అది ఎలా ఏ సందర్భంలో జరిగిందో మనం గత ఎపిసోడ్లలో చూశాము.

ఇక్కడ కృతజ్ఞః తరువాత కృతిరాత్మవాన్ అనగానే భీష్ముడు క్షణమాలోచనలో మునిగాడు. కారణం ఏమయ్యుంటుంది? తాపత్రయాల్లో మొదటి రెండూ తీరాయి కానీ, మూడవది ఇంకా తీరలేదు. ఒక చిన్న అనుమానం ఆయనను పీడిస్తూనే ఉన్నది. ఏమిటా అనుమానం?

ఎందుకు శ్రీమన్నారాయణుడు తన కోసం దిగి వచ్చి, శ్రీకృష్ణుడి రూపంలో దర్శనమివ్వటానికి అంత రంగం ఎందుకు సృష్టించాడు? (మొదటి రెండు ఎపిసోడ్లు చూడండి).

దీనికి సంబంధించి కృతజ్ఞః అన్న నామాన్ని మరోసారి పరిశీలించాలి. త్రిమతాచార్యుల వ్యాఖ్యానాలలో ఉన్న అంతరార్థాలను బైటకు తీయాలి. ఆ పని చేద్దాము.

(సశేషం)

Exit mobile version