Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తల్లివి నీవే తండ్రివి నీవే!-88

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

హరే రామ హరే కృష్ణ-6

|| అనుత్తమో ధురాధర్షః కృతజ్ఞః కృతి రాత్మవాన్ ||

ఇక్కడ ఉన్నాము ప్రస్తుతం మనం. అనుత్తమ అనే నామము అటు శ్రీరామచంద్రమూర్తికి, ఇటు శ్రీకృష్ణ భగవానునికి ఎలా సరిపోతుందో చూస్తూ అవతార తత్వవిచారణ చేస్తున్నాము. పరమాత్మ అని అందరూ చెప్తున్నా తాను మానవుడు అని నొక్కి చెప్పే శ్రీరాముడు, తానే భగవానుడు అని చెప్పినా సాక్షాత్ బ్రహ్మ గారు కూడా పరీక్షించ దలచి భంగపడటం మనకు తెలుసు. ఎందుకీ తేడా? ఆ యా అవతార తత్వాల మధ్య ఉన్న మౌలిక భేదాన్ని తఱచి చూస్తూ, ఈలాంటి భేదం ఉన్నా కూడా అవే నామాలు రెండు అవతారాలకూ సరిపోవటానికి కారణాలు అన్వేషించాలి.

చాలా విచిత్రమైన అంశాలు మనకు తెలుస్తాయి.

గతంలో మనం శ్రీ రామావతారానికి సరిపోయే నామాలను చూస్తూ ధన్వీ అన్న నామం దగ్గర శ్రీరామచంద్రుడి ఆయుధ/అస్త్ర సంపదను గురించి తెలుసుకుంటూ ఆయన సర్వశ్రేష్ఠ ధనుర్ధారిగా నిరూపితమవటాన్ని చూశాము. కానీ, ఆయన కాలంలో మనకన్నా కనీసం కోటిన్నర సంవత్సరాల ముందువాడు (24వ మహాయుగం. మనం ఉన్నది 28వ మహాయుగం).

ఈమధ్య మహాభారతాన్ని చదువుతుంటే (వ్యాస ప్రోక్తం) ఒక విచిత్రమైన వివరం దొరికింది. శ్రీ వ్యాస మహర్షి అనుగ్రహం వల్ల. అది ఏమిటో చూసే ముందు నరనారాయణుల విలువిద్యా నైపుణ్యాన్ని మనకు తెలిసిన వివరాలను బట్టీ అంచనా వేద్దాము.

శ్రీ రామాయణం (వాల్మీకి ప్రోక్తం), మహాభారతం (వ్యాస) ఆధారంగా సర్వశ్రేష్ఠ ధనుర్ధారి గురించి చర్చించడం అనేది ఆసక్తికరమైన, సంక్లిష్టమైన పని. శ్రీరాముని మించిన ధనుర్ధారి అంటే ఎవరూ లేరు. శ్రీకృష్ణుడు తప్ప. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు ఈ విషయంలో పోల్చటానికి వీలుపడడో మనం చూశాము గతంలో. ఆయన సాక్షాత్ పరమాత్మ. సంపూర్ణం. కొందరు పెద్దలు నుడివిన ప్రకారం, రావణుడితో చివరి యుద్ధం సమయంలో నేడు పోయి రేపు రమ్ము అని రావణుడితో చెప్పే ఘట్టంలో రఘుకల తిలకుడు, వానరం సైన్యాన్ని ఉద్దేశ్యించి, “ఈ రకమైన యుద్ధ నైపుణ్యం ప్రదర్శను నేను మాత్రమే చేయగలను. లేదా శంకరుడు చేయగలడు.” అన్నాడని చెప్పగా విన్నాను. కానీ, నేను చూసినంతలో వాల్మీకంలో లేదు.  నాకు కనపడలేదు కనుక పెద్దల వాక్యాన్ని కాదనటము సముచితము కాదు. కనుక ఈ విషయం సరియైనదే అని భావించినా శివుడు భగవానుడిగా చెప్పబడే ఆర్గురు దేవతా మూర్తులలో ఒకడు ((శ్రీమహావిష్ణువు, శివుడునబడే శంకరుడు, శక్తి (లలితా అంటున్నారు చాలామంది కానీ, పార్వతిగానే భావించాలి. లలితా త్రిపుర సుందరి, పార్వతి మరో రూపమే అన్నది ఒక వాదన. కానీ శ్రీమాన్ దిట్టకవి లక్ష్మీనరసింహాచార్యులు – పాంచరాత్రాగమంలో తిరుగులేని విషయ జ్ఞానం కలిగిన వారు – ప్రామాణికంగా మహిషాసురమర్దిని శ్రీమహాలక్ష్మి (వీరలక్ష్మి) అని నిరూపించారు. వారి ఇతర రచనల ప్రకారం లలితాదేవి, పార్వతీదేవి వేరు వేరు కావచ్చు), గణపతి, సూర్యుడు, స్కందుడు (కుమార స్వామి) భగవాన్ అని పిలువదగిన వారు. వీరు శంకరాచార్యుల వారు స్థిరీకరించిన షణ్మతాలలో ప్రధాన పరమాత్మ స్వరూపాలు)).

కనుక శంకరుడు ఇక్కడ కుదరడు.

రామాయణంలో శ్రీరాముడు, మహాభారతంలో అర్జునుడు ఇద్దరూ అసమానమైన ధనుర్విద్య నైపుణ్యం కలిగినవారుగా చిత్రీకరించబడ్డారు. ఈ ఇద్దరి గొప్పతనాన్ని పోల్చడానికి, వారి నైపుణ్యాలు, ఆయుధాలు, యుద్ధాలు, గురువులు, దైవిక సహాయం వంటి అంశాలను పరిశీలించాలి.

శ్రీరాముడు (రామాయణం):

  1. నైపుణ్యం: శ్రీ రాముడు విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠుడు వంటి గురువుల వద్ద ధనుర్విద్యలో శిక్షణ పొందాడు. ఆయన తన ధనుస్సుతో తాటకి, సుబాహు, మారీచాది రాక్షసులను సంహరించాడు.
  2. ఆయుధాలు: శ్రీ రాముడు విష్ణు ధనుస్సు, శరభంగ మహర్షి నుండి పొందిన దైవిక ఆయుధాలు, బ్రహ్మాస్త్రం వంటి శక్తివంతమైన అస్త్రాలను ఉపయోగించాడు. రావణుడిని సంహరించడానికి బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు.
  3. పరాక్రమం: రాముడు ఒక్కడే ఖర-దూషణులు, వారి సైన్యాన్ని 14,000 రాక్షస సైన్యాన్ని నాశనం చేశాడు. రావణుడు, కుంభకర్ణుడు వంటి అత్యంత శక్తివంతమైన రాక్షసులను ఓడించాడు.
  4. దైవిక శక్తి: శ్రీ రాముడు విష్ణువు యొక్క అవతారంగా పరిగణించబడ్డాడు, కాబట్టి ఆయన ధనుర్విద్యలో అసాధారణ నైపుణ్యం దైవిక శక్తితో ముడిపడి ఉంది అని భావించాలి. నరుడి రూపంలో ఉన్న నారాయణుడు.
  5. స్వభావం: రాముడు ధర్మాన్ని పాటించే మర్యాదా పురుషోత్తముడు. ఆయన ధనుర్విద్యను ధర్మ రక్షణ కోసం మాత్రమే ఉపయోగించాడు.

అర్జునుడు (మహాభారతం):

  1. నైపుణ్యం: అర్జునుడు ద్రోణాచార్యుల వద్ద శిక్షణ పొందాడు, ఆ తర్వాత శివుని నుండి పాశుపతాస్త్రం, ఇంద్రుని నుండి దైవిక ఆయుధాలు పొందాడు. ఆయన ధనుర్విద్యలో అసమాన నైపుణ్యం కలిగినవాడు.
  2. ఆయుధాలు: అర్జునుడు గాండీవం అనే అద్భుతమైన ధనుస్సును ఉపయోగించాడు. బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, వజ్రాయుధం వంటి శక్తివంతమైన అస్త్రాలు ఆయన సొంతం. వాడ్ని ఆయుధం లేదు. తెలియని అస్త్రం లేదు. ఒక్క సుదర్శనం తప్ప.
  3. పరాక్రమం: అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, జయద్రథుడు వంటి మహాయోధులను ఓడించాడు. విరాట పర్వంలో గోగ్రహణం యుద్ధంలో ఒక్కడే కౌరవ సైన్యాన్ని ఓడించాడు. (గుర్తు పెట్చుకోండి).
  4. దైవిక సహాయం: అర్జునుడికి శ్రీకృష్ణుడే (విష్ణువు అవతారం – సాక్షాత్ పరమాత్మ) సారథిగా, మార్గదర్శిగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు గీతోపదేశం ద్వారా అర్జునుడిని యుద్ధంలో నడిపించాడు.ఇక్కడ నరుడి ప్రక్కన నారాయణుడు.
  5. స్వభావం: అర్జునుడు నైపుణ్యం, ధైర్యం కలిగినవాడు అయినప్పటికీ, కొన్ని సందర్భాలలో ధర్మం విషయంలో సంశయాత్మక స్వభావం కలిగి ఉన్నాడు. కానీ శ్రీకృష్ణుడి ఉపదేశాలతో ధర్మాన్ని కాపాడాడు.

పోలిక:

నిజానికి అనవసరం. కానీ నరుడి రూపంలో ఉన్న నారాయణుడు, నారాయణునిచే నడుపబడిన నరుడు కనుక మనకు కొత్త విషయాలు తెలుసుకునేఅవకాశం వస్తుంది. ఎవరూ ఎక్కువ ప్రస్తావించని కోణాలను చూద్దాము.

నైపుణ్యం:

ఇద్దరూ ధనుర్విద్యలో అసమాన నైపుణ్యం కలిగినవారు. అర్జునుడు గాండీవం, పాశుపతాస్త్రం వంటి ఆయుధాలతో బహుముఖ నైపుణ్యం చూపగా, రాముడు బ్రహ్మాస్త్రం, విష్ణు ధనుస్సుతో అజేయుడు. యుద్ధాలలో అర్జునుడు  అపజయం ఎరుగడు. శ్రీరాముడు కూడా. అర్జునుడి తొలి పరాజయం బభ్రువాహనుని చేతిలో. శ్రీరామునికి పరాజయం లేదు. మాయాయుద్దంతో నిలువరించబడ్డాడు. నాగపాశాలు.

పరాక్రమం:

రాముడు ఒక్కడే రాక్షస సైన్యాన్ని నాశనం చేశాడు, అర్జునుడు కృష్ణుడి సహాయంతో కౌరవ సైన్యాన్ని ఎదిరించాడు.

ఇక్కడే నాకు అత్యంత విచిత్రమైన వివరం దొరికింది. రామరావణ యుద్ధం కన్నా ముందర శ్రీరాముడొక్కడే 14,000 మంది రాక్షసులను ఒకటిన్నర ఘడియ కాలంలో (72 నిముషాలు) నిర్జించాడు. మరి అర్జునుడు? ఉత్తర గోగ్రహణం కాలంలో కౌరవులందరినీ నిలువరించాడు. కానీ అక్కడ ఎక్కువ సైన్యం లేదు. ప్రధాన యోధులందరూ ఉన్నా, వారితో ఎక్కువగా ద్వంద్వ యుద్ధమే. రాముడు ఖరదూషణులతో చేసిన యుద్ధంలో రాక్షసులందరూ ఒకేసారి మీద పడ్డారు.

అంతగా కౌరవ సైన్యం మొత్తాన్నీ నిలువరించిన వాడు అయితే మరి కురుక్షేత్రంలో ఎందుకు అలా ఒక్కడే గెలువలేక పోయాడు? అందులోనూ పరమాత్మ ప్రక్కనే ఉన్నా! కారణం?

అది చూస్తుంటేనే దిమ్మతిరిగే రహస్యం తెలుస్తుంది. అసలు ధన్వీ అన్న నామము శ్రీరామావతారానికి మాత్రమే ఎందుకు ఒప్పుతుంది అనే విషయం తెలుస్తుంది.

ఒక్కసారి అలా 5200 సంవత్సరాల క్రితం జరిగిన కురుక్షేత్ర యుద్ధానికీ, కోటిన్నర సంవత్సరాల పైనకాలంలో శ్రీరాముడు చేసిన యుద్ధాలకూ మధ్య చక్కర్లు కొడదాము రండి. కాలంలో ప్రయాణం చేస్తూ..

(సశేషం)

Exit mobile version