Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తల్లివి నీవే తండ్రివి నీవే!-86

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

హరే రామ హరే కృష్ణ-4

సర్వం విశ్వస్య సందానం సర్వం విశ్వస్య సంగ్రహమ్ | చింతయేచ్చేతసా నిత్యం శ్రీరామః శరణం మమ || ౨౬ ||
సర్వం విశ్వస్య సంనాదం సర్వం విశ్వస్య సంనతమ్ | చింతయేచ్చేతసా నిత్యం శ్రీరామః శరణం మమ || ౨౭ ||
సర్వం విశ్వస్య సంజ్ఞానం సర్వం విశ్వస్య సంశ్రితమ్ | చింతయేచ్చేతసా నిత్యం శ్రీరామః శరణం మమ || ౨౮ ||
సర్వం విశ్వస్య సంతోషం సర్వం విశ్వస్య సంనిధిమ్ | చింతయేచ్చేతసా నిత్యం శ్రీరామః శరణం మమ || ౨౯ ||
సర్వం విశ్వస్య సంతాపం సర్వం విశ్వస్య సంక్షయమ్ | చింతయేచ్చేతసా నిత్యం శ్రీరామః శరణం మమ || ౩౦ ||
(అష్టాక్షర శ్రీరామ మంత్ర స్తోత్రం)

దీపో యథా నిరవధిః స్వప్రకాశకోసౌ |
స్వీయం ప్రకాశతి యథాగ్నిరివాత్మతేజః |
తస్మాత్ పరం స్వయమసౌ హి పరం ప్రకాశః |
గోవిందం ఆదిపురుషం తమహం భజామి || ౪౬ ||
మాయాతితే వ్యతికరే జగతాం సుమంగళం |
లీలావతారైరవతీర్ణం స్వమనీషయా |
సంసారసాగరనిమగ్నాన్ ఉద్ధరత్యసౌ |
గోవిందం ఆదిపురుషం తమహం భజామి || ౪౭ ||
యద్భావభావితధియో మనుజాస్తథైవ |
సంప్రాప్తవన్మనసిజాః కమలాసనస్థాః |
శ్రీరూపమాశ్రితమజస్రమజం ప్రసీదత్ |
గోవిందం ఆదిపురుషం తమహం భజామి || ౪౮ ||
ఏకోపి సన్ బహుధా యోవభాతి విశ్వే |
విష్ణుర్భవాన్ హరిరితి స్మరతి త్మదీయః |
ఏషాం ఘటాంతరగతోపి హృదంతరస్థః |
గోవిందం ఆదిపురుషం తమహం భజామి || ౪౯ ||
 యం పశ్యతో జనముఖే ముఖమాత్మనశ్చ |
సర్వం విశేషవిహితం హి తదాత్మకం చ |
తస్మాత్ పరం న హి పరం త్వమసి స్వయం చ |
గోవిందం ఆదిపురుషం తమహం భజామి || ౫౦ ||
(బ్రహ్మ సంహితా)

బ్రహ్మాది దేవతల నుంచీ, బుద్ధి జ్ఞానులైన భక్తులు శ్రీరాముని పరతత్వాన్ని గుర్తించారు. కానీ, బుద్ధి జ్ఞానులైన భక్తులను శ్రీకృష్ణుడే మొదట గుర్తిస్తాడు. అందుకే బుద్ధిహీనులకు, అజ్ఞానాహంకారాలు కలిగిన వారిని శ్రీకృష్ణుడు వీలైనంత త్వరగా శిక్షిస్తాడు. కానీ శ్రీరాముడు మాత్రం ఒకటికి రెండుసార్లు అవకాశం ఇచ్చి చూస్తాడు. కాకాసురుడు, మారీచుడు, చివరికి రావణుడికి కూడా.

మనం గ్రహించం కానీ, వాలిని మొదటే చంపకపోవటంలో, సుగ్రీవుడి అపరాధం, దానికి చిన్న శిక్ష ద్వారా కర్మను కరిగించి, బాపటమే కాదు, వాలికి కూడా ఆయన రెండవ అవకాశం ఈయటానికి కూడా. వివేకవతి అయిన తార మాటలు వినక వచ్చిన అవకాశాన్ని వాలి చేజార్చుకున్నాడు. ఒక్క సుబాహుడు తప్ప (వాడికి కూడా మొదట హెచ్చరిక వెళ్ళింది). తాటక విషయంలో తటపటాయించుతూ కూడా ఒక అవకాశమిద్దాము, ఆగుతుందేమో అని కావచ్చు. అందుకే ఆయన అనుత్తముడు. ధురాధర్షుడు.

కానీ శ్రీకృష్ణ భగవానుడు మాత్రం అలాంటి అవకాశాలు ఇవ్వడు. కేవలం సమయం కోసం వేచి చూస్తాడు. శిక్షిస్తాడు. అది అర్జునుడైనా, కర్ణుడైనా, భీష్ముడు అయినా. ఒక్క రుక్మిణి మాత్రం రుక్మిణి కోసం వదిలాడు. కాస్త నయమనిపించేలా తయారయ్యాడు. కానీ దుష్టబుద్ధి ఊరకుండదుగా, కలి ప్రభావం వల్ల తప్పు చేసి బలరాముడు చేతిలో హతమయ్యాడు. జరాసందుని చేత మూల మూలలనున్న రాక్షస సంతతిని, అసురాంశలు గల వారిని రప్పించి మరీ నిహతులను గావించాడు. తానే చంపగలిగినా విధిని గౌరవించి భీముని చేత చంపించాడు.

ఒక మాట రూపంలోనో, ఒక సైగ రూపంలోనో, చిన్న హెచ్చరిక ఇస్తాడు. అంతే. ఆ పైన..

తన వారు, పరాయి వారు అనే తేడా ఉండదు.

రాముడు ధర్మము అయితే శ్రీకృష్ణుడు కూడా ధర్మ స్వరూపుడే.

రామో విగ్రహవాన్ ధర్మః

యతో ధర్మః తతో కృష్ణః యతో కృష్ణః తతో జయః

అంటే శ్రీకృష్ణ భగవానుడు ధర్మం పక్షాన ఉంటాడు. ఆయన ఎవరి పక్షాన ఉంటే వారికి విజయం కనుక ధర్మం విజయం సాధిస్తుంది.

శ్రీకృష్ణుడు ధర్మాన్ని ఆచరించు బుద్ధి జ్ఞానులను తానే మొదట గుర్తిస్తాడనేది మనం ద్రౌపదీ స్వయంవర ఘట్టం ఆధారంగా పరిశీలిద్దాము.

ద్రుపదుడు ఏర్పాటు చేసిన స్వయంవరానికి అందులో పాల్గొనేందుకు కాదు, చూసి వెళ్దాం అని వచ్చిన వారు కూడా ఉన్నారు. వారు శ్రీకృష్ణ-బలరాముడు ఆధ్వర్యంలో వచ్చిన యాదవులు కూడా ఉన్నారు. వారు నిజానికి స్వయంవరానికి ముందు జరిగిన యజ్ఞ క్రతువు చూడటానికి వచ్చారు. వారికి ఈ స్వయంవరం అసలు రహస్యం తెలుసు. అర్జునుడి కోసం అన్వేషణ అని.

ఇక్కడ వ్యాస మహర్షి ఎలా చూపుతాడంటే..

హలాయుధస్తత్ర జనార్దనశ్చ
వృష్ణకాంధశ్చైవ యథా ప్రధానమ్
ప్రేక్షాంస్మ చక్రు ర్యదుపుంగవా స్తే
స్థితాశ్చ కృష్ణస్య మతే మహాంతః

చాలా చిత్రమైన పరిచయం ఇది. మొదట స్థూలంగా చూసి తరువాత సూక్ష్మంగా పరిశీలిద్దాము.

బలరాముడు, జనార్దనుడు మొదలైన యదువంశీయులు అక్కడ చేరారు. అందరూ నిశ్శబ్దంగా తిలకిస్తున్నారు తప్ప నోరు మెదపటం లేదు. ఎందుకంటే కృష్ణుడు చెప్పిన విధంగా ఉండాలి కనుక.

ఎందుకు? ఆయన భగవంతుడు కనుక.

కృష్ణస్య మతే మహాంతః

ఎనిమిది అక్షరాలలో చెప్పేశాడు. శ్రీకృష్ణ తత్వం.

ఇంకోరకంగా చూద్దాము.

హలాయుధస్తత్ర జనార్దనశ్చ

మొదట బలరాముడి పేరు ఎందుకు? పైగా హలాయుధస్తత్ర అంటూ మరీ?

హలాయుధమూ, దానిని ధరించిన వాడు.. ఆయన (శ్రీకృష్ణ భగవానుడి) ఆయుధాలే కనుక. బలరాముడు కూడా ఆయన ఆయుధమే.

ఇప్పుడు చూడండి. హలాయుధుడిని ఆయుధంగా ధరించిన వాడైన జనార్దనుడితో వృష్ణి, అంధక వంశీయులు వచ్చారు. వారంతా మౌనంగా తిలకిస్తున్నారు. ఎందుకంటే హలాయుధుడిని ధరించిన వాడు చెప్పాడు కనుక.

హలాయుధము వ్యవసాయానికి ప్రతీక. అంటే వ్యవసాయం చేయటానికి వచ్చాడు ఈశ్వరుడు. ఆయనే శ్రీకృష్ణ భగవానుడు. ఏ వ్యవసాయం? ధర్మము అనే వ్యవసాయము.

అంటే ధర్మము, ధర్మాచరణ అనే వ్యవసాయానికి సాక్షాత్ పరమాత్మయే విజయం చేసినప్పుడు, మిగిలిన వారు చేయవలసినది ఆయన చెప్పిన దానిని అనుసరించటమే అని.

ఇదీ వేదవ్యాస మహర్షి చమత్కృతి.

బలరాముడితో జనార్దనుడు ఇలా చెప్పాడు, “అగ్రజా! అదిగో, అక్కడ బ్రాహ్మణుల వరుసలో ఆ ప్రక్కగా ఐదుగురు కూర్చున్నారు చూశావా? వారు మన మేనత్త గారైన కుంతీదేవి సంతానం. పాండవులు. యుధిష్ఠిరుడు, భీమసేనుడు, అర్జునుడు, నకులుజు, సహదేవుడు. ఈ స్వయంవర పరీక్షలో వీరే విజయం సాధిస్తారు.”

ద్రౌపదికి ఐదుగురు పతులు అనే విషయాన్ని నర్మగర్భంగా పరమాత్మ చెప్పేశాడు. ఇక ఆ విషయంలో తిరుగులేదు. ధర్మాధర్మ చర్చ లేదు. పైగా ఐదుగురిని కుంతీపుత్రులు అన్నాడు. అంటే ఆయనకు భేదభావం లేదు.

ఈ మాట చెప్పాక ఇక కర్ణుడిని నిరాకరించింది ద్రౌపది అని తప్పుపట్టటం తప్పు. దైవ వాక్యాన్నే ఆమె కూడా పలికింది. సూతపుత్రుడిని చేసుకోను అన్న మాట. సూతులను అనలేదు. ఆ సూత పుత్రుని మాత్రమే అని కూడా తీసుకోవాలి. పైగా కర్ణుడి పారిపోయిన ప్రతాపం గురించి తండ్రి చెప్పకపోయి ఉంటాడా?

(సశేషం)

Exit mobile version