Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తల్లివి నీవే తండ్రివి నీవే!-85

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

హరే రామ హరే కృష్ణ-3

జటాచీరధరోధన్వీ జానకీలక్ష్మణాన్వితఃl
చిత్రకూటకృతావాసః శ్రీరామః శరణం మమ॥21॥
మహాపంచవటీలీలా సంజాతపరమోత్సవః।
దండకారణ్యసంచారీ శ్రీరామః శరణం మమ॥22॥
ఖరదూషణవిచ్ఛేదీ దుష్టరాక్షసభంజనః।
హృతశూర్పణఖాశోభః శ్రీరామః శరణం మమ॥23॥
మాయామృగవిభేత్తా చ హృతసీతానుతాపకృత్।
జానకీవిరహాక్రోశీ శ్రీరామః శరణం మమ॥24॥
లక్ష్మణానుచరోధన్వీ లోకయాత్రావిడంబకృత్।
పంపాతీరకృతాన్వేషః శ్రీరామః శరణం మమ॥25॥
(అష్టాక్షర శ్రీరామ మంత్ర స్తోత్రం)

మాయా హి యస్య జగదండశతాని సూతే
త్రైగుణ్యతద్విషయవేదవితాయమానా।
సత్త్వావలంబిపరసత్త్వం విశుద్ధసత్త్వం
గోవిందమాదిపురుషం తమహం భజామి॥41॥
ఆనందచిన్మయరసాత్మతయా మనఃసు
యః ప్రాణినాం ప్రతిఫలన్ స్మరతాముపేత్య।
లీలాయితేన భువనాని జయత్యజస్రం
గోవిందమాదిపురుషం తమహం భజామి॥42॥
గోలోకనామ్ని నిజధామ్ని తలే చ తస్య
దేవి మహేశహరిధామసు తేషు తేషు।
తే తే ప్రభావనిచయా విహితాశ్చ యేన
గోవిందమాదిపురుషం తమహం భజామి॥43॥
సృష్టిస్థితిప్రలయసాధనశక్తిరేకా
ఛాయేవ యస్య భువనాని బిభర్తి దుర్గా।
ఇచ్ఛానురూపమపి యస్య చ చేష్టతే సా
గోవిందమాదిపురుషం తమహం భజామి॥44॥
క్షీరం యథా దధి వికారవిశేషయోగాత్
సంజాయతే న హి తతః పృథగస్తి హేతోః।
యః శంభుతామపి తథా సముపైతి కార్యా-
-ద్గోవిందమాదిపురుషం తమహం భజామి॥45॥
(శ్రీ బ్రహ్మ సంహితా)

సాధారణముగా ఉత్తమము అంటే గొప్పది అని చెప్తాము. సాపేక్షమే ఇది. అంతకు మించినది ఏదైనా తారసపడితే మనం ఆ దానిని ఉత్తమము అని చెప్తాము. అంతకు ముందుది ఉత్తమం కాకుండా పోతుంది. పోలిక వల్ల. కానీ, అది బాగుండదా అంటే బాగుండక పోవటం కాదు.

కానీ భగవానుని విషయంలో ఎన్ని పోలికలు తెచ్చినా, వారిని మించిన వారు, వస్తువులు.. ఇలా ఏవీ ఉండవు.

శ్రీ రామాయణ కాలంలో తీసుకుంటే వాల్మీకి మహర్షి అడిగిన సద్గుణాలన్నీ పోతపోసినట్లు శ్రీరామునిలో తప్ప ఎవరి వద్దా లేవు.

మహాభారత కాలంలో చూస్తే శ్రీకృష్ణుడే సర్వోన్నతుడిగా కనిపిస్తాడు. ఎందుకు ఎన్ని రకాలుగా వ్యాఖ్యానించినా కూడా.

ఆ రకంగా ఈ రెండు అవతారాలకు అనుత్తమః అనే నామము నప్పుతుంది.

జ్ఞాన, బల, క్రియాతి శక్తులలో ఆయనను మించిన వారు ఉండరు. ఇది వేదం చెప్పిన మాట.

యస్మాన్నజాతః పరం అస్తి య అవివేశభువనాని విశ్వా॥ – ఈతని కంటే అధికమైనదేదీ లేదు. గతంలో లేదు. ప్రస్తుతం లేదు. భవిష్యత్‌లో ఉండదు. అలాంటి ఈయన విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు.

ఎవరు? విష్ణువు. కనుక విష్ణువు అనుత్తముడు. ఆయన అవతారాలలో శ్రీరామావతారంలో ఆయన పరబ్రహ్మ తత్వాన్ని గురించి చెప్పినా ఆయన ఒప్పుకోలేదు. అయినా ఆయనను మించిన వారు ముల్లోకాలలోనూ లేరు. స్వయంగా శ్రీకృష్ణుడే తాను పరమేశ్వరుడిని చెప్పటమే కాదు. ఆయనను గర్తించిన వారు కొందరి ఆ కాలంలో ఉండగా, ఆయనను గుర్తించలేని వారు అధిక సంఖ్యలో ఉన్నారు. అధిక సంఖ్య అంటే సాపేక్షంగా ఎక్కువ అని. 50శాతం కంటే ఎక్కువ అని.

ద్వారకలో ఉండి హస్థినాపురంలో ఆపదలో ఉన్న ద్రౌపదిని రక్షించాలంటే ఆయన వ్యాపించినవాడు అయితేనే సాధ్యం. Instantaneous intervention. ఆ వ్యాపించిన వాడు అనుత్తముడు అయితే అదే వ్యాపనాన్ని చూపిన వాడు కూడా అనుత్తముడే.

తస్మాత్ పరం నాఽ పరమస్తికించిత్॥
తస్మాద్ధాన్యన్నపర కిఞ్చి నాస॥

ఇవి కెంధూళి శ్రుతివాక్యాలు. ఇతనికంటే ఉత్తమమైనది ఏదీ లేదని, పరమాత్మయే సర్వోత్కృష్టమని తేల్చి చెప్పాయి.

దీనినే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత (7.7) లో ఇలా చెప్తాడు.

మత్తః పరతరం నాన్యత్కిఞ్చిదస్తి ధనంజయ॥ – ఓ ధనంజయా, ఈ విశ్వాలన్నిటిలో నాకంటే గొప్పది లేదు. దారానికి ముత్యాలు గుచ్చినట్లుగా, ఈ ప్రపంచంలోని ప్రతిదీ నా మీదే ఆధారపడి ఉంది. ఈ శ్లోకం శ్రీ కృష్ణుడు తన దివ్యత్వాన్ని, సర్వోన్నతత్వాన్ని అర్జునుడికి వివరిస్తున్న సందర్భంలో వస్తుంది.

న త్వత్సమో స్త్యభ్యధికః కుతోస్యః॥ – నీతో సమానమైనది లేదు. ఇక నీకన్నా అధికమైనది ఇంకెలా ఉంటుంది?

అనుత్తముడు కనుకనే జ్ఞానబలాదులచే శోభిల్లుతున్న ఈతడు

ధురాధర్షుడు.

రాక్షసాదులు ఇతనిని ఎదుర్కొనలేదు.

రావణ సంహారంలో చూశాము తొలిగా ఎదురుపడిన తాటక నుంచీ, చివరగా శతృఘ్ని ద్వారా వధించబడిన లవణాసురుడి దాకా శ్రీరాముని ఎదుర్కొనగలిగ్న రాక్షసులు ఎక్కడా లేరు. దేవతలు లేరు.

కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే॥

శ్రీ రామాయణం బాలకాండ మొదటి సర్గ మొదటి శ్లోకం.

దేవతలు కూడా ఈయనను ఎదుర్కొనలేరు.

శ్రీకృష్ణుని ముందు నిలచిన వారు కూడా శూన్యం. ఇటువంటి సర్వేశ్వరత్వము కల విక్రముడు కనుక ఈ నామాల వరుస ఇలా సాగింది.

ఈశ్వరుడిగా లోకమంతా వ్యాపించి, ఎవరూ సాధింపశక్యం కాని మహా మహిమలతో ప్రకాశిస్తూ ధురాధర్షుడు అని పేరు పొందాడు.

ఎవరు? 24వ మహాయుగంలోని త్రేతాయుగంలో శ్రీరాముడు. ఇప్పటి (అంటే 28వ మహాయుగంలోని) ద్వాపరంలో నడయాడిన శ్రీకృష్ణ భగవానుడు.

తేనార్హతి బ్రహ్మణా స్పర్ధితుమ్ కః॥ – ఆ బ్రహ్మముతో స్పర్ధను ఎవరు వహించగలరు?

దుష్టులను సమగ్రంగా శిక్షించు వాడు కూడా ధురాధర్షుడు అనబడుతున్నాడు.

ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అవగతం చేసుకోవాలి. రామ, కృష్ణావతారాల పరమార్థం, భేదాలు ఇక్కడ తెలుస్తాయి.

(సశేషం)

Exit mobile version