[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
హరే రామ హరే కృష్ణ-2
అర్చావతార రూపేణ దర్శనస్పర్శనాదిభిః।
దీనానుద్ధరతే యోఽసౌ శ్రీరామః శరణం మమ॥16॥
కౌశల్యాశుక్తిసంజాతో జానకీకంఠభూషణః।
ముక్తాఫలసమో యోఽసౌ శ్రీరామః శరణం మమ॥17॥
విశ్వామిత్రమఖత్రాతా తాటకాగతిదాయకః।
అహల్యాశాపశమనః శ్రీరామః శరణం మమ॥18॥
పినాకభంజనః శ్రీమాన్ జానకీప్రేమపాలకః।
జామదగ్న్యప్రతాపఘ్నః శ్రీరామః శరణం మమ॥19
రాజ్యాభిషేకసంహృష్టః కైకేయీ వచనాత్పునః।
పితృదత్తవనక్రీడః శ్రీరామః శరణం మమ॥20॥
(అష్టాక్షర శ్రీరామ మంత్ర స్తోత్రం)
యద్భావభావితధియో మనుజాస్తథైవ
సంప్రాప్య రూపమహిమాసనయానభూషాః।
సూక్తైర్యమేవ నిగమప్రథితైః స్తువంతి
గోవిందమాదిపురుషం తమహం భజామి॥36॥
ఆనందచిన్మయరసప్రతిభావితాభి-
-స్తాభిర్య ఏవ నిజరూపతయా కలాభిః।
గోలోక ఏవ నివసత్యఖిలాత్మభూతో
గోవిందమాదిపురుషం తమహం భజామి॥37॥
ప్రేమాంజనచ్ఛురితభక్తివిలోచనేన
సంతః సదైవ హృదయేషు విలోకయంతి।
యం శ్యామసుందరమచింత్యగుణస్వరూపం
గోవిందమాదిపురుషం తమహం భజామి॥38॥
రామాదిమూర్తిషు కలానియమేన తిష్ఠన్
నానావతారమకరోద్భువనేషు కింతు।
కృష్ణః స్వయం సమభవత్పరమః పుమాన్ యో
గోవిందమాదిపురుషం తమహం భజామి॥39॥
యస్య ప్రభా ప్రభవతో జగదండకోటి-
-కోటిష్వశేషవసుధాది విభూతిభిన్నమ్।
తద్బ్రహ్మ నిష్కలమనంతమశేషభూతం
గోవిందమాదిపురుషం తమహం భజామి॥40॥
(బ్రహ్మ సంహిత)
శ్రీకృష్ణావతారం దశావతారాల వరుసలో ఎనిమిదోది. శ్రీకృష్ణునికి ఈ ఎనిమిది సంఖ్యకు విశేషమైన సంబంధం ఉంది. అతడు దేవకీదేవికి అష్టమగర్భంలో జన్మించాడు. అతని జన్మతిథి అష్టమి. అతనికి భార్యలు ఎనిమిది మంది. వీరందరూ అష్టమహిషులుగా ప్రసిద్ధులు, అంతేకాదు అందరూ పేర్కొనే ఎనిమిదిమంది అష్టవిధ శృంగారనాయికలకు ప్రతీకలు. శ్రీకృష్ణుడు గీతలో పేర్కొన్న ప్రకృతులు కూడా ఎనిమిది. ఇలా అష్ట సంఖ్యకు, శ్రీకృష్ణునికి గల సంబంధం చాలా ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే అనుష్టుప్ ఛందస్సులో పాదానికి ఎనిమిది అక్షరాలు. గతంలో చెప్పినట్లు గాయత్రీ మంత్రం కూడా 8×3 అని మనకు ఎక్కువగా తెలిసినా లుప్తమైన మరో పాదంతో కలిసి నాలుగు పాదాల అనుష్టుప్ యే అంటారు పెద్దలు. అంటే భగవాన్ ఛందస్ అయిన అనుష్టుప్ నుంచే గాయత్రీ ఛందస్ వచ్చింది.
తాను కృష్ణునిగా అవతరిస్తూ దేవతా కోటిని మీరు భూలోకంలో మీకు నచ్చిన రూపంలో జన్మించమన్నాడు ఆ మహావిష్ణువు. ఋషులుగా, గోపికలుగా, గోవులుగా, పక్షులుగా, పశువులుగా, చెట్లుగా, నదులుగా, కొండలుగా వారందరూ భూమి మీద జన్మించారు. అలా జన్మించిన చరాచర జగత్తును తన స్పర్శతో పునీతం చేసి పుణ్యగతులు కల్పించిన అవతారం కృష్ణావతారం. అందుకే కృష్ణావతారానికి అంత ప్రత్యేకత ఏర్పడింది.
‘దేవ దేవి గర్భజననమ్’ అని కృష్ణుని జన్మను తలచుకుంటే ఎంత హాయిగానో అనిపిస్తుంది. ఋగ్వేదంలో కృష్ణ శబ్ద విశేషాలు ఉంటాయి. కృష్ణుడి శరీరం నీలపు (నీల(లి) మేఘశ్యామ – వర్షపునీటిలో మేఘం ఉండే రంగు) రంగులో ఉంటుంది. దాని గురించి వివరాలను అందులో వివరించారు.
చేసే పనినీ, చూసే చూపునీ.. స్మృతినీ ధృతినీ.. అన్నింటినీ వశం చేసుకొనే మోహనమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ. ఈయనను అర్థం చేసుకుంటే నిజమైన భక్తి, నిజమైన వ్యక్తిత్వం, నిజమైన మానవ గుణాలు ఎలా ఉండాలి?? వంటి విషయాలు అర్థమైపోతాయి. మొదట్లో భీష్మ చరిత్ర తెలుసుకునే క్రమంలో వచ్చిన శ్రీకృష్ణ దర్శనమ్ ఆయనను ఎంత మోహన పరిచినదో చూశాము.
శ్రీమన్నారాయణుని అవతార విభూతులన్నింటిలో కృష్ణావతారమే పరిపూర్ణం. అందుకే ప్రతి మనిషి కూడా ఈ పరిపూర్ణ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. జీవితంలో ఆచరణలో పెట్టాలి. రాముడిలోని ఉత్తమ నాయకత్వ గుణాలను చూసి లోకం దేవుడని తరువాత కొనియాడింది. మొదట రామావతారం, ఆ తరువాత కృష్ణావతారం సంభవించాయి. ఈ రామావతారం అవతార దైవలక్షణాలను నిరూపించింది.
- సమగ్రమైన ఐశ్వర్యం
- ధర్మం
- కీర్తి
- సంపద
- వైరాగ్యం
- మోక్షం
అనే ఆరు లక్షణాలకీ నిలయుడైన వాడే భగవంతుడు. శ్రీరామచంద్రుడు ఈ లక్షణాలన్నీ కనపరచాడు. మానవుడిగా ఉంటూనే. ప్రత్యేకించి, తార, మండోదరి, వాలి, మొదలైన వారు దర్శించిన శ్రీరాముని పరతత్వం, బ్రహ్మాదువు దిగి వచ్చి మరీ నీవే పరబ్రహ్మవు అని చెప్పినా వినలేదు. అదే బ్రహ్మాదులు (భాగవతంలో ఇంద్రుడు, బ్రహ్మ) దిగి వచ్చి నీవు మానవుడని అనబోతే తన పరబ్రహ్మ తత్వాన్ని వాళ్ళకు ఇక మరచిపోలేని విధంగా చూపాడు.
గమనిస్తే శ్రీకృష్ణుడిలో ఈ ఆరు లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అందుకే ఆయనను సంపూర్ణుడు అంటారు. ఎక్కడైనా సరే కృష్ణుడి ఆహార్యం వేసుకున్న వారిని గమనించినా, శ్రీ కృష్ణుని గురించి చదివినా ఆయన ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటాడే తప్ప ఆయనలో బాధ అనేది ఏ కోశాన ఉండదు.
దుః ఖమ్ అనేది ఉండదు. సు ఖమ్ మాత్రమే.
ద్యౌః సచంద్రార్కనక్షత్రా ఖం దిశో భూర్మహోదధిః।
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః॥14॥
ఉత్తర పీఠికలో చూస్తాము.
ఖమ్ అంటే ఆకాశం(లాంటిది). దాని ముందు సు పెడతామా? దుః పెడతామా అన్నదానిని బట్టీ మనకు అలాంటి అనుభూతి ఇస్తుంది. అలా సు పెట్టి ఆయనకు అనుకూలురైన వారు పాండవులు. దుః పెట్టి ఆయనకు వ్యతిరేకులు నశించిన వారు దుర్యోధనాదులు.
పరిపూర్ణమైన వ్యక్తిలో ఉండాల్సినది ఇదే!! అందుకే అందరూ కృష్ణుడిని ఆదర్శంగా తీసుకోవాలని చెబుతారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటికి నిలకడగా ఉండాలని, గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని, కష్ట సుఖాల విషయంలో తటస్థంగా ఉండాలని చెబుతారు. అర్థం చేసుకుంటే భగవద్గీతలో కూడా ఇదే విషయం ఉంటుంది. ఇదే శ్రీకృష్ణ తత్వం.
ఎన్నో గొప్ప సిద్ధాంతాలను సులభంగా జీర్ణం చేసుకోగల జ్ఞానాన్ని కృష్ణుడు మనకు అందించాడు. శ్రీకృష్ణుడి ద్వారా వ్యక్తమైన భగవత్-భాగవత తత్వం భగవద్గీత కదా భారతీయ తాత్వికతకు ఆత్మనిచ్చింది! అందుకే కృష్ణుడు జగద్గురువు. ఆయనే జగద్గురువు.
॥కృష్ణం వందే జగద్గురుమ్॥
అనడంలో ఉద్దేశం ఇదే. శ్రీకృష్ణుడు గురువు మాత్రమే కాదు. గొప్ప రాజనీతిజ్ఞుడు, తత్త్వవేత్త, రక్షకుడు, శిక్షకుడు. అన్ని నియమాలనూ ఆచరింపజేయగలడు, ఉల్లంఘించగలడు. తన కీర్తి ప్రతిష్ఠలను, అపఖ్యాతులను లెక్కించకుండా ధర్మాధర్మ విచక్షణను ఆచరించగల సమర్థుడు.
కీర్తి ప్రతిష్ఠలను లెక్కచేయని వారు ఎవరు? అనంతమైన కీర్తిగలవారు. లేదా బరితెగించిన వారు. శ్రీకృష్ణుడు స్వయంగా భగవానుడు కనుక ఆయనది అనంతమైన కీర్తి.
అజ్ఞానమనే చీకటి నుంచీ ఙ్ఞానమనే వెలుగు వైపు మనలను నడిపించేవాడే గురువు. శ్రీకృష్ణుడు గురువు. తనతో చేరిన వారందరినీ కష్టాలు అనే చీకటి నుంచీ సుఖం (మోక్షం) వైపు నచిపించినవాడాయన.
అలా చేయగలిగేది కేవలం అనుత్తములు మాత్రమే. అంటే.. వారిని మించిన ఉత్తములు ఉండరు. వారి మార్గం సదా అనుసరణీయం.
యుద్ధంతో భారతదేశాన్ని ఐకమత్యం వైపు మొదటిసారి అడుగులు వేయించిన అసమాన వ్యూహకర్త. విశిష్టమైన మానవశక్తిగా.. శ్రీమన్నారాయణుడి ఎనిమిదవ అవతారంగా.. దేవకీవసుదేవుల పుణ్యఫలంగా శ్రావణ బహుళ అష్టమి నాడు జన్మించిన శ్రీకృష్ణుడు పుట్టు బందీ. కానీ మానవాళికి భవసాగరం నుంచి బంధ విముక్తి కలిగించే ఆత్మజ్ఞానాన్ని అందించాడు. విషపూరితమైన పూతన చనుబాలు గ్రోలిన శ్రీకృష్ణుడే.. పోతన ద్వారా భాగవతామృతాన్ని మనకు అందించాడు.
నంద గోవ్రజంలో ఉన్నప్పుడు శకటాసురుడు, తృణావర్తుడు, వత్సాసుర, బకాసురాది రాక్షసులను ఎదుర్కొన్న గోపాలుడు.. రాక్షస స్వభావాలను ఎలా జయించాలో మనకు నేర్పించాడు. కాళీయ మర్దనం ద్వారా.. అహంకారంతో ప్రవర్తించేవారి మదం ఎలా అణచాలో తెలియజెప్పాడు. దుష్టుడైన మేనమామ కంసుని వధించి.. దుర్మార్గపు బంధుత్వాన్ని, దుష్ట బంధాలను వదిలించుకోవాలని సూచించాడు. అడుగడుగునా తనను నమ్మిన పాండవులను రక్షించి ‘నమ్మకం’ అనే విలువకు పట్టంగట్టాడు. దుష్టులైన దుర్యోధనాదులను ఎదిరించి పశుబలంపై తిరగబడి ధర్మస్థాపన చేయాలని చెప్పాడు. రక్తసంబంధ వ్యామోహంలో కొట్టుకుపోతున్న అర్జునుడికి తత్వబోధ చేసి గీతామృతాన్ని పంచాడు. అర్జునుడి మాధ్యమంగా లోకానికి గొప్ప తత్వధారను అందించాడు.
భూ సంబంధమైన వాసనలు లేని నిర్విరామ ఆనందభావానికి మరొక పేరు.. శ్రీకృష్ణుడు. ఆయన రూపం ఆనంద స్వరూపం. మోహన రూపం. అది అతీంద్రియం. ఈ ఇంద్రియాలు ఆయనను అందుకోలేవు.
॥అతీన్ద్రియో మహామాయో వేగవాన్ అమితాశనః॥
(సశేషం)
నా గురించి నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా (SSSA). వేరే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తారు. కనుక నేను రాసిన దాన్ని బట్టీ నా రచనల గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. అది చాలు. భవిషత్ లో కలవాల్సి వస్తే అప్పుడు నా గురించి ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకోవచ్చు. ఠీక్ హైఁ? 🙂
తెలుగు వాడినే అని చెప్పేందుకు సాక్ష్యం: నాకు తెలుగు రాదు.
గీతాచార్య