Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తల్లివి నీవే తండ్రివి నీవే!-83

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

హరే రామ హరే కృష్ణ-1

మన్వాదినృపరూపేణ శ్రుతిమార్గం బిభర్తియః।
యః ప్రాకృత స్వరూపేణ శ్రీరామః శరణం మమ॥11
ఋషిరూపేణ యో దేవో వన్యవృత్తిమపాలయత్।
యోఽంతరాత్మా చ సర్వేషాం శ్రీరామః శరణం మమ॥12
యోఽసౌ సర్వతనుః సర్వః సర్వనామా సనాతనః।
ఆస్థితః సర్వభావేషు శ్రీరామః శరణం మమ॥13
బహిర్మత్స్యాదిరూపేణ సద్ధర్మమనుపాలయన్।
పరిపాతి జనాన్ దీనాన్ శ్రీరామః శరణం మమ॥14
యశ్చాత్మానం పృథక్కృత్య భావేన పురుషోత్తమః।
అర్చాయామాస్థితో దేవః శ్రీరామః శరణం మమ॥15
(అష్టాక్షర శ్రీరామ మంత్ర స్తోత్రం)

గోవిందమాదిపురుషం తమహం భజామి॥29
వేణుం క్వణంతమరవిందదలాయతాక్షం
బర్హావతంసమసితాంబుదసుందరాంగమ్।
కందర్పకోటికమనీయవిశేషశోభం
గోవిందమాదిపురుషం తమహం భజామి॥30
ఆలోలచంద్రకలసద్వనమాల్యవంశీ-
రత్నాంగదం ప్రణయకేలికలావిలాసమ్।
శ్యామం త్రిభంగలలితం నియతప్రకాశం
గోవిందమాదిపురుషం తమహం భజామి॥31
అంగాని యస్య సకలేంద్రియవృత్తిమంతి
పశ్యంతి పాంతి కలయంతి చిరం జగంతి।
ఆనందచిన్మయసదుజ్జ్వలవిగ్రహస్య
గోవిందమాదిపురుషం తమహం భజామి॥32
అద్వైతమచ్యుతమనాదిమనంతరూపం
ఆద్యం పురాణపురుషం నవయౌవనం చ।
వేదేషు దుర్లభమదుర్లభమాత్మభక్తౌ
గోవిందమాదిపురుషం తమహం భజామి॥33
పంథాస్తు కోటిశతవత్సరసంప్రగమ్యో
వాయోరథాపి మనసో మునిపుంగవానామ్।
సోఽప్యస్తి యత్ప్రపదసీమ్న్యవిచింత్యతత్త్వే
గోవిందమాదిపురుషం తమహం భజామి॥34
ఏకోఽప్యసౌ రచయితుం జగదండకోటిం
యచ్ఛక్తిరస్తి జగదండచయా యదంతః।
అండాంతరస్థపరమాణుచయాంతరస్థం
గోవిందమాదిపురుషం తమహం భజామి॥35
(బ్రహ్మ సంహిత)

గత రెండు వారాలుగా, ‘అష్టాక్షర శ్రీరామ మంత్ర స్తోత్రం’ ప్రార్థన క్రింద ఇస్తున్నాను. ఇప్పుడు పైన ఇచ్చిన నాలుగు శ్లోకాలు బ్రహ్మ సంహిత నుంచీ తీసుకున్నవి. ప్రఖ్యాత International Society for Krishnan Consciousness (ISKCON) భక్తులు ఎక్కువగా వినే పాటలలో ప్రధానమైనవి రెండు ఉన్నాయి.

ఒకటి.. ‘జయ రాధా మాధవ కుంజ విహారి’

రెండోది.. బాగా యువతలో పేరు పొందినది ‘గోవిందం ఆదిపురుషమ్..’

ఈ గోవిందం ఆదిపురుషమ్ తమహం భజామి అనేది వారు కట్టిన బాణీలో (పదాల విరుపు సంగతి వదిలేసి) వింటుంటే మనం ప్రపంచం మర్చిపోతాము. ఇది నిజానికి బ్రహ్మ సంహితలో 29వ శ్లోకం చివరి పాదం ఈ పాటకు పల్లవిలా వాడారు. తరువాత వచ్చే 26 శ్లోకాలు ఈ పాటకు మూలం. అంటే బ్రహ్మ సంహితను ఈ విధంగా తెలిసో తెలియకో యువతకు చేరవేస్తున్నారు. పాటగా అర్థం కాకపోయినా, కేవలం ఆ పాట, బాణీ మాయలో పడి గోవిందం ఆదిపురుషమ్ తమహమ్ భజామి అని పదే పదే అన్నా చాలు ఆ గోవింద్ నామస్మరణ చేసినంత ఫలితం.

ఇస్కాన్ వారు గౌడీయ వైష్ణవ శాఖకు చెందిన వారు. ద్వైతానికి దగ్గరగా ఉంటుంది. మనది జీవాత్మ. పరమాత్మకు దాసోహమని ఆయనను/ఆ శక్తిని చేరటం మన జీవిత లక్ష్యంగా భావిస్తారు. నామ సంకీర్తన, హరేకృష్ణ మంత్రము మనలను తరిస్తాయి అని భావిస్తారు.

గౌడీయ వైష్ణవం గురించి క్లుప్తంగా చూద్దాము. త్రిమతాల గురించీ పరిశీలిస్తున్నాము కదా.

గౌడీయ వైష్ణవం అనేది హిందూ మతంలోని (నిజానికి సనాతన ధర్మానుయాయులు అని అనాలి) వైష్ణవ సంప్రదాయంలో ఒక ప్రముఖ శాఖ. ఇది 16వ శతాబ్దంలో శ్రీ చైతన్య మహాప్రభు ద్వారా స్థాపించబడింది. ఈ సంప్రదాయం ప్రధానంగా బెంగాల్ (గౌడ దేశం) ప్రాంతంలో ఉద్భవించినందున దీనిని ‘గౌడీయ’ వైష్ణవం అని పిలుస్తారు. ఇది (భగవద్గీతలో చెప్పిన) భక్తి యోగాన్ని ఆధారం చేసుకుని, శ్రీ కృష్ణ భగవానుని సర్వోన్నత దైవంగా ఆరాధించే సంప్రదాయం. ఈ సంప్రదాయం భగవద్గీత, శ్రీమద్భాగవతం, మరియు చైతన్య చరితామృతం వంటి గ్రంథాలపై ఆధారపడుతుంది. వీరికి ప్రధాన పురాణం (భాగవతం కాకుండా) బ్రహ్మవైవర్త పురాణం. పైన చెప్పిన బ్రహ్మ సంహితను ప్రామాణిక గ్రంధంగా పరిగణిస్తారు.

ముఖ్యంగా తెలుసుకోవలసినది

1. శ్రీ కృష్ణ భక్తి: గౌడీయ వైష్ణవం శ్రీ కృష్ణుని పరమాత్మగా, అన్నిటికీ మూలంగా భావిస్తుంది. ఆయనను రాధా-కృష్ణ రూపంలో ఆరాధిస్తారు, ఇక్కడ రాధారాణి కృష్ణుని శక్తి, ఆయన భక్తి యొక్క స్వరూపంగా పరిగణించబడుతుంది. కృష్ణుడు బీజము. రాధారాణి శక్తి. Krishna is the basic field inducing particle and Radha Rani is the field. ఈ Field and Particle గురించి మనం ఇంతకుముందు లక్ష్మీ నారాయణుల గురించి, ఆ తత్వాన్ని తెలుసుకునే క్రమంలో చూశాము. ఆధునిక విజ్ఞానశాస్త్రానికి సంబంధించి ఇది ఒక అవగాహన చేసుకోదగ్గ విశేషం.

2. చైతన్య మహాప్రభు: శ్రీ చైతన్య మహాప్రభు (1486-1534) ఈ సంప్రదాయ స్థాపకుడు. ఆయన రాధా మరియు కృష్ణుని ఉమ్మడి అవతారంగా గౌడీయ వైష్ణవులచే ఆరాధించబడతారు. ఆయన బోధనలు భక్తి మార్గాన్ని సామాన్య జనులకు చేరువ చేశాయి. ఇక్కడే శ్రీవైష్ణవంతో కొంత పోలిక కనిపిస్తుంది. భగవత్ సౌలభ్యత.

3. హరే కృష్ణ మహామంత్రం: ఈ సంప్రదాయంలో హరే కృష్ణ మంత్రం జపం చాలా ముఖ్యం. ఈ మంత్రం:

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

దీనినే మనం సాధారణంగా మనకు, ‘హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే’ – గా చిన్నతనం నుంచీ విని ఉంటాము. వీరు కృష్ణభక్తి ప్రధానంగా చూడటం వల్ల ఇలా మార్చి ఉంటారు.

ఈ మంత్ర జపం ద్వారా భక్తులు కృష్ణునితో ఆధ్యాత్మిక సంబంధాన్ని పెంచుకుంటారు. అనుక్షణం జపమాల ధరించి వీలైనంత ఈ హరేకృష్ణ మహామంత్రాన్ని జపం చేయటం చూసే ఉంటాము.

4.భక్తి యొక్క ఐదు రూపాలు: గౌడీయ వైష్ణవం భక్తిని ఐదు రకాల సంబంధాల ద్వారా వ్యక్తీకరిస్తుంది:

5. ఆచార గోష్ఠి: శ్రీ చైతన్య మహాప్రభు ఆరు గోష్ఠీలను (ఆధ్యాత్మిక గురువులను) నియమించారు, వారు ఈ సంప్రదాయాన్ని విస్తరించారు. వారి బోధనలు గౌడీయ వైష్ణవ తత్వశాస్త్రానికి బలమైన ఆధారం.

6. జీవన విధానం: గౌడీయ వైష్ణవులు కఠినమైన ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అనుసరిస్తారు, ఇందులో:

7. సాత్విక ఆహారం: మాంసం, చేపలు, గుడ్లు, ఉల్లిపాయ, వెల్లుల్లి మొదలైనవి తినరు.

8. నాలుగు నియమాలు: మద్యం, జూదం, అనైతిక సంబంధాలు, మాంసాహారం నిషేధం.

9. సంకీర్తనం: కృష్ణ నామ జపం మరియు సామూహిక సంకీర్తనం (కీర్తనలు) ద్వారా భక్తి ప్రచారం.

10. ప్రపంచవ్యాప్త ప్రభావం: గౌడీయ వైష్ణవం ఆధునిక కాలంలో ఇస్కాన్ (International Society for Krishna Consciousness) ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇస్కాన్ను 1966లో శ్రీ ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద స్థాపించారు, ఇది గౌడీయ వైష్ణవ సిద్ధాంతాలను పాశ్చాత్య దేశాలకు తీసుకెళ్లింది.

తాత్విక సిద్ధాంతం

గౌడీయ వైష్ణవం అచింత్య భేదాభేద తత్వాన్ని అనుసరిస్తుంది. ఇది జీవాత్మ మరియు పరమాత్మ (కృష్ణుడు) ఒకటి అయినా, వేరుగా ఉంటాయని బోధిస్తుంది. ఇది అద్వైతం (ఏకత్వం) మరియు ద్వైతం (ద్వంద్వం) యొక్క సమన్వయం.

ముఖ్య గ్రంథాలు

– భగవద్గీత: కృష్ణుని బోధనలు.
– శ్రీమద్భాగవతం: కృష్ణ లీలలు మరియు భక్తి తత్వం.
– చైతన్య చరితామృతం: చైతన్య మహాప్రభు జీవితం మరియు బోధనలు.
– బ్రహ్మ సంహిత

గౌడీయ వైష్ణవం శ్రీ కృష్ణుని పట్ల స్వచ్ఛమైన భక్తి మరియు ప్రేమ ద్వారా మోక్షాన్ని (గోలోక వృందావనం) పొందే మార్గాన్ని బోధిస్తుంది. ఇది సంకీర్తనం, సాత్విక జీవనం, మరియు రాధా-కృష్ణ ఆరాధన ద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది.

రామునితో పరబ్రహ్మ తత్వాన్ని అందరూ గుర్తిస్తారు. కానీ బైటకు చెప్పరు. కానీ కృష్ణుడే తన భక్తులను గుర్తిస్తాడు. వారు తనను పరబ్రహ్మగా గుర్తించ గలిగినా గుర్తించ లేకపోయినా.

దీనికి ఉదాహరణగా హనుమ క్రమంగా శ్రీరామునికి దాసుడను (మొదట దూతను అంటాడు) అని ఎలా చాటుకున్నాడు చూశాము. ఇప్పుడు శ్రీకృయ్ణుడే తన భక్తులను ఎలా స్వయంగా గుర్తిస్తాడు అనే దానిని ద్రౌపదీ స్వయంవరం ఆధారంగా చూద్దాము.

అనుత్తమః నుంచీ వచ్చే వరుస నామాలకు ఇక్కడ మనకు మంచి వివరణలు దొరుకుతాయి.

(సశేషం)

Exit mobile version