Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తల్లివి నీవే తండ్రివి నీవే!-80

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

రామం దశరథాత్మజమ్-7

వ్యక్తమేష మహాయోగీ
పరమాత్మా సనాతనః।
అనాదిమధ్య నిధనో
మహతః పరమో మహాన్॥
తమసః పరమోధాతా
శంఖచక్ర గదా ధరః।
శ్రీవత్సవక్షా నిత్యశ్రీ
రజయ్య శ్శాశ్వతో ధ్రువః॥

‘నిత్య శ్రీః’ ఎన్నడును తనకు దూరముగ ఉండని లక్ష్మీదేవి గలవాడు ఈతడు. పురుష సూక్తములో, “లక్ష్మి ఎవనికి పత్ని అయి ఉండువో వాడు పురుషుడని” చెప్పబడినది. ఆ పురుషుడే శ్రీరాముడు. శ్రీతో కూడి ఉండుటచే ఈతడు ఎవ్వరిచేతను జయింపశక్యముగాని వాడు. అనగా ‘అజయ్యుడు’.

ఈ విషయమును మారీచుడు రావణునకు చెప్పుచు, “అప్రమేయం హితత్తేజఃయస్యసా జనకాత్మజా,” జనకాత్మజ పత్నిగ గలవానిని ఎవ్వరును జయింపజాలరని చెప్పినాడు.

శాశ్వతః, ఒక దేశములో ఒక కాలములో ఒక వస్తువుగ మాత్రమే ఉండెడివాడు కాడు. అన్ని దేశములయందు అన్ని కాలములయందు అన్ని వస్తువులుగ వాటికి అన్నిటికి ఆత్మ అయి ఉండెడివాడు. అట్టి పరమాత్మయే శ్రీరాముడు. అతడు మనుష్య రూపమును లోకరక్షణకై స్వీకరించి వచ్చినాడు.

శ్రీరాముడు విష్ణువే. ఆతడు సత్యపరాక్రముడు. తన పరివారము అగు దేవతలను వానరులుగ జన్మింపజేసి తాను మనుష్యునిగ వచ్చినాడు. సర్వలోకములు తన సొత్తు అగుటచే వానికి అనర్థము కలిగించుచున్న రావణుని చంపి లోకములకు హితమును కల్గింపవలెనని వచ్చినాడు.

మహాతేజశ్శాలి యగు శ్రీమహావిష్ణువే మనుష్యరూపముతో వచ్చి నిన్ను నీ రాక్షస పరివారమును చంపి నాడు.

ఇట్లు యుద్ధ భూమిలో మండోదరి భర్త కళేబరము వద్ద విలపించుచు రాముడు సాక్షాత్ పరమాత్మయే అని స్పష్టముగ తెలియజేసినది.

వీటన్నిటినీ మించిన గొప్ప నిదర్శనం, సీతా దేవి అగ్ని ప్రవేశం తరువాత బ్రహ్మాది దేవతలు వచ్చి, “నీవే పరమాత్మవు. శ్రీమన్నారాయణుడవు. సీతయే శ్రీమహాలక్ష్మి. నిత్యానపాయని” అని స్తుతిస్తారు. ప్రత్యేకించి బ్రహ్మగారే స్వయంగా ఒక స్తోత్రం చెప్తారు. దానినే బ్రహ్మకృత శ్రీరామ స్తుతి అంటారు.

ఇన్ని చెప్పినా చివరకు శ్రీరాముడు, “ఆత్మానాం మానుషం మన్యే..” అనేస్తాడు.

రామం దశరథాత్మజమ్.

దశరథాత్మజుడైన శ్రీరాముడే, సీతా రాముడే పరబ్రహ్మ. శ్రీమహావిష్ణువు.

విష్ణుః అన్న నామానికి శ్రీముఖి పరంగా మనం వ్యాఖ్యానాన్ని చూశాము తల్లివి నీవే తండ్రివి నీవే! లో.

  1. అనుత్తమః —అంతకంటె ఉత్తమమైనది మరొకటి లేదు.
  2. దురాధర్షః — తననెదిరింపగల గల శక్తి వేరెవ్వరికి లేనట్టివాడు.
  3. కృతజ్ఞః— నామ స్మరణము, శరణాగతి, పూజాది భక్తి కార్యములచే ప్రసన్నుడై భక్తులను అనుగ్రహించువాడు; పత్ర పుష్పాది అల్ప నివేదనల చేతనే సంతుష్టుడై కామితార్ధ మోక్షములను ప్రసాదించువాడు; సమస్త ప్రాణుల పుణ్య, అపుణ్య కర్మలనెరిగినవాడు.
  4. కృతిః — తన భక్తుల సత్కార్యములకు కారణమైనవాడు; తన అనుగ్రహముచే పుణ్య కర్మలను చేయించువాడు.
  5. ఆత్మవాన్ — సత్కార్యములొనర్చు ఆత్మలకు నిజమైన ప్రభువు. తన వైభవమునందే ప్రతిష్ఠుడైనవాడు.
  6. సురేశః — సకల దేవతలకును దేవుడు. దేవదేవుడు. భక్తుల కోర్కెలను తీర్చువారిలో అధిపుడు.
  7. శరణం — తన్ను శరణు జొచ్చినవారిని రక్షించువాడు. ఆర్తత్రాణ పరాయణుడు. ముక్తుల నివాస స్థానము.
  8. శర్మ — సచ్చిదానంద స్వరూపుడు. మోక్షగాముల పరమపదము.
  9. విశ్వరేతాః — విశ్వమంతటికిని బీజము, మూల కారణము.
  10. ప్రజాభవః — సకల భూతముల ఆవిర్భావమునకు మూలమైనవాడు, జన్మకారకుడు.

ఇక్కడి వరకూ శ్రీరామ పరబ్రహ్మ తత్వము ముగిసింది. పైన క్లుప్తంగా అర్థ వివరణ అచ్చిన నామాలు కూడా రాముని పరంగా ఒప్పుతాయి.

అందుకే ఇక్కడికి వరామం తీసుకుని, వచ్చేవారం మరింత విశ్వరేతాః అన్న నామము విస్తృతార్థముతో కొత్త గుత్తిని ఆస్వాదిద్దాము.

(సశేషం)

Exit mobile version