[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
రామం దశరథాత్మజమ్-6
వ్యక్తమేష మహాయోగీ
పరమాత్మా సనాతనః।
అనాదిమధ్య నిధనో
మహతః పరమో మహాన్॥
తమసః పరమోధాతా
శంఖచక్ర గదా ధరః।
శ్రీవత్సవక్షా నిత్యశ్రీ
రజయ్య శ్శాశ్వతో ధ్రువః॥
రావణాసురుడు మరణించిన తరువాత శ్రీరాముణ్ణి చూస్తూ మండోదరి శ్రీరాముని అతిమానుష చేష్టితాలను గ్రహించింది. అనగా పరతత్వంగా ఆయనను దర్శించి తెలిపిన విశేషాలు.
ఆమె గతంలోనే శ్రీరాముని గురించి విన్నది. “తండ్రి మాటను తల దాల్చి, రాజ్యాన్ని, రాజ్య సౌఖ్యాలను త్యాగం చేసిన ధర్మమూర్తి,” అని గ్రహించింది.
జనస్థానంలో ఖరదూషణ త్రిశిరస్కుల సహితంగా చతుర్ధశ సహస్ర రాక్షసులను ఒంటిచేత్తో సంహరించాడని తెలియగానే, ఆయన ఒక మహా శక్తివంతుడని నిర్ణయించుకున్నది.
రాముడు దూతగా పంపిన ఒక వానరుడు దేవతలు కూడ ప్రవేశించడానికి సాహసింప వీలులేని లంకా నగరంలోనికి శతయోజన విస్తీర్ణమైన మహాసముద్రాన్ని దాటి ప్రవేశించి, వేలాది రాక్షసవీరులను సంహరించి, లంకా నగరాన్ని ఆగ్నికి ఆహుతి చేసినప్పుడు శ్రీరాముడు మానవమాత్రుడు కాదని అర్థం చేసుకున్నది.
ఇప్పుడా శ్రీరాముడు యముని రూపంలో వచ్చి రావణుని మృత్యువుకు కారణమయ్యాడు. దేవేంద్రుడంతటివాడు రావణుని యుద్ధంలో ఎదుర్కోవడానికి సాహసించడు. ఇప్పుడు శ్రీరాముడు సంహరించగలిగాడంటే ఆయన దేవేంద్రుని కంటే అపరమిత శక్తి సంపన్నుడని అర్థమవుతున్నది. ఇప్పుడు క్రమంగా రాముడెవ్వడో గుర్తించగలుగుతున్నది.
“రాముడు మహాయోగి, స్వాభావికముగ జ్ఞానశక్తి సంపన్నుడు.
॥పరాస్య శక్తిః వివిదైన శ్రూయతే స్వాభావికీ జ్ఞావ బల క్రియాచ॥
అని శ్రుతి చెప్పిన విధముగ జ్ఞానము శక్తి సహజముగ గల వారు ఈతడు. ఈతడే శ్రీమహావిష్ణువు. ఈతడు సర్వదేవతల కంటె పరుడగు విష్ణువే. యోగమనగ లోకరక్షణమును చేయు ఉపాయమును తలంచుచుండుట. అది కలవాడు రాముడు.”
అందువలన రాముడు పరమాత్మ. జగత్తును సృష్టించుట, రక్షించి నిలబెట్టుట మరల లయము చేయుట అనునవి మూడును జగద్రక్షణమే అగును. అట్లు చేసెడి సంకల్పము గల వాడు పరబ్రహ్మము. వాడే రాముడు. అంతేకాదు పరమాత్మ. అనగా ఆత్మలకే ఆత్మ అయి అంతర్యామిగ ఉండువాడు. ఈతడే జీవాత్మలకు లోన తాను ప్రవేశించి వానికి కూడ తాను ఉన్నాడని తెలియకుండ నిలుపువాడు. ప్రేరణనిచ్చు వాడు పరబ్రహ్మమే. ఆతడే రాముడు.
॥య ఆత్మని తిష్ఠన్ ఆత్మనోంతరో యమాత్మావ వేద యస్యాత్మా శరీరమ్,
య ఆత్మానమంతరో యమయతి॥
అని శ్రుతి చెప్పుచున్నది.
అట్లే ఆత్మలలో ఆత్మ అయి ఉండి ఆత్మకు కూడ తెలియకుండ ఆత్మను తన శరీరము వలె ధరించి నియమించి తన నచ్చినట్లు తన కొరకు వినియోగించుకొనువాడు పరమాత్మ, ఆతడే రాముడి రూపంలో వచ్చాడు.
ఆతడు సనాతనుడు. అనగా ఎల్లప్పుడు ఉండెడివాడు. ఆది, మధ్యము, లయము అనునవి లేనివాడు. లోకములో ఉన్న వస్తువులు ఒకనాడు పుట్టి, ఒకనాడు పెరిగి, చివరికి లయమును పొందుతుంటాయి. కాని భగవానుడు అట్టివాడు కాడు. అతడే శ్రీరాముడు.
షడ్భావ వికారములు లేనివాడగుట వలన ఇతడు సకలాత్మలకంటే ఉత్కృష్టుడు అని (సనాతనః అని) చెప్పుచున్నది.
సనాతనః (సదాస్తిత్వయుక్తః) ఎల్లప్పుడు అస్తిత్వముతో కూడినవాడు, అనగా ఎల్లప్పుడు ఉండెడివాడు అని అర్ధము.
॥అనాది మధ్య నిధనః॥
ఆది, మధ్యము, లయము అనునవి లేనివాడు. అనగా జన్మ, వృద్ధి, వినాశము అనునవి లేనివాడు.
శాశ్వతః = అపక్షయ రహితుడు – అనగా తరుగుదల లేనివాడు.
ధ్రువః = పరిణామ రహితుడు అనగా మార్పులేనివాడు.
ఈ విశేషణముల చేత లోకములో జీవులకుండునట్టి ఆరు రకములైన వికారములు లేనివాడు పరబ్రహ్మమని చెప్పబడినది. ఈ విషయమే విష్ణుపురాణమునందు
॥అపక్షయ వినాశాభ్యాం పరిణామర్ధి జన్మభిః వర్జిత శ్శక్యతే వక్తుం యస్సదాస్తీతి॥
కేవలం – పుట్టుట, పెరుగుట, తరుగుట, మారుట, నాశమగుట, అను నీ వికారములు లేనివాడై, ఎవడు ఎల్లప్పుడును ఉన్నాడు అని చెప్పుటకు శక్యమగునో, అతడే పరబ్రహ్మము.
వ్యక్తమేషమహాయోగీ! పరమాత్మాసనాతనః।
అనాదిమధ్య నిధనో మహతః పరమోమహాన్॥
తమసః పరమోధాతా
శంఖచక్రగదాధరః।
శ్రీవత్స వక్షానిత్యశ్రీః
అజయ్యః శాశ్వతోధృవః
పరమాత్మ ఏ మార్పును లేక ఎల్లప్పుడు ఏక రూపముగ ఉండును. ‘మహతః పరమో మహాన్’ పరమాత్మ అను శబ్దమునకు అర్థము విచారిస్తే. ఇంద్రుడు మొదలగువారు గొప్పవారు. వారికంటే గొప్పవాడు సృష్టికర్త అయిన బ్రహ్మ గారు.
వానికంటే పైన శ్రీవైకుంఠములో ఉండెడి అనంత, గరుడ, విష్వక్సేనాదులు, వారికంటె పరుడై అతనిని మించినవారు మరొకరు లేకుండ ఉండెడివాడు శ్రీమహావిష్ణువు. కేవలము జీవవర్గములో అందరికంటే ఆఖరివాడై అంతట ఎల్లప్పుడు అన్నిటిలో ఉండువాడగుటచే విష్ణువును ‘మహతః పరమం మహాన్’ అని చెప్పవచ్చును. అంతేకాకుండ మరొక విధముగ చెప్పుచున్నారు.
తమసః పరమః సృష్టికి ముందు ఉండునది తమోమయమగు ప్రాకృత మండలము. దానికంటె ఆవల ఉండెడిది వైకుంఠము. అది తమస: పరస్మాత్ – రజసః పరాకే ఉన్నదని శ్రుతి చెప్పుచున్నది. అక్కడ వైకుంఠములో ఉన్నవాడు తమసః పరముడు. ఆతడే శ్రీరాముడు. పరమాత్మ అంతట వ్యాపించి ఉండును కదా! వైకుంఠములో ఉండుననుట ఎట్లు? అని సందేహము కలుగును.
అందుకై ‘శంఖ, చక్ర, గదాధరః’ అని చెప్పుచున్నాడు. విశ్వమునంతను తేజ స్వరూపముతో వ్యాపించి యుండును. ఆతనికి తేజోరూపము విగ్రహము కూడ ఉండును. శక్తి రూపంలో వ్యాపించి ఉంటాడు. అవసరమైతే ఆ శక్తి పదార్థముగా మారి రూపాన్ని సంతరించుకుంటుంది.
The Law of Conservation of Energy.
సతతము ప్రేమించి చూడవలెనని కోరెడివారి కొరకు తాను ఒక రూపమును ధరించి ఉండును. తనకు మాత్రమే ప్రత్యేకించి ఉండెడి రూపమును ధరించి యుండును. ఆ రూపముతోనే శ్రీ వైకుంఠములో ఉండెడి దివ్య శూరులకు, ముక్త పురుషులకు దర్శనమొసంగు చుండును. పాలసముద్రములో శ్వేతద్వీపములో సనక సనందాదులకు దర్శనమొసంగు చుండును. ఆ రూపముతోనే సూర్యమండలమునందును ఉపాసకుల హృదయాంత రాళమునందును వశించి యుండును.
ఒక రూపము తన రూపముగ లేనివాడై అన్ని రూపములు తన రూపముగ స్వీకరింపగలవాడు. తనకు తప్ప వేరొకరికి లేని అసాధారణ దివ్యరూపముతో దర్శింపగోరువారిని ఆనందింపజేయు చుండును. భగవానుడు రూపులేనివాడు కాడు. మనవలె కర్మకృతమైన శరీర సంబంధముచే ఏర్పడిన రూపము లేనివాడు. అట్లే పేరు లేనివాడుకాడు. అనేక దివ్యనామములు కలవాడు.
‘ధాతా’ భూత భవిష్యత్ వర్తమాన కాలములయందు ఉన్న సకల జగత్తుమ నిర్మించువాడు. అని శ్రుతి చెప్పు బ్రహ్మమే శ్రీరాముడు.
॥సూర్యా చంద్రమపౌధాతా యధా పూర్వమకల్పమత్॥
అని శ్రుతిచే పేర్కొనబడువాడు శ్రీరాముడు. సృష్టించిన జగత్తును నిలిపెడి వాడు కూడ ఆతడే. ధారణమనగ తన శాసనమునకు లొంగి లోకము అంతయు నిలచి ఉండునట్లు చేయువాడు.
॥ఏ తస్యవా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యా చంద్రమసౌవిధృతా తిష్ఠతః॥
సూర్యుడు, చంద్రుడు మొదలగు వారు అందరు అక్షరమని పేర్కొనబడు పరబ్రహ్మశాసనమునకు అధీనమై నిలచియున్నారని చెప్పుచున్నది. ఈ విధముగ అందరిచే ఉపాసింపదగు. జగత్కారణమగు బ్రహ్మతత్వమే ఈ శ్రీరాముడు. అట్లు జగత్కారణముగ ఉండుటకు కావలసిన జ్ఞానము శక్తి మొదలగు గుణములన్నియు కలవాడగు బ్రహ్మమే శ్రీరాముడు. బ్రహ్మమునకు గుణములున్నవని దివ్యమంగళ విగ్రహము ఉన్నదని శ్రుతి చెప్పుచున్నది. ఆ విషయమునే శ్రీరాముడే జగత్కారణమగుట బ్రహ్మమే శ్రీరాముడని దర్శించింది మండోదరి.
బ్రహ్మమునకు కళ్యాణగుణము లున్నవనియు దివ్యమంగళ విగ్రహము ఉన్నదనియు చెప్పినది. శంఖ చక్రగదాధరుడగుటచే రూపము గలవాడని తెలియుచున్నది. తనను ఉపాసించి శరణాగతి చేసినవారి విరోధులను నిరసించుటకు తగిన గుణములు ఆయుధములు ధరించి రక్షణమున నిత్య జాగరూకుడై ఉండును. ఈతని రూపమునందు శ్రీవత్సము, కౌస్తుభము ఎల్లప్పుడు ఉండును.
మరిన్ని వివరాలు ఇక పైన చూద్దాము.
(సశేషం)
నా గురించి నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా (SSSA). వేరే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తారు. కనుక నేను రాసిన దాన్ని బట్టీ నా రచనల గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. అది చాలు. భవిషత్ లో కలవాల్సి వస్తే అప్పుడు నా గురించి ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకోవచ్చు. ఠీక్ హైఁ? 🙂
తెలుగు వాడినే అని చెప్పేందుకు సాక్ష్యం: నాకు తెలుగు రాదు.
గీతాచార్య