Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తల్లివి నీవే తండ్రివి నీవే!-78

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

రామం దశరథాత్మజమ్-5

రామ-రావణ యుద్దం అంతిమ ఘట్టానికి చేరువ అవుతున్న సమయమది.

శ్రీరామచంద్రుడు నాలుగు బాణాలతో రావణుని రథాశ్వాలను బాధించాడు.

బాధతో అతని అశ్వాలు త్రోవదప్పి పరుగెత్తసాగాయి. రావణడు విపరీతమైన ఆగ్రహంతో శ్రీరాముని బాణాలతో ముంచాడు. మాతలిపై అనేక బాణాలను వేశాడు.

రావణుని బాణాలు రాముని, మాతలిని ఇద్దరిని కూడ ఏ మాత్రము బాధించలేదు, అయినా దేవేంద్ర సారధి అయిన మాతలిపై బాణాలను ప్రయోగించినందుకు కోపగించి, శ్రీరాముడు కరకు బాణాలతో రావణుని బాధించాడు. అంతేకాదు ఆగకుండా అతనిపై బాణప్రయోగాన్ని కొనసాగిస్తునే ఉన్నాడు. ఎప్పుడు బాణాన్ని అమ్ములపొదిలో నుంచీ తీస్తున్నాడో, ఎప్పుడు సంధిస్తున్నాడో, ఎప్పుడు వింటి నారిని ఆకర్ణాంతం లాగుతున్నాడో, ప్రళయకాలాగ్ని సదృశమైన శరణులను ఎప్పుడు వదులుతున్నాడో రావణునికి అర్థం కావటం లేదని వాల్మీకి మహర్షి వర్ణన. అంత వేగంగా శ్రీరాముడు బాణాలను వేస్తాడు. ఆ వేసే సమయంలో ఆయన బాహువు ఒక చక్రం మాదిరిగా తిరుగుతూ కనిపిస్తుంది. సుదర్శన దర్శనం.

రావణుడు పరిఘలను, శూలాలను, గదలను గొడ్డళ్లను ప్రయోగించాడు.

రామ రావణుల బాణాలు, ఆయుధాలు అక్కడ ఉన్న భూభాగాన్ని నింపాయి. “వాటి వలన తమ ప్రాణాలు పోతాయేమో అని సర్వభూతాలు గడగడ వణికాయి.” ఆనాటి నుండి ఈ నాటి వరకు రామ రావణుల యుద్ధముతో సమాన యుద్ధము జరుగనే లేదు.

<<<గగనం గనాకారం । సాగరం సాగరోపమం। రామ రావణ యుద్ధం | రామ రావణ యోరివ>>>

“ఆకాశానికి సాటి ఆకాశమే, సముద్రము వంటిది సముద్రమే. రామ రావణుల యుద్ధము రామ రావణుల యుద్ధము వంటిదే,” అని సకల దేవతలు, మహర్షులు చెప్పుకొన్నారు.

సమయం గడుస్తున్న కొద్ది శ్రీరామునిలో ఆగ్రహము అధికము కాసాగింది. ఒక పదునైన బాణంతో రావణాసురుని శిరస్సు ఖండించాడు.

మణి మయ మకుటంతో బంగారు చెవి పోగులతో రత్న ప్రచుర కుండలాలతో ప్రకాశించే రావణుని శిరస్సు నేలపై పడింది.

తల తెగగానే బ్రహ్మ వర ప్రసాదంగా మరొక తల మొలిచింది. ఈ విధంగా నూరు తలలు తెగాయి. నూరు తలలు మొలిచాయి.

తన బాణాలు సామాన్యమైనవి కావు. మారీచుని, ఖరుని, దూషణుని, త్రిశిరస్కుని, విరాధుని, వాలిని, కబంధుని వంటి మహావీరుల శిరస్సులను ఖండించిన తన శరాలు రావణుని శిరస్సు(ల)ను పూర్తిగా ఎందుకు ఖండించలేకపోతున్నాయి.?

మాతలి ఆ కారణాన్ని శ్రీరామునికి వివరించాడు. “మాములు బాణాలు రావణుని ఏమి చేయలేవు. అది వాడి వరబలమే కారణము. అందువలన దానికి దివ్యాస్త్రాలు కావాలి.”

అస్త్రాలన్నింటికన్న ఎన్నో రెట్లు శక్తివంతమైన బ్రహ్మాస్త్రమే రావణుని వధకు సమర్థమైనదని తెలిపాడు. రాముడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రము అత్యంత శక్తివంతమైనది. దానిని ఇంద్రుని విజయము కొరకు బ్రహ్మ దేవుడు స్వయంగా నిర్మించి ఇచ్చాడు. ఆ మహేంద్రుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని అగస్త్య మహామునికి ఇచ్చాడు. దండ కారణ్యములో అగస్త్య మహర్షి ఆ పరమాస్త్రాన్ని శ్రీరామచంద్రునికి ప్రసాదించాడు.

అందువలన ఆ బ్రహ్మాస్త్రము అసామాన్యమైనది. అత్యంత శక్తివంతమైంది. దానిని అనేక దేవతలు ఆవహించి ఉన్నారు. దాని బరువు మేరు మందర పర్వతముల బరువుతో సమానమైంది. వజ్రమువలె కఠినమైంది. పర్వతాలను కూడ భేదించే శక్తి గలది.

శ్రీరామచంద్రుడు బ్రహ్మను ధ్యానించి మంత్రపూతంగా ధనుస్సులో సంధించి చెవుల వరకు నారిని లాగి మహాబలంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది కూడా నిర్దుష్టంగా. ఇతర జీవుల మీద ప్రభావం చూపకుండా. అర్జునుడితో సహా ఇతర విలుకారులకు ఈ శక్తి లేదు.

ఆ మహాస్త్రము రావణుని రొమ్మును చీల్చి వాడి ప్రాణాలను సంహరించింది. రావణ సంహారము వలన సమస్తలోకాలు సంతోషించాయి. పతివ్రతలైన పడుచులు, పరువుగల వనితలు తాము అపహరింపబడుతామేమో అనే భయాన్ని, బాధను వీడి తేలికగా ఊపిరి పీల్చుకొన్నారు.

మహర్షులు తమ తపస్సులకు, యజ్ఞయాగాదులకు ఇక విఘ్నాలు కలుగవనే తృప్తిని పొందారు.

దేవతలు తమ పదవులకు, అధికారాలకు ఆటంకాలు ఉండవని, యజ్ఞయాగాదులలో తమకు చెందవలసిన హవిస్సులు తమకే చెందుతాయని నిశ్చింతులయ్యారు.

సమస్త భూతాలు తాము స్వేచ్ఛగా మెదులుకోవచ్చునని స్వేచ్ఛగా గాలిని పీల్చాయి. సురులు మహేంద్రుని చుట్టుముట్టినట్లు హనుమ సుగ్రీవ విభీషణాదులు శ్రీరాముని చుట్టూ చేరి ఆయనను ప్రశంసలలో ముంచారు.

శ్రీరాముడు చేతిలో రావణుడు హతమయ్యాడనే వార్త తెలియగానే అంతఃపురకాంతలందరూ విపరీతమైన దుఃఖంతో రోదిస్తూ రణరంగానికి పరుగు పరుగున వచ్చారు. నోరూనెత్తీ బాదుకుంటూ కంటికీమంటికీ ఏకధారగా విలపించారు. దశరథాత్మజుడి రూపంలో యముడే వచ్చి రావణుని కబళించుకు పోయాడన్నారు. సీతాదేవిని అపహరించి తెచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకున్నావన్నారు. హితుల మిత్రుల ఉపదేశాలు వినక అహంకరించి మమ్మల్ని విధవలను చేసి పోయావన్నారు. అతడితో అనుభవించిన సుఖాలూ పొందిన దివ్యానుభూతులూ తలచుకుని తలచుకుని విలపించారు.

మండోదరీ దుఃఖానికి అవధులు లేవు. కళేబరాన్ని కౌగిలించుకుని దీనాతి దీనంగా విలపించింది.

దేవదానవులకు తేరిచూడరాని చండ ప్రతాపంతో వెలిగిపోయే నీవు ఒక స్త్రీ కారణంగా రఘువంశీకుని చేత హతుడవయ్యావు.

ఇంద్రియాణి పురా జిత్వా

జితం త్రిభువనం త్వయా

స్మరద్భిరివ తద్వైర

మింద్రియై రేవ నిర్జితః.

పూర్వము నీ ఇంద్రియములను జయించి, ముల్లోకములను జయించితివి. ఇపుడా యింద్రియములు అప్పటి వైరాన్ని స్మరించి నీపై అవి ప్రతీకారం తీర్చుకున్నాయి అన్నట్లు ఇంద్రియవశుడవై ఇట్లైతివి.

దాశరథి మానవమాత్రుడనుకున్నావు. ఆయన మానవుడు కానే కాదు.

వ్యక్తమేషమహాయోగీ!

పరమాత్మాసనాతనః।

అనాదిమధ్య నిధనో

మహతః పరమోమహాన్॥

తమసః పరమోధాతా

శంఖచక్రగదాధరః।

శ్రీవత్సవక్షా నిత్యశ్రీః

అజయ్యః శాశ్వతోధృవః॥

మానుషం వపురాస్థాయ

విష్ణుస్సత్య పరాక్రమః

సర్వైః పరీవృతో దేవైః

వానరత్వ ముపాగతైః॥

సుస్పష్టముగా ఈ శ్రీరాముడు

  1. మహాయోగి
  2. పరమాత్మ
  3. సనాతనుడు
  4. జన్మవృద్ధి వినాశములు లేనివాడు
  5. గొప్ప వారికంటె మిక్కిలి గొప్పవాడు
  6. ప్రాకృత మండలముకు ఆవల వైకుంఠమునందున్నవాడు
  7. ఇతడే అందరి పోషకుడు
  8. శంఖచక్రగదా ధరుడు
  9. శ్రీవత్సము అనే పుట్టు మచ్చ వక్షస్థలమునందు గలవాడు
  10. ఎల్లప్పుడు లక్ష్మిదేవి తో కూడి ఉండే వాడు
  11. జయించ శక్యముగానివాడు
  12. తరుగుదల లేనివాడు
  13. మార్పులేనివాడు

అయిన శ్రీమహావిష్ణువే!

  1. సత్య పరాక్రముడు
  2. సర్వలోకేశ్వరుడు
  3. గొప్పతేజస్సు గలవాడు

అయిన ఆది విష్ణువే మనుష్య శరీరము స్వీకరించి వానరత్వమును పొందిన సకల దేవతలతో కూడినవాడై స్వయంగా లోకములకు హితమును కలిగించు కోరికతో నీ రక్కస పరివారమును, నిన్ను నిరతులను కావించాడు.

తార లాగానే మండోదరి కూడా శ్రీరామ పరతత్వాన్ని గ్రహిస్తుంది.

ఆ వివరాలను చూస్తే, శ్రీవిష్ణు సహస్రనామములలో ఉన్నవన్నీ శ్రీరామునికే చెందుతాయని మనం భావిస్తాము. ఆ గుణగణములన్నీ ప్రదర్శిస్తూనే శ్రీహరి మానవ రూపంలో వచ్చి అసుర సంహారం గావించాడు.

ఇక్కడ బ్రహ్మాస్త్ర ప్రయోగము సందర్భముగా చూసిన వివరాలను బట్టీ ధన్వీ అన్న నామము శ్రీరామచంద్రునికి ఎలా ఒప్పుతున్నదో చూడవచ్చు.

(సశేషం)

Exit mobile version