[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
రామం దశరథాత్మజమ్-4
త్వమప్రమేయ శ్చ దురా సదశ్చ
జితేన్ద్రియ శ్చోత్తమ ధార్మికశ్చః।
అక్షయ్య కీర్తిశ్చ విలక్షణశ్చ
క్షితిక్షమావాన్ క్షతజోపమాక్షః॥
(శ్రీ రామాయణం, కిష్కింధ కాండ – 24వ సర్గ)
క్షితిక్షమావాన్ భూమికున్నంత ఓపిక కలవాడవు!
శ్రీరాముని కల్యాణ గుణాలను వాల్మీకి మహర్షికి నారదముని వివరిస్తూ “క్షమయా పృథివీ సమః” సహనంలో భూమితో సమానుడని తెలిపాడు. సుగ్రీవుడు ఒంటరివాడై అడవులలో అమితంగా దుఃఖిస్తుంటే తార, అంగదులు వాలితోపాటు సుఖ సంతోషాలలో తేలుతు ఉన్నారు. అందువలన “వాలిని భార్యాపుత్ర, మిత్ర, అమాత్య, జ్ఞాతి, బాంధవులందరితో కలిపి వధిస్తే కాని రాముని కోపము తీరదు” అనుకొన్నారు అందరు.
కాని తారాంగదులు తన కళ్ల ఎదుటే నిలిచిన వారిపై తన కోపాన్ని వెళ్లగక్కలేదు. సరికదా తారను ఓదార్చడానికి రాముడు పూనుకొన్నాడు. వాళ్లను మనసారా క్షమించాడు. అంతటి క్షమాశీలుడు రాముడు! గమనించారా? రాముడు, కృష్ణుడు మన ఇంట్లో వారిని పిలిచినంత తేలికగా, స్వచ్ఛంగా, చనువుగా చేస్తున్న సంబోధన. భగవానుడు కనుక ఆయన సౌలభ్యత మనకు ఇలా కలిసి వస్తున్నది. అదే సౌలభ్యం మనకు తోటి మానవులతో ఉంటుందా? అందుకే శ్రీహరి భక్త సులభుడు.
తార రాముని సహనానికి నివ్వెరపోయింది. “4 కోట్ల యోజనాల విస్తీర్ణమైన ఈ భూమండలమంతా ఒక ఎత్తు! నీ సహనం ఒక ఎత్తుగా నిలిపినా నీ సహనమే ఎక్కువ కదా రామయ్యా!” అనుకొంది ఆ వానర నారి.
ఇక్కడ మరో విచిత్రమైన వివరం.
శ్రీ రామాయణం కావ్యం కాబట్టి కొన్ని సంఖ్యల వివరాలు మొదలైనవి అతిశయోక్తులుగా అనిపించ వచ్చు. కానీ అవన్నీ సత్యాలే. బ్రహ్మ గారి వాక్కు అసత్యం కాదు కదా.
“నీవు వ్రాసే ప్రతి అక్షరమూ, సత్యమై భాసిల్లుతుంది,” అని వరమిచ్చాడు కదా. వాల్మీకి మహర్షికి.
భూమి వైశాల్యం.. (Surface area of earth) 51,00,72,000 చదరపు కిలోమీటర్లు. అంటే దాదాపు 51 కోట్ల చదరపు కిలోమీటర్లు. ఒక యోజనం 12.8 కిలో మీటర్లు. అంటే భూమి విస్తీర్ణం 4 కోట్ల యోజనాలకు దాదాపు సమానం (51,00,72,000/12.8).
రకరకాల సంఖ్యలు కనిపిస్తాయి మన పురాణాలలో. ఇతిహాసాలలోవి ప్రాధాన్య ప్రమాణం పురాణాలతో పోలిస్తే. వాల్మీకి రామాయణంలో 51 కోట్లు, నాలు కోట్లు అనే అంకెలు కొన్ని ప్రత్యేక వివరణలతో లెక్కిస్తే ఆధునిక పశీలనలకు సరిపోలుతున్నాయి. ఏవైనా తేడాలు ఉంటే ఆ యా సూత్రాలు/formulas లో ఉండే తేడాల వల్ల ఉంటాయి.
పైన చెప్పిన లెక్క భూమి ఒక గోళం అని అనుకుని కట్టిన లెక్క. అదే భూమి మీద ఉండే పర్వతాల ఎత్తులు, సముద్రాల లోతులు, చెట్టు చేమలు, జీవుల.. అన్నీ లెక్కిస్తే కొన్ని తేడాలు కనిపిస్తాయి కదా.
ఏతావాతా బ్రహ్మ గారి వాక్కు సత్యమై, శ్రీ రామాయణంలో వాల్మీకి మహర్షి రాసిన ప్రతి అక్షరం అక్షరమై, సత్యమై భాసిల్లుతున్నది.
ఇక విషయంలోకి వద్దాము.
“నీవు ప్రపంచమంతటిపై చూపవలసిన క్షమనంతా ఒక్క ఈ ఆడుదానిపై చూపావేమయ్యా ప్రభూ!” అని విస్తుపోయింది తార!
“నా ఒక్కదానిపై చూపిన నీ అపార క్షమ ప్రపంచాన్ని అంతటిని క్షమించడానికి సరిపోతుంది కదా స్వామి!” అని ఆశ్చర్యపడింది తార!
సుగ్రీవుని కష్టాలకు వాలే ప్రత్యక్ష కారణమైనా, ఆయనతో కలిసి జీవించడమువలన నాకు, నా కొడుకైన అంగదునికి కూడ ఆ వాలి నేరంలో భాగముంది కదా! మా దోషాన్ని తెలిసికొని కూడ మమ్మల్ని మనసారా క్షమించి మమ్మల్ని ఓదారుస్తున్నావే? ఎంతటి సహనశీలివి తండ్రీ! అని తార రాముని వైపు చేతులు జోడించింది.
క్షతజోపమాక్షః
రక్తము వంటి ఎఱ్ఱని కన్నులు కలవాడవు!
ప్రాణులందరిని కన్న తల్లివలె అనురాగంతో కాపాడే వాడివి కదా! ఆ అనురాగము నీ కళ్ల ఎరువుకు కారణమైందా?
వాలిపైన ఆగ్రహంతో నీ నేత్రాలు రక్త వర్ణాలయ్యాయా? అయితే ఆ ఆగ్రహం ఇంకా తగ్గలేదా? కోపంతో కనులు రక్త వర్ణాలయితే మరి నాపై, నా కొడుకుపై ఆగ్రహాన్ని ప్రదర్శించడం లేదే?
అంటే నీ రక్త నేత్రాలకు వాలిపై ఆగ్రహము తాత్కాలిక కారణమే కాని సంపూర్ణ కారణముకాదన్న మాట! మరి నీ కన్నులు సహజంగానే అరుణంగా ఉంటాయా? ఔనులే! నీవు ఎఱ్ఱతామరల వంటి కన్నులు కలవాడవు కదా!
‘త్రి తామః, రక్తాస్య, నేత్ర, పాణిః’ ముఖము, నేత్రాలు, అరచేతులు ఈ మూడు అవయవాలు ఎఱ్ఱగా ఉండడము సార్వభౌమ లక్షణాలు కదా! నీవు సార్వభౌముడవు కనుక నీ కన్నులు ఎఱ్ఱగా ఉన్నాయిలే!
అయితే ఈ ఎఱుపు నీ కన్నులకు సహజమైంది కాదేమో? సీతా వియోగంవలన నీ కన్నులు ఎఱ్ఱబారాయేమో? లేక సుగ్రీవుని పై వాత్సల్యం వలన అరుణిమను సంతరించుకొన్నాయేమో?
“ప్రభూ! నీ రక్తాక్షములకు కారణము ఏమని ఊహింపగలను?” అని విస్మితురాలైంది
తార దర్శించిన శ్రీ రాముని పరత్వము గోవిందరాజీయం, తనిశ్లోకి అనే సంస్కృత వ్యాఖ్యాన ఆధారితం. శ్రీభాష్యం అప్పాలాచార్య స్వామి వారి రామాయణ తత్త్వ దీపిక గ్రంథం లోని అనేక విషయాలలో కొంత భాగం స్వతంత్ర వాక్యాలలో స్వీకరించటమైనది.
పైన చెప్పిన భూమి విస్తృతి గురించి వాల్మీకి చెప్పినది ఈ కాలపు లెక్కలకు సరిపోలటం గురించిన పరిశీలన/పరిశోధన.. భవదీయునిదే (చేత వ్రాయిస్తున్న శక్తి వల్ల కనుగొనబడిన సత్యము).
—
శ్రీరాముని చూడగానే దుఃఖముతో దూషించాలనుకొన్న తార అనుకోకుండా ఆయనను స్తోత్రము చేసింది. కొంత సమయానికి ఆమె మరణించిన తన భర్తవైపు తిరిగి చూచింది. తన భర్త మరణము ఆమెను వివశురాలిని చేసింది.
ఆమె శ్రీరామునివైపు మరలి చేతులు జోడించి, “రామచంద్ర ప్రభూ! భార్యను పోగొట్టుకొని నీవు పొందుతున్న వియోగ దుఃఖము నీకు తెలుసు కదా! అలాగే నన్ను విడిచివెళ్లిన నా భర్త కూడ స్వర్గంలో నా తోడు లేక దుఃఖాక్రాంతుడు అవుతాడు. నేను కూడ పతివిహీననై జీవింపజాలను. అందువలన నన్ను కూడ నీ బాణంతో వధించి నా భర్త దగ్గరకు చేర్చు.
స్త్రీ హత్య మహాపాపము కదా అని అనుమానించవలసిన అవసరము లేదు. పురుషుని శరీరములో అర్ధభాగము స్త్రీ. ఆమె అతనికి అనుక్షణము వెంట నుండి, అతని సుఖదుఃఖాలలో పాలు పంచుకొని, అతని జీవిత నౌకకు చుక్కాని అవుతుంది.”
ఇక్కడ తార పలికిన పలుకులు ధర్మం.
దానికి ప్రతిగా శ్రీరాముడు మాట్లాడిన మాటలలో ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. అందుకే ఆయన మేధావి.
శోకమూర్తి అయిన తారను మహానుభావుడైన రామచంద్రుడు ఎంతో ఓపికతో ఓదార్చాడు. “అమ్మా! నీవు వీరపత్నివి. వీరులకు వీరమరణం లభించడం ఎంతో పుణ్యం వలననే కలుగుతుంది. తమ భర్తలు వీర స్వర్గాన్ని అలంకరించడం వీర పత్నులందరికి గర్వకారణము, సంతోషదాయకము కూడా.
నీవు ధైర్యము తెచ్చుకో. నీ భర్త మరణానికి చింతించటము మాని జీవించి ఉన్న నీ కొడుకు జీవితాన్ని చూచుకో. నీ ప్రియ పుత్రుడు అంగదుడు యువరాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు. అతనిని చూచుకొంటూ నీ కాలము గడుపుకో. ఆ బాలుని బాధ్యత నీది కాదా?”
శ్రీరామచంద్రస్వామి సాంత్వన వచనములు తార దుఃఖాన్ని కొంత శమింపజేశాయి. ఆయన ఓదార్పుతో ఆమె మనస్సు ఊరడిల్లింది. తరువాత రామభద్రుడు సుగ్రీవుని వైపు తిరిగి, “చనిపోయిన వారి గురించి శోకిస్తూ ఉండడము వలన ప్రయోజనము ఏమి ఉండదు. మృతులకు శ్రేయస్కరంగా వారికి తగిన విధంగా అంత్యసంస్కారాలు జరుపాలి.
సుగ్రీవా! నీవిప్పుడు మీ కుటుంబానికి పెద్దవు. నీ అన్న మరణాన్ని గురించి విచారించడం మాని, దీనుడైన అంగదుని అక్కున జేర్చుకొని, ఆ బాలుని ఓదార్చి, అతని ద్వారా వాలికి మహారాజోచిత దహన సంస్కారాలను చేయించు,” అని బోధించాడు.
రామాజ్ఞతో తక్షణమే వాలి శవవాహనం కొరకు అత్యంత సుందర శిల్పాలంకృతమైన శిబిక (పల్లకి) సిద్ధమైంది. అందులో ఒక సుఖాస్తరణంపై వాలి శవము ఉంచబడింది. ఆ శిబికను ఒక కొండవాగు దగ్గర దించారు. ఇసుక తిన్నెలపై శవానికి దింపుడుకల్లము జరిగింది. తార మొదలైన వానరాంగనలు ఆ శవముపై పడి అమితంగా దుఃఖించారు.
శిబిక నుండి వాలి శవాన్ని చితిపై చేర్చారు. అంగదుడుచే ఆ శవానికి అగ్ని సంస్కారము జరిగింది. వాలితో శరీర సంబంధము అంతమైంది. అంగదుడు, సుగ్రీవాదులు కొండవాగుకు వెళ్లి ధర్మోదకాలు (జలతర్పణాలు) వదిలారు.
ఇవన్నీ జరిగిన దాకా ఎంతో సహనంతో వేచి ఉన్నాడు ఇనకుల తిలకుడు.
విక్రమః (వాలి వధ). మేథావీ (ధర్మ సూక్ష్మాలు). క్రమః – ఎప్పుడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండగలగటము. రాముడు తన పని కోసం వానరులను హడావుడి పెట్టలేదు. సుగ్రీవుని, తార అంగదుల దుఃఖార్తి, ఆ పైన సుగ్రీవుని భోగ కాంక్ష (అనేక సంవత్సరాలు భోగాలకు దూరమయ్యాడు కదా) తీరే వరకూ సహనంతో ఉన్నాడు.
(సశేషం)
నా గురించి నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా (SSSA). వేరే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తారు. కనుక నేను రాసిన దాన్ని బట్టీ నా రచనల గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. అది చాలు. భవిషత్ లో కలవాల్సి వస్తే అప్పుడు నా గురించి ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకోవచ్చు. ఠీక్ హైఁ? 🙂
తెలుగు వాడినే అని చెప్పేందుకు సాక్ష్యం: నాకు తెలుగు రాదు.
గీతాచార్య