Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తల్లివి నీవే తండ్రివి నీవే!-76

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

రామం దశరథాత్మజమ్-3

వాలి-రామ సంవాదాన్ని 23 ప్రశ్నోత్తరాల రూపంలో శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యులవారు చాలా వివరంగా చెప్తారు. అవి శ్రీవైష్ణవ సంప్రదాయానుసారంగా ఉంటుందా వివరణ. ఇక్కడ త్రిమతాల గురించి, మధ్యలో ఆసక్తికరమైన విశేషాలు మాత్రమే కనుక ఆ వివరాలు ఇవ్వటం లేదు.

ఇక తార విషయానికి వస్తే..

వాలి నేలకొరిగాడనే వార్త తారకు తెలిసింది. దుఃఖాతిశయముతో ఆమె కొండ గుహనుండి బయలు దేరింది. ఆమె ముందు భయంతో చెల్లాచెదరై పారిపోతున్న వాలి అనుచరులు నిలిచారు. వారి భయానికి కారణాన్ని ఆమె అడిగింది. “అమ్మా! రాముడనే యముడు వాలి ప్రాణాలను హరించి మనను అనాధులను చేశాడు.

ఇది మనకు ప్రమాద సమయము. వాలి రాజ్యాన్ని పాలించే రోజులలో ఎందరో ప్రత్యర్థులను వధించి వారి వనితలను విధవలను కావించాడు. శత్రువుల భార్యలను ఎందరినో అపహరించి తెచ్చి అంతఃపురంలో పెట్టుకొన్నాడు. మన మహారాజు జీవించి ఉన్న రోజులలో ఆయనకు భయపడి వారందరు అణగిమణగి ఉన్నారు. ఇప్పుడు వారందరు తిరుగబడి మహా ప్రవాహంగా మారి మన పుట్టిని ముంచడానికి ముందుకొస్తారు.

భార్యను కోల్పోయి, ప్రతీకారం కొరకు ఎదురు చూస్తున్న వాళ్లలో సుగ్రీవుడు కూడ ఉన్నాడు. రాముని ద్వారా అన్నను చంపించాడు. ఇప్పుడు అంగదుని మనలను అనాధలను చేసి రాజ్యాన్ని ఆక్రమించబోతున్నాడు. మనము జాగ్రత్తగా ఉండి, వాళ్ల ఉపాయాన్ని చిత్తు చేయాలి,” అని మొరపెట్టుకొన్నారు.

తారకు దుఃఖమాగలేదు “మహావీరుడు, మహానుభావుడైన నా భర్తే మరణించిన తరువాత నాకు రాజ్యమెందుకు? కొడుకెందుకు? నా పతి సుడిగాలిలా శత్రువులపై విజృంభించేవాడు. వర్షమేఘంలా గర్జించేవాడు. ఇప్పుడు నీరు లేని మొగులు వలె కళాహీనంగా ఉన్నాడు” అని వాలి పడి ఉన్న చోటుకు వెళ్ళింది.

తన భర్తను వధించిన శ్రీరాముడు, సుగ్రీవుడు దారిలో ఎదురయ్యారు. వారివైపు కన్నెత్తి చూడక రోదిస్తూ వెళ్లి, ఒక చెట్టును అల్లుకున్న తీగ ఆ చెట్టుతోపాటే నేల కూలినట్లు భర్త శవంపై వాలి పోయింది.

“సుగ్రీవునితో సమరానికి సమాయత్తం కావద్దని, ఆయన భార్యను అప్పగించి, ఆయనను ఆదరించుమని నిన్నెంతగానో అర్ధించాను. నీవు నా మాటను లక్ష్య పెట్టలేదు. నా ప్రార్ధన వ్యర్థమైంది. నా బ్రతుకు బీడుభూమి అయింది.” అంటూ కోదించింది.

సుగ్రీవుని ఉద్దేశించి, “సుగ్రీవా! నీ కోరిక తీరింది. నీ బాధ అంతమైంది. ఇప్పుడు నీ భార్యను పరిగ్రహించు. నీ రాజ్యాన్ని స్వీకరించు,” అని అన్నది.

మళ్లీ వాలిపై బడి, “నాథా! మన దాంపత్య జీవితంలో తెలిసో, తెలియకో నీకేదైనా అప్రియము ఆచరించానా? ఒకవేళ అలా అప్రియాన్ని ఆచరించి ఉంటే నన్ను మన్నించు. నీ పాదాలపై పడి ప్రార్థిస్తున్నాను” అని దయనీయంగా విలపిస్తూ, భర్త సన్నిధిలోనే ప్రాయోపవేశం చేయాలని నిశ్చయించుకొంది.

తారాంగదుల, పరివార జనుల ఏడుపులు వాలికి చావు తెలివిని తెప్పించాయి. అతి కష్టము మీద కొద్ది కొద్దిగా కళ్లు తెరచి చూచాడు. ఆయన కళ్ల ముందు దిగాలుగా అంగదుడు, ఆయన వెనుక సుగ్రీవుడు నిలుచొని ఉన్నారు.

“సోదరా! ఈ అంగద కుమారుని ఆదరించు. పసివాడు ఇంతవరకు ఎంతో ప్రేమతో పెరిగాడు. ఇప్పటి నుండి నీవే కన్న తండ్రివి. నీ కన్న కుమారునిగా పెంచు. అతనిని ఆపదలలో నుండి రక్షించు. ఆయన అవసరాలను ఆదరంతో తీర్చు. అంగదుడు పిల్లవాడే కాని బుద్ధిమంతుడు. పరాక్రమవంతుడు. శ్రీరాముని పక్షంలో నీవు నిలిచి సేవలు చేసేప్పుడు నీకు అండగా ఉంటాడు. తోడు నీడలా నిలుస్తాడు.

తార సుషేణుని కూతురు, సూక్ష్మజ్ఞురాలు, వివేకవతి. రాబోయే అపార్ధాలను, అనర్ధాలను ముందుగానే ఊహించగల ధీమంతురాలు. ఆమె సలహాను తప్పక స్వీకరించు.

ఆమె నన్ను నీతో యుద్ధానికి వెళ్లవద్దని వారించింది. ఏదో ప్రమాదము కలుగ బోతుందని హెచ్చరించింది. నేనామె మాటను నిర్లక్ష్యము చేశాను. అతి దుఃఖంతో నన్ను వీడి అంతఃపురానికి వెళ్లింది. ఇప్పుడు చూస్తున్నావు కదా నా దుస్థితి. ఆమె మాటను కాదన్నందుకు ఫలితము అనుభవిస్తున్నాను.”

ఇక్కడ తార మాట్లాడిన మాటలు, తదనంతరం వాలి పలికిన పలుకులు శ్రీరాముని ప్రభావాన్ని సూచిస్తాయి.

శ్రీరాముడు చెప్పిన సమాధానాలను వాలి అంగీకరించక పోతే, ఆయనలో ధర్మమే లేకపోతే, వాలి మాట్లాడే మాటలు వేరే విధంగా ఉండేవి.

<<<శ్రీరాముని పక్షంలో నీవు నిలిచి సేవలు చేసేప్పుడు నీకు అండగా ఉంటాడు. తోడు నీడలా నిలుస్తాడు.>>>

మరణ కాలంలో ఏ తండ్రి అయినా తన బిడ్డ ధర్మాచరణ చేస్తూ జీవితంలో బాగుపడాలని కోరుకుంటాడు. అదే విధంగా పిల్లడు క్షేమంగా ఉండాలని కూడా అనుకుంటాడు. శ్రీరాముని ధర్మం మీద, సుగ్రీవుడికి రాముడి మీద ఉన్న గురి మీదా నమ్మకం లేనిదే వాలి ఆ మాటలు అనడు.

అలాగే తార కూడా సామాన్యురాలు కాదు. ధర్మ శాస్త్రాలు తెలిసిన సూక్ష్మఙ్ఞరాలు. గమనించండి. ఇక్కడ సూక్ష్మఙ్ఞురాలు అనే విశేషణం వాడాడు వాలి. అంటే శ్రీరాముని స్థాయిలో కాకపోయినా తారకు కూడా ధర్మసూక్ష్మాలు గ్రహించగలదు. వివేకవంతురాలు. ఈ విషయాలు మనకు లక్ష్మణుడితో తార మాట్లాడే సందర్భంలో సుస్పష్టమౌతుంది.

అలాంటి స్త్రీ కనుకనే శ్రీరాముని గొప్పతనాన్ని ఆమె గ్రహించింది సులువుగానే.

వానరరాజు వాలి శవంపై పడి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తారను వానర వీరులు లేపి ఓదార్చడం ప్రారంభించారు. ఆమె నిలదొక్కుకోవాలనుకొంది. అటుఇటు తన చూపులను సారించింది.

ఆమె దృష్టి అకస్మాత్తుగా ధనుర్ధారి అయిన శ్రీరామచంద్రునిపై పడింది.

శ్రీరామభద్రుడు భర్త మరణంతో పుట్టెడు దుఃఖంలో మునిగిన తారను ఓదార్చాలనుకున్నాడు. ఆయన ఆమె వైపు మెల్లగా అడుగులు వేశాడు.

తనను సమీపిస్తున్న రాముని చూడగానే తార దుఃఖం మరింత అధికం కాసాగింది. తన భర్తను హత్య చేసిన వాడు తనకు ఎదురుగా నిలిచి ఉన్నాడు. ఆమెకు ఆగ్రహము అతిశయించింది. తన అక్కసు అంతా తీరేలా అతనిని దూషిద్దామనుకున్నది. ఆమె తలెత్తి రామునివైపు చూచింది.

ఆశ్చర్యం!

ఆయన కనులు కూడా బాష్పధారలను స్రవిస్తున్నాయి. ఆమె ఆ క్షణంలో నిశ్చేష్ట అయింది.

ఆయన అపార కరుణను ఆమె తట్టుకోలేకపోయింది. ఆమెలోని క్రోధము అంతరించిపోయింది. తామస గుణము తలవాల్చి సాత్విక గుణము ఆమెలో తల ఎత్తింది. ఆయన తామరనేత్రాలు అమెను తన్మయురాలిని చేశాయి. వాటిని చూచి ఆమె రాముని పురుషోత్తమునిగా గుర్తించింది.

అప్రయత్నంగా ‘శ్రీరామతత్వము’ శూర్పణఖలో లాగే తారలో కూడ స్తుతి శీలాన్ని కల్గించింది. ఆశ్చర్యకరమైంది కదా భగవత్తత్వము! అనుకోకుండా ఆమె నోటి నుండి శ్రీరాముని విషయంలో ప్రశంసా వాక్యాలు రాసాగాయి.

త్వమప్రమేయ శ్చ దురా సదశ్చ

జితేన్ద్రియ శ్చోత్తమ ధార్మికశ్చః।

అక్షయ్య కీర్తిశ్చ విలక్షణశ్చ

క్షితిక్షమావాన్ క్షతజోపమాక్షః॥

(శ్రీ రామాయణం, కిష్కింధ కాండ – 24వ సర్గ)

రామా!

నీవు వేదములచే గూడ వర్ణింప శక్యము గాని మహామహామాన్వితు డవు, మనస్సుచే గూడ చేర శక్యముగాని వాడవు, జితేంద్రియుడవు, ధార్మికులలో నుత్తముడవు. తఱుగని కీర్తి కలవాడవు, వివేకివి, సహనమున భూమికి సాటియైనవాడవు, రక్తాంతనేత్రుడవు.

త్వమప్రమేయశ్చ

నీవు ఊహింపశక్యము కానివాడవు.

రామచంద్రా! నీవు సాటిలేని వాడివి. నీ తండ్రిగారి నిర్దేశంవలన నీవు అడవికి బయలు దేరావు. పితృవాక్య పాలనాధర్మాన్ని నిరుపమానంగా పాటించావు.

క్రూరారణ్యములో విరాధ, ఖర, కబంధాది ఘోర రాక్షసులను అవలీలగా హతమార్చిన విక్రముడవు.

నీ కమల పత్రాక్షములు నిన్ను కమలానాథునిగా స్ఫురింపజేస్తున్నాయి.

నీ పరదుఃఖ దుఃఖిత్వము (ఇతరుల దుఃఖాన్ని చూసి తాను కూడా దుఃఖించేవాడు – empathy in one way) నిన్ను సకల కల్యాణ గుణాలతో సాటిలేని వాడివని నిరూపిస్తున్నది.

నీవు విల్లు అమ్ములను ధరించి నా ముందు నిలిచావు. అయితే శంఖచక్రాది సర్వాయుధోపేతుడవని నిన్ను గుర్తించగలుగుతున్నాను..

నీవు నా కనులముందే నిలిచి ఉన్నావు. కాని నీవు ఇంత వాడివని గుర్తించడానికి వీలు లేకుండా ఉంది.

క ఇత్థా వేద ఆయన ఇంత వాడని, పరమాత్మను వేదాలు కూడ తెలుసుకోజాలవు. సోఽంగవేద యదివానవేద స్వయంగా ఆయన కూడ తన మహిమను కొంత గుర్తించగల్గుతాడో లేదో?

అని భగవద్వైభవాన్ని వేదాలు వివరిస్తున్నాయి. నీ స్వభావము కూడ అటువంటిదేనని నామనస్సుకు తోస్తున్నది.

నీవు ఒంటరిగా అసహాయునివలె నిలుచున్నావు. కాని అనేక ప్రబల శత్రువులు నీపై మూకుమ్మడిగా దండెత్తి వచ్చినా నీవు అకంప్యుడవు.

నీ ప్రభావము వాఙ్మనసాతీతము.

దురా సదశ్చ

ఎదురింప శక్యము కాని వాడవు.

నీ ప్రభావము వాక్కులకు, మనస్సుకు అందనిది కావచ్చు. అయినా నీవు కట్టెదుట నిలిచి ఉన్నావు కదా! బాహ్యేంద్రియాలతో నిన్ను అనుభవించవచ్చుకదా! అంటే అదీ అసాధ్యమే. మనస్సుకందిన విషయాన్నే కదా బాహ్యేంద్రియాలతో అనుభవింపగల్గేది.

శిథిలము:- విశరణము:- స్థూల వస్తువునైతే సూక్ష్మంగా విభజించి శిథిలము చేయవచ్చు కాని నీవు ‘అణోరణీయాన్’ అణువులకంటే అణువు అన్నట్లు ‘సుసూక్ష్మమైన’ వాడివి. నిన్ను శిథిలము చేయడము అసాధ్యము కదా!

‘గతి’ అంటే ‘చలనము’ అని అర్ధము. నిన్ను ఒక చోట లేకుండా మరొక చోటికి మారుద్దామంటే అది కూడ కుదరదు. ఎందుకంటే నీవు విభుడవు. సర్వ వ్యాపివి. అంతట వ్యాపించి ఉన్నవాడివి ఎక్కడైనా ఒకచోట లేకుండా చేయడం కుదరదుకదా!

నీకు అవసాదమును (నిర్మూలనమును) కలుగచేద్దామంటే నీవు లేకుండా పోయే వాడివి కాదు. నీవు నిత్యుడవు.

వాలి వధకు కోపించిన వానరులందరు కలిసి నిన్ను దుఃఖ పరచాలనుకొన్నా అది సాధ్యముకాదు.

నీవు ఆశ్రితులందరికి అత్యంత సులభుడవు. అనాశ్రితులందరికి అత్యంత దుర్లభుడవు

మహాజనో యేన గతః స పంధా అన్నట్లు భక్తి మార్గంలో పయనించే వారందరికి పట్టుగొమ్మ

తర్కోప్రతిష్ఠః – హేతువాదంతో నిన్ను లేవని నిరూపిద్దామంటే “ధర్మస్య తత్వం నిహితం గుహాయాం” వేదగుహలో స్థిరంగా నిహితమై ఉన్న నిన్ను లేడని నిరూపించడం ఎవ్వరి తరముకాదు.

ఇక నిన్ను సాధించడమెలా? బాధించడమెలా? అందువలననే నీవు “నిత్యం, విభుం, సర్వగతం, సుసూక్ష్మం” అయినవాడివి. దురాసదుడవు.

జితేంద్రియశ్చ జయించబడిన ఇంద్రియములు కలవాడు.

నీవు ఇంద్రియములను జయించినవాడివి. నీవు వాలి రావణులవలె ఇంద్రియములకు లోబడి పరదారలను ఆశించే వాడివా? కాదు.

మహేంద్రుడంతటి వాడు అహల్యా జారుడయ్యాడు. ప్రజాపతి అయిన చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా ఆత్మ తనయ అయిన సరస్వతికి వశుడయ్యాడు. తారకాధిపతి అయిన చంద్రుడు గురుపత్ని అయిన తారవిషయంలో చోరుడయ్యాడు. విశ్వామిత్ర మహాముని మేనక విషయంలో చపలుడయ్యాడు.

కాని నీవు వాలిని చంపి కూడ రుమను సుగ్రీవునికి అప్పగించావు. సహజంగా సౌందర్య వంతులయిన స్త్రీ పురుషులు పరస్పరము ఆకర్షణకు లోబడుతారు. అప్సరసలను మించిన అందముగల నేను, భార్యా విహీనుడవైన నీకు ఇంత దగ్గరలో ఉన్నా నన్ను కన్నెత్తి కూడ చూడడంలేదు. “నరామః పరదారాన్వై చక్షుర్భ్యామపి పశ్యతి” రాముడు పరస్త్రీలను కన్నెత్తి కూడ చూడడు – అనే మాట సత్యమైనది.

ధర్మబద్ధంగా మాత్రమే అర్థకామాలను అనుభవిస్తావు. వాలిని నిరసించి ఆయన రాజ్యాన్ని ఆయన తమ్ముడైన సుగ్రీవునికే అప్పగించావు. నీవు జితేంద్రియడవు.

రాముడు జితేంద్రియుడు, ఇంద్రియములను జయించినవాడు..

“పశ్యత్యచక్షుః, సశృణోత్యకర్ణః, అపాణిపాదో జవనోగృహీతా” పరమాత్మకు ఈ ప్రపంచాన్నంతటిని చూడడానికి కనులు అక్కరలేదు. సర్వ శబ్దాలను వినడానికి కర్ణాలు అవసరంలేదు. అందరికంటే ఆయన వేగంగా కదులుతాడు. అయితే అలా కదలడానికి ఆయనకు కాళ్లు అక్కరలేదు. సర్వాన్ని గ్రహిస్తాడు (పట్టుకొంటాడు). కాని అందుకు హస్తాలు అవసరం లేదు. ఆయన ఇంద్రియాధీనుడు కాదు.

“సర్వేంద్రియైర్వినా సర్వం సర్వత్ర పశ్యతి”. ఏ ఇంద్రియావసరము లేకుండానే ఆయన అన్నిటిని అధీనంలో

ఉంచుకొంటాడు.

ఉత్తమ ధార్మికశ్చ

ఉత్తమమైన ధర్మము కలవాడు.

రాముడు జితేంద్రియుడు కావచ్చు. కాని వైర కారణమేమి లేకుండానే వాలిని వధించాడే? ఆయన ధార్మికుడెలా అవుతాడు?

సాధారణంగా వైర కారణం లేకుండా ఏ ప్రాణిని సంహరించినా అది హింసే. అది అధర్మమే.

కాని పరులకు ఉపకారం చేయడంలో ఏ ప్రాణినైనా హింసిస్తే అది అధర్మము కాదు. “తనను కాటువేయలేదు కదా” అని తన ఇంట్లో ప్రవేశించిన నాగు బామును ఎవ్వరైనా వదలివేస్తారా? విషప్రాణిని చంపడం హింస అవుతుందా? అధర్మమవుతుందా?

“ఆనృంశంస్యం పరో ధర్మః” అన్నట్లు భూతదయ సామాన్య ధర్మము కావచ్చు. కాని ఆశ్రిత రక్షణము అంతకు మించిన ధర్మము. ఉత్తమ ధర్మము.

  1. తన స్వార్థం కొరకు ధర్మాన్ని ఆచరిస్తే అది స్వార్ధ ధర్మము. అది అథమ ధర్మము. తన కొరకు, పరులకొరకు కూడ కలిపి ధర్మాన్ని ఆచరిస్తే అది మధ్యమ ధర్మము. తన కొరకు ఎంతమాత్రము కాకుండా పరులకొరకే ధర్మాచరణ కావిస్తే అది ఉత్తమ ధర్మము. చెట్టు చాటు నుండి అధర్మంగా వాలిని హత్య కావించాడనే నిందను భరించికూడ, సుగ్రీవుని కొరకు వాలిని వధించడం రాముని ఉత్తమోత్తమ ధర్మము.
  2. వర్ణాశ్రమ ధర్మాలను పాటించడం సామాన్య ధర్మము. చతుర్విధ భక్తులకు రక్షణ కల్పించడం అంతకంటే మించిన (ఉత్తమ) ధర్మము. జ్ఞానులకు ఆశ్రితులకు సర్వదా సర్వథా శరణునివ్వడం దానిని మించిన “ఉత్తర” ధర్మము. ఆచార్యోపాయంతో అమ్మవారి పురుషకారంతో భక్తులకు వశం కావడం ఉత్తమ ధర్మము.
  3. వధను వైర కారణంగా చేయడం సామాన్య ధర్మము. వధను పాప పరిహారార్థము చేయడం ఉత్తమ ధర్మము. వాలి చేసిన సోదర భార్యాపహరణ పాపాన్నుండి అతనిని విముక్తుని చేయడం కొరకే అతనిని వధించానని వాలికి రాముడు సమాధానమిచ్చాడు.

“రాజభిర్ధృతదండాస్తు। నిర్మలాః స్వర్గ మాయాంతి”

రాజుల ద్వారా దండింపబడ్డవారు, తమ పాపాలనుండి నిర్మలులై స్వర్గానికి వెళ్లుతారని రాజనీతిని వాలికి రామచంద్రుడు వివరించాడు.

ఇక శాఖామృగాలను చంపటంలో చాటునుండి చంపినా తప్పు లేదని వేట ధర్మాన్ని శ్రీరాముడు వివరించాడు.

రామ పరతత్వాన్ని తార దర్శించిన రీతిని మరికొంత తెలుసుకుందాము. తద్వారా మేధావీ, విక్రమః, క్రమః నామాలకు సంబంధించిన విశేషాలు దర్శించిన వారమౌతాము.

(సశేషం)

Exit mobile version