[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
రామం దశరథాత్మజమ్-1
77. ధన్వీ – (దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు) శార్ఙ్గము అను ధనుసును ధరించినవాడు.
కులశేఖరాళ్వార్ క్షత్రియ కులములో జన్మించినప్పటికి భగవానుని యెడల, భాగవతుల యెడల చాలా విధేయుడై ఉండెడివారు. వీరికి శ్రీరాముడి పట్ల ఉన్న అనన్య భక్తి వలన ఈ ఆళ్వార్ ‘కులశేఖర పెరుమాళ్’ (పెరుమాళ్ అనేది భగవంతుని సంబోధించు పదం) గా ప్రసిద్దులైరి.
శెడియాయ వల్వినైగళ్ తీర్కుమ్ తిరుమాలే
ణెడియానే వేఙ్గడవా! నిన్ కోయిలిన్ వాశల్
అడియారుమ్ వానవరుమ్ అరమ్బైయరుమ్ కిడన్దు ఇయఙ్గుమ్
పడియాయ్ క్కిడన్దు ఉన్ పవళ వాయ్ కాణ్బేనే॥
“ఓ వేంకటేశా! అనాది కాలముగా ఆర్జించిన పాపాలను ఛేదించే వాడివై, తిరుమలకు వేంచేసే నీ భక్తులు, దేవతలు కలసి సంచరించే నీ దివ్య సన్నిధి వాకిటిలో వారి పాదాలు తగిలే గడపగా పడి ఉండి పగడము వంటి పరమ భోగ్యమైన నీ అధరోష్ఠాన్ని ఎల్లప్పుడూ సేవించే భాగ్యాన్ని కలవాడను కావాలి.” అని కోరుకున్నారు.
అదే ఈనాటి కులశేఖరప్పడి.
ఆయన రచించిన “పెరుమాళ్ తిరుమొళి” మరియు “ముకుందమాలా” వంటి కృతులలో శ్రీరాముని పట్ల ఆయన భక్తి స్పష్టంగా కనిపిస్తుంది. కులశేఖరాళ్వార్ శ్రీరాముని ఆదర్శ పురుషుడిగా, ధర్మమూర్తిగా, భక్తవత్సలుడిగా కీర్తించాడు.
రామ భక్తిలో కులశేఖరాళ్వార్ యొక్క ప్రత్యేకతలు:
1. రామాయణంతో గాఢమైన అనుబంధం:
కులశేఖరాళ్వార్ రామాయణంలోని పాత్రలతో లోతైన భావనాత్మక అనుబంధాన్ని పెంచుకున్నాడు. ఆయన తన పాశురాలలో రాముని సీతాపతిగా, రఘువంశ తిలకంగా, దయాసాగరంగా వర్ణించాడు. రామాయణ కథలోని సన్నివేశాలను భక్తి రసంతో చిత్రీకరించాడు.
2. ముకుందమాలలో రామ స్తుతి:
కులశేఖరాళ్వార్ రచించిన “ముకుందమాలా” సంస్కృతంలో రాసిన ఒక భక్తి స్తోత్రం, ఇందులో శ్రీరాముని దివ్య గుణాలను, ఆయన లీలలను కొనియాడాడు. ఈ స్తోత్రంలో రాముని భక్తులకు రక్షకుడిగా, సర్వాంతర్యామిగా స్తుతించాడు. ఉదాహరణకు, ఒక శ్లోకంలో ఆయన రాముని “జానకీ వల్లభం” (సీత యొక్క ప్రియతముడు) అని సంబోధిస్తూ భక్తి భావాన్ని వ్యక్తపరిచాడు. సీతారాములు ఆయనకు వేరు కారు. ఒకటే. పరబ్రహ్మ స్వరూపం.
3. సర్వసమర్పణ భావం:
కులశేఖరాళ్వార్ రామ భక్తిలో సర్వం రామునికి అర్పించే దాస్య భావాన్ని ప్రదర్శించాడు. ఆయన తనను తాను రాముని సేవకుడిగా భావించి, ఆయన చరణాలలో శరణాగతి చేసాడు. ఈ భావం ఆయన పాశురాలలో స్పష్టంగా కనిపిస్తుంది.
4. రామ భక్తుల పట్ల ప్రేమ:
కులశేఖరాళ్వార్ రామ భక్తులను కూడా గౌరవించాడు. రామాయణంలోని హనుమంతుడు, లక్ష్మణుడు, గుహుడు వంటి పాత్రలను ఆదర్శంగా తీసుకుని, వారి భక్తి, సేవా తత్పరతను కొనియాడాడు.
రామ భక్తిలో కులశేఖరాళ్వార్ యొక్క ఆదర్శం:
కులశేఖరాళ్వార్ ఒక రాజుగా ఉన్నప్పటికీ, ఆయన భక్తి రాజ్య ఐశ్వర్యాన్ని మించినదిగా ఉండేది. ఆయన రాముని పట్ల భక్తిని సామాన్య జనులకు అర్థమయ్యే భాషలో, భావనాత్మకంగా వ్యక్తపరిచాడు. ఆయన రామ భక్తి ద్వారా ధర్మం, కరుణ, సత్యం వంటి విలువలను ప్రచారం చేశాడు.
కులశేఖరాళ్వార్కు ఉన్న రామభక్తి గొప్పదనం గురించి చాలా కథలు ఉన్నాయి. వాటిలో ఒకటి.. ఆళ్వార్ సాహిత్యంలో ఉంది. ఈ కథ ఆయన శ్రీ రామాయణం పట్ల, ముఖ్యంగా శ్రీరాముని పట్ల గల గాఢమైన భక్తిని, భావావేశాన్ని స్పష్టంగా చూపిస్తుంది.
ఏమి జరిగిందంటే:
కులశేఖరాళ్వార్ ఒక రాజుగా, చేర రాజ్యంలో పరిపాలన చేస్తున్న సమయంలో కూడా శ్రీరాముని భక్తిలో మునిగి ఉండేవారు. ఒక రోజు, ఆయన రాజసభలో రామాయణ పారాయణం జరుగుతుండగా, పండితులు రామాయణంలోని యుద్ధకాండలో ఒక సన్నివేశాన్ని వివరిస్తున్నారు. ఆ సన్నివేశం ఇలా ఉంది:
“రావణుడు తన సైన్యంతో శ్రీరాముని చుట్టుముట్టాడు. రాముడు, లక్ష్మణుడు ఒంటరిగా ఉండి, శత్రువులతో యుద్ధం చేస్తున్నారు. రాక్షస సైన్యం రాముని బాణాలతో ఎదుర్కొంటూ దాడి చేస్తోంది.”
ఈ వివరణ వింటున్న కులశేఖరాళ్వార్ రామ భక్తిలో లీనమై, ఆ సన్నివేశాన్ని తన కళ్ళముందు ఊహించుకున్నారు. శ్రీరాముడు శత్రువుల చేత చుట్టుముట్టబడ్డాడని, ఆయనకు ప్రమాదం సంభవించవచ్చని ఊహించి, ఆయన హృదయం ఆవేశంతో నిండిపోయింది. ఆ క్షణంలో, ఆయన తన రాజ సింహాసనం నుండి లేచి, గట్టిగా అరిచారు:
“రాముడు ఒంటరిగా ఉన్నాడు! రాక్షసులు ఆయనను చుట్టుముట్టారు! వెంటనే సైన్యాన్ని సిద్ధం చేయండి! శ్రీరాముని రక్షించడానికి నేను వెళ్తున్నాను!”
ఆయన ఆవేశంతో తన కత్తిని తీసి, రాముని సహాయానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. రాజసభలోని సభ్యులు, సేవకులు ఆశ్చర్యపోయి, ఆయనను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. పండితులు వెంటనే ముందుకు వచ్చి, “ప్రభూ! ఇది రామాయణ కథలో ఒక భాగం మాత్రమే. శ్రీరాముడు రావణుని సంహరించి విజయం సాధిస్తాడు. ఇది కేవలం పారాయణం మాత్రమే!” అని వివరించారు.
ఈ వివరణ విన్న తర్వాత కులశేఖరాళ్వార్ కొంత శాంతించారు, కానీ ఆయన కళ్ళలో రాముని పట్ల గల భక్తి భావం, రావణ-రాక్షసుల పట్ల క్రోధం స్పష్టంగా కనిపించింది. ఆయన రామాయణంలోని ప్రతి సన్నివేశాన్ని జీవంతో చూసినట్టు భావించి, రాముని సేవలో తనను తాను అర్పించుకున్నారు.
ఈ కథ యొక్క ప్రాముఖ్యత:
- గాఢ భక్తి: ఈ సంఘటన కులశేఖరాళ్వార్ యొక్క రామ భక్తి గాఢతను, ఆయన శ్రీరాముని దివ్య లీలలతో గల అనన్యమైన అనుబంధాన్ని చూపిస్తుంది.
- రామాయణ ప్రభావం: రామాయణం ఆయన హృదయంలో ఎంత గొప్ప స్థానాన్ని ఆక్రమించిందో ఈ కథ స్పష్టం చేస్తుంది. ఆయన రాముని కేవలం ఒక దేవుడిగా కాక, జీవన సహచరుడిగా భావించారు.
- దాస్య భావం: ఈ సంఘటన ఆయన రాముని పట్ల దాస్య భావాన్ని (సేవకుడిగా భావించడం) స్పష్టంగా తెలియజేస్తుంది. రాముడు ఆపదలో ఉన్నాడని తెలిసిన వెంటనే, ఆయన సహాయానికి ధావించడానికి సిద్ధపడటం ఈ భావాన్ని చూపిస్తుంది. క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఒరలో నుంచీ ఖడ్గం తీసి, ఎత్తిపట్టుకుని సైన్య సన్నద్ధానికి ఆఙ్ఞ ఇచ్చాడు.
కులశేఖరాళ్వార్ యొక్క “పెరుమాళ్ తిరుమొళి”లో ఆయన భక్తి భావం అనేక పాసురాలలో కనిపిస్తుంది. ఒక పాసురంలో ఆయన రాముని గురించి ఇలా అంటారు:
“ఓ రామా! నీ దివ్య చరణాలు నా ఆశ్రయం. నీ నామ స్మరణమే నా జీవన ధ్యేయం.”
ఈ కథ వైష్ణవ సాహిత్యంలో కులశేఖరాళ్వార్ రామ భక్తి యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరిస్తుంది. ఆయన జీవితం, రచనలు రామ భక్తులకు ఒక ఆదర్శంగా నిలుస్తాయి.
ఒక పాశురంలో కులశేఖరాళ్వార్ రాముని గురించి ఇలా వర్ణిస్తాడు:
“రామా! నీ చరణాలు నా ఆశ్రయం, నీ దివ్య నామం నా జీవనాధారం. సీతా సమేతుడవైన నీవు నా హృదయంలో నిలిచావు.”
ఈ విధంగా, కులశేఖరాళ్వార్ యొక్క రామ భక్తి వైష్ణవ సాహిత్యంలో ఒక ఆణిముత్యంగా నిలిచింది. ఆయన రచనలు ఈ రోజు కూడా భక్తులను రాముని పట్ల భక్తి భావంతో నడిపిస్తున్నాయి.
శ్రీ కులశేఖర పెరుమాళ్ కొల్లినగర్ (తిరువన్జిక్కళమ్) అను రాజ్యములో క్షత్రియ వంశములో శ్రీకౌస్తుభం అంశముతో జన్మించిరి. వీరిని కొల్లి కావలన్, కొళియర్ కోన్, కూడల్ నాయకన్ మొదలగు నామములతో కూడా వ్యవహరించెదరు.
తనియన్లో వివరించినట్టు “మాఱ్ఱలరై వీరంగెడుత్త శెంగోల్ కొల్లి కావలన్ విల్లవర్ కోన్ శేరన్ కులశేఖరన్ ముడివేందర్ శిఖామణియే” వీరు చేర రాజ్యమునకు రాజు, శత్రువులను నిర్మూలించే గొప్ప బలము కలిగిన రథములు, గుఱ్ఱములు, ఏనుగులు, శత్రువులను ప్రారదోలే సైనికులను కలిగి ఉండేవారు. ఆళ్వార్ శాస్త్ర బద్ధంగా రాజ్యాన్ని పాలించెడివారు, బలవంతులు బలహీనులను ఇబ్బంది పెట్టకుండా చూసుకుని, శ్రీరామడిలా తమ పాలనలో ఎంతో ఉదారంగా, వినయంగా ఉండేవారు. దాదాపు ఆయన పాలన శ్రీరామ రాజ్యాన్ని తలపించేది.
గొప్ప మహారాజైనందున, తాను స్వతంత్రుడని, తన రాజ్యనియంత్రణ తమ అధీనములో ఉండాలని భావించేవారు. ఆ పరమపదాన్ని ఈ సంసారాన్ని రెండింటినీ నియంత్రిచువాడైన శ్రీమన్నారాయణుడు, తమ నిర్హేతుక కృపతో ఆళ్వారుకి రాజో/తమో గుణాలను తొలగించి, దివ్య జ్ఞానాన్ని అనుగ్రహించి, తన రూప, గుణ, విభూతి, చేష్టితాలను వెల్లడించిరి.
భగవద్ విషయమందు ఆలోచన లేకుండా తమ శరీర అవసరములను గురించి మాత్రమే చింతించే సంసారులను చూసి ఆళ్వార్ వేదన చెందేవాడు. నమ్మాళ్వార్లు చెప్పినట్లుగా సాంసారిక విషయాలు పెద్ద అగ్ని వంటిదని, అది మానవుని శారీరక అవసరములందు మరలా మరలా వ్యామోహమును పెంపొందిచునని గ్రహించిరి. కులశేఖరాళ్వార్లు తమ రాజ్యముతో ఎటువంటి సంబంధము పెట్టు కోకుండ శ్రీవిభీషనుడి వలే తమ సంపదను శ్రీ రాముని పాదాల వద్ద ఉంచి శరణు వేడెను.
శ్రీరామాయణము గొప్పతనమును తెలుపు శ్లోకం:
వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే।
వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా॥
వేద వేద్యుడు, వేదము చేత తెలియ బడేవాడు దశరథాత్మాజుడిగా అవతరించినప్పుడు వేదము వాల్మీకి మహర్షి నుండి శ్రీరామాయణముగా అవతరించింది.
పై శ్లోక ప్రమాణంగా కులశేఖరాళ్వార్లు ప్రతిరోజు దినచర్యగా శ్రీరామాయణాన్ని శ్రవణం చేస్తు ప్రవచిస్తూ ఉండేవారు. ఆళ్వార్ ఒక్కొక్కసారి శ్రీరామాయణంలో తన్మయత్వంగా మునిగి తమను తాము మరచి పోతుండేవారు.
కులశేఖరాళ్వార్ రామభక్తి తత్పరతను తెలిపే మరో సందర్భం.
ఒకసారి ఉపన్యాసకుడు శ్రీరామాయణంలోని ఖరదూషణాదులు, పదనాల్గు వేల మంది రాక్షసులు శ్రీరామునితో యుద్ధానికి సిద్ధమవుతుండగా శ్రీరాముడు ఒక గుహలో సీతాదేవిని ఇళయ పెరుమాళ్ళ (లక్ష్మణుని) సంరక్షణలో ఉంచి తానొక్కడే పదనాల్గు వేలమంది రాక్షసులతో ఒంటి చేత్తో ఎదుర్కొనుచుండగా, ఋషులందరు భయముతో చూస్తుండే ఘట్టం ప్రవచిస్తున్నారు. అది విన్న ఆళ్వార్ నిష్ఫల భావోద్వేగముతో శ్రీరామునికి యుద్ధములో సహకరించుటకు తన సేనలకు యుద్ధరంగం వైపు వెళ్ళుటకు సిద్ధం కావల్సినదని ఆఙ్ఞాపించెను. దీనిని చూసిన మంత్రులు కొందరిని రాజు యాత్రకు ఎదురుగా వచ్చేలా చేసి వారితో “మహారాజా శ్రీరాముడు యుద్ధములో విజయాన్ని వరించాడు, సీతాదేవి వారి గాయాలకు చికిత్స చేస్తున్నది, కావున మీరిక వెళ్ళవలసిన పనిలేదు” అని చెప్పించారు. ఆళ్వార్ సంతుష్టి చెంది తన రాజ్యానికి వెనుదిరిగారు.
మంత్రులందరు ఆళ్వార్ వింత ప్రవర్తన గురించి ఆలోచించి శ్రీవైష్ణవుల సంబంధ వ్యామోహము నుండి వీరిని విడదీయాలని నిర్ణయించుకొన్నారు. మంత్రులందరు రాజును శ్రీవైష్ణవుల నుండి దూరం చేయుటకు ఆళ్వార్ తిరువారాధన మందిరంలో నుండి ఒక వజ్రాల ఆభరణాన్ని దొంగిలించి, ఆ దొంగతనాన్ని అత్యంత సన్నిహితులైన శ్రీవైష్ణవులపై మోపుతారు. ఇది తెలసిన ఆళ్వార్ విషనాగుతో ఉన్న ఒక కుండను తెప్పించి దానిలో తన చేతిని పెడుతూ “శ్రీవైష్ణవులు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడరు” అని ఒగ్గడించారు. ఆయన వాక్యం సత్యమైనందున ఆ విషనాగు వారిని కాటు వేయదు. దీనిని చూసిన మంత్రులు సిగ్గుచెంది ఆ నగను తిరిగి ఇచ్చి కులశేఖరులకు, ఆ శ్రీవైష్ణవులకు క్షమా ప్రార్థన చేశారు.
ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినేదినే।
తమహం శిరసా వందే రాజానం కులశేఖరమ్॥
కులశేఖరుల తనియన్
కుశేఖరులు ప్రతి దినమూ శ్రీరంగము వెళ్ళి అక్కడ రంగనాథుని దర్శించాలని ప్రయత్నం చేసేవారట! ఆయన అలా వెళితే ఇక రారు అన్న భయంతో మంత్రులు ప్రతి దినమూ కొందరు భాగవతులను కోట దాటుతుండగా ఆయనకు ఎదురు వచ్చేలా చేసేవారు. వారిని సేవించేందుకు వెనుతిరిగి వారితో కాలక్షేపము చేస్తూ ఆనాటికి యాత్రను మరచిపోయేవారట.
అలాంటి కులశేఖరులకు శిరసు వంచి ప్రణామము చేస్తున్నాను అని.
ధన్వి – కోదండాన్ని ధరించిన శ్రీరాముడు కూడా ధన్వి యే. ప్రత్యేకించి ఇక్కడ కులశేఖరుల కథ చెప్పుకోవటానికి కారణం ఆయన మైమరచిపోయిన ప్రధాన ఘట్టాలన్నిట్లో శ్రీరాముడు ధనుర్ధారి అయి ఉన్నవే. ఆ ఆకారం ఆళ్వార్కు బాగా ఇష్టం కావటం.
కులశేఖరాళ్వార్కు
రాముడే ఈశ్వరుడు.
ధర్మ విరుద్ధంగా నడచెడివారిని సంబరించే విక్రమీ.
అందుకు శార్ఙ్గ/కోదండములను ధరించే ధన్వి.
ఇక మన త్రిమతాచార్యులు ధన్వీ అనే నామాన్ని ఎలా వ్యాఖ్యానించారో చూద్దాము.
దానికి మునుపు ఆయనను ధన్వీ అనుటకు మరొక కారణం వివిధములైన అస్త్రములను ప్రయోగోపసంహారాలతో సహా నేర్చుకొనటమే కాక వాటిని వినియోగించేటప్పుడు ధర్మాధర్మ విచక్షణను పాటించేవాడు కొన్ని సందర్భాల్లో లక్ష్మణుడు, “అన్నా ఎందుకీ సమయం వృథా చేసే యుద్ధము? బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రావణుని/అనేకముగా వస్తున్న రాక్షస సమూహాలను నిర్జించరాదా?” అని అడుగుతాడు.
దానికి శ్రీరాముడు, “లక్ష్మణా! బ్రహ్మాస్త్రము బహుశక్తివంతమైనది. దానిని వాడితే, నియంత్రణ కుదరకపోతే ధర్మాత్ములైన విభీషణుడి వంటి రాక్షసులు కూడా మరణిస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో సూక్ష్మశక్తిని వాడుతూ సంధించటం విధాయకం,” అని సమాధానపరుస్తాడు.
ఒక్క రావణ వధ సందర్భంలో తప్ప ఎక్కడా బ్రహ్మాస్త్రాన్ని పూర్తి శక్తితో శ్రీరాముడు వాడలేదు. నిజానికి శ్రీరాముని వద్ద ఉన్న అస్త్రససంపద వేరొకరి దగ్గర లేదు. అర్జునుడు దాదాపు సంపాదించాడు. కానీ సర్వశ్రేష్ఠ ధనుర్ధారి శ్రీరాముడే. కారణం చూద్దామిప్పుడే.
అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలోనే కాదు చాలాచోట్ల అస్త్రాలను వాడేవాడు. అనగా మంత్రసహితమైన శక్రవంతమైన ఆయుధాలు. వాటికి బాణాలే అక్కరలేదు. కాకాసుర ఉపాఖ్యానంలో శ్రీరాముడు వాడినట్లు దర్భపుల్ల అయినా చాలు. అలాంటి సందర్భాలు కూడా ఎదురుపడ్డాయి అర్జునుడికి.
కానీ, అక్కడా ఇక్కడా తప్ప శ్రీరాముడు అస్త్రాలకన్నా, సామాన్య అంబులనే వాడి శత్రునిర్మూలన చేశాడు. వాలివధ ఒక ప్రధాన ఘట్టం. నిన్ను ముప్పతిప్పలు పెట్టి ఓడించిన వాలిని కేవలం ఒక సాధారణ బాణంతోనే సంపరించాడు రాముడు అని విభీయణుడు రావణుడికి హెచ్చరికగా చెప్తాడు.
ఒకవేళ వాడినా వాటిని చాలా నియంత్రించి ప్రత్యేకంగా ఒకరిని, ఇద్దరినో, సంహరించవలసిన వారి మీద మాత్రమే ప్రభావం చూపేలా వేసేవాడు. Highly localised.
శ్రీరాముడు ప్రయోగించిన కొన్ని ప్రధాన అస్త్రాలు.
ఈ అస్త్రాలు ఆయన గురువులైన విశ్వామిత్రుడు, అగస్త్య మహర్షి నుండి లభించినవి. ఈ అస్త్రాలు అత్యంత శక్తివంతమైనవి మరియు వాటి రక్తి సామర్థ్యాలు (ప్రభావం మరియు శక్తి) ప్రత్యేకమైనవి. ఇంకా సూక్ష్మంగా గ్రహిస్తే అవి Customised weapons. సహజంగా ఆ యా అస్త్రాలకు ఉండాల్సిన సామర్థ్యం కన్నా శ్రీరాముడు వాడే ఆ అస్త్రాలు ఆయన ధర్మనిష్ఠ వలన, తపోబలం వలన మరింత శక్తివంతంగా ఉండేవి. శ్రీరామునికి కైవసం అయిన కొన్ని ముఖ్యమైన అస్త్రాలు మరియు వాటి సామర్థ్యాలను క్రింద వివరిస్తున్నాను. అలాగే శ్రీ రామాయణంలో ఎలా ఉపయోగించబడినవో కూడా.
1. బ్రహ్మాస్త్రం:
– వివరణ: బ్రహ్మాస్త్రం అనేది బ్రహ్మదేవుడు సృష్టించిన అత్యంత శక్తివంతమైన దివ్యాస్త్రం. ఇది అన్ని అస్త్రాలలో అత్యున్నతమైనదిగా పరిగణించబడుతుంది. అస్త్రాలకు అస్త్రం అంటారు.
– సామర్థ్యం:
– లక్ష్యాన్ని పూర్తిగా నాశనం చేసే శక్తి కలిగి ఉంటుంది. లోకాలను దహించివేయగలదు.
– ఇది ఒక్క బాణంతో ఒక సైన్యాన్ని సంహరించగలదు.
– బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించే (నిలిపివేసే) శక్తి కూడా ఉంది, కానీ దీనిని ఉపయోగించడానికి అత్యంత జాగ్రత్త అవసరం. శ్రీరాముడు దాన్ని అన్ని విధాలుగా తన స్వాధీనంలో ఉంచుకున్నాడు.
– రామాయణంలో ఉపయోగం: శ్రీరాముడు రావణుని సంహరించడానికి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడు.
2. వైష్ణవాస్త్రం:
– వివరణ: శ్రీమహావిష్ణువు సంబంధించిన దివ్యాస్త్రం. ఇది విష్ణుమూర్తి యొక్క శక్తిని కలిగి ఉంటుంది.
– సామర్థ్యం:
– శత్రువుల సైన్యాన్ని నాశనం చేయగల అపార శక్తి కలిగి ఉంటుంది.
– ఈ అస్త్రం లక్ష్యాన్ని ఖచ్చితంగా తాకి, శత్రువును నిర్మూలిస్తుంది. Targeted weapon.
– దీనిని ఎదుర్కోవడం అసాధ్యం. శరణని రక్షింపబడాలి (పైపై మాటలు కాదు. త్రికరణశుద్ధితో శరణాగతి చేయాల్సిందే.
– రామాయణంలో ఉపయోగం: శ్రీరాముడు ఈ అస్త్రాన్ని యుద్ధంలో కొన్ని సందర్భాలలో ఉపయోగించాడు, ముఖ్యంగా అనేకులుగా ఎగబడుతున్న రాక్షస సైన్యాలను, సజ్జనులను కాపాడుతూ (సాధారణంగా వానరులు) ఇతరులను సంహరించడానికి.
3. ఇంద్రాస్త్రం:
– వివరణ: దేవేంద్రుడు (ఇంద్రుడు) అందించిన అస్త్రం. ఇది గొప్ప శక్తిని కలిగి ఉంటుంది.
– సామర్థ్యం:
– ఒకే బాణంతో అనేక శత్రువులను సంహరించగల సామర్థ్యం కలిగి ఉంటుంది.
– ఇది శత్రు సైన్యంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది.
– రామాయణంలో ఉపయోగం: శ్రీరాముడు రాక్షస సైన్యంతో యుద్ధంలో ఈ అస్త్రాన్ని ఉపయోగించి, శత్రువులను నాశనం చేశాడు. వానరులు రాక్షసులు కలిసిపోయి ఎవరు ఎవరో తెలియని పరిస్థితులున్న సందర్భాలు ఉన్నాయి (రాత్రి యుద్ధాలు కూడా). లేదా యుద్ధం ఎలా సాగుతున్నా శత్రువును మాత్రమే వేరు చేసి కొట్టాలనికున్నప్పుడు.
4. గాంధర్వాస్త్రం:
– వివరణ: గంధర్వులు అందించిన అస్త్రం, ఇది శత్రువులను మాయ చేయడానికి ఉపయోగపడుతుంది.
– సామర్థ్యం:
– శత్రువులకు భ్రమలు కలిగించి, వారిని గందరగోళంలో పడవేస్తుంది.
– ఈ అస్త్రం ద్వారా శత్రువులు ఒకరినొకరు శత్రువులుగా భావించి, సొంత సైన్యంలోనే యుద్ధం చేసుకుంటారు.
– రామాయణంలో ఉపయోగం: శ్రీరాముడు ఈ అస్త్రాన్ని రాక్షస సైన్యంపై ఉపయోగించి, వారిని గందరగోళ పరిస్థితిలోకి నెట్టాడు.
5. ఆగ్నేయాస్త్రం:
– వివరణ: అగ్నిదేవుడు సంబంధించిన అస్త్రం, ఇది అగ్ని శక్తిని కలిగి ఉంటుంది. చాలా ప్రముఖమైన అస్త్రాలలో ఇదొకటి.
– సామర్థ్యం:
– శత్రువులను దహించే అగ్ని జ్వాలలను సృష్టిస్తుంది.
– ఇది ఒక ప్రాంతంలోని శత్రు సైన్యాన్ని భస్మం చేయగలదు.
– రామాయణంలో ఉపయోగం: శ్రీరాముడు ఈ అస్త్రాన్ని రాక్షస సైన్యంపై ఉపయోగించి, వారిని నాశనం చేశాడు.
6. వాయవ్యాస్త్రం:
– వివరణ: వాయుదేవుడు సంబంధించిన అస్త్రం, ఇది గాలి శక్తిని ఉపయోగిస్తుంది.
– సామర్థ్యం:
– శత్రువులను గాలి శక్తితో ఎగరవేస్తుంది లేదా వారిని చెల్లాచెదురుగా చేస్తుంది.
– ఇది శత్రు సైన్యంలో అస్తవ్యస్తతను సృష్టిస్తుంది.
– రామాయణంలో ఉపయోగం: శ్రీరాముడు ఈ అస్త్రాన్ని రాక్షసులపై ఉపయోగించి, వారి సైన్యాన్ని చెదరగొట్టాడు. చంపాల్సిన అవసరం లేని సందర్భాలు.
7. నాగాస్త్రం:
– వివరణ: నాగ దేవతల సంబంధించిన అస్త్రం, ఇది సర్ప శక్తిని కలిగి ఉంటుంది.
– సామర్థ్యం:
– శత్రువులను సర్పాలతో బంధిస్తుంది లేదా విష సర్పాలతో దాడి చేస్తుంది.
– శత్రువులను స్థంభన స్థితిలోకి నెట్టగలదు.
– రామాయణంలో ఉపయోగం: శ్రీరాముడు ఈ అస్త్రాన్ని రాక్షసులను నియంత్రించడానికి ఉపయోగించాడు. అయితే, రాముడు ఈ అస్త్రాన్ని జాగ్రత్తగా, ధర్మాన్ని అనుసరించి ఉపయోగించాడు.
8. సూర్యాస్త్రం:
– వివరణ: సూర్యునికి సంబంధించిన అస్త్రం, ఇది సూర్య శక్తిని కలిగి ఉంటుంది.
– సామర్థ్యం:
– తీవ్రమైన కాంతి మరియు వేడితో శత్రువులను దహిస్తుంది.
– శత్రు సైన్యాన్ని అంధకారంలో ముంచగలదు లేదా కళ్ళు కనిపించకుండా చేయగలదు.
– రామాయణంలో ఉపయోగం: శ్రీరాముడు ఈ అస్త్రాన్ని రాక్షస సైన్యంపై ఉపయోగించి, వారిని గందరగోళంలోకి నెట్టాడు.
శ్రీరాముని అస్త్రాల యొక్క ప్రత్యేకతలు:
- ధర్మానుగుణ ఉపయోగం: శ్రీరాముడు తన అస్త్రాలను ఎల్లప్పుడూ ధర్మాన్ని అనుసరించి, అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాడు. ఆయన శత్రువులను సంహరించినప్పటికీ, ఎల్లప్పుడూ కరుణ, న్యాయం పాటించాడు.
- దివ్య శక్తి: ఈ అస్త్రాలు దేవతల సంబంధించినవి కాబట్టి, వీటిని ఉపయోగించడానికి ఆధ్యాత్మిక శక్తి, మంత్ర జ్ఞానం అవసరం. పైన చెప్పుకున్నట్లు ఆయన వద్ద ఉన్నవి Customised Astras. అంటే అదే అస్త్రం వేరొకరికి ఉన్నా కూడా వారు ఆయన ప్రయోగించినంత గొప్పగా ప్రయోగించలేరు.
ఉదాహరణకు, అర్జునుడి దగ్గర ఆగ్నేయాస్త్రం, కర్ణుడి దగ్గర ఆగ్నేయాస్త్రం ఉంటే, ఇద్దరు వాటిని ప్రయోగించినప్పుడు ప్రభావం దాదాపు సమానంగా ఉంటుంది. కానీ అదే రాముడు ప్రయోగిస్తే చాలా నియంత్రణ చూపినా దాని ప్రభావం అమోఘంగా ఉండేది. కొత్త అస్త్రాన్ని ఇలా కూడా ప్రయోగించగలరా అని ఆశ్చర్య పోతారట చూసినవారు.
దీని గురించి మరింత వివరణ చూద్దాము. ఇతర అస్త్రములతో పాటూ.
(సశేషం)
నా గురించి నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా (SSSA). వేరే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తారు. కనుక నేను రాసిన దాన్ని బట్టీ నా రచనల గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. అది చాలు. భవిషత్ లో కలవాల్సి వస్తే అప్పుడు నా గురించి ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకోవచ్చు. ఠీక్ హైఁ? 🙂
తెలుగు వాడినే అని చెప్పేందుకు సాక్ష్యం: నాకు తెలుగు రాదు.
గీతాచార్య