Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తల్లివి నీవే తండ్రివి నీవే!-69

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

మాధవమ్ మధుసూదనమ్-2

స వై న దేవాసురమర్త్యతిర్య-

-ఙ్న స్త్రీ న షండో న పుమాన్న జంతుః।

నాయం గుణః కర్మ న సన్న చాస-

-న్నిషేధశేషో జయతాదశేషః॥24॥

జిజీవిషే నాహమిహాముయా కి-

-మంతర్బహిశ్చావృతయేభయోన్యా।

ఇచ్ఛామి కాలేన న యస్య విప్లవ-

-స్తస్యాత్మలోకావరణస్య మోక్షణమ్॥25॥

సోఽహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేధసమ్।

విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోఽస్మి పరం పదమ్॥26॥

యోగరంధితకర్మాణో హృదియోగవిభావితే।

యోగినో యం ప్రపశ్యంతి యోగీశం తం నతోఽస్మ్యహమ్॥27॥

నమో నమస్తుభ్యమసహ్యవేగ

శక్తిత్రయాయాఖిలధీగుణాయ।

ప్రపన్నపాలాయ దురంతశక్తయే

కదింద్రియాణామనవాప్యవర్త్మనే॥28॥

నాయం వేద స్వమాత్మానం యచ్ఛక్త్యాహం ధియాహతః।

తం దురత్యయమాహాత్మ్యం భగవంతం ఇతోఽస్మ్యహమ్॥29॥

(గజేంద్ర మోక్షం నుంచీ గజేంద్రుడు అందించిన స్తుతి – సంపూర్ణమ్)

శ్రీశుక ఉవాచ

ఏవం గజేంద్రముపవర్ణితనిర్విశేషం

బ్రహ్మాదయో వివిధలింగభిదాభిమానాః।

నైతే యదోపససృపుర్నిఖిలాత్మకత్వా-

-త్తత్రాఖిలామరమయో హరిరావిరాసీత్॥30॥

తం తద్వదార్తముపలభ్య జగన్నివాసః

స్తోత్రం నిశమ్య దివిజైః సహ సంస్తువద్భిః।

ఛందోమయేన గరుడేన స ఊహ్యమాన-

-శ్చక్రాయుధోఽభ్యగమదాశు యతో గజేంద్రః॥31॥

సోఽంతఃసరస్యురుబలేన గృహీత ఆర్తో

దృష్ట్వా గరుత్మతి హరిం ఖ ఉపాత్తచక్రమ్।

ఉత్క్షిప్య సాంబుజకరం గిరమాహ కృచ్ఛ్రా-

-న్నారాయణాఖిలగురో భగవన్నమస్తే॥32॥

తం వీక్ష్య పీడితమజః సహసాఽవతీర్య

తంగ్రాహమాశు సరసః కృపయోజ్జహార।

గ్రాహాద్విపాటితముఖాదరిణా గజేంద్రం

సంపశ్యతాం హరిరమూముచదుస్రియాణామ్॥33॥

స్తోత్రానికి చివరలో ఉన్న శ్లోకాలు కనుక వీటిని కూడా ఇక్కడ అందించాను. చదువుకోవాలనుకునే వారి వసతి కోసం.

శ్రీమహావిష్ణువు కూర్మావతారం చాలా ప్రత్యేకమైనది. అది స్వామి వారి అపార కరుణను, కార్యసాధనా దీక్షను, భక్త వాత్సల్యాన్ని, ధర్మోద్ధరణ కాంక్షను సూచిస్తుంది.

విశ్వస్య జన్మస్థితిసంయమార్థే కృతావతారస్య పదాంబుజం తే।

వ్రజేమ సర్వే శరణం యదీశ స్మృతం ప్రయచ్ఛత్యభయం స్వపుంసామ్॥

శ్రీమహావిష్ణువు తాబేలు రూపంలో చేసిన లీల. శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో రెండవ అవతారం కూర్మావతారము. దేవదానవులు అమృతము కోసము పాలసముద్రాన్ని మథించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి, పాలసముద్రంలో వేస్తే అది కాస్తా ఆ బరువుకి క్షీర సాగరంలో మునిగిపోతుంటే, విష్ణుమూర్తి కూర్మావతారములో దానిని భరిస్తాడు. ఇది కృతయుగంలో సంభవించిన అవతారం. ఆరవ మన్వంతరమైన చాక్షుస మన్వంతరంలో జరిగినది సంఘటన.

అంటే కనీసం తక్కువలో తక్కువ 16,00,00,000 సంవత్సరాలైనా అయి ఉండవచ్చు. లెక్క సరిగ్గా అదేనా అంటే కాదు. కానైతే పూర్తి వివరాలు లేవు కనుక భాగవతంలో, ఇతర పురాణాలలో దొరికిన వివరాలను బట్టీ అంచనా.

దుర్వాస మహర్షి అత్రి, అనసూయల పుత్రుడు. ముక్కోపి. ఆయనకు కోపం తెప్పించినవారిని శపిస్తాడు. అందువల్లనే ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆయనను విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కారణం ఏమి మాట్లాడితే ఏమి జరుగుతుందనే భయం.

నిజానికి ఇక్కడే ఒక సూక్ష్మం గ్రహించాలి. He is a catalyst deployed by the Parabrahman to bring quicker culmination to the karma of people. ఆయన శాపం వల్ల పడాల్సిన శిక్ష లేదా కర్మఫలం త్వరగా తీరే అవకాశం ఉంటుంది. తద్వారా సంస్కరింపబడి ఉన్నతిని పొందుతారు.

వీరి మీద చాలా అపోహలు, అంతులేని కల్పితాలు ఉన్నాయి. శకుంతలను శపించాడని. అసలు శకుంతల కథలో ఈయన ప్రసక్తి లేనే లేదు.

ఈ సంస్కరింపబడి ఉన్నతిని పొందటం అనేది మనం నారద ముని కువేరుని పుత్రులకు శాపం ఇచ్చిన విషయం దామోదర లీలలో సవివరంగా చూశాము. మరొక చోట నారద ముని ఒక catalyst లాగా పని చేస్తాడని కూడా చూశాము.

<<<“నారదుడు ముని. నారద మహర్షి అని కూడా ప్రసిద్ధుడయ్యాడు. ఆయన తన కృపతో భగవదాఙ్ఞననుసరించి లోక కళ్యాణార్థం కొన్ని పనులు వేగవంతం అయ్యేలా చేస్తాడు. Narada is a representation of Newton’s First Law of Motion (మనం దీన్నీ ధృవానీతిర్మతిర్మమ అనే 9వ అధ్యాయంలో చూశాము). He sets into motion certain events. Or changes the events sometimes so that the outcomes alter. అదే కాకుండా ఆయన catalyst (ఉత్ప్రేరకం) కూడా.”>>> – 36వ ఎపిసోడ్ – యశోదై ఇళం సింగమ్ – లో చూశాము.

ఇక్కడ కూడా ఈ కూర్మావతార ఘట్టంలో మనం సంస్కరింపబడి ఉన్నతిని పొందటం అనేది చూస్తాము. కాకపోతే ఈసారి catalyst దుర్వాస ముని. ఆయన కోపిష్టి కాదు. ఆలోచన లేని వ్యక్తి కూడా కాదు. He’s one who’s completely indulged in Parabrahman. ఒక కళాకారుడినో శాస్త్రవేత్తనో కదిలిస్తే వారు మన మీద ఆవేశం చూపటం తెలిసిన విషయమే. దుర్వాస మహర్షి ధర్మ ప్రియుడు. ధర్మం తప్పిన వారిని దారిలో పెట్టటం ఆయన బాధ్యతగా భావిస్తాడు.

ఒక విషయం గమనించాలి. ఒకసారి ఒకరిని శపిస్తే తమ తపోశక్తి ఆ వారా సన్నగిల్లుతుందని ఋషులు సాధారణంగా శపించటానికి పూనుకోరు.

నిజానికి విశ్వామిత్ర మహర్షికి తన క్రోధాగ్నితో మారీచ సుబాహులను నశింపజేసే సామర్థ్యం ఉన్నా ఆయన ఆ పని చేయడు.

మరి అలాంటిది దుర్వాస మహర్షి అన్ని శాపాలు, తరువాత అనుగ్రహం చూపుతాడు, ఇచ్చినా ఆయన స్థాయి, తపోశక్తి సన్నగిల్లిన వివరం లేదు. అంటే ఆయన తపోశక్తి, సత్య-ధర్మనిష్ఠ ఎంత గొప్పవో తెలుస్తూనే ఉంది. భాగవతంలోనే మనకు తెలిసిన అంబరీష వృత్తాంతంలో ఆయన ఎదుర్కొన్న సమస్య ఆయన అహంకారానికి పడిన శిక్ష తప్ప ఆయన తపోశక్తి, ధర్మనిష్ఠల లోపంవల్ల కాదు. మహాత్ముడని గుర్తు పెట్టుకోవాలి. సాక్షాత్ రుద్రుని అంశ.

ఆయన ఒకసారి శ్రీమహాలక్ష్మిని ఆరాధించి అమ్మ ప్రసాదించిన ఒక పూమాలను స్వీకరించి స్వర్గానికి వెళతాడు. అక్కడ ఐరావతాన్ని అధిరోహించి వస్తున్న ఇంద్రునికి ఆ మాలను అనుగ్రహిస్తాడు. కానీ, ఆ క్షణాన ఐశ్వర్య మదోన్మత్తుడై ఉన్న ఇంద్రుడు ఆ మాలని నిర్లక్ష్యంగా తీసుకుని ఐరావతానికి ఇస్తే, ఆ శ్వేత గజం ఆ మాలను విసిరి అవతల పడవేసి తొక్కుకుంటూ వెళ్తుంది. దానితో కోపించిన ఆ మహనీయుడు ఏ ఐశ్వర్య మదోన్మత్తుడవై శ్రీమహాలక్ష్మి ప్రసాదమైన మాలను నిర్లక్ష్యం చేశావో అదే ఐశ్వర్యం కోసం అలమటిస్తావు. దేవతల శక్తి సామర్థ్యాలు క్షీణిస్తాయి అని శపిస్తాడు.

ఆ మదం ఇంద్రుడికే కాదు. ఎవరికైనా తగ్గాలి.

ఆ శాప ప్రభావం వల్ల, రాక్షస మూకలు విజృంభించి ఆయుధాలు ధరించి దేవతలను రెట్టింపు ధైర్యంతో ఎదుర్కుని యుద్ధాలు చేశారు. దేవతల బలం తగ్గి ఉండటం వల్ల, సామర్థ్యాలలో తేడాలు గల ఆ యుద్ధాలలో అనేక ఇక్కట్ల పాలై, ప్రాణాలు అరచేతులలో పెట్టుకుని, శత్రువులను లొంగదీసుకునే ఉపాయం తెలియక తల్లడిల్లిపోయారు.

చేసినంత కాలం యుద్ధాలు చేసి, ఇక వారి శక్తి తట్టుకొనలేని స్థితిలో వరుణుడు మున్నగు దేవతా ప్రముఖులతో కూడి, దేవేంద్రుడు బ్రహ్మ గారి వద్దకు వెళ్ళాడు. ఆ పితామహునికి నమస్కరించి, దేవతలు అందరూ ఆయనకు రాక్షసుల దురాగతాలను ఇలా వివరించారు.

“దుర్వాసుడి శాపం వలన లోకాలు అన్నీ పౌరుషమూ వైభవమూ కోల్పోయాయి. ఇంద్రుడితో సహా అన్ని లోకాల వారూ ఓడిపోయారు. పండుగలు అంతరించాయి.”

తొలుత వారిని మందలించిన బ్రహ్మదేవుడు, తరువాత దైత్యుల సహజ లక్షణాలైన అవైదిక చర్యల వల్ల కీడే ఎక్కువ ఉంటుంది కనుక దేవతలను ఊరడించి, అందరికీ దిక్కు అయిన ఆ శ్రీహరినే శరణు వేడుదాము రండి అని వారిని పరంధామానికి తోడ్కొని వెళ్ళాడు.

ఇక్కడ దేవతల ఐశ్వర్యము అనగా వారి ఐశ్వర్య శక్తి. అనగా స్వర్గ లక్ష్మి.

“తండ్రీ! నీ మాయ వలన సృష్టి సమస్తమూ మోహంలో మునిగిపోతుంది, నీ మాయను దాటడం ఎవరి వల్లా కాదు. ఏమాత్రమైనా నీ మాయను గెలిచినవారు ఎవరూ లేరు. నీవు ప్రాణులు అందరి ఎడల సమానంగా మెలగువాడవు, నీ వల్ల పుట్టిన భూమి నీ పాదాలు, శివుడు నీ మనస్సు, అగ్ని నీ ముఖము, సూర్యచంద్రులు నీ కన్నులు, దిక్కులు నీ చెవులు, జలం నీ వీర్యం, త్రిమూర్తులకు నీ రూపం పుట్టిల్లు, సృష్టి సమస్తమునకు మూలాధారం నీ కడుపు, ఆకాశం నీ శిరస్సు, ఈ విధంగా విశ్వరూపుడవైన నీకు నమస్కరిస్తున్నాను.” అని ప్రార్థించాడు.

ఎందుకీ ప్రార్థన అంటే దేవతలకు వారి అసలయిన శక్తి ఎవరో, ఎవరి అనుగ్రహం వల్ల వారీ భోగాలు గతంలో అనుభవించారో తెలియజెప్పటానికి. ఇంతకు మునుపు చూసిన అన్ని నామాలకు వివరణ ఇక్కడ లభించింది.

  1. నీ బలం నుండి దేవేంద్రుడూ
  2. అనుగ్రహం నుండి దేవతలు
  3. ఆగ్రహం నుండి రుద్రుడు
  4. పౌరుషం నుండి బ్రహ్మదేవుడు (అనగా ఈ ప్రార్థిస్తున్న ఆయనే)
  5. ఇంద్రియాల నుండి వేదాలూ, మునులూ
  6. పురుషాంగం నుండి ప్రజాపతి
  7. రొమ్ములనుండి లక్ష్మీదేవి
  8. నీడ నుండి ధర్మము
  9. వీపు నుండి అధర్మము
  10. తల నుండి స్వర్గము
  11. నవ్వు నుండి అప్సరసలు
  12. ముఖం నుండి బ్రాహ్మణులు, బ్రహ్మము
  13. భుజాల నుండి రాజులు, బలము
  14. తొడల నుండి వైశ్యులు, నేర్పరి తనము
  15. పాదాల నుండి శూద్రులు, శుశ్రూష
  16. క్రింది పెదవి నుండి లోభము
  17. పై పెదవి నుండి ప్రేమ
  18. ముక్కుపుటాల నుండి కాంతి
  19. స్పర్శ నుండి కామము
  20. కనుబొమలు నుండి యముడు
  21. పక్కభాగం నుండి కాలము సంభవించాయి
  22. యోగమాయ వలన ద్రవ్యము, వయస్సు, కర్మము, గుణవిశేషాలు విధింపబడ్డాయి,
  23. ఆత్మతంత్రం నుండి ధర్మము, అర్థము, కామము, మోక్షము కలిగాయి,
  24. నీ వలన లోకాలు, లోకపాలకులు ఏర్పడి అభివృద్ధి పొందుతారు,
  25. దేవతలకు ఆయుష్షు, ఆహారము, బలమూ నీవే. పర్వతాలపై అధికారివి నీవే. ప్రజలను పుట్టించి వారిని కాపాడే కర్మకాండల కోసం ఏర్పడిన అగ్నివి నీవే,
  26. సముద్రంలో రత్న రాసులను విస్తరింపజేసేది నీవే, మోక్షానికి
  27. ద్వారమైన పరబ్రహ్మం నీవే,
  28. చావు బ్రతుకులు నీ రూపాలే,
  29. ప్రాణులకు అన్నింటికీ ప్రాణం నీవే,
  30. తేజస్సు, అహంకారం, వాయువు నిండిన ప్రాణుల దేహాలలో, అవయవాలలో, ఆత్మలో నీవే నివసిస్తావు,

“పరమశక్తివైన మహాప్రభూ! మాపై దయచూపు.”

పురుష సూక్తము, పరమాత్మ తత్వము, విస్వసృష్టి-రచన.

దేవతా సమూహాలతో కూడి బ్రహ్మదేవుడు ఇలా అనేక రకాలుగా విష్ణుమూర్తిని స్తోత్రం చేసాడు. అంతట కరుణించి విశ్వాలు అన్నిటినీ తన గర్భంలో ధరించే ఆ మహానుభావుడు ప్రత్యక్షం అయ్యాడు. అలా ప్రత్యక్షమైన శ్రీమహావిష్ణువు రూపు సహస్ర సూర్యుల తేజస్సు ఒకటిగా పోతపోసిన ప్రకాశ వైభవంతో ప్రకాశిస్తోంది. చూస్తున్న దేవతల చూపులు చెదిరిపోయాయి. స్వామిని చూడగానే కొంతసేపు భయపడ్డారు, ఆశ్చర్యచకితులు అయ్యారు. వారికి ప్రభువును (అమరప్రభుః నామము) తట్టుకోవటం సాధ్యం కాదు కదా! అందులోనూ సాపం వలన తేజోహీనులైనారు.

పరమాత్మ శ్రీహరి హారాలు, కిరీటాలు, భుజకీర్తులు, కుండలాలు, కాలి అందెలు, మొలనూలు, కంకణాలు, కౌస్తుభరత్నము, కొమోదకీ గద, శంఖము, చక్రము, విల్లు ధరించి దర్శనం ఇచ్చాడు. మరకత మణి వంటి నల్లని మేను, కాంతులీనే పద్మాల వంటి కళ్ళు, చెక్కిళ్ళపై ప్రతిఫలిస్తున్న తళతళలాడే మకర కుండలాల కాంతులూ కలిగి ఉన్నాడు. బంగారురంగు పట్టు వస్త్రం ధరించి ఉన్నాడు. మెడలో వైజయంతీమాల ప్రకాశిస్తూ ఉంది. ఎంతో అందంగా ఉన్న స్వామి రూపాన్ని బ్రహ్మదేవుడు, శివుడు, దేవతలు సంతోషంతో పొంగిపోతూ దర్శించుకున్నారు. బ్రహ్మదేవుడు భగవంతునికి నమస్కారం చేసి స్తోత్రం చేసి వచ్చిన విషయాన్ని వివరించాడు. దైత్యుల ఆగడాలను చెప్పాడు. దేవేంద్రాదుల కష్టాలు విన్నవించాడు.

అలా బ్రహ్మదేవ ప్రముఖులు ప్రార్థించగా భగవంతుడు సంతోషించాడు. దేవతల దేహాలు నిలువెల్ల పులకించాయి. అప్పుడే తమ కష్టాలనుండి గట్టెక్కినట్లు తలచారు. భయంకరమైన ప్రారబ్ధమనే సముద్రాన్ని మథించడానికి ఉత్సాహపడ్డారు. అప్పుడు భగవంతుడు విష్ణుమూర్తి మేఘ గంభీరకంఠస్వరంతో ఇలా అన్నాడు.

“హిరణ్యగర్భ సంజాతా! ఓ దేవతలకు ప్రభువు అయిన దేవేంద్రుడా! నుదుటి కన్నుగల ఓ త్రినేత్రుడా రుద్రుడా! ఓ దేవతా ముఖ్యులారా! ప్రస్తుతం మీరు రాక్షసులతో మంచిగా ఉండి, స్నేహం చేసి జీవించడమే మంచిది.

ఎలుకకోసం పాము పొంచి ఉండే విధంగా, బలం చేకూరేదాకా సమయంకోసం నిరీక్షిస్తూ శత్రువుల బారినుండి శరీరాన్ని దాచుకుని ఉండటం ఉత్తముల లక్షణం.

మీరు క్షీర సాగరం నుండీ అమృతాన్ని పుట్టించే ప్రయత్నం స్వచ్ఛమైన మనసులతో చేయండి. అమృతాన్ని త్రాగినవారికి ఆయుష్షు పెరుగుతుంది, మరణంలేని మనుగడ లభిస్తుంది.

మీరందరూ పాలసముద్రంలో రకరకాల తృణధాన్యాలను, ఔషధాలను, మొక్కలను, తీగలను, విరివిగా తెప్పించి వేయండి. మంథరపర్వతాన్ని కవ్వంగానూ, సర్పరాజు వాసుకిని కవ్వం తాడుగానూ చేసుకుని నా సహాయంతో పాలసముద్రాన్ని చిలకండి. అందువల్ల, మీకు ప్రయోజనం కలుగుతుంది. పాపాత్ములైన రాక్షసులు అనేక కష్టాల పాలవుతారు. అన్ని సంపదలూ మీకు లభిస్తాయి. ఆ పాలకడలి నుండి ఒక విషం పుడుతుంది. అందుకు మీరు కలతచెంది భయపడరాదు. అలా చిలికేటప్పుడు, ఇంకా అనేక వస్తువులు పుడతాయి. వాటిపట్ల మీరు ఆసక్తి చూపకండి.”

అలా క్షీరసాగర మథనం చేయమని ఆజ్ఞాపించి, శ్రీమన్నారాయణుడు అంతర్థానం కాగా, బ్రహ్మ రుద్రాది దేవతలు తమ తమ నెలవులకు వెళ్ళారు.

చాలా శ్రద్ధగా మనం సాధించాలనుకున్న దానిని ఏవిధంగా సాధించాలో ఆ పరమాత్మ దేవతలందరికీ చెప్పాడు.

ఇక్కడ మనం రెండు విషయాలు పరిశీలించాలి. ఇంతకు మునుపు మనం చూసిన నామాల (హిరణ్యగర్భః, భూగర్భః మొదలైన వాటి) విస్తారమైన వివరణ ఈ కథలో తెలుస్తుంది. దానికి తోడు, సంకల్పం చేసుకుని ఒక పనిని తలపెట్టినప్పుడు అది ఎలా చేయాలో సవివరంగా చెప్పటం జరిగింది.

  1. పరిస్థితులు బాగా లేనప్పుడు తగ్గి ఉండాలి. బాగున్నప్పుడు తగ్గి ఉంటే ఇలాంటి సమయాలు అంత త్వరగా రావు. పరీక్షా కాలం అయితే తప్ప. మనకంటే బలవంతులు ఎవరైతే ఉంటారో వారితో వైరం కన్నా స్నేహమే, లేదా కనీసం శత్రుత్వం లేకుండానో చూసుకోవాలి.
  2. మీరు క్షీర సాగరం నుండీ అమృతాన్ని పుట్టించే ప్రయత్నం స్వచ్ఛమైన మనసులతో చేయండి. ——> ఏ పని తలపెట్టినా ఆ పని తప్పు మాకు వేరొక వ్యాపకం లేదు అనే విధంగా చేయాలి. అంటే శ్రద్ధ దాని మీదే పెట్టాలి. స్వచ్ఛమైన మనసు అంటే దృష్టి మరల్చకుండా అని. తదేక దృష్టి.
  3. మీరందరూ పాలసముద్రంలో రకరకాల తృణధాన్యాలను, ఔషధాలను, మొక్కలను, తీగలను, విరివిగా తెప్పించి వేయండి ——> మనకు ఏదైనా కావాలని ఎవరి వద్దకైనా వెళ్ళినపుడు (ఇక్కడ క్షీరసాగరం) వారికి తగిన విలువను అందిస్తామని చెప్పాలి. “నా దగ్గర ఏమీ లేదు. నువ్వే నా దిక్కు,” అనాల్సినది పరమాత్మ దగ్గరే! ఆ శరణాగతి చేయదగిన వాడు ఆ విశ్వశక్తి మాత్రమే. ఇతరులకు మేము సమయ సందర్భాలను బట్టీ ప్రత్యుపకారమో, ఇతరమైన విలువలో నీకు అందించగలము అని చెప్పాలి. అలాగే మన ప్రయత్నానికి తగిన సాధనములను (అమృతం కోసం ఓషధులు) మన పరిశ్రమతో సాధించే ప్రయత్నం చేయాలి.
  4. మంథరపర్వతాన్ని కవ్వంగానూ, సర్పరాజు వాసుకిని కవ్వం తాడుగానూ చేసుకుని నా సహాయంతో పాలసముద్రాన్ని చిలకండి ——> పని చేసేప్పుడు తగిన వారి సహాయాన్ని సరైన రీతిలో అర్థించాలి. ఆ యా సహాయాలను సరైన రీతిలో వినియోగించుకోవాలి. ఇక్కడ మంధర పర్వతం మునగటం, వాసుకి ఇబ్బంది పడటం అన్నవి ఎవరి చేతిలో లేని విషయాలు. దాని వల్ల సమస్యలు రాకుండా పరమాత్మ మన ప్రయత్నంలోనే స్వచ్ఛతను బట్టీ మనకు అండగా ఉండి పనులు నెరవేరేలా చేస్తాడు.
  5. మీకు ప్రయోజనం కలుగుతుంది. పాపాత్ములైన రాక్షసులు అనేక కష్టాల పాలవుతారు. అన్ని సంపదలూ మీకు లభిస్తాయి ——> పాపాత్ములైన రాక్షసులు. ఇది గ్రహించాల్సిన విషయం. ధర్మాత్ములు రాక్షసులైనా ఏమీ కాదు. జాతి భేదాలు ధర్మాచరణ పరాయణులకు ఉండవు. పరమాత్మ ఏ భేదభావాలు చూపడు. మీ ప్రయత్నం త్రికరణ శుద్ధిగా చేస్తే, మీ సంపదలు మీకు లభ్యమౌతాయి. పట్టుదలతో చేయవలసినది చేసి సాధించుకోండి.
  6. ఆ పాలకడలి నుండి ఒక విషం పుడుతుంది. అందుకు మీరు కలతచెంది భయపడరాదు ——> సంకల్పంతో ఒక పని తలపెట్టి సాధించే క్రమంలో మనకు వచ్చే శుభ ఫలితాలతో పాటూ, కొన్ని ఎదురు చూడని ప్రమాదాలు కూడా వస్తాయి. అంతఃకరణశుద్ధి ఉంటే మన ప్రమేయం లేకుండానే ఆ కష్టాలు, ప్రమాదాలు తీరుతాయి. కనుక భయపడి పనిని మధ్యలోనే వదిలేయకూడదు (ఇక్కడ శివుడు ఆ హాలాహలాన్ని స్వీకరిస్తాడు)
  7. అలా చిలికేటప్పుడు, ఇంకా అనేక వస్తువులు పుడతాయి. వాటిపట్ల మీరు ఆసక్తి చూపకండి ——> మనం సంకల్పంతో ఒక కార్యాలయాన్ని తలపెట్టినప్పుడు ఎన్నో ప్రలోభాలు ఎదురౌతాయి. వాటి మాయలో పడకూడదు. (ఆధ్యాత్మిక సాధన పరంగా చెప్పుకుంటే మంత్ర జపాల్లో, ధ్యానంలో చేసే వారికి కొన్ని శక్తులు, మానవాతీత అనుభవాలే లభిస్తాయి. వాటి మాయలో పడి ప్రదర్శనలు చేయకూడదు. పనమౌతారు. వాటి మీద మోహం లేకపోతే/చూపకపోతే అంతిమ ఫలితం దక్కుతుంది.

ఈ ఏడు మెట్లు ప్రతి ఎఒక్కరికీ శిరోధార్యమైన మాటలు. ఎందుకంటే పరమాత్మ స్వయంగా చెప్పినవి. ఫలితం గుకించి హామీ ఇచ్చినవి.

ఇవన్నీ మనం క్షీరసాగరమథన వృత్తాంతంలో సోదాహరణంగా చూడవచ్చు.

క్షితిరతి విపులతరే తవ తిష్ఠతి పృష్టే

ధరణి ధరణ కిణ చక్ర గరిష్ఠే

కేశవ! ధృత కచ్ఛప రూప! జయ జగదీశ హరే!

కూర్మావతార విశేషాల మీదుగా మాధవ, మధుసూదన అనే నామాల వ్యాఖ్యానాన్ని చూద్దాము

(సశేషం)

Exit mobile version