[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
సర్వశ్రేష్ఠః-3
కేయూరాఙ్గదకఙ్కణోత్తమమహారత్నాఙ్గులీయాఙ్కిత-
శ్రీమద్బాహుచతుష్కసఙ్గతగదాశఙ్ఖారిపఙ్కేరుహామ్।
కాఞ్చిత్కాఞ్చనకాఞ్చిలాఞ్ఛితలసత్పీతామ్బరాలమ్బినీ-
మాలమ్బే విమలామ్బుజద్యుతిపదాం మూర్తిం తవార్తిచ్ఛిదమ్॥
యత్త్రైక్యమహీయసోఽపి మహితం సమ్మోహనం మోహనాత్
కాన్తం కాన్తినిధానతోఽపి మధురం మాధుర్యధుర్యాదపి।
సౌన్దర్యోత్తరతోఽపి సున్దరతరం త్వద్రుపమాశ్చర్యతో-
ఽప్యాశ్చర్యం భువనే న కస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో॥
వృద్ధతముడై భగవానుడు జ్యేష్ఠః అని పిలువబడినాడు. విష్ణుమూర్తి సృష్టికి పూర్వమే ఉండుటచేత జ్యేష్ఠః అని కీర్తింపబడినాడు.
వయోభేదాలన్నీ కాల నిర్మితాలు. కాలాన్ని అనిసరించేవారికి, కాలంలో బంధించబడి ఉన్నవారికి, కాల ప్రభావాన్ని చవిచూసేవారికి ఇవన్నీ వర్తిస్తాయి.
కానీ శ్రీమహావిష్ణువు కాలానికే స్వామి. కాలం ఆదిశేషుడి, అనంతుడై ఆ శ్రీహరిని ఆశ్రయించుకుని ఉండి ఆయనకు శయ్యలా ఉంటుంది. ఆయనకు ఏ విధంగా అయితే అనుకూలంగా ఉంటుందో ఆవిధంగా తనను తాను మలచుకుంటూ ఉంటుంది.
శ్రీమన్నారాయణుడు కాలాతీతుడు. స్థలకాలాదులు ఆవిర్భవించటానికి మునుపే ఆయన ఆయన అలా ఉన్నాడు.
॥కాలః కలయతామహమ్॥
అందుకే ఆయన జ్యేష్ఠుడు.
ఆండాళ్ 21వ పాశురంలో ఆయనను పెరియాయ్ అని సంబోధించింది అందుకే. అంతట అలా జ్యేష్ఠుడై ఉండేవాడు కచేచితంగా శ్రేష్ఠుడై ఉండవలెను.
॥జ్యేష్ఠః – బ్రహ్మైవ భూతానాం జ్యేష్ఠః॥ – సర్వ భూతములలోకి బ్రహ్మమే పెద్దవాడు అని చెప్పుట వలన విష్ణు సహస్రనామములో స్తుతింపబడినవాడు బ్రహ్మమే.
జ్యేష్ఠుడు అనగా పరముడు. అందరు దేవతలకన్నా పరమైనవాడు.
॥తద్విష్ణోః పరమం పదం॥ – విష్ణువు యొక్క పరమపదమే అది.
ఇంకా చెప్పాలి అంటే…
- అ) జీవించువాడు (జ + ఇష్ట)
- మనమందరము జీవులమే. జీవిస్తుంటాము. కానీ పరిమిత కాలమే. కాలప్రభావానికి లొంగుతాము. కానీ ఆ విశేవశక్తి మాత్రం కాలాతీతము. Time independent.
- ఆ) క్షేత్రఙ్ఞుడు లేక శరీరములో జీవరూపములో ఉండెడి వాడు.
- ఇ) పరమాత్మ అని కూడా చెప్పుకొనవచ్చును.
- ఈ) ముఖ్యప్రాణస్వరూపుడు (ముఖమునందు సంచారము చేయు ప్రాణము ముఖి + య
- ఉ) జీవుడు పుట్టగానే ఆహారము స్వీకరించుటకు నోరుతెరచును. అలా ఆహారము స్వికరించాలి అన్న ఆలోచన కలిగించు ప్రాణశక్తి ఆయనే. ఆ జీవుడు పుట్టక మునుపే ఆయన ఉండి వానికి ఆ వసతి కల్పించుతాడు. కనుక ఆయన జ్యేష్ఠుడు (జ్యేష్టుడు).
- ఊ) ముఖముగల వాయుపుత్రుడని – ఆంజనేయ స్వరూపుడని కూడా అర్థము. వాయువుకు ఆ శక్తిని ఇచ్చేది కూడా ఆయనే కదా.
॥పవనః పవతామస్మి॥ – పవిత్రమొనర్చే వాటిలో నేను వాయువును
ఇక పరాశర భట్టర్ ఏమని చెప్పారో చూద్దాము.
॥జ్యేష్ఠః – అయమతిశయేన ప్రశస్యః, వృద్ధ ఇతి వా జ్యేష్ఠః॥ – తాను, తనతో ఉండే నిత్యముక్తులు ప్రతి నిత్యమూ తృప్తితీరా అనుభవించినా తరుగని మహదైశ్వర్యము కలిగిన వాడు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పరమపదము లేదా వైకుణ్ఠము చేరేవారి సంఖ్య అనంతంగా పెరుగుతూనే ఉంటుంది. అలా అక్కడ చేరి, నిత్యముక్తులైన వారు, వారితోపాటు ఆ పరంధామ యజమాని అయిన శ్రీమన్నారాయణుడు (అమ్మ కూడా కలిసే) అక్కడి ఐశ్వర్యమును ఎంత అనుభవించినా తరిగి పోదు. అలాంటి అనంత ఐశ్వర్యము కలిగిన వాడు కనుక ఆయనను జ్యేష్ఠుడని కొనియాడుతారు.
స్తుతి పాత్రుడైన వాడు జ్యేష్ఠుడని పెద్దల మాట. అంటే అత్యున్నతుడు. అందుకే ఆయన శ్రేష్ఠుడు.
69. శ్రేష్ఠః — ప్రశంసింపదగిన వారిలోకెల్ల ఉత్తముడు.
శ్రేష్టః లేదా శ్రేష్ఠః జీవులయందు కరుణ కలిగిన వాడు. వారి శ్రేయస్సును కోరుకొనువాడు. వారి శ్రేయస్సు ఇష్టమైనవాడు. కనుక ఆయన శ్రేష్ఠః.
మరి ఇన్నిన్ని ఉపద్రవాలు వస్తుంటే ఆయన ఎందుకు చూస్తూ ఊరుకుంటాడు? మరి రక్షించిన సంఘటనలు కూడా ఉన్నాయి కదా.
ఈ చర్చను సాక్షి అనే నామము దగ్గర చూద్దాము.
ప్రాణ శక్తియే సమస్త వ్యవహారాలకు మూలము. అది నిజానికి మహిమాన్వితమై ఉన్నది.
ఎందుకు?
Life can be created in the laboratory. But cannot be produced by things that aren’t already existing in the universe.
<<<తల్లివి నీవే తండ్రివి నీవే! 60: ప్రాణ దాత>>> లో
అరుదైన మూలకాలు రేడియోధార్మిక క్షయం (radioactive decay) మరియు మరింత సాధారణ మూలకాల యొక్క ఇతర అణు ప్రక్రియల ద్వారా ఉత్పత్తి అవుతాయి. ఉదాహరణకు, ఆక్టినియమ్ యొక్క ఆల్ఫా క్షయం (Alpha Decay) ఫలితంగా ఫ్రాన్సియం పిచ్బ్లెండేలో కనుగొనబడింది. నేడు కనుగొనబడిన కొన్ని మూలకాలు ఆదిమ మూలకాల క్షయం ద్వారా ఉత్పత్తి చేయబడి ఉండవచ్చు – విశ్వ చరిత్రలో ముందుగా ఉత్పత్తి చేయబడిన మూలకాలు అతి తక్కువ జీవిత కాలం కలిగి ఉండి తరువాత అదృశ్యం అయి ఉండవచ్చు.
అలా అవి అదృశ్యం అయినా కూడా అవి పూర్తిగా అంతరించి పోవు.
కనుక ప్రాణశక్తి మహిమాన్వితమైనది. దానిని అందరికీ ఇచ్చేవాడు, కాపాడు వాడు కనుక ఆయన శ్రేష్ఠుడు.
వేద వాక్:
॥ప్రాణోవావ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ॥
ప్రాణ సంబంధమైన నామాల వరుసలో ఈ రెండు (జ్యేష్ఠః, శ్రేష్ఠః) చెప్పబడటం వేద విజ్ఞానాన్ని ప్రస్తావించటమే అని సామవేదం షణ్ముఖశర్మ గారు నుడివారు.
ముఖ్య ప్రాణోపాసనకు చెందిన ఈ నామాలనే – ॥నమో జ్యేష్ఠాయ చ శ్రేష్ఠాయచ॥ అని రుద్ర నెక్ మంత్రాలు స్తుతించాయి.
॥శ్రేష్ఠతమాయ కర్మణే॥ అని యజుర్వేదం శ్రేష్ఠతముడైన పరమాత్మను పేర్కొన్నది.
ప్రశంసనీయమైన ఈ స్వామినే జ్ఞానులు నిత్యం కీర్తిస్తున్నారు.
॥తద్విప్రాసో విపన్యవో జాగృవాగ్0 సస్సమింధతే. విష్ణోర్యత్పరమం పదమ్॥ – బ్రహ్మఙ్ఞులు నిత్యము ఎరుకకలవారై ఈతనిని స్తుతిస్తున్నారు కనుక, సర్వదా కీర్తనీయమైన గుణ మహిమ తత్వాధిక్యాలు కలిగిన విష్ణువే శ్రేష్ఠుడు.
ప్రాణములనిచ్చి, వాటిని తిరిగి తీసుకొనగలిగే ప్రాణస్వరూపుడైన విష్ణువు అన్నిటికంటే అధికుడు. కనుక ఆయన ప్రశంసనీయుడు.
అందుకే ప్రశంసాపాత్రమైన దివ్యస్వాభావిక మహిమాతిశయంతో దీపించే శ్రీమన్నారాయణుడు సమస్త ప్రాణకోటికి ప్రాణికోటికి పాలకుడై రక్షకుడై ఉన్న ఆయనే..
70.ప్రజాపతిః — సకల ప్రజలకు ప్రభువు, తండ్రి. నిత్యసూరులకు (పరమపదము పొందినవారికి) ప్రభువు.
ఈ ప్రజాపతి అన్న నామమును చాలా విధాలుగా పరిశీలించాలి. ఆధునిక సైన్స్ ప్రకారం ఉన్న సృష్టి ప్రారంభం గురించి సామ్యాలు వెదకవచ్చు. అలాగే అక్కడ లోపించిన కొన్ని అనుసంధానాలను కూడా తెలుసుకోవచ్చు.
ముందు భాగవతం ప్రకారం సృష్టి ఆరంభం నుంచీ జీవరాశుల ఆవిర్భావం గురించి చూసి, ఆధునిక సైన్స్ పరిశోధనలు దీనికి ఎలా అన్వయమౌతుందో లేదా కాదో చూడాలి.
(సశేషం)
నా గురించి నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా (SSSA). వేరే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తారు. కనుక నేను రాసిన దాన్ని బట్టీ నా రచనల గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. అది చాలు. భవిషత్ లో కలవాల్సి వస్తే అప్పుడు నా గురించి ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకోవచ్చు. ఠీక్ హైఁ? 🙂
తెలుగు వాడినే అని చెప్పేందుకు సాక్ష్యం: నాకు తెలుగు రాదు.
గీతాచార్య