[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
ప్రాణ నాయక
నిత్యాభూషా నిగమశిరసాం నిస్సమోత్తుంగవార్తా
కాన్తోయస్యాః కచవిలులితైః కాముకో మాల్యరత్నైః।
సూక్త్యా యస్యాః శ్రుతిసుభగయా సుప్రభాతా ధరిత్రీ
సైషా దేవీ సకలజననీ సించితాన్మామపాంగైః॥1॥
మాతా చేత్తులసీ పితా యది తవ శ్రీవిష్ణుచిత్తో మహాన్
భ్రాతా చేద్యతిశేఖరః ప్రియతమః శ్రీరంగధామా యది।
జ్ఞాతారస్తనయాస్త్వదుక్తి సరసస్తన్యేన సంవర్ధితాః
గోదాదేవి! కథం త్వమన్య సులభా సాధారణా శ్రీరసి॥2॥
కల్పదౌ హరిణా స్వయం జనహితం దృష్టేన సర్వాత్మనాం
ప్రోక్తం స్వస్యచ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణమ్।
సర్వేషాం ప్రకటం విధాతుమనిశం శ్రీధన్వినవ్యే పురే
జాతాం వైదికవిష్ణుచిత్త తనయాం గోదాముదారాం స్తుమః॥3॥
ఆకూతస్య పరిష్క్రియామనుపమామాసేచనం చక్షుషోః
ఆనందస్య పరంపరామనుగుణామారామశైలేశితుః।
తద్దోర్మధ్యకిరీట కోటిఘటితస్వోచ్ఛిష్టకస్తూరికా
మాల్యామోదసమేధితాత్మ విభవాం గోదా ముదారాం స్తుమః॥4॥
(గోదా చతుశ్శ్లోకీ)
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః।
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥
- ఈశానః — సమస్తమునూ శాసించు వాడు. సకలావస్థలలోనూ సకలమునూ పాలించువాడు.
- ప్రాణదః — ప్రాణములను ప్రసాదించువాడు (ప్రాణాన్ దదాతి). ప్రాణములను హరించువాడు (ప్రాణాన్ ద్యాతి). ప్రాణములను ప్రకాశింపజేయువాడు (ప్రాణాన్ దీపయతి).
- ప్రాణః — ప్రాణ స్వరూపుడు. జీవనము. చైతన్యము.
- జ్యేష్ఠః — పూర్వులకంటె, వారి పూర్వులకంటె, పెద్దవాడు. తరుగని ఐశ్వర్య సంపదచే పెద్దవాడు, మిక్కిలి కొనియాడదగినవాడు.
- శ్రేష్ఠః — ప్రశంసింపదగిన వారిలోకెల్ల ఉత్తముడు.
- ప్రజాపతిః — సకల ప్రజలకు ప్రభువు, తండ్రి. నిత్యసూరులకు (పరమపదము పొందినవారికి) ప్రభువు.
- హిరణ్యగర్భః — రమణీయమగు స్థానమున నివసించువాడు, పరంధాముడు. సంపూర్ణానందమగువానిని ప్రసాదించువాడు. చతుర్ముఖ బ్రహ్మకు ఆత్మయై యున్నవాడు.
- భూగర్భః — భూమిని (కడుపులో పెట్టుకొని) కాపాడువాడు. విశ్వమునకు పుట్టినిల్లు అయినవాడు.
- మాధవః — మా ధవః -శ్రీమహాలక్ష్మి(మా)కి భర్త. మధువిద్య (మౌనము, ధ్యానము, యోగము) ద్వారా తెలిసికొనబడువాడు. సకల విద్యా జ్ఞానములకు ప్రభువు. పరమాత్మను గూర్చిన జ్ఞానము ప్రసాదించువాడు. మధు (యాదవ) వంశమున పుట్టినవాడు. తనకు వేరు ప్రభువు లేనివాడు (అందరకు ఆయనే ప్రభువు). మౌనముగానుండి, సాక్షియై నిలచువాడు.
- మధుసూధనః — మధు, కైటభులను రాక్షసులను సంహరించినవాడు. బంధకారణములైన కర్మఫలములను నాశనము చేయువాడు.
ఇప్పుడు ఈశానః అనే నామం గురించి చూద్దాము.
తొల్త సత్యసంధ తీర్థుల వారి ద్వైత వ్యాఖ్య చూద్దాము.
॥ఈశం రుద్రమానయతి చేష్టయతి ఇతి ఈశానః॥ – రుద్రునికి చేష్టలు కలిగించు వాడు. చైతన్య పఱచువాడు (ఈశ + ఆనః).
॥ఈ – లక్ష్మీః తస్యాః శం – సుఖం యస్మాత్ స ఈశః అనస్యాయం స్వామీ ఆనః, ఈశశ్చ అసౌ అనశ్చేతి వా (ఈశ + ఆనః) ॥ – ఎవరి వలన లక్ష్మీదేవికి సుఖము కలుగునో ఆయనే ఈశుడు. అనుడి యొక్క స్వామి ఆనుడు. లక్ష్మీదేవికి సుఖం కల్గించువాడు, ముఖ్య ప్రాణునకు స్వామి అయినవాడు. అన శబ్దమునకు ముఖ్యప్రాణము అని అర్థము.
॥ముక్త చేష్టకత్వాత్ వా। ఈశానామపి ముక్తానాం ఈశానః సోఽ ననాత్ శృతః ఇతి మణ్డూకోపనిషత్ భాష్యోక్తే॥ – ముక్తులకు ప్రభవైన వాడు.
గతంలో ముక్తానాం పరమాగతిః అని ఉన్నది కదా. గతి అయ్యేది ప్రభువైన వాడు.
శ్రీమన్నారాయణుడు ముక్తులకు వారికి కూడా నియామకుడు అని మండూక భాష్యమున చెప్పబడినది.
ఇక శంకర భాష్యం ప్రకారం..
సర్వభూతములను శాసించువాడైనందువలన ఈశానః అని పిలువబడుతున్నాడు. సర్వకాల సర్వావస్థల యందు సమస్తమును శాసించి, నడిపించువాడైనందువలన ఈశానః అని కీర్తిని పొందెను. ఆయన ఆధిపత్యమునకు ఆది మధ్య అంతములు లేవు.
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా అన్నాడు.
ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి।
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా॥18.61॥
ఈశ్వరః — పరమేశ్వరుడు
సర్వ-భూతానాం — సమస్త ప్రాణుల యందు
హృత్-దేశే — హృదయములలో
అర్జున — అర్జునా
తిష్ఠతి — నివసించును
భ్రామయన్ — తిప్పుతాడు
సర్వ-భూతాని — సమస్త జీవులను
యంత్ర-ఆరూఢాని — యంత్రములో కూర్చునిఉన్న
మాయయా — భౌతిక శక్తిచే తయారుచేయబడిన
పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు. భౌతిక శక్తిచే తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని, వాటి వాటి కర్మల అనుగుణముగా, ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు.
భగవంతునిపై జీవాత్మ యొక్క పరాధీనతని (ఆధారపడి ఉండటాన్ని) వక్కాణిస్తూ, శ్రీ కృష్ణుడు ఇలా అంటున్నాడు, ‘అర్జునా, నేను చెప్పినట్టు విన్నా, వినకపోయినా, నీవు ఎల్లప్పుడూ నా ఆధీనంలోనే ఉంటావు. నీవు వసించి ఉండే ఈ శరీరము నా భౌతిక శక్తిచే తయారు చేయబడినది. నీ యొక్క పూర్వ కర్మల ప్రకారం, నీకు తగిన శరీరమును ఇచ్చాను. నేను కూడా దానిలోనే కూర్చుని ఉన్నాను. నేను నీ సమస్త ఆలోచనలను, మాటలను, మరియు చేష్టలను గమనిస్తూనే ఉన్నాను. కాబట్టి, నీవు ప్రస్తుతం చేసే కర్మలను బట్టి, నీ భవిష్యత్తు ఎలా ఉండాలి అని కూడా నిర్ణయిస్తాను. నీవు నాకంటే స్వతంత్రుడవని ఎన్నడూ తలంచకు. కాబట్టి అర్జునా, నీ శ్రేయస్సు కోసమే నీవు నాకు శరణాగతి చేయటమే మంచిది.’
సకలభూతములను శాసించుట చేత జీవకోటికి ప్రాణదాత కూడా తానే అయి ఉన్నాడు. అందుకే ఆయన ప్రాణదః
ఇక శ్రీ పరాశర భట్టర్ వ్యాఖ్య చూస్తే..
ఈశానః – తనను, ఇతర పదార్థములను సమస్తమును వశము కావించుకున్నవాడు. సకలావస్థలలోను సమస్థమును పాలించువాడు. సర్వమునకు అధిపతి.
శ్వేతాశ్వతర ఉపనిషత్ లో ఇలా ఉంది.
“తమీశ్వరాణాం పరమం మహేశ్వరం”
పరిపాలించువారందరికీ పరమైన మహేశ్వరుడు. ఈయనకు ఈ విశ్వశక్తికి వేరొక యజమాని అంటూ ఉండరు. తనను సృష్టించిన సృష్టికర్త అంటూ ఎవరూ ఉండని వాడు.
సర్వ స్వరూపుడు అని బృహదారణ్యక ఉపనిషత్ లో ఉన్నది.
ఈ శక్తికి లేదా స్వామికి (విష్ణు రూపంలో మనం ఆరాధిస్తాము) నాలుగు లక్షణాలు ఉంటాయి.
- ఆనందము
- నిత్యముక్తత్వము
- సర్వంసహా పరిపాలకత్వము
- తనను, తాను సృష్టించిన యావత్ సృష్టిని పాలించగల లక్షణము కలిగిన వాడు.
అందుచేత భగవానుడు సమస్త సృష్టికి ప్రాణాధారము అవుచున్నాడు. అక్కడే ప్రాణదః అనే నామము ఒప్పుతుంది.
ఆయన ఉంటాడు. ఆ వైశ్విక శక్తి యే శాశ్వతము. సనాతనము. ఆ శక్తియే శ్రీకృష్ణ రూపములో సాకార బ్రహ్మ గా వచ్చెను.
ఆ ఎల్లప్పుడూ ఉండటాన్ని Ayn Rand.. Aristotle’s Laws of Logic ను పునః సమీక్షిస్తూ Existence Exists అని అన్నది.
అట్లాగే అట్లాస్ ష్రగ్డ్ నవల మూడవ భాగానికి A is A అని పేరు పెట్టింది. Rand’s objectivism ignores or doesn’t accept the existence of God or some power superior to humans. But for all, other, purposes, she presented an ideal version of human being.
- ప్రాణదః
సర్వులకూ ప్రాణములనిచ్చువాడు. ఆ ప్రాణుల ప్రాణములను హరించు వాడు. వాటిని వెలిగించువాడు కూడా ఆయనే.
ఇక్కడ ప్రాణములు అంటే పంచ ప్రాణములు.
వాటి వివరం చూద్దాము.
ప్రాణాపాన సమాఘతాత్ కందమధ్యాద్యదుత్థితం।
ప్రాణలింగం తదాఖ్యాతం ప్రాణాపాననిరోదిభిః॥
ప్రతి మానవుని దేహంలో ఐదు రకముల వాయువులుంటాయి: 1. ప్రాణం, 2. అపానం, 3. సమానం, 4. ఉదానం, 5. వ్యానం. వీటిని పంచప్రాణాలని పిలుస్తారు.
హృది ప్రాణోగుదేపానః సమానోనాభిమండలే।
ఉదానః కంఠ దేశేస్యాద్ వ్యానః సర్వశరీరగః॥
ప్రాణవాయువు హృదయంలో, అపానవాయువు మూలాధారంలో, సమానవాయువు నాభిలో, ఉదానవాయువు కఠంలో, అలాగే వ్యానవాయువు దేహమంతా నెలకొని ఉంటుంది.
నిజానికి వాయువు ఒకటే అయినా, పలు ప్రదేశాలలో పలు పనులతో పలు పేర్లను కలిగి ఉంటుంది.
ప్రాణం: శ్వాస ద్వారా లోపలికి తీసుకున్న గాలి, ఊపిరితిత్తుల నుండి హృదయానికి చేరుతుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది.
అపానం: గుదము ద్వారా బయటికి వెళ్ళే వాయువు. మలమూత్ర విసర్జనకు సహాయపడుతుంది.
సమానం: నాభి ప్రాంతంలో ఉండే వాయువు. జీర్ణక్రియకు సహాయపడుతుంది.
ఉదానం: గొంతు ప్రాంతంలో ఉండే వాయువు. మాట్లాడటం, ఊపిరి పీల్చుకోవడం, వాంతులు చేయడం వంటి కార్యకలాపాలకు సహాయపడుతుంది.
వ్యానం: శరీరమంతా వ్యాపించి ఉండే వాయువు. రక్త ప్రసరణ, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వంటి కార్యకలాపాలకు సహాయపడుతుంది.
ఈ పంచ ప్రాణాలు మన జీవితానికి చాలా ముఖ్యమైనవి. ఈ వాయువులలో ఏ ఒక్కటి సరిగ్గా పనిచేయకపోయినా, అది మన ఆరోగ్యానికి హానికరం. ఈ వాయువులను సమతుల్యంగా ఉంచడానికి యోగా, ప్రాణాయామం వంటి వ్యాయామాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
పంచ ప్రాణాల పనులు:
ప్రాణం: శరీరానికి శక్తిని అందిస్తుంది, శ్వాసక్రియను నియంత్రిస్తుంది.
అపానం: మలమూత్ర విసర్జనకు సహాయపడుతుంది.
సమానం: జీర్ణక్రియకు సహాయపడుతుంది.
ఉదానం: మాట్లాడటం, ఊపిరి పీల్చుకోవడం, వాంతులు చేయడం వంటి కార్యకలాపాలకు సహాయపడుతుంది.
వ్యానం: రక్త ప్రసరణ, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వంటి కార్యకలాపాలకు సహాయపడుతుంది.
సత్యసంధ తీర్థుల వారి వ్యాఖ్య చూద్దాము.
(సశేషం)
నా గురించి నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా (SSSA). వేరే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తారు. కనుక నేను రాసిన దాన్ని బట్టీ నా రచనల గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. అది చాలు. భవిషత్ లో కలవాల్సి వస్తే అప్పుడు నా గురించి ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకోవచ్చు. ఠీక్ హైఁ? 🙂
తెలుగు వాడినే అని చెప్పేందుకు సాక్ష్యం: నాకు తెలుగు రాదు.
గీతాచార్య