[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
కృష్ణం వాసుదేవం జగద్గురమ్-3
॥అర్జున ఉవాచ॥
ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే।
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః॥12.1॥
కృష్ణ అన్న నామానికి ఉన్న అర్థాలను, విశేషార్థాలను చూసే ముందు కొంత ఆయన చెప్పిన భగవత్తత్వాన్ని, ఆ తత్వాన్ని సులభంగా అందుకునేందుకు ఆయన చూపిన తరుణోపాయాలను, అసలు ఆయన సాక్షాత్ భగవత్స్వరూపం అన్న విషయాన్ని ప్రమాణికం చేసిన భగవద్గీతా శ్లోకాలను పరిశీలించటం ముఖ్యం.
ఇక్కడే మనకు ఈ అవతారం సౌలభ్యానికి పరాకాష్టగా నిలిచి విశిష్టాద్వైతం ఉత్కృష్టతను, ఆవశ్యకతను మనకు తెలుపుతుంది.
శ్రీ గురువాయూరప్పన్ చెప్పినట్లు, త్రిమతాలు ఆవశ్యకమే.
వైదిక ధర్మానికి లోపం కలుగుతున్నప్పుడు శంకరుడు వచ్చాడు. ధర్మాన్ని నిలబెట్టి కొన్ని ప్రమాణాలు ఏర్పరచాడు. వైష్ణవం ఆవశ్యకత గురించి తెలుపటానికి, అద్వైత సిద్దాంతానికి అవసరమైన మార్పులు తెచ్చి, భక్తి సిద్ధాంతాన్ని సులభం చేసి భగవంతుని భక్తులకు దగ్గర చేయటానికి రామానుజాచార్య అవతరించారు. దాస భక్తిని ప్రచారంలోకి తెచ్చి మరియొక విధంగా భగవంతుని సేవ చేసుకునేందుకు ద్వైతము వచ్చింది.
పై శ్లోకానికి అర్థం చూద్దాము.
“సాకార రూపము పట్ల స్థిరముగా భక్తితో ఉండేవారు, నిరాకార పరబ్రహ్మను ఉపాసించే వారు – వీరిలో, యోగములో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని నీవు పరిగణిస్తావు?”
అని అర్జునుడు శ్రీకృష్ణుని అడిగాడు.
అర్జునుడు, సమస్త జగత్తునూ తన యందే కలిగి ఉన్న భగవంతుని యొక్క విశ్వ రూపమును చూసాడు అంతకు కొన్ని క్షణముల క్రితమే. అది చూసిన తరువాత, భగవంతుడి స్వభావములు, గుణములు, లీలలను, పరివారమును కలిగున్న సాకార రూపములోనే దర్శించాలనుకున్నాడు. కాబట్టి, ఇప్పుడు ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని కుతూహలంగా ఉన్నాడు – భగవంతుడిని సాకార రూపములో పూజించే భక్తులా లేక నిరాకార పరబ్రహ్మను ఆరాధించే వారా అని.
భగవంతుడికి, సర్వ-వ్యాప్తి అయిన నిరాకార తత్త్వము మరియు సాకార రూపము, ఈ రెండు అస్తిత్వాలూ ఉన్నట్టు అర్జునుడి ప్రశ్న మళ్లీ ఒకసారి నిరూపిస్తున్నది. భగవంతుడికి సాకార రూపము లేదనేవారు ఆయనకు ఒక పరిమితిని విధించినట్టే, అదే విధంగా భగవంతుడు సాకార రూపములో మాత్రమే ఉంటాడు అనేవారు కూడా ఆయనను తక్కువ చేసినట్టే.
భగవంతుడు సమగ్రమైనవాడు. పరిపూర్ణుడు. కాబట్టి ఆయన నిరాకారుడు, రూపములు కూడా కలవాడు. మనం అనగా జీవాత్మలం కూడా ఈ రెండు అస్తిత్వాలనూ కలిగి ఉన్నాము. ఆత్మ అనేది నిరాకారమైనది, అయినా అది ఒక శరీరమును తీసుకున్నది, ఒకసారి కాదు ఎన్నెన్నో పూర్వ జన్మలలో అసంఖ్యాకమైనన్నిసార్లు. అత్యల్పమైన (మనం) ఆత్మలకే ఒక రూపము తీసుకునే శక్తి ఉంటే, సర్వ శక్తివంతుడైన పరమాత్మకు మాత్రం, ఆయన సంకల్పించినపుడల్లా ఒక రూపము తీస్కునే శక్తి ఉండదా? జ్ఞాన యోగము యొక్క గొప్ప ప్రతిపాదకుడైన జగద్గురు శంకరాచార్యులు కూడా ఇలా పేర్కొన్నాడు:
॥మూర్తం చైవామూర్తం ద్వే ఏవ బ్రహ్మణో రూపే,
ఇత్యుపనిషత్ తయోర్వా ద్వౌ
భక్తౌ భగవదుపదిష్టౌ,
క్లేశాదక్లేశాద్వా ముక్తిస్యాదేరతయోర్మధ్యే॥
పరమేశ్వరుడు, సాకారుడు మరియు నిరాకారుడు, రెండూ. ఆధ్యాత్మిక పథంలో అభ్యాసం చేసేవారు కూడా రెండు రకాలుగా ఉంటారు – నిరాకార పరబ్రహ్మను ఆరాధించేవారు, మరియు భగవంతుని సాకార రూప భక్తులు. కానీ, నిరాకార ఉపాసన మార్గము చాలా కఠినమైనది. అందరికీ అందుబాటులో ఉండనిది.
ఇదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తరువాత శ్లోకాలలో స్పష్టం చేశాడు.
॥శ్రీ భగవానువాచ॥
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే।
శ్రద్ధయా పరాయోపేతాస్తే మే యుక్తతమా మతాః॥12.2॥
యే త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే।
సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువమ్॥12.3॥
సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః।
తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః॥12.4॥
క్లేశోఽధికతరస్తేషామ్ అవ్యక్తాసక్తచేతసామ్।
అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే॥12.5॥
నా పైనే తమ మనస్సులను లగ్నం చేసి అనవరతం నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమైన వారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తాను. 2
నాశరహితుడూ, అనిర్వచనీయమైన వాడు, అవ్యక్తమూ, సర్వవ్యాపి, మనోబుద్ధులకు అతీతుడు, మార్పు లేనివాడు, నిత్యశాశ్వతుడూ, మరియు నిశ్చలమైన వాడునూ – అయిన పరమ సత్యము యొక్క నిరాకార తత్త్వాన్ని – ఇంద్రియములను నిగ్రహించి, సర్వత్రా సమబుద్ధితో ఉంటూ, సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ – ఆరాధించేవారు కూడా నన్ను పొందుతారు. 3, 4
మనస్సు యందు అవ్యక్తము పట్ల ఆసక్తి ఉన్నవారికి, సిద్ధి పథము చాలా కష్టములతో కూడుకున్నది. అవ్యక్తమును ఆరాధించటం అనేది శరీరబద్ధులైన జీవులకు చాలా కష్టతరమైనది. 5
తన యొక్క భిన్నమైన స్వరూపములను ఆరాధించే వారందరినీ ఆదరించిన శ్రీ కృష్ణుడు, తన సాకార రూపమును పూజించటమే శ్రేష్ఠమని మరల ఒకసారి స్పష్టం చేస్తున్నాడు. నిరాకార పరబ్రహ్మను ఆరాధించటం చాలా కష్టసాధ్యమైన మార్గమని అది ఎన్నో క్లేశములతో కూడినదని అంటున్నాడు.
నిరాకార పరబ్రహ్మను ఆరాధించటం ఎందుకు అంత కష్టమైనది? దీనికి ప్రప్రథమమైన, ప్రధానమైన కారణం ఏమిటంటే, మనకు (మనుష్యులకు) కూడా ఆకారం ఉంది. అనంతమైన జన్మలలో, రూపమున్న వాటితో అనుబంధం ఏర్పరుచుకోవటం మనకు అలవాటైంది. అందుకే, భగవంతునిపై ప్రేమను పెంపొందించుకునే ప్రయాసలో కూడా, మనకొక మనోహరమైన ఆకర్షణీయమైన రూపము అందుబాటులో ఉంటే, మనస్సు సునాయాసముగా దానిపై లగ్నం చేసి భగవంతుని పై మమకారానుబంధం పెంచుకోగలము. కానీ, నిరాకార తత్త్వ ఉపాసనలో, మన బుద్ధి దానిని అందుకోలేదు, మరియు మనస్సుకి, ఇంద్రియములకి అనుబంధం పెంచుకోవటానికి ఒక స్పర్శనీయమైనది (tangible) అంటూ ఏదీ ఉండదు. కాబట్టి ఈశ్వరునిపై ధ్యానం చేయటానికి, ఆ తత్వంపై మనస్సుతో అనుబంధం పెంచుకోవటానికీ, ఈ రెండు ప్రయత్నాలూ కఠినంగా అనిపిస్తాయి.
నిరాకార పరబ్రహ్మను ఆరాధించటం అనేది సాకార భగవంతుడిని ఆరాధించటం కంటే కష్టముగా ఉండటానికి ఇంకొక కారణము ఉంది. ఈ రెండు రకాల మార్గాలని, మర్కట-కిషోర న్యాయము (కోతి పిల్ల తర్కము) మరియు మార్జాల-కిషోర న్యాయము (పిల్లి పిల్ల తర్కము) ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. కోతిపిల్ల తనే తన తల్లి పొట్టని గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో తల్లి కోతి నుండి ఎలాంటి సహాయము లభించదు. తల్లి-కోతి ఒక కొమ్మ నుండి ఇంకొక కొమ్మ మీదికి దూకినప్పుడు, తల్లి-కోతిని గట్టిగా పట్టుకునే ఉండే బాధ్యత పిల్ల-కోతిదే, ఒకవేళ అది అలా చేయలేకపోతే, అది పడిపోతుంది. అదే సమయంలో, పిల్లిపిల్ల చాలా చిన్నగా, సున్నితముగా ఉంటుంది. కానీ తల్లి-పిల్లి ఆ పిల్లను ఒకచోటి నుండి ఇంకొక చోటికి మార్చే బాధ్యత తనే తీసుకుంటుంది. అది జాగ్రత్తగా పిల్లిపిల్లను మెడ వెనుక నోటితో పట్టి లేపి తీస్కువెళుతుంది.
ఈ పోలికలో, నిరాకార పరబ్రహ్మ యొక్క భక్తులను కోతిపిల్లతో పోల్చవచ్చు. సాకార రూపము యొక్క భక్తులను పిల్లి పిల్లతో పోల్చవచ్చు. నిరాకార పరబ్రహ్మను ఉపాసించేవారు, ఆ మార్గంలో పురోగతి సాధించే భారాన్ని తామే మోయవలసి ఉంటుంది, ఎందుకంటే బ్రహ్మన్ వారిమీద కృప చూపించలేదు. ఎందుకంటే, బ్రహ్మన్ నిరాకారమే కాదు, అది గుణరహితము కూడా. అది నిర్గుణ (గుణములు లేని), నిర్విశేష (లక్షణములు లేని), మరియు నిరాకార (ఆకారము లేని) అని వివరించబడినది. దీనిచే, మనకు తెలిసేదేమిటంటే, బ్రహ్మన్, కృప అనే లక్షణమును చూపలేదు అని. ఈశ్వరుడిని నిర్గుణ, నిర్విశేష, నిరాకార ముగా ఆరాధించే వారు, పురోగతి కోసం పూర్తిగా తమ సొంత పరిశ్రమ మీదనే ఆధారపడాలి. మరో పక్క, భగవంతుని సాకార రూపము, కరుణ మరియు కృపా సముద్రము. కాబట్టి, సాకార రూప భక్తులు తమ సాధన లో దైవీ సహకారం పొందుతారు. భగవంతుడు భక్తులపై ప్రసాదించే రక్షణ ఆధారముగానే శ్రీ కృష్ణుడు, 9.31వ శ్లోకంలో: ‘ఓ కుంతీ పుత్రుడా, నా భక్తుడు ఎన్నటికీ నశింపడు అని ధైర్యముగా ప్రకటించుము.’ అని పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని తదుపరి రెండు శ్లోకాలలో మళ్ళీ చెప్తున్నాడు.
యే తు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః।
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే॥12.6॥
తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్।
భవామి నచిరాత్ పార్థ మయ్యావేశితచేతసామ్॥12.7॥
“తాము చేసే కర్మలన్నింటినీ నాకే సమర్పిస్తూ, నన్నే పరమ లక్ష్యముగా భావిస్తూ, నన్నే ఆరాధిస్తూ మరియు అనన్య భక్తితో నా మీదే ధ్యానం చేసే వారిని, ఓ పార్థా, నేను వారిని శీఘ్రముగానే ఈ మృత్యుసంసారసాగరము నుండి విముక్తి చేస్తాను, ఏలనన వారి అంతఃకరణ నా యందే ఏకమైపోయి ఉంటుంది.”
ఎందుకు?
మొదట తన సాకార రూపమును వారి భక్తికి ఆధారముగా చేసుకుని, వారు తమ మనస్సు, ఇంద్రియములను సునాయాసముగా ఆయన మీద కేంద్రీకరిస్తారు. తమ నాలుక మరియు చెవులను భగవంతుని యొక్క దివ్య నామములను జపించటానికి మరియు వినటానికి వాడతారు, వారి కన్నులను ఆయన యొక్క దివ్య మంగళ స్వరూపమును చూడటానికి, తమ శరీరమును ఆయన ప్రీతి కోసం పనులను చేయటానికి, తమ మనస్సును ఆయన యొక్క అద్భుతమైన లీలలను మరియు గుణములను గురించి స్మరించటానికి, మరియు బుద్ధిని ఆయన మహిమలను గురించి ధ్యానించటానికి/ఆలోచించటానికి ఉపయోగిస్తారు. ఈ విధంగా, వారు త్వరగా తమ మనోబుద్ధులను (అంతఃకరణ) ను భగవానునితో ఏకం చేస్తారు.
అంతేకాక, అటువంటి భక్తులు ఎడతెగని భక్తితో నిరంతరం తమ హృదయములను సమర్పిస్తారు కాబట్టి, భగవంతుడు త్వరగానే ఆయన కృపను వారిపై అనుగ్రహిస్తాడు. వారి మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాడు. తనతో అనన్య సంబంధము కలిగి ఉన్నవారికి, వారి అజ్ఞానమును జ్ఞాన దీపముచే పారదోలుతాడు. ఈ విధంగా, భగవంతుడే స్వయంగా తన భక్తుల రక్షకుడై వారిని మృత్యు సంసార సాగరము (జనన-మరణ చక్రము) నుండి ఉద్ధరిస్తాడు.
మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ।
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః॥12.8॥
“నీ మనస్సుని నామీదే లగ్నం చేయుము మరియు నీ బుద్ధిని నాకు అర్పించుము. ఆ తరువాత, నీవు సర్వదా నాలోనే నివసిస్తావు. దీనిపై ఎలాంటి సంశయము వద్దు.”
అని హామీ ఇస్తున్నాడు.
సాకార రూపమును ఆరాధించటమే ఉత్తమము అని చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు, ఇక తనను ఎలా ఆరాధించాలో వివరిస్తున్నాడు. అర్జునుడిని రెండు పనులు చేయమంటున్నాడు – మనస్సుని భగవంతుని యందే లగ్నము చేయాలి. బుద్ధిని ఆయనకు అర్పించాలి. మనస్సు యొక్క లక్షణము ఏమిటంటే అది కోరికలను, ఆకర్షణలను, ద్వేషములను సృష్టిస్తుంటుంది. బుద్ధి యొక్క పని ఆలోచించటం, విశ్లేషించటం, మంచి-చెడు నిర్ణయించటం.
మనస్సు యొక్క ప్రాముఖ్యత వైదిక శాస్త్రాలలో చాలా చోట్ల చెప్పబడింది:
చేతః ఖల్వస్య బంధాయ ముక్తయే చాత్మనో మతం।
గుణేషు సక్తం బంధాయ రతం వా పుంసి ముక్తయే॥
(శ్రీమద్భాగవతం 3.25.15)
‘మాయలో బంధనము లేదా దాని నుండి విముక్తి పొందటం అనేది మనస్సు యొక్క స్థితిని బట్టి ఉంటుంది. అది ప్రాపంచికత్వం పట్ల ఆసక్తితో ఉంటే, వ్యక్తి బంధనములో ఉన్నట్టే, ఒకవేళ మనస్సు ప్రపంచం నుండి విడివడి ఉంటే, వ్యక్తి ముక్తిని పొందుతాడు.’
॥మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః॥
(పంచదశి)
‘బంధనము లేదా మోక్షము అనేది మనస్సు యొక్క స్థితిని బట్టి ఉంటుంది.’ కేవలం శారీరక యాంత్రిక భక్తి సరిపోదు. మనస్సుని భగవత్ ధ్యాసలో నిమగ్నం చేయాలి. ఇలా ఎందుకంటే, మనస్సును లగ్నం చేయకుండా, కేవలం ఇంద్రియ కార్యక్రమాల వలన ఏమీ లాభము లేదు. ఉదాహరణకి, మనము చెవులతో ఒక ఉపదేశము విన్నాము అనుకోండి, కానీ మన మనస్సు ఏటో వెళ్ళిపోతే, ఏమి చెప్పబడినదో అర్థం కాదు. మాటలు చెవులలో పడతాయి కానీ అవి గుర్తుండవు/అవగతం కావు. దీనివలన మనస్సు అనుసంధానం కాకపొతే ఇంద్రియముల పని వ్యర్థమే అని మనకు తెలుస్తుంది.
అదే విధంగా, మనస్సు అనేది ఎలాంటిదంటే దానిలోనే అన్ని ఇంద్రియములు సూక్ష్మ రూపములో ఉంటాయి. అందుకే, ఇంద్రియ కార్యములు లేకున్నా, దృష్టి, వాసన, రుచి, స్పర్శ, మరియు వినికిడి వంటివాటిని తెలుసుకునే గ్రహణశక్తి మనస్సుకు ఉంటుంది. ఉదాహరణకి, రాత్రి పూట మనం నిద్రిస్తున్నప్పుడు మన ఇంద్రియములు అచేతనముగా ఉంటాయి. అయినా కలలు వస్తే, మన మనస్సు ఈ ఇంద్రియ విషయ-వస్తువులను అనుభవిస్తుంది. స్థూల ఇంద్రియములు లేకున్నా మనస్సుకి అన్ని ఇంద్రియ కార్యములు చేసే సామర్థ్యము ఉన్నది, అన్న విషయం దీనితో నిరూపించబడుతున్నది. కాబట్టి, మన కర్మలను నోట్ చేసుకుంటున్నప్పుడు భగవంతుడు మన మానసిక పనులకు ప్రాధాన్యం ఇస్తాడు కానీ ఇంద్రియాలతో చేసే శారీరక పనులకు కాదు.
మనస్సు కంటే ఉన్నతమైనది బుద్ధి. బుద్ధిని భగవంతుడికి సమర్పణ (శరణాగతి) చేసినప్పుడే మనము భగవంతునిపై మనస్సుని నిలపగలము. ప్రాపంచిక వ్యవహారాల్లో కూడా, మన బుద్ధికన్నా మించిన పరిస్థితి ఎదురైనప్పుడు, మనము మనకన్నా ఎక్కువ వివేకము/బుద్ధి కల వారి మార్గనిర్దేశనం వాంఛిస్తాము. ఉదాహరణకి, మనకు వ్యాధి సంక్రమిస్తే వైద్యుడి దగ్గరకు వెళతాము. మనకు వైద్య శాస్త్రము గురించి ఏమీ తెలియదు కాబట్టి మనము ఒక యోగ్యుడైన వైద్యుడి దగ్గరకు వెళతాము. ఆ వైద్యుడు మన రోగలక్షణములు గమనించి, మన వైద్య పరీక్షల రిపోర్టులు చూసి, రోగనిర్ణయము చేసి మనకు మందులని రాసిస్తాడు. మన బుద్ధిని శరణాగతి చేసి ఆయన రాసిన చీటీ ప్రకారం మందులను తీసుకుంటాము. అదే విధంగా, మనం ఏదైనా న్యాయ వివాదాల్లో చిక్కుకుంటే, ఒక న్యాయవాది సహాయం తీసుకుంటాము. మన న్యాయవాది, మనకు ప్రతిపక్షం తరఫు న్యాయవాది అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలో నేర్పిస్తాడు. మనకు న్యాయశాస్త్రం పట్ల ఎలాంటి అవగాహన లేదు కాబట్టి మన బుద్ధిని ఆయనకు అర్పించి ఆ న్యాయవాది చెప్పినట్టుగానే చేస్తాము.
అదే విధముగా, ప్రస్తుతం మన బుద్ధి ఎన్నో దోషాలతో కూడి ఉంది. శ్రీకృష్ణుడిని బృందావనం నుండి మథురకి తీస్కెళ్ళటానికి వెళ్ళిన అక్రూరుడు, ఈ బుద్ధికి ఉన్న దోషాలను శ్రీమద్ భాగవతంలో (10.40.25) లో ఇలా చెప్పాడు:
॥అనిత్యానాత్మ దుఃఖేషు విపర్యయ మతిర్హ్యహం॥ అక్రూరుడు ఇలా అన్నాడు: ‘మన బుద్ధి తప్పుడు జ్ఞానంతో ఉన్నది. మనము నిత్య శాశ్వతమైన ఆత్మలమైనా, మనం మనల్ని ఈ నశ్వర శరీరమే అనుకుంటాము. సమస్త ప్రపంచపు వస్తువులన్నీ నశ్వరమైనవే అయినా అవి ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి అనుకుంటాము, అందుకే, వాటిని రాత్రీపగలూ పోగుచేసుకుంటాము. ఇంద్రియ భోగముల కోసం పరిశ్రమ అనేది అంతిమంగా దుఃఖహేతువే అయినా, అదేదో ఆనందము లభిస్తుంది అనుకుని వాటి కోసం ప్రయాస పడుతూనే ఉంటాము.’
బుద్ధిలో ఉన్న ఈ మూడు దోషములను విపర్యయములు అంటారు. అంటే భౌతిక మాయ వల్ల అయిన జ్ఞాన నష్టము. అసంఖ్యాకమైన పూర్వ జన్మలలో మన బుద్ధి చేసిన ఈ దోషపూరిత చింతన వలన మన సమస్య యొక్క తీవ్రత మరింత జఠిలమవుతున్నది. మన జీవితాలను మన బుద్ధి చెప్పిన ప్రకారం నడిపించకుంటే మనం ఖఛ్చితంగా ఆధ్యాత్మిక పథంలో ముందుకు పోలేము. ఈ విధంగా, మనం మనస్సుని భగవంతుని యందే అనుసంధానం చేస్తూ ఆధ్యాత్మిక పథంలో పురోగతి సాధించాలనుకుంటే, మనం బుద్ధిని ఆయనకు సమర్పించి, ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. బుద్ధిని సమర్పించటం అంటే, శాస్త్రములు మరియు ప్రామాణిక గురువుల ద్వారా, భగవంతుని నుండి లభించిన జ్ఞానము ప్రకారం చింతన/ఆలోచన చేయటం. శరణాగతి చేసిన బుద్ధి యొక్క లక్షణములు 18.62వ శ్లోకంలో వివరించబడ్డాయి.
ఏది ఏమైనా స్వయంగా పూనుకుని నిరాకార నిర్గుణ పరబ్రహ్మను చింతించినా, లేదా సౌలభ్యానికి పరాకాష్ట అయిన సగుణ సాకార బ్రహ్మాన్ని ఉపాసించినా చివరకు ఆయన అనుగ్రహము మనకు కావాలి. అది లభిస్తే ఇక మనకు పూన్తనం విషయంలో చెప్పినట్లు (4వ ఎపిసోడ్) మిగతాదంతా భగవానుడే చూసుకుంటాడు.
ఈ సగుణ సాకార పరబ్రహ్మ తత్వాన్ని, అందులోని సౌలభ్యతను ఆధారం చేసుకుని శ్రీ పరాశర భట్టర్ చేసిన శ్రీవిష్ణు సహస్రనామ వ్యాఖ్యానమే భగవద్గుణ దర్పణం.
ఇక మీదట త్రిమతాచార్యులు కృయ్ణ అన్న నామమును మనకు అవగతమయ్యే విధంగా చెప్పారో ఇక పైన చూద్దాము.
అందుకే కృష్ణం వాసుదేవం జగద్గురుమ్!
(సశేషం)
నా గురించి నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా (SSSA). వేరే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తారు. కనుక నేను రాసిన దాన్ని బట్టీ నా రచనల గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. అది చాలు. భవిషత్ లో కలవాల్సి వస్తే అప్పుడు నా గురించి ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకోవచ్చు. ఠీక్ హైఁ? 🙂
తెలుగు వాడినే అని చెప్పేందుకు సాక్ష్యం: నాకు తెలుగు రాదు.
గీతాచార్య