Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తల్లివి నీవే తండ్రివి నీవే!-17

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

తత్సమ

విష్ణుః

తరుణౌ రూప సంపన్నౌ సుకూమారౌ మహాబలౌ।

పుణ్డరీక విశాలాక్షౌ చీర కృష్ణ అజిన అంబరౌ॥

వారిద్దరూ యవ్వనంలో ఉన్నారు. చెప్పనలవి కాని సౌందర్యం వారిది. చాలా సుకుమారంగా అగుపిస్తారు. కానీ, మహా బల సంపన్నులు. తెలివైనవారు. వీరులు. ధీరులు. శూరులు. తామరపువ్వు వంటి విశాలమైన కన్నులు కలవారు. చెట్ల తొడుగులు ధరించారు. వస్త్రాల బదులుగా.

ఫల మూల అశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ।

పుత్రౌ దశరథస్య ఆస్తాం భ్రాతరౌ రామ లక్ష్మణౌ॥

కంద మూలాలు, ఫలాలు మాత్రమే ఆహారంగా జీవిస్తున్నారు. తపస్సు-బ్రహ్మచర్యం ఆచరిస్తున్నట్లు అగుపిస్తున్నారు. వారు ఇద్దరూ సోదరులు. దశరథ కుమారులు. పేర్లు రామ, లక్ష్మణ.

ఈ మాటలు అన్నది ఎవరో కాదు. నిత్య పారాయణంలో, అనుష్ఠానాలలో, ఆఖరకు శ్రీరామ రక్షా స్తోత్రంలో కూడా చేర్చబడిన ఈ శ్లోకాలు శూర్ప నఖ నోట వెలువడినవి.

అలాగే..

రామో విగ్రహవాన్ ధర్మః

సాధుః సత్యపరాక్రమః।

రాజా సర్వస్యలోకస్య

దేవానాం మఘవానివ॥

ఈ మాటలు పలికింది ఎవరో కాదు. మహానుభావుడైన మారీచుడు. మహానుభావుడైన మారీచుడా? అని ఆశ్చర్య పడాల్సిన పని లేదు. అసలు రాముడంటే ఏమిటో కేవలం 32 అక్షరాలలో తేల్చి చెప్పాడు. శ్రీరామ తత్వాన్ని అర్థం చేసుకున్న వారు, ప్రచారం చేసేవారు, నిత్య నామస్మరణ చేసేవారు మహానుభావులు కాదగ్గ అర్హత కలిగిన వారే.

రాముడంటే పోత పోసిన ధర్మం. ధర్మం అనే భావన ఆకృతి దాలుస్తే అది శ్రీరాముడే. సీతారాముడే. ఆయనకున్న చాతుర్యం సామాన్యమైనది కాదు. భవిష్యత్ తరాల వారు తమను విమర్శిస్తారని, రాక్షసుల తరఫున వకాల్తా పుచ్చుకుని వాదిస్తారనీ గ్రహించి ఆ మర్యాదా పురుషోత్తముడు సీతను అలా ఎవరూ విమర్శించ కూడదని, తాను నిందలు మోసి మరీ సీతమ్మను ఆ రక్కసులే వెనకేసుకునచ్చేలా పరిస్థితులను మలచాడు. కల్పించాడు. మరి లేకపోతే ఆయనకు తెలియకనా జానకి అగ్ని పునీత అని? ఆయనకు తెలియకనా ఆమె పాతివ్రత్యం? ఆయనకు తెలియకనా ఆమె గొప్పతనం?

ఇప్పటి పరిస్థితులనే చూడండి!

జై శ్రీరామ్!

అనే మాటను యుద్ధం ప్రేరేపిత పిలుపుగా (యుద్ధం నినాదం) భావిస్తున్న వారు దానికి వ్యతిరేకంగా సీతను ఎందుకు వదిలేస్తున్నారు అని ప్రశ్నిస్తూ జై సీతారామ్ అని జవాబిస్తున్నారు. ఏమి చాతుర్యం శ్రీరామచంద్రమూర్తిది? మూర్తీభవించిన బుద్ధి కుశలత కాదూ? ఆ రక్కసపుత్రుల చేతనే జై సీతారామ్ అనిపిస్తున్నాడు.

అలా ఒక రాక్షసుడే, ఆయన చేత దెబ్బతిన్న వాడే, ఆయనకు శత్రువు అయిన వాడే శ్రీరాముడంటే.. విగ్రహవాన్ ధర్మః అని పలికాడు. అందుకే ఆ క్షణానికి మహానుభావుడైనాడు.

వేదాలలో నిక్షిప్తమైన ధర్మం సాకారంగా భౌతిక నేత్రాలకు దర్శింపశక్యం కాదు. కానీ శ్రీమహావిష్ణువు సౌలభ్యానికి ప్రతీకగా మన జీవులందరికీ అర్థమయ్యేలా చేసేందుకు, ఆచరణయోగ్యం కావించేందుకు ధర్మానికి ఆకారం రూపంలో శ్రీరామునిగా అవనీతలంపై అవతరించాడు (వ్యాపించాడు).

ధర్మసంరక్షణార్థం భగవంతుడు దాల్చిన అవతారాలలో శ్రీ రామావతారం తొట్టతొలి పూర్ణావతారము. జన్మబంధాలులేని పరమాత్మ జగత్కళ్యాణ కాంక్షతో ఈ భువిపై నరునిగా జన్మించి, ధర్మాన్ని ఆచరించి, శ్రీరామునిగా సర్వలోకాలకూ ధర్మపథావలంబకుడై ఇదీ ధర్మం. అదే రామాయణం అని చాటి చెప్పాడు.

రామస్య ఆయనం – రామాయణం.

రాముని మార్గం. రాముడు అనుసరించిన పథం.

ఆయనం అంటే గమనం లేదా కదలిక. రామాయణం అంటే “రామగమనం’. అంటే మూర్తీభవించిన ధర్మం యొక్క మార్గము. ధర్మమార్గము.

ఈ చరాచర, గోచరాగోచర సృష్టి అంతా ధర్మ బలంతోనే నడుస్తోంది. ప్రపంచంలోని సకల సుగుణాలు, సుఖాలు, శుభకర్మలూ ధర్మాన్ని అనుసరించే వుంటాయి. ధర్మలోపం జరిగితే మరుక్షణంలో అన్నీ అదృశ్యమైపోతాయి. అందుకే “ధర్మో రక్షతి రక్షితః” అన్నారు. అలాగే మనం పనిగట్టుకుని మరీ ధర్మాన్ని నెగ్గించాలి. లేకపోతే అధర్మం పెచ్చుమీరి పోతుంది.

శ్రీరాముడు వేసిన ప్రతి అడుగులోనూ ధర్మస్వరూపం ప్రతిబింబిస్తూనే ఉంది. తాటకా సంహార సమయంలో

స్త్రీని చంపడం ఎంతవరకూ ధర్మం? అనే సంశయం చూపి శ్రీరాముడు విశ్వామిత్రుడి చేత మనకు సమాధానం ఇప్పించాడు.

నృశంస మనృశంసం వా ప్రజారక్షణ కారణాత్।

పాతకం వా సదోషం వా కర్తవ్యం రాక్షతా సతా॥

ధర్మరక్షణ దీక్షతో ప్రజారక్షణ చేయవలసిన క్షత్రియుడు, ధర్మసంరక్షణ కోసం పాపమని కానీ, క్రూరమని కానీ, అధర్మమని కానీ ఆలోచించకుండా ధర్మాన్ని కాపాడాలి. ఇది పాపరహితమైన సనాతన ధర్మం. అదే విశేష ధర్మము అని బోధిస్తాడు విశ్వామిత్రుడు. ఆ బోధన మనకే. శ్రీరామునికి కాదు.

అంతే! తాటకను వధించాడు శ్రీ రాముడు. ఋషివాక్యంగా గొప్ప సత్యం పలికించాడు రామయ్య. ఆ రాఘవుడు.

శివ ధనుర్భంగం జరిగింది. సీతారాముల కళ్యాణము జరిగింది. తన శౌర్యం వల్లనే శివ ధనుర్భంగం జరిగిందనీ, సీతను పెళ్ళి చేసుకున్నాను అని శ్రీరాముడు ఎన్నడూ అనుకోలేదు.

ప్రియా తు సీతా రామస్య

దారాః పితృకృతా ఇతి।

గుణాద్రూప గుణాచ్చాపి

ప్రీతిర్భూయో భ్యవర్థత॥

తన తండ్రి అయిన దశరథుడు అంగీకరించిన సంబంధం కాబట్టే, రామునకు సీతపై ప్రేమ కలిగింది. సీత, తన (ఆత్మ)సౌందర్యము చేతనూ, సద్గుణముల చేతనూ రామునకు తనపై గల ప్రేమను ఇంకా వృద్ధి అయ్యేలా చేసుకుందని ఆదికవి వాల్మీకి మహర్షి అంటాడు శ్రీ రామాయణంలో.

ఈ సీతాకల్యాణం వరకూ కథను నడిపించినది మహర్షి విశ్వామిత్రుడు. బ్రహ్మర్షికా మారిన తన కథను రామునికి తెలుపుతూ మరీ! మానవుడు సంకల్పించుకుంటే దైవానుగ్రహంతో సాధ్యం కానిది ఉండదని మానవులకు బోధిస్తూ.

తనయుని వివాహం విషయంలో తండ్రిదే సర్వాధికారం అన్న వైదిక వివాహ ధర్మానికి కట్టుబడ్డవాడు శ్రీరాముడు.

శ్రీరామ పట్టాభిషేక ముహుర్త నిర్ణయం జరిగింది.

కానీ,

అదే ముహుర్తానికి పదునాలుగేళ్లు వనవాసం చెయ్యాలి అని శ్రీరాముని ఆదేశించింది పినతల్లి కైక!

చిరునవ్వుతో అంగీకరించాడు శ్రీరాముడు.

మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా? సందేహాన్ని వ్యక్తం చేసింది కైక.

రామో ద్విర్నాభి భాషతే। రాముడు ముందొకటి, వెనుకొకటి మాట్లాడడు. ఒక విధంగా చెప్పి, మరొక విధంగా చెయ్యడు. ఒకే మాట, ఒకే బాణం.

అమ్మా! ఈ రామునకు రెండు నాలుకలు (మాటలు) లేవు. పితృవాక్య పాలనమే నా ధర్మం అన్నాడు శ్రీరాముడు.

అలాగే అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అదీ రాముని ఆయనం, ధర్మం. శ్రీరాముని మనస్సు, మాట, చేత ఒక్కటే. అందులో మార్పు వుండదు. అప్పుడే ధర్మాచరణ సాధ్యం. అదే చేసి చూపించాడు రాఘవుడు.

అక్కడ కూడా ఎందరో ఋషులను, మహర్షులను కలిశాడు. వారు చెప్పిన మార్గంలోనే నడిచాడు. భరద్వాజ మహర్షి నుంచీ కపిల మహర్షి వరకూ. అందుకే ఆ యా మహర్షులున్నంత కాలం, వారి మార్గాన్ని జనులు అనుసరించినంత కాలం శ్రీరాముని కీర్తి దిగంతాలకూ వ్యాపించింది. వ్యాపిస్తున్నది. వ్యాపిస్తుంది.

భూతభవ్యభవత్ప్రభుః! (4వ నామం)

త్రికాలాముల యందూ ఆయన కీర్తి వ్యాపిస్తూనే ఉంటుంది. అందుకే ఆయన విష్ణువు. అందుకే పృథివీ పతులను విష్ణువుతో పోల్చేది. ధర్మాచరణ ద్వారా తమ కీర్తిని దిగంతాల వరకూ వ్యాపింపజేసుకొనుట వారి కర్తవ్యం. దీన్ని తన నడత ద్వారా చూపిన వాడు

విశ్వం విష్ణుః!

అనే వ్యాపకత్వాన్ని ఇలా మనకు అవగతం చేసిన వాడు శ్రీరామచంద్ర ప్రభువు. ఆ శ్రీ యే సీతమ్మ. ఎక్కడో విడిగా ఉండదు. ఆయన హృదయంలోనే ఉంటుంది. అందుకే ఆయన ఒకటి అనుకున్న చోట రెండింతలధిక ఫలితాన్ని అందిస్తుందా అమ్మ. లవకుశులిద్దరు.

శ్రీరామపట్టాభిషేకం మహావైభవంగా జరిగిన తరువాత, కొంతకాలానికి అష్టావక్రమహర్షి సీతారాములను చూసేందుకు అయోధ్యకు విచ్చేశాడు. సీతారాముల నుంచీ తగు రీతిన స్వాగతసత్కారాలను అందుకున్నాడు. తనకు నమస్కరించిన సీతమ్మను దీవించాడు.

వీరప్రసవా భూయాః।

వీరులను కనుదానివి కావలసినది గాక!

ఆ దీవెన శ్రీరామునికి ఎంతగానో నచ్చింది.

భగవన్, అనుగృహీతాః స్మః।

మహాత్మా, మేము (అంటే మా వంశస్థులము) అనుగ్రహింపబడ్డాము.

లౌకికానాం హి సాధూనామ్ అర్థం వాగనువర్తతే।

ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోఽనుధావతి॥

లౌకికులు కార్యశూరులైన సత్పురుషులు తాము ఒక ఘనకార్యాన్ని చేసిన తరువాతనే అలా చేశామని అంటారు. కాని, ఆద్యులైన ఋషులు ఒక మాటను పలికితే, ఆ మాట యథాతథంగా వెనువెంటనే జరిగిపోతుంది.

ఇలా అనుకుంటూ శ్రీరాముడు ఎంతగానో సంబరపడిపోయాడు.

ఇది భవభూతిమహాకవి తన ఉత్తరరామచరితంలో దర్శించి చెప్పిన ముచ్చట.

ధర్మాచరణ ద్వారా తన కీర్తిని అన్ని దిశలలోనూ వ్యాపింపజేసెడి వాడు విష్ణువు.

ఆయనే రాముడు. శ్రీరాముడు. సీతారాముడు. జగదభిరాముడు. రాఘవుడు. దశరథాత్మజుడు. కౌసల్యానన్దనుడు.

శ్రీరాముడు ఆచరించి చూపాడు. మనం అది అనుసరించాలి. ఇది ద్వైతము.

శ్రీరాముడే విష్ణువు (పైన చెప్పినదంతా). అంటే వ్యాపించే గుణం (ధర్మం) కలిగిన వాడు. ఆయన మన అందరి హృదయాలలో ఉన్నాడు. వ్యాపించే ఉన్నాడు. మనమంతా ఆయనలో భాగమే. ఆయన/ఆ విశ్వ శక్తి పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మలో భాగమే మనం. లేదా అదే మనం. తత్సమ. ఇది అద్వైతం.

మూర్తీభవించిన ధర్మమే శ్రీరాముని ఆకారంలో వచ్చి ధర్మాచరణను దిగంతాలకూ వ్యాపించేలా చేసి, పృథ్వీ పతి అయ్యి విష్ణువయ్యాడు. మనకు సులభంగా అవగతమయ్యేలా చేసి సౌలభ్యానికి పరాకాష్టగా నిలిచాడు. ఇది విశిష్టాద్వైతం. అద్వైత భావనతో కలిపి ఇది కూడా.

ధర్మాచరణ ద్వారా తన కీర్తిని అన్ని దిశలలోనూ వ్యాపింపజేసెడి వాడు విష్ణువు.

ఎలా చేయగలిగాడు? ఓజస్సు, సహస్సుల వలన. అదే వషట్కార నామం.

(సశేషం)

Exit mobile version