[‘పుస్తక సురభి’ శీర్షికలో భాగంగా ఇస్మాయిల్ దర్బేష్ రాసిన, వి. రామస్వామి అనువదించిన ‘తలష్‌నామా: ది క్వెస్ట్’ అనే నవలని సమీక్షిస్తున్నారు స్వప్న పేరి.]
ఇస్మాయిల్ దర్బేష్ రాసిన ‘తలష్‌నామా: ది క్వెస్ట్’ అనే పుస్తకాన్ని వి. రామస్వామి ఆంగ్లంలోకి అనువదించారు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముస్లింలు మెజారిటీగా ఓ గ్రామపు సంక్లిష్ట ప్రపంచంలోకి పాఠకులను ఆహ్వానిస్తుందీ నవల. ఈ ఉత్కంఠభరితమైన తొలి నవలలో రిజియా అనే దృఢమైన మనస్సు గల విద్యావంతురాలు ప్రధాన పాత్ర. ఆమెకి ఓ లోతైన బాధాకరమైన రహస్యం ఉంటుంది. ఆమె తన ట్యూటర్, హిందువు అయిన్ సుమన్ నాథ్‌తో పారిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు, అది వ్యక్తిగత సమస్య స్థాయిని దాటి, సమాజంలో సంక్లిష్ట భావోద్వేగాలకూ, ఉద్రిక్తతల సుడిగాలికి కారణమవుతుంది. ఆధునిక భారతదేశంలో ప్రేమ, మతం, గుర్తింపు, సామాజిక అంచనాలతో ముడిపడి ఉన్న వాస్తవాలకు ఉపశమనం కలిగిస్తుంది. నిజమైన సామాజిక పోరాటాల అన్వేషణగా సాగే ఈ నవల నేపథ్యం – సమకాలీన పాఠకులకు ఆసక్తికరంగా, అత్యంత సన్నిహితమైనదిగా అనిపిస్తుంది.
విశ్వాసాన్ని, దాని పలు వైరుధ్యాల మధ్య సున్నితంగా చిత్రించడం ఈ నవల గొప్ప బలాల్లో ఒకటి. దర్బేష్ మతాన్ని ఒక స్థిర వ్యవస్థలా కాకుండా, దాన్ని పాటించే ప్రజలచే రూపొందించబడిన ఒక సజీవ, ప్రాణశక్తిగా పరిగణిస్తూ, అందులోని అన్ని లోపాలతో, వైరుధ్యాలతో ప్రదర్శిస్తారు. ఆయన కథనం ఇస్లాంలోని అంతర్గత ఉద్రిక్తతలను లోతుగా పరిశీలిస్తుంది, సంస్కరణవాద ఉద్యమాలను, పరమత సహనంతో జీవించడంలోని సవాళ్లను తాకుతుంది. తన సొంత సందేహాలతో, నమ్మకాలతో కుస్తీ పట్టే తాహిరుల్ అనే ఓ గ్రామపు ఇమామ్ వంటి పాత్రల ద్వారా, ఈ పుస్తకం మతవిశ్వాసపు వ్యక్తిగత, రాజకీయ కోణాలను పరిశీలిస్తుంది. ఏది మంచి, ఏదు చెడు అనే పద్ధతిని తిరస్కరించి, పాఠకులను వారి మనస్సులలో నమ్మకం, గుర్తింపు గురించి బహుళ సత్యాలను, కొన్నిసార్లు విరుద్ధమైన సత్యాలను ఒకేసారి గ్రహించమని సవాలు చేస్తుంది.
రిజియా, సుమన్ నాథ్‌ల సున్నితమైన, పరిపూర్ణమైన ప్రేమ కథ ఈ నవలకి కేంద్రం, ఇది విస్తృతమైన సామాజిక పక్షపాతాలను, హద్దులను పరిశీలించడానికి శక్తివంతమైన దర్పణంగా పనిచేస్తుంది. వారి ప్రేమకథ మతదురాభిమానం, మతపరమైన అనుమానం, కఠినమైన సామాజిక నిబంధనల బాధాకరమైన పరిణామాలను స్పష్టంగా బహిర్గతం చేస్తుంది. పాతుకుపోయిన మతపరమైన హద్దులను ప్రేమ అధిగమించే అవకాశం గురించి; సామూహిక అంచనాల నేపథ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛలను పాటించడంలో చెల్లించే మూల్యం గురించి ఈ నవల జటిలమైన ప్రశ్నలను రేకెత్తిస్తుంది. సులభమైన పరిష్కారాలను అందించే బదులు, కథనం నిజమైన మతాంతర సంబంధాల సంక్లిష్టతకు అద్దం పడుతుంది; సంప్రదాయాల పట్ల విధేయత, వ్యక్తిగత కోరికల మధ్య ఎదుర్కోవాల్సిన సున్నితమైన సమతుల్యతని నిజం చేస్తుంది.
దర్భేష్ కథ చెప్పే శైలి – సరళమైన కథనాన్ని, లోతైన ప్రతిఫలానాన్ని ఆహ్వానించే తాత్విక ఆలోచనలను మిళితం చేస్తుంది. నవల గణనీయమైన నిడివి, కొన్నిసార్లు విస్తృతమైన వేగం పాఠకులను వేగంగా చదివేట్లు చేసినా; సద్నహతి గ్రామంలోని సామాజిక-రాజకీయ నిర్మాణపు గొప్ప వివరణాత్మక వర్ణన – వచనంలో పూర్తిగా లీనమయ్యే వారికి ప్రతిఫలమిస్తుంది. నవల అంతటా అల్లిన సూక్ష్మ హాస్యం – తేలికదనాన్ని, చేరుబాటును జోడించి, గంభీరమైన సన్నివేశాలను సమతుల్యం చేస్తుంది. కథ దాని కదే మోపలేని భారంగా మారకుండా నిరోధిస్తుంది. ఈ మిశ్రమం పుస్తకాన్ని అంతర్దృష్టి, భావోద్వేగాల పొరలుగా చేస్తుంది, స్పష్టమైన సాంస్కృతిక, భావోద్వేగ చిత్రణను అందిస్తుంది.
వి. రామస్వామి గారి అనువాదం గొప్ప విజయం సాధించింది, ఇది మూల బెంగాలీ సాంస్కృతిక సూక్ష్మ నైపుణ్యాలను, భావోద్వేగపు లోతును అత్యంత నైపుణ్యంతో ప్రదర్శించింది. నవల ప్రధాన బలాన్ని, మూల సందేశాన్ని కోల్పోకుండా అనువాదకుడు సామాజిక చిక్కులను, భాషా లయలను, హృద్యమైన భావోద్వేగాలను వ్యక్తంచేయగలుగుతాడు. జాగ్రత్తగా చేసిన ఈ అనువాదం నవల పరిధిని విస్తృతం చేస్తుంది, ఇంగ్లీష్ మాట్లాడే పాఠకులు దర్బేష్ గారి గుర్తింపు, విశ్వాసం, సమాజపు శక్తివంతమైన అన్వేషణను స్పష్టత తోనూ, బిగ్గరగానూ అభినందించడానికి వీలు కల్పిస్తుంది.
అయితే, ‘తలష్‌నామా’ అంత తేలికగా చదవగలిగేది కాదు. దానికి సహనం, మేధోపరమైన బాధ్యత అవసరం, ఎందుకంటే దాని తాత్వికమైన సాంద్రత; నెమ్మదిగా సాగే కథనం వంటివి – సూటిగా కథ చెప్పడాన్ని లేదా వేగవంతంగా సాగే కథాంశాలను ఇష్టపడే పాఠకులను అంతగా మెప్పించవు. అయితే, సామాజిక వాస్తవాలను, వ్యక్తిగత సందిగ్ధతలను – సూక్ష్మ నైపుణ్యం, ధైర్యం, సాహిత్యపు ఆధునికతలతో ఆలోచనాత్మకంగా విడదీసే నవలలను ఇష్టపడేవారికి, ఇది లోతైన ప్రతిఫలదాయకమైన అనుభవాన్ని అందిస్తుంది. మతం, రాజకీయాలు, మానవ సంబంధాల ఇతివృత్తాలను విమర్శనాత్మకంగా ప్రస్తావించడం ద్వారా ఇది సమకాలీన భారతీయ సాహిత్యానికి గణనీయమైన చేర్పుగా నిలుస్తుంది.
చివరగా, ‘తలష్‌నామా: ది క్వెస్ట్’ అనేది ఒక నవల కంటే ఎక్కువ! ఇది విభజిత ప్రపంచంలో – అనురాగం, విశ్వాసం, ఇంకా మానవ సంబంధాల – సాహసోపేతమైన, ఉత్తేజకరమైన ప్రతిఫలనం. రిజియా ప్రయాణం, సద్నహతి గ్రామపు స్పష్టమైన చిత్రీకరణ ద్వారా, ఇస్మాయిల్ దర్బేష్ ఒక చక్కని కథనాన్ని రూపొందించారు, ఇది పరిధిలో ఇతిహాసం స్థాయిని, వివరాలలో లోతైన వ్యక్తిగత స్థాయిని అందుకుంది. కఠినమైన సత్యాలను ప్రకాశవంతం చేయడం లోనూ; సామాజిక, మతపరమైన విభజనలలో సానుభూతిని పెంపొందించడంలోనూ సాహిత్యానికున్న శక్తికి ఈ నవల నిదర్శనం. ఆలోచనాత్మకమైన, సామాజికమైన అవగాహన ఉన్న పాఠకులకు ఈ పుస్తకం చదవడం ఓ మరపురాని అనుభూతిగా మిగులుతుంది.
***
Author: Ismail Darbesh
Translator: V. Ramaswamy
Published By: HarperCollins
No. of pages: 572
Price: ₹699/- Paperback
Link to buy:
https://www.amazon.in/Talashnama-Quest-Ismail-Darbesh/dp/9354898955/
స్వప్న పేరి ఫ్రీలాన్స్ బ్లాగర్. పుస్తక సమీక్షకురాలు. సినిమాలంటే ఆసక్తి.