[సుధా మురళి గారి ‘తడి ఆరని వాక్యమొకటి’ కవితా సంపుటిని సమీక్షిస్తున్నారు శ్రీమతి రాధకృష్ణ కర్రి.]
చిన్నప్పుడు పరకాయప్రవేశం గురించి విన్నాను. కొన్ని జానపదచిత్రాల్లో చూశాను. ఆదిశంకరాచార్యులవారు కూడా పరకాయప్రవేశం చేశారని పెద్దవాళ్ళు చెబితే తెలుసుకొన్నాను. సరిగ్గా ఇలాంటి పరకాయప్రవేశాన్ని కవయిత్రి శ్రీమతి సుధా మురళి (మా సుధమ్మ) సమాజంలో ఉన్న స్త్రీల, ఇతర బాధిత వర్గాల ఆత్మల్లోకి చేశారు. వాళ్ళ బాధలను వారితోపాటు తానూ అనుభువించి ఆ బాధిత స్త్రీల గుండెలకు గొంతుకగా మారి సమాజాన్ని ప్రశ్నించారు. అయితే కచ్చితంగా ఫెమిస్టు మాత్రం కాదు. కేవలం సమాజానికి స్త్రీ పట్ల ఉన్న దృష్టి లోపాన్ని సరిచేసుకోమంటూ ఆవేదన చెందారు. అలాగే సమాజంలో ఉన్న అనేక మలినాలను, అసమానతలను అది జెండర్‌తో సంబంధం లేకుండా కుల, మత, వృత్తి ఆధారంగా జరిగే అనేక అన్యాయాలను ప్రశ్నించే అక్షరాయుధమవుతారు.
కవయిత్రి సుధామురళి సమాజంలో భాగమైన సాటి స్త్రీ. ఇతరుల బాధను తన గొంతుకతో ఎప్పటికప్పుడు కవిత్వమై ప్రవహిస్తూనే, గరళ కంఠుడిలా దాచి దాచి ఇంక భరించలేను అనుకునే స్థితిలోకి చేరి ఇలా ఒక్కోక్క కవితగా కాకుండా ఓ ‘తడి ఆరని వాక్యమొకటి’ పుస్తకమై మానసిక వైకల్యం ఉన్న సమాజం గుండెల్లోకి కొన్నింటిని సూటిగా, ఇంకొన్నింటిని సుతిమెత్తటి సూదులవంటి కవిత్వంతో ప్రశ్నలను గుప్పిస్తారు.
సుధామురళి గారిది ఒక విభిన్నమైన శైలి. ఒక్కో కవిత ఒక్కో విభిన్నమైన ఆత్మను కలిగి మొత్తానికి సమాజమే ఓ వస్తువుగా మారిన కవితా సంపుటి ఈ ‘తడి ఆరని వాక్యమొకటి’. ఆ తడి ఎన్నటికైనా ఆరాలని కవయిత్రి ఆలోచన. అందుకే ‘సాత్విక’ గా “..నేను సజీవ శిలకు తార్కాణం / ఎవరికేం తెలుసు / నా లోపల ఎన్ని సుళ్ళు మౌనముద్రలు వేస్తున్నాయో / ఎవరికేం అంచనా ఉంటుంది / నా వేదనా భాగాలు ఎన్ని తునకలై లోలోపలే విరుచుకుపడుతున్నాయో/ అతని ప్రబంధానికి నా చుట్టు కొలతలు తూనికరాళ్లు / ఇతని వాదనా పటిమకు నా రూపురేఖలు వజ్రాయుధాలు/..” అంటూ స్త్రీ కేవలం వర్ణనకు లేకపోతే శృంగారానికి లేదా శారీరక సుఖం ఇచ్చే ఒక వస్తువు లేదా ఒక ఉత్పాదక యంత్రం అని మాత్రమే చూసే చూపులకు.. స్త్రీ అస్తిత్వం మీద పురుషుడి అవకాశవాదాన్ని, తోడేలు ప్రేమను తోలు వొలిచినట్లు వొలిచేస్తారు.
గాయం మానక ముందే మరో గాయాన్ని చేసి ఆ గాయాన్ని ఎప్పుడూ ‘పచ్చిగాయం’గా ఉంచే సమాజాన్ని నిలదీస్తూ.. “అబద్ధమైతే ఇదే / శీలం పోని ఆడదంటూ లేకపోవడం / పై పై దుస్తుల చాటులతో / పోగొట్టుకోబడిన ఆత్మాభిమానం సాక్షిగా / నిత్య శంకల అగ్ని పునీతగా మిగలబడటం/ నువ్వనుకున్నట్లు / లోనేక్కడో ఉండేదా శీలం / నువ్వు మానభంగ చేసినట్లు / పైపై తాకుళ్ళ వేటతో కోల్పోనిదా శీలం?!” అంటూ.. బయటకు పతితులుగా కనబడుతూ మెదడులో నీచమైన ఆలోచనలతో వందమందిలో నిలబడినా కళ్ళతోటే అంగాంగాలను తడిమే లోకంలో శీలం అంటే కేవలం లోపల ఉండే అంగమా? దానిని ఛిద్రం చేస్తేనే శీలం పోగొట్టుకున్నట్లా..? కళ్ళకు చేతుల్ని మొలిపించి తడిమితే అది శీలం పోవడం కాదా అంటూ సూటిగా ప్రశ్నిస్తారు. ఈ కవిత చదివిన ఓ పాఠకురాలిగా కవయిత్రి భావన ‘అబద్ధం’ అనే ఒక్క సమాజాన్నైనా నేను చూడాలనుకుంటున్నాను. బహుశా అది ఈ భూమి ఉన్నంత కాలం జరగదేమో. ఎందుకంటే ఎవడి దుర్మార్గానికో బలైన ఆడపిల్ల కాసింత ధైర్యం తెచ్చుకుని తన పని తాను చేసుకుందాం అనుకుంటే.. శీలం లేని ఆడది, శీలం చెడిన ఆడది అంటూ మానసికంగా హింసించే సమాజానికి ఎప్పుడు తెలుస్తుందో కదా.. శీలం అనేది కేవలం మనసుకు మాత్రమే చెందింది..అది తమకు కూడా వర్తిస్తుంది అని..!
‘జై’హింద్’ అనే కవితలో.. కామాంధులకు దూరంగా స్త్రీ దేహాన్ని పొమ్మంటూ చాలా ఆవేదన చెందుతూ ఇలా అంటారు కవయిత్రి.. “ఓ నా మాతృస్థానమా / నన్ను మన్నించు / నీవున్నందుకే ఈ కష్టాలన్నీ / అందుకే నేను త్యజిస్తున్నా / ఓ నా అమృత కలశాల్లారా / నన్ను శపించకండి / మీ ఎత్తుల మోతల్లో నేను దహించబడుతూ / మిమ్మల్ని విడిచేస్తున్నా..”. ఏ దేహం కోసం, ఏ అంగాల వలన స్త్రీ / ఆడ పిల్లలు ఇబ్బందుల పడుతున్నారో, ఆ భాగాలను ఈ శరీరం విడిచి దూరంగా పొమ్మని అనేక స్త్రీ మనసులలోని మాటను తన మాటగా చెబుతారు ఈ కవయిత్రి.
శీలమంటే.. మట్టితో నిర్మితమై మట్టిలోనే కలిసిపోయే కాయానిదేనా.. అయితే ‘మా శీలాలను మేమే రద్దు చేసుకుంటాము’ అనే శీర్షిక ఉన్న కవితలో ప్రకటిస్తుంది. ఈ శీలాలను తమ రాజకీయ, కుల, మత, వర్గ స్వలాభాల నిచ్చెనకు, ఎత్తుగడలకు వస్తువుగా, న్యాయం కోసం వెళ్లిన చోటులో మరోసారి శీలం అనబడే ఆ కనబడని బ్రహ్మహదార్థాన్ని కాపాడుకోలేకపోవడం.. కొత్త తరహాలో సాక్ష్యం కోసం.. ఎక్కడెక్కడ తాకాడో, ఎలా మానభంగించాడో చెప్పమంటూ మరోమారు పదే పదే మాటలతో మానభంగం చేయడం.. ఇన్ని అన్యాయాల మధ్య రక్షణలేని ఈ తుచ్ఛ దేహాలకు ఎంతవరకు కాపలా కాస్తాం? అందుకే మానం.. అభిమానం అనే మాటలకు అర్థాలు తెలియని చదువుకున్న మూర్ఖపు సమాజంపై తిరుగుబాటు జెండా ఎగరడాన్ని మనం ఈ కవితలో చూస్తాం.
ఇలా ఒకటా రెండా.. అన్ని వర్ణాలా, వర్గాల స్త్రీల గుండెల్ని తాను పొదువుకొని, ఇంకొన్ని గుండెల్లోకి తాను ప్రవేశించి శిశువుగా పుట్టిన నాటి నుండి వార్ధక్యం వచ్చినా మారని అనేక రూపాలలో స్త్రీ పడుతున్న బాధలకు తానే గొంతుకగా మారి, ఆ గొంతుకకు కలాన్ని కట్టి, ఆవేదనను సిరాగా మార్చి అక్షరరూపం ఇచ్చిన కవితలు చాలా ఉన్నాయి.
ముందుగానే చెప్పినట్లు ఇది ఫెమినిస్ట్ పోయెట్రీ కాదు. ఈ పొత్తంలో కేవలం స్త్రీకి చెందిన ఆవేదన, అన్యాయం మాత్రమే కాదు, కాలం కంటే వేగంగా పరుగులు పెడుతున్న మానవుల అనుభూతుల్ని కాపాడుకోలేనితనాన్ని ‘closed vibes’, ద్వారా చెబుతారు ఈ కవయిత్రి. పక్కవాళ్ళ జీవితంలో సరే, కనీసం మన జీవితంలో మనం ఆస్వాదించాల్సిన ఏ అనుభూతుల్ని అనుభవించలేకపోవడాన్ని చెప్పిన తీరు చాలా బాగుంది. ఈ కవిత చదివిన పాఠకులు తన గతాన్ని తవ్వి చూసుకోవడం ఖాయం.
“జరుగుతున్న ఘోరాన్ని చోద్యంలా చూస్తూ / ఆర్తనాదాలు జోలలనుకుంటూ/ గుడ్లు మిటకరించి చెవుల నిండుగా సీసాన్ని కుమ్మరించి / నాకెందుకు మత్తులో జోగుతున్న / నా తోటి చచ్చు మొహాల్లారా చాలించండి చాలించండి బతుకును చాలించండి..” అనే వాక్యాలలో బిజీ బీ లుగా మారిన ఈ మానవ సమూహానికి మానవత్వం అనే మాట మళ్ళీ కొత్తగా పరిచయించాలేమో. ఎందుకంటే రోడ్డు మీద, లేదూ మన పక్కింటిలోనో ఏ ప్రమాదమో జరిగితే గాయపడిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చడం బదులు సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి యూట్యూబ్‌లో వ్యూస్ కోసం పెట్టడం, జరుగుతున్న విషయాలను కంటికి వేడుకలా లేదా చోద్యంగా చూస్తూ ఉండడం వంటి హేయమైన చర్యలను చూసి మానవత్వానికి ‘RIP మనవత్వమా’ అనే శీర్షిక ద్వారా సంతాపం ప్రకటిస్తూ మరోసారి సమాజాన్ని నిద్రలోంచి మేలుకోమని చెప్పడం కవయిత్రికి సమాజం పట్ల ఉన్న ఆవేదనను తెలియచేస్తుంది.
‘హే ప్రభూ’ అనే శీర్షికలో.. “నువ్వు చూడట్లేదేమో కానీ / లేళ్ళన్నీ ఇప్పుడు తాబేళ్ళు అవుతున్నాయి / సెలయేళ్లపై బద్దకం కప్పబడి / ప్రవాహాలు స్తబ్దత చాటుకు చేరిపోతున్నాయి / రక్తం ఉడకాల్సిన చోట భయపుమంటపై మానం కుతుకుతాలాడుతోంది / జవాన్ని చంపుకున్న జీవం / కబోది బతుకు బతికేస్తోంది..” అంటూ ఈ కవితలో సమాజం, ముఖ్యంగా యువతపై సంధించిన ఓ సూటి ప్రశ్నను చూస్తే కవయిత్రి వృత్తిరీత్యా టీచరు అయినందుకు.. అక్కర్లేనితనాన్ని పైపూతగా, నిర్లక్ష్యానికి, బద్దకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన యువత తీరుతెన్నులుపట్ల ఎంత ఆవేదన చెందారో తెలుస్తుంది.
ఓ కవితలో పురుషుడు గొప్పా / స్త్రీ గొప్పా అని ప్రశ్నిస్తూనే ఈ సృష్టికి, కుటుంబానికి, సమాజానికి ఇద్దరూ ఎంత అవసరమో తెలియచేస్తారు కవయిత్రి. ఈ సంకలనం నిండా ఎన్నో ప్రశ్నలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచింప చేస్తాయి. జంతువుల కంటే దారుణంగా ఉన్నామా!? పాలిచ్చే పశువులకుండే కొద్దిపాటి సాధుత్వం కూడా మనలో లేదా!? వివేకం, విచక్షణ, విజ్ఞానం కలిగిన మనుషులం మనం ఇలా బ్రతుకుతున్నామేంటి..!? వంటి ప్రశ్నలు మనల్ని చుట్టుముడతాయి.
సుధా మురళి కవయిత్రిగా బాహ్య రూపం ధరించి.. సమాజాన్ని, దాని చర్యలను, అన్ని వర్గాల దుఃఖాలను తాను మోస్తూ.. కూతురుగా, కోడలిగా, ఉపాధ్యాయురాలిగా.. మంచి మార్పును కోరుకునే ఓ బాధ్యత కలిగిన సృజనకారిణిగా అనేక పార్శ్వాలతో పరికించి, అనేక కోణాలతో పరిశీలించి, అనేక పాత్రలు పోషిస్తున్న వ్యక్తులను పరిశోధించి, పరివేష్టించి, ఈ వేదనలతో తాను బాధింపబడి, బంధింపబడి, బాధ్యతల కావిడిని భుజాలకెత్తుకొని అందరి ఆవేదనలకు అక్షరరూపం కల్పించి.. ప్రశ్నించే గొంతుకై.. ఇలా తడి ఆరని వాక్యమై పాఠకుల ముందుకు వచ్చి నిలుచున్నారు.
***
రచన: సుధామురళి
పేజీలు: 202
వెల: ₹ 200/-
ప్రతులకు:
పద్మ సుధామణి
డో.నెం. 6-4-5, పిచ్చిరెడ్డి తోపు,
జ్యోతి మెడికల్స్ ఎదురుగా,
కరెంట్ ఆఫీసు దగ్గర, నాయుడుపేట,
తిరుపతి. 524126
సెల్: 9491311049, 8309622246