[డి. బి. గాయత్రి గారు రచించిన ‘తారలు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
ఆకాశంలో
మిలమిలలాడే తారలు
చిన్నారి పాపల
అమాయక స్వప్నాల
స్వచ్ఛతలోని ఔన్నత్యం
నింగిని తాకితే
ఆ కలల అందానికి
ఆనందంతో పొంగిన
ఆకాశరాజు గుండెల
నవ్వుల మెరుపులు
ఆ కలల స్వచ్ఛతలో
హరివిల్లులు పూయిస్తే
రంగులు మారుతూ
తళతళ మెరుస్తూ
చూపరుల కన్నులలో
దివ్వెలు వెలిగిస్తున్న
చిన్నారి పాపల
సుకుమార స్వప్నసుమాలు
ఆకాశంలో
మిలమిలలాడే తారలు!