Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తానొకటి తలిస్తే

[శ్రీమతి దాసరి శివకుమారి రాసిన ‘తానొకటి తలిస్తే’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“బయోడేటా తయారు చేశావు. కాని మనమ్మాయి పుట్టిన తేదీ పెళ్లి సంబంధాలప్పుడైనా కరెక్ట్‌గా వేస్తే బాగుంటుంది అరుంధతీ”, అన్నాడు భర్త.

“స్కూల్లోనూ, కాలేజీలోనూ అంతా ఇదే తేదీ వుంటుందిగా. ఇప్పుడు మారిస్తే ఏం బాగుంటుంది? మ్యారేజీ బ్యూరోలకిచ్చే దానికీ మాత్రం మార్చటం ఎందుకు? అలా చెప్తే మనమ్మాయి వయస్సు ఇంకో రెండేళ్లు పెరుగుతుంది. జాగ్రత్త గల పిల్ల కాబట్టి. దాని వయస్సు కనపడకుండా మొయిన్‌టెయిన్ చేసుకుంటున్నది” అంటూ తాను తయారు చేసిన వివరాలు, మరోసారి చూసుకుని అరుంధతి తృప్తిపడింది. ఆ తర్వాత మ్యారేజీ బ్యూరోకు పంపింది. ఇక ఆ రోజు నుండి తానే ఫోన్లు చేసి తెలిసిన వాళ్లకు బంధువులకు చెప్పసాగింది.

“మా అమ్మాయి శిరీష తెల్సుగా ‘పోలారిస్’ కంపెనీ చెన్నై బ్రాంచ్‌లో ఉద్యోగం చేస్తున్నది. హెచ్.ఆర్. కదా? దాదాపు లక్షరూపాయలు జీతం తెచ్చుకుంటున్నది. మా అమ్మాయికి మేం ఎప్పుడు పెళ్లి చేస్తామంటామోనని బోలెడుమంది కాచుకుని కూర్చున్నారు. చిన్నపిల్ల అని మేమ ఆగితే, మంచి పొజీషన్‌కు వెళ్లాకే పెళ్లి అని నా కూతురు అన్నది. ‘ఇప్పటికైనా ఒప్పుకో తల్లీ!’ అని నా కూతుర్ని ఎంతో బతిమాలితే ఇప్పుడు ఒప్పుకున్నది. శిరీష ఒప్పుకోగానే నీ చెవిన వేస్తున్నాను. పిన్నీ! బాబాయికి ఎవరైనా తెలిసిన వాళ్లుంటే చెప్పమను. మాక్కాబోయే అల్లుడు అందంగా, తెల్లగా, దర్జాగా వుండాలి. ఆస్తిపాస్తులు, మంచి ఉద్యోగం వుండాలి. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కూడా ఉద్యోగాలు చేస్కుకునే వాళ్లు. వాళ్లకు ఒక్కడే కొడుకూ అయితే బాగుంటుంది. తల్లిదండ్రులు ఉద్యోగస్థులయితే కొడుకు డబ్బుకు ఆశపడకుండా వుండారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పెళ్లికొడుకును చూడండి పిన్నీ. చిన్నా, చితకా సంబంధాల జోలికి అసలు పోవద్దు. మా స్థాయి నీకు తెలుసుగా పిన్నీ” అంటూ తనకు పిన్ని వరసయ్యే ఆమెకు వివరించి చెప్పింది అరుంధతి.

 ***

“ఏం చేస్తున్నారు? అరుంధతీ! ఖాళీగానే వున్నారుగా?” అంటూ పక్కింటి సుజాత వచ్చి కూర్చున్నది.

“ఆ ఖాళీగానే వున్నాను, రండి” అంటూ సుజాతను ఆహ్వానించింది.

కాసేపు పిచ్చాపాటీ ఆయిపోయాక ఇద్దరూ తమ కూతుళ్ల పెళ్లళ్లి గురించి మాట్లాడుకున్నారు. అరుంధతి మొదలుపెట్టింది.

“సుజాతగారూ! పెద్ద ఇల్లు కాకపోతే నాకూ, నా కూతురుకూ అస్సలు నచ్చదు. తన పెళ్లవగానే త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లోకే మా అమ్మాయి చేత కాపురం పెట్టిస్తాం. ఈ రోజుల్లో ఎలాగూ స్వంత కారున్న పెళ్లి కొడుకే వస్తాడు. అది కూడా ఏ ఫోర్డు కారు అయితే కాని నా కూతురుకు నచ్చదు. అత్తవారింట్లో మా అమ్మాయిని కన్న కూతుర్లా చూడాలి. అసలు పెళ్లి కుదిరి ఎంగేజ్‌మెంట్ రోజునే డైమండ్ నగల సెట్టు పెట్టగలగాలి.”

“చాలా నగలు మీరే చేయించానన్నారుగా అరుంధతీ? ఇంకా అత్తగారు పెట్టాలంటారేమిటి?”

“మీరు భలే వారే సుజాతగారూ? మీ స్థాయిలో అయితే పెట్టరేమోకానీ, మా స్థాయి వాళ్లు నగలు పెట్టకుండా ఎందుకుంటారు? మేము చేయించినవీ, వాళ్లు పెట్టేవీ అన్నీ నా కూతురు మార్చి మార్చి పెట్టుకుంటుంది. డైమండ్ నగలు పెట్టలేని వాళ్ల సంబంధం మేం అసలు చేసుకోం.”

“ఏమోనండీ, అరుంధతిగారూ! మీలాగా మేం పెద్ద పెద్ద కోరికలేం పెట్టుకోవటం లేదు. మా అమ్మాయి టీ.సి.యస్ హైదరాబాద్ లోని గచ్చిబౌలీ బ్రాంచ్‌లో పని చేస్తుంది. కుదిరితే ఈ సంవత్సరమో, వచ్చే సంవత్సరమో పెళ్లి చేద్దామనుకుంటున్నాం. కుర్రాడు మంచి వాడై, ఫ్యామిలీ కూడా మంచిదైతే చాలు. ఆ అబ్బాయి కూడా ఏదైనా కాస్త పేరున్న కంపెనీలోనే ఉద్యోగం చేస్తుంటే చాలనుకుంటున్నాను. మా అమ్మాయి కూడా పెద్ద షోకిళ్లు పోయేరకం కాదు.”

“చిన్నప్పటి నుండీ పేరిగిన వాతావరణం లెండి సుజాతగారూ. మా అమ్మాయివన్నీ ఖరీదైన అలవాట్లు” అన్నది మురిపెంగా.

కాసేపు కూర్చుని సుజాత వెళ్ళిపోయింది.

ఆ రోజు స్నేహితురాలు సరితకు ఫోన్ చేసింది అరుంధతి. “చూడు సరితా! నేను సంబంధం చూడమన్న మాట నిజమే. నువ్వు మొన్న చెప్పిన అబ్బాయి ఐఐటి ఖరగ్‌పూర్‌లో బి.టెక్, యమ్.టెక్ పూర్తి చేశాడు. తెలివిగలవాడే, ఒప్పుకుంటాను. కాని ఇప్పుడు అతనికొచ్చే ప్యాకేజీ అంత ఎక్కువేం కాదు. అది తప్పితే వెనకాల ఆస్తిపాస్తులు పెద్దగా లేవు. తెలివిగల వాడు, ముందు ముందు బాగా సంపాదిస్తాడంటున్నావు నువ్వు. వాళ్లది మరీ మధ్యతరగతి కుటుంబం. వాళ్ల అలవాట్లు కూడా అలాగే వుంటాయి. చూసి చూసి డబ్బు ఖర్చుపెట్టుకోవంటం ఇలా. కాని నా కుతురు థారాళంగా ఖర్చుపెడుతుంది. ఆ వచ్చే వాడు పైసా, పైసా లెక్కపెట్టుకుని ఖర్చుబెడుతుంటే నా కూతురు చిన్నబుచ్చుకుంటుంది. నువ్వు ఎన్నైనా చెప్పు సరితా, డబ్బు అంతగా లేని వాళ్లు ఒదిగొదిగి వుంటూ చిల్లర మనుషుల్లా అనిపిస్తారు. నా కూతురు ఉద్దేశం కూడా ఇదే. దాని మనసును మేం కష్టపెట్టలేం. ఈ సంబంధం కాదులే. మరో పెద్ద సంబంధంముంటే చెప్పు, వుంటాను”  అంటూ ఫోన్ పెట్టింది అరుంధతి.

‘ఈ అరుంధతి డబ్బు పిచ్చిలో పడి కొట్టుకుపోతున్నది. తన కూతురిక్కూడా ఇవే బుద్దులు నేర్పినట్లున్నది. ఆ పిల్ల అయినా పెద్ద ఉద్యోగం చేస్తున్నది కాని పెద్ద మనసును కలిగి లేదు. తాను చెప్పిన సంబంధం తాలుకు చంద్రశేఖర్ కుటుంబమంతా చాలా మంచివాళ్లు. చిన్నప్పటినుండీ బాగా తెలివిగా వుంటాడు. బాగా చదువుకున్నాడు. అతనిప్పుడు పదిహేను లక్షల ప్యాకేజీ తీసుకుంటున్నాడు. ముందు ముందు ఇంకా పెరుగుతుంది. ఇవన్నీ అరుంధతి అస్సలు ఆలోచించటం లేదు. ఒకేసారి పెద్ద కారూ, బంగళా, ఏ పాతిక ముఫై లక్షల ప్యాకేజీ తీసుకునేవాడు కావాలని, అచ్చం సినిమాల్లో లాగా జరిగిపోవాలని తల్లీ కూతుళ్లు ఊహించుకుంటున్నారు. అదేమంటే మాలాంటి ధనవంతుల ఆలోచనలు ఇలాగే వుంటాయంటుంది. ఇంతటి వాళ్లను ఒప్పించాలనుకోవటం నాదే మూర్ఖత్వం అవుతుంది’ అనుకున్నది సరిత.

రోజులు గడుస్తున్నాయి. మార్యేజీ బ్యూరో వాళ్ల మీదే అరుంధతి బాగా నమ్మకం పెట్టుకున్నది. అదే పనిగా వాళ్లు చెప్పే కబురు కోసం ఎదురు చూడసాగింది. ఆ ఆరాటాన్ని భర్త ప్రకాశరావు పసిగట్టాడు.

“మరీ అంత ఆరాటం పనికిరాదు అరుంధతీ. దేనికయినా టైం కావాలి” అన్నాడు ప్రశాంతంగా.

అరుంధతి తన ప్రయత్నాలేమీ మానలేదు. తన ఉద్దేశాలు చెప్తూ పరిచయస్థులు అందరికి తన కూతురుకు మంచి సంబంధముంటే చెప్పమని అడుగుతున్నది.

“అబ్బో! అరుంధతి మాటలు నేల విడిచి సాము చేసేటట్లున్నాయి. తన చూపులు నక్షత్రమండలంలో వున్నాయి. మనమేం చెప్పినా సవాలక్ష వంకలు పెడుతుంది. ఏదైనా సంబంధముందని చెప్పటం కూడా శుద్ధ దండగ” అనే ఉద్దేశానికొచ్చారు వారంతా.

ప్రకాశరావు మాత్రం తన పరిచయస్థుల కెవరికీ ఈ సంగతి చెప్పలేదు, భార్యా సంగతి తెలుసు కనుక. ఎట్టకేలకు అరుంధతి కోర్కెలకు తగిన సంబంధాన్ని కాకతీయ మ్యారేజీ బ్యూరో వాళ్లు సెలక్ట్ చేసి పెళ్లి కూతురు వాళ్లకూ, పెళ్లికొడుకు వాళ్లకూ కబురు చేశారు. రెండు వైపుల వాళ్లూ ఒక చోట చేరారు. ఆ అబ్బాయి బి.టెక్ తర్వాత యం.బి.ఎ. కూడా చేశాడు. ప్రస్తుతం ‘విప్రో’ కంపెనీలో చెన్నైలోనే ఉద్యోగం చేస్తున్నాడు. అతని వేతన ప్యాకేజీ కూడా ఆకర్షణీయంగానే వున్నది. అరుంధతి తెగ ఆరాటపడిపోయింది. తన కూతురు అతనూ ఇద్దరూ చెన్నైలోనే ఉద్యోగాలు చేస్తున్నారు. అతని తండ్రి టెలికామ్ డిపార్ట్‌మెంట్‌లో జె.ఇ. తల్లి హైస్కూల్ టీచర్. అమ్మయ్య అనుకున్నది. ఇళ్లూ వాకిళ్లూ స్థలాలు అన్నీ వున్నాయి.

“మీరేం వర్క్ చేయటం లేదా?” అనడిగింది అరుంధతిని పిల్లవాడి తల్లి.

కాస్త చిన్నతంగా అనిపించిది. అదేమీ బయట పడనియ్యకుండా ”పిల్లలిద్దరూ ఏమైనా, మాట్లాడుకుంటారేమో మనం వేరే గదిలో కూర్చుందాం. రండి” అంటూ బయటకునడిచింది.

అమ్మాయికి తాము కట్నంగా ఏమేం ఇవ్వాదలుచుకున్నారో ఇప్పుడే అరుంధతి చెప్పదల్చుకోలేదు. ముందు ఆ అబ్బాయి తన కూతురికి నచ్చాలి. ఆ తర్వాత పిల్లవాడు పనిచేసే చోటికెళ్లి ఆ జాబ్ ఎలాంటిదో, ఆఫీస్‌లో ఆ అబ్బాయి ఎలా వుంటాడో వగైరాలన్నీ ఆరాలు తీసుకోవాలి. అవన్నీ తమకు నచ్చిన తర్వాత ముందుకు వెళ్లాలి అనుకున్నది. పెళ్లికొడుకుతో మాట్లాడి శిరీష కూడా బయటకొచ్చింది. ఆ రోజు ఇంకేం మాట్లాడకుండా ఎవరి దారిన వాళ్లు వచ్చేశారు.

“పెళ్లికొడుకు ఫర్వాలేదమ్మా. బాగా బాధ్యతగానే ఫీలయ్యేరకం. నాతో పెళ్లికి ఇష్టపడే ఈ, పెళ్లి చూపులు కొచ్చారు గదా అని అడిగాడు. కాస్త దద్దోజనమే. నాకు బాగా నచ్చాడునుకో” అంటూ కితాబిచ్చింది శిరీష.

“అలాంటి వాళ్లయితేనే మనం బాగా సుఖపడతాం. తల్లిదండ్రులు కూడా ఫ్రవాలేదు. ఆ అబ్బాయి పని చేసే ఆపీసుకు కూడా మీ నాన్నగారెళ్లి కనుక్కొస్తారు. అప్పుడొక నిర్ణయించికొద్దాం.”

“నాన్నగారు ఎక్కడికో వెళ్లటమొందుకు? నెట్ ఓపెన్ చేస్తే అతని వివరాలు తెలుస్తాయి.”

“అలా కాదులే శిరీషా. ఆఫీస్ కెళ్లి చూస్తే అతని ప్రవర్తన ఎలాంటిదో కాస్త అంచనా వేయవచ్చు. ఎవరో ఒకరు తెలిసినవాళ్లు కనపడకపోరు. చూద్దాం.” అంటూ భర్తను ఆ విప్రో బ్రాంచ్‌కు పంపింది.

అతడిది చాలా సాఫ్ట్ కార్నర్ అని రిపోర్టు వచ్చింది. “మనం పాజిటివ్ గానే వుండొచ్చు అరుంధతి” అన్నాడు ప్రకాశరావు.

అరుంధతి మనసు గాలిలో తేలిపోయే దూదిపింజే అయింది.

“మీక్కూడా అమ్మాయి నచ్చితే మనం ప్రోసీడవుదామండీ” అని పెళ్లికొడుకు వాళ్లకు ఫోన్ చేసింది.

“మాకు జాతకాల పట్ల నమ్మకం బాగా వున్నది. మీరు అమ్మాయి జాతకం పంపండి. కావాలంటే మా అబ్బాయి జాతకమూ మీకిస్తాము. మీరు చూపించినా, చూపించకపోయినా మేం మాత్రం మా పంతులుగారికి జాతకాలు చూపించాల్సిందే” అన్నారు వాళ్లు.

‘ఇదేదో ముందే చెప్పొచ్చుగా’ అనుకుంటూ శిరీష పుట్టిన తేదీ, రాశి పాదాలు అన్నీ వ్రాసి పంపింది. వారం గడిచింది. వాళ్ల దగ్గర నుండీ ఏ సమాధానమూ లేదు. ఎందుకాలస్యం చేస్తున్నారో తెలియటం లేదు. కొంపదీసి జాతకాలు కలవలేదా ఏంటి? అని మథనపడసాగింది. తన కూతురు కూడా రెండు సార్లు అడిగింది “వాళ్లేమైనా చెప్పారా అమ్మా” అని.

“మనకు కొన్ని సంబంధాలు నచ్చటం లేదు. అలాగే వాళ్లకీ మన సంబంధం నచ్చకపోయి వుండొచ్చు. నచ్చలేదని మొఖాన చెప్పలేరు కదా? అందుకే మౌనంగా వుండిపోయుంటారు. పోనీ మరో సంబందం చూసుకోవచ్చు” అన్నాడు ప్రకాశరావు.

“ఇంతకుమించి మీ నోట్లో నుంచి మంచి మాటలు రావా?” అంటూ రుసరుసలాడింది అరుంధతి.

పది రోజులు గడిచిన తర్వాత తనే వాళ్లకు ఫోన్ చేసింది. ఆ అబ్బాయి తల్లి ఫోన్ ఎత్తింది.

“జాతకాలు చూపించారా అండీ?”

“ఆ చూపించామండీ.”

“ఏమన్నారో తెలుసుకోవచ్చా?”

“ఇద్దరి జాతకాలు కలవలేదండీ. పాయింట్లు సరిపోవటం లేదు. నేను మీకు ముందే చెప్పాను. మాకు జాతకాలంటే బాగా నమ్మకమని. ఎవరికి ఎవరు రాసిపెట్టారో లెండి” అన్నదామె.

“ఆగండాగండి. చిన్నప్పుడు మా అమ్మాయిది చాలా మంచి జాతకమని మా అమ్మావాళ్లు చెప్పారు. మరోసారి చూపిద్దాం. పోనీ ఈసారి నేను చూపిస్తాను.”

“ఇంకెవరికీ చూపించాల్సిన అవసరంలేదండీ. మీ అమ్మాయిది మంచి జాతకమైతే కావచ్చు. కాని మా అబ్బాయి జాతకంతో కలవాలిగా. అలా కలవని సంబంధాన్ని మేమిష్టపడం.”

ఇలాంటి నెగటివ్ జవాబొస్తుందని అరుంధతి అస్సలు ఊహించలేదు. ఉండేలు దెబ్బతిన్న పక్షిలా విలవిలలాడింది. భర్తతో మాట్లాడినా ఏం లాభం వుండదు. మరో సంబంధం చూసుకోవచ్చు. అనే అంటాడు. ఎంత సన్నగా చిన్నగా కనపడినా కూతురు వయస్సు ఎక్కడికి పోతుంది? ఇప్పటికే పెళ్లి వయస్సు దాటుతుంది. అని తెగ ఆరాటపడింది. ఆ పగలంతా ఆలోచిస్తూనే వున్నది. శివాలయంలో వుండే పూజారి భట్టాచార్యగారు జాతకాలు చూడటంలో దిట్ట అని విన్న మాట గుర్తుకొచ్చింది. సాయంకాలం కాగానే బయలుదేరి శివాలయానికెళ్లింది. ఆ భట్టాచార్యగారు తీరుబాటుగానే వున్నారు.

“పంతులుగారూ! అమ్మాయి అబ్బాయిల జాతక పత్రికలు తెచ్చాను. ఈ ఇద్దరి జాతకాలూ, కలుస్తాయో, లేదో మీరు చెప్పాలి.” అంటూ ఆయన ముందు వాటిని పెట్టింది.

పంతులుగారు రెండిటిని చూశారు. ఒకటికి రెండు సార్లు పరిశీరించారు.

“ఈ అబ్బాయేమైనా చుట్టాలబ్బాయా?”

“కాదండీ. బయటి సంబంధమే.”

ఏవో లెక్కలు వేసుకుంటూ “అమ్మాయి జాతకం సరిగానే వ్రాసి వుంచారు కదమ్మా.” అన్నారు.

“ఆ.. సరిగానే వ్రాసున్నది.”

“ఇలా చెప్పవలసి వచ్చినందుకు నాకు చాలా బాధగా వుందమ్మా. అమ్మాయి జాతకంలో కుజ దోషం వున్నది. ఈ పెళ్ళివారే కాదు. ఏ పెళ్ళివారైనా వెనకా ముందూ ఆలోచిస్తారు.”

అరుంధతికి తన ఏం వింటున్నదో కాసేపు అర్ధం కాలేదు. అర్ధమైన తర్వాత గుండెల్లో దడ మొదలైంది. తను కూర్చున్నచోటుతో సహా అతా గిర్రున తిరిగిపోతున్నట్లుగా వున్నది. తనతో తెచ్చుకున్న వాటర్ బాటిల్ లోని మంచి నీళ్లు రెండు గుక్కలు తాగింది. పమిట చెంగుతో ముఖం తుడుచున్నది. పంతులుగారు జాతకాలు వ్రాసివున్న గాగితాలు తిరిగి అరుంధతికిచ్చేశారు. తన చేతిలోని కాగితాల వంక వెఱ్ఱిదానిలాగే చూడసాగింది.

గతమంతా కళ్లముందు కదిలింది. 1992 వసంవత్సరంలో మాఖా నక్షత్రంలో, సింహరాశిలో తన కూతురు పుట్టంది. పుట్టిన తిథీ, వారం కూడా బాగా వున్నాయనుకున్నారు. కాని తనే ఆ తారీఖును, మార్చి వేసింది. ఇప్పుడెలా అని కంగారుపడుతూ “పంతులుగారూ! నేనిప్పుడొక చిక్కు సమస్యలో ఇరుక్కున్నాను. అదేంటంటే రెండేళ్ల వయస్సులో నా కూతురుకు లివర్ సమస్య వచ్చింది. కాళ్లూ, చేతులూ సన్నబడి పొట్ట మాత్రం కనబడేది. చాలా వైద్యం చేయించాం. అది బాగా కోలుకునేటప్పటికి రెండేళ్లు పట్టింది. తనకి ఐదవ సంవత్సరం వచ్చేసింది. తనతోటి పిల్లలు ఎల్‌కేజీ యూకేజీలూ పూర్తి చేసి ఫస్ట్ క్లాస్‌లో కెళ్లారు. నా కుతురేమో నోట్లో వేలు వేసుకుని చప్పరిస్తూ దిక్కులు చూస్తున్నది. అనారోగ్య కారణంగా గడిచిపోయిన రెండేళ్లు నా కూతురికి తిరిగి ఎలా వస్తాయి? మరేం ఫర్వాలేదని మా ఆయన ఎంత చెప్పినా నేను వినిపించుకోలేదు. బాగా ఆలోచించి నా కూతురు పుట్టిన తేదీని 1994వ సంవత్సరంగా మార్చాను. ఆ తేదీయే వేసి ఒక కాన్వెంట్‌లో చేర్పించాము. ఆ తేదీకే పుట్టిన రోజులు చేస్తూ చాక్లెట్లు స్కూల్‌కు పంపేదాన్ని. క్రమంగా అదే తేదీ ఖరారయిపోయింది. భవిష్యత్‌లో నా కూతురు ఏదైనా జాబ్‌లో చేరినా ఏజ్ ఎక్కువన్న సమస్య కూడా రాదు. చాలా తెలివిగా ఆలోచించాననుకుని మురిసిపోయాను. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. పెళ్లి విషయంలో నైనా అసలు వయసు చెప్తే మంచిదని నా భర్త సలహా ఇవ్వబోయినా కొట్టిపారేశాను. ఇదేం పెద్ద నేరమూ కాదు, మోసమూ కాదని వాదించాను. ఇప్పుడిలా అయింది. నా మూలంగా నా కుతురు కుజదోషం వున్నదిగా ముద్ర పడిపోతుందేమో? తన అసలు పుట్టిన తేదీ వేరుగా వున్నది. ఆ రోజు ప్రకారం ఏ దోషమూ లేదు అని చెప్పబోయినా ఎవరూ నమ్మరు. ఇప్పుడే ఇంత పెద్ద అబద్ధం చెప్తున్నారు. ముందు ముందు ఇంకా ఎన్ని చెప్తారో అని మమ్మల్ని తేలిగ్గా చూస్తారు. నా కూతురు కూడా ఎలా అర్ధం చేసుకుంటుందో అని భయంగా వున్నది. నాకు నేనుగానే పద్మవ్యూహం పన్నుకుని చిక్కుకుపోయినట్లుగా అనిపిస్తున్నది” అంటూ వస్తున్న కన్నీళ్లను బలవంతాన ఆపుకున్నది.

“బాధపడకండమ్మా. అంతా సరవుతుందిలే. మీ అమ్మాయి అసలు పుట్టిన తేదీ. వారం సంవత్కరం, సమయం అంతా కరెక్ట్‌గా గుర్తుంటే చెప్పండి. ఆ సమయంలో తారాబలం ఎట్లా వుందో చూస్తాను” అన్నారు పంతులుగారు.

అన్నీ కరెక్ట్ గా చెప్పింది అరుంధతి.

కాగితం మీద లెక్కలు వేశారు పంతులుగారు. “భేషుగ్గా వున్నదమ్మా. సింహరాశి అంటే మంచి పట్టుదలా, తెగువా వున్న అమ్మాయి అవుతుంది” అంటూ మెచ్చుకున్నారు.

కాని ఏం లాభం? ఒక ముళ్ల వలయాన్ని తనే సృష్టించింది. ఇప్పుడు దాంట్లో నుంచి ఎలా బయటపడాలా? అని ఆలోచిస్తూ పంతులుగారికి నమస్కారం చేసి ఇంటికొచ్చేసింది. భర్త ఇంకా ఇంటికి రాలేదు. అతని కోసం ఎదురు చూస్తూ వుండగానే ప్రకాశం వచ్చాడు. రాగానే కాఫీ కలిపి ఇచ్చింది. కాఫీ కప్పు చేతిలోకి తీసుకుంటూ భార్య వంక చూస్తే ఆమె వాలకంలో ఏదో తేడా కనిపించింది, ప్రకాశరావుకు. గాలి తీసిన బెలూన్ లాగా వుంది.

“ఏంటలా డల్‌గా వున్నావు? ఇంకా ఆ సంబంధం గురించే ఆలోచిస్తున్నావా?” అని అడుగుతుంటే అరుంధతికి కన్నీళ్లు వచ్చేసాయి.

“మీరు చెప్పినా వినకుండా నేనే అతి తెలివికి పోయాను. నేను చేసిన పనికి ఏం జరిగిందో తెలుసా?” అంటూ పంతులుగారు చెప్పిన విషయం తెలియజేసింది.

“మనమ్మాయి వయసు దాచటం ఒక తప్పు. అది నేరమవుతుంది కూడా. బాగా ఆస్తిపాస్తులు పెద్ద ఉద్యోగం, ఇంకా ఏవేవో కావాలనుకుని ఊరికే పరుగులు పెట్టావు. ఇప్పుడు మనం చేసిన పనిని అర్దం చేసుకునే పెద్ద మనసు కలిగిన వాళ్లు కావాలి. ఎవరో ఒకరు ఉండకపోరు. నువ్వేం కంగారుపడకు.”

“కూతురు వయ్యసు రెండోళ్లు దాచాలన్న ఆరాటంలో ఎంత తెలివితక్కువ దాన్ని అయ్యాను? మున్సిపాలిటీలో నా కూతురు పుట్టన తేదీ నమోదై వుంటుంది. ఆ విషయమూ మర్చిపోయిన దద్దమ్మనయిపోయాను. ఇదెంత పెద్ద సమస్య అయి కూర్చుంటుందో? ప్రస్తుతం పెళ్లి సంగతి ఆలోచించాలి. నా కూతురికీ పెళ్లికొడుకు బాగా నచ్చాడు. ఆ అబ్బాయి కూడా అభిప్రాయాన్ని చెప్పాడు. వాళ్లిద్దరూ కాబోయే భార్యాభర్తల్లా ఊపించుకుంటున్నారు. ఎన్నో ఆలోచనలను మాలగా గుచ్చుకుని ఒకరి కొకరు మార్చుకుందామన్న ఉద్దేశ్యంలో వుండివుంటారు. వాళ్ల కలలను చెదరగొట్టేయకూడదు. నా తప్పు అందరి దగ్గరా నిజాయితీగా ఒప్పుకుంటాను” అని ఆలోచించింది అరుంధతి.

వెంటనే పెళ్లికొడుకు వాళ్ల ఇంటికి ఫోన్ చేసింది అరుంధతి. “వదినగారూ! జరిగిన సంగతి ఇది. దీన్ని కాస్త పెద్ద మనసుతో అర్ధం చేసుకోవాలి” అంటూ సంగతంతా వివరించింది.

“అరుంధతిగారూ! మీరు తెలుసుకోవాల్సినవి కూడా కొన్నున్నాయి. మా మరిది చనిపోయాడు. నా తోటికోడలికి బాగా అనారోగ్యం. వాళ్లకిద్దరు పిల్లలు. దాంతో వాళ్లు మా ఇంట్లోనే మా పిల్లల్తో బాటు వుంటారు. ఆ అమ్మాయి పెళ్లి బాధ్యత మాదే. ఆ అబ్బాయినీ తల్లి దండ్రుల్లా మేమే ఆదరించాలి. మా ఆస్తిపాస్తులు దాదాపు సగభాగం వాళ్లకిస్తాం.” అన్నది కొడుకు తల్లి.

“మరేం ఫర్వాలేదండీ. మీ ఆస్తి మీ ఇష్టం. మాకిప్పుడు మీ కుటుంబమూ మీ అబ్బాయి గుణగణాలే ముఖ్యం.” అన్నది మనస్ఫూర్తిగా. “మరో విషయంమండీ” అంటూ తామిచ్చే కట్నకానుకుల గురించి చెప్పబోయింది.

ఆమె వినిపించుకోకుండా, “మీరివ్వగలిగిందే మీ అమ్మాయికి పెట్టుకోండి. వాటి గురించి మేం ఎప్పుడూ ఆలోచించలేదు. మా అబ్బాయికి మీ అమ్మాయి బాగా నచ్చిందని చెప్పాడు. అదొక్కటే మేం ఆలోచించాం. తర్వాత మాట్లాడుకుందాం. నా స్కూల్ కి టైమవుదోంది” అంటూ ఫోన్ పెట్టేసింది. ఆమె ఇంత త్వరగా ఎలా అర్ధం చేసుకోగలిగిందో అరుంధతి అర్ధం కాలేదు.

పెళ్ళికొడుకు తల్లి మాత్రం నవ్వుకున్నది. ‘అరుంధతి చిన్నప్పటి స్నేహితురాలు సరితే. నాకు డిగ్రీలో క్లాస్‌మేట్. మొన్న ఏదో ఫంక్షన్‌కు ఈ ఊరొచ్చి నన్ను కలవాలని వచ్చింది. అప్పుడే తమ ఈ సంబంధం విషయం చెప్పి వాళ్లిచ్చిన బయోడేటా చూపించింది. పరిశీలనగా చూసి శిరీష పుట్టిన తేదీ ఇది కాదు. మా అబ్బాయి తనూ ఒకే సంవత్సరంలో పుట్టారు. మా ఇద్దరి పుట్టిళ్లూ ఒకే చోట కదా. నాకు బాగా గుర్తుంది. అరుంధతి కాస్త తలతిక్క మనిషి. విషయమేంటో కనుక్కుందాం. మీరింత వరకూ జాతకాల జోలికి వెళ్లలేదు గదా? ఇప్పుడు ‘జాతకం పంపించండి’ అని అడగండి. జాతకాలు కలవాలి అని కూడా చెప్పండి. విషయం బయటికొస్తుంది. బాగా నచ్చిన సంబంధం కనుక అరుంధతి అంత తేలిగ్గా వదులుకోదు అంటూ సలహా ఇచ్చి వెళ్లింది. తాను జాతకం ఎవరికీ చూపించకుండానే జాతకాలు కలవలేదని ఒక చిన్న అబద్ధం ఆడింది. దాంతో కంగారుపడ్డ ఆమె వాళ్ల దగ్గరకూ వీళ్ల దగ్గరకూ పరుగెత్తి కెళ్లినట్లుంది. దాంతో అసలు విషయం బయటికొచ్చింది. సరితకీ విషయం ఫోన్ చేసి చెప్పాలి’ అనుకున్నది.

Exit mobile version