Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సింబయాసిస్

[డా. మధు చిత్తర్వు రచించిన ‘సింబయాసిస్’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

ర్షం.. ఎప్పటికీ ఆగని వర్షం.

వర్షం ధారలుగా ఆకాశం నుంచి నేలకి సూదుల్లాగా పడి నేలలో ఇంకిపోతోంది.

ఆ వర్షం ఊదా రంగు ఆకాశంలోని నల్లటి మబ్బుల్లో నుంచి ఎర్రటి నేల మీద పడి తెల్లటి పొగ లాంటి నీటి పొరలు మళ్లీ తెరలు తెరలుగా పైకి లేస్తున్నాయి.

ఆ వర్షపు చినుకులు సంతోషంగా లేవు. సంతోషంగా కాక క్రూరంగా వారిద్దరినీ వేటాడుతున్నట్లు, వాళ్లమీద ఏదో తెలియని పగ తీర్చుకుంటున్నట్లు వెంటాడి వేటాడే క్రూరమృగాల బుసల స్పర్శలా ఉన్నాయి. పెద్ద చప్పుడుతో వాన ధారలు భీకరంగా వారి ఎక్సోసూట్ల మీదా, గాజుతో చేసిన ముఖం తొడుగుల (వైజర్స్) మీదా పడుతూ, చుట్టూ ఉన్న దృశ్యాలు వారికి ఏమీ కనబడనీయకుండా అడ్డు పడుతున్నాయి.

ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు వారం రోజుల నుంచి ఇదే వర్షం వారిద్దరినీ వెంటాడుతోంది. ఈ ఎలీజియం గ్రహంలో వారం రోజులు అంటే భూమి కాలమానం ప్రకారం ఆరు నెలలు. వారి శరీరానికి ప్రతిరోజు రెండు సార్లు ఆహారం కావాలి. ఇప్పుడు వారికి తినడానికి కొద్దిగా కూడా ఆహారం లేదు. గ్రహంలోని మానవ కాలనీ నివాసాల నుంచి అడవులనీ, వాటిలోని ఫెర్న్ మొక్కలనీ, నేలలోని మట్టినీ పరిశోధనలు చేయడం కోసం వారం రోజుల క్రితం ఇద్దరూ రోవర్‌లో బయల్దేరారు.

ఆదిత్య, గ్రహాంతర జీవుల పరిశోధనాశాస్త్రవేత్త. అరవింద గ్రహాంతర సూక్ష్మజీవుల మీద పరిశోధకురాలు. ఇద్దరూ గ్రహం లోని మట్టినీ, అడవుల్లోని చెట్ల ఆకులు, పువ్వుల శాంపిల్స్‌ని సేకరిస్తూ ఆ శాంపిల్స్ కోసం వారుండే ప్రధాన కాలనీ నుంచి చాలా దూరం వచ్చేశారు.

ఈ గ్రహానికి చాలా కాలం క్రితమే వచ్చికాలనీలలో నివసిస్తున్నారు భూమి మానవులు. ఆల్ఫా వన్ అనే ఎర్రటి కుబ్జ నక్షత్రం (dwarf star) చుట్టూ తిరిగే గ్రహం ఇది. ఇక్కడ నీరు, ఆక్సిజన్, ఫెర్న్ మొక్కలతో నిండిన ఆకుపచ్చ అరణ్యాలు, ఎర్రటి రాతి నేలా, ఎర్రటి మట్టీ, రాళ్లు, కొండలు చాలానే ఉన్నాయి. ఆక్సిజన్ తక్కువ కాబట్టి బయటి వెళ్లి నప్పుడు మాత్రం ఆక్సిజన్ మాస్క్‌లు, ఎక్సోసూట్లు వాడాలి. రాతి నేలలో గనులు తవ్వి మానవులు చేసే మైనింగ్‌తో వచ్చే ఖనిజాలు విలువైనవి. ఇతర గ్రహాలకు అమ్మి మంచి ఆదాయం సంపాదించవచ్చు. అడవుల్లో ఆకుపచ్చ ఫెర్న్ మొక్కలు ఇతర పోషక పదార్థాలని ఇస్తున్నాయి. ఇది కాక కాలనీలలో కూడా నీటితో సేద్యం చేసే ‘హైడ్రోపోనిక్’ తోటల్లో భూమిలో పండే ధాన్యాలు కూరగాయలు పండిస్తున్నారు. మానవాళికి జీవితం అనుకూలంగా ఉంటుందని భూమి నుంచి చాలా మంది వచ్చేశారు. కాలనీ షెల్టర్‌లో మాత్రం వాతావరణం భూమిలో లాగానే వుంటుంది.

ఎందుకు వచ్చేశారంటే, భూమిలో వాతావరణం కలుషితమై పోయింది. చాలా దేశాలలో జనం నేల అడుగున బంకర్లలో కూడా ఆక్సిజన్ మాస్కులు తగిలించుకొని ఉండి జీవించే పరిస్థితి వచ్చింది. అలాగే చాలా మంది వ్యవసాయం లేక ఆహారం లేకుండా ఇంకా కరువుల వల్ల మరణిస్తున్నారు. భూమి ఒక నివాసయోగ్యమైన గ్రహం కాదు. అది కూడా వాతావరణ కాలుష్యం వల్ల వేగంగా మరణిస్తోంది.

“నాకు స్వతంత్రం కావాలి. ఈ గ్రహంనుంచి పారిపోవాలని వుంది. హాయిగా గాలిలో ఎండలో తిరగాలి.” అనేది అరవింద.

“ఎలాగైనా భూమి నుంచి తప్పుకొని పారిపోయి ఏదో గ్రహంలో సెటిల్ అయ్యి పరిశోధనలు చేయాలి అని నాకు అనిపిస్తుంది” అనేవాడు ఆదిత్య. భూమి నుంచి వలస వచ్చే అంతరిక్ష నౌకలోఇద్దరూ ఈ గ్రహానికి వచ్చేశారు. ఇద్దరూ అప్పటి నుంచే స్నేహితులు. భూమి నుంచి వచ్చేసి ఈ గ్రహంలో స్థిరపడ్డ తర్వాత కూడా వారి స్నేహం కొనసాగింది. లాబొరేటరీలో పనిచేసేటప్పుడు, విద్యుత్ శక్తి తయారు చేసే థర్మో రియాక్టర్ల దగ్గర, ఆకుపచ్చని హైడ్రోపోనిక్ ఉద్యానవనాలు ఎలా పెరుగుతున్నాయో పరీక్షించేటప్పుడు కలిసి పనిచేసేవారు. ఇద్దరికీ స్నేహం ఇంకా పెరిగి క్రమంగా గాఢమైన ప్రేమగా మారింది.

వర్షం ధాటిగా ధారగావారి ఎక్సోసూట్ల మీద పడి సూదుల్లా గుచ్చుకుని ఆ సూట్లను చిరుగులు పట్టేలా చేస్తోంది. వర్షం ఫెర్న్ మొక్కలు నిండిన అరణ్యాల మీద, ఎర్రటి నేల మీదా పడి వారి కాళ్ల చుట్టూ బురద నిండిన నీళ్లు వాగులుగా పారుతున్నాయి. వర్షం మొదలైనప్పుడు మాములుగా ఈ ఎలీజియం గ్రహంలో ఋతువుల ప్రకారం వచ్చే వానాకాలపు వాన మాత్రమే అని అనుకున్నారు. వారి కాలనీ నివాస వాతావరణ సూచన కేంద్రం కూడా అలాగే సూచించింది.

కాలనీ నివాసాల్లో నివాసం ఉన్న కొందరు గ్రహపు నేలని డ్రిల్లింగ్ చేయడానికి వెళ్తారు.

కొందరు అడవుల్లోకి వెళ్లి పరిశోధనలు చేస్తారు. కొందరు అక్కడ వుండి శాటిలైట్ మానిటర్‌లో సమాచారం విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఇతర శాఖలలో శాస్త్రజ్ఞులు కూడా అక్కడ వివిధ రకాలుగా పనిచేస్తూ వుంటారు. అరవింద ఆదిత్య మట్టి శాంపిల్స్‌లో గ్రహాంతర జీవుల ఉనికిని తెలిపే ఆధారాల కోసం సేకరించడానికి బయలుదేరి హరితారణ్యంలోకి వారి రోవర్‌లో వెళ్లారు. ఆ గ్రహ కాలమానం ప్రకారం వారం రోజుల క్రితం బయలుదేరారు. వర్షం మొదలవ్వగానే ఆలస్యం చేయకుండానే తిరిగి బయలుదేరారు. వారి ఇంటర్‌కామ్ స్పీకర్లతో వాతావరణ సూచనలు రాసాగాయి. “తీవ్రమైన తుఫాను సూచన. వర్షపు సూచన. తిరిగి వచ్చేయండి. ఈ తుఫాను నాలుగు రోజుల వరకు ఉంటుంది.” అని.

నాలుగు రోజులబాటు కాదు వర్షం ఎడతెగకుండా వస్తూనే ఉంది. వారి రోవర్‌లో నాలుగు రోజులకు సరిపడా మాత్రమే ఆహారం ఉంది. వారం రోజులు అంటే భూమి కాలమానం ప్రకారం ఆరు నెలలు. కనీసం ఒక నెల సరిపడా ఆహారం అవసరమవుతుంది. అయినా అదే సరిపెట్టుకుని అలాగే ప్రయాణం చేస్తూ వస్తున్నారు. ఇంతలో వానధారలకి షార్ట్ సర్క్యూట్ అయ్యి రోవర్ వాహనంలో ఇంజన్ పాడైపోయి అది ఆగిపోయింది. వాన ఇంకా ఆగటం లేదు.

“మన కాలనీ మెయిన్ సెంటర్ ఎంత దూరం ఉంటుంది?” తన గాజు వైజర్ మీద పడిన వర్షపు నీరు తుడుచుకుంటూ అంది అరవింద.

“అదిగో దూరంగా మన ప్రధాన కాలనీ గోపురం..”

ఇది మూడోసారి. వర్షపు ధారలలో దూరంగా తెల్లటి పొగలో అస్పష్టంగా కనిపించీ కనిపించనట్లు వారి ప్రధాన నివాస గోపురం (dome) కనిపిస్తోంది. కానీ దగ్గరగా వెళ్లి చూస్తే ఏమీ ఉండదు. ఇది ఒక రకపు మృగతృష్ణ!

ఆదిత్య సూట్ మీద చిల్లులు పడి వాన చినుకులు అతని చర్మాన్ని తాకసాగాయి. తాకిన చోట మండుతోంది. ఆకుపచ్చగా ఎర్రటి గీతలు పడినట్లు అనిపిస్తోంది. అతని కాళ్ల చుట్టూ బురద అంటుకుని నీరు సుడులుగా ప్రవహిస్తోంది. అడవి అంచున నడుస్తుంటే గుంపులుగా ఉన్న ఫెర్న్ మొక్కలు అతని పలకరించినట్టు శరీరాన్ని తడుముతున్నాయి. వానధారలు అతడిని కుట్టినట్లుగా వున్నాయి. శరీరంలోకి చొచ్చుకుపోవాలని చూస్తున్నట్లు, సూట్లోంచి అతని చేతుల్లోకి కండరాలలోకి రక్త ప్రవాహంలోకి ప్రవహిస్తున్నట్లు అనిపిస్తోంది.

ఇద్దరూ రోవర్ వదిలి దిగి చేతికందిన, ఆహారం పాకెట్లు ఒక సంచీలో సర్దుకుని బురదలో వానలో భారంగా అడుగు తీసి అడుగువేస్తూ రెండు రోజుల నుంచి నడుస్తున్నారు. అంటే చాలా కాలమే.

హఠాత్తుగా ఆకాశంలో పెద్ద చప్పుడుతో ఉరుములూ, మెరుపులు.. ఊదా రంగు మేఘాలు భీకరంగా ఇంకా మరింత దట్టంగా ఆకాశంలో అలుముకుంటున్నాయి. దగ్గరలో నేలలోనుంచి ఢాం అనే పెద్ద చప్పుడుతో తెల్లటి ఆవిరి పైకి వచ్చింది. ఇంత వానలో ‘గేసర్’ (Geyser) అంటే వేడి ఆవిరి ఫౌంటెన్ లాగా నేల నుంచి ఆకాశం దాకా చిమ్మింది.

“ఇది చాలా వింతగా ఉంది. ఈ వానలో ఈ వేడి ఆవిరి పైకి చిమ్మటం. ఇది ఒక ధర్మల్ ఫౌంటెన్? భూమి లోని సహారా లాంటి ఎడారులలో కనిపించే Geysers లాంటిదా?”

ఎత్తుగా ఉన్న కొండలాంటి ప్రదేశం మీద ఎక్కుతున్నారు. ఇక్కడ వానకి శిథిలమై పడిపోయిన ఒక షెల్టర్ కనిపించింది. తుఫాన్‌కి సమాచార వ్యవస్థ పోయింది. వారి స్పీకర్ల నుంచి సందేశాలు వెళ్లటం లేదు, సందేశాలు రావడం లేదు.

ఆదిత్య “ఈ షెల్టర్ కూలిపోయింది. లోపలకి వెళ్లి చూద్దాం. పద!” అన్నాడు.

ఇక్కడ అంతా నిర్మానుష్యంగా ఉంది. పడిపోయిన గోడలూ, చెల్లాచెదురుగా విధులకు ఇక్కడి మానవులు ఉపయోగించిన పరికరాలు, మానిటర్‌లు, బంకర్లు, నీళ్లలో మునిగిపోయి ఉన్నాయి. నేల మీద ఠప్ మనే వెలుగుతో ఒక ఐపాడ్ లాంటి పరికరం హఠాత్తుగా వెలిగింది. ఎవరో రాసుకున్నఎలక్ట్రిక్ నోట్స్ చీకటిలో ఎర్రగా మెరుస్తూ కనిపించాయి.

ఎలీజియం కాలమానం. 19:47 గంటలు. తుఫాన్ రెండో రోజు. వాన ఆగడం లేదు. ఇంకా వాతావరణం ఒక నెల పాటు ఇలానే ఉంటుంది అని శాటిలైట్ దృశ్యాలు చెబుతున్నాయి.. ఏం చేయాలో తెలియడం లేదు.

ఎలీజియం కాలమానం 10:00 గంటలు. తుఫాన్ మూడో రోజు. వర్షపు ధాటికి కాలనీ కూలిపోయింది. అందరు కాలనీ వదిలి వెళ్లిపోతున్నారు.

“ఎమర్జెన్సీ! ఎమర్జెన్సీ! మెయిన్ సెంటర్‌కి పారిపోవాలి! అందరూ అందరు పారిపోయి తప్పించుకోండి. ప్రమాదం! ప్రమాదం!”

తుఫాన్ నాలుగో రోజు: ఎలీజియం కాలమానం అర్ధరాత్రి.12:00. చీకటి. అర్ధరాత్రి అయింది. తగ్గని తుఫాన్, తీవ్రంగా వర్షం. పవర్ లేదు. ఏ వ్యవస్థలూ పనిచేయడం లేదు. అందరూ వెళ్లిపోయారు. కానీ నేను వెళ్ళలేక పోతున్నాను. నాకు ఏదో అయ్యింది. నా శరీరమంతా బలహీనమైంది. నా అవయవాలు కదలడం లేదు. ఆ వాన నీటికి ఆశ్చర్యం గా నా శరీరం అంతా గాయాలయ్యాయి.అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. బహుశా ఇదే నా ఆఖరి రోజు. ఇదే ఆఖరి సందేశం.. ఎందుకంటే చేతులు, మెదడు మాత్రమే పని చేస్తున్నాయి. కొద్దిసేపటికి, మరో నోట్..

“నేను బతికి ఉండటం అసాధ్యం. హైపాక్సియా(hypoxia) ఆక్సిజన్ లేదు.. శరీరంలో అన్ని సిస్టమ్స్ విఫలమయ్యాయి…

బలహీనంగా గీకినట్లు ఆ వ్యక్తి సంతకం. ఎ…డ్వ..ర్డ్ ఫె..లీ..రి.. యో.. గుడ్..బై..

వదిలేసిన ఐప్యాడ్ ఉంది గాని మనిషి లేడు. “ఏమై ఉంటుంది?” అరవింద మాస్క్ తీసి ఆందోళనగా అంది.

ఆదిత్య అన్నాడు “మనకి తెలియనిది ఏదో జరుగుతోంది. ఈ గ్రహంలో మనకి తెలియని రసాయనిక చర్యలు ఏవేవో జరుగుతున్నాయి.”

దగ్గరలో వరుసగా నాలుగు గేసర్లు అంటే ఆవిరి ఫౌంటైన్లు పెద్ద చప్పుడుతో మోగి ఆకాశంలోకి మళ్ళీ ఆవిరి ఆకాశంలోకి ఎగజిమ్మింది.

“పారిపోదాం! పారిపోదాం! ఏమిటి ఈ పేలుళ్లు వర్షంలో?”

ఆశ్చర్యంగా వారికి కూడా తమ శరీరం అంతా ఏదో మార్పు వచ్చినట్లు అనిపిస్తోంది. సూట్లు చిరిగిపోయి వాన చినుకులు శరీరం మీద పడిన చోట ఆకుపచ్చగా సిరలు ఎర్రటి రక్తనాళాలు, ఏదో జీవకాంతితో మెరిసినట్లు చారలుగా ఏర్పడుతున్నాయి.

“నేను ఆక్సిజన్ మాస్క్ లేకుండా నడవగలుగుతున్నాను. ఇది ఎలా సాధ్యం? నాకు ఇక ఆక్సిజన్ అవసరం లేదు” అంది అరవింద. ఇద్దరు శిథిలమైన సెంటర్ నుంచి మళ్లీ నడవడం మొదలు పెట్టారు. ఇప్పుడు వారికి కొత్త శక్తి వచ్చినట్లు అవుతుంది. వేగంగా నడుస్తున్నారు. వర్షం ఇప్పుడు క్రూరంగా లేదు. అది ధారలుగా వారి శరీరం అంతటినీ ఆక్రమించింది.

“ఒళ్ళంతా ఆకుపచ్చగా అయింది నాలో ఏదో మార్పు?”

“నాలో కూడా నా సిరలలో ధమనుల్లో, రక్తంలో వేడిగా ఏదో ప్రవహిస్తున్న కొత్త శక్తి! నా చూపు కూడా చాలా దూరం వరకూ కనిపిస్తోంది!”

మూడు రోజులు నడిచే దూరం ఒకే ఒక్క పూటలో నడి చేశారు. కళ్ల ముందు దూరంగా ఈసారి నిజంగా ఉన్న మెయిన్ సెంటర్ ప్రధాన నివాస కాలనీ గోపురం కనిపిస్తోంది. ఇప్పుడు సమాచారం స్పీకర్లు పాడైనా సరే, చెవులలో వినవస్తోంది.

అస్పష్టమైన గొంతులు ఏదో మాట్లాడుతున్నాయి.

“ఆదిత్య నువ్వు విన్నావా? ఆదిత్య నువ్వు విన్నావా?”

“అవును నాకు వినపడింది.”

“అందరూ ఎలీజియంలో ఎక్కడ ఉన్నా సరే, కాలనీ వాసులందరూ శ్రద్ధగా వినండి. ముఖ్య సూచన. సింబయాసిస్! సింబయాసిస్! ప్రోటోకాల్ ఎమర్జెన్సీ..”

ఆ క్షణం ఆదిత్యకి మెదడులో వేయి బాంబులు పేలినట్లు వంద మెరుపులు మెరిసినట్లు ఉరుములు ఉరిమినట్లు అనిపించింది. అతని రక్తనాళాల్లో కొత్త శక్తి ఉజ్వలంగా తిరుగుతోంది.

“అరవిందా! ఈ గ్రహం ఎలీజియం మన మీద తిరగబడుతోంది!”

“అంటే?”

“ఈ గ్రహంలో మనం వచ్చి వలస ఉండి ఈ నేలని తవ్వి గనులు మైనింగ్ చేసి ఇక్కడ దాని హక్కైన వనరులు చెట్లు నేల ఖనిజాలు కొల్లగొట్టి ఆక్రమించుకోవడం దానికి ఇష్టం లేదు. ఈ గ్రహం, ఈ గ్రహంలోని ప్రకృతీ మన మీద తిరగబడుతున్నాయి!”

“మన పరిశోధనలో జీవరాశులు దొరకలేదు కదా?”

ఆదిత్య గొంతు ఇప్పుడు బొంగురుగా ఒక గ్రహాంతర జీవి గొంతులోకి మారిపోయింది.

“అరవిందా, అవి ధర్మల్ ఫౌంటెన్‌లు గీజర్లు కావు!ఆ ఆవిరి ఆవిరి కాదు!అవి.., ..అవి..”

“నిజం. నువ్వు సరిగానే ఊహిస్తున్నావు!” నిజం అర్థమైన అచ్చెరువుతో జీవశాస్త్ర పరిశోధకురాలు అరవింద కెవ్వుమని అరిచింది.

ఆమె గొంతు కూడా ఇప్పుడు ఒక వింత జంతువు గొంతులా బొంగురు మారిపోయింది.

“ఈ నేల రాతినేల కాదు. ఈ అడవులు ఫెర్న్ మొక్కల అడవులు కాదు. ఇవి అన్నీ సూక్ష్మజీవులే!

వారి పక్కన వెనుక ఉన్న అడవులన్నీ జీవకాంతితో వానలో ఆకుపచ్చగా వెలిగి ఆరసాగాయి. అడవుల అంచున ఉన్న పచ్చటి ఫెర్న్ మొక్కలు వానకీ, గాలికీ తలలు ఆడిస్తున్నాయి. ఇప్పుడు అవి స్నేహపూర్వకంగా ఉన్నాయి అనిపిస్తోంది. అదే సమయంలో భయపెడుతున్నాయి అనిపించింది.

నేలలోని సూక్ష్మజీవులు గేసర్ లలోనుంచి ఏరోసాల్ రూపంలో అంటే ఆవిరిలా మబ్బుల లోకి వెళ్లి వర్షపు ధారలలో మళ్ళీ నేలమీద కురుస్తున్నాయి. ఎలీజియం నేలలోని సూక్ష్మజీవులు తవ్వకాల వల్ల చెదిరిపోయి ఉండవచ్చు? అవి మనని వాటిలా మార్చుకుంటున్నాయి. మనం వాటిలా మారితేనే ఈ గ్రహంలో జీవించగలం!”

ఇంటర్‌కామ్‌లో చెవుల్లో ధ్వనులు వినిపించసాగాయి.

“మానవులందరికీ హెచ్చరిక! ఎలీజియంతో సహజీవనం చేయండి! మనం అంతా ఈ గ్రహపు జీవులతో కలిసిపోవాలి! ఇష్టం లేని వారు వారి ఇచ్ఛాశక్తిని ఉపయోగించి మార్పుని ప్రతిఘటించవచ్చు. కానీ దానితో మీ జీవితం అంతం అవుతుంది. గ్రహం దాడికి లొంగిపోతే మన జీవితాలు, ఆత్మలు శాశ్వతంగా ఉంటాయి. ఎడ్జెస్ట్ ఆర్ పెరిష్. ఈ జీవరాశితో సహకరించండి! లేదా నాశనమైపోండి!”

ఇద్దరూ పరిగెత్తుకుంటూ ప్రధాన నివాసంలోకి వెళ్ళి ప్రవేశించారు. వారికి తెలియకుండానే వారి శరీరాలు ఆకుపచ్చని ఫెర్న్ మొక్కలలా తయారైపోయాయి. కానీ వారికి మానవుల కళ్లు కాళ్లు చేతులు ఉన్నాయి!!!

కాలనీ అంతర్భాగంలో అంతటా అటూ ఇటూ ఆకుపచ్చని ఫెర్న్ మొక్కలు నడుస్తూ తిరుగుతున్నాయి! వాటికి కూడా మనుషుల కాళ్లు చేతులు కళ్ళు ఉన్నాయి. అవి మోనిటర్స్ పరిశీలించి చూస్తున్నాయి.

అరవింద ఆదిత్య ఇప్పుడు రెండు మొక్కలు. ఒకరినొకరు చూసుకున్నారు. కళ్లు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆకుపచ్చగా వెలుగుతున్న శరీరాల ధమనుల్లో కొత్త శక్తి లభిస్తోంది. ఈ మొక్కలకి శక్తి ఆల్ఫా వన్ ఎర్రటి కుబ్జ నక్షత్రం నుంచి వస్తున్నట్లు ఉంది.

“మనం మొక్కలము. సూక్ష్మజీవులము. కిరణజన్య సంయోగక్రియ ద్వారానో , లేక వేరే జీవశక్తి ద్వారానో బతుకుతాం. కానీ మనకు జ్ఞాపకశక్తి, తెలివి మానవ అవయవాలు కూడా ఉంటాయి అనుకుంటున్నాను.మనం బతకాలంటే మారాల్సిందే. మారి పోదాం, కొత్త జీవితానికి. ఈ ఎలీజియం గ్రహంలో” అంది అరవింద.

వర్షం ఆగిపోయింది.

మానిటర్లలో తెర మీద తెల్లటి ధూళిలో సూక్ష్మజీవులు ఆకాశ నిండా నిండి కనిపించాయి.

అది వాన కాదు. అవి వాన చినుకులు కాదు.

గ్రహాంతర సూక్ష్మప్రాణుల ధారలు గ్రహంలో వున్న మానవుల శరీరాలని ఆక్రమించి వారిని మార్చివేశాయి. మనిషి శక్తి గ్రహంలోని సూక్ష్మజీవుల శక్తీ రెండూ కలిసి సహజీవనం మొదలుపెట్టాయి.

తప్పదు. వాటితో సహజీవనం చేయకపోతే అంతం తప్పదు.

సింబయాసిస్ ముగిసింది.

Exit mobile version