Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సిలబస్

[శ్రీ కొండూరి కాశీ విశ్వేశ్వరరావు రచించిన ‘సిలబస్’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

విద్యాభ్యాసంలో ఒక ముఖ్యమైన భాగంగా, ఎప్పటిలాగానే స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటయ్యింది. విద్యా సంవత్సరంలో సగం పూర్తి అయ్యింది. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్‌ని కూడా మెయిన్ పరీక్షల్లాగా ఎంతో టెన్షన్‌తో వ్రాశారు విద్యార్థులు.

శ్రీవాణీ విద్యాలయంలో విద్యార్థులు సరిగా చదవకపోతే టీచర్లు మటుకూ కొట్టరు, గోడకుర్చీలు వేయించరు. అలాగే ఎండలో కూడా నుంచో బెట్టరు. కానీ బాగా చదవకపోతే భయపెట్టి, కొట్టినంత పని చేస్తారు. అందుకేనేమో ఈ స్కూల్లోని విద్యార్థులంతా ఎప్పుడు చూసినా ఆడుతూ పాడుతూ ఆహ్లాదకరంగా కన్పిస్తారు.

ఇక మార్కుల విషయానికొస్తే పేరెంట్స్ చాలామంది అసంతృప్తితోనే ఉన్నారు. అందుకనే ఈనాటి మీటింగ్‌లో అటో ఇటో తెల్చేసుకోవాలనే కోపంతో ఉన్నారు.

‘‘మా అబ్బాయి సరిగా చదవటంలేదంటూ ఇంటికి పోన్ చేసి మరీ చెప్పారు ఏం లాభం? అసలు వాడు బాగా చదవకపోతే, చదివించవలసిన బాధ్యత మీదే కదా! అందుకే కదా మా జీతాలన్నీ ఫీజులకే కడుతున్నాం” అంటూ వాదించింది ఒకావిడ.

పేరెంట్స్ చెపుతున్న విషయాలన్నిటినీ వ్రాసుకుంటున్నాడు ప్రిన్సిపల్ రామానుజం.

“ఇదిగో చూడండి! మీ స్కూలు మీద ఒక కంప్లెంటు కూడా ఉంది. ‘స్కూల్లోని విద్యార్థులు సరిగ్గా చదివినా, చదవకపోయినా మీరు అసలు పట్టించుకోర’ని. ఇలా అయితే ఎలాగండి ప్రిన్సిపల్ గారు? అవసరం అయితే మా పిల్లల్ని కొట్టైనా, తిట్టైనా చదివించి, వాళ్లకి మంచి మార్కులొచ్చేలాగా చేయాలి” అంటూ ఆవేశంగా వాదించాడు ఓ పెద్దాయన.

కానీ కొంతమంది పేరెంట్స్ యొక్క ఆలోచనా విధానం చాలా విభిన్నంగా ఉంది. అదేమిటంటే తమ పిల్లలకు చాలా తక్కువ మార్కులు వస్తున్నాయనే వాదనకు దిగారు. ఇలా అయితే ఇంజనీరింగ్‌ గానీ, మెడిసిన్ చదవటానికిగానీ ఏ మాత్రమూ పనికిరాకుండా పోతారనే ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.

ఇంకొకావిడ చాలా విచిత్రంగా వాదనకు దిగింది.

“మా అమ్మాయి ‘ఎ’ సెక్షన్లోనే చదివించండి. అంతేకాదు మా అమ్మాయి చాలా ఇంటలిజెంట్ కూడా! మీరు ఇలా పాఠం చెప్పారో లేదో, అలా ఠక్కున పట్టేసే ఏకసంథాగ్రాహి. అందుకోసం మా అమ్మాయిని తప్పనిసరిగా ‘ఫ్రంట్ బెంచ్’లోనే కూర్చోబెట్టండి” అంటూ నానా యాగీ చేసిందావిడ.

ఆవిడ ఆవేశధోరణిని ఓపికగా విని, వాటిలో ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకున్నాడు ప్రిన్సిపల్ రామానుజం. వారి వాదనలు వింటున్న ప్రిన్సిపల్‌కి కూడా కోపం వస్తోంది కానీ, సహనంగా వింటూ వాటికి పరిష్కారాల సూత్రాలను కూడా పేరెంట్స్‌కి నచ్చజెపుతున్నాడు.

ఇంకొంత మంది పేరెంట్స్ అయితే, సాయంకాలం ఆరుగంటలవరకూ స్పెషల్ క్లాసులు తీసుకు తీరాలని మొండిగా వాదించారు. మొత్తానికి పేరెంట్స్ మీటింగ్ కాస్తా రసాభాసగా మారిపోయింది. అక్కడ అందరూ చెప్పేవాళ్లే కానీ, వినేవారు మాత్రం ఎవరూ లేరు అన్న చందాన తయారయ్యింది.

టీచర్లందరూ తలలు పట్టుకొని కూర్చున్నారు, అసలు ఎప్పుడు ఈ మీటింగ్ అయిపోతుందా అని. అలాంటి గందరగోళ సమయంలో అందరికీ సమోసాలు, బిస్కట్లూ, చాయ్‌లు ఇవ్వటంతో కొంత ఉపశమనం దొరికింది. అవి ఆరగించిన తరువాత, వారంతా ప్రిన్సిపల్ ఇచ్చే సమాధానం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

“ఈ రోజు మా స్కూలు యాజమన్యంతో పేరెంట్స్ మీటింగ్‌కి విచ్చేసిన వారందరికీ నమస్కారములు. మీరు తెలియజేసిన ముఖ్యమైన విషయాలన్నిటినీ మేము ఎంతో శ్రద్ధగా విని వాటిని నోట్ చేసుకున్నాము కూడా.

నాకు ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. వారిద్దరూ శ్రీవాణీ విద్యాలయంలోనే చదువుకున్నారు. వాళ్లిద్దరూ కూడా ఏవరేజ్ విద్యార్థులే కానీ, ఫస్ట్ క్లాస్ మార్కులొచ్చేవాళ్ళు కాదు. అలా అని వాళ్లకు ఎక్కువ మార్కులు వేసే ప్రయత్నం కూడా నేను ఏనాడూ చేయలేదు. ఒకవేళ నేను ఎక్కువ మార్కులు స్కూల్లో వేసినా, భవిష్యత్తులో వీళ్లు వెళ్లిన ఇంటర్వ్యూల్లో ఎవరు మార్కులు వేస్తారు? ఇది నా కుటుంబపరమైన వ్యక్తిగత విషయమైనా, మీరు తప్పక తెలుసుకోవాలని చెప్పటం జరిగింది.

మీరు చెప్పినట్లుగానే, అసలు స్పెషల్ క్లాసులు ఎందుకు తీసుకోవాలి? మేము టైమ్ టేబుల్ ప్రకారం మరియు ‘లెసన్ ప్లాన్’ ప్రకారమే సిలబస్‌ని పూర్తి చేస్తున్నాం కదా!

ఇక్కడ మీరు ఇంకొక అతి ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుని తీరాలి. మీలో ఎక్కువగా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ, మీ పిల్లల్ని చూచుకోవటానికి ఇంట్లో ఎవరూ లేరని, మమ్మల్ని స్పెషల్ క్లాసులు తీసుకోమనటం ఎంతవరకూ సబబో కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. అప్పుడు మీకు సరైన సమాధానం తప్పక దొరకుతుంది.

అందుకనే మా శ్రీవాణి విద్యాలయంలో సాయంత్రం నాలుగు గంటలకే లాంగ్‍ బెల్ గణగణా మ్రోగుతుంది. ఆ తరువాత మన విద్యార్థులంతా హాయిగా ఆటస్థలంలో ఆడుకుంటున్నారు. విద్యార్థులకు మానసిక వికాసం కోసం, తగిన వ్యాయామం కూడా తప్పనిసరి అనే సూత్రాన్ని మేము విధిగా అమలుపర్చుతున్నాం.

ఆనందంగా ఆడుకున్న పిల్లలు సాయంత్రం ఆరుగంటల కల్లా ఇల్లు చేరుకుంటున్నారు. విద్యార్థులను కొట్టటం, తిట్టటం లాంటి పనులు ఏనాడూ చేయలేదు. వాళ్లు మోయలేని పుస్తకాలను కొనిపించలేదు. టైమ్ లేక హోంవర్కు చేయకపోతే, అది కూడా స్కూల్లోనే పూర్తి చేయిస్తాం. కొన్ని ప్రత్యేకమైన ప్రాజక్ట్ వర్కులు మాత్రం వారితోనే చేయిస్తాం. వాటివల్ల వారిలో విజ్ఞానం మెరుగుపడుతుంది.

విద్యలో భాగంగా పోస్టాఫీస్‌కు, బ్యాంక్ లకు విద్యార్థులందరినీ తీసుకెళ్లి అక్కడ సిబ్బంది పనిచేసే విధానాన్ని, మనకు వారిచ్చే సౌకర్యాలనూ ప్రాక్టికల్‍గా చూపించి, వివరిస్తాం. దీనివలన విద్యార్థులకు ఆ సంస్థల గురించి పూర్తి అవగాహన పెరుగుతుంది.

ఉన్నత విద్యలో సీట్లు సాధించేందుకు మార్కులు తప్పనిసరిగా కావాలన్న మీ అభిప్రాయం మటికి నూరుపాళ్లు నిజమే. ఈ విషయంలో మీకొక ఉదాహరణను చెపుతున్నాను. నేను యస్.యస్.సి.లో రెండుసార్లు ఫెయిల్ అయ్యాను. దాంతో నాలో పట్టుదల బాగా పెరిగింది. మూడవసారి ఏవరేజ్‍లో పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్లో సెకండ్ క్లాసు రాగా, డిగ్రీలో ఫస్ట్ ర్యాంక్ సాధించాను.

ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నారేకానీ, జీవితంలో ఫెయిల్ అవటంలేదు. ఒకవేళ ఫెయిల్ అయినా మరింత పట్టుదలతో ఇంకా బాగా చదివి మంచి మార్కులు సాధిస్తారు. మార్కుల విషయంలో విద్యార్థులను ఒత్తిడి చేయకుండా వుండవలసిన బాధ్యత తల్లిదండ్రులదే అని గుర్తుంచుకోవాలి. మానసిక ఒత్తిడి వలన విద్యార్థులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి, ఏదైనా అఘాయిత్యం చేసుకునే అవకాశం ఉంది.

ఇక మీడియం విషయానికొస్తే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయినా రెండూ సమానమే. నిజం చెప్పాలంటే తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులే సివిల్స్ లోనూ, ఇతర పోటీ పరీక్షల్లోనూ ముందుంటున్నారు. మరి హైటెక్ ఉద్యోగాలకు ఇంగ్లీషు మీడియంలో చదవటం అనివార్యం. ఉద్యోగరీత్యా దేశ, విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు పొందటానికి ఇంగ్లీషు మీడియం చాలా ఉపయోగపడుతుంది. మన తెలుగుభాష అమ్మ వంటిది. ఇంగ్లీషుభాష నాన్నలాంటిది. ఈ రెండు భాషలతోపాటు రాజ్యభాష హిందీని నేర్చుకుంటే మన భారతదేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేయడం చాలా సులభం. మనం ఉన్నత స్థితిని, ఉద్యోగాలను పొందటానికి ఈ మూడు భాషలు చాలా ముఖ్యమైనవి. మన మాతృభాషను మనం ప్రేమించటం సహజం. అలా అని ఇంగ్లీషుభాషను ద్వేషించవలసిన అవసరం ఏ మాత్రమూ లేదన్నది మీరు తెలుసుకుంటే మీ  పిల్లల భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది.

ఒక పటిష్టమైన ప్రణాళికతో, నిబద్ధత కలిగిన ఉన్నత ఆశయాలతో శ్రీవాణీ విద్యాలయం ద్వారా విద్యనందిస్తున్న ప్రిన్సిపల్ రామానుజం శషబిషలులేని ఉన్నతమైన వ్యక్తిత్వం గలవాడు. అందుకనే ఆయన ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా విన్న విద్యార్థులు, పేరెంట్స్ అందరూ కరతాళ ధ్వనులు చేస్తూ మర్యాదపూర్వకంగా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి తమ సంతోషాన్ని తెలియజేశారు.

“మార్కులు, ర్యాంకులే ప్రతిభకు కొలమానం కాకూడదు. ఉత్తమ పౌరులను తీర్చిదిద్దటమే ‘మన విద్యా లక్ష్యం, మన సిలబస్’ లా ఉండాలి” అన్న ప్రిన్సిపల్ గారి బంగారు మాటలతో ఆనాటి పేరెంట్స్ మీటింగ్ విజయవంతమయింది.

Exit mobile version