[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘స్వధర్మమే శ్రేయస్కరం’ అనే రచనని అందిస్తున్నాము.]
భగవద్గీత 2వ అధ్యాయం, సాంఖ్యయోగం లోని 33వ శ్లోకం ఈ విధంగా వుంది:
అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి।
తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి॥
“ఓ అర్జునా! ఒకవేళ నీవు స్వధర్మాన్ని, కీర్తిని విడిచి, ఈ ధర్మ యుద్ధాన్ని చేయడానికి నిరాకరిస్తే, తప్పకుండా పాపాన్ని చేసినవాడివవుతావు” అని స్వధర్మం యొక్క ప్రాశస్త్యం గురించి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చక్కగా బోధించాడు.
స్వధర్మంలో సుగుణాలు అంతగా లేకున్నా, పరధర్మంలో సుగుణాలు ఎన్ని ఉన్నా.. చక్కగా అనుష్ఠించే పరధర్మం కన్నా స్వధర్మాచరణమే ఉత్తమం. స్వధర్మాచరణలో మరణం సంభవించినా శ్రేయస్కరమే కానీ, పరధర్మం భయావహం అని కూడా మరొక శ్లోకంలో భగవానుడు ఉపదేశించాడు.
స్వధర్మాచరణ.. వ్యక్తి ఆలోచనలో, ప్రవర్తనలో, కర్మాచరణలో, అవగాహనలో ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేందుకు ఉపకరిస్తుంది. స్వధర్మానికి భిన్నంగా ఉండేది పరధర్మం. దాన్ని ఎంత నిష్ఠతో ఆచరించినా అందులో ఎన్ని సుగుణాలు కనిపించినా ఎంతటి ఆకర్షణ ఉన్నా అది జీవన లక్ష్యాన్ని చేరడానికి సుఖకరం కాలేదు. తాత్కాలికంగా సుఖంగా ఉన్నట్లుగా భ్రమింపచేయగలదేమో కాని, పరమమైన శ్రేయస్సును పరధర్మం ఇవ్వలేదు. కాబట్టి పర ధర్మాచరణ మానవులకు కొండంత దుఖాన్ని తెచ్చిపెడుతుంది, కాబట్టి ఆచరణకు ఉపయుక్తం కాదు. మరొకరిలా నటించడం లేదా ప్రవర్తించడం కన్నా మనం మన లాగే ఉండటం, మన స్వభావానికి అనుగుణంగా ప్రవర్తించడం ఎంతో ఆనందదాయకం. మన సహజ స్వభావం ద్వారా జనించిన విధులను మానసిక స్థైర్యముతో చాలా సునాయాసంగా చేయవచ్చు. ఇతరుల విధులు దూరం నుండి చూడటానికి దూరపు కొండలు నునుపు అన్న చందాన బహు ఆకర్షణీయంగా ఉండవచ్చు, వాటిని అనుసరించాలని, మనకి అలా చేయబుద్ధి అవ్వచ్చు, కానీ అది ప్రమాదభరితమైనది. అది మన స్వభావంతో పొసగకపోతే, అది మన ఇంద్రియ మనోబుద్ధులలో ఘర్షణకి దారితీస్తుంది. తత్ఫలితంగా ఎనలేని దుఖాన్ని పోగు చేసుకుంటాము.
ధర్మరక్షణ చేయవలసిన బాధ్యత ఉన్నవాడు అర్జునుడు. అసలు శ్రీ కృష్ణార్జున సంగమం అధర్మానికి ప్రతిరూపమైన కౌరవాదులను మట్టు పెట్టడానికే జరిగిందన్నది విస్పష్టం. యుద్ధరంగంలో చేయవలసిన ధర్మం పట్ల వికలుడై విస్మరించే స్థితికి చేరి క్షత్రియ ధర్మమైన యుద్ధాన్ని చేయలేనన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడితో విషయం చెప్పి రణరంగం నుంచి వెనుతిరిగేందుకు సంసిద్ధుడయ్యాడు. అర్జునుడు క్షత్రియుడు పుట్టుక పుట్టి చిన్నప్పటినుండి ‘రాజ్యం వీర భోజ్యం’ అన్న భావనతో పెరిగాడు. మహావీరుడు, మేటి విలుకాడు. ఉత్సాహం ఉరకలువేస్తూ రణరంగంలో దూకటం అతని స్వధర్మం. అంతేకాని భిక్షమెత్తుకు బ్రతకడం కాదు. అయితే అనూహ్యంగా కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితులు అన్న మోహంలో పడి అస్త్ర సన్యాసం చేస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు స్వయంగా పూనుకొని అర్జునుడికి స్వధర్మ రక్షణ గురించి బోధిస్తూ “అర్జునా! నువ్వు క్షత్రియుడివి. ధర్మం కోసం ధర్మయుద్ధం చేయడమే నీ స్వధర్మం. అంతేగాక యుద్ధం చేయడం కన్నా శ్రేయస్సును కలిగించేది మరొకటి నీకు సరిపడదు. కాబట్టి దానిగురించి దుఃఖించాల్సిన అవసరం లేదు” అని స్పష్టంగా కర్తవ్యబోధ చేశాడు.
మానవులు తన ధర్మాన్ని పక్కనబెట్టి ప్రవర్తించడం వల్ల అన్ని అనర్థాలూ జరుగుతాయి. కాబట్టి స్వధర్మనిష్ఠ శ్రేయస్కరం. అదే సదా అనుసరణీయం అని పై శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని కర్తవ్య బోధ చేసాడు.