[శ్రీ పాలకుర్తి రామమూర్తి రచించిన ‘స్వర్గారోహణ పర్వము’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
మహాభారతంలో స్వర్గారోహణ పర్వము పదునెనిమిదవది మరియు చివరిది కూడా. స్వర్గపథంలో ఆరోహణగా దీనిని చెప్పుకోవచ్చు. సాధారణమైన ఆలోచనాస్థాయిలో సృష్టిలో ఆరోహణ, అవరోహణలని రెండు మార్గాలు కనిపిస్తుంటాయి. అంతర్గత ప్రజ్ఞ స్థూలస్థితి నుండి సూక్ష్మస్థితికి ఎదగడం.. ఆరోహణ లేదా ఊర్ధ్వముఖ ప్రయాణంగానూ.. సూక్ష్మస్థితి నుండి స్థూలస్థితికి పరివర్తన చెందడం అవతరణ లేదా అధోముఖ ప్రయాణంగానూ చెప్పుకుంటాము. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ స్థితులుగా పరిణామం చెందినా.. దాని విలోమంగా పరిణమించినా రెండూ శాశ్వతమైనవే. అలా జరగని నాడు సృష్టి క్రమం సాధ్యపడదు. అయితే ఈ రెంటికీ భేదం లేదనే భావనను అనుభవ పూర్వకంగా తెలుసుకున్న సాధకునికి వీటి మధ్య భేదం కనిపించదు.
మానవుడు తన కర్మఫలితాన్ని అనుభవించే క్రమంలో జాత్యంతరీకరణను పొందడం లేదా పతనావస్థను పొందడం జరుగుతుంది. జీవిలో పరివర్తన జరిగి జాత్యంతరీకరణ లేదా ఉన్నతస్థితిని చేరే విధానంలో కూడా ఎన్నో పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది.
సాధకునిలో జాత్యంతరీకరణ జరుగుతున్న సమయంలో పరిణతి ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితికి చేరుకుంటుంది. తనలో సకల సృష్టినీ దర్శించడం, సకల సృష్టిలో తానూ దర్శనమివ్వడం జరుగుతుంది. ఆ దివ్య స్థితిలో అతనిలో వ్యక్తమయ్యేవి.. ఒకటి సమదర్శన, రెండవది కర్మాచరణలో నేర్పు. సమదర్శన వల్ల తనపర భేదం గాని, మానావమానాలు గాని అతనిని కలతపెట్టవు.
స్వర్గారోహణ పర్వారంభంలో తిక్కన గారు “సంపోషితంబయిన బోధంబున” చక్కగా పోషింపబడిన లేదా వృద్ధి చెందిన బోధ వలన జ్ఞానం కలుగుతుంది, అంటారు. వ్యాస కృష్ణులచేత చక్కగా బోధింపబడిన ధర్మరాజులో విద్య దార్శనికతను పెంచింది. మానవ జీవిత గమ్యాన్నీ, గమనాన్నీ “యెఱుక” పరచింది. నిజానికి విద్య వ్యక్తిత్వాన్ని వికసింప చేస్తుంది. విద్యనుండి పొందిన వికసన, బుద్ధిచే ఆదరింపబడాలి. కాని సాధారణంగా విద్య అహంకారాన్ని ప్రసాదిస్తుంది. అహంకారం వల్ల పతనం ఆరంభమవుతుంది. దీనిని గ్రహింప చేసేది బుద్ధి. బుద్ధి సక్రమంగా పనిచేస్తే వ్యక్తిత్వం వికసిస్తుంది, విస్తరిస్తుంది.. అది ప్రయోజనకారి అవుతుంది. మహాత్ముల బోధలు, ప్రబోధలు, ప్రవచనాలు వ్యక్తిలో సక్రమమైన ప్రవర్తనకు నాంది పలికితే వారి మార్గదర్శన ప్రపంచానికి ఉపకరిస్తుంది.
మహాప్రస్థానంలో యోగానుభవంతో ఎన్నో పరీక్షలను ఎదుర్కొని సశరీరంగా స్వర్గారోహణకు అర్హతను సాధించిన ధర్మరాజు, సశరీరంగా స్వర్గాన్ని చేరినా అతనిలో ముందుగా తనవారిని చూడాలనే “కోరిక”ను అదుపు చేసుకోలేక, తన వారిని చూపమని ఇంద్రుని ప్రార్థించాడు. ఇంద్రుడు దూతను రప్పించి.. ధర్మరాజుకు తన బంధుమిత్రులను చూపమన్నాడు. ఆ సమయంలో నారదాది మహర్షులు తనతో కూడా వస్తూ ఉండగా ధర్మరాజు నడుస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో స్వర్గంలో తన కెదురుగా అమితమైన దేవేంద్రభోగాలను అనుభవిస్తున్న దుర్యోధనాదులను చూచి భరించలేని వేదనకు గురయ్యాడు. కౌరవులు స్వార్థపరులూ, అధర్మపరులూ.. అయినా వారికి స్వర్గము ప్రాప్తించింది.. అదెలా ధర్మమో అతనికి అవగతం కాలేదు. దీర్ఘదర్శి కాని దుర్యోధనుని వల్లనే మహాయుద్ధం సంభవించి అపార ప్రాణనష్టానికి కారణమయింది. ద్రౌపది లాంటి సాధ్వి నిండు సభలో అవమానింపబడింది. అయినా అతనికి స్వర్గోపభోగాలు లభించాయి. అది అన్యాయం, అధర్మమని ధర్మరాజు భావన. స్వర్గంలో కూడా ధర్మరాజు మానవ శరీరానికి సహజమైన ఈర్ష్యాసూయలను, మమకారాలను విడిచి పెట్టలేకపోయాడు. దానికి కారణం మానుషరూపం మానుషభావాన్ని ఆశ్రయించింది, అనుకోవచ్చు.
నిజానికి జీవిత గమనంలో ఎదురయ్యే సన్నివేశాల నిర్వహణా దక్షతయే ఆత్మసాధనలో వికాసానికి ప్రాతిపదిక. భౌతిక జీవన గమనంలో ఎదురయ్యే సన్నివేశాల నిర్వహణ, ఆధ్యాత్మిక సాధన.. రెండూ వేరు వేరు కావు. గమ్యం చేరే గమనంలో ఎదురయ్యే ప్రతి సన్నివేశమూ మనకొక పాఠాన్ని నేర్పి, శిక్షణాలయాలుగా స్థాయిని ఉన్నతీకరిస్తుందనే సత్యాన్ని మహాభారత గాథ మనకు తెలియ చేస్తుంది. ధర్మరాజు జీవిత గమనమూ.. ప్రాజ్ఞత, సమదర్శన, జాత్యంతరీకరణ విధానానికి ప్రతీకలుగా చెప్పుకోవచ్చు.
భౌతిక శరీర సహజ మనోభావనల ప్రభావాన్ని వదిలించుకోలేని ధర్మరాజుకు స్వర్గవాసం కావాలంటే ప్రక్షాళన అవసరం. అందుకే మరొకసారి అర్హతాపరీక్ష రూపంలో శోధన మొదలయింది. ధర్మరాజు కౌరవులను చూచాక మనస్సు కుతకుతలాడిపోగా.. వ్యాకులపాటుతో ధర్మాన్నీ న్యాయాన్నీ నిందిస్తూ.. తనతో వస్తున్న మహర్షులను ఆ పక్షపాత వైఖరికి కారణం అడిగాడు. ఆ సమయంలో నారదుడు అనునయంగా ధర్మరాజును సమీపించి.. ధర్మజా! ఈర్ష్యాసూయలకు దూరంగా ఉండాల్సిన ప్రదేశంలో వాటికి బంధీగావడం క్లేశాన్ని కలిగిస్తుంది. చింత క్షోభకు దారితీస్తుంది. మనసు కకావికలం ఔతుంది. దుర్యోధనుడు, “ఆహవ సంపరిత్యక్త తనుడు”.. అనగా.. యుద్ధమనే యజ్ఞంలో సంపూర్ణంగా పరిత్యజించిన శరీరం కలిగిన వాడు. కాబట్టి దుర్యోధనుడు స్వర్గలోక వాసి అయ్యాడు. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. యుద్ధభూమిలో మరణించిన అందరికీ స్వర్గవాసం ప్రాప్తించదు. ధర్మం కోసం చేసిన యుద్ధంలో వెన్నుచూపక ధర్మ పరిరక్షణకై ప్రాణాలు వదిలిన వీరులకే స్వర్గవాసం లభిస్తుంది. ధర్మరాజా! హృదయానికి క్లేశాన్ని కలిగించే విషయాలను పదే పదే గుర్తుచేసుకో కూడదు. అన్నింటినీ మరిచిపొమ్ము.. అంటాడు.
నిజానికి స్వర్గ నరకాలు ఎక్కడో లేవు. ప్రతివ్యక్తి అంతరంగంలో భావిస్తున్న భావనలు సాకారమవడమే, స్వర్గనరక దర్శనాలుగా భావించాలి. గతాన్ని త్రవ్వుకుంటే.. గతమే వర్తమానమై మనస్సును ఆక్రమించి బంధనాలకు కారణమౌతుంది. మనస్సే బంధానికి మోక్షానికి కారణమౌతుందనేది విదితమే.
దుర్యోధనుడు అధర్మవర్తి యైనా అతను స్వర్గవాసానికి ఎలా అర్హుడయ్యాడనేది ధర్మరాజును తొలుస్తున్న ప్రశ్న. దానిని గ్రహించిన నారదుడు.. ధర్మజా! అస్థిరబుద్ధి స్వర్గంలో నిలబడలేదు.. సమదర్శనం నుండి నీ మనసు చలించింది. దానిని విడిచిపెట్టు అని బోధిస్తాడు. ధర్మరాజు ఆ మాటలు విని కాసేపు మౌనంగా ఉన్నాడు. దానితో ప్రశాంతమైన మనసుకు కర్తవ్యం బోధపడింది. తన చాంచల్యతకు కారణం అవగతమయింది. దుర్యోధనునిపై ద్వేషం తొలిగిపోయింది.. అయినా తన వారక్కడ కనిపించడం లేదు. అందుకే తన వెంట వచ్చిన మునులతో.. అయ్యా! నా తమ్ములు భార్య ఉన్నచోటికి నన్ను తీసుకువెళ్ళండి, అంటాడు.
అంతేకాదు, నా తమ్ముళ్ళను, భార్యను, మిత్రులను, పుత్రులను.. కర్ణుడిని చూపమని మహర్షులను ప్రార్థిస్తాడు. తమ్ముళ్ళూ, భార్య పుత్రులు, మిత్రులను చూడాలనుకోవడం సమంజసమే అయినా కర్ణుడిని చూడాలని అనుకోవడం విడ్డూరంగా కనిపిస్తుంది.. అదీ “అతడు నేము నైన నమరేంద్రుఁడును మమ్ముఁ జెనయునే” అంటాడు.. కర్ణుడు తమకు తోడుగా ఉంటే ఇంద్రుడైనా తమను జయింపలేడని చెప్పడం.. అతనికి శత్రువులను జయించాలనే అమితమైన కోరికను వ్యక్తపరుస్తుంది. అంతేకాదు.. “రణాగ్నికిన్ బ్రాణ హవిస్సులు వేల్చిన వారు” అయిన తన బంధువులను చూడాలని కోరుకుంటాడు. తమను గెలిపించాలనే దృఢ సంకల్పంతో ధర్మ రక్షణ అనబడే.. రణమనే అగ్నికి తమ ప్రాణాలను హవిస్సులుగా సమర్పించిన బంధువులను చూడాలని అనుకోవడం మానవులకు సహజమైన కృతజ్ఞతా భావనయే. ఆ కోరికను విన్న మహర్షులు అలాగే అంటారు. నిజానికి వ్యక్తి మనసులో నిగూఢంగా ఉన్నటు వంటి కోరికలు బలమైన సూచనల ద్వారా సాకారమౌతాయి. ఎన్ని బోధలు విన్నా, స్వర్గంలో నిలిచినా ధర్మరాజు మనసు సమత్వాన్ని పూర్తిగా పొందకపోవడానికి కారణం.. మానుష శరీరం ఉండడంతో సంబంధిత వాసనలు, వికారాలు ప్రకటితమవడమే.
అంతర్గతంగా నిద్రాణమై ఉన్న ప్రజ్ఞలను మేల్కొల్పడమే “ప్రబోధ” గా చెప్పుకోవాలి. అంతశ్చేతనలో నిద్రావస్థలో ఉన్న “ప్రజ్ఞ” జాగృతం కావాలి. ప్రజ్ఞ జాగృతం కావడం అన్నప్పుడు అది ఉన్నతమైనదైనా అధమమైనదైనా యేదైనా కావచ్చు. అది మన సంస్కారంపై, ప్రబోధ పరచిన గురువుపై ఆధారపడి ఉంటుంది. ప్రబోధ వల్ల అంతశ్చేతనలో ఉన్న ప్రజ్ఞ జాగృత మౌతుందే కానీ దానిని ఉపయోగించు కోవడం వ్యక్తి విజ్ఞతపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రబోధను సరైన వారి వద్ద సరైన మార్గంలో పొందడం అత్యంత ప్రాధాన్యమైన అంశం. ధర్మరాజుకు భౌతిక జీవితంలో వ్యాస, కృష్ణులు.. స్వర్గంలో ఇంద్రడు, యముడు మార్గదర్శకులుగా లభించడం వల్ల అతనిలో అవసరమైన చిత్త వికాసం కలిగింది.
యోగసాధనలో.. చిత్తవృత్తులను నిరోధించుకోవడం ప్రముఖమైనది. మనస్, అహంకారం, చిత్తం, బుద్ధి వీటి సమష్టిని వ్యావహారికంగా మనస్సని అనుకుంటాము. “మనస్” నిత్య కృత్యాలలో పనిచేసేది.. ఆలోచనలను చేయడం, పనులను నిర్వహించడానికి ఉపయుక్తమౌతుంది. “బుద్ధి” యుక్తాయుక్త విచక్షణను తెలిపేది. “అహంకారం” మన ఉనికికి ప్రతీక. వ్యావహారికంగా మనం చెప్పుకునే గర్వానికి సంబంధించిన అహంకారం వేరు. “చిత్తం” పలు జన్మలలో చేసిన పుణ్య పాప కార్యాలను తనలో నిక్షిప్తం చేసుకొని తదనుగుణమైన ఫలితాలను ఇచ్చేది. చిత్తంలో గుప్తంగా ఉండేవాడు కాబట్టే చిత్తగుప్తుడు అయ్యాడు. అతనే వ్యావహారికంలో చిత్రగుప్తుడుగా మారిపోయాడు. చిత్తవృత్తులు నిరోధింపబడితేనే యోగసిద్ధి జరుగుతుంది. దానితో అష్ట సిద్ధులూ సిద్ధిస్తాయి. సాధనా మార్గంలో ముందుకు సాగే వ్యక్తికి తనకు సిద్ధించిన అష్ట సిద్ధులు ప్రసాదింపబడిందీ లేనిదీ తెలియవచ్చు.. తెలియక పోనూవచ్చు. అయితే సిద్ధులను అనుసరించి “నకారాత్మక” శక్తులూ సాధకునిలో వచ్చి చేరుతాయి. అవి మాత్రం వాటి ఉనికిని చాటుతుంటాయి. వాటి ప్రభావాన్ని నిగ్రహించుకో గలిగితేనే సాధన ముందుకు సాగుతుంది. ధర్మరాజు తన మార్గంలో ఆ స్థాయిని చేరాడు కాబట్టే.. స్వర్గవాసం సశరీరంగా లభించింది. ఇక్కడితో ఆగిపోతే.. పుణ్యఫలం క్షీణించాక తిరిగి భూమిపై జన్మించాలి. దానిని ఎవరైతే గ్రహిస్తారో వారు సాధనను ఆపకుండా ముముక్షత్వంకై పరిశ్రమిస్తారు.. సాధిస్తారు.
నారదాది మహర్షుల బోధలచే శమతను పొందిన ధర్మరాజు, తన వెంట వచ్చిన దేవదూతను చూచి.. అయ్యా! నన్ను మా సోదరులు, ద్రౌపది ఉన్న చోటికి తీసుకు వెళ్లమని ప్రార్థిస్తాడు. సరేనని.. ఆ దేవదూత తనను ఒకదారి వెంట తీసుకు వెళుతుండగా.. ఆ దారి పొడువునా దుర్గంధం వెదజల్లబడుతూ.. అసహ్యకరమైన రీతిలో ఉంటుంది. ధర్మరాజు నరకం ఎలా ఊహించుకున్నాడో అలాగే దర్శనం ఇచ్చింది ఆ దారి. నరక మార్గం అంతా దుర్గంధ భూయిష్టమై ఉన్నది.. దుర్గంధం అంటే పాపము లేదా చెడు కార్యాచరణ కాగా సుగంధమనేది పుణ్యం లేదా సత్కార్యాచరణ. శిక్షలు అనుభవిస్తున్న పాపుల హాహాకారాలు నలు దిసలా ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ దారిలో నడుస్తూ ఇంకా ఎంత దూరమని దూతను ప్రశ్నిస్తాడు.. ధర్మరాజు. దానికి ఆ దూత మనం చేరవలసిన ప్రదేశం ఇదే అంటాడు. భరించలేని దుర్గంధ భరితమైన ఆ ప్రదేశంలో నిలువలేని ధర్మరాజు తిరిగి వెళ్ళిపోదామని వెనుదిరుగుతున్న సమయంలో.. మహాత్మా! నీవు వెళ్ళవద్దు.. అంటూ పెక్కురు ప్రార్థిస్తారు. దానిని విన్న ధర్మరాజు మీరెవ్వరని ప్రశ్నించగా వారంతా.. నేను కర్ణుడను, నేను భీముడను, నేను అర్జునుడను, నేను నకులుడను, నేను సహదేవుడను, నేను ద్రౌపదిని, నేను ధృష్టద్యుమ్నుడను, మేము ద్రౌపదీ సుతులము అని బదులిస్తారు.
ఒకటైనా మంచి పనిని చేయని దుర్యోధనుడు సపరివారంగా స్వర్గ సుఖాలు అనుభవించడం.. పుణ్యాత్ములయిన తన సోదరులు, .. నరకవాసంలో ఉండడం మ్రింగుడు పడడంలేదు, ధర్మరాజుకు. సకల పాప నాశనియగు అవబృథ స్నానంచేత పునీతయైన ద్రౌపది నరకంలో యాతనను అనుభవిస్తుంది. ధర్మరాజులో అయోమయం.. అధర్మం సుఖంగా స్వర్గంలో భోగిస్తుంటే ధర్మం కష్టాలలో నరకంలో విలపించడం సమంజసమా.. అన్యాయం కాదా. ఇది సత్యమా.. భ్రాంతియా? నిర్ణయించుకోలేని ఒకానొక మానసిక స్థితిలో ఉన్న ధర్మరాజు దేవదూతను చూచి… ఆర్యా! నా తమ్ములు భార్య ఉన్న ఈ ప్రదేశంలోనే నేనూ ఉంటాను.. నీవు వెళ్ళి నా మాటగా ఇంద్రునికి చెప్పు, అంటాడు.
ఆ సమయంలో సకల దేవతాగణంతో ప్రత్యక్షమైన ఇంద్రుడు.. ధర్మజా.. కోపం, మాత్సర్యం మొదలైన భావనలు విడిచిపెట్టు. పాపపుణ్యాలు నిజానికి సాపేక్షాలే. అవి నరకానికి లేదా స్వర్గానికి ఆవాసాలు. పాపకార్యాచరణ నరక బాధలను అనుభవానికి తెస్తే.. పుణ్యకార్యాచరణ స్వర్గభోగాలను అనుభవానికి తెస్తుంది. కలలో జీవుడు అనుభవించిన కష్ట సుఖాల విధంగానే స్వర్గ నరకాల అనుభవమూ ఉంటుంది. నిన్నిక్కడకు పంపడం భవిష్యత్తులో స్వర్గంలో నిలుపుటకే. “రాజ్యాంతే నరకం ధృవం” అన్నట్లుగా నీవు నరకాన్ని చూడవలసి వచ్చింది. రాజ్యపాలన చేసేవాడు ఎంతటి ధర్మాత్ముడైనా ఎక్కడో ఒక దగ్గర తెలిసి గానీ తెలియక గాని అధర్మవర్తనుడౌతాడు. నీవు అలాగే నరక ద్వారాన్ని దర్శించావు. భ్రాంతిని పొందావు. నీ నరక వాస సమయం సమాప్తమయింది. మాతో బయలుదేరమని ఆహ్వానిస్తాడు.
ఇలా ఎన్ని చెప్పినా ఇంకా సంశయిస్తున్న ధర్మరాజుతో.. ఆతని సంశయానికి కారణాన్ని గ్రహించిన ఇంద్రుడు భౌతిక శరీరగతమైన మమకారాన్ని విడిచిపెట్టమని చెపుతూ.. ఆకాశగంగలో స్నానాన్ని ఆచరించమంటాడు.
ఆ సమయంలో అక్కడే ఉన్న యముడంటాడు.. ధర్మజా! ద్వైతవనంలో యక్షునిగానూ, మహాప్రస్థానంలో కుక్కగానూ నిన్ను పరీక్షించాను. నీకు ఇప్పుడిది మరొక పరీక్షగా ఆశ్రితులు, బంధువుల రక్షణ పట్ల నీ కర్తవ్యాన్ని పరీక్షించాను, అంటాడు. ధర్మరాజు లోని సారభక్తి లేదా అంతస్తత్వ భక్తిని అభినందిస్తూ.. యముడు.. ధర్మరాజా! నీవు సమగ్రంగా పరిశోధింపబడ్డావు. అనగా పాప క్షాళన జరిగింది. శోధన అంటే క్షాళనమే. నిజానికి, ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధానంతరం తాను సాధించిన రాజ్యమంతా నెత్తుటి కూడనే వైరాగ్యాన్ని పొందాడు.. దానితో “తృష్ణా” క్షయమయింది. కౌరవులపై ప్రతీకారం తీర్చుకోవాలనే తీవ్రమైన “కోరిక”తో రగిలిపోయాడు. ఆ కోరికా క్షాళనమయింది. నరకానుభవం చేత రాజ్యపాలన వల్ల కలిగిన దోషాలు క్షయమయ్యాయి. దానితో స్వర్గావాసానికి పూర్తి అర్హతను సాధించాడు.
రామాయణంలో స్వజనులను రక్షించిన శ్రీరాముని వలెనే.. స్వజనల గూర్చి పరితపించి రక్షించిన ధర్మరాజును యముడు.. ఆకాశ గంగలో మునకలేయమని సూచిస్తాడు. అలా గంగా స్నానం చేత పునీతుడైన ధర్మరాజులో ప్రశాంతమైన మానసిక స్థితి నెలకొంటుంది. భౌతిక శరీరం అదృశ్యమై అతను తేజోమయ దివ్య శరీరంతో ప్రకాశితుడయ్యాడు. అతనికి అల్లంత దూరంలో.. నారాయణుని సమీపంలో భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్న నరుని (అర్జునుని) చూచాడు. సూర్య సమూహంలో అలరారే కర్ణుడినీ చూచాడు. మరుద్దేవతల మధ్య నున్న భీముడినీ చూచాడు. అశ్వినీ దేవతల సమీపంలో నున్న నకుల సహదేవులనూ చూచాడు.
ఆ పిమ్మట.. ప్రభాతోదయ సూర్యకాంతితో సమానమైన దివ్యకాంతితో ప్రకాశిస్తున్న ఒక స్త్రీ మూర్తిని చూచి ఆమె ఎవ్వరని ప్రశ్నిస్తాడు. దానికి ఇంద్రుడు.. ఆమె మహేశ్వరుని ఆజ్ఞచేత మహాలక్ష్మి అవతారంగా అవతరించిన ద్రౌపది అని చెపుతాడు. అలాగే ధృతరాష్ట్రుడిని, ఉపపాండవులను చూపుతాడు. ఇక్కడ ఒక అనుమానం.. తన తమ్ములను, కర్ణుడిని పోల్చుకోగలిగిన ధర్మరాజు ద్రౌపదిని పోల్చుకోలేకపోవడం ఏమిటి? పాండవులు కృష్ణునితో సహా మానవ గర్భసంజాతులు.. ద్రౌపది కారణజన్మయైన అయోనిజ. ఆదిపర్వంలో కనిపించే ఇంద్రసేన ఈశ్వరుని ఆజ్ఞచేత ద్రౌపదిగా జన్మించిందనే విషయాన్ని స్మరించుకోవాలి. ద్రౌపది.. ఇఛ్ఛాజ్ఞాన క్రియా శక్తుల సమష్టి తత్త్వం. దైవకార్య నిర్వహణలో ముఖ్య భూమిక వహించినదీ ద్రౌపదియే. మహాలక్ష్మీ అవతారం కనుకనే ఆమె ఆ బాధ్యతను నిర్దుష్టంగా, నిబ్బరంగా నిర్వహించ గలిగింది.
అలా చెపుతూ.. తక్కు వారిని అందరినీ చూపుతాడు.. ఇంద్రుడు. తదుపరి ఎవరెవరు ఏయే శక్తులలో లయమయ్యారో దర్శిస్తాడు, ధర్మరాజు. ఇక్కడ పలు ధార్మికాంశాలను ప్రస్తావిస్తుంది భారతం. అలాగే భారతాన్ని విన్నా, చదివినా, సకల సంపత్తులూ సిద్ధిస్తాయని ఫలశ్రుతినీ చెపుతుంది.
అయితే చివరగా ఒక్కమాట .. ఏ జ్ఞానమైనా వినినంతనే సిద్ధించదు. దానిని ఆచరిస్తేనే ఫలితం ఉంటుంది. ఆచరణలేని జ్ఞానం.. వికాసాన్ని ఇవ్వజాలదనే సత్యాన్ని ధర్మరాజు పాత్ర ద్వారా వ్యాసులవారు మహాభారతంలో చక్కగా చెప్పారు.
పాలకుర్తి రామమూర్తి సింగరేణి కాలరీస్‌లో పని చేసి ఫైనాన్స్ అండ్ ఎకౌంట్స్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేశారు. ‘భారతీ స్తవము’, ‘వేద సంస్కృతి – వివాహ సంస్కారోద్దేశ్యము’, ‘శ్రీ సరస్వతీ సన్నిధానము’, ‘గంగావతరణం’ వంటి సంప్రదాయ పద్య కావ్యాలతో పాటుగా ‘వ్యక్తిత్వం విజయపథం’ వంటి వ్యక్తిత్వ వికాస గ్రంథాలతో మొత్తం 17 పుస్తకాలు రచించారు. ఎన్నో వ్యాసాలు వ్రాశారు. సాఫ్ట్ స్కిల్స్ ట్రెయినర్‌గా వ్యవహరిస్తున్నారు. 25 టెలీఫిల్మ్లలో పాల్గొన్నారు. యువతరానికి మేధోపరమైన, భావోద్వేగ నైపుణ్యాలను అందించడంలో ఆసక్తి.