[స్వాతీ శ్రీపాద గారు రచించిన ‘స్వప్నాలు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
స్వప్నాలు ఆకాశం నుండి ఊడి పడవు
నాలుగు రసాయనాలు కలిపేసి కరిగించీ వేడిచేస్తేనో
చటుక్కున ప్రత్యక్షం కావు
మేల్కొన్న జగత్తులో వికసించవు
నిద్రామెలుకువా కాని సాయం సంధ్య సమయం
మనసును ఆవరించినప్పుడు
మత్తెక్కిన కనురెప్పలు వాలితేనే
వాటిని తివాసీలుగా మలుచుకు
మత్తేభాలై నడిచి వస్తాయి.
కొత్తలోకంలో విహారానికి వెళ్ళిన ఆత్మను
చూడచక్కని సొబగులూ
ఎన్నడూ చూడని వింత జీవులూ
గుంపులు గుంపులుగా గుమిగూడి
లోలోపల మొలకెత్తని గుప్త రహస్యాలను
గుప్పిళ్ళతో లాగి
తనివితీరని తమకాలను కాచివడబోసి
కనురెప్ప పాటుల మధ్య త్రిశంకును కల్పిస్తాయి
స్వప్నాలు ఊరికే రావు
ఎత్తుపల్లాల దారిలో ఎదురుదెబ్బలు నిమురుకుంటూ
ఇంకిపోయిన పీడకలల ఉప్పు సముద్రాలు దాటినప్పుడు
గుండెపొరల్లోంచి తొంగిచూసే
సౌరభవనాలే స్వప్నాలు.
జ్ఞాపకాల ఊటలో నాని నాని
తీపి తలపుల తేనె వాగులే కలలు
స్వప్నాలు ఉరికే రావు
లోకాన్ని వీపున మోస్తూ
చిరునవ్వులు విరబూయిస్తే తప్ప
స్వప్న మాధుర్యాలు
తియ్యని మధురరసాలుగా మారవు.
అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, అనేక నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో ‘మానస సంచరరే’ శీర్షిక నిర్వహించారు.