[గంగరాజు పద్మజ గారు రచించిన ‘స్వాగతం సగటుబతుకుల స్వగతం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
స్వాగతమమ్మా కరయుగం జోడించి నీకు
తొలి పర్వమైన యుగాది
శృతి ఆధారంగా వ్యాప్తమై క్రమంగా
మా నోట మారిన ఉగాది
ఏదేమైనా ఇది వాస్తవం
పవిత్ర పర్వదినంగా
జరుపు సంప్రదాయం నేటిది కాదు అనాది
ప్రకృతి ప్రసాదించే పదార్థాలు
ప్రసాద వినియోగంకి వేసింది పునాది
అరవైమంది తోబుట్టువుల్లో
విశ్వావసూ! నీ సంఖ్య ఎన్నోది?
నీ ఆగమనం మాకివ్వగలదు ఉపశమనం
నిర్వివాద సత్యమది
శిశిరంలోని నైరాశ్యాన్ని తోసేస్తూ
వసంతం ప్రవేశంతో పులకించు హృది
షడ్రుచుల రసాలకై ఆబగా కోరు మది
పండుగ పనిపాటల విషయంలో చూపదు తేడా
పడుచు మది పర్యావరణ పరిరక్షణ తోడై
ప్రకృతి పడతి అందాలప్రోది
శుకశారికలు చంచరీకాల
సంచారానికి వనోద్యానాలే వేది
రంగు రంగుల పుష్పాంగాలకు
విహంగాలసరాగాలకు ఎందుకుంటుంది తుది?
పెరుగుతున్న ధరలపై
అరుగుతున్న మరలాంటి బ్రతుకుల సోది
షట్పద సామ్రాట్టులేలే సామ్రాజ్యం
నిమ్న మధ్యతరగతుల ఇరుకుగది
కృత్రిమ మేధ అంటువ్యాధుల వ్యథ
మనసంతా ఏదో ఇది!?
అందుకే కలంలో చెప్పలేని కలవరం అదే 🥭