Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సుపారి కిల్లర్

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన డా. మామిడాల శైలజ గారి ‘సుపారి కిల్లర్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

ద్వారక బార్..

ఏసీ సెక్షన్‌లో అడుగుపెట్టాడు జానీ. పొడవాటి విగ్రహంతో బక్క పల్చగా ఉన్న అతను మాసిపోయిన గడ్డాన్ని తడుముకుంటూ నిగూఢమైన భావాలను ప్రతిఫలించే లోతైన కళ్ళతో ఒకసారి చుట్టూ చూసి ఎప్పుడూ కూర్చునే టేబుల్ దగ్గరకి వచ్చి కుర్చీ వెనక్కు లాగి నిర్లక్ష్యంగా కాళ్లు బార్లా చాపుకుని కూర్చున్నాడు.

జానీని చూడగానే స్టీవార్డ్ దగ్గరగా వచ్చి నిలబడ్డాడు వినయంగా. ఎప్పుడు ఆర్డర్ చేసేదే అన్నట్లుగా చూడడంతో తల ఊపి వెనక్కి వెళ్ళిపోయాడు స్టీవార్డ్.

ఒకసారి పరిసరాలను పరిశీలనగా చూశాడు. తనకు కాస్త దూరంలో టేబుల్ దగ్గర ముగ్గురు వ్యక్తులు మంద్రస్వరంతో మాట్లాడుకుంటూ బ్లాక్ డాగ్‌ని చప్పరిస్తున్నారు. డిమ్ లైట్ వెలుగులో వాళ్ల ముఖాలు సరిగా కనిపించడం లేదు కాకపోతే ఏదో విషయం సీరియస్‌గా చర్చించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పెద్దగా పట్టించుకోవాల్సిన విషయంగా అనిపించలేదు జానీకి. మనసును సుదూర తీరాలకు లాక్కుపోతున్నట్లుగా ఉన్న సన్నని స్వరంతో వినిపిస్తున్న సంగీతాన్ని ఆస్వాదిస్తూ రిలాక్స్‌డ్‌గా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు.

స్టీవార్డ్ జానీ ఎప్పుడు తాగే బ్రాండ్ బాటిల్, గ్లాస్ ఉన్న ప్లేట్‌ని టేబుల్ పైన పెడుతూ “సర్” చిన్నగా పిలిచాడు.

కళ్ళు తెరిచి చిన్నగా తలపంకించి బాటిల్లోని ద్రవాన్ని గ్లాసులోకి షిఫ్ట్ చేసి నెమ్మదిగా ఆస్వాదిస్తూ తాగడం మొదలుపెట్టాడు.

జానీ ముంబాయి మహానగరంలో పేరుమోసిన సుపారి కిల్లర్. నగరానికి ఎప్పుడు వచ్చాడో ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు. ఒంటరిగానే ఉంటాడు. పెద్దగా జనసమర్థం లేని అందేరీలోని ఒక చిన్న గదిలో ఎవరితోనూ సంబంధం లేనట్లుగా తన పని తాను చేసుకుంటూ పోతాడు. బడా బడా వ్యాపారవేత్తలకు, రాజకీయ నాయకులందరికీ జానీ రైట్ హ్యాండ్ లాంటివాడు. ఒక్కసారి కనుక సుఫారి కాంటాక్ట్ తీసుకున్నాడు అంటే అనుకున్నది అనుకున్నట్లుగా టైమ్‌కి పని కానిచ్చేయడం అతని నైజం. అలాగే పేమెంట్ విషయంలో కూడా ఎలాంటి మొహమాటం లేకుండా ఖచ్చితంగా ఉంటాడు. తమ పని గుట్టుచప్పుడు కాకుండా అయితే చాలు అనుకునే వారు డబ్బు విషయం పట్టించుకోకుండా అతడు అడిగిన మొత్తాన్ని ముట్టచెబుతారు. వారికి జానీ అంటే ఒక నమ్మకం. ఒక్కసారి సుపారి ఇచ్చారంటే తమ పని అయిపోయినట్లుగా నిశ్చింతగా ఉంటారు. గుట్టుగా పని జరగాలంటే మొదటగా వెళ్ళేది జానీ దగ్గరికే. ఎందుకంటే చెప్పిన పనిని చెప్పిన సమయానికి ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా ప్లాన్డ్‌గా కంప్లీట్ చేసేస్తాడు. ఒక్కసారి ఒక పని ఒప్పుకున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికి కానిచ్చేస్తుంటాడు. ఆ సమయంలో జాలి, దయ లాంటి ఎమోషన్స్ ఏమాత్రం ఉండవు అతనికి. హత్యలు చేయడం అంటే మంచినీళ్ల ప్రాయం. డజన్ల కొద్ది హత్యలు చేసినా చూసేవారికి అందరిలా సాధారణమైన వ్యక్తి లాగే కనిపిస్తాడు. ఎక్కడ ఈషణ్మాత్రం కూడా అనుమానం రాకుండా వ్యవహరిస్తాడు. అందుకే అతని వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి అవకాశాలు.. ప్రతిరోజు అతడు ఠంచనుగా వచ్చే ద్వారకా బార్ అతని అడ్డా అని అందరికీ తెలుసు.

రెండవ పెగ్గు తీసుకుంటుండగా జేబులో ఉన్న మొబైల్ రింగ్ అయింది. అటు నుంచి గంభీరంగా ఉంది స్వరం “జానీ సుపారి తీసుకొని నాలుగు రోజులైంది పని ఇంకా పూర్తి కాలేదు. వాడు గంధర్వ అపార్ట్మెంట్లోని మూడవ ఫ్లోర్‌లో ఒంటరిగా ఉంటున్నాడు. ఇంకో వారం రోజుల్లో వాడి ఫ్యామిలీ రావచ్చు అప్పుడు పని కానివ్వడం కష్టమవుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడే వేసేయడం ఈజీ..” ఇంకా ఏదో చెప్పబోతుండగా

“చూడండి బాస్ మీరు ఇచ్చిన సమయం ఇంకా నాలుగు రోజులు ఉంది. ఆలోగా పని కంప్లీట్ చేసేస్తాను”

“అది కాదు జానీ అర్థం చేసుకో ఆ గణేష్ గాడు నాకెంత తలనొప్పిగా తయారయ్యాడో.. నా వ్యాపారంలోని లొసుగులన్నింటినీ పట్టుకొని, అన్వేషించి మరీ పత్రికలో రాస్తున్నాడు. ఏ క్షణం ఏమవుతుందో అని నిద్ర కూడా పట్టడం లేదు నాకు. నయానో భయానో చెప్పి, బెదిరించి, భయపెట్టి డబ్బు ఆశ చూపించి వాడిని లొంగదీసుకోవాలని ఎంత ప్రయత్నించానో.. కానీ దేనికి లొంగకుండా కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. అందుకే వాడిని ఈ లోకంలో నుంచే పంపేయాలని నిర్ణయించుకుని నిన్ను అప్రోచ్ అయ్యాను. నువ్వేమో ఇలా మీన మీషాలు లెక్క పెట్టుకుంటూ..”

“నాకిలా పదేపదే ఫోన్ చేయకండి. మీరు ఇచ్చిన గడువు లోపల తప్పకుండా పని పూర్తవుతుంది. అమౌంట్ రెడీ చేసుకోండి” ఫోన్ కట్ చేశాడు.

బాటిల్ ఖాళీ చేసి మరొకటి తెమ్మన్నట్లుగా సైగ చేశాడు.. ఎప్పుడూ ఒక బాటిల్ తోనే సరిపెట్టుకునే జానీకి ఈరోజు ఎందుకో లిమిట్‌కి మించి తాగాలనిపిస్తోంది.

జానీ రెండవ బాటిల్ మొదలుపెడుతుండగా పక్కనున్న మరో టేబుల్ దగ్గరకు నలుగురు వ్యక్తుల బృందం వచ్చి కూర్చుంది. ఇంతకుముందు వాళ్ళలాగా వీళ్ళు చిన్నగా మాట్లాడుకోవడం లేదు. గట్టిగా పోట్లాడుకుంటున్నట్టుగా మాట్లాడుతూ వెకిలిగా నవ్వుతూ, బూతులు తిట్టుకుంటూ అక్కడ ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని ఒక్కసారిగా కలుషితం చేసేసారు. వాళ్ళ వైపు చిరాగ్గా చూసి తన పనిలో తాను పడ్డాడు జానీ.

మెల్లమెల్లగా మత్తు తలకెక్కసాగింది జానీకి. మోతాదు మించి తీసుకోవడం వల్లనేమో కళ్ళు కూడా మసకబారడం మొదలయ్యాయి. ఇక ఆపేద్దాం అనుకునేలోగా పక్క టేబుల్ లోని వ్యక్తులు గట్టిగా తిట్టుకుంటూ కుర్చీలు పైకెత్తి గ్లాసులు విసిరేస్తు హంగామా సృష్టించడం మొదలుపెట్టారు.

ఒక్కసారిగా సహనం కోల్పోయాడు జానీ. “హలో ఎక్స్‌క్యూజ్ మీ.. నాకు కాస్త ప్రైవసీ కావాలి. దయచేసి సైలెంట్ గా ఉండండి. లేకపోతే బయటికి వెళ్లి గొడవ పడండి” విసుగ్గా అన్నాడు.

అందులో కళ్ళు రక్తవర్ణంలో ఉన్న ఒక వ్యక్తి జానీ వైపు చూసి “నువ్వేవడివిరా మమ్మల్ని బయటికి పొమ్మనడానికి ఇదేమన్నా నీ అయ్య బారా.. కావాలంటే నువ్వు దొబ్బెయ్” అన్నాడు అగ్రెసివ్‌గా.

కోపం నషాలానికి అంటింది జానీకి. వాడిని అక్కడికక్కడే ఏసెయ్యాలన్నంత ఇరిటేట్ అయ్యాడు. కానీ తను ఏం చేసినా మూడో కంటికి తెలియకుండా చేస్తాడు. ఈ పబ్లిక్ ప్లేస్‌లో అలా చేయడం మంచిది కాదు. తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు.

గ్లాస్ పక్కన పెట్టి డైరెక్ట్‌గా బాటిల్ ఎత్తి తాగడం మొదలు పెట్టాడు. వాళ్ల గొడవ మెల్లమెల్లగా ఎక్కువవుతుంది. గ్లాసులు విసిరేస్తూ కుర్చీలు లేపుతూ గట్టిగా అరుచుకోవడం మొదలుపెట్టారు. బార్ బౌన్సర్స్ వచ్చి వాళ్లను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వాళ్ళు ఏ మాత్రం తగ్గడం లేదు.

జానీ సహనంగా ఉండడంతో ఇంకా రెచ్చిపోయి ఎకసెకాలు ఆడుతూ రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. రెండవ బాటిల్ కూడా కంప్లీట్ చేసిన జానీ మనీ పే చేసి పూర్తిగా స్వాధీనం తప్పుతున్న శరీరంతో లేవబోయి తూలిపడబోతుండగా “సర్” అంటూ చేయి అందించబోయాడు స్టీవార్డ్.

“ఇట్స్ ఓకే..” పర్వాలేదన్నట్టుగా చెయ్యి చూపించాడు జానీ.

అప్పటికే అర్ధరాత్రి దాటింది. మరో గంటలో తాను చేయాల్సిన ఇంపార్టెంట్ డీల్‌ని గుర్తు చేసుకుంటూ బయటకు వెళ్ళబోతుండగా పక్క టేబుల్ లోని అగ్రెసివ్ వ్యక్తి విసిరిన బీర్ బాటిల్ అతివేగంగా గింగిరాలు తిరుగుకుంటూ వచ్చి జానీ కుడి చెవి వెనక భాగంలో బలంగా తాకింది. ఎంత ఫోర్సుతో అంటే అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని స్థితిలో స్పృహ తప్పి పడిపోతుండగా “అరే చెక్క నాయాల గాడు పారిపోతున్నాడురోయ్” అన్న మాటలు లీలగా వినిపించాయి.

***

నెమ్మదిగా కళ్ళు తెరిచాడు జానీ అప్పుడప్పుడే తెలవరాబోతుంది అనడానికి సూచనగా చిన్నగా రణ గొణ ధ్వనులు వినిపిస్తున్నాయి. కాసేపు తనెక్కడున్నాడో అర్థం కాలేదు. తలతిప్పి చుట్టూ చూశాడు తన గదిలోనే ఉన్నాడు. కాళ్లకు షూస్ అలాగే ఉన్నాయి. తల పైన చేయి వేసుకున్నాడు. రాత్రి తగిలిన గాయానికి కట్టు కట్టిన క్లాత్ చేతికి తగిలింది. మెల్లగా అన్ని స్మరణ లోకి రావడం మొదలుపెట్టాయి. తను దెబ్బ తగిలి పడిపోవడం వరకే గుర్తుంది. ఆ తర్వాత తనని రూమ్ కు ఎవరు తీసుకొచ్చారో అర్థం కాలేదు. అయోమయంగా అనిపించింది మెల్లగా లేచి కూర్చున్నాడు గాయం తాలూకు ప్రభావం కావచ్చు తల భారంగా ఉంది. రెండు కాళ్ళను గట్టిగా విదిల్చి షూస్ గది మూలకు విసిరేసి నిలబడ్డాడు. గదిలో ఒక రకమైన నీచు వాసన వ్యాపించి ఉంది. కిటికీ తలుపులు తెరవడానికి ఒక అడుగు ముందుకు వేసిన వాడల్లా కాలికింద ఏదో మెత్తగా తగిలేసరికి వెనుకడుగు వేశాడు. కిందికి చూసిన జానీ ఆశ్చర్యానికి అంతులేదు. అక్కడ రక్తసిక్తమైన బట్టలతో బోర్లా పడిపోయిఉన్న మనిషి తల అటువైపు తిరిగి ఉంది. ఆ వ్యక్తి గొంతు సగానికి పైగా తెగిపోయి రక్తనాళాల నుంచి స్రవించిన రక్తం గదంతా పరుచుకొని రక్తం అంచులు నల్ల రంగుకు తిరిగి ఉన్నాయి. హత్య జరిగి చాలా సేపు అయిందనడానికి నిదర్శనంగా. తన వృత్తిలో భాగంగా అంతకంటే దారుణమైన దృశ్యాలు చూశాడు జానీ కానీ అతన్ని ఆశ్చర్యానికి గురిచేసింది ఆ శవం తన గదిలోకి ఎలా వచ్చింది అనేదే.. శవాన్ని దాటుకుంటూ వెళ్లి కిటికీ తలుపులు తెరిచాడు. లేత వెలుతురు గదంతా పరుచుకుంది. శవాన్ని కాలితో పక్కకు జరిపి పరిశీలనగా చూశాడు. ఎప్పుడు చూసిన గుర్తులేదు. తనకు తెలియని ఎవరో అపరిచిత వ్యక్తి. అతడు తన గదిలోకి ఎలా వచ్చాడు అనేది అతని ఊహకి అందడం లేదు అసలు తనను గదిలోకి ఎవరు తీసుకొచ్చారు?

మళ్లీ వెనక్కి వచ్చి మంచం మీద కూర్చున్నాడు. ఈ హత్య ఎవరు చేసారో ఎందుకని తన గదిలో వేశారు ఇప్పుడు తన ఏం చేయాలి? కాసేపట్లో పూర్తిగా తెల్లవారుతుంది పనిమనిషి వస్తుంది. చుట్టుపక్కల వారు లేస్తారు. అప్పుడు శవాన్ని మాయం చేయడం కష్టం. ఒకవేళ శవాన్ని గనక ఎవరైనా చూస్తే తను చిక్కుల్లో ఇరుక్కుంటాడు. ఇప్పటికే తాను ఎన్నో మర్డర్స్ చేసినా పకడ్బందీగా ఏ ఆధారం లేకుండా తన మీద ఏ అనుమానం రాకుండా చేశాడు. ఇప్పుడు ఈ శవం బయటపడితే కనుక ఏమైనా ఉందా? తన పాత నేరాలన్నీ బయటకు వస్తాయి.

ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్ళ లేచి నిలబడ్డాడు. పది నిమిషాల్లో రూమ్‌కు లాక్ చేసి కార్ స్టార్ట్ చేశాడు. ఫోన్ రింగ్ అయింది. అవతల నుంచి పరాంకుశం. ముంబాయి మాఫియాకు ఎదురులేని అధినేత. తను కన్నుసన్నలలో ముంబాయిని ఒక ఆట ఆడించగల సత్తా ఉన్నది అతనికి.

“జానీ ఎక్కడున్నావ్ పది నిమిషాల్లో నా ముందుండాలి నువ్వు. లేకుంటే మ్యాటర్ విల్ బి వెరీ సీరియస్..”

“సార్ వినండి చిన్న పొరపాటు వల్ల మీరు చెప్పిన పని కంప్లీట్ చేయలేకపోయాను. ఒక్క రోజు సమయం ఇవ్వండి పని పూర్తి చేసి మీ ముందు ఉంటాను. లేని పక్షంలో మీరు చేసుకున్న ఒప్పందం ప్రకారం మీకు సరెండర్ అయిపోతాను ప్లీజ్ సర్..”

“అలా కుదరదు జానీ.. ఆ వ్యక్తి వల్ల నా వ్యాపార సామ్రాజ్యానికే కాదు. నా ప్రాణాలకు ప్రమాదం వాటిల్లిందని, వెంటనే పని కానివ్వమని నీకు సుపారి ఇస్తే పట్టించుకోకుండా ఆలస్యం చేస్తావా? వాన్ని గనుక వెంటనే ఖతం చేయకపోతే నిన్ను లేపేస్తానని చెప్పా కదా! ఏం ఆటలుగా ఉందా? నిన్న రాత్రే పని కానివ్వమన్నాను కదా?” కటువుగా వుంది గొంతు.

“ఇప్పటివరకు నాకు మీరు అప్పగించిన ఏ పనైనా డిలే జరిగిందా బాస్.. ఊహించని కారణాలవల్ల నిన్న రాత్రి పని పూర్తి చేయలేకపోయాను. అనుకోకుండా నిన్న ఒక ప్రమాదం జరిగి..”

“షటప్.. కుంటి సాకులు చెప్పకు జానీ.. ఇప్పటికే ఆలస్యమైంది వెంటనే పని కాని చేస్తేనే సరి లేకపోతే నీ భరతం పడతారు నా మనుషులు. గంట టైం మాత్రమే ఇస్తున్నా నీకు. వాడి ప్రాణమా నీ ప్రాణమా ఆలోచించుకో” కాల్ కట్ అయిపోయింది.

‘ఓహ్ గాడ్.. నిన్న అనవసరంగా ఎక్కువ తాగి చిక్కుల్లో పడిపోయాను. దానికి తోడు ఎవడో కొట్టిన దెబ్బకి స్పృహ కోల్పోయాను. ఇప్పుడైనా పని పూర్తి చేద్దాం అంటే ఈ గొడవ ఒకటి వచ్చి పడింది’ అనుకున్నాడు. కోపంగా పళ్ళు బిగించి “షిట్..” అంటూ స్టీరింగ్‌ని గట్టిగా పట్టుకొని ఎక్సెలరేటర్ రైస్ చేశాడు.

ఇరవై నిమిషాల్లో మెట్లు ఎక్కి గది తలుపులు తీయబోతుండగా “సారూ ఇంత పొద్దుగాల ఏడకి పోయారు? ఇది రెండోసారి రావడం నేను. బేగి తలుపులు తెరవండి. ఇంకా చానా ఇండ్లు ఉన్నాయి నాకు తొందరగా పని చేసుకుని పోతాను.” పనిమనిషి రంగమ్మ అంది.

తాళం తీయబోతున్న వాడల్లా ఆగిపోయాడు. “ఇవాళ పని వద్దు వెళ్లి రేపు రా” అన్నాడు అసహనంగా.

“అదేంది సారు ఎలాగూ వచ్చేసానుగా.. ఇల్లు చిమ్మి గిన్నెలు తోమి, బట్టలు ఉతికి పోతా మళ్ళీ రేపు పని ఎక్కువైతుంది లేకపోతే.. అవును సారు.. తలకు కట్టు కట్టుకున్నారు ఏమైంది?”

“ఏమీ కాలేదు కానీ ఈరోజు పని వద్దంటున్నాను వెళ్ళు..” గద్దించినట్లుగా అన్నాడు.

“ఏంటి ఈ బాబు ఈరోజు అదోలా మాట్లాడుతున్నాడు.. పని వద్దంటాడేంటి?” వెనక్కి చూసుకుంటూ వెళ్ళిపోయింది రంగమ్మ.

ఆమె వెళ్లిపోయేదాకా చూసి రూమ్ లోకి వచ్చి డోర్ పెట్టి తాను తెచ్చిన సంచిలోంచి రెండు పెద్ద కత్తులు బయటికి తీశాడు. గది కిటికీలను మూసివేసి శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి రెండు సంచులలో విడివిడిగా సర్దాడు. ఇదంతా చేయడానికి రెండు గంటల సమయం పట్టింది అతనికి. ఒక్కసారిగా తల ప్రాణం తోకకు వచ్చినట్లు అయింది. మెల్లగా డోర్ ఓపెన్ చేసి బయటకు తలపెట్టి చూసి ఎవరూ లేరని నిర్ధారించుకొని ఒకదాని తర్వాత ఒకటి సంచులను డిక్కిలో కుక్కి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేయబోతుండగా “ఏంటి జానీ కార్లో ఏదో తీసుకెళ్తున్నట్టు ఉన్నావ్ ఏదైనా ఊరు వెళ్తున్నావా ఏంటి? రాత్రి కూడా చాలా లేటుగా వచ్చినట్టు ఉన్నావే?” మార్నింగ్ వాక్‌కి వెళ్లి వస్తున్న గంగాధర్ పలకరించాడు.

ఒక్కసారిగా గతుక్కుమన్నాడు జానీ. “అదేం లేదండి కొంచెం అర్జెంట్ పని ఉంది వస్తాను..” కార్ స్టార్ట్ చేయబోతుoటే “అంకుల్.. అంకుల్” అంటూ దూరంగా పిలుస్తూ వస్తున్న కౌశిక్ కనిపించాడు.

రెండిళ్ల అవతల వుండే పదిహేనేళ్ల కౌశిక్ “అంకుల్ ఈరోజు మా స్కూల్ బస్సు రాలేదు. కాస్త స్కూల్ దాకా డ్రాప్ చేస్తారా ప్లీజ్..”

“నేను అటు వెళ్లట్లేదు కౌశిక్ నువ్వు ఆటోలో వెళ్ళు..” మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అన్నాడు.

దూరంగా పోలీస్ జీప్ సౌండ్ వినిపించింది..”బాయ్” అంటూ వేగంగా కార్ స్టార్ట్ చేశాడు జానీ.

గంటన్నర తర్వాత నగర శివారులోని డంప్ ఏరియా దగ్గర ఆగింది కారు. పెద్దగా ఎవరూ జనాలు లేరు. డిక్కీ లోని సంచులను ఒక్కొక్కటిగా తీసి గబగబా పని కానిచ్చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుని నిట్టూర్చాడు జానీ.

ఇక పరాంకుశం పని చూడాలి అనుకున్నాడు మనసులో.

కారు స్పీడ్ అందుకొని డొంక రోడ్ నుంచి మెయిన్ రోడ్డు పైకి ఎక్కి మలుపు తిరిగింది. సమయం చూసుకున్నాడు 11:50 నిమిషాలు.

ఎన్నో దారుణమైన, భయంకరమైన హత్యలు చేసి ఈజీగా తప్పించుకున్నాడు. తను కానీ ఈరోజు మాత్రం చేయని హత్యకు నానా తంటాలు పడి సుపారి ఇచ్చిన వాడు ప్రాణాలు తీస్తానని బెదిరిస్తున్నా ఇన్ని కష్టాలు పడవలసి వస్తోంది. పళ్ళు బిగించాడు ఒక్కసారి. ఈ సమస్య నుంచి బయటపడినట్లే.. ఇకనైనా పరాంకుశం పని చూడాలి.. లేకపోతే అన్నంత పని చేసే ఘనుడు పరాంకుశం. ఆలోచనలో ఉండగానే ఇంటి ముందుకు వచ్చి ఆగింది కారు. ఎందుకో అక్కడ కొంచెం అలజడిగా, సందడిగా అనిపిస్తుంది. అక్కడక్కడ పల్చగా ఉన్న జనాలు ఆసక్తిగా ఏదో చూస్తున్నారు.

ఇంతలో మొబైల్ ఫోన్ మెసేజ్ వచ్చినట్లుగా బీఫ్ సౌండ్ ఇచ్చింది.

ఓపెన్ చేసి చూసాడు. అన్‌నోన్ నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్ అది.

“ఒరేయ్ జానీ.. డబ్బులకు కక్కుర్తి పడి అభం శుభం ఎరుగని నా తమ్ముణ్ణి కనీసం శవం కూడా దొరక్కుండా మాయం చేశావు. ఇట్లా ఎంతమంది ఉసురు తీస్తావు? నీ పాపం పండే రోజు వచ్చింది. నువ్వు చేయని హత్యకు శవాన్ని నీ గదిలో వేసి నువ్వు చేసే ప్రతి చర్యను గమనిస్తూ పోలీసులకు ఫార్వర్డ్ చేశాను. అంతేకాదు పరాంకుశం ఇచ్చిన సుపారి పూర్తి చేయకుండా డిలే చేసి వాడికి ఆగ్రహం తెప్పించేలా చేశాను. అటు పోలీసులు, ఇటు పరాంకుశం మనుషులు వేటకుక్కల్లా నీ వెంట పడతారు. తీగ లాగి నీ డొంకంతా బయట పెడతారు. ఇక నీ పని ఖతం. నువ్వు నాకు చేసిన నష్టానికి నేనిస్తున్న బహుమతి ఇదే..”

తలెత్తి పైకి చూసిన జానికి దూరం నుంచి తన గదిలోంచి తన వైపు పరిగెత్తుకుంటూ వస్తున్న పోలీసు జాగిలాలు కనిపించాయి. నిమిషంలో పోలీసులు జానీ కారును చుట్టుముట్టారు.

దూరంగా ఫార్చునర్‌లో కూర్చున్న పరాంకుశం మనుషులు ఆ దృశ్యం చూసి మందహాసం చేశారు.

Exit mobile version