[‘సునేత్ర పబ్లిషర్స్’ అనే అనువాద కథని అందిస్తున్నారు రంగనాథ రామచంద్రరావు. కన్నడ మూలం – కావ్య కడమె.]
మానవత్వం అనే ద్రవాన్ని చుక్క చుక్కగా పోగొట్టుకుంటున్నప్పుడు కనీసం మనకైనా దాని అవగాహన కలగకూడదు. అంటే ఒక ఘడియ సుఖంగా కళ్ళు మూసుకోవడానికైనా సాధ్యం. మన రాజకీయ నాయకులు ఉన్నారు కదా? అటు వేలాది కోట్ల రూపాయలు మింగి ఇటు హోమాలు హవనాలు చేసి బ్యాలెన్స్ చేసుకు మళ్ళీ తల ఎత్తుకునే తిరుగుతారు కదా. ఉంటే ఆ విధంగా ఉండాలి. అంటే ఒక ప్రశాంతత. అయితే ఇదేమి ఈ కర్మ! చేసినదాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకోవడానికీ లేదు, అలా చేయకూడదని పశ్చాత్తాపం పడేలానూ లేదు. ఇలా సందిగ్ధంలో తేలుతూవుండే హింస ఎవరికీ వద్దు. సునేత్ర హత్య కుట్ర గురించి ఇలాంటివే నా బాధలు.
హత్య అంటే హత్య కాదు. ‘‘పొరపాటున కూడా ఆ మాటను ఎక్కడ ఉపయోగించకండి సార్. ఈ మధ్య ఎక్కడెక్కడ చెవులు ఉంటాయో చెప్పలేము. మనసులో చెప్పుకున్నా ఈ కాలంలో వినిపిస్తుందట. వెళ్ళాల్సిన ఆమేమో వెళ్ళిపోతుంది. మీరు ఆ పదాన్ని
ఉపయోగించి మిగిలిన వారిని ఉరికంబానికి ఎక్కించకండి’’ అంటాడు దాదా. ఈ దిక్కుమాలిన దాదా పేరు ఏమిటో కూడా నాకు తెలియదు. మేము దాన్ని అడగకూడదట. పండుగకు తెచ్చే వినాయకుడి విగ్రహంతోపాటు విగ్రహానికి అంటుకునే హారమూ, విగ్రహం వెనుక శిరోభాగంలో వర్తులాకారంలోని అలంకార వస్తువూ వస్తాయి కదా, అలా అనుచరుల బృందంతోపాటు ఈ దాదా ఆఫీస్ వెనుక తలుపుల నుంచి వచ్చి నన్ను కలిసి పోతాడు. ఈ సహచరులకు ఈ వినాయకుడే దేవుడు. అతను మాటల మధ్యలో ఓపెన్‌గా అపానవాయువు వదిలినా వాళ్ళకు నవ్వు రాదు. “చూడండి, అతన్ని అంతగా ఆరాధించక్కర్లేదు. ఇప్పుడు మీరు వెళుతున్నట్టే టాయిలెట్‌కు వెళ్ళాడు కదా?’’ అని అంటూ వాళ్ళు నవ్వాలని టాయిలెట్ అన్నప్పుడు రెండు వేళ్ళను చూపించాను. నేను ఏమి చెప్పినా బుర్రమీసాల అనుచరులు గాలిలోకి చూస్తూ నిలుచునే ఉన్నారు. దాదా చెప్పిన అన్ని చోట్లా చెవులు ఉన్న విషయం గుర్తుకొచ్చి నేనూ కాస్త బెదిరి, ముడుచుకొని కూర్చున్నాను.
పబ్లిషింగ్ సంస్థ మొదలు పెట్టిన తర్వాత, ఇలా అన్ని వర్గాల ప్రజలతో పరిచయం కావడం సహజం. ఇతను కాకుండా అండర్‌గ్రౌండ్ వరల్డ్‌కు చెందిన మరో ఇద్దరు డాన్‌లతో నాకు పరిచయం ఉన్నప్పటికీ ఈ దాదా నాకు ప్రత్యేకమైనవాడు. అతని జీవిత చరిత్రను నేనే నా పబ్లిషింగ్ సంస్థ ద్వారా ప్రకటిస్తున్నాను. మా ప్రెస్ కుర్రవాడు రాకేష్ ఈ వినాయకుడికి రైటర్‌గా పనిచేస్తున్నాడు. ‘‘పెద్ద సాహితీవేత్తనే పట్టుకొని రాయించవచ్చు సార్. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోక పోయినప్పటికీ ఒప్పుకునేలా చేయటం మాకు తెలుసు. అయితే ఈ దొంగ సాహితీవేత్తలు మహావాగుడుకాయలు. ఇటు మా చరిత్రను రాసిచ్చి, డబ్బులు మింగి, తర్వాత తమ పేరుతో నవల రాయడం మొదలుపెడతారు. ఎవరినైనా నమ్మవచ్చు కానీ ఊసరవెల్లులను మాత్రం నమ్మకూడదు’’. అతను స్వయంగా తనను, ‘మనం’, ‘మనం’ అంటూ సంబోధించుకోవడం విచిత్రంగా ఉంది.
సునేత్ర ఈ దాదాలాంటి వాళ్ళ నీడను చూసినా భరించదు. రచయితలు, పోరాట యోధులు, ఉద్యమకారులు, స్వయంసేవ సంఘం వారు ఇలా ఒక్క పైసాకూ పనికిరాని వళ్ళందరితోనూ ఆమెకు దోస్తీ. వీళ్ళను లోపలికి రానిస్తే మన జేబుకే ప్రమాదం. ఈ రచయితల అవతారం చూడాలి, ఆ కాటన్ జుబ్బాలేమిటి, చేనేత జోలెలు ఏమిటి, కాటన్ చీరలేమిటి, లావాటి గాజు కళ్ళాద్దాలు ఏమిటి, తమ వల్లనే ప్రపంచం నడుస్తుంది అన్నట్టు ఉంటారు. లెక్కకు వీరి పుస్తకాలను పదిమంది చదవకపోయినా వీరి పొగరుకు ఏమి తక్కువ లేదు.
‘‘కథకులు, కళాకారులు అంటే మానవత్వపు మూలానికి చాలా దగ్గరివారంట అన్నయ్య. దయచేసి వారిని అలా మాట్లాడకండి’’ అని తిరిగి నాకే బుద్ధి చెబుతుంది. నేను ఆడించి పెంచిన పిల్ల, ఏదో కారణంగా వ్యక్తిగత కష్టాల్లో ఉందని సునేత్రను మా పబ్లికేషన్ సంస్థలో ఎడిటర్ అనే పదవి ఇచ్చి కూర్చోబెట్టాను. కూతురి పేరును పెట్టకపోతే తండ్రి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు ఇవ్వనని అమ్మ పట్టు బట్టినందుకు పబ్లికేషన్‌కు ఆమె పేరే పెట్టాను. అలాగని ఈమె కంపెనీ తనదేనని ప్రవర్తించడం మొదలుపెడితే ఎలా?
ఆమెకు దాదా, అతనిలాంటి వారి జీవిత ఆధారంగా రాసిన పుస్తకాలు ప్రకటించడం ఇష్టం లేదు. ‘‘అతడిని మనమే హీరో చేసినట్లు అవుతుందికదా అన్నయ్య. చిన్నచిన్న పిల్లలంతా అతన్ని మహాత్ముడని భావిస్తే ఏమిటి గతి? ఆ రాకేష్ రాసిన డ్రాఫ్ట్‌ను చదివావా? ప్రతి పేజిలో ‘పొడిచేస్తాను’, ‘సువ్వర్‌ను లేపేస్తాను’.. ఇలాంటి పదాలే ఉన్నాయి’’ అని మండిపడుతుంది. మొన్న ఇలాంటి పుస్తకం నుంచి ఎవరికి ఏమి లాభం అంటూ నన్నే అడిగింది. ఎవరికి లాభం కలుగుతుందో లేదో, కానీ మాకైతే తప్పకుండా డబ్బుల వాన కురుస్తోంది. దాదానే తన అనుచరులతో పంచడానికి పదివేల కాపీలను డబ్బిచ్చి కొనుక్కుంటాడనే నిజాన్ని చెబితే కోపంతో నిప్పులు కక్కింది. పైగా డబ్బులు వస్తాయని మురికి నీళ్ళు తాగడం ఎంతవరకు సమంజసం అని అంది.
అది కాదు, పెళ్ళి చేసి పంపిన తర్వాత పుట్టింటికి తమకు రుణం తీరినట్టు ఆడవాళ్ళు ఉండాలి. ఇప్పుడు నా భార్య లావణ్య లేదా? ఏదో నేనొక మాట చెబితే, ఏదో కోపంతో ఒకసారి తిడితే, ఏ విషయంలోనూ తలదూర్చకు అని మండిపడితే ఆమె ఏమైనా అలిగి పుట్టింటికి వెళ్ళి కూర్చుంటుందా? మగవాళ్ళకు ఇంటి బయట వందలాది సమస్యలు ఉంటాయని అర్థం చేసుకుందామె. నేను చెయ్యొద్దు అన్న పనిని కలలోను చేయదేమో. నా ఎనిమిదేళ్ళ కూతురు సిమి కూడా అంతే. ‘‘నేను డాడీస్ గర్ల్. మై డాడీ స్ట్రాంగెస్ట్’’ అని చెప్పేటప్పుడు తన కళ్ళల్లో ఎంత గర్వమో!
అయితే ఈ సునేత్ర పద్ధతే వేరు. తండ్రి లేని పిల్ల అని నేనే ఎక్కువగా ముద్దు చేసి పెంచినందుకు ఇలా మారిందేమో. నోరు తెరిస్తే స్త్రీవాదం, స్త్రీస్వాతంత్య్రం, మహిళల హక్కులు, సెక్సువల్ ఫ్రీడం-ఇలాంటి అధిక ప్రసంగాలే ఆమె మాటల్లో వెలువడేవి. స్వాతంత్య్రం ఇవ్వడం ఎక్కువైందిలే అని అంటే; మాకు స్వాతంత్రాన్ని నువ్వు ఇచ్చేది ఏమిటి అని పోట్లాడేది. మొత్తం మగజాతి జన్మని తూర్పారబడుతుంది. అలా కాదు, భర్తను వదిలేసి వచ్చిన దాన్ని నేను ఇంట్లో చేర్చుకోనని చెప్పి ఉంటే ఎవరేమి చేసేవారు? మనిషి అన్న తర్వాత గుర్తుపెట్టుకోదగిన గుణాలు ఉండాలి.
ఆమె భర్త సునీల్ చాలా మంచివాడు. ఇక్కడి రూపాయలతో పోల్చితే; అమెరికాలో అతని నెల జీతం ఆరులక్షల రూపాయలట. చూడటానికి చాలా అందగాడు. అంత సంపాదించిన ఏమాత్రం గర్వం లేదు. ఒక చెడు అలవాటు లేదు. ‘‘నా డబ్బుతో నేను ఎన్నడూ తాగకూడదని మా నాన్నగారు ప్రమాణం చేయించుకున్నాడు బావ. అందుకే ఎవరైనా పార్టీలలో ఆఫర్ చేస్తేనే ఒక పెగ్గు తీసుకుంటాను’’ అని అన్నప్పుడు అతని మాటల్లో ఎంత నిజాయితీ ఉంది. థూ, మన బంగారమే బాగా లేకపోతే ఏమి చేయగలం?
అలాంటి బంగారంలాంటి భర్తను ఎందుకు వదిలి వచ్చావు అని అడిగితే అతను “వడ్డించు” అన్నాడు అంటుంది.
‘‘దేన్నీ వడ్డించు అన్నాడు?’’
‘‘భోజనాన్ని’’
‘‘ఎలాంటి భోజనాన్ని?’’
మనుషుల్ని ఏమైనా వేయించుకుని తినే అలవాటు ఉందా అని మనస్సులో నాకు భయం వేసింది. ఈ అమెరికాలో సెటిల్ అయిన కొందరు ఏమేమి అలవాట్లను అంటించుకుని ఉంటారో ఎవరికి తెలుసు.
‘‘ఎలాంటి భోజనం అంటే ఏమిటి అర్థం అన్నయ్య? వంట చేసి పెట్టడమే కాక ముందు నిలుచుని వడ్డించాలట?’’
‘‘ఓహ్, అంటే మనం తినే భోజనమే కదా? వడ్డించడం అంత పెద్ద విషయమా?’’
ఒక్క నిమిషం ఆగి జవాబిచ్చింది.
‘‘అది కాదన్నయ్య. అది ‘వడ్డించే’ విషయం మాత్రమే కాదు. అది ఒక రకంగా నన్ను సూక్ష్మంగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడమే. వంట చేసుకుని ఇద్దరం జతగా కూర్చొని మనకు మనమే వడ్డించుకుని తిందామని అన్నాను. అది అతనికి నచ్చదట. నిన్ను ఎందుకు పెళ్ళి చేసుకున్నాను అన్నాడు. అతనికి వడ్డించేవారొకరు ఉండాలట. వడ్డించేవారు లేకపోతే అతనే వడ్డించుకుని తినడానికి అవమానమట. కుదరదు అన్నాను. ఒత్తిడి పెట్టాడు. నాకు కోపం వచ్చి ‘నువ్వు నన్ను బానిసల చూడడానికి వీల్లేదు. అమెరికాలో బానిసత్వం రద్దయి చాలా కాలమైంది కదా’ అని అన్నాను.
ఒక్క నెలలోనే బ్యాగు సమేతంగా ఈమెను తిప్పు పంపి, ‘‘మీ చెల్లెలి నుంచి అమెరికన్ చరిత్ర పాఠాలు నేర్చుకున్నట్టయింది. థాంక్స్’’ అని మెసేజ్ టైప్ చేసి మౌనంగా ఉండిపోయాడు. సునీల్ మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. బంగారం లాంటి జీవితాన్ని పాడు చేసుకుందని తలబాదుకున్నాను. ‘వడ్డించి’ ఉంటే ఏమైనా చేతులు పడిపోయేవా? పెద్దవాళ్ళు చెబుతారు కదా, కళ్ళు నెత్తికెక్కితే నేల కనిపించదట. అలా ఉంది ఈమె పరిస్థితి అని కుమిలిపోయాను!
అప్పుడే వార్తాపత్రికల పనిని వదిలిపెట్టి ఇలా పబ్లిషింగ్ హౌస్ ప్రారంభిద్దామనే ఉత్సాహంలో ఉన్నాను. సునేత్ర ఉండటం నాకెంతో సహాయ పడిందనటంలో అబద్ధం లేదు. నేను కాస్త రఫ్ మనిషిని. కంపెనీ అజెండా, రూపు రేఖలు, ఆఫీసు డిజైన్, పబ్లికేషన్ లోగో – ఇలాంటి అన్ని సున్నితమైన కార్యాలు ఆమె ఊహల్లోనే ప్రాణాలు పోసుకున్నాయి. ఎలాంటి పనైనప్పటికీ, అతిథులు వచ్చినప్పుడు ఆమె ఇచ్చే చాయ్ కప్పు రంగు, ఆకారం మొదలు డోర్ మ్యాట్ వరకు అలంకారికంగా మెరిసిపోయేలా చేసేది. అయినా పబ్లిషర్‌గా నా పేరే ఉండేలా చూసుకున్నాను. ‘నీ పేరు పబ్లికేషన్‌కు ఉంది కదా తల్లీ’ అన్నాను.
వీధి పక్కన పళ్ళు అమ్మేవాడు, చేతి మగ్గాలు నేసేవారు, హౌస్ వైఫ్‌లు, ఊరి చెరువులను సంరక్షించేవారు, ఒత్తులు చేసేవారు- ఇలాంటివారి జీవిత చరిత్రలను ప్రకటిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనను ముందుగా మా ముందు పెట్టింది ఆమే. ‘‘చాలా పెద్ద పెద్ద పుస్తకాల అక్కర్లేదు. ఒక యాభై పేజీలలో సంక్షిప్తంగా చిన్న సైజు పుస్తకాలైనా పరవాలేదు. ఇలా తెరమరుగున ఉన్నవారందరూ మన సమాజానికి ఎందుకు అవసరమో అనే థీమ్‌ను పెట్టుకొని ‘అనుదినం హీరోలు’ అని వరుసగా ప్రకటిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడున్న జీవిత చరిత్రలకన్నా విభిన్నంగా ఉండాలి. పాఠకులకు ప్రేరణ కలిగించేవి’’ అని అడిగింది. ‘‘అదంతా జరగదు. పళ్ళు అమ్మేవాడి గోడు కథ ఎవరికి కావాలి? ఎవరు కొనుక్కోకుండా దుమ్ము పట్టి మూలన పడివుంటాయి’’ అని తోసిపుచ్చాను.
ఇంకొకసారి, ‘‘అన్నయ్య, గొప్ప గొప్ప క్లాసిక్ రచయితలను కొత్తగా కన్నడంలోకి అనువాదం చేయిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉన్న అనువాదాలన్నీ యాభై ఏళ్ళ పాతవి. నా ఇంకొక సలహా ఏమిటంటే ఆడవాళ్ళ గురించి వాళ్ళు చెడుగా చిత్రించిన వాక్యాలన్నీ తీసివేసి ప్రకటిస్తే ఎలా ఉంటుంది? మనం ఏవేవి డిలీట్ చేశామో కావాలంటే వాటిని ఫుట్ నోట్లో ఇద్దాం. షేక్‌పియర్, సింగర్, టాల్ టాల్‌స్టాయ్ – ఇలాంటి రచయితలంతా ఎవరికి ఇష్టం ఉండరో చెప్పు? అయితే వారి కాలపు నమ్మకల్లా, పాపం వాళ్ళు కూడా ఆడవాళ్ళను చెడుగా చిత్రించారు. అది ఈనాటి కాలంలో చదివేటప్పుడు ఇబ్బంది కలుగుతుంది. షేక్స్‌పియర్ ఇప్పుడు ఉంటే అలా రాసివుండేవాడు కాదేమో. అందుకే మనం ఫెమినిస్ట్ వర్షన్ ఆఫ్ క్లాసిక్స్ అని పుస్తకమాలికను మొదలుపెడదాం. తర్వాత కన్నడ క్లాసిక్‌లను కూడా ఈ ప్రణాళికలో చేర్చుకోవచ్చు. దేశంలోనే గొప్ప పేరు సంపాదించవచ్చు. ఏమంటావు’’ అని అంది.
‘‘నీకేమైనా తల చెడిపోయిందా సునీ? అలా చనిపోయిన రచయితల రాతలను దిద్దుతారా? మనల్ని జైల్లో వేస్తారు. అంతేకాదు ఈ సాహితీవేత్తలంతా సామాన్యమైన వాళ్ళని అనుకోవద్దు. ఊరికే ఉంటారు, నిజమే. అయితే ఇలాంటి వార్తల చిన్న జాడ దొరికినా చాలు, గుంపుల గుంపులుగా వచ్చేస్తారు. రేపు ధర్నా చేస్తూ వచ్చి ఆఫీస్ కిటికీ అద్దాల మీద రాళ్ళు పడేలా ఏమీ చేయొద్దు’’ అని గట్టిగా అన్నాను.
***
తన పేరును మొదటి పేజీలో చూడగానే దాదా సంతోషంతో పొంగిపోయాడు. పుస్తకాన్ని తిప్పి తిప్పి చూడటం ఏమిటి, దాని అందచందాలను పొగడటం ఏమిటి, కవర్ పేజీలో ఉన్న తన ముఖాన్ని తాకి తాకి కంటతడి పెట్టడం ఏమిటి. ‘‘సార్, ఈ పుస్తకం చూడటానికి మా నాన్న ఉండాల్సింది సార్. ఎవరెవరో స్వాతంత్ర పోరాట యోధుల చరిత్రల పుస్తకాల నాకు ఇచ్చి, చూడూ, భవిష్యత్తులో నీ గురించి కూడా ఇలాంటి పుస్తకం రావాలి, నువ్వు అంతగా అభివృద్ధి చెందాలి అని అనేవారు. ఇప్పుడు మేము అభివృద్ధి చెందింది చూడ్డానికి ఆయన లేరు కదా అని బాధ కలుగుతుంది. ఏం చేయాలి?’’ అని ఏడుస్తున్నట్టు అన్నాడు. అండర్‌గ్రౌండ్ డాన్‌ల కళ్ళలోనూ నీళ్ళు వస్తాయి కదా అని నాకు ఆశ్చర్యం వేసింది. వెనుక నిల్చున్న అతని అనుచరుల కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
అదే ఉత్సాహంలో ఆ రోజు దాదా నమ్మకంగా నాకొక అభయం ఇచ్చాడు. ‘‘సార్ ఎవరైనా కానీ, అతను ప్రపంచంలో ఏ మూలలోనైనా ఉండనీ, ఇలా ఇలా అతన్ని లేపేయాలి అని మీ మనసులో ఉంటే మాకు చెప్పండి. ఎవరికీ ఎలాంటి డౌట్ రాకుండా, అలా అలా పని ముగించి వేస్తాం’’ అని నా చేయి పట్టుకొని చెప్పాడు.
నేను భయంతో చేయి విడిపించుకున్నాను.
‘‘మీరు ఏమంటున్నారు దాదా? నాకెందుకు అలాంటి అవసరం వస్తుంది? ఊరకే ఏమేమో చెప్పకండి మీరు?’’ అని గడుసుగానే అన్నాను.
‘‘అదికాదు సార్, ఎవరైనా కానీ, చెప్పాను కదా. అది చాలా కష్టం అని అనుకొని వుంటారు. అయితే ఇన్ని సంవత్సరాల మా ఎక్స్‌పీరియన్స్‌లో చూశాం కదా. ఎవరిదైనా కాలో, చేయో తీయటమే ఎక్కువ డిఫికల్ట్. మనిషిని లేపేయడం నిజానికి సులభం. అయితే ఎవరికీ ఎలాంటి అనుమానమే రాకూడదు. వాళ్ళే వెళ్ళి చెరువులో దూకినట్టుగా ఉండాలి. అది ఎలా ఏమీ అని మీకు, చెప్పినవారికీ అర్థం కాదు. అలా పని ముగించేస్తాం సార్..’’
ఇతని సన్నిధిలో ఇలా అకారణంగా దీనత్వం తనంతట తానే ఒళ్ళంతా వ్యాపించటం చూసి నా మీద నాకే అసహనం పొంగుకొచ్చింది. ఇక్కడి నుంచి లేచి వెళ్ళు అని చెప్పటానికి సంకోచం కలిగింది.
దాదా కూర్చున్న చోటే కాస్త ముందుకు వంగాడు. అతని పొట్టి ఆకృతికి ఈ పెద్ద కళ్ళు నప్పటం లేదని నా మనసులో ఆలోచన కదిలిపోయింది. అతని దేహం కన్నా తక్కువ స్వరంలో అన్నాడు – ‘‘సార్, మీ దగ్గరివారే మీకు చాలా ఇబ్బంది పెడుతున్నారని మాకు కబురు వచ్చింది. అలాంటివాళ్ళ నుంచి మాకూ డేంజరే. అందుకే చెబుతున్నాను సార్. ఏమీ లేదు, రోజులోని ఇరవై నాలుగు గంటల్లో ఏ సమయమైనా కానీ, మా పర్సనల్ ఫోన్‌కు కాల్ చేసి, ‘గో అహెడ్’ అని అనుమతి ఇవ్వండి సార్. తర్వాతి జరగాల్సినవి మేము చూసుకుంటాం. మీరు దాని గురించి పరేషాన్ కాకండి’’ అన్నాడు. తర్వాత రెండు నిమిషాలు అతను లేచిపోయే వరకు గాలిలో చూస్తూ కూర్చున్నాను. సునేత్ర చెబుతున్నట్టు ఇతన్ని దగ్గరికి తీసుకోకూడదని మొదటిసారిగా ఎందుకో గాఢంగా అనిపించింది.
అయినా దాదా పుస్తకం ప్రకటించినప్పటి నుంచీ, వద్దు వద్దు అనుకున్నప్పటికీ విచిత్రమైన గర్వమొకటి నా వ్యక్తిత్వంలో చేరిపోయింది. అదేమిటో సరిగ్గా నాకు అర్థం కాకపోయినప్పటికీ గొప్పదైన ఏదో ఒక దానికి చెందుతున్నాను అనే భావన నా నడకలోనూ, మాటల్లోనూ వ్యక్తమవుతుందేమోనని నాకు అనుమానం. పైగా నెమ్మదిగా ‘రౌడీల రాజ్యం’లో నాకు ప్రత్యేకమైన మర్యాద ఉండటం నా దృష్టికి వచ్చి మురిసిపోతున్నాను.
చూస్తూ చూస్తుండగానే ఎవరో ఆఫీసుకు వచ్చి ఇనుప హ్యాండిల్స్ ఉన్న బ్యాగులని పెట్టి వెళ్ళిపోవడం, తర్వాత ఇంకెవరో దాన్ని తీసుకొని వెళ్ళటం అన్నీ మొదలయ్యాయి. దాదాకు ఆత్మకథను రాసిచ్చిన మా ప్రెస్ కుర్రవాడు విచిత్రమైన తీరులో తిరుగుతున్నాడు. పదివేల ప్రతులు కావాలన్న దాదా, తర్వాత ఇరవైఐదు వేల ప్రతులను వేయించి కొనుక్కోవడం నా నోరును మూయించింది. నేను గతంలో ఎన్నడూ చూడని వేగంలో డబ్బుల వర్షం కురవడం మొదలైంది. వీటన్నిటినీ ఓరకంట చూస్తున్న సునేత్ర, ‘‘ఇదంతా మంచికి కాదన్నయ్యా’’ అని అన్నప్పుడు నిర్లక్ష్యం చేశాను.
మరో ఇద్దరు రౌడీలు మా పుస్తకాన్నీ రాయించి ఇవ్వండని ఆఫీసుకు వచ్చిన వెంటనే మొదలుపెట్టారు. అండర్ వరల్డ్ డాన్‌ల గురించి మాత్రమే పుస్తకాలు ప్రకటిస్తున్నాం, చిల్లర రౌడీల గురించి కాదని చెబితే వాళ్ళకెక్కడ అర్థం అవుతుంది?
‘‘ఏమండీ అలా అంటే? అతనైతే పర్వాలేదా? నేను మీకు పనికిరానా?’’ అని అడిగి నన్నే ఉలిక్కిపడేలా చేసేవారు.
క్రమంగా దాదా, అతని అనుచరులు ఈ చిల్లర రౌడీలను దారికి తెస్తున్నప్పటీ, రోజుకొక కొత్త ప్రకరణమైనా జరగక తప్పేది కాదు. నేను కూడా ఎందుకైనా మంచిదని నా సేఫ్టీ కోసం ఉండాలని రోజు వచ్చే టైమ్‌ను తప్పించి ఏవేవో సమయాలలో ఇంటికి వెళ్ళటం మొదలుపెట్టాను.
లావణ్య ప్రవర్తనలో ఈ మధ్య విలక్షణమైన మార్పులు కనిపించాయి. అందులో ఒకటి మితిమీరేవరకూ నాకు ఎందుకు తెలియలేదో నాకే ఆశ్చర్యంగా ఉంది. మొదట్లో నేను ఏమైనా అన్నప్పటికీ ‘సారీ అండి తెలియలేదు’, ‘సారీ అండి నాదే తప్పు’ అంటూ అన్నిటిని సరి చేస్తుండేది, ఇప్పుడు కనీసం ఒక్కసారి కూడా క్షమించు అనే పదం ఆమె నోటి నుంచి రాదు. ఏమి చెప్పినా ముఖం ముడుచుకుని పని చేస్తూనే ఉంటుంది ‘‘ఏమే పనికిమాలినదానా, ముఖానికి ఏమైనా పక్షవాతం వచ్చిందా? నవ్వుతూ ఉండటానికి ఏమి రోగం?’’ అని అంటే, ‘‘నాకేమైందండీ ఎందుకలా పాడు మాటలు అంటున్నారు’’ అని ఎదురు తిరుగుతుంది. ‘‘ఇంటి మగవారిని ఎలా పెట్టుకోవాలో తెలిసివుండాలి. రానురానూ రాజుగారి గుర్రం గాడిదయ్యింది’’ అంటే మళ్ళీ ముఖం గంటు పెట్టుకుని కూర్చుంటుంది.
ఇక సునేత్రాతో లావణ్య అతిశయమైన స్నేహం నాలో అసహనాన్ని పుట్టిస్తోంది. నా దగ్గర మాట్లాడటానికి తడబడుతున్నా సునేత్రతో ఆమె మాటలేమిటి, కిలకిలమని నవ్వడం ఏమిటి, లోకపద్ధతిలా భర్తను వదిలేసి వచ్చిన మరదలు ఇంట్లో ఉన్న వదినతో వైమనస్యం తెచ్చుకుంటూ, పోట్లాడుతూ ఉండటం వదిలి, వీళ్ళిద్దరూ కలిసి షాపింగ్‌కు వెళ్ళడం ఏమిటి, స్ఫాలో గంటలకొద్దీ స్టీమ్ బాత్ చేయడమేమిటి, జత జతగా ఒకే రంగు నెయిల్ పాలిష్ పెట్టుకోవడం ఏమిటి, లావణ్యకు అమ్మతో ఎలాంటి మనస్పర్ధలు ఉన్నా, ఆమె సునేత్ర వదినవైపే మాట్లాడుతుంది. గది తలుపులు ఓరగా వేసుకుని గుసగుసగా మొదలుపెడితే గంటలు గడిచిపోయిన వీరికి ధ్యాసే లేదు. నేను గదిలో అడుగు పెట్టిన వెంటనే మాటల తీరును మార్చకుండా కొనసాగించడం లావణ్య ఈమధ్య అలవాటు చేసుకుంది. ‘‘అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా, మనసుకు కొట్టినట్లు..’’ అని చెబుతున్నది నన్ను చూడగానే అదే వాక్యంలో ‘‘నువ్వు సిమికి కాస్త ఆల్జీబ్రా చెబుతావా సునీ? అత్త చెబితేనే నాకు బుర్రకు ఎక్కుతుంది అని పట్టుబట్టి కూర్చుంది చూడు’’ అని మాటలు కొనసాగించటం నేర్చుకుంది.
***
ఆ రాత్రి అమ్మ మా బెడ్ రూమ్ తలుపు కొట్టి సునేత్ర ఇంకా ఇంటికి రాలేదని చెప్పినప్పుడు భయపడవలసిందేమి జరగలేదని అంటూ మనసు చాటి చెబుతోంది. సునేత్రకు ఈ మధ్యన మాలిని అనే యువకవయిత్రి పరిచయమైంది. ఇద్దరే పర్యటనలకు వెళ్ళటం, కవిగోష్ఠులకి, సమావేశాలకు హాయిగా వెళ్ళి, రావడం మొదలైంది. ఆరోజు కూడా తొందరగానే లేచి బన్నేరుఘట్ట అడవిలో తిరిగి రావడానికి వెళ్ళారని తర్వాత లావణ్య ద్వారా నాకు తెలిసింది.
సునేత్ర ఫోన్ స్విచ్ ఆఫ్ అయివుంది. రాత్రి పన్నెండు గంటలైనా సునేత్ర రాకపోవడంతో, ఎవరెవరినో సంప్రదించి మాలిని నెంబర్ తీసుకున్నాం. ఫోన్ ఎత్తిన మాలిని ఏడవడం మొదలు పెట్టింది. ఆమె చెబుతున్నది అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది.
మాలిని చెప్పిందింతే. ఉదయం ఆమె, సునేత్ర బన్నేరుఘట్టలోని నిషేధిత అడవిలోకి వెళ్ళారట. మధ్యలో ఒకసారి కూర్చొని అలసటను తీర్చుకుంటుండగా దగ్గర్లోనే ఏనుగులు ఫీుంకరించటం విని భయపడ్డారట. సమీపంలోని పొదల నుంచి భారీ ఏనుగు ఒకటి దూసుకొని రావటంతో ఇద్దరూ దిక్కుతోచినట్టు పరిగెత్తారట. కొద్దిసేపటి తర్వాత ఏనుగు అడుగుల శబ్దంతోపాటు, పరిగెత్తుకొస్తున్న సునేత్ర అడుగుల శబ్దాలు కూడా మాయమయ్యాయి. వెతికేంత వరకు వెతికి చివరికి మాలిని పోలీసులకు ఫోన్ చేసిందట. ఇప్పుడు అందరూ కలిసి బన్నేరుఘట్ట అడవులలో వెతుకుతున్నారు.
పైజామా మీద ఒక షర్ట్ తొడుక్కొని పరిగెడుతున్నట్టు అడుగులు వేస్తూ వచ్చి కారు స్టార్ట్ చేశాను. ఎంత దీర్ఘంగా ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నించిన మనసు అదుపులోకి రాలేదు. ‘‘అలా జరిగి ఉండదు, అలా జరిగి ఉండదు’’ అని నాకు నేనే పదేపదే చెప్పుకున్నాను.
స్టీరింగ్ వీల్ పైన ఉన్న చేతులు గజగజ వణుకుతున్నాయి. అర్ధరాత్రి చలిలోనూ మొత్తం దేహం చెమటలు పట్టాయి. ఒకసారి, ఒకే ఒకసారి సునేత్ర దొరికి, ‘‘ఏమి కాలేదు అన్నయ్య, అక్కడ తప్పిపోయాను, అంతే’’ అని నవ్వుతూ ఇంటికి రావాలని ఆలోచిస్తుంటే, కళ్ళనుండి కన్నీళ్ళు ధారాపాతంగా ప్రవహిస్తున్నాయి.
బన్నేరుఘట్ట చేరినప్పుడు అక్కడక్కడ స్పాట్‌లైట్లు మాత్రం కనిపిస్తున్నాయి. అక్కడే ఎదురుచూస్తున్న ఒక గార్డ్ నుంచి ఇప్పుడు వెతుకుతున్న పనిని ఆపేశారని, ఉదయం 6:00కు మళ్ళీ ప్రారంభిస్తారని తెలిసింది. ‘‘ఈ ఆడపిల్లలతో చాలా కష్టం సార్. వీళ్ళు మజా చేయడానికి అడవిలోకి వెళ్ళి ఇప్పుడు మాకు ఎంతటి కష్టాన్ని తెచ్చిపెట్టారో చూడండి’’ అని బీడీ వెలిగించాడు. తర్వాత ‘‘ఓహ్! మీ చెల్లెలా సార్, దొరుకుతారు లేండి, ఎక్కడికి వెళ్తారు?’’ అని మౌనం వహించాడు. ఉదయం చెన్నై నుంచి ప్రత్యేకమైన దళం రాబోతోంది.
ఆ తర్వాతి మూడు రోజులు అన్వేషణ చురుగ్గా జరిగింది.
మూడురోజుల తర్వాత ఉబ్బిపోయిన సునేత్ర శవం బన్నేరుఘట్ట పొదల్లో దొరికింది. వార్త వినగానే పోలీస్ దళంతోపాటు ముక్కుకు కర్చీఫ్ కట్టుకొని నేనూ ఆ స్థలానికి పరిగెత్తాను. ఆమె దేహాన్న మీద ఏనుగు తొక్కి తొక్కి నలిపి వేసిన గుర్తులున్నాయి. దగ్గరలోనే ఒక కాలి చెప్పు, ఫోను, హ్యాండ్ బ్యాగులు దొరికాయి. అక్కడి దృశ్యం చూసి మాకెవరికీ నోట మాట రాలేదు.
లావణ్య, ‘‘అలా నిషేధింపబడిన అరణ్యంలో ఆమె వెళ్ళదు. అలాంటి ఆమె అదృష్టం ఎందుకు వక్రించిందో’’ అని ఏడవసాగింది. అమ్మ మాత్రం ‘‘ఎప్పుడు చూసినా అంతే, మా కడుపు కాల్చడానికి వచ్చింది. నన్ను బాధ పెట్టడానికే పుట్టిందామె’’ అని ఒక మూలకు వెళ్ళి కూర్చుంది.
***
ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళినప్పుడు పది గంటలు అయిందేమో. మధ్యాహ్నం దాదా అనుచరులు మా ఆఫీస్ లాబీలో కాళ్ళు చాపి కూర్చొని సిగరెట్ తాగుతూ ఉండటం చూసి సునేత్ర నా గదికి వచ్చి పెద్దగా గొడవ చేసి వెళ్ళింది. పోలీసులంటూ, పరువు నష్టం అంటూ, తోడబుట్టినవాడు అని కూడా జాలి చూపించకుండా, నానా మాటలు ఆమె నోటి నుంచి పుంఖాను పుంఖాలుగా బయటపడ్డాయి. సరే దీనికంత ఏదైనా పరిష్కారం వెతుకుతానని ఆమెను శాంతంగానే ఇంటికి సాగనంపాను. రాత్రి నేను వెళ్ళినప్పుడు అందరూ భోజనం చేసి వారి వారి గదిలో నిద్రపోయారు.
సిమి గదిలో మాత్రం లైటు వెలుగుతోంది. వెళ్ళి చూస్తే ఏదో మాథ్స్ ప్రాబ్లమ్‌ను పరిష్కరిస్తూ కూర్చుంది. ‘‘హోంవర్క్ చేస్తున్నావా బంగారూ?’’ అని వెనుక నుంచి ఆమె తలను వాసన చూశాడు. ‘‘ఊఁ..’’ అంది. ‘‘కలిసి భోజనం చేద్దాం వస్తావా? ఐస్క్రీమ్ ఇప్పిస్తాను’’ అన్నాను. ‘‘నా భోజనమైంది డాడీ, డిస్టర్బ్ చేయకండి’’ అంది. ఆమె చిన్న నోట డిస్టర్బ్ అనే మాట విని నాకూ ఉత్సాహం వచ్చింది. మెల్లగా ఆమె చంకలో వేళ్ళు కదిలించి, ‘‘వస్తావా లేదా? నువ్వు వస్తాను అంటేనే నేను ఆపుతాను’’ అంటూ గిలిగింతలు పెట్టాను. మునుపట్లా కిలకిలమని నవ్వక ‘‘స్టాప్ డాడీ’’ అంటూ శరీరాన్ని బిగదీసుకున్నట్లు చేసి ఒక్కసారి దూరంగా వెళ్ళి నిలుచుంది. తిరిగి నిలుచున్న ఆమె ముక్కుపుటలు పెద్దవయ్యాయి. కళ్ళు తీక్షణంగా చూస్తున్నాయి. ‘‘ఒకసారి స్టాప్ అంటే అర్థం కాదా నీకు? స్టాప్ టచింగ్ మీ వితౌట్ మై పర్మిషన్. నౌ గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్’’ అని నా వీపు వెనక దభాలున తలుపు మూసింది.
సిమి నోటి నుంచి వచ్చిన ‘గెట్ అవుట్’ అనే మాటలు చెంప మీద కొట్టినట్టు అనిపించింది.
నా రెండు అరచేతుల్లో పట్టుకోగలిగిన చిన్నారి ఇంత తొందరగా పెరిగిపోయిందా?
మా బెడ్‌రూమ్‌కు వెళ్ళినప్పుడు లావణ్య కూడా లైట్ లార్పి పడుకునివుంది. దగ్గరికి వెళ్ళి ‘‘లావణ్య’’ అన్నాను. ‘‘లేట్ అయింది కదా’’ అంది. పక్కకు తిరిగి పడుకున్న ఆమెను తిప్పుకొని ఆమె గుండెల మీద ఒరిగాను. ‘‘ఈరోజు వద్దు’’ అంటూ తోసింది. నిజానికి నాకూ ఆ రోజు అవసరం లేదు. అయినా ఆమె తోసిన తీరుకు అవమానంగా అనిపించింది. ‘‘ఎందుకు వద్దు?’’ అని కోప్పడ్డాను. ‘‘నాకు ఇష్టం లేదు’’ అనడం విని మరింతగా కోపం వచ్చింది. లావణ్య ఇంతకుముందు ఎప్పుడూ ఈ మాట అనలేదు. తలనొప్పి, కడుపునొప్పి, ముట్టు, నడుము నొప్పి, పైత్యం- ఇలాంటి కారణాలన్నీ చెప్పి వద్దు అనడం వేరే. అయితే ‘ఇష్టం లేదు’ అంటే దాని అర్థం ఏమిటి? వీటన్నిటి వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో నాకు తెలియదనుకున్నారా? పిడికిలి బిగించిన అరచేతిని బిగువుగా పట్టుకొని బెడ్‌రూమ్ నుంచి బయటకు నడిచాను.
ఇలాంటి దెబ్బ నాకెన్నడూ పడలేదు. భోజనం లేకపోవటంతో కడుపు భగభగ మండుతోంది. డైనింగ్ టేబుల్ మీద మూసి పెట్టిన అన్నం, చారు, కూరల గిన్నెలు వెక్కిరిస్తున్నట్టు కనిపించాయి. అన్నీ నా చేజారి పోతున్నట్టు భయం వేసింది. తర్వాత కొన్ని గంటల్లో తీసుకోబోయే నిర్ణయం కూడా అప్పటికే నా చేయి జారిపోయింది. వేకువ జామున పక్షుల కలకలరావాలు మొదలయ్యేవరకూ తెరిచిన కళ్ళు తెరిచినట్లే సోఫాలో కూర్చునివున్నాను.
చివరికి సూర్యుడు ఉదయిస్తున్నాడు, అన్ని వైపులా వెలుతురు పరుచుకుంటోందనే క్షణంలో దాదాకు ఫోన్ చేసి ‘‘గో అహెడ్’’ అన్నాను.
కన్నడ మూలం: కావ్య కడమె
అనువాదం: రంగనాథ రామచంద్రరావు