Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సుందరి నవ్వు

[మోహనరావు మంత్రిప్రగడ గారు రచించిన ‘సుందరి నవ్వు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

సుబ్బారావు ఓ మంచి ప్లంబర్. మంచి వర్కరని పేరుంది. బిల్డింగు ఓనర్లందరు పిలిచి మరి పనిస్తారు. ఇంక అతని భార్య సుందరి కూడా మంచి టైలరు, ఇంటికొచ్చే బోల్డుమంది బట్టలు ఇస్తుంటారు.

కాలం నడుస్తోంది, కాదు కాదు పరిగెడుతోంది. ఆ రోజు వాళ్ళ జీవితాల్లో మరపురాని, చీకటి రోజు.

యథావిధిగా సుబ్బారావు ఇంటికొచ్చాడు, కాని మనిషి మామూలుగా లేడు. సుందరి బైటకి వచ్చి చూసింది, రోజులా అతని జేబులో డబ్బు తీసి ఇస్తాడని ఎదురుచూసింది. సుబ్బారావు సుందరిని గెంటుకుంటూ లోపలకి వచ్చేసాడు. వెంటనే సుందరి లోపలకెళ్ళి మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది. సుబ్బారావు గ్లాసు తీసుకొని సుందరి మీదకి విసిరాడు.

సుందరి విస్తుపోయింది ఈ కొత్త ప్రవర్తనకి. మ్రాన్పడి అలాగే చూస్తూ ఉండిపోయింది. ఈసారి సుబ్బారావు తూలుతూ లేచి పక్కన గోడకి చేరేసున్నకర్ర తీసి “నీయమ్మ”.. అంటు బూతులు తిడుతూ కర్రతో గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బ తప్పించుకొని బైటకి పరిగెత్తింది సుందరి. సుబ్బారావు మాత్రం పడిపోయాడు క్రింద, కొంచెంసేపలా వాగి నిద్రపోయాడు. ఆ రోజు సుబ్బారావు సుందరి కూడా ఏం తినలేదు. మర్నాడు ఏం తెలియనట్లు లేచి పనికి వెళ్ళిపోయాడు. రోజు ఇదే వరస. ఇతని పరిస్దితి చూసి ఓనర్లు పని ఇవ్వడం మానేసారు. ఈ సంగతి అందరికి తెలిసి పోయింది. బట్టలు కుట్టించుకొనేవాళ్ళు కూడా దూరమయ్యారు. దాచిన డబ్బు అంతా అయిపోయింది, డబ్బులు లేక మందు ఇవ్వడం మానేసారు షాపువాళ్ళు. రోజు ఆ షాపు చుట్టు తిరిగి ఒక్కో రోజు అక్కడే పడుకుండి పోతున్నాడు సుబ్బారావు.

సుందరి మిషను పని మానేసింది, బైటకెళ్ళి అందరి మొహం చూడ్డానికి ఇష్టంలేక ఇంట్లోనే ఉండిపోతోంది. తిండిలేదు, బాగా నీరసించిపోయింది.

ఆ రోజు సుబ్బారావు తను పనిచేసిన అపార్టుమెంటు దగ్గరకి వెళ్ళాడు. ఓనరుగారు కనిపించారు. “సుబ్బారావు, ఇలా అయిపోయావేమిటి, పని మానేసావెందుకు?” అడిగారు ఆయన.

సుబ్బారావు తలొంచుకొని నిలబడ్డాడు. మరో మేస్త్రి వచ్చి ఆయనకి సుబ్బారావు పరిస్దితి వివరించాడు. ఆయన ఆశ్చర్యపోయారు, “అలా ఎలా జరిగింది, ఇతను చాలా మంచివాడు కదా” అన్నారు.

సుబ్బారావు ఆయనకి నమస్కరించాడు. ఆయన ఓ వంద అతనికిచ్చి “రేపటినించి ఇక్కడకు రాకు” అని కోపంగా వెళ్ళిపోయారు.

సుబ్బారావు ఆ వంద తీసుకొని షాపుకెళ్ళి తాగేసి ఇంటికి వచ్చాడు. సుందరికి విపరీతంగా నీరసంగా ఉంది, అలాగే ఓ బల్ల మీద కూర్చొని గోడకి చేరపడి నిద్రపోయింది. సుబ్బారావు ఆమెని చూడగానే కోపం తారాస్దాయికి ఎక్కింది. వెంటనే బైటకి వెళ్ళి అక్కడ పడున్న ఓ ఇనపరాడ్ తీసుకొచ్చి “నీయమ్మ” అని ఎత్తి ఆమెను కొట్టబోయాడు. ఆ అలికిడికి సుందరి కళ్ళు తెరచి సుబ్బారావుని చూసి నిస్పృహతో ఓ వెర్రినవ్వు నవ్వింది. కాని ఆమె తప్పించుకొందుకు ప్రయత్నించ లేదు. ఆ నవ్వు చూసి సుబ్బారావు హతాశుడయ్యాడు. ఆ నవ్వు అతని కళ్ళ ముందు అలా కనిపిస్తూ ఉంది. తాగిన మత్తంతా దిగిపోయింది.

గబగబా ఆ రాడ్ అక్కడ పడేసి మళ్ళా షాపుకెళ్ళి బాటిలు కొన్నాడు. ఓ చోట కూర్చొని దాన్ని ఓపెన్ చేసాడు. గ్లాసులో కొంచం పోసి అది తాగుదామని పైకి ఎత్తాడు. అదే నవ్వు అదే సుందరి మొహం కనిపించింది. మందు నేలకేసి కొట్టాడు. మళ్ళా సీసా తీసాడు, ఈసారి సీసాలో సుందరి నవ్వు మొహం కనపడింది. ఆ సీసా కూడా నేలకేసి కొట్టాడు. ఏం తాగబుద్దవలేదు. మనసు కుతకుత ఉడికిపోతోంది. సుందరి అలా ఎందుకు నవ్వింది, దీని వెనకున్న అర్థం ఏమిటి, అలా ఆలోచిస్తూ నడుచుకొంటూ పోయాడు. శ్మశానం దగ్గరకి చేరాడు. ఆ సంగతి అతను గ్రహించలేదు. అలా నడుస్తు అక్కడే చెట్టుకు చేరబడి కాళ్ళు చాచుకు కూర్చున్న యంకన్న కాలు తగిలి ముందుకి పడబోయి, నిలదొక్కుకొని, చుట్టూ పరకాయించి చూసాడు.

“ఏంది సుబ్బారావు బాబు ఇలా దారి తప్పోచ్చినట్టు ఉంది” అన్నాడు యంకన్న.

అప్పుడర్థమైంది అది శ్మశానం అని. “ఒరే యంకన్నా, అర్ధరాత్రయింది. ఇక్కడ శ్మశానంలోఉన్నావేం భయంలేదా?” అని అడిగాడు కంగారుగా సుబ్బారావు.

ఆ వెంకన్న బోసినోరు తెరచి నవ్వాడు. ఈసారి సుబ్బారావుకి మతి పోయింది. ఇంటి దగ్గర సుందరి నవ్వింది. ఇక్కడ వీడు నవ్వాడు. వీళ్ళకి చావంటే భయం లేదా? అసలా నవ్వు అర్థం ఏమిటి, అని బుర్రబద్దలు కొట్టుకున్నాడు, కాని సమాధానం దొరకలేదు.

మళ్ళా ఇంటికొచ్చాడు, సుందరి అక్కడే అలాగే గోడకి చేరపడి నిద్రపోతోంది. సుబ్బారావు గదిలోకెళ్ళాడు. మంచం మీద వాలాడు, నిద్ర రాలేదు. కళ్ళ ముందర సుందరి నవ్వు, వెంకన్న నవ్వు కనపడుతున్నాయి. నిద్రపట్టక ఇల్లంతా కలతిరిగాడు. ఆ చీకట్లోనే బైటకు వెళ్ళిపోయాడు, తెల్లారేదాక కాలవ గట్టుదగ్గర ఉన్న చెట్టుకు చేరబడి కూర్చున్నాడు. తెల్లతెల్లవారుతుండగా పెద్దాయన గుడి పూజారి ఆచారి గారు వచ్చారు. ఆయన స్నానానికి దిగుతూ సుబ్బారావుని చూసి, ఓ చిరునవ్వు నవ్వి కాలవలో దిగి స్నానం చేసి వెళ్ళిపోయారు.

ఆయన నవ్వుకి సుబ్బారావు ఉలిక్కిపడ్డాడు. ఏమిటి ఆయన నవ్వుకి అర్థం? ఇప్పటికే సుందరి, వెంకన్న నవ్విన నవ్వులకి అర్థం తెలియలేదు. మరో ఆచారిగారి నవ్వు. ఆయన ఎందుకు నవ్వినట్టు? సుబ్బారావు బుర్ర మళ్ళా తిరిగిపోయింది. ఇంతలో సుబ్బారావు క్రింద పనిచేసి ఓ మేస్త్రి అక్కడకొచ్చాడు. సుబ్బారావుని చూసాడు. అతని హృదయం ద్రవించి పోయింది. “అన్నా, సుబ్బారావన్నా” అని పిలిచాడు.

సుబ్బారావు అతనికేసి ఓ నిర్జీవమైన చూపు చూసాడు. వెంటనే అతను సుబ్బారావుని లేపి నిలబెట్టి “ముందు మొహం కడుక్కో” అన్నాడు.

సుబ్బారావు యాంత్రికంగా మొహం కడుక్కొచ్చాడు. అతగాడు సుబ్బారావు చెయ్యట్టుకొని దగ్గరున్న హొటల్లోకి తీసుకెళ్ళాడు, సుబ్బారావుకి టిఫెన్ పెట్టించాడు, టీ కూడా ఇప్పించాడు. ఆ తరవాత అతను సుబ్బారావుని తన ఇంటికి తీసుకెళ్ళాడు. “అన్నా, ఇక్కడ పడుకో” అని మంచం చూపించాడు. సుబ్బారావు యాంత్రికంగా ఆ మంచం మీద పడుకున్నాడు. వెంటనే నిద్రలోకి జారుకొన్నాడు. అలా పడుకున్న సుబ్బారావు సాయంత్రం నాల్గు గంటలకి లేచాడు. “అన్నా, టీ తాగు” అని అతని భార్య టీ ఇచ్చింది, సుబ్బారావు టీ తాగాడు. మరి కొంచంసేపటికి పనికెళ్ళిన అతగాడు వచ్చి సుబ్బారావుని చూసాడు. “మేస్త్రీ గారు” అన్నాడు, ఆ మాటకి సుబ్బారావు తల పైకెత్తి చూసాడు, అతగాడు చిన్నగా నవ్వాడు.

ఈసారి ఆ నవ్వులో సుబ్బారావుకి ఆప్యాయత, అనురాగం కనిపించాయి. తిరిగి చిన్నగా నవ్వాడు. “మేస్త్రీ గారు, రేపు మనం పనికెడతనాం” అన్నాడు. సుబ్బారావేం మాట్లాడలేదు.

ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు, మర్నాడు లేచి “ఇంటికి వెడతాను” అన్నాడు.

“వద్దు మేస్త్రి గారు, ముందుగా పనికెడదాం, సాయంత్రం ఇద్దరం మీ ఇంటికి వెడదాం” అన్నాడతను.

సుబ్బారావు మారుమాట్లాడకుండా అతని వెనకే నడిచాడు. పనిచేసే చోట ఇంకా సుబ్బారావుకి తెలిసిన పనివాళ్ళు చాలామంది కనిపించారు, అందరు అతన్ని చూసి పలకరింపుగా నవ్వారు. అందరికీ చిరునవ్వుతో సమాధానం చెప్పాడు సుబ్బారావు.

సుబ్బారావుకి కొంతపని అప్పగించాడు అతను. పనిలో పడ్డాక సుబ్బారావుకి చాలా మనశ్శాంతి కలిగింది. సాయంత్రం వరకు ఎవరితో మాట్లాడకుండా పని చేసాడు. తరవాత అతను సుబ్బారావుని తీసుకొని సుబ్బారావింటికి వచ్చాడు. హాలంతా శుభ్రంగా ఉంది, లోపలకి తొంగి చూసాడు. సుందరి వంటింట్లో ఉంది. సుబ్బారావు ఆశ్చర్యపోయాడు. అతను సుబ్బారావుని ఇంట్లో వదిలి వెళ్ళిపోయాడు,

రాత్రయింది, సుందరి కంచం పెట్టి అన్నం పెట్టింది. సుబ్బారావు తినేసాడు, గదిలో పక్క సరిచేసింది. సుబ్బారావెళ్ళి పడుకొన్నాడు. ఆ తరవాత మర్నాడు అతనొచ్చి సుబ్బారావుని పనికి తీసుకెళ్ళాడు. అలా నాలుగురోజులు గడిచాయి.

సుందరి ఏం మాట్లాడకుండా అలానే ఉంటోంది. ఆ మౌనం భరించలేకపోయాడు సుబ్బారావు, సుందరి దగ్గరకెళ్ళి నుంచొని “ఏంటి మాట్లడటం లేదు?” అని అడిగాడు తలొంచుకుని.

“ఏం మాట్లాడను? దేని గురించి?” అడిగింది.

“అదే ఇంత తొందరలో ఇంట్లో ఇంత మార్పు ఎలా వచ్చింది?” అడిగాడు.

“అదా ఇంకా లోకంలో మానవత్వం, మంచితనం పోలేదండి. మీ స్నేహితుడు మేస్త్రి కొంతకాలం ఊరిలో లేడట. వచ్చిన వెంటనే మీ గురించి ఆరా తీసి విషయం తెలుసుకొని, వెంటనే తన భార్యని తీసుకొచ్చాడు, ఆమే ముందుగా నన్ను చూసి లేవదీసి అన్నం పెట్టిందండి, తరవాత సాయంత్రం వరకు ఇక్కడే ఉండి నాకు ధైర్యం చెప్పిందండి. అప్పడే నాలో ఆశ, నమ్మకం వచ్చాయి. ఆమే ‘నీ భర్త కోసం చూడకు. నువ్వు ఎప్పటిలా జీవించు. సమయం వచ్చినప్పుడు అతనొస్తాడు’ అని ధైర్యం చెప్పి వెళ్ళిందండి. ఆ తరవాత ఆయనొచ్చి మీరు బాగానే ఉన్నారని, తనింట్లో ఉన్నారని, భయపడ వద్దని చెప్పాడండి. ఆ తరవాత మీరొచ్చారు. అసలు ఏం జరిగిందో కూడా చెప్పాడండి, మీరు నన్ను రాడ్‌తో కొట్టబోయి, వదిలేసి మీరు తిన్నగా స్మశానం దగ్గరకెళ్ళి అక్కడున్న ముసలాడితో ‘తాతా, ఇది శ్మశానం ఇక్కడున్నావేమిటి, భయం లేదా’ అని అడగడం, అతను ఓ వెర్రినవ్వు నవ్వడం, తరవాత మీరు కాలవ దగ్గర కూర్చోవడం, తెల్లవారు జామున ఆచారిగారు మిమ్మల్ని చూసి మందహాసం చేయడం, తరువాత ఆ మేస్త్రి మిమ్మల్లి తనింటికి తీసుకెళ్ళడం.. అక్కడనించి పనికి తీసుకెళ్ళడం, ఆయన మీ కోసం వెతకడంలో ఇవన్నితెలుసుకొన్నాట, అదంతా నాకు చెప్పాడండి ఆయన. అదీ సంగతి” అంది సుందరి.

“అదే ఆ నవ్వుకి అర్థం తెలియక తల బద్దలు కొట్టుకుంటున్నాను” అన్నాడు సుబ్బారావు.

“మీరు నన్ను రాడ్‌తో కొట్టబోయినపుడు తప్పించుకోవడానికి బదులు ఎందుకు నవ్వాననే కదా? మీరు రాడ్ ఎత్తినప్పుడు నా ప్రాణం పోవడం ఖాయం అని నాకు తెలిసింది. రావలసిన చావు ఎలాగు వస్తుంది. అప్పుడు తప్పించుకున్నా మరోసారి అలా జరగచ్చు. చావుకి సిధ్ధమైనప్పుడు వాయిదా వేయడం ఎందుకు అని ఓ విషాదపు నవ్వు నవ్వాను. అలాగే మీరు అయోమయంగా శ్మశానం దగ్గరకెళ్ళి అక్కడున్న తాతని చూసి ‘తాతా ఇక్కడున్నావేంటి? ఇది శ్మశానం. భయం లేదా’ అని అడిగారు. అతనికి 99 ఏళ్ళు. ఇవాళో రేపో పోయేవాడికి చావంటే భయం ఏమిటని ఓ వెకిలినవ్వు నవ్వాడు. ఇంక కాలవ దగ్గర ఆచారిగారు మిమ్మల్ని చూసారు, ఒకప్పుడు మీరు మంచి మేస్త్రి అని ఆయనకు తెలుసు. విధి వైపరీత్యం వల్ల ఏర్పడిన మీ పరిస్థితి చూసి ఆయన మందహాసం చేసారు” అంది సుందరి.

“ఆహా ఎంత బాగా చెప్పావు సుందరి. నిజంగా ఇదంతా నా మూలంగానే. నా వల్లే కదా నీకు ఇన్ని బాధలు కలిగాయి” అన్నాడు సుబ్బారావు.

“వదిలెయ్యండి. గతంలో జరిగిన సంతోషాలు, బాధలు మరచిపొండి. మళ్ళా కొత్త జీవితం మొదలెట్టండి” అంది సుందరి.

ఆ తరవాత మేస్త్రి వచ్చి అతన్ని పనికి తీసుకెళ్ళాడు,

ఆ సాయంత్రం ఎప్పటిలాగే సుందరి గుమ్మం దగ్గర ఎదురు చూస్తోంది. సుబ్బారావు వచ్చి తన జేబులోని డబ్బు ఆమె చేతిలో పెట్టాడు ఎప్పటిలాగే. అలాగే తెచ్చిన మల్లెపూలు ఆమె తల్లో పెట్టి ఆమెను గుండెలకు హత్తుకున్నాడు.

మళ్ళా సుబ్బారావు మంచి ప్లంబర్ గాను, సుందరి మంచి టైలరు గాను మారిపోయారు.

Exit mobile version