[కన్నడంలో వాసుదేవ్ నాడిగ్ గారు రచించిన కథని అనువదించి అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]
జ్ఞాపకాల అలలు అనూప్‌ని చుట్టుముట్టాయి. ఎందుకో ఈ జ్ఞాపకాలను బాగా అణచివేయాలని అనిపించిదతనికి. ఎంత ప్రయత్నించినా ఈ ముప్పై ఏళ్ళ సుదీర్ఘ జ్ఞాపకాల బురదలో కూరుకుపోయాడు. ఎవరి నుండి తప్పించుకున్నా, ఆ టేబుల్ కింద కనిపించే నాలుగు పాదాల నుండి మాత్రం తప్పించుకోలేకపోయాడు.
చిన్నప్పటి నుండి కళ్ళలో తిష్ట వేసి కూర్చున్న ఆ నాలుగు పాదాలు మళ్ళీ మళ్ళీ వేధిస్తున్నాయి. అవి ఏమైనా మాట్లాడుకుంటున్నాయేమో అనిపించేది. కేవలం ఒక చిత్తరువులా వెంటాడిన ఆ పాదాలు ఇప్పుడు మెల్లగా అర్థమవుతున్నాయి. తను టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు సునందక్కకు ట్యూషన్ చెప్పడానికి అప్పుడప్పుడు వచ్చే ప్రసన్న సార్ పాదాలు, ఆమె పాదాలు కింద అనూప్‌కు కనిపించేవి. అప్పుడప్పుడు ఒకదానికొకటి దగ్గరికి వచ్చి వెళ్లినట్లు అనిపించేది. ఇంతలో అరుగుయింటి మేస్టారు గీసుకు రమ్మన్న ఇండియా మ్యాపు వంకరటింకర అయ్యేది. బాసింపట్టు వేసుకుని రాయడానికి కూర్చున్న అతనికి దారి తప్పిన అనుభవం. కానీ బయటకు వెళ్లలేక, ఇక్కడ ఉండలేక ఇబ్బంది పడటానికి కారణం అమ్మ చెప్పిన మాట. ‘అనూ, ప్రసన్న సార్ వస్తుంటారు, నువ్వు పక్కనే ఉండు, సునీని వదిలి వెళ్ళకు!’
తననిలా తీర్చిదిద్దింది సునందక్క ప్రేమ, ఆమె కళ్ళు చెదిరిపోయే అందం అని అనూప్ పదేపదే నిరూపించుకోవడానికి కూర్చున్న క్షణాలు ఎన్నో. ఎంతో అందమైన అక్కను కలిగి ఉండటమే తనని ఇలా ఆడించింది, పరుగులు పెట్టించింది అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆమె కటాక్షం కోసమే పుట్టినట్లుగా ఉన్న అనూప్‌కు సునందక్క తన జీవితంలో అమృతాన్ని చిందించే ఒక సెలయేరు. అప్పుడప్పుడు గొడవపడి, పట్టుబట్టి ఆమె చేతిని గిల్లినప్పుడు, ఒక వారం అయినా నల్లబడిన రక్తం మరలా మొదటిలాగా కాకపోయినప్పుడు భయపడిన సందర్భాలు ఉన్నాయి! ఆమె సున్నితత్వం అతన్ని తొందరగా పరిణతి చెందించినట్లు అనిపించింది. కొంచెం ఎండకు వాడిపోయి కొంచెం చలికే నడిగే సునందక్క అంటే అనూప్కు జీవితంలో మరొక ఎంపికను గుర్తుచేయని గంభీరత!
తనకంటే నాలుగు సంవత్సరాలు పెద్దవారైనా, తనతో స్నేహం పెంచుకుని, తనను బుట్టలో వేసుకోవాలని ప్రయత్నించిన రామ్మూర్తి, ప్రసన్నసార్, ఇమామ్ పటేల్ గుర్తుకు రావడం చూసి అనూప్‌కు నవ్వు వచ్చింది. తను వారి కంటే చిన్నవాడైనా, తాను కూర్చోమంటే కూర్చునేవాళ్ళు నిలబడమంటే నిలబడేవాళ్ళు. ఎలాగైనా చేసి తనకు కొనిపెట్టి, తినిపించి, తాగించి ఎలాగైనా సునందక్కతో స్నేహం చేయాలి, మాట్లాడాలి అన్నదే వీరి కుట్ర. ఎలాగైనా తనను వలలో వేసుకుని, దగ్గరికి తీసుకుని తనతో మాట్లాడే నెపంతో సునందక్కను చూసి ఆనందించాలనే వారి ప్లాన్ అనూప్‌కు మెల్లమెల్లగా అర్థం కాసాగింది. సునందక్క స్నేహం కోసం ఆ ముగ్గురూ కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇమామ్ పటేల్ అయితే, సునందక్క తనలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అని తెలుసుకుని, తన కట్టుబాట్లనే మార్చుకుని, సిల్ సిలా సినిమాలో అమితాబ్ బచ్చన్‌లా మారిపోయాడు. కావాలనే ఇంగ్లీష్ నోట్స్ అడిగే నెపంతో అప్పుడప్పుడు సునందక్కతో మాట్లాడేవాడు. తిన్న చాక్లెట్ కవర్లను అలా నిమిరి పేజీల మధ్య పెట్టుకునే సునందక్క హాబీకి పడిపోయి, తానూ అలాగే చేయడం మొదలుపెట్టి, పళ్ళు పాడుచేసుకుని ఇంట్లో తిట్లు తిన్నాడట పాపం! మెరుపులా సరసర శబ్దం చేస్తున్న పేజీల మధ్య చాక్లెట్ కవర్లు అతని పాలిట నెమలి ఈకలుగా కనిపించడం వేరే విషయం.
ఇంత అందమైన కూతురుని కన్న నాన్న ముఖంలో ఎన్నడూ సంతోషాన్ని చూడనే లేదు. జబ్బ పుష్టితో పెరుగుతున్న సునందక్కను చూస్తే నాన్నకు లోపల ఎక్కడో కంగారు. అమ్మానాన్నల నొసటి గీతలు ఇలా లోతుగా అవుతుండటం అనూప్ గమనించాడు. తాము నివసిస్తున్న కాలనీ వెనుక, ముందు నాలుగైదు వీధుల వరకు తన సునందక్క గురించి ప్రచారం చేస్తున్నది ఎవరు అన్న దానిపై అనూప్‌కు తన స్నేహితులపైనే అనుమానం. ఆమెను కాపలా కాయడమే దుస్సాహసంగా ఉండేది అతనికి. మొదట నాన్న ఇంటికి వచ్చిన తన స్నేహితులకు కాఫీ ఇచ్చే నెపంతో ‘అమ్మాయ్ కాఫీ తీసుకురా’ అనేవాడు. కానీ ఇప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే సునందక్క బయటకు తొంగి చూడకుండా ఉండటం అనూప్‌కు ఆందోళన కలిగించింది. ఇంతకు ముందు చూసిన వారందరూ ఇంటిలోకి రాగానే వారి కళ్ళు సునందక్కను వెతుకుతుండటాన్ని నాన్న గమనించి, వీలైనంత త్వరగా వారిని బయటకు పంపడానికి ప్రయత్నించేవాడు లేదా తానూ ఏదో ఒక నెపంతో వారి వెంట బయటకు వెళ్లిపోయేవాడు. ఈ మధ్య ఆమె పగటిపూట బయటకు వెళ్ళడం అసాధ్యమైనప్పుడు నాన్న కామర్స్ అకౌంటెన్సీ ట్యూషన్‌కు అని ప్రసన్న సార్‌ని ఏర్పాటు చేశాడు. అదీ ప్రసన్న వివాహితుడు, ఒక బిడ్డకు తండ్రి అని నిర్ధారించుకుని! ఇంటికి వచ్చి పాఠం చెప్పి వెళ్ళిపోతున్న ప్రసన్న సార్ కూడా తనను ఇష్టపడిన కారణాన్ని తలచుకుని అనూప్ నవ్వుకున్నాడు.
వాన, చలి, భార్య, బిడ్డ దేన్నీ లెక్కచేయకుండా వచ్చి పాఠం చెప్పి వెళ్ళిపోతున్న ప్రసన్న సార్ పట్ల సునందక్క స్పందన ఆమె కళ్ళే చెప్పేవి. అందులోనూ ప్రసన్న సార్ పట్ల ఆమె అభిమానం, ప్రేమ, పేరుపెట్టడానికి వీలులేని విశ్వాసం సునందక్క మనసులో పరిణతి చెందాయి. ఆ ప్రేమాభిమానాలకు బదులుగా ఆమె ఇచ్చింది ఆ సబ్జెక్ట్‌లో వచ్చిన గరిష్ట మార్కుల రూపంలో! ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడని సునందక్క మౌనంలోని తియ్యని కలలను అంచనా వేయడంలో అనూప్ ఓడిపోయాడు.
రామ్మూర్తి తనకు సైకిల్ ఎందుకు నేర్పించాడో అనూప్‌కు ఇప్పుడు అర్థమవుతోంది. వెనుక కూర్చోవడానికి క్యారియర్ లేని అద్దె సైకిల్ను తీసుకొచ్చే రామ్మూర్తి సాయంత్రం ఐదు కాగానే ఇంటి ముందు వచ్చి నిలబడేవాడు. మొదట సైకిల్ నేర్పించడానికి తన వెనకే వచ్చే రామ్మూర్తి ఇప్పుడు అలా కాదు, వచ్చిన వెంటనే ‘చిన్నా సైకిల్ తీసుకుని రెండు రౌండ్లు తొక్కాలి, ప్రాక్టీస్ అవుతుంది’ అని ఆశ పెట్టి తనను పంపి, సునందక్కతో కాంపౌండ్ దగ్గరే నిలబడి కబుర్లు చెప్పడం మొదలుపెట్టేవాడని అనూప్‌కు గుర్తుంది. వెళ్లే, వచ్చే జనాలకు అనుమానం రాకుండా నటించేవాడని అనిపిస్తుంది. ఒకవేళ తను సైకిల్ తొక్కి తొందరగా వచ్చేస్తే, అతని ముఖంలో ఏదో నిరాశ. ‘అయ్యో చిన్నా, ఇంత తొందరగా ఎందుకు వచ్చావ్? ఇంకో రెండు రౌండ్లు వెళ్లిరా’ అని మరలా తనను బలవంతంగా ఎందుకు పంపించేవాడు రామ్మూర్తి? ఇదంతా ఇప్పుడు అర్థమవుతోంది. అది తన పట్ల ప్రేమతో కాదు; బదులుగా సునందక్క ఆకర్షణమైన నవ్వు, మాటల మోహం అని తెలిసింది. కొంచెం లోపల బాధపడినా, సునందక్క ముఖంలో ఏదో నవ్వు కనిపించినట్లుగా అనూప్ మరలా సైకిల్ ఎక్కేవాడు. ఆమె ముఖంలో ఈ నవ్వును ఉంచడానికి తను ఆ మాత్రం కూడా చేయకపోతే ఎలా అన్న భావనతో. ఈ రోజు జీవితం అతనికి కారులో తిరిగే అవకాశాన్ని ఇచ్చినా, ప్రతిసారి కారు ఆన్ చేసినప్పుడు రామ్మూర్తి సైకిల్ గుర్తుకొస్తుంది!
ఆ సమయం ట్రిన్ ట్రిన్ సైకిల్ శబ్దం మరలా చెవుల నిండా నిండినట్లుగా, సునందక్క జీవితంలో వచ్చిన మార్పుల పేజీ తిప్పిన అనుభవాన్ని అనూప్ నింపుకుని కూర్చున్నాడు. రామ్మూర్తి మరలా ఇంటికి బయలుదేరేటప్పుడు తనను మురిపించడానికి సైకిల్ మీద కూర్చోబెట్టుకుని వెళ్లి అయ్యంగార్ బేకరీలో కారపు బన్ను, సీనప్ప హోటల్లో మిరపకాయ బజ్జీలు తినిపించిన జ్ఞాపకం ఈ రోజు అన్ని జంక్ ఫుడ్ల రుచిని విసిరి కొట్టేసినట్లు మళ్ళీ మళ్ళీ వేధిస్తోంది. సునందక్క పట్ల రామ్మూర్తికి ఉన్న ఏదో మోహం, ఆమె ఎంతో అందమైన మహా మౌనం ఎలా కలిసాయో అన్నదే అనూప్ ముందున్న జిజ్ఞాస కూడా.
సునందక్క వేలును తను పట్టుకోకుండా, ఆమె తన వేలును గట్టిగా పట్టుకుని, భీతహరిణిలా చిరు చెమటను చిందిస్తూ పేట రోడ్డులో తిరిగిన విధానం ఇంకా అనూప్ కళ్ళలో పచ్చిగా ఉంది. చెమట పట్టిన ఆమె వేళ్ళలో అభద్రత తాలూకు ఒక ఊట ప్రవహిస్తున్న సంవేదన అతనిలో. ఎంతో అందమైన అక్కను పేట వీధిలో తీసుకుని వెళ్ళే ఆనాటి సంబరం ఈ రోజు ఏదో ఒక తత్వానికి అతన్ని జతకలిపింది. అమ్మానాన్నలు లోలోపల అనుభవించిన ఆందోళనకు సంబంధించిన తెలివిడి అది. కళ్ళతోనే అక్క మొత్తం శరీరాన్ని కొలిచే, వెక్కిరించే, అశ్లీలమైన ద్వంద్వార్థాన్ని విసిరే దుర్మార్గుల గుంపు కళ్ళ ముందు మరలా వచ్చి ‘హాయ్ సునందక్కా, ఇప్పుడు ఎలా ఉన్నావ్?’ అని ఫోన్ చేసి అడిగే తడబాటుకు మనసు కొట్టుకుంది. జాబితా వ్రాసుకుని వెళ్ళినా, ఇలాంటి జనం మధ్య అయోమయపడి సగం సగం సామానులు తెచ్చి అమ్మ తిట్టేటప్పుడు ఆమె బలి అయిన సందర్భాలు ఉన్నాయి. ఈ భయంలో తనకు చాక్లెట్ కొనిపించడం కూడా మర్చిపోయే సునందక్క ఆందోళన కొంచెం కొంచెం అర్థమయ్యేది. కామెడీ ఏమిటంటే, కాలనీ వెనుక వరుసలో ఉన్న మంజు తానూ, సునందక్క పేటకి వెళుతుండగా చూసి, మెల్లగా అనుసరించి, తెలియకుండా మాయం అయిన విధానాన్ని సునందక్క పసిగట్టి, మనసులో నవ్వుకుని వెళ్ళేది!
అప్పుడలా ఎందరికో మోహపు చిచ్చును, మాయకపు గంధాన్ని వ్యాపింప జేసిన సునందక్క ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి. ఆమె అందాన్ని పోరాడి లాక్కున్నట్లు పుట్టినవారు కవల మగపిల్లలు! లోలోపల నిట్టూర్పులు విడిచినట్లున్న సునందక్క ముఖంలో సంతృప్తి తాలూకు ఛాయను అనూప్ గమనించాడు. అలాగే ముఖంలోని ముడతలు క్రీములో మునిగిపోయిన విధానాన్ని కూడా. మాటిమాటికీ అన్నింటినీ నవ్వులోనే ముంచే సునందక్క తన అన్ని భావనలను అణచిపెట్టుకుని నాన్న వెతికిన మగవాడి ముందు తన మెడను వంచడాన్ని పెళ్లి మండపంలో అనూప్ గుర్తించాడు. ఆమె స్నేహితురాళ్ళు ‘ఎందుకు సునీ, ఏ ఫోటోలోనూ నీ ముఖం ఉత్సాహంగా లేదు’ అని అడిగిన ప్రశ్నకు సునంద సమాధానం ఒకటే! అదే నవ్వినట్లు ఉన్న ఏడుపు లేదా ఏడ్చినట్లు ఉన్న నవ్వు! మాటిమాటికీ అదే నవ్వు, నవ్వు, నవ్వు. పరిణతి చెందిన మనసు లోతులో పులకించే క్షణాలను దాచిపెట్టుకున్నట్లు. విశ్వపు కోరికలన్నీ నక్షత్రాలై ఎగిరి ఆకాశంలో నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు. సైకిల్.. ట్రిన్ ట్రిన్ బెల్, చాక్లెట్.. కరకర కవర్, అకౌంటన్సీ.. పట్టికల గురించి మాట్లాడినప్పుడు సునందక్క కళ్ళలో మెరిసే వెలుగు, లోపల ప్రవహించే నది, ఆమెకే తెలుసు.
రామ్మూర్తి అక్క మృదువైన మాటలకు ఓడిపోయి నిలబడిన చోటే నిలబడిపోతుంటే, ట్యూషన్ ప్రసన్న సార్ నాగుపాము అంత పొడవైన, లావైన జడ యొక్క మాయను చూసి టాలీ కాని టేబుల్స్ మధ్య అయోమయపడేవాడు. ఆమెకు పాపిట తీసి రెండు జడలు అల్లేసరికి, అమ్మ చేతులు అలిసిపోయి గొణుగుతుండేది. ‘ఏ పురుగు మందు వేసి పెంచావమ్మా’ అని ప్రేమగా వెక్కిరించేది. అమ్మ లోపల వెల్లివిరిసే గర్వపు ఛాయలను అనూప్ కూడా గమనించేవాడు. సునందక్కది మళ్ళీ అదే నవ్వు. భోజనానికి కూర్చున్నప్పుడు అయితే, పళ్ళెంలో వెంట్రుక కనిపిస్తే నాన్న కొలిచి కొలిచి తిట్టేవాడు. పొడవుగా మణులలా అన్నం గింజలను అంటించుకుని ఉన్న వెంట్రుకను పళ్ళెం నుండి తీస్తూ సునందక్క వైపు కోపంగా చూస్తే చాలు, అక్క అక్కడి నుండి పరార్!
‘సునీ, దయచేసి జుట్టును విరబోసుకుని వంటగదిలోకి రాకమ్మా’ అని అమ్మ బ్రతిమలాడుకునేది. ఇంకా తల దువ్వుకోవడానికి బయటకు వచ్చి నిలబడితే, ఎదురింటి కిటికీ ఒకటి చప్పున తెరుచుకునేది..!
స్థిమితంగా కూర్చోనివ్వని జ్ఞాపకాలు అనూప్ లోపల మళ్ళీ మళ్ళీ తవ్వుతున్నాయి.. ట్యూషన్ చెప్పే నెపంతో భార్య ఇచ్చింది అని కర్చీఫ్‌లో బొండుమల్లె మొగ్గలను తెచ్చిపెట్టి వెళ్ళిపోతున్న ప్రసన్న సార్ తన జీవితాన్ని సార్థకం చేసుకుంటున్న విధానం అదేనా అనిపిస్తుంది. తలలో పెట్టుకోని సునందక్క వాటిని అకౌంటెన్సీ నోట్స్లో మడిచిపెట్టి అప్పుడప్పుడు వాసన చూసేది కూడా అనూప్‌కు గుర్తు. చాక్లెట్ కవర్ల వరుసలో మరలా ఎండిపోయినా వాసన కోల్పోని బొండుమల్లెలు! సునందక్క స్నేహం, సామీప్యం సంపాదించుకోవడమే తమ జీవిత లక్ష్యమని నమ్మి సర్కస్ చేస్తున్న రామ్మూర్తి, పటేల్, ప్రసన్న సార్.. వీరందరూ తనను ఈ స్వార్థంతోనే ఉపయోగించుకుంటున్నారన్న సత్యం మెల్లగా మనసులో నాటి అనూప్‌కు పరిణతి చెందే మార్గాన్ని నేర్పించింది. ఒక క్షణం కూడా తనను వదిలిపెట్టని సునందక్క కూడా తనను భద్రతాకవచంగా చూసిందా లేక ప్రపంచపు అనుమానాలకు తనను కోటగా కట్టుకుందా అని అనూప్‌కు సందేహం కూడా కలిగింది.
‘అనూ’ ‘అనూ’ అని ప్రేమగా పలకరించిన ఆ కాలనీలోని ఎక్కువమంది కుర్రాళ్లు, మగాళ్ల కుట్ర ఇప్పుడు అనూప్‌కు అర్థమై, అమాయక ప్రపంచపు పొరను వదిలి చాలా దూరం వచ్చేశాడు. జీవితం కూడా చాలా మారిపోయింది. ఏవి మారినా సునందక్క ఇచ్చిన వెచ్చని ఆప్యాయత, చేదు నిజాల అవగాహన అతడిని మరింత పరిణతి చెందేలా చేశాయి. తమ కష్టాలు తెలియకుండా బ్రతికిన అమ్మానాన్నల జీవితం ఇక్కడి వరకు తీసుకువచ్చింది. అనారోగ్యం కారణంగా రెండేళ్ల ముందే నాన్న పదవీ విరమణ చేసి, కాలనీని వదిలి పల్లెలోని సొంత ఇంటికి మకాం మార్చడం, కాలనీని విడిచి వెళ్ళే రోజు అటూఇటూ ఉన్న ప్రజలందరూ చేయి ఊపి వీడ్కోలు పలకడం, దూరంలో రామ్మూర్తి తన సైకిల్‌కి ఆనుకుని నిలబడడం, కర్చీఫ్ పట్టుకుని చెమట తుడుచుకుంటున్న ప్రసన్న సార్, సిల్‌సిలా వంటి అమితాబ్ స్టైల్‌లో ఉదాసీనంగా ఉన్న ఇమామ్ పటేల్ అందరి ముఖాలు అనూప్ గుండెలో ఒకసారి మెరిసి మాయమయ్యాయి. అందరినీ ఒక్కసారి తదేకంగా చూస్తూ లగేజీ లారీ ముందు కూర్చున్న సునందక్క, జీవితంలోని ఉత్సాహాన్నంతా మూటగట్టుకుని వెళ్తున్నట్లుగా చేయి ఊపింది. కానీ మళ్లీ ఆమె ఆ మూటను విప్పలేదేమో అని అనూప్‌కు అనిపించింది.
చేజారిపోయే క్షణాల మైకం గురించి అనూప్ మళ్లీ మళ్లీ ఆలోచించసాగాడు. జీవితం ఇంత దూరం తీసుకువచ్చినప్పుడు గడిచిపోయిన దారిని మళ్లీ చూసే వ్యసనానికి లొంగిపోవాలనే పట్టుదల. చాలా అందమైన సునందక్కతో అల్లుకున్న జీవితం అకాల పరిణతిని అతడిలో తీసుకొచ్చింది. తమ కూతురు గుండెలపై కుంపటి అని నమ్మిన అమ్మానాన్నల ఆందోళనంతా అనూప్‌కు మళ్లీ ఎదురైంది. అచ్చం మేనత్త రూపాన్ని పోలిన అందమైన ప్రతిరూపంగా పుట్టిన తన కూతురిని చూసి! చిన్న కూతురు పరిమళను చూసినప్పుడల్లా ఇంకా ఏ అధ్యాయాలు మళ్లీ తెరవబడటానికి సిద్ధంగా ఉన్నాయో అనే చింత అనూప్‌ది.
అనూప్‌కు ఇంకా బాగా గుర్తుంది.
సునందక్కకు పెళ్ళై ఒక వారం కూడా కాలేదు. దివాకర్ బావ ఆమెకు పొడవైన జుట్టును కత్తిరించుకోమని ఆజ్ఞాపించాడు! నవ్వును కోల్పోయినట్లు ఉన్న సునందక్క తన జుట్టును చిన్న జడగా మార్చుకుని ‘అనూ పుట్టా’ అని ఎప్పుడూ పిలిచినట్లుగా ‘అమ్మకు చెప్పు, ఇక నుండి నాకు జడ అల్లేటప్పుడు ఎప్పుడూ చెయ్యి నొప్పి రాదు’ అంది. సునందక్క కంటి అంచున నీరు పొంగకుండా లోపలే ఇంకిపోవడం అనూప్ గమనించాడు. నిలబడినప్పుడు, కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు అపనమ్మకపు ముళ్ళను పరిచే దివాకర్ బావ వ్యంగ్యానికి సునందక్క ఇచ్చిన సమాధానం మరలా అదే నవ్వు! ‘ఎందుకు సునీ జడ కత్తిరించుకున్నావ్?’ అన్న అమ్మ మాటలకు ‘చుండ్రు, పేలు, పురుగులు’ అని ఏదో తడబడుతూ చెప్పింది. పల్లెటూరి ఇంటి ఆవరణలో గోరింటాకు మొక్క సునందక్క చేతికి చిక్కి ప్రతిసారి ‘బోడి’ అయిన విధానాన్ని అనూప్ మర్చిపోలేడు.
వాసుదేవ్ నాడిగ్
కలలు కనడం నేర్పించిన సునందక్క వంటగదిలో చేరిపోయినప్పుడు అపారమైన అందం, ఉత్సాహం, ప్రతిభ, తేజస్సు, మెల్లగా పోపు వాసనలో మిళితమై పోవడం అనూప్‌కు ప్రశ్నగా మిగిలింది. ఏ భావాన్నీ ముఖంలో పలికించని దివాకర్ బావను రోడ్డు మీద కలిసినప్పుడు దీని గురించి అడగాలనిపిస్తుంది. కానీ అన్నింటికీ సునందక్కదే అదే నవ్వు అడ్డు వచ్చి, పుస్తకాల పేజీల మధ్య పెట్టిన బొండుమల్లెపూలు ఇంకా సువాసన కోల్పోని విస్మయం గుర్తుకు వచ్చి ఊరుకున్నాడు. పరిమళ నామకరణానికి వచ్చి వెళ్ళిన సునందక్క ఒక నెల అయినా ఇంటికి రానందుకు ఆందోళనపడి అనూప్ అక్కను చూడటానికి వచ్చినప్పుడు, నటి శిరోమణిలా మరలా నవ్వు నవ్వుతూ వచ్చిన సునందక్కను చూసి మౌనంగా ఉండిపోయాడు. ఏదో అడగాలని నిర్ణయించుకుని వచ్చిన అతనికి సునందక్క కాఫీ కప్పు చేతికి ఇచ్చి ‘అంతా బానే ఉంది కదా? నాన్న బీపీ కంట్రోల్లో ఉందా?’ అని ప్రశ్నలు వేస్తూ వంటగదిలో దూరిపోయింది. ఏమీ అడగలేక అనూప్ బయలుదేరడానికి సిద్ధమైనప్పుడు సునందక్క లోపల నుండి అరిచి చెప్పింది;
‘అనూ, పరిని బాగా చూసుకో’ అన్న మాట వెయ్యి కథలకు నాంది పలికింది!
కన్నడ మూలం: వాసుదేవ్ నాడిగ్
తెలుగు అనువాదం: కోడీహళ్ళి మురళీమోహన్
కోడీహళ్లి మురళీమోహన్ వ్యాసకర్త, కథకులు, సంపాదకులు. తెలుగు వికీపీడియన్. ‘కథాజగత్’, ‘సాహితి విరూపాక్షుడు విద్వాన్ విశ్వం’, ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ అనే పుస్తకాలు ప్రచురించారు.