[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘సుఖాంతం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఉదయం ఎనిమిది గంటలు. అప్పుడే నిద్ర లేచి, హాల్లోకి వచ్చింది తల్లి సుభద్రమ్మ. సోఫాలో కూర్చుని కాఫీ తాగుతున్న కొడుకుతో..
“సూర్యా! ఆఫీస్ కి బయలుదేరుతున్నావా?” అంది.
“అవునమ్మా”
“కాఫీ పెట్టుకున్నావా?”
“అవును.. నీకూ ఇమ్మంటావా?” అన్నాడు.
“నీకు అనువుగా చేసిపెట్టే అదృష్టం నాకు లేకపాయె. ఈ కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఏ పనీ చేయకుండా బాధపెడుతున్నాయి. అందులో చలికాలం” అంది మూలుగుతూ.
“పర్వాలేదమ్మా. నాకు తెలిసిన డాక్టర్ దగ్గర ఈ శనివారానికి అపాయింట్మెంట్ తీసుకున్నాను. నిన్ను తీసుకెళ్తాను”
“ఏం వైద్యాలో, ఏంటో.. ఎన్ని రకాల వైద్యాలని చేయిస్తావు నాకు. ఈ నొప్పులు తగ్గేవి కాదు” అంది నిర్లిప్తతగా.
“సరే! నేను బయల్దేరుతానమ్మా” అన్నాడు.
అంతలో సూర్య ఫోన్ మోగింది.
“హలో చెప్పు సుమా!”
“అన్నయ్యా ఎలా ఉన్నావు? అమ్మ ఎలా ఉంది?”
“నేను బాగానే ఉన్నాను. కానీ అమ్మకే కాళ్ళనొప్పులు ఎక్కువయ్యాయి. ఈ శనివారం ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను”
“అన్నయ్య! నాకు కొంచెం మనీ పంపించు.. కాలేజీలో ల్యాబ్‌లో కట్టాలి.”
“అర్జెంటా? రెండు రోజులు టైమ్ ఉందా?” అన్నాడు.
“అలాగే.. రెండు రోజులాగి పంపు”
“ఆఫీస్‌కి బయలుదేరుతున్నాను” అని ఫోన్ పెట్టేసాడు.
బయలుదేరుతుంటే.. “సూర్యా! ఇవాళ అక్క వనజ వస్తానని ఫోన్ చేసింది.” అంది సుభద్రమ్మ.
“మొన్నే కదమ్మా.. వచ్చి వారం రోజులుండి వెళ్ళింది”
“చీరలు కొనుక్కోవాలట.”
“ఏం వాళ్లున్నచోట బట్టల షాపులు లేవా? అయినా ఇవాళ షాపులు దాకా కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో బుక్ చేస్తే చాలు.. ఏం కావాలన్నా ఇంటికి వస్తున్నాయి” అన్నాడు.
“వస్తానంటే కన్నతల్లిగా వద్దని ఏమని చెప్పేది?”
“సరే నీ ఇష్టం..” అని బయటకు వచ్చాడు సూర్య.
***
సూర్య తండ్రి రాజారావు బ్రతికున్నప్పుడు సూర్యకి ఏ చింతా ఉండేది కాదు. ఇప్పుడు ఓ పక్క ఆర్థిక బాధలు., మరోపక్క బరువు బాధ్యతలు. వచ్చేదానికి ఖర్చయ్యేదానికి పొంతనలేదు. చదివిన చదువుకి చేసే ఉద్యోగంలా. ఊహా జీవితానికి, వాస్తవ జీవితానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. తీరం చేరని నావలాంటి కుటుంబాన్ని నడిసంద్రంలో వదిలి రాజారావు అకాల మరణం పాలయ్యాడు. తండ్రి వదిలిన బాధ్యతల్లో ముఖ్యమైనవి ఓ కొలిక్కి తెచ్చాడు సూర్య. రాజారావు మరణంతో అప్పటి వరకు ఉంటున్న రైల్వే క్వార్టర్స్ ఖాళీ చేయాల్సి వచ్చింది. తండ్రి ఎప్పుడో బొల్లారం సమీపంలో కొన్న 200 గజాల స్థలంలో.. అసంపూర్తిగా కట్టి వదిలేసిన ఇంటిని పూర్తి చేశాడు. తండ్రి బతికున్నప్పుడే అక్క వనజకి పెళ్లి సంబంధం కుదరటంతో, ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్లి కాకుండా తండ్రి మరణించడంతో సంవత్సరం పాటు వాయిదా పడ్డది. కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాక, అక్కకి అదే.. సంబంధం పెళ్లి చేశాడు సూర్య. ఇల్లు కట్టడం కోసం తండ్రి చేసిన అప్పులు అలాగే మిగిలిపోయాయి. గుడ్డిలో మెల్లగా తండ్రి చేసిన రైల్వే ఉద్యోగానికి కంపేసినేట్ గ్రౌండ్స్‌లో సూర్యకి జూనియర్ క్లర్క్ ఉద్యోగం వచ్చింది. చెల్లెలు సుమ.. ఖమ్మం మమతా మెడికల్ కాలేజీలో డెంటల్ కోర్సు చదువుతోంది. తల్లి సుభద్రముకి అనారోగ్యం. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తరచూ వస్తుండటంతో హోమియోపతి, ఆయుర్వేదం, అల్లోపతి వైద్యాలు చేయించినా.. మోకాళ్ళ నొప్పులు మాత్రం తగ్గటం లేదు. ఇప్పుడు మోకాళ్ళకి సర్జరీ చేయించాలనుకుని, శనివారానికి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాడు. సుభద్రమ్మకి భర్త పెన్షన్ నెల నెలా వస్తుంది. కానీ ప్రతి నెలా ఏదో ఒక అదనపు ఖర్చు వస్తూనే ఉంది. దానికి తోడు వనజ ప్రతినెల ఏదో ఒక కారణం చెప్పి పుట్టింట్లో కనీసం వారం అయినా ఉండి వెళ్ళటం పరిపాటి అయింది. ఏదైనా అంటే.. “నీ సంపాదనలో నాకు పైసా అక్కర్లేదు.. అమ్మకి నాన్న పెన్షన్ వస్తుంది. నీ సంగతి నువ్వు చూసుకో” అని వనజ అనటంతో.. సూర్య మౌనం అయిపోయాడు. సుమ డెంటల్ డాక్టర్ కోర్స్ చదువుతుంటే ఖర్చు వేలల్లో.. ఉంటున్నాయి. తల్లికి వచ్చే పెన్షన్.. చన్నీళ్ళకి వేడినీళ్ల ఉపయోగపడుతుంది అనుకున్నాడు. కానీ.. ఆ డబ్బు ప్రతినెలా చెల్లా చెదిరిపోతుందని ఊహించలేదు సూర్య. ఆలోచిస్తూనే ఆఫీస్‌కి చేరుకున్నాడు.
***
పది గంటలకు వనజ వచ్చింది. కూతుర్ని చూడటంతోనే అప్పటి వరకు ఉన్న అనారోగ్యం పక్కకు నెట్టి.. రుచికరంగా వంట చేసింది.
మధ్యాహ్నం తల్లి కూతురు షాపింగ్‌కి బయలుదేరారు. తల్లితో “నాకు నువ్వు సెలెక్ట్ చేసే చైర్లే నచ్చుతాయమ్మా! .. నీతో షాపింగ్ చేస్తేనే మ్యాచింగ్ బ్లౌజ్, ఇన్నర్సు.. అన్నీ దొరికే చోటుకే తీసుకెళ్తావు. బట్టల్లో నాణ్యత నీకు తెలిసినంతగా నాకు తెలియదు..” అని తల్లిని పొగిడితే చాలు.. వనజ చీరలకయ్యే ఖర్చు, చివరికి బ్లౌజుల కూలికి అయ్యే ఖర్చు కూడా సుభద్రమ్మ పెన్షన్ డబ్బులు నుండే ఇస్తుంది. అంతేనా! మా ఆయనకి ఆ పచ్చడి అంటే ఇష్టం, పలానా స్వీట్ అంటే ఇష్టం అంటూ నెలకు సరిపడా చిరుతిండి దగ్గర నుంచి వచ్చినప్పుడల్లా చేయించుకుని తీసుకు వెళుతుంది.
ఆ మధ్య ఒకసారి చెన్నైలో సూర్యా పినతండ్రి కొడుకు పెళ్లికి కంపల్సరిగా వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు తను కలిసి వస్తానని.. ముందు రోజే వచ్చి కూర్చుంది వనజ. రెండు రోజుల్లో తిరిగి వద్దామనుకున్నది కాస్త.. ఆ గుడి చూడాలి ఈ గుడి చూడాలి అని.. మధురై, రామేశ్వరం, తిరువన్నామలై..తిప్పించింది. తల్లి కొడుకు రైల్వే పాస్‌లో వెళ్లి రావచ్చని అనుకున్న సూర్య ప్లాన్ అంతా.. తలకిందులు చేసి ఖర్చు నాలుగింతలు పెరిగేలా చేసింది వనజ.
సూర్య ఏదైనా మాట్లాడితే చాలు “నీ పీనాసి బుద్ధులు ఆపరా!.. తోడబుట్టిన అక్క కోసం 10 రూపాయల ఖర్చు పెట్టాలంటే.. వందసార్లు ఆలోచిస్తావెందుకురా? పిసినారిలా.. మా ఆయనకు లీవ్ దొరకకపోబట్టి మీతో రావాల్సి వచ్చింది. అయినా నీ సంగతి తెలిసే నాన్న అమ్మకి పెన్షన్ ఏర్పాటు చేసెళ్ళాడు” అని దులిపేసింది. వనజ చదివింది టెన్త్ క్లాస్ వరకే అయినా.. మాటలు మాత్రం లాయర్లను మించిపోయి ఉంటాయి. డి.ఆర్.డి.ఎల్ వంటి పేరుగాంచిన సంస్థల్లో.. సైంటిస్ట్‌గా ఉద్యోగం చేయాలని ఎమ్మెస్సీ ఫిజిక్స్ చేశాడు. తండ్రి మరణంతో అతని కలలన్నీ అటకెక్కాయి.
తల్లి అక్క వాళ్ల గురించి వాళ్లు ఆలోచించుకోవడం తప్ప.. సూర్య గురించి ఆలోచించటం మానేశారు. సూర్యకి పెళ్లీడు వయసు వచ్చింది. చెల్లెలు సుమకి పెళ్లి కాకుండా తను పెళ్లి చేసుకోవడం సబబు కాదు. అసలు తన జీవితంలో వసంతం వస్తుందా? తన కోసం ఆలోచించే, అనుకూలమైన వ్యక్తి భార్యగా వస్తుందా? తనను అర్థం చేసుకునే భార్య వచ్చి, తన వాళ్లలో మార్పు తెస్తుందా? లేక వాళ్లతో కలిసి తన జీవితాన్ని నరకంగా మారుస్తుందా? ఇలా పలు రకాల ప్రశ్నలతో.. రాత్రుళ్ళు పడుకుని ఆలోచించిస్తూ.. ఉదయం నిద్ర లేచి మళ్లీ తనకు తానే సర్ది చెప్పుకొని మంచి కాలం కోసం నిరీక్షిస్తున్నాడు సూర్య.
***
కాలం గిర్రున మరో సంవత్సరం ముందు కదిలింది. సుమ డెంటల్ డాక్టర్ కోర్స్ (బి.డి.ఎస్) ఫైనల్ ఇయర్‌కి వచ్చింది. ఇంకో ఆరు నెలల్లో కోర్స్ పూర్తవుతోందనుకున్న సమయంలో.. సెలవులకు ఇంటికి వచ్చిన సుమ సూర్య నిరీక్షణకు పరీక్షగా.. ఓ పెద్ద అణుబాంబు పేల్చింది. తనతో పాటు బీ.డీ.ఎస్ చదువుతున్న వంశీతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయింది. వీళ్ళ ప్రేమ వ్యవహారం వంశీ వాళ్ల ఇంట్లో తెలియటంతో తండ్రి భాస్కర రావు.. ఆరోజు సూర్య వాళ్ళతో మాట్లాడటానికి వస్తున్నాడని తల్లి సుభద్రముతో చెప్పింది సుమ.
చదువు పూర్తి కాకుండా పెళ్లేంటిని సుభద్రమ్మ కూతురిని అరిచింది.
“ఇప్పుడే పెళ్లి చేసుకోవటం లేదులేమ్మా!”
“ఏమో సూర్యకి తెలిస్తే ఏమంటాడో? అయినా చెప్పి చూస్తాను”అంది సుభద్రమ్మ.
ఆరోజు రాత్రి సుభద్రమ్మ సూర్యతో చెప్పింది.
తల్లి వెనకాలే సుమ వచ్చి.. భయం భయంగా సూర్యతో చెప్పింది.
విషయం విన్న సూర్య మౌనంగా ఉన్నాడు. ఒక్క మాట మాట్లాడలేదు.
మరుసటి రోజు ఆదివారం అవటంతో సూర్య ఇంట్లోనే ఉన్నాడు.
10 గంటల సమయంలో వచ్చిన భాస్కర రావు తనని తాను పరిచయం చేసుకున్నాడు.
“మీ చెల్లెలు సుమ, నా కొడుకు వంశీ.. ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్యనే నా కొడుకు నాతో..
“డాడీ! మీకు అమ్మకి ఇష్టమైతేనే సుమని చేసుకుంటాను. నాకోసం ఒక్కసారి సుమ వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడండి. మేమిద్దరం సెటిల్ అయ్యాక పెద్దలు అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం”అని చెప్పి,
“మీకు నేను పరిచయం లేకపోవచ్చు కానీ మీ చెల్లెలు సుమకి నేనెవరో బాగా తెలుసు”అన్నాడు భాస్కర రావు.
ఆయనకేం బదులు చెప్పాలో సూర్యకి అర్థం కాలేదు తల్లి వైపు చూశాడు.
మళ్లీ భాస్కర్ రావు కల్పించుకొని “మాది మిడిల్ క్లాస్ కుటుంబం నా భార్య పేరు తులసి. మాకు ఇద్దరు కవల పిల్లలు. ఓ కొడుకు, కూతురు. కొడుకు పేరు వంశీ. బి.డి.యస్ చదువుతున్నాడు. కూతురు పేరు గాయత్రి. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది. ఇప్పుడు నా కొడుకు వంశీ, మీ సుమ ప్రేమించుకుంటున్నారు. పరస్పరం ఇష్టపడుతున్నారు. దానిని గురించి మాట్లాడటానికి మీ ఇంటికి వచ్చాను.” అన్నాడు.
సుభద్రమ్మ కొడుకు వైపు చూసి అతను మాట్లాడటానికి ముందే కల్పించుకొని “ఏం పిల్లలో ఏంటో నండీ! లక్షలు పోసి కాలేజీలో చదివిస్తుంటే.. చదువులు పూర్తికాకముందే ప్రేమ పాఠాలు నేర్చుకుని, కాబోయే వాళ్ళని వాళ్ళే చూసుకుని.. పెళ్లిళ్లు మాత్రం చేయమంటున్నారు.”అంది సుభద్రమ్మ కోపం నటిస్తూ.
“ఆవేశ పడకండమ్మా! ఈ విషయం విన్న వెంటనే నాకూ మీలాగే అనిపించింది. తర్వాత నిదానంగా ఆలోచించాను. మన కాలం కాదిది. ఆ కాలంలో తల్లిదండ్రులు చూపించిన వాళ్లనే చేసుకునే వాళ్ళం. కానీ ఈ కాలం అరేంజ్డ్ మ్యారేజ్ ఓల్డ్ ఫ్యాషన్‌కి మారిపోయాయి. కనీసం మన పిల్లలు మన అంగీకారం అడుగుతున్నారు. అందుకు సంతోషించండి. వాళ్ళ ఇష్టాన్ని మనం గౌరవించకపోతే వాళ్లు మనల్నీ గౌరవించకుండా వాళ్ల త్రోవ వాళ్లు చూసుకుంటారు. నేను మీ కుటుంబం గురించి సుమ గురించి ఎంక్వయిరీ చేశాకే మీ ఇంటికి వచ్చాను. నాకు సుమ కంటే సూర్య బాగా నచ్చాడు. సైంటిస్ట్ అవుదామనుకున్న తన లక్ష్యాన్ని పక్కనపెట్టి కుటుంబం కోసం చిన్న ఉద్యోగం చేస్తూ.. బాధ్యత తెలిసినవాడిగా వ్యవహరించటం నాకు బాగా నచ్చింది. ఈ కాలపు పిల్లలు సొంత లాభం చూసుకుంటున్నారే తప్ప.. మీ సూర్యలాగా చాలా తక్కువ మంది కుటుంబం కన్నవాళ్ళ గురించి గురించి ఆలోచిస్తున్నారు. నాకు సూర్యలో ఆ విషయం నచ్చి వెంటనే మీతో సంబంధం కలుపుకోవాలని మీ సమ్మతం కోసం వచ్చాను” అన్నాడు భాస్కర రావు. ఆ మాట వినేసరికి సుభద్రమ్మ సూర్య, మొహాల్లో చిరు దరహాసం తొంగి చూసింది.
సూర్యకి చెల్లెలిపై కొన్ని నిమిషాల ముందున్న కోపం శాంతించింది.
భాస్కర రావుతో “ఫస్ట్ అఫ్ ఆల్.. మా కుటుంబం మీద నా మీద మీకున్న గౌరవానికి ధన్యవాదాలు సార్! మీరు నాకు అది నచ్చిన అంశం ఏమిటంటేరు కన్న పిల్లల ఇష్టాల్ని విని ఆవేశపడకుండా గౌరవించి.. ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషం సార్! నేను మీ అబ్బాయిని చూడలేదు” అన్నాడు సూర్య.
వెంటనే వాలెట్ తీసి అందులో ఉన్న కొడుకు ఫోటో సూర్యకి చూపించి “అదంతా విషయం సూర్యా! రేపు మీ సుమతో కాలేజీకి వెళ్లి మా వంశీని చూడండి. వాడి ఫ్రెండ్స్ దగ్గర వాడి గురించి విచారించండి. నేను మీ గురించి విచారించినట్టు.. మీరూ మా గురించి ఎంక్వయిరీ చేసుకోండి” అన్నాడు భాస్కరరావు.
“చాలా సంతోషం సార్! మా వాళ్ళతో మాట్లాడి మీకు ఏ విషయం తెలియజేస్తాను” అన్నాడు సూర్య.
అంతలో అందరికీ కాఫీ తీసుకొచ్చింది సుమ.
కాఫీ తాగుతూ.. “మీతో రెండు కండిషన్ల గురించి మాట్లాడాలి. మొదటిది వీళ్లిద్దరు చదువులు పూర్తి అవటానికి ఇంకో ఆరు నెలలు టైం ఉంది. ఆ తర్వాతే పెళ్లి.”
“కచ్చితంగా సార్! దీని గురించి నేనే మీతో మాట్లాడాలనుకున్నాను. మీరే చెప్పారు. మాకు ఓ.కే” అన్నాడు సూర్య.
“నా రెండో కండిషన్ ఏమిటంటే.. నాకు పెళ్లీడు కొచ్చిన కూతురు ఉంది. పేరు గాయత్రి. తనకి పెళ్లి చేయకుండా వంశీకి పెళ్లి చేయడం పద్ధతి కాదు. తనకీ ఇంకో రెండు నెలల్లో ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వబోతోంది. అందుకని నా కూతురు గాయత్రిని, సూర్యకి చేసుకుంటామంటే దాని గురించి మాట్లాడదాం. మీకు అంగీకారం అయితే.. అభ్యంతరం లేకపోతే.. ఆలోచించుకుని చెప్పండి. ఆ తర్వాతే.. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ పెట్టుకుందాం” అన్నాడు భాస్కరరావు.
సూర్యకి ఏం బదులు చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఇంతవరకూ ఎప్పుడు తన పెళ్లి గురించి తనే ఆలోచించలేదు.
మళ్లీ భాస్కర రావు మాట్లాడుతూ
“కట్నకానుకల గురించి ఆలోచించకండి. మీ ఇంటి మహాలక్ష్మిని మా ఇంటికి వస్తే, మా ఇంటి మహాలక్ష్మి మీ ఇంటికి పంపుతున్నాం. మీరు మీ అల్లుడికి ఎన్ని కట్నకానుకలిస్తే, మా అల్లుడికి అన్ని కట్నం కానుకలు తిరిగి ఇస్తాం. మీరు మీ అమ్మాయిని ఇచ్చి, మా అమ్మాయిని చేసుకోవడానికి అంగీకరిస్తే చాలు. ఇది నా సెల్ నెంబర్. మీరు ఆలోచించుకుని ఏ విషయం చెప్తే మనం కలుసుకొని వివరంగా మాట్లాడుకుందాం.” అని నెంబర్ ఇచ్చి వెళ్లిపోయాడు భాస్కరరావు.
సుభద్రమ్మ కొడుకుతో “నువ్వు ఏమంటావు సూర్యా!” అంది.
“ఇంకా నేనేం ఆలోచించలేదమ్మా!” అని ఏదో మాట్లాడుపోతుంటే అతని సెల్‌ఫోన్ శబ్దం చేసింది.
ఫ్రెండ్ ఫోన్ చేయటంతో బయటకు వెళ్ళాడు సూర్య.
సుమ తల్లితో “అమ్మా! ఇలా కుండ మార్పిడి పిళ్ళిళ్ళకి అన్నయ్య ఒప్పుకుంటాడో లేదో!? ఇలాంటి విషయాల్లో అన్నయ్య చాలా కచ్చితంగా ఉంటాడు. ఇప్పుడు నా పెళ్లి కట్నం సమస్య కూడా లేదు. అన్నయ్యకి నువ్వే చెప్పి ఒప్పించాలి” అంది సుమ.
***
బయటికి వెళ్లిన సూర్య.. ఫ్రెండ్ మహేష్‌ని కలిసి ఇద్దరూ కెఫటేరియాలో కూర్చున్నారు. సూర్య జరిగిందంతా చెప్పాడు.
“సూర్యా! మంచి ఛాన్స్ మిస్ చేసుకోకు. ఈ అవకాశం వదులుకుని మీ సుమకి మాత్రం పెళ్లి చేసి పంపించావంటే.. ఆ తర్వాత నీ పెళ్లి గురించి పట్టించుకునే వాళ్లే ఉండరు మీ ఇంట్లో. మీ అమ్మ గాని, అక్క గాని నిన్నో ఏ.టీ.ఎం. మెషీన్లా భావిస్తున్నారు. కానీ నీ మంచి చెడ్డలు గురించి పట్టించుకోవడం లేదు. వాళ్లు నీ గురించి ఆలోచించే వాళ్లే అయితే నీ పెళ్లి ఎప్పుడో అయిపోయేది” అన్నాడు మహేష్.
“అది నిజమే! కానీ నా భయం వేరుగా ఉంది. ఇంట్లో అమ్మ, అక్కయ్య పది రూపాయలు అయితే వుంది రూపాయలు ఖర్చు పెట్టడానికి అలవాటు పడ్డారు. వీళ్ళలాగే నాకు వచ్చే భార్య కూడా దుబారా ఖర్చు మనిషి అయితే నా పరిస్థితి ఏమిటన్నదే నా ఆలోచన” అన్నాడు.
“కరెక్టే! ఇవాళ మనం వంశీని కలిసి మాట్లాడినట్టే.. ఎంగేజ్మెంట్కి ముందే ఆ అమ్మాయిని కలిసి ఓసారి మాట్లాడటం మంచిది. ఎందుకంటే రాబోయే అమ్మాయి ఎన్నో కలలతో వస్తుంది. తీరా వచ్చాక మీ ఇంటి పరిస్థితులకు అడ్జస్ట్ కాలేకపోతే.. నువ్వు చెప్పినట్టే జరుగుతుంది” అన్నాడు మహేష్.
అంతలో కాఫీ వచ్చింది. ఇద్దరూ తాగుతున్న సమయంలో.. కూర్చున్న చోటుకి వెనక నుండి “ఎక్స్‌క్యూజ్‌మీ” అన్న స్త్రీ గొంతు వినిపించడంతో వెనక్కి తిరిగి చూశారిద్దరూ.
ఆ అమ్మాయి సూర్య వాళ్ళ దగ్గరకొచ్చి..
“హలో! నా పేరు గాయత్రి. మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను. నేను మా ఫ్రెండ్‌తో కాఫీ తాగడానికి వచ్చాను. నిజానికి మీరు ఎవరో నాకు తెలీదు. కానీ మీ మాటలను బట్టి.. మా అన్నయ్య వంశీ ప్రేమిస్తున్న సుమ వాళ్ళ అన్నయ్య సూర్య మీరే అని వచ్చాను” అంది.
సూర్య మహేష్ ఒకరినొకరు చూసుకున్నారు.
మళ్లీ గాయత్రి మాట్లాడుతూ “సూర్యా! మీ గురించి మా నాన్న చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు మీరిద్దరూ మాట్లాడుకున్న విషయాలన్నీ విన్నాను. మీ గురించి, మీ ఇంటి పరిస్థితుల గురించి కొంతవరకు అర్థమైంది. నా గురించి నా ఎడ్యుకేషన్ గురించి నాన్న చెప్పే ఉంటారు. ఇన్ కేస్ మన పెళ్ళి జరిగితే.. నా వంతుగా నేను మీకు పూర్తి సహకారం అందిస్తాను. అంతేకానీ మీరు ఊహిస్తున్నట్టు.. ఆడంబరాలకు పోయే వ్యక్తిత్వం కాదు నాది. మా ఫ్రెండ్ వెయిట్ చేస్తోంది వెళ్తాను” అని గాయత్రి వెళ్లిపోయింది.
“మచ్చా! నీ మంచి మనసుకి మంచి రోజులు గాయత్రి తీసుకురాబోతోంది రా! కంగ్రాట్యులేషన్స్.. ఇంకెవరిని గురించి నువ్వు ఆలోచించకుండా బుద్ధిగా గాయత్రి ని పెళ్లి చేసుకో”అని సూర్యని హగ్ చేసుకున్నాడు మహేష్.
***
ఆ రోజు రాత్రి సుభద్రమ్మ కొడుకుతో మాట్లాడింది. “ఈ సంబంధం అన్ని విధాలా అటు సుమకి, ఇటు నీకు బాగుంటుంది. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇంటికి మగ పిల్లవాడు అయిన నీతో అన్ని పనులు చేయించాల్సి వస్తోంది. కోడలు వస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి” అంది.
సూర్యకి నవ్వొచ్చింది. ఏమీ మాట్లాడకుండా.. “సరేనమ్మా! అట్లాగే కానిద్దాం” అని తన గదికి వెళ్ళిపోయాడు.
తను కొడుక్కి చెప్పడం. వల్లనే ఈ కుండ మార్పిడి పెళ్లిళ్లకి సూర్య ఒప్పుకున్నాడు అనుకుంది సుభద్రమ్మ. కానీ సూర్య అంగీకరించింది మాత్రం గాయత్రి చెప్పిన మాటలకి, ఆమె తనని అభిమానిస్తున్న విధానికి, ఆమె వ్యక్తిత్వానికి అని అతనికి మాత్రమే తెలిసిన వాస్తవం మరి.
***
శనివారం నాడు సుభద్రమ్మను ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాడు సూర్య. ఆమెకి అన్ని రకాల పరీక్షలు చేయించాడు.
మరుసటి రోజు రిపోర్ట్ లని తీసుకెళ్ళి సూర్య డాక్టర్ని కలిశాడు.
“డాక్టర్ మా అమ్మకి ప్రాబ్లమ్ ఏంటి మోకాళ్ళ సర్జరీ అవసరమా?” అన్నాడు
“డాక్టర్ రిపోర్టులను చూసి నవ్వుతూ 100% ఫ్రీ ఈజ్ ఆల్ రైట్ సూర్య ఆమెకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు”.
“మరి ఎప్పుడు మోకాళ్లు చేతులు విపరీతమైన నొప్పులు అంటూ బాధపడుతోంది”అన్నాడు.
“ఆమె ఒంట్లో ఎలాంటి సమస్య లేదు. మానసికంగా నొప్పులు ఉన్నట్టు ఫిక్స్ అయిందేమో! ఏ పని చేయకుండా ఉంటే శరీరంలో మూమెంట్స్ లేకపోయినా ఇబ్బందిగానే ఉంటుంది. పన్ను చేస్తుంటే వ్యాయామానికి వ్యాయామం, ఆరోగ్యానికి ఆరోగ్యం.” అన్నాడు డాక్టర్.
ఇంటికి వస్తూ సూర్య ఆలోచిస్తున్నాడు. ఇంటికి వనజక్క వస్తే చాలు.. ఎక్కడ లేని ఓపిక తెచ్చుకొని మరీ.. కూతురికి కావాల్సినవన్నీ రుచిగా.. రకరకాల వంటలు చేసి పెడుతుంది. ఆమెతోపాటు షాపింగ్‌కి వెళుతుంది. ఇంటి పనులు చేస్తుంది అమ్మ. వనజ వెళ్లగానే తనకి మాత్రం వండి పెట్టాలంటే కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు అంటూ పడుకుంటుంది. ఎందుకు తనంటే ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు సూర్యకి. తల్లి పక్షపాత ధోరణి ఎందుకు చూపుతోందో తెలియటం లేదు.. ఆలోచిస్తూ ఇంటికి వచ్చాడు సూర్య.
డాక్టర్ చెప్పింది తల్లితో చెప్పాడు సూర్య. దానికామె కోపగించుకుని సుభద్రమ్మ “ఈ డాక్టర్లకి బాగా ఫీజులు గుంజటం అలవాటయింది. ఫీజులు తీసుకొని నిజాలు చెప్తారా అంటే అదీ లేదు. నా నెప్పులు, బాధలు భరించే నాకు తెలుస్తాయి కానీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది. ఎప్పటికీ ఈ రోగాలు తగ్గేలా లేవు. అంతా నా కర్మ”అంది.
కావాలని తల్లి అంటున్న మాటలకి బదులేం చెప్పాలో తెలియలేదు సూర్యకి.
***
కాలం వేగంగా ఆరు నెలలు తిరిగి వచ్చింది
సుమ, వంశీ, గాయత్రిల చదువు ముగిసింది. సుమ, వంశీ ఎక్స్ పీరియన్స్ కోసం ఓ ఫేమస్ డెంటల్ క్లినిక్‌లో జాయిన్ అయ్యారు. గాయత్రి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి, ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తోంది.
భాస్కర రావు మంచి రోజు చూసి సూర్య వాళ్ళ ఇంటికి వచ్చాడు. రెండు పెళ్లిళ్ల విషయం మాట్లాడి.. మంచి ముహూర్తం చూపించాడు.. ఇద్దరి ఎంగేజ్మెంట్లు అనుకున్నట్టుగానే పూర్తయ్యాయి., ఆ తర్వాత నెలలో ఒక్కరోజు తేడాతో రెండు పెళ్లిళ్లు ఘనంగా జరిగిపోయాయి.
సూర్య, గాయత్రి ల శోభనం రోజు.
పాల గ్లాసుతో గదిలోకి వచ్చిన గాయత్రితో “మా కుటుంబం గురించి నీకు ముందే తెలుసు అందుకని..”
అన్నాడు.
“మా కుటుంబం అనకండి.. ఇప్పుడు మన కుటుంబం” అంది నవ్వుతూ.
“సరే!.. మన కుటుంబం ఇక్కడ పరిస్థితులకి తగ్గట్టు ఉండటం నీకు ఇబ్బందిగా ఉంటుందేమో!”..
“అందుకని..”
“అందుకని..కొన్ని రోజులు పాటు శారీరకంగా దూ..రం..గా”అన్నాడు మెల్లగా.
“ఎందుకా పెళ్లి చేసుకుంది? ఏమి అవసరం లేదు. మీరు ఏంటో నాకు తెలుసు నేనేంటో మీకు తెలుసు. మన ఇద్దరికీ మన కుటుంబ పరిస్థితి తెలుసు. పరిస్థితులను మనకి అనుకూలంగా మార్చుకోవాలి కానీ.. వాటిని చూసి భయపడకూడదు.” అని అతని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది.
అంతే! అప్పటివరకు అతనిలో నిద్రిస్తున్న శారీర వాంఛ వాంఛ మేల్కొంది. సహకరిస్తున్న భార్యకు స్వర్గం చూపించాడు కొన్ని నిమిషాల్లో.
ఆ తర్వాత గాయత్రి.. “ఇప్పుడు చెప్పండి” అంది.
“నేను కాదు చెప్పాల్సింది నువ్వే. నీ మాటలు వింటుంటే హాయిగా ఉంది”అన్నాడు ఆమె ఒళ్ళో తల పెట్టుకుని.
గాయత్రి ప్రతి అంశాన్ని పాజిటివ్‌గా మాట్లాడుతుంటే.. చలించి పోయాడు సూర్య. జీవితంలో మొదటిసారి తనకోసం మాట్లాడే వ్యక్తి భార్యగా దొరకటం తన అదృష్టం అనుకుంటూ మౌనంగా కూర్చున్న సూర్యతో, “ఎందుకా మౌనం?” అంది.
“వైవాహిక జీవితం స్టార్టింగ్ లోనే నిన్ను ఇబ్బంది పెడుతున్నానేమో! అనిపిస్తోంది. ఎన్నో కలలతో పెళ్లి చేసుకున్నావు. వాటిని పక్కన పెట్టి బాధ్యతలతో, సమస్యలతో నాతో కలిసి నడవాల్సి రావటం..” అంటుంటే, చప్పున అరచేత్తో అతని నోరు మూసింది.
“ఎందుకలా అనుకుంటున్నారు? ఇది మన ఇల్లు. ముందు ఇంటి సమస్యలు లేకుండా ఉంటే.. మీరు ధైర్యంగా ఉంటారు. దేనిని గురించి ఎక్కువగా ఆలోచించకండి. సమస్య తలెత్తినప్పుడు పరిష్కారం దాని వెంటే ఉంటుంది. ఎక్కువగా ఆలోచించకండి” అంటూ అతనిలో ఒదిగిపోయింది.
***
కాలం 15 రోజులు ముందుకు జరిగింది. గాయత్రి కాపురానికి వచ్చింది. సుమ కూడా కాపురానికి వెళ్లిపోయింది.
గాయత్రి ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి పనులు చేసి, సూర్యకి కావాల్సినన్నీ చూసి, అతను ఆఫీస్ కి బయలుదేరే ముందు రుచిగా టిఫిన్ చేసి పెట్టింది లంచ్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చి పంపింది.
కోడలి పనితనం చూస్తున్నా సుభద్రలో ఎటువంటి మార్పు లేదు. కోడలు ఉంది కదా అని ఇంకో అరగంట ఆలస్యంగా లేచి.. “అమ్మా, అయ్యా” అని మూలుగుతూ.. కోడలుతో అన్ని పనులు చేయించుకుంటోంది.
***
నెలరోజుల తర్వాత తల్లిని చూడాలన్న వంకతో మునగ పుట్టింటికి వచ్చింది. రోజు పాలకులు ఈ నొప్పులు అంటూ ఎనిమిది తర్వాత నిద్రలేచే సుభద్రమ్మ ఇప్పుడు తొందరగా నిద్ర లేచి.. కూతురు కోసం “అది చెయ్, ఇది చెయ్” అని కోడలి మీద అజమాయిషీ చేస్తోంది. అది చాలక తనే ప్రత్యేకంగా కూతురికి చేసి పెడుతుంటే.. గాయత్రి అనువదించుకోలేకపోయింది. సరైన సమయం కోసం వెయిట్ చేస్తోంది గాయత్రి.
నాలుగు రోజుల తర్వాత ఓ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక.. వనజ సుభద్రమ్మ గదిలోకి వెళ్లింది. గాయత్రి తన గదిలో పడుకుని సెల్‌ఫోన్ చూస్తోంది.
తల్లి కూతుర్లు మాట్లాడుకుంటుంది మాటలు వినిపిస్తున్నాయి.
వనజ తల్లితో”అమ్మా! మీ అల్లుడు కొత్తగా ఎదో బిజినెస్ చేయాలనుకుంటున్నాడు”అంది.
“అలాగా మంచి మాట చెప్పావు తల్లి ఇప్పుడు కష్టపడితేనే నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చు”
“దాని విషయమై.. నిన్నో సహాయం అడగాలని వచ్చాను”అంది.
“ఏంటో చెప్పు. ఏం కావాలి?”
“నువ్వు సూర్య దగ్గర చెప్పి ఎలాగైనా మూడు లక్షలు ఏర్పాటు చేసేలా చూడు. మిగతా డబ్బు మేము చూసుకుంటున్నాం. ఎలాగైనా ఇప్పించమ్మా! మళ్లీ మాకు రాగానే ఇచ్చేస్తాం” అంది.
పక్క గదిలో పడుకున్న గాయత్రికి ఆ మాటలు వినిపించి..ఆశ్చర్యపోయింది.
కానీ సుభద్రం ఆశ్చర్యపోలేదు. కంగారు పడకుండా “అంతే కదా, వనజా! సూర్యంతో చెబుతాను. వాడి దగ్గర లేకపోతే.. ఆఫీసు లోనూ, అదీ కాకపోతే ఎవరి దగ్గరైనా అప్పుగానైనా తీసుకొచ్చి ఇవ్వమంటాను. నువ్వేం కంగారు పడకు” అంది భరోసాగా.
ఆ రోజు రాత్రి గాయత్రి భర్తతో వనజ తల్లితో చెప్పిన మూడు లక్షల మాట చెప్పింది. ఆ మాటలు వినగానే మనుజ మీద పట్టరానంత కోపం వచ్చింది. అతని ఆవేశం గమనించిన గాయత్రి “మీరు ఆవేశపడి అల్లరి కాకుండా నేను ఈ విషయాన్ని డీల్ చేస్తాను. అత్తయ్య మీకు చెప్పే వరకు మీరు తెలియనట్టే ఉండండి”అంది.
***
మర్నాడు ఉదయం సూర్య ఆఫీస్‌కి వెళ్ళాడు. గాయత్రి అత్తగారితో తను చదివిన కాలేజీకి వెళ్లాల్సిన పనుందని చెప్పి బయలుదేరింది. వనజ భర్త మోహన్‌కి ఫోన్ చేసి.. ఆఫీసుకు వస్తున్నట్టు చెప్పింది. అతను గాయత్రిని రమ్మని ఆఫీసు లొకేషన్ షేర్ చేశాడు. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళింది. గాయత్రి ని సాదరంగా ఆహ్వానించాడు మోహన్.
కుశల ప్రశ్నలయ్యాక.. “అవునూ.. ఇప్పుడు అత్తయ్య గారికి ఎలా ఉంది? ఆమెకు ఒంట్లో బాగాలేదటగా! అందుకే వనజ పుట్టింటికి వెళ్ళింది” అన్నాడు మోహన్.
గాయత్రికి మేటర్ అర్థమై.. “అలాంటిదేమీ లేదు బాగానే ఉన్నారిపుడు.” అంది.
“అవునా!? అత్తయ్య గారికి బాగలేదని తగ్గే వరకు ఉండి వస్తానని వనజ వచ్చిందే మరి”
“అత్తయ్య గారు ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు అన్నయ్యా. అవును మీరు ఇప్పుడు ఏదో కొత్త బిజినెస్ చేయబోతున్నారట కదా!” అంది.
“నేనా!? కొత్త బిజినెస్సా!? ఎవరు చెప్పారు?” అన్నాడు మోహన్ ఆశ్చర్యంగా.
“వనజ వదిన చెప్పింది.”
“చూడమ్మా! నేను ఆఫీసులో మంచి పోస్టులో ఉన్నాను. శని ఆదివారాలు సెలవులు. మంచి జీతం వస్తుంది. ఇలాంటి వసతులు వదులుకొని బిజినెస్ రిస్క్ చెయ్యడం నావల్ల కాదు. నాకేమీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు. వచ్చే సంవత్సరం అమెరికా కూడా వెళ్లాలనుకుంటున్నాను” అన్నాడు.
గాయత్రికి వనజ ఆడుతున్న డబుల్ గేమ్ ఏమిటో అర్థమైంది. భర్త వ్యాపారం చేస్యబోతున్నాడని సూర్య దగ్గర నుంచి తల్లి ద్వారా డబ్బులు గుంజాలని చూస్తోంది.
“ఏంటి గాయత్రీ! ఏమైనా ప్రాబ్లమా?”
“అది..” అని అప్పటి వరకు వనజ ప్రవర్తన, పుట్టింట్లో ఆమె ఆడుతున్న నాటకాల గురించి వివరంగా చెప్పింది గాయత్రి.
విన్న మోహన్ షాకయ్యాడు.
“ఏంటి గాయత్రి! నువ్వు చెప్పేదంతా నిజమా?! నిజంగా నాకిదంతా తెలియదు. పాపం సూర్య! ఎంత ఫీలవుతున్నాడో! ఆఫీస్ పనులతో బిజీగా ఉండటం వల్ల, సూర్యని తరచూ కలవలేక పోతున్నాను” అని ఫీలయ్యాడు మోహన్.
“అన్నయ్యా! మీకూ సూర్యకి, కుటుంబానికి సరైన కమ్యూనికేషన్ లేదు. మీరు సూర్యతో మాట్లాడండి. ఇంటికి వస్తూ పోతూ ఉంటే.. ఈ ప్రాబ్లమ్స్ వచ్చేవి కావు. మీరు రాకపోవడంతో వనజ వదిన అడ్వాంటేజ్ తీసుకొని ఇక్కడ మాటలు అక్కడ చెబుతూ.. తనకి కావలసినవి ఏర్పరచుకుంటూ.. పబ్బం గడుపుక్కుంటుంది” అంది.
“అర్థమైంది గాయత్రీ! ఇది నా అశ్రద్ధ వల్ల జరిగిందే. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను. సూర్యతో మాట్లాడతాను” అన్నాడు మోహన్.
“అన్నయ్యా! ఇప్పుడు జరుగుతున్న సమస్యలకి చెక్ పెట్టడానికి నా దగ్గర ఓ ఐడియా ఉంది. దాని ప్రకారం మీరు చేస్తే సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది” అంది.
“ఏంటో చెప్పమ్మా! ఎలాంటిదైనా నేను చేస్తాను”.
గాయత్రి తన ఐడియా చెప్పి “వచ్చే ఆదివారం ఇంటికి రండన్నయ్యా!” అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది.
***
ఆదివారం వచ్చింది. ఇంట్లో వనజ, సుభద్రమ్మ, గాయత్రి, సూర్య ఉన్నారు.
సూర్య టీ.వీ.లో న్యూస్ చూస్తున్నాడు.
సరిగ్గా పది గంటలకు మోహన్ వచ్చాడు. పలకరింపులు అయ్యాక మోహన్ తనతో తెచ్చిన పళ్ళబుట్ట గాయత్రికి ఇచ్చాడు. మోహన్ని చూసిన వనజ లోలోపల భయపడుతూనే ఉంది. లోపలి నుంచి సుభద్రం వచ్చి అల్లుడిని పలకరించింది.
“అత్తయ్యా! మీకు ఒంట్లో బాగాలేదని వనజ మీ కూడా ఉండి చూసుకోవటానికి వెళ్తున్నానని చెప్పి వచ్చి వారం రోజులైంది. ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఏమైనా సీరియస్‌గా ఉందేమోనని చూసి పోదామని వచ్చాను.” అన్నాడు.
అల్లుడు మాటలు విన్న సుభద్రకి కూతురు అబద్ధం చెప్పి వచ్చిందన్న విషయం అర్థమైంది. వనజను సమర్థించే విధంగా “అవును బాబూ! మోకాళ్లు, చేతులు ఒకటే నొప్పులు. ఏం చేస్తాం? వయసైన కాలంలో ఇవన్నీ సహజం. ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదు” అంది నీరసపు గొంతుతో.
తల్లి మాటలు విన్న సూర్యకి కోపం వస్తోంది. గాయత్రిని చూసాడు. ఆవేశపడొద్దని కళ్ళతోనే సైజ్ చేసింది గాయత్రి.
“అవునా! నాకు తెలిసిన ఓ ప్రకృతి వైద్యశాల ఉంది. ఇలాంటి నొప్పులు తగ్గించడంలో వాళ్లకి బాగా పేరు ఉంది. అయితే ఆరు నెలల ఆశ్రమంలోనే ఉండాలి. వాళ్లు పత్యపు భోజనం పెడతారు. మందులు వాడుతూ వాళ్ల దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలాంటి నొప్పులన్నీ మాయమైపోతాయి. నేను ఇప్పుడే ఫోన్ చేసి వాళ్లతో మాట్లాడుతాను.” అని ఫోన్ తీశాడు మోహన్.
వెంటనే సుభద్రమ్మ కల్పించుకొని “అదేం వద్దు బాబూ! మొన్ననే సూర్య డాక్టర్ దగ్గర చూపించాడు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు” అంది కంగారుగా.
“అలా అయితే ఓ.కే అత్తయ్యా! సరే.. వనజా రా! మన ఇంటికి వెళ్లి పోదాం” అన్నాడు.
“ఇప్పటికిప్పుడు రమ్మంటే ఎలా వస్తాను? అమ్మని మొన్ననేగా ఆస్పత్రిలో చూపించింది. మందులు వాడుతోంది. నొప్పులు కొంచెం తగ్గుతున్నాయి. నాలుగు రోజులుండి మా అమ్మకు పూర్తిగా తగ్గాక వస్తాను” అంది వనజ.
“అలాగా! అయితే ఓ పని చేద్దాం. నెలలో వారం పది రోజులు ఇక్కడే ఉంటున్నావు. కాబట్టి నాకు ఇబ్బంది అవుతోంది. నేను ఓ నిర్ణయానికి వచ్చాను. లాయర్ ద్వారా డివోర్స్ నోటీసులు పంపిస్తాను. మీ అమ్మని చూసుకుంటూ పర్మినెంట్‌గా పుట్టింటోనే ఉండిపో” అన్నాడు మోహన్.
అంతే! మోహన్ మాటలు విన్న వనజ, సుభద్రమ్మలకు నోట మాట రాలేదు.
సుభద్రమ్మ కంగారుగా “ఏంటి బాబూ! ఏదేదో అంటున్నావు. అది చిన్న పిల్ల. నా మీద ప్రేమతో వస్తోంది. దీనికే విడాకులు అంటావేంటి?” అంది.
వనజ మొహం జేవురించింది. కన్నీళ్లు చెంపగుండా కారుతున్నాయి. సూర్య, గాయత్రి ఎటువంటి రియాక్షన్ లేకుండా చూస్తున్నారు.
సూర్య మౌనం చూసి సుభద్రమ్మకి చిర్రెత్తుకొచ్చింది.
“ఏమిటిరా! అల్లుడుగారు విడాకులు అంటుంటే .. ఏం మాట్లాడకుండా కూర్చుంటావేంటి?”
“బావా..అదీ..” అని మాట్లాడబోతున్న సూర్యకి అడ్డుపడి..
“మిస్టర్ సూర్యా! ప్లీజ్.. ఇది మా భార్యాభర్తల వ్యవహారం. దయచేసి ఇంటర్ఫియర్ అవ్వద్దు” అన్నాడు మోహన్.
సుభద్రమ్మ కూడా కళ్లొత్తు కోసాగింది.
“అత్తయ్యా! వనజ ఇదంతా నీ మీద ప్రేమతో చేస్తున్నది కాదు. ఎలాగైనా మీరు ఉంటున్న ఈ ఇల్లు తన తండ్రి సంపాదించిందని.. అందులో తనకూ, సుమకి వాటా వస్తుందని.. సూర్యని అడగాలని ప్లాన్ వేసింది. కానీ సూర్యకి పిసినారి అనే బిరుదు ఇచ్చి, ఇంట్లో వాటా ఇస్తాడో లేదోనని లాయర్ని సంప్రదిద్దామని సుమని, వంశీని అడిగింది. వాళ్లు తమకు అక్కర్లేదని కరాకండీగా చెప్పడంతో.. తనే సొంతంగా కేసు వేద్దామని లాయర్ని సంప్రదించింది. అందుకు కావలసిన డబ్బు కోసం నేను బిజినెస్ చేయబోతున్నట్టు నాకు తెలియకుండా మీకు చెప్పి ఇక్కడ కొత్త డ్రామా మొదలు పెట్టింది” అని మోహన్ అన్నాడు.
సరిగ్గా సమయంలో సుమ, వంశీ కారులో వచ్చారు. లోపలికి వస్తూనే అందరినీ పలకరించారు.
“ఏంటి వాతావరణం సీరియస్‌గా ఉన్నట్టుంది” అంది సుమ.
“సుమా! నీకూ వనజక్కలాగా ఏమైనా కోరికలు ఉంటే ఇప్పుడే చెప్పు. వంశీ బావా! నీక కూడా ఏమైనా డబ్బు సహాయం కావాలంటే చెప్పండి” అన్నాడు సూర్య విరక్తిగా.
“ఏంటి అన్నయ్యా! కొత్తగా అడుగుతున్నావు? నేను కానీ, మా ఆయన కానీ అది కావాలి, ఇది కావాలని ఎప్పుడైనా అడిగామా? నన్ను చదివించి.. నాకు మంచి జీవితాన్ని ఇచ్చావు. అంతకంటే నాకు ఇంకేం కావాలి!” అంది సుమ.
“సుమా! నేను ఇంతవరకూ ఎన్నడూ అది కావాలి, ఇది కావాలని సూర్యుని కానీ, మీ అమ్మని కానీ అడిగింది లేదు. ఏం అత్తయ్య, సూర్యా!” అన్నాడు మోహన్.
ఆ మాటకి ఏం చెప్పాలో సుభద్రమ్మకి పాలుపోలేదు.
“థాంక్స్ సుమా? థాంక్స్ బావగారూ! అర్థం చేసుకున్నందుకు”అన్నాడు సూర్య.
వనజ మౌనం చూసి.. “అక్కా! ఎన్నోసార్లు చెప్పాను నీకు. అన్నయ్య మనసు చాలా సున్నితం. ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించొద్దని. విన్నావా? నువ్వు టెన్త్ వరకు చదువుకున్నావు. కానీ ఏం ప్రయోజనం? ఇక్కడ నాన్న కొన్నది కేవలం 200 గజాల స్థలం, అందులో ఇంటి బేస్మెంట్ కూడా పూర్తిగా వేయకుండా అసంపూర్తిగా వదిలి వెళితే.. అన్నయ్య ఎంతో కష్టపడి పూర్తిచేశాడు. నీకు పెళ్లి కూడా చేశాడు. నన్ను బి.డి.ఎస్ చదివించి, పెళ్లి చేయటం కొచ్చి చిన్న జీతంలో సాధ్యమయ్యే విషయమేనా? ఎన్నడైనా ఆలోచించావా? పైగా అమ్మ తెచ్చి పెట్టుకున్న రోగాలకి, అదనంగా ఆస్పత్రుల ఖర్చులు. ఎప్పుడూ అమ్మ, నువ్వు మీ గురించే ఆలోచిస్తున్నారు కానీ అన్నయ్య గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించరు.. ఎందుకంటే అన్నయ్య అమ్మకి సవతి కొడుకు కాబట్టి. నాన్న మొదటి భార్య లక్ష్మికి అన్నయ్య పుట్టిన ఐదేళ్లకి మరణించింది. నాన్న అమ్మని రెండో పెళ్లి చేసుకున్నాడు. అమ్మ పైకి సవతి కొడుకుని ఎత్తెత్తుమానంగా నాన్నకు భయపడి పెంచినా, లోలోపల అన్నయ్య అంటే అయిష్టత పెంచుకుంది.
అమ్మకి మొదట నువ్వు పుట్టావు. తర్వాత మూడేళ్ళకి నేను పుట్టాను. నువ్వు అమ్మ మాట వింటావు కాబట్టి అన్నయ్య అంటే తనలో పెంచుకున్న ద్వేషాన్ని నీకు బదిలీ చేసింది. నాన్న పోయాక ఆ విముఖత తీవ్ర రూపం దాల్చింది మీ ఇద్దరిలో. నీకు పెళ్లి అయ్యాక కూడా అన్నయ్య దగ్గర నుండి ఏదో ఒక రూపంలో డబ్బు గుంజాలని ప్రయత్నిస్తున్నావే కానీ అన్నయ్య గురించి ఏనాడైనా ఆలోచించావా? అసలు అన్నయ్య మనల్ని ఏనాడైనా వేరుగా చూశాడా? పక్షపాతం ఎవరిలో ఉందో చెప్పు.
మన కోసం తన చదువుకు పొంతనలేని ఉద్యోగం చేస్తూ.. సైంటిస్ట్ అవ్వాలన్న తన ఆశయాన్ని, లక్ష్యాన్ని అణిచిపెట్టుకుని ఎదుగు బొదుగూ లేని చిన్న ఉద్యోగం చేస్తున్నాడు.
ఇప్పుడు అన్నయ్యకి పెళ్లయింది. ఈ రెండు వందల గజాల ఇంటిని.. మూడు భాగాలు చేస్తే, నువ్వు బావగారిని వదిలి నువ్వు వచ్చి ఇక్కడ ఉండగలవా?” అది సుమ ఆవేదనగా.
సుమ మాట్లాడుతుంటే సూర్య కళ్ళు చమర్చాయి. సుభద్రమ్మ చిన్న కూతురి మాటలకు కంగుతిన్నట్టు చూసి, సిగ్గుతో తలవంచుకుంది.
మోహన్ కల్పించుకొని.. “వనజా! నీకంటే చిన్నదైనా మీ చెల్లెలు సుమకి ఉన్నంత ఆలోచన కూడా పెద్దదానివైన నీకు లేకపోయె. నాతో కలిసి ఉండదలుచుకున్నావా? లేక డివోర్స్ ఇవ్వదల్చుకున్నావో నీ చేతుల్లోనే ఉంది. ఆలోచించుకో!” అన్నాడు మోహన్.
వనజ వెక్కి వెక్కి ఏడుస్తోంది.
“బాబూ! చిన్నవాళ్ళైనా మీరు నన్ను క్షమించండి. సూర్య చిన్నతనం నుండి బాగా చదువుకున్నాడు. కష్టపడే మనస్తత్వం. మగపిల్లాడు ఎలాగైనా వృద్ధిలోకి వస్తాడు అనుకునేదాన్ని. నా తొలి సంతానం వనజపై అధిక ప్రేమ పెంచుకోవడం వల్ల, అతి గారాబం వల్ల వల్ల దానికి సరిగ్గా చదువు అబ్బలేదు. దానికి పెళ్లి అవుతుందా? అని భయపడే దాన్ని. కానీ సూర్య మమ్మల్ని కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసేవాడు. సూర్య తన కలలను పక్కన పెట్టి, కుటుంబం కోసం పాటుపడటం దగ్గర నుంచి అన్నీ తెలుసు. కానీ వనజ పై పెంచుకున్న ప్రేమ వల్ల నా కళ్ళు మూసుకుపోయాయి. ఇప్పుడు నేనేంటో తెలుసుకున్నాను. ఒంట్లో ఓపిక ఉండి సూర్యకి కనీసం తిండి పెట్టకుండా ఇబ్బంది పెట్టాను. అన్నీ నా స్వయంకృతాపరాధాలే. మీరంతా చిన్నవాళ్ళైనా నన్ను మన్నించండి. వనజ కూడా మారిపోయింది”. అంటూ సుభద్రమ్మ కన్నీళ్ళతో అల్లుడు చేతులు పట్టుకుంది.
మోహన్ చెప్పిన డైవోర్స్ మాటలకి వనజ కింద కూర్చొని ఏడుస్తోంది.
గాయత్రి వనజ దగ్గరికి వెళ్లి దగ్గరికి తీసుకుంది. కళ్ళు తుడుచుకుంటన్న అత్తగారితో..
“మీరిద్దరూ అలా ఫీల్ అవ్వకుండి. చేతికున్న అన్ని వేళ్ళూ సమానంగా లేనట్టే.. ఇంట్లో ఉన్న అందరూ ఒకే మనస్తత్వంతో ఉండాలని లేదు. అయితే కుటుంబం.. అనేసరికి ఐదు వేళ్ళూ సమానంగా లేకపోయినా వాటి మూలాలు అరచేతిలో కలిసే ఉంటాయి. అందుకే వేళ్ళన్నీ కలిసికట్టుగా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరూ ఏటిలోని కెరటాల్ని విడదీయలేరు. జరిగిందేదో జరిగింది. తప్పిదాలు తెలుసుకుని సరి చేసుకోవడమే విజ్ఞత” అంది గాయత్రి.
“గాయత్రీ! చిన్నదానవైనా నా కళ్ళు తెరిపించావు. థాంక్స్. నేను మా ఆయన్ని వదిలి ఇంకెప్పుడూ ఎక్కడికి ఒంటరిగా రాను. వస్తే ఇద్దరం కలిసే వస్తాం” అని భర్త పక్కకి వెళ్లినట్టుంది వనజ.
“ఇది కదా కావలసింది” అని మోహన్ సూర్యకి, వంశీకి హైఫై ఇచ్చాడు.
“ఈ శుభ సమయంలో మీ అందరికీ రెండు స్పెషల్ న్యూస్ చెప్తాను. ఒకటి.. మా ఆయన సూర్యకి డి.ఆర్.డి.ఎల్.లో జూనియర్ సైంటిస్ట్‌గా అపాయింట్మెంట్ వచ్చింది. రెండోది.. నేను క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన కంపెనీ నుండి నాకు ఆఫర్ లెటర్ వచ్చింది” అంది గాయత్రి.
అందరూ కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. “మరి పార్టీ ఎప్పుడు?” అన్నారు మోహన్, వంశీ.
“ఎప్పుడో ఎందుకు. ఇప్పుడే.. మీ అందరికీ విందు భోజనం చేసి పెడతాను. అందాకా మాట్లాడుతూ ఉండండి” అని వంటింట్లోకి వెళ్ళింది సుభద్రమ్మ తన వల్ల తారుమారైన పరిస్థితులు సుఖాంతమైన సంతోషంలో.
ఎం. వెంకటేశ్వర రావు చక్కని కథా రచయిత. మంచి నవలా రచయిత. “అదివో… అల్లదివో!” వీరి కథా సంపుటి. ఇటీవలి కాలంలో “విజయ విలాసం” పేరిట వ్యక్తిత్వ వికాసం సంబంధిత వ్యాసాలు కూడా రాస్తున్నారు.