[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన పొత్తూరి సీతారామరాజు గారి ‘సుబ్బన్న పరుగు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
జిల్లా పోలీసు కార్యాలయంలో కొత్తగా వచ్చిన ఎస్.పి. రాయప్ప తనకింద పనిచేసే సిబ్బందిని మొత్తం సమావేశపరిచాడు. ఇరవై సంవత్సరాలుగా ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు త్రాగిస్తున్న గుడ్డి సుబ్బరాజును ఈసారి వచ్చే సంక్రాంతి కోడిపందాల పోటీల్లో ఎలాగైనా రెడ్ హాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేయాలన్నది వారి సమావేశ ముఖ్యోద్దేశం.
డి.ఎస్.పి. ముకుందరావు లేచి శాల్యూట్ చేసి ఎస్.పి. గారి ముందు ఓ ఫైలు పెట్టాడు. దానిలో సుబ్బరాజు ఎక్కడ పుట్టాడో, అతని బంధువుల వివరాలు, చుట్టుప్రక్కల గ్రామాలలో అతనికున్న పలుకుబడి, అతని ఏలుబడి. అతను పోలీసుల నుండి వ్యూహాత్మకంగా తప్పించుకున్న సంఘటనలు, ఇంకా చాలా దానిలో పొందుపరచబడి ఉన్నాయి. కానీ అతని ఫొటో మాత్రం ఇప్పటివరకూ దొరకలేదు. అతను గడచిన రెండు దశాబ్దాలలో ఏనాడు పోలీసుల చేతికి చిక్కితే కదా ఫొటో దొరికేది. అతను ఎక్కడుంటాడో తెలుసు కాని ఎలా ఉంటాడో మాత్రం తెలియదు. ఒకవేళ అతనుండే ప్రాంతానికి వెళ్ళాలన్నా భయమే.
ఫైలు మొత్తం చదివిన ఎస్.పి. ఆశ్చర్యపోయాడు. ‘ఆ మనిషిని పట్టుకోవడానికి ఇంత సమయం అవసరమా?’ లేచి నిలబడ్డ ముకుందాన్ని ఒక్కసారిగా ఇంతకాలం నువ్వేం చేస్తున్నావు అన్నట్లు ఉరిమి చూసాడు.
“అతని గురించి మరేమైనా కొత్త విషయాలున్నాయా?” అని గద్దించి అడిగాడు.
“సార్! అతను నల్లగా, దృఢంగా ఏడు అడుగులు పొడవు ఉంటాడు. అతనితో గెరిల్లా పోరాటయోధులు కూడా పరుగుపందాలలో వెనుకంజ వేయాల్సిందే. అతను సైన్యంలో పనిచేసేవాడు. యుద్ధంలో కన్ను పోయిందని పదవీ కాలం పూర్తవకుండానే ఇంటికి పంపించేసారు. ఇప్పుడు గాజుకన్ను అమర్చారని విన్నాను.”
“అతన్ని ఇంతకాలం ఎందుకు మీరు పట్టుకోలేకపోయారు?” అన్నాడు ఎస్.పి. రాయప్ప.
“సార్! అతను మిలటరీ నుండి బయటకు వచ్చిన తరువాత ప్రభుత్వం ఇచ్చిన భూమిని సాగుచేయడం మొదలుపెట్టాడు. అతనికున్న వ్యసనం కోడిపందాలు. చుట్టుప్రక్కల గ్రామాలవారినందరినీ ప్రోగుచేసి, ప్రభుత్వ రికార్డులలో లేని చింతలమర్రి అనే చిట్టడవిలో యథేచ్చగా వేళాపాళా లేకుండా పందాలు నిర్వహిస్తుంటాడు. అతనిపై శత్రువులు దాడిచేసినప్పుడు, పోలీసువారు ఎటాక్ చేసినపుడు ఎంతమందినైనా ఎదిరించి, తప్పించుకోవటం అతనికి పరిపాటి అయిపోయింది. ఈ సంఘవిద్రోహ చర్యలకు సంబంధించి అతనిపై చాలా కేసులు పెండింగులో ఉన్నాయి. ఎన్ని అరెస్టు వారెంట్లు వెళ్ళినా అతను లెక్కచేయడు.
గత కొన్ని సంవత్సరాలుగా స్పెషల్ పార్టీలు వెళ్లి దాడిచేసినా, అతను తృటిలో లాఘవంగా తప్పించుకుంటున్నాడు. నేనొకసారి కోడిపందాలు జరుగుతున్న ప్రాంతానికి దూరంగా జీవును ఆపి. మెల్లగా నడచుకొంటూ వెళ్ళినా, మా జాడ ఎలా కనిపెట్టాడో తెలియదు. పులిలా మాపై విరుచుకుపడి, మెరుపు వేగంతో పరుగెత్తాడు. నేనూ అతని వెంట పరుగెత్తడం. మొదలుపెట్టాను. కొద్ది గజాల దూరం, ఒక పెద్ద చెరువు గట్టు మీద సన్నని దారి గుండా పరుగెత్తుతున్నాడు. చేతికి చిక్కాడనుకున్నాను. అంతలో పెద్ద వంతెన. దాని పైనుంచి అమాంతంగా ఉతికి నీటి మడుగులోనుండి మరి కనిపించలేదు. అక్కడే చాలాసేపుండి వెతికాం. కానీ అతని జాడ కనిపెట్టలేకపోయాం.”
“సరే.. అతన్ని ఓకంట కనిపెట్టండి. ఆ గుడ్డిరాజును ఎప్పటికయినా పట్టుకుతీరతాను. అతన్ని నేను వదలను” అంటూ బల్లగుద్ది శపథం చేసాడు ఎస్.పి.రాయప్ప.
***
అది ప్రభుత్వ రికార్డులలో లేని గ్రామం. చిట్టడవి దానిమధ్య ఓ ఏభై ఎకరాలు ఖాళీస్థలం, అక్కడకు వివిద గ్రామాల నుండి బలిసిన కోడిపుంజులను, పందేలకు తీసుకు వస్తుంటారు. ఎక్కడెక్కడినుండో దూరప్రాంతాల నుండి, పట్టణాల నుండి కార్లలో వచ్చి పందాలు కడుతుంటారు. జట్టీ పందాలు లక్షల్లో జరుగుతాయి. తినుబండారాలు, కాఫీ హోటళ్ళు తాత్కాలికంగా అక్కడ వెలుస్తుంటాయి. అన్ని సపర్యలు, సౌకర్యాలు జరుగుతాయి. అయితే దానికి ‘చింతలమర్రి’ అని నామకరణం చేసుకున్నారు. అక్కడికి వచ్చిన పందెం రాయుళ్ళకు అధ్యక్షుడు, దాని నిర్వాహకుడు గుడ్డి సుబ్బరాజు,
కొయ్యా గంగన్న వెంకటాపురంలో పెద్ద భూస్వామి. మనిషి గిడసబారిన వంకాయల కూర లాగా ఉంటాడు. క్రూరత్వం కలిగిన ముఖంతో చూపరులకు భయం కలుగుతుంది. ఆ రోజుల్లోనే మూడు వందల ఎకరాలు భూమిని – అప్పులు ఇచ్చి తిరిగి కట్టలేని వారి దగ్గర వాళ్ళ భూమిని ఆక్రమించుకొన్నాడు. తాకట్ల రూపంలో వివిధ కారణాలతో అతగాడు ఎన్నో రకాలుగా భూమిని ఆక్రమించేవాడు. అనతికాలం లోనే చుట్టుప్రక్క గ్రామాలకు పెద్ద భూస్వామిగా పేరుపొందాడు. జనాల్ని భయపెడుతూ, పేదవాళ్ళను అణగారిన వర్గాలను ఇంకా అణగదొక్కుతూ, మరెన్నో అందలాలు ఎక్కాలని అతని ఆశ. ఇటువంటి సమయంలో గుడ్డి సుబ్బరాజుకి ప్రభుత్వం వారు ఇచ్చిన భూమిని కూడా దౌర్జన్యంగా లాక్కున్నాడు.
సుబ్బరాజు ఒకరోజు దేనికి మా భూమిని ఆక్రమించావని సామరస్యంగా అడుదామని అతనింటికి వెళ్ళాడు. ఇతని రాకను గమనించిన గంగన్న పాలేరు రంగడు చేత ఇంట్లో లేనని చెప్పించాడు. తన ఆస్తిని తిరిగి పొందాలంటే కావాల్సిన బలం తన దగ్గర ఉండాలి. సమయం కోసం వేచిచూడాలి. దొరక్కపోడు, ఎప్పటికైనా అని వెనుదిరిగాడు సుబ్బరాజు, అతను చుట్టుప్రక్క గ్రామాల ప్రజలను ఏ కష్టమొచ్చినా అడుకునేవాడు. తలలో నాలుకలా ఉంటూ ఆపద సమయంలో ఏ ఇంటి ముందైనా వాలిపోయేవాడు.
అతన్ని పట్టుకోవాలంటే సుడిగాలిలో మనం నిలబడినట్లే. అతను వలలో పడ్డ చేప లాంటివాడు తప్పించుకుని మళ్ళీ నీళ్ళలోకి జారిపోతాడు – అతన్ని పట్టుకోవడం చాలా కష్టం. మరి ఎలా దొరుకుతాడు.. బుర్ర ఎంత చించుకున్నా అర్ధం. కావడం లేదు. ప్రక్కగ్రామంలో ఎంతోమంది మల్లయోధులను చిత్తుచేసిన వస్తాడు చేబ్రోలు సాంబయ్యను కూడా పిలిచేడు. “రాజుని ఎలాగైనా పట్టి ప్రభుత్వానికి అప్పగిద్దాం. నాకు నీ సహాయం కావాలి, నీకు ఆ వచ్చే డబ్బు మొత్తం ఇచ్చేస్తాను. ఇంకా కావాల్సివస్తే, నీవు ఏదడిగినా, ఎంతిమ్మన్నా ఇస్తాను, ఒకవేళ అతన్ని పట్టివ్వలేకపోయినా, సజీవంగా కాకపోయినా, నిర్జీవంగా అయినా మనం ప్రభుత్వానికి అప్పగించాలి” అని ప్రాధేయపడుతూ సాంబయ్యను కోరుకున్నాడు కొయ్యా గంగన్న.
సాంబయ్య చిరునవ్వుతో, “ఒక మాట అడుగుతాను చెప్తావా గంగన్నా! రాజుమీద నీకు ఎందుకింత పగ?” అన్నాడు.
“ఏమీ లేదు, అతను నాకు ఏ రకంగానూ శత్రువు కాదు. నాకు మొదటినుండీ ఈ భూమ్మీదా, మనుషుల మీద పట్టు సాధించాలి అనే విధానంలో నేను ముందుకెళ్తున్నాను. ఈ ఆధిపత్యంలో నాకెవరు ఎదురువచ్చినా సహించలేను. సుబ్బరాజు తండ్రి నా దగ్గర ఏదో కొంచెం డబ్బులు బకాయిపడ్డాడు. దానికి నేను అతని భూమిని లాక్కున్నాను. అతను నాపై కక్ష కట్టాడేమోనని భయం. ధైర్యం ఉన్నవాడికి భయం ఉండకూడదు. భయం ఉన్నవాడు ఎదురుదాడి చేయలేడు”.
“మనమంతా కలిసినా సుబ్బరాజును ఏమీ చేయలేమని నా నమ్మకం. అతన్ని పట్టుకోవాలంటే మెరుపుదాడి చేయాలి. ఆ దాడిలో అతన్ని మాయం చేయాలి. పట్టు తప్పిందా, మనం పులుసులో ఆకుపరిగిల్లా విడిపోతాం, జాగ్రత్త, నేను ఈ కార్యక్రమంలో పాల్గొనలేను గాని మీకు ఒక సలహా ఇస్తాను. దాని ప్రకారం మీరు వెళ్ళండి. ఎందుకంటే సుబ్బరాజు. పూర్వీకులతో మాకు తరతరాలుగా స్నేహం కొనసాగుతుంది. అందుకే నేను రాలేను. ఒకవేళ ఈ దాడిలో అతను మీనుండి తప్పించుకుంటే చావు మీ చెవుల్లో గుసగుసలాడుతుంది జాగ్రత్త.”
గర్వంగా నవ్వాడు గంగన్న, సాంబయ్య మాటలు విని. “నీవు చెబుతున్నదంతా వినడానికి వీరోచితంగా ఉంది. ఆ గుడ్డిరాజుని రెక్కలు విరిచి పట్టుకోవడం నువ్వు చెప్పినంత కష్టం కాదేమో, మావాళ్ళ ముందు అతను నిలబడలేడు” అన్నాడు.
“సాంబయ్య, నీవు రానంటున్నావు సరే. నీకో విషయం తెలుసా..” అడిగాడు గంగన్న.
“ఏమిటీ?” అని ఆతృతగా అడిగాడు సాంబయ్య. ఆశ్చర్యంగా వినడానికి వెనక్కి వాలిన మనిషి నిటారుగా కూర్చున్నాడు పాతకాలం నాటి చెక్కకుర్చీలో.
“ధారకొండ అనే పేరు విన్నావా?”.
“విన్నాను గంగన్నా. అయితే ఏమిటి. అతనిప్పుడు ఇక్కడ లేడుగా!”
“అవును లేడు. రప్పిస్తాను. శత్రువుని ఎదుర్కోవడానికి బలం సరిపోనప్పుడు నాకంటే బలవంతుడిని నేను సహాయం కోరాలిగా..”
“అఖిల భారత కుస్తీ పోటీల్లో పంజాబ్ సింగ్‌ను నేలకరిపించిన ధారకొండే కదూ నువ్వు చెప్పేది?” అడిగాడు సాంబయ్య.
“ఆఁ, అవును అతడే.”
“అతనికి ఇప్పుడు ఆరవై ఏళ్ళుంటాయేమో. వయసు పెరిగి వృద్ధాప్యం ఆవహించి బలహీనుడయ్యాడేమో ఒక్కసారి ఆలోచించు గంగన్నా”
విరగబడి నవ్వాడు గంగన్న. “చూడు ఇప్పుడు నీ వయస్సు ఎంత? నీకంటే అతను పది సంవత్సరాలు చిన్న. నిన్ను పిలవగా లేంది, అతన్ని ఆహ్వానించడంలో తప్పులేదుగా. అందుకే నువ్వు కాదన్నా మా ఆలోచనలు మాకుంటాయి. వాటినే అనుసరించి అమలుపరుస్తాము.” అన్నాడు.
“జాగ్రత్త. మరోసారి హెచ్చరిస్తున్నాను. ఆ మిలటరీ రాజు చాలా గట్టివాడు. అతన్ని పట్టుకోవడం అంటే అడవిలో పులిని వేటాడటం, అతనికి అడవిలో పరిగెత్తడం తెలుసు. గురితప్పిందా ఆరోజు నీ పని అయిపోయినట్లే ఎందుకైనా మంచిది. వెళ్ళేటప్పుడు కాస్త మందిని ఎక్కువగా తీసుకెళ్ళు. అటునుండి గాయపడినవాళ్ళను మోసుకురావడానికి ఉపయోగపడతారు. మీ వాహనాలు అక్కడికి చేరుకోలేవు. నులకమంచాలు ఓ నాలుగు పట్టుకెళ్ళండి, కనీసం దెబ్బతిన్నవాళ్ళను వాటిపై పడుకోబెట్టి తీసుకువస్తారు. గంగన్నా జాగ్రత్త.. పగ జేబులో పాము లాంటిది” చెప్పాడు సాంబయ్య.
“ఏమిటి సాంబా? వెటకారమా!” అంటూ కోపంతో లేచి ఊగిపోయాడు. “చూద్దువుగానిలే రాజుని పట్టిచ్చిన తరువాత, ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది. అప్పుడు నా దగ్గరకు నీవు పరిగెత్తుతూ వస్తావు.”
“గంగా! చూడ్డానికి అక్కడ ఏమీ ఉండదు. ఒకవేళ విధి అతనితో ఆడుకుంటే తప్ప నీకు అతను దొరకడు, గెలుపు నిన్ను వరించదు” అన్నాడు సాంబయ్య.
“ఇక నీవు బయల్దేరు సాంబయ్య” అంటూ వీధి గుమ్మం వైపు వేలెత్తి చూపాడు. గంగన్న.
***
పిర్ల సూరన్న, నరాల నాగన్న దారికాచినవారు. వీరందరికీ సారధి కొయ్యా గంగన్న ఎంతదూరం వెళ్ళినా కాలినడకనే వెళ్ళేవాడు. చుట్టుప్రక్కల గ్రామాలలో పర్యటించేవాడు. తను సుబ్బరాజును పట్టిఇచ్చి, గర్వంగా మీసాలు మెలివేసి, ప్రభుత్వ సత్కారాలు అందుకోవాలన్న గంగన్న అడ్డదారిలో కాచాడు. అయితే ఆ రోజు అనుకోకుండా సుబ్బరాజు వెంట ముదునూరి చంటిరాజు తమ్ముడు మాలకొండరాజు అతన్ని అనుసరిస్తున్నారు. వీరిద్దరూ 25 సం॥ లోపు యువకులే. వీరిద్దరూ 50 మందిని సునాయాసంగా కొట్టి తప్పించుకునే నేర్పున్నవారే. చంటి సన్నంగా రివటలా ఉంటాడు. ఎదుట శత్రువు ఆయుధానికి కనీసం గుప్పిటకు దొరకడు. జుట్టు చేతికి దొరకకుండా కురచగా మంగలి నారాయణ చేత క్షవరం. చేయించుకొనేవాడు. గుర్రపుస్వారీలో ఆరితేరినవాడు. ఎక్కడికెళ్ళినా గుర్రంమీద వెళ్ళేవాడు. దానికంటే శరీరంలో వేగాన్ని పెంచుకున్నాడు. తన శరీరాన్ని ఇనుపకడ్డీలా మలచుకున్నాడు. రెండవవాడు సుబ్బరాజు తమ్ముడు మాలకొండరాజు. ఎంతటి బరువునయినా, ఎంతటి బలమైన మనిషినయినా దూరంగా విసిరిపారవేయగల సామర్థ్యం, బలమున్నవాడు. తెల్లగా, పొడవుగా ఉంటాడు. అయిదు అడుగుల కర్ర ముక్క చేతిలో ఉంటే ఎంతమందినైనా ముందుకు రానివ్వడు కర్రసాము, కత్తిసాము. మల్లవిద్యలలో ఆరితేరినవాడు.
చుట్టూ దారంతా పాదలతో నిండిఉంది. సూర్యుడు అప్పుడే పడమర వైపుకి వెళ్ళిపోతున్నాడు. సాయంత్రం సుమారు నాలుగవుతుంది. దుర్గాదేవి చెరువు గట్టు దిగి దక్షిణం వైపునుండి ముగ్గురూ మెల్లగా నడిచివస్తున్నారు. పొదల్లో అలికిడిని పసికట్టిన సుబ్బరాజు ఇద్దరి భుజాల పైన చేతులేసి పోరాటానికి సిద్ధంకమ్మన్నాడు. యుద్ధంలో ఆరితేరిన అతనికి శత్రువు. జాడ కనిపెట్టడం ఎంతసేపు! త్రుటిలో పాతికమంది గంగన్న నేతృత్వంలో దాడిచేసారు. వచ్చినవాళ్ళను వచ్చినట్లే కొడుతున్నారు. ఒక దెబ్బకు పడినవాడు మరి లేవలేకపోతున్నాడు. అరగుద్దుకు ఒరిగిపోతున్నారు. పాతికమందిలో ఎవరికీ ఏమీ జరగలేదు. కాని – చేతులూ కాళ్ళూ పనిచేయవు. అలాగే కూర్చుండిపోయారు. లోపల నరాలు పట్టు తప్పి, ఎముకలు చిట్లిపోయాయి. పైకి ఏమీ కనిపించలేదు. గంగన్న కయితే మెడ ఎముక విరిగి ప్రక్కకు చూస్తున్నాడు. నాలుక బయటపెట్టి రెండు చేతులూ జోడించి, ‘మమ్మల్ని వదిలేయండి’ అని సుబ్బరాజు కాళ్ళు పట్టుకున్నాడు. మిగతా మూడు వైపులా దారికాచిన వస్తాదులు ఈ విషయం తెలుసుకుని ముళ్ళకంచెలు దాటి తలోదిక్కు పరుగులు తీసారు.
అప్పటిదాకా దూరంగా చెట్టుపై మాటేసిన ధారకొండ సుబ్బరాజు యుద్ధవిద్యలు చూస్తున్నాడు అందరూ నేలకొరిగాక కిందకు ఉరికాడు. “రా.. సుబ్బన్నా, మల్లయుద్ధం పట్టులో నువ్వో నేనో తేల్చుకుందాం” అంటూ సవాల్ విసిరాడు. ఎప్పుడో ఆంధ్రపత్రిక పేపర్లో ఫొటో చూసిన గుర్తు, ధారకొండ అని గుర్తు పట్టాడు.
“రా, ఇన్నేళ్లకు నాకు సమవుజ్జీ దొరికావు” అంటూ కలబడ్డాడు సుబ్బన్న.
ఇద్దరూ అతి బలవంతులే. ఎవరికి ఎవరూ తక్కువ కారు. సుబ్బరాజును ధారకొండ వెనక్కి తోసిన మూడుసార్లు కాలి చోటనవ్రేళ్లు చిట్లి రక్తం కారుతున్నాయి. మల్లయుద్ధం చేతులతో చేసినా, కాలి బొటన వ్రేలితో భుమిని పెట్టుకోవాలి. అది జారిందా కాళ్లు రెండు వెనక్కి వెళ్లిపోతాయి. మనిషి నిస్సత్తువగా వాలిపోతాడు నాలుగోసారి మాత్రం చిత్రంగా సుబ్బరాజు ధారకొండను రెండు జబ్బలు పట్టుకుని పైకి లేపి నడుం మీద మోకాలితో ఓ పోటు పొడిచాడు. వెల్లకిలా పడి గిలగిలా కొట్టుకుంటున్న ధారకొండను లేపి నులకమంచంపై పడుకోబెట్టి కాళ్లపై కారుతున్న రక్తానికి అక్కడ ఉన్న ఎండిన మట్టిని పూసి ముందుకు సాగిపోయాడు.
***
ఓ సాధువు వీరనారాయణపురంలో రామాలయంలో మూడు రోజుల్నుండి ఉంటున్నాడు. ఉదయాన్నే లేచి ఊరికి దూరంగా ఉన్న చెరువులో స్నానం చేసి సంధ్యావందనం గావించి, భిక్షాటనకు ఆ ఊరిలో ప్రతీ ఇల్లూ తిరుగుతున్నాడు. ఒక ఇంటి దగ్గర మాత్రం ఎక్కువ సేపుంటూ మధ్యాహ్న భోజనం మాత్రం స్వీకరిస్తున్నాడు. ఆ ఇంటిలో ఎనభై సంవత్సరాలు నిండిన ముదుసలి రాజుల బుద్దిమ్మ నివసిస్తుంది. ఆమె సుబ్బరాజు తల్లి.. వారం రోజుల తరువాత ఊరంతా భిక్షాటన ముగిసిన తరువాత పనిమనిషి సీతమ్మ చేత ఆ సాధువుకి వడ్డన గావించింది. అతను కడుపారా తిని ఆమె పాదాలకు నమస్కరించాడు.
“అమ్మా.. మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట అడుగుతాను”
“అడుగు..” అంది.
“మీకెవరూ లేరా..”.
“ఉన్నారు. అయిదుగురు కొడుకులు, ఒక కూతురు.”
“అంతా దూరంగా ఉన్నారా….”.
“ఒక్క కొడుకు మాత్రం నన్నంటిపెట్టుకుని ఉండేవాడు.”
“ఇప్పుడు లేడా..” అన్నాడు.
“ఉన్నాడు.”
“ఆయన ఇప్పుడెక్కడున్నాడు..” అంటూ ఆమె కళ్లలోకి చూసాడు.
ఆమె కళ్లు బరువుగా వాచి తడి అయ్యాయి.
“మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి అమ్మా..”
“లేదు. నా కొడుకు సాహసికుడు.. అతని గురించి నీకు చెప్పాలి. ఎందుకంటే నీవూ నా కొడుకులాగే ఆరడుగుల ఎత్తు పైమాటే.. ఆ ధైర్యం, గాంభీర్యం నీలోనూ కనిపిస్తున్నాయి. వేషం మార్చినంత మాత్రాన రాజు భటుడు కాలేదు. రాజు వేషం మార్చినా అతని నడక రాజులానే ఉంటుంది. గొప్ప జీవితం అనుభవించినవాడు. కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు. నీ ఏమరుపాటు నీ ఆహార్యాన్ని కప్పేసింది. అయినా ఫర్వాలేదు..
ఒక నెల రోజుల క్రితం భయంకరమైన తుఫాను పట్టింది.. ఒక వారం రోజులు ఇళ్లలో నుండి జనం బయటికి రాలేదు. ఊరి చెరువు పెద్ద గట్టు పైనుండి నీరు పారుతుంది. గట్టుతెగి నీరు ఊరిలోకి ప్రవేశిస్తే గొడ్డు, గోదా, పిల్లా పీచు మొత్తం జనమంతా జల ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే. చెరువు గట్టుపై లాకుల దగ్గర రాత్రీపగలు ఊరు మునిగిపోతుందని కాపలా కాసేవాడు. ఒకరోజు రాత్రి కొన్ని గంటల్లో ఊరిలోకి నీరు ప్రవేశిస్తుందనగానే అందరినీ ఊరికి దూరంగా నున్న కొండపైకి తోలేసాడు. మొత్తం ఊరు ఖాళీ అయింది. చివరలో ఒక తల్లి, ఇద్దరు పిల్లలతో ఒక పూరి గుడిసెలో నిద్రపోతుంది. ఆమెను పిల్లలనూ తీసుకుని రోడ్డు చివరగా నున్న లారీ ఎక్కించి, పంపించాడు మళ్లీ వస్తానని. గట్టు తెగి మొత్తం ఊరంతా మునిగిపోయింది. అయినా అతను మాత్రం అక్కడే ఉన్నాడు. ఎంత నీటిలోనైనా ఈత కొట్టగల గజ ఈతగాడు. తన తాతముత్తాతల దగ్గర్నుండీ జలస్తంభన విద్య తెలిసినవాడు. తన తండ్రి కొండరాజు ఎంతటి పెద్ద చెరువులోనైనా బుడక పెట్టి చేపలు పట్టి ఒడ్డుకు తెచ్చేవాడు. అదే అనువంశికంగా మా సుబ్బరాజుకి అబ్బింది. కాబట్టి ఈ జలప్రళయం మా సుబ్బురాజును ఏదో ఒడ్డుకు చేరుస్తుంది. అతను చనిపోడు. ఎందుకంటే ఎంతసేపైనా నీటిపై తేలి ప్రయాణించగలదు. ఆ రోజు నుండీ మరి కనిపించలేదు. ఎప్పటికయినా వస్తాడనే ఆశ ఉంది. అందరినీ రక్షించే అతని ఆశయం ముందు మరణం తలవంచాల్సిందేనని మా ఊరి వారందరి నమ్మకం. మా ఊరు ఇంకా బతికుందంటే.. మా సుబ్బరాజు ఎప్పటికీ జీవించే ఉంటాడు.
సాధుపుంగవుల దేహం శుష్కించి ఉంటుంది. నీవు అలా లేవు, ఎముకలపై పొంగిన నీ బలం నీ భుజాల్లో కనిపిస్తుంది. నీ చూపులు ఎవరి కోసమో వెతుకుతున్నాయి అని నిన్ను చూసిన రోజునే గ్రహించాను. నా కొడుకు నిత్యం కుస్తీ పోటీల్లో గెలిచి.. ఎందరో వస్తాదులను మట్టికరిపించాడు. తుపాకీ తూటాల మెరుపుల్లో సాటి మిలటరీ సహచరులు క్షతగాత్రులయితే కొండల మీద నుండి భుజాలపై మోసుకుంటూ ఆసుపత్రికి అడ్డదారిలో తీసుకుపోయేవాడు. అక్కడ వాడి పరుగు ఇక్కడ కూడా ఆగలేదు. తుపాకీ రవ్వ కంటిలో గుచ్చుకుని కన్ను పోగొట్టుకుని ఉద్యోగం నుండి ఇక్కడకు పంపిచేయబడ్డాడు. ‘నాకిలా జరగకపోతే జీవితాంతం అక్కడే ఉండిపోదును అమ్మా.. నా దేశానికి సేవ చేసుకుంటూ..’ అనేవాడు” చెప్పిందామె.
మారువేషంలో ఉన్న ఎస్. పి. రాయప్ప కన్నీటి పర్యంతమయ్యాడు. ఏ సుబ్బరాజు గురించి చెడుగా విన్నాడో.. అదంతా నేడు అతని మనసు నుండి తొలగిపోయింది.
“అమ్మా..” అంటూ ఆమె కాళ్లకు నమస్కరించి, ఆ గ్రామం నుండి బరువైన హృదయంతో వెనుతిరిగాడు.
మసకబారిన ఆమె కళ్లకు దూరమవుతున్న రాయప్ప నడకలో ఆమె తన కొడుకును చూసుకుంది. రెండు చేతులెత్తి దీవించింది.