Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నవ్విస్తూ ఆలోచింపజేసే కన్నడ సినిమా ‘సు ఫ్రం సో’

మధ్య నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన కన్నడ సినిమాని థియేటర్‌లో చూశాను. ఇంత మంచి సినిమాని సంచిక పాఠకులకు పరిచయం చేయాలని అనిపించి మొదటిసారి ఒక సినిమా సమీక్ష వ్రాస్తున్నాను.

చిత్రం పేరు ‘సు ఫ్రం సో’. అంటే ఏమిటో మనకు సినిమా మొదలైన కొంత సమయానికి గానీ అర్థం కాదు.

కర్ణాటకలోని కరావళి ప్రాంతానికి చెందిన మర్లూరు, సోమేశ్వర అనే రెండు గ్రామాల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. అశోక అనే యువకుడు దెయ్యం గురించి కల కనడంతో సినిమా మొదలవుతుంది. ఇది ఒక హారర్ సినిమా ఏమో అని భ్రమ కలుగుతుంది.. తర్వాత ఒక మరణం, ఆ మరణం చుట్టూ ప్రజలకు ఉన్న నమ్మకాలు, దాని ఆధారంగా ఉన్న ఆచారాలు. వీటన్నిటినీ పర్యవేక్షించే ఒక వ్యక్తి (రవి అన్న), అతని వ్యక్తిత్వం. దేన్నీ ప్రశ్నించకుండా, అన్నిటినీ పాటించే అమాయక ప్రజలు. ఆ ప్రాంతం యొక్క ఆహారపు అలవాట్లు, సరదా విషయాలు (మద్యం), వీటి మధ్యలో ఒక పెళ్లి, పాటలు-నృత్యం, రోజువారీ జీవితం, వృత్తులు, గ్రామీణ స్వచ్ఛమైన వాతావరణం, ప్రజల మధ్య ఉన్న సామరస్యం, స్నేహం, చిన్న చిన్న మనస్పర్ధలు. ఈ చర్చలన్నిటికీ సాక్ష్యంగా ఉన్న రాజన్న కిరాణా కొట్టు, అక్కడ ఎప్పుడూ కూర్చుని ఉండే దృష్టి లోపంతో ఉన్న ఒక ముసలాయన, పాఠశాల-పిల్లలు, యువకుల అభిరుచులు ఇలా అనేక విషయాలు ప్రారంభ భాగంలో వచ్చి వెళ్తాయి. తుళు మిశ్రిత ప్రాంతీయ కన్నడ భాష వీటన్నింటినీ అందంగా కట్టిపడేస్తుంది. ముఖ్యంగా అశోక, యువతి నళిని మధ్య ఉన్న సహజ ప్రేమ-ఆకర్షణ, ఆమెను చూడాలనే తపనలో యువకుడు చేసే తప్పు, దాని నుంచి బయటపడటానికి దెయ్యం పూనినట్లు నటించడంతో ఆ ప్రేతాత్మ పేరు మీద ఉన్న వ్యూహమే మొత్తం సినిమాకు దిక్సూచిగా మారుతుంది.

అశోకకు పట్టిన దెయ్యాన్ని వదిలించడానికి, ఆచారం ప్రకారం ఆచార్య (అశోక స్నేహితుడు) ను పిలిపిస్తారు. అశోక సరదాకి ఒక పాత కన్నడ సినిమా పోస్టర్ చూసి ‘కల్పన’ అంటే, అది అక్కడున్నవారందరూ ‘సులోచన’ అని వినడం, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అశోక్ చేయి చూపించిన దిక్కులో ఉన్న పిండాలు పెట్టే సోమేశ్వర స్థలాన్ని ముడిపెట్టడం. ఆ ‘సోమేశ్వర సులోచన’ యే ప్రేతాత్మ అని బలంగా నమ్మడం, దీన్ని వదిలించడానికి ప్రభావవంతమైన దైవాంశ ఉన్న వ్యక్తిని పిలిపించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సమావేశంలో చేసే సాంప్రదాయక ప్రసంగం, నిర్ణయం ప్రకారం శ్రీ కర్ణాకర గురూజీ వస్తారు. ఆయన వచ్చిన తర్వాత సినిమా ఇంకా ఆసక్తికరమైన మలుపు తీసుకుంటుంది. అక్కడ టైటిల్‌ను రివీల్ చేస్తారు సు ఫ్రం సో అంటే సులోచన ఫ్రం సోమేశ్వర అని. వింతగా అనిపించే ఈ సినిమా శీర్షిక ఆన్‌స్క్రీన్ లో నిర్వచించిన ఆ నిర్దిష్ట సమయంలో నిజంగా ప్రశంసలు పొందుతుంది. అక్కడి నుంచి సినిమా ఆసక్తిని ఇంకా పెంచుకుంటుంది. తర్వాత కర్ణాకర గురూజీ యొక్క ఆషాఢభూతి తనం. ఆయన ఇచ్చే తర్కరహిత సలహాలు, ఆ ప్రయోగాల వల్ల అలిసిపోయిన అశోక తాను సరదాకి చేసిన ఈ గందరగోళాన్ని చెప్పడానికి చేసే ప్రయత్నాలు. దాని వల్ల ఇంకా భయపడే ఊరి వాళ్ళు. చెప్పలేనంతటి ఇబ్బంది అశోకది. చివరకు సోమేశ్వర నివాసి, చనిపోయిన సులోచన కూతురు భాను వచ్చి తన తల్లి అశోక మీదకి వచ్చిందని నమ్మి తన కష్టాలన్నీ చెప్పుకునేటప్పుడు ఆమె అమాయకత్వం ఎవ్వరినైనా కరిగిస్తుంది. అలాగే మంచివాడిగా కనిపించే ఆమె చిన్నాయన యొక్క అసహ్యమైన వ్యక్తిత్వం. ఇవి ప్రేక్షకులను తీవ్రంగా ఆలోచింపజేస్తాయి.

సమాజంలోని అసహ్యకరమైన వాస్తవాలను హాస్యపూరితంగా, చాలా సామాన్యంగా చూపిస్తూనే, అన్ని కాలాలకు అవసరమైన నైతిక జీవితపు సందేశాన్ని ఈ సినిమా ద్వారా అందించారు.

ఒక మనిషి తనది కాని అతీతమైన వ్యక్తిత్వాన్ని ఎలా ఆరోపించుకోగలడు. కాకతాళీయంగా అనిపించే సంఘటనల పరంపర నమ్మకాన్ని ఎలా బలపరుస్తుంది. దాని పరిమితి, అవకాశాలు ఏమిటి అనే విషయాలను సినిమా సూక్ష్మంగా వివరిస్తుంది. అలాంటి నమ్మకాలను సదుద్దేశానికి ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దానికి గొప్ప ఉదాహరణ ఈ సినిమాలో కనిపిస్తుంది. స్త్రీ వేధింపులు, మూఢనమ్మకాల గురించి మొత్తం సినిమా బృందం నిశ్శబ్దంగా చేసిన కృషి ప్రశంసనీయం. తేలికపాటి హాస్యం, అమాయకత్వంతో తరతరాల జాడ్యాన్ని కడిగిపారేసే ఆలోచనను ఈ సినిమా నిశ్శబ్దంగా అందిస్తుంది. ఇలాంటి అమాయకత్వాల మధ్య సులోచన కూతురికి న్యాయం చేకూర్చి అశోక ప్రేక్షకుల దృష్టిలో హీరో అనిపించుకుంటాడు. చిల్లర బుద్ధిని ప్రదర్శించే అశోక చివరికి ధీమంతుడిగా కనిపిస్తాడు.

ఈ చిత్రం తన కథనంలో సూక్ష్మమైన, శక్తివంతమైన సామాజిక చైతన్యాన్ని అద్భుతంగా ప్రదర్శించింది. విషపూరిత పురుషాధిక్యత, లైంగిక దోపిడీ, ‘గురూజీల’పై గుడ్డి నమ్మకం, మహిళల స్వేచ్ఛను, భావ వ్యక్తీకరణను అణచివేసే పితృస్వామ్య మనస్తత్వాలు వంటి వాటిని విమర్శించింది. పైకి ప్రశాంతంగా కనిపించే గ్రామీణ సమాజాలలో దాగి ఉన్న ‘మురికిని’ ధైర్యంగా బట్టబయలు చేసింది.

దర్శకుడిగా జె.పి. తుమినాడ్ తొలి ప్రయత్నంగా తెరకెక్కిన ఈ కామెడీ చిత్రం నిరాడంబరంగా ప్రచారార్భాటాలు లేకుండా విడుదలైనప్పటికీ మౌత్ పబ్లిసిటీ ద్వారా కొద్దిరోజుల్లోనే భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. దీనిలో ఒకరిద్దరు చిత్రరంగం నుండి వచ్చిన నటులను మినహాయిస్తే మిగతావారందరూ తుళు రంగస్థలం నుండి వచ్చినవారు కావడం విశేషం. దర్శకుడు జె.పి.తుమినాడ్ అశోక పాత్రలోనూ, నిర్మాత రాజ్ బి. శెట్టి కర్ణాకర స్వామీజీ వేషంలోనూ చక్కగా నటించారు. ఇంకా రవి రై కలస, శశిధర్ శెట్టి బరోడ, షనీల్ గౌతమ్, ప్రకాష్ తుమినాడ్, దీపక్ రై పణజే, మైమ్ రాందాస్, తనిష్క శెట్టి, సంధ్య అరెకెరె మొదలైన నటులంతా వారి వారి పాత్రలకు న్యాయం చేకూర్చారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చింది సుమేధ్‌ కె అనే పదహారేళ్ల యువకుడు అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ‘బందరో బందరూ భావ బందరో’ పాట హాస్యాస్పదంగా ఉన్నా మనసులో నిలిచిపోతుంది.

ఈ చిత్రాన్ని మన బలగం సినిమాతోనూ, కన్నడ సినిమా కాంతార తోనూ పోల్చవచ్చు. ఈ మూడు సినిమాలు కూడా స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక వాస్తవాలను చాలా బలంగా చూపించాయి. చావు లేదా పెళ్ళి సందర్భాలలో పల్లెలలో మద్యం సేవించే ఆచారం అది తెలంగాణా పల్లె అయినా, మంగళూరు తీరప్రాంతమైనా ఒకటే అనిపిస్తుంది. ఈ సినిమాలో మద్యం సేవించే దృశ్యాలు కొంచెం శృతి మించినా వినోదాన్ని కలిగిస్తాయి. ‘కాంతార’లో భూతం అవతరించడం, ఇక్కడ అవతరించడం వేరు. ‘కాంతార’ భయపెట్టే దైవాన్ని పిలిచి, అంధవిశ్వాసాన్ని పెంచుతుంది. ‘సు ఫ్రం సో’లో దెయ్యం మంచి పనిలో భాగమైనా, దాని అసలైన రూపాన్ని ప్రదర్శిస్తుంది. వినోదం, వ్యాపారం, అంధవిశ్వాసంపై ప్రశ్న- అన్నీ కలగలిపి ఈ సినిమా ప్రశంసలను అందుకుంది.

భాష, ప్రాంతాలకతీతంగా ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూసి ఆనందించవచ్చు. ఇటీవలే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ అదే పేరుతో థియేటర్లలో విడుదలయ్యింది. వీలైతే థియేటర్లలో చూడండి. లేకపోతే ఈ సినిమా ఎప్పుడో ఒకప్పుడు ఒటిటి ప్లాట్‌ఫాంలో వస్తుంది. అప్పుడైనా తప్పకుండా చూడండి.

Exit mobile version