[‘పుస్తక సురభి’ శీర్షికలో భాగంగా మంజుల పద్మనాభన్ రాసిన ‘స్టోలెన్ అవర్స్ అండ్ అదర్ క్యూరియాసిటీస్’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు స్వప్న పేరి.]
మంజుల పద్మనాభన్ రాసిన ఇరవై ఆరు సైన్స్ ఫిక్షన్ కథల సంపుటి ‘స్టోలెన్ అవర్స్ అండ్ అదర్ క్యూరియాసిటీస్’. ఈ పుస్తకం, తరచుగా మనదైన లోకానికి దగ్గరగా ఉన్న ఇతర ప్రపంచాలను వింతగా చిత్రించడం ద్వారా, మానవుడిగా ఉండటం అంటే ఏమిటో ప్రశ్నిస్తుంది. ఈ పుస్తకంలో ఊహ, సంభావ్యత ద్వారా ఏర్పడే ఎన్నో మలుపులు ఉన్నాయి. తన సృజనాత్మక కథాంశాల ద్వారా, రచయిత్రి సాంకేతిక పురోగతి, సామాజిక స్థితిగతులు పరిణామాలను పరిశీలిస్తారు. పురాణాల, ఆధునికతల మేళవింపుని అన్వేషిస్తారు.
మంజుల పద్మనాభన్
ఈ పుస్తకపు స్వరం – వినోదభరితమైన, వెంటాడే మరియు కలవరపెట్టే కథల మధ్య నేర్పుగా మారుతూంటుంది, ఇది కథకురాలిగా మంజుల గారి నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. నొప్పి లేని ప్రపంచం (‘ది పెయిన్ మర్చంట్’) లేదా జన్యుపరంగా ఇంజనీరింగ్ చేయబడిన లక్షణాలు (‘అడాప్టేషన్’) వంటి ఊహాజనిత భావనను తీసుకొని, కలవరపెట్టేవైనా అంతర్దృష్టితో కూడిన ముగింపులను కఠినమైన తర్కంతో అనుసంధానించే సామర్థ్యం ఆమె ప్రత్యేక లక్షణం. ఉదాహరణకు, ‘ది పెయిన్ మర్చంట్’లో, నొప్పి సరుకుగా మార్చబడింది, అలాగే ‘ఇంటర్‌ఫేస్’ కథ స్మార్ట్ పరికరాలను వ్యక్తీకరిస్తుంది, వాటికి మానవుల పట్ల చైతన్యాన్ని, ఆగ్రహాన్ని కలిగిస్తుంది.
అన్ని కథలలోనూ ప్రస్ఫుటంగా కనబడే ఏకసూత్రత – వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ సమాజ స్థితిపై మంజుల వ్యాఖ్యానం. ఆమె ఊహించిన వాస్తవాలకు సంబంధించిన నైతిక సందిగ్ధతలను పరిశీలిస్తారు: జన్యు-సవరణ అంశంలోని నైతికత, కృత్రిమ మేధస్సుపై ఆధారపడటంలోని పరిణామాలు, ఇంక భారతీయ చరిత్ర మరియు పురాణాల నుండి ప్రేరణ పొందిన పరిస్థితులలో శాంతి కాముకత పరిమితులు. కొన్నిసార్లు, కథలలుగా నేరుగా భారతీయ పురాణాల లోని ఇతివృత్తాలను తీసుకుంటారు, ఉదాహరణకు రామాయణం నుండి మండోదరికి చెందిన పునఃకథనాలు, ఈ ఇతిహాసాలతో పరిచయం ఉన్న పాఠకులకు కొత్త అర్థాలను వెల్లడించే ప్రయత్నం చేశారు.
ఈ కథలలో విభిన్నమైన పాత్రలున్నాయి – మానవులే కాక, రక్త పిశాచులు, యతి, కృత్రిమ మేధ, రోబోలు, ఇంకా చేతన కలిగిన దోమలు కూడా. ఈ సంపుటి నిజమైన నైతిక ప్రశ్నలతో పాటు అధిక్షేపాన్ని అందిస్తుంది. ఈ మేళవింపు – ఉల్లాసభరితమైన, భయంకరమైన కథల మధ్య ఊగిసలాడే కథలను అనుమతిస్తుంది, మానవుల మూర్ఖత్వాలు, ఆశయాలకు అద్దం పట్టేలా చేస్తుంది. మలుపులు తిరిగే ముగింపులు; కథనం అనూహ్యంగా పక్కదారి పట్టడం వంటివి పాఠకులను విస్తుగొల్పుతాయి, ప్రతి కథని కొత్తగా, అనూహ్యంగా అనిపించేలా చేస్తాయి.
శైలిపరంగా, మంజుల తన సంక్షిప్త వచనం, చురుకైన చమత్కారానికి ప్రశంసలు అందుకున్నారు. పుస్తకం భాష సరళంగానే ఉన్నప్పటికీ మేధోపరంగా ఉత్తేజపరుస్తుంది, అత్యంత గంభీరమైన క్షణాలలో కూడా హాస్యంతో నిండి ఉంది. ఈ శైలి వినోదాన్ని అందిస్తుంది, ఆత్మపరిశీలనను ఆహ్వానిస్తుంది. సాంకేతికత, శక్తి, సమాజం గురించి తమ అంచనాలను ప్రశ్నించడానికి పాఠకులను ప్రేరేపిస్తుంది.
కథల్లో వైవిధ్యం ఉన్నప్పటికీ, కొంతమంది విమర్శకులు ఈ సంపుటి లోని అన్ని కథలూ సమానంగా విజయవంతం కాలేవని పేర్కొన్నారు; కొన్ని కథలు నిగూఢమైనవిలా అనిపిస్తాయి, లేదా కొంతవరకు అస్పష్టంగా ఉంటాయి, రచయిత్రికి పూర్తి ప్రశంసలందించాలంటే, పాఠకులకు ఓపిక, ఈ కథలకు సంబంధించిన జ్ఞానం అవసరం. అయినప్పటికీ, ఈ లోతైన కథలు గందరగోళం కంటే ఆలోచననే ఎక్కువగా రేకెత్తిస్తాయి, తద్వారా చాలా కాలం పాటు పాఠకుల మనస్సులో నిలిచిపోతాయి.
మొత్తం మీద, ‘స్టోలెన్ అవర్స్ అండ్ అదర్ క్యూరియాసిటీస్’ అనే పుస్తకం సైన్స్ ఫిక్షన్ రచయిత్రిగా మంజుల పద్మనాభన్ స్థాయికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ సంపుటి పరిధి ప్రతిష్ఠాత్మకమైనది, చదువుతుంటే వినోదాత్మకంగా ఉంటుంది. అయితే ప్రాచీన, సమకాలీన సమస్యల అన్వేషణను లోతుగా కొనసాగిస్తుంది. భారతీయ దృక్పథంతో ఊహాజనిత కల్పనను కోరుకునే పాఠకులకు, కథానిక సాహిత్య అవకాశాలపై ఆసక్తి ఉన్న ఎవరికైనా ఈ కథాసంపుటిని సిఫార్సు చేయవచ్చు.
***
Author: Manjula Padmanabhan
Published By: Hachette India
No. of pages: 288
Price: ₹ 499 Paperback
Link to buy:
https://www.amazon.in/Stolen-Hours-Curiosities-Manjula-Padmanabhan/dp/9357312064
స్వప్న పేరి ఫ్రీలాన్స్ బ్లాగర్. పుస్తక సమీక్షకురాలు. సినిమాలంటే ఆసక్తి.