[కానాల సుమంగళి గారు రచించిన ‘సృష్టి రహస్యం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
సృష్టి రహస్యం తెలియని అంతరంగం
ఎవరికోసం ఆగనిది నిరంతర కాల గమనం
మంచుతెరల మాటున దాగిన సౌందర్యం
భానుని కిరణాలు సోకగానే భహిర్గతం
గుండె లయలో వినిపించే భావం అనిర్వచనీయం
కాలగమనానికి లేదు ఎటువంటి కళ్లెం
సుఖ దుఃఖాలను రుచి చూపిస్తున్న వైనం
గత కాలపు మధుర స్మృతుల సమాహారం
కోల్పోయిన హితుల సన్నిహితులతో సహచర్యం
గతించిన చేదు అనుభవాలను మరిపించు నైజం
మదిలో మెదిలే గతస్మృతులతో సాగు గమనం
కలవర పరిచినా తప్పని సరిగా సాగేదీ పయనం
ఎంతటి వారికైనా తప్పనిదీ విచిత్ర అనుభవం
ఎదురీదుతూ సాగాలీ నిరామయ నిర్విరామయానం
సర్వే జనాః సుఖినో భవంతు మన నినాదం
సమస్తం కావాలి ఆనంద నందన వనం
జన్మ సార్థకతకు ప్రయత్నించుట మానవ ధర్మం
స్వస్వరూపు జ్ఞానమే మనకు చూపు సరైన మార్గం