Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సృష్టిలో విలువైనది

[శ్రీమతి విజయశ్రీముఖి రాసిన ‘సృష్టిలో విలువైనది’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“అమ్మా, తినేద్దామా?” ఐదేళ్ల అభయ్ అడిగాడు తమకు ఎదురుగా పెద్ద పళ్ళెంలో ఉన్న బిర్యానీ చూస్తూ. మూడేళ్ల అభీష్ట పళ్ళెంలో చేతిని పెట్టి తీసుకోబోతోంది.

“ఆగు” దాదాపు అరచినట్టుగా అని, కూతురు చేయి వెనక్కిలాగింది శర్మిష్ఠ. కూల్ డ్రింక్ బాటిల్స్ నాలుగింటికి మూతలు తీయబోతున్న మదన్ చేసే పనిని క్షణం ఆపి, భార్య వైపు చూశాడు.

శర్మిష్ఠ చూపు మరల్చుకుని, పిల్లలిద్దరి చేతులను కలిపి పట్టుకుంది పళ్ళెంకి ఎడంగా.

“ఏం, నువ్వో నేనో పెట్టేవరకూ ఆగాలా వాళ్ళు? ఎలాగూ తినాల్సిందే కనుక వాళ్ళనే తీసుకుని తిననివ్వరాదూ?” అన్నాడు.

“ఎలాగూ తినబోతున్నాంగా? మరీ ఎందుకంత తొందర? కాస్తాగలేరా?” అంది శర్మిష్ఠ.

తల్లి చేతుల్లోనుండి తమ చేతులు లాక్కోడానికి గుంజుకుంటున్నారు పిల్లలు. ఓసారి అటు చూసి నాలుగు కూల్ డ్రింక్ బాటిల్స్ మూతలు కూడా తీసేసి పెట్టాడు మదన్.

“ఒక్క నిమిషం ఆగండి” అంది శర్మిష్ఠ భర్తను.

ఆగి, ఏమిటన్నట్టు ఆమె వైపు చూసాడు మదన్.

“మన బెడ్ రూమ్‌లో.. షెల్ఫ్ పై అరలో ఉంది. ప్లీజ్ తీసుకుని రండి” బతిమాలినట్లు అడిగింది.

“ఇప్పుడది అవసరమా?” అడిగాడు.

“ఇప్పుడే కదా అవసరం? ప్రక్కన పెట్టుకుంటాను” గింజుకుంటూ చేతులు వెనక్కిలాక్కోబోతున్న పిల్లలు చేతులు మరింత గట్టిగా పట్టుకుని అంది.

“అదిక్కడ హాల్లో షెల్ఫ్ లోనే కదా ఉంది?”

“నిన్న కాసేపు చూసి అక్కడే పెట్టేసాను”

అయిష్టంగానే లేచి బెడ్రూమ్‌కి వెళ్లాడు మదన్.

మరుక్షణమే పిల్లల చేతులను వదిలి దూసుకు వెళ్లిన శర్మిష్ఠ భర్త బైటకు వచ్చేఅవకాశం ఇవ్వకుండా ధఢాలున తలుపులు మూసి బైట గడియపెట్టేసి, తిరిగి పిల్లల దగ్గరకు వచ్చింది.

అప్పటికే తమ చిట్టి చేతులతో కొద్దిగా బిర్యానీ తీసుకుని నోట్లో పెట్టుకుంటున్నారు పిల్లలు.

వాళ్ల చేతుల్లోది లాగేసి, నోట్లో పెట్టుకున్నది కూడ బలవంతాన వేళ్ళతో తీసేసి నీళ్ళతో వాళ్ల నోళ్ళు కడిగి, ఇద్దర్నీఎత్తి మంచం మీద వేసింది.

బిర్యానీ పళ్ళెం తీసుకెళ్లి పెరట్లో డస్ట్ బిన్ లో వేసి వచ్చేసరికి గదిలో నుండి మదన్ కోపంగా అరవడం, తిట్టడం వినిపిస్తోంది.

ఎదురింట్లో ఉండే గణపతి ఇంటికెళ్ళి ఏడుస్తూ రెండు ముక్కల్లో విషయం చెప్పింది. తింటున్న అన్నాన్ని వదిలేసి, గణపతి అతని భార్య సుగుణ ఆమె పాటు వీళ్ళ ఇంటికి వచ్చారు.

గదిలో నుండి మదన్ తలుపులు బాదుతూ, ఏదో అరవడం వినిపిస్తూనే ఉంది. ఇవతల గది నుండి అభీష్ట వాంతి చేసుకునే శబ్దాలు వినిపిస్తున్నాయి.

“అన్నా, మీరాయన్ని చూడండి.. దేవుడా.. నా పిల్లలు..” శర్మిష్ఠ ఏడుస్తూ పిల్లల వైపు పరిగెత్తింది. ఆమెతో పాటు సుగుణ కూడా పిల్లల వద్దకెళ్లింది.

గణపతి తలుపు గడియ తీస్తున్నాడు.

***

అమృతా హాస్పిటల్..

ఒక బెడ్ మీద అభయ్, మరొక బెడ్ మీద అభీష్ట ఉన్నారు. వాళ్ల చేతులకు సెలైన్ డ్రిప్స్ ఉన్నాయి. అభీష్ట బెడ్ ప్రక్కన శర్మిష్ఠ, అభయ్ బెడ్ దగ్గర సుగుణ కూర్చుని ఉన్నారు.

శర్మిష్ఠ ఒకచేయి కూతురుపై వేసి అశాంతిగా, అన్యమనస్కంగా ఆలోచిస్తూ కూర్చుంది. సుగుణ అభయ్‌తో ఏవో కబుర్లు చెప్పి నవ్వించడానికి ప్రయత్నిస్తోంది.

హాస్పిటల్ ముందున్న చెట్ల కింద బెంచీల మీద కూర్చున్నారు మదన్, గణపతి.

గణపతికి మెకానిక్ షెడ్ ఉంది. ఇద్దరి ఇళ్ళూ ఒక దగ్గరనే ఉన్నా తరచూ చూసుకుంటున్నాసరే మాటలు తక్కువ. ఎవరి పనుల్లో వాళ్ళుంటారు.

“మదన్ భయ్యా, ఆవేశంలో నువు తీసుకున్న నిర్ణయం దేవుని దయవలన ఆగిపోయింది. ఇంక ఎప్పుడూ అలాంటి ఆలోచన రానివ్వకు.” మదన్ భుజం మీద చిన్నగా తడుతూ చెప్పాడు గణపతి.

“..నీకూ తెలుసుగా? మన ఈ ఏరియాలోనే ప్రతిష్ఠాత్మకమైన పెద్ద కార్ల కంపెనీ ఒకటి కట్టాలని, దానితోపాటు ఒకటి రెండు పరిశ్రమలేవో శాంక్షన్ అయ్యాయని భూమి ఎన్నుకుని చర్చలు కూడా జరిగాయి కదా ఆ మధ్య?”

“అవునవును” ఒప్పుకున్నాడు గణపతి.

“అవింకా కార్యరూపం దాల్చకముందే మన వైపు బీడు భూములకు ధరలు పెరగసాగాయి. నీకు తెలియదేమో నాకెలాంటి చెడు అలవాట్లులేవు గణపతీ.. ఉన్న బట్టల షాపునే జాగ్రత్తగా నడుపుకునే నాలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే తొందరగా పైకి రావచ్చనే ఆశ పొడచూపింది..” నెమ్మదిగా చెప్పసాగాడు మదన్.

“………………..”

“ఆ ఆశతోనే ఆలోచనతోనే అమ్మానాన్నను, మా తమ్ముళ్లు ఇద్దరినీ ఒకటి రెండేళ్లలో ఇంతకింతగా కొందామని కాల్వ కింద పండే మూడెకరాల మా భూమిని అమ్మించి, అనువైన చోటల్లా అధిక ధరకి అడ్వాన్సులు ఇచ్చేసాను.

“……………….”

“..ఆ తిరుగుడుతో అప్పటివరకు బాగానే నడిచిన బట్టల షాపుని వర్కర్స్ పైన వదిలెళ్లాను. చివరికి.. ఆ కంపెనీల నిర్మాణాలు మరో జిల్లాకి తరలిపోయాయి. ఇచ్చిన అడ్వాన్సులు తిరిగి రాలేదు. ఇటు బట్టలషాపులో బేరాలు పడిపోయి లాస్ పెరిగిపోయింది. షాప్‍లో వర్కర్స్ జీతాలకు, షాప్ అద్దెలు బకాయిలు పడి పడి చివరకు నా భార్య నగలు అమ్మేసి వాటిని తీర్చాల్సివచ్చింది..”

“ఒక్కోసారి దురదృష్టం వెంటాడితే అంతే”

“..అప్పులు చేయాల్సి వచ్చింది. వడ్డీలు పెరిగి పోతూ, కోలుకునే అవకాశాలు కనపడటం లేదు, తల్లిదండ్రులకు ముఖం చూపించలేక, తమ్ముళ్ళ నిందలు నిష్ఠూరాలు భరించలేక, భార్య బిడ్డలను బతికించలేని కుంగుబాటు, మానసిక వ్యధతో..”

మదన్ కళ్ళలో నిండిన నీటితో గొంతు పూడుకు పోయింది. జేబులో రుమాలు తీసి కళ్లు ఒత్తుకోసాగాడు.

“నేను అర్థం చేసుకున్నాను భయ్యా నీ పరిస్థితి. కానీ, ఒక్కటాలోచించు.. ఏ బాదరబందీలు, కష్టనష్టాలు లేకుండానే మన పెద్దవాళ్ళు మనల్నింత పెంచి పెద్దచేశారా? వాళ్లు అవన్నీ భరించే కదా మనకు ఈ బతుకునిచ్చారు?

మనకంటే వాళ్లకు చదువు, సదుపాయాలు కూడ అప్పట్లో తక్కువేననే సంగతి మర్చిపోకూడదు. కొంచెం ఇబ్బంది కలగగానే అదే పెద్ద కష్టం, అదే పెద్ద అవమానంగా తలచి ఇలాంటి తొందరపాటు పనులు ఎవ్వరం చేయకూడదు భయ్యా” నెమ్మదిగా అన్నాడు గణపతి.

“కేవలం అప్పులు గురించే కాదన్నా.. తోడబుట్టిన వాళ్లు కూడా ఓర్చుకోలేక, ఓదార్పునివ్వక పోగా ‘మా వాటా పొలం కూడా అమ్మేసి, మమ్మల్నికూడా నష్ట పెట్టేవ’న్నట్లుగా ఉన్న.. వాళ్ళ మాటలను చూపులను తట్టుకోలేకపోతున్నాను. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే వాళ్లు కూడా లాభపడదామనే కదా ముందు ఒప్పుకున్నారు? వీళ్ళు.. వీళ్ళా నా వాళ్ళు?” విరక్తిగా అడిగాడు.

“నిజమేలే కానీ.. కష్టాలు వచ్చినప్పుడే కదా మనవాళ్లు ఎవరూ, కానివాళ్లెవరనేది మనకి అర్థమయ్యేది? అప్పుడే మనకి జీవితం అంటే ఏమిటో అర్థం అవుతుంది. ఎలా జాగ్రత్త పడాలో కూడా అనుభవంలోకి వస్తుంది.”

“………………”

“జీవితమంటే ఆట కాదు, కథ కూడా కాదు.. మన ఇష్టం వచ్చినట్లు ఆడటానికి, రాసుకోవడానికి.. ఇలాంటివన్నీ తట్టుకోవాలి మరి” చెప్పాడు గణపతి.

ఉబికే ఆవేశాన్ని, అశ్రువులను నొక్కిపెట్టుకుంటున్నాడు మదన్.

“మనకేదో అవమానం జరిగిందని, మనం లేకపోతే పెళ్ళాం పిల్లలు బతకలేరనే అతి ఆలోచన కూడా మన భ్రమే! పసిబిడ్డల నూరేళ్ల బతుకుని మట్టిపాలు చేయాలని పూనుకోవడమేంటి? మనం కన్నవాళ్ళమేనా?

మనల్ని నమ్మి తన నూరేళ్ల జీవితం మన చేతుల్లో పెట్టిన అర్ధాంగిని మన పరువు అవమానాల కోసం బలి చేయడమా? అసలు మనం మనుషులమేనా? కేవలం ఇవి నిన్నుఅడగటం కాదు తమ్ముడూ.. ఇలాంటి తొందరపాటు చర్యకు పూనుకునే వాళ్ళని తలుచుకున్నప్పుడు నాలో కలిగే ఆవేదన ఇది”

“………………”

“అసలొక్క విషయం చూడు. కోట్ల సంపదున్నా, బతుకుమీద కాంక్ష ఉన్నాఆయువు లేక ఎంతోమంది చస్తున్నారు. ఆయువున్న వాళ్ళం అల్పవిషయాలకే చావును కొని తెచ్చుకోవడం ఎందుకు? సృష్టిలో విలువైనది ఒకే ఒక్కటి, అది ప్రాణం! అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఒక్కక్షణం ఆగి ఆలోచిస్తే.. అసలు మన నిర్ణయాలు ఎంత అసంబద్ధంగా దుర్మార్గంగా ఉన్నాయో మనకే తెలుస్తుంది. కానీ ఆగం, ఆలోచించం.. పైగా మన తొందరపాటుకి సెంటిమెంట్ పూత పూస్తాము..” విసుగ్గా అన్నాడు గణపతి.

మదన్ పశ్చాతాపంగా “ఆ రోజు శర్మిష్ఠ కూడా ఎంతగానో చెబుతూనే ఉందన్నా నాకు. నేను.. అప్పులోళ్ల, నా వాళ్ళ మాటలను భరించలేక, ఎక్కడా తేలేక.. నేనొక్కడ్నిచస్తే, నా భార్యని వాళ్లందరూ కాకుల్లా పొడుస్తారని.. మేమిద్దరం పోతే.. మా పిల్లలు.. అనాథల్లా తిరగడం.. నేను ఊహించుకోలేక.. శర్మిష్ఠని ఒప్పించి తెచ్చిన బిర్యానీలో పురుగుల మందును కలిపాను..” అన్నాడు.

వినలేనట్లు “ష్..” అన్నాడు గణపతి.

“నా భార్య ‘ఆ గదిలో భగవద్గీత ఉంది. తెమ్మం’టే, తన ఆఖరి కోరికను కాదనలేక వెళ్ళాను.. బైట గడియ పెట్టేసింది..” ఆగాడు మదన్.

మదన్ భుజంమీద చేయివేసి “చిన్న గడ్డిపరక ఎదురుగాలి వీస్తే తలవాల్చి తగ్గేక తలెత్తుతుంది. అదీ ఆటుపోట్లను తట్టుకోవడమంటే.”

“……………….”

“నీకేదో ఉపన్యాసాలిస్తున్నాననుకోకు. రేపు నీ పరిస్థితులు మారి, పిల్లలు పెద్దయి మంచి పొజిషన్‍లో ఉంటే నీకే అనిపిస్తది అప్పుడెంత తొందరపాటు ప్రదర్శించాను అని “

“……………….”

“మెకానిక్ షెడ్ మీదొచ్చేఆదాయంతో ముగ్గురు పిల్లలతో సంసారం లాక్కొచ్చే నేను నీకు ఆర్థికంగా సహాయపడలేను గానీ, నీతోపాటు నేను కూడా వస్తాను. ఇవ్వాల్సిన వాళ్ళని కలిసి కాస్త టైమ్ ఇస్తే నెమ్మదిగా తీర్చేసుకుంటామని చెబుదాం.”

“అన్నా! నాకు నువ్విలా మాటగా తోడుంటే చాలు. ఇదే నాకు పెద్ద సాయం, ధైర్యం అన్నా” మదన్ స్వరంలో, కళ్ళలో కృతజ్ఞత తొణికింది.

“మీరక్కడ కూర్చున్నారా? డాక్టర్ డిశ్చార్జి చేస్తాం అని చెప్పారు.” వీళ్ళని చూస్తూ సుగుణ పిలుస్తోంది.

“వస్తున్నాం పద. మీరు ఇంటికి తీసుకెళ్ళేవేవైనా ఉంటే సర్దండి.” అని భార్యతో చెప్పిన గణపతి “లే, భయ్యా.. నిన్న అమ్మాయి నువు గదిలోకి వెళ్లగానే గడియపెట్టీసి వెళ్ళేలోపులో వాళ్ల చిట్టి చేతులకు వచ్చిన నాలుగు మెతుకులు తినబట్టి పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఆపద తప్పింది. పద వెళ్దాం” గణపతి తన జేబులో డబ్బుని తడుముకుంటూ లేచాడు. అతనితోపాటు మదన్ కూడా లేచాడు.

Exit mobile version