[2025 ఏప్రిల్ 6 న శ్రీరామనవమి సందర్భంగా శ్రీమతి మరింగంటి సత్యభామ గారి ‘శ్రీరామ కళ్యాణవైభోగమే’ అనే రచనను అందిస్తున్నాము.]
బ్రహ్మర్షి గాధిజుడు జనకుడు చూపిన
శివధనువును భక్తితో ప్రార్థిం చి పూజించి
శ్రీరామునకు చూపి పేటికలో నున్న
శివ ధనువును తాకి గంధ పుష్ప
మాలాంలంకృత ధనువు చేపట్టి రాముడు
ఆకర్ణాంతము లాగి సంధించి భగ్నముచేయ
దివ్య ధనువు ధ్వనికి ధరణి కంపింప
సునయన సహిత జనక మహరాజు
హృదయమున వెల్లి విరిసినది హర్ష
వర్షామృతమ్ము నునుసిగ్గుల జనకసుత
వరమాలను దాశరధి గళము నుంచె ముగ్ధ
మోహనముగ విశ్వామిత్రుని అంతరంగము
ఆనంద తరంగ జలధియై ఉప్పొంగ
మిథిలాధిపతి దశరథునకు ఆహ్వానము
పంప ఏతెంచె రాచ పరివారముల
రాచ మరియాదలతో పూర్ణ కుంభముల
మంగళ తూర్యముల తోజనకమహరాజు
ముని గణములతో స్వాగతముపలికె
ఉచితరీతుల గౌరవ సత్కారములుజరిపి
జనకు సోదర పుత్రికల సౌమిత్రి భరత
శతృఘ్నులకు కల్యాణ సంకల్పములతో
మునులు దశరథుని ప్రవర వినిపించిరి
మిథిలాధిపతి వంశవృత్తాంతము తెలుప
వందనీయం బైన వంశజుల గృహమున
కల్యాణ సుమూహూర్త నిర్ణయము చేసి
విధి విధాన దానకర్మల నాచరించి రక్షా
బంధమున వరులు కల్యాణ మండపము చేర
శాస్త్రోక్తముగ అగ్ని ప్రజ్వలనము చేసి
సర్వాభరణ భూషిత సీతను రామునెదురుగ
ఆశీనను చేసి సకల గుణాభిరామునకు
సీతావధూటిని కన్యాదాన మీయ జనకుని
మానస మానందమున నుప్పొంగ పరవశించ
లక్ష్మణుడు ఊర్మిళ పాణినందుకొనగ
భరతుడు మాండవిని చేపట్ట శతృఘ్ను శృతకీర్తి
కరమందు కొనగ దేవ దుంధుభులతో
మంగళ వాయిద్య మంగళకర శోభల
మ్రోగ నృత్య గీత మధుర వాద్యముల
దేవతా గణము మురియ ధశరథ జనకాదులు
దీవనల నందించ విశ్వాంత రంగునికి విశ్వ
వైభవము శుభాంగి వైదేహి దివ్య శోభితముల
కల్యాణ వైభోగ మహోత్సవముజరగ గణగణ
గణగణ ఘంటారావము వీణా మృదంగ
వేణు గానముల నృత్య గీతముల వాద్య
శోభలతో ఆణిముత్యముల తలంబ్రాలతో
కన్నుల పండుగ మనసులు నిండగ
సీతా రాముల కల్యాణ వైభోగము
శుభము శుభము శుభము
సర్వ మంగళములు మంగళ కరులకు
హారతులు మంగళ హారతులు
సకల దేవతల శుభ హారతులనీయగ
సకల గుణాభి రాము శ్రీరాముని
కర మందుకొనియె జనకజ జానకి
రక్కసిలలనల కు అభయమొసగిన
కరము పావనిని ప్రేమారనిమిరిన
పరమ పావని సీతమ్మ కరము
సకల జగమునకు మాత సీతమ్మ
శ్రీరామచంద్రుడు మాకు తండ్రి