Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీమద్రమారమణ-7

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమారమణ’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము. డల్లాస్ లోని సిరికోన సంస్థ – నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది.]

[ఆంజనేయశర్మగారింట్లో ఉంటూ, ఆయన శిష్యరికంలో సంగీతం, హరికథలు చెప్పే విధానం నేర్చుకుంటాడు వైనతేయ. తన ప్రవర్తనతో శర్మగారి, వల్లెలాంబ గారి అభిమానాన్ని చూరగొంటాడు. ఆయన వాడికి ‘భక్తప్రహ్లాద’ హరికథ నేర్పుతారు. కీర్తన పాడుతూ, తదనుగుణంగా అడుగులు ఎలా వెయ్యాలో, కొంత నాట్యరీతిని వాడికి చేసి చూపిస్తారు. శ్రోతలను ఎలా సంబోధించాలి, మధ్యలో గోవింద నామస్మరణ ఎలా చేయించాలి, భక్తులను మధ్యమధ్యతతో చెబుతూ వారిని ఎలా వినోదపరచాలో బోధిస్తారు. హార్మోనిస్టు ఉరుకుందప్ప, మృదంగ విద్వాన్ ఓబులేశయ్యలతో కలిసి సాధన చేస్తాడు. వైనతేయ తన అంచనాలను అందుకున్నాడని అనిపించాకా, కౌతాళం శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో ప్రదర్శన ఏర్పాటు చేయిస్తారు. దస్తగిరి సారు, కోనేటయ్య, తిరుపాలమ్మ, రమణమ్మ ముందురోజే కౌతాళం చేరుకుంటారు. అనుకున్న రోజున ఆలయ ప్రాంగణంలో వైనతేయ హరికథ మొదలవుతుంది. గురువులకి, తల్లిదండ్రులకి పాద నమస్కారాలు చేసి గణపతి ప్రార్థనతో ప్రారంభిస్తాడు. రామచంద్రుని శ్లోకం రాగయుక్తంగా చదువుతాడు. ఆపై, ఆంజనేయ శర్మ గారి మీద, దస్తగిరి సారు మీద తన తల్లిదండ్రుల మీద తాను స్వయంగా వ్రాసిన ఛందోబద్ధ పద్యాలను చదువుతాడు వైనతేయ. అనంతరం ‘భక్తప్రహ్లాద’ హరికథని గొప్పగా చెప్పి శ్రోతల అభిమానానాన్ని పొందుతాడు. గురువులు, తల్లిదండ్రులు, అక్క పొంగిపోతారు. మర్నాడు ఉదయం దస్తగిరి సారు, కోనేటయ్య, తిరుపాలమ్మ, రమణమ్మ వెళ్ళిపోతారు. – ఇక చదవండి.]

దవ తరగతి పెద్ద పరీక్షలు పూర్తయినాయి. వైనతేయ బాగా రాసినాడు. జూన్/జూలై నెలల్లో వాడిని తిరుపతికి తీసుకు వెళ్లి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య పాఠశాలలు చేర్పించాలి. కౌతాళం నుంచి ఐతే మూడు నాలుగు నెలలకొకసారి యానాదుల దెబ్బకు వెళ్లి అమ్మానాన్నలను, ప్యాపిలికి వెళ్లి దస్తగిరిసారును చూసి వస్తుండేవాడు. తిరుపతిలో చేరితే మాటిమాటికి రాలేడు. కాబట్టి వాడిని ఈ నెలన్నరా ఊరికి వెళ్లి రమ్మన్నారు శర్మగారు. దస్తగిరిసారును కూడా, వచ్చేటపుడు, వాడితో పాటు రమ్మనమని చెప్పారు.

రెండు బస్సులు మారి ముందు ప్యాపిలి చేరుకున్నాడు వైనతేయ. వాడు ముందుగా వాళ్ల ఊరికి వెళ్లకుండా తమ దగ్గరికి రావడం దస్తగిరి సారుకు ఎంతో సంతోషం అనిపించింది. కాశింబీ వాడిని అక్కున చేర్చుకుని తల నిమిరింది.

ఆ రోజు, వైనతేయ వచ్చినాడని వాంగీబాత్, అలసంద వడలు చేసింది ఆమె. సగ్గుబియ్యం పరమాన్నం వండింది. మధ్యాహ్నం భోజనం తర్వాత, సారు విశ్రమిస్తుంటే, వాడు కాళ్ళు నొక్కసాగాడు. సారిలా అన్నాడు.

“ఒరేయ్ వైనా! శర్మగారు నేర్పించిన కీర్తన ఏదైనా పాడి వినిపించరా!” “ఉండండి! పది నిమిషాల్లో నేనూ వస్తాన్నా” అని అరచింది లోపలి నుంచి కాశింబీ.

ఆమె కూడ వచ్చి, వాడి పక్కనే క్రింద కూర్చుంది.

“సార్, అన్నమాచార్యుల వారి కీర్తన పాడమంటారా? వెంకటేశ్వర స్వామి మీద? ఈ మధ్యనే గురువుగారు సాధన చేయించారు. బౌలి రాగం సార్ ఇది; ఆదితాళం.”

రెండు చేతులెత్తి ఏడుకొండలవాడికి నమస్కరించాడు దస్తగిరిసారు, లేచి కూర్చుని.

“వచ్చే నెలలోనే కదరా నీవు తిరుపతికి పోయ్యేది? అంతా స్వామి దయ!”

“నీవు కూడా వస్తావు కద సార్?”

“స్వామి రమ్మనమని చెప్పినాడంటివి కదా! పోదాము!”

ఆ బాలగాయకుని గొంతులో అన్నమయ్య మధురంగా పలికినాడు.

‘గోవింద గోవింద యని కొలువరే

గోవిందా యని కొలువరే’

అన్న పల్లవికి ముందు కొంత ఆలాపన చేసినాడు వైనతేయ.

చివరి చరణంలో,

‘దేవుడు శ్రీవిభుడని కొలువరే

సోవల అనంతుని చూడరే’ అని పాడి,

‘శ్రీవేంకటనాధుని చేరరే..’ – అన్న చోట పూర్తి పై స్థాయికి వెళ్లినాడు. అక్కడ చాలా సేపు ఆలాపన వస్తుంది. దానిని అద్భుతంగా పలికించినాడు.

దస్తగిరిసారు వాటిని దగ్గరికి తీసుకుని అన్నాడు.

“నాయనా! స్వాతిచినుకు ముత్తెపు చిప్పలోన బడి ముత్తెమైనట్లు, గురువు గారి దగ్గర నీవు విద్య నేర్చుకొని, నీ జన్మను పండించుకున్నావు రా!”

“వెంకటేసులు కండ్ల ముందు నిలబడె, మన పిల్లాడు పాడతా ఉంటే!” అన్నది కాశింబీ. ఆమె కండ్లు తడి అయినాయి.

“సరే గాని, సోవల అనంతుని అన్నాడు కదా అన్నమయ్య? అంటే ఏమి?” అనడిగినాడు దస్తగిరిసారు.

“‘శోభల’ అన్న పదానికి వికృతే ‘సోవల’ అని స్వామి చెప్పిండె సార్” అన్నాడు వాడు వినయంగా.

వాడి భాషలో, ఉచ్చారణలో, పూర్తిగా మార్పు వచ్చిందని గమనించాడు సారు.

మర్నాడు యానాదుల దిబ్బకు వెళ్లిపోయాడు వాడు. వాడిని చూసి కోనేటయ్య, తిరుపాలమ్మ, రమణమ్మల మొగాలు ఇంత అయినాయి!

వాడు కౌతాళం వెళ్లేముందే, వాళ్ల ఆవు సుభద్ర కోడె దూడను ఈనింది. అది ఇప్పుడు రెండేళ్ల గిత్త. గోధుమ, తెలుపు, పొడల మిశ్రమం గల చర్మం దానిది. కాటుక కళ్ల పొట్టకొమ్ములు. దిష్టి తగలకుండా కాలికి కంబడి తాడు చుట్టాడు కోనేటయ్య. దాని మెడలో చిరుగజ్జెలు అమర్చిన అరంగుళం వెడల్పు తోలుపట్టెడ, దాని చివర ఒక గంట వేలాడుతూంది.

వైనతేయ కూడ తమ కుటుంబ సభ్యుడని దానికి అర్థమైంది. సుభద్ర మళ్లీ చూలుతో ఉంది. ఈసారి పెయ్య దూడ పుడితే బాగుంటుందని, పాడికి కొరత ఉండదని, తిరుపాలమ్మ అనుకుంటూంది

రమణమ్మ ఆవునూ, గిత్తనూ బీట్లకి మేపుకోరావడానికిని, వాటి పలుపులు విప్పుతూంది.

“అక్కా నేను తీసుకుపోతాలే, నేనున్నన్ని నాళ్లు” అన్నాడు తమ్ముడు.

“ఈరన్న గాడు మాటినడు రా! నీవు మళ్లెయ్య లేవు!” అన్నది అక్క. ఈరన్నగాడంటే గిత్త.

“ఏం కాదు లేవే” అని అమ్మనూ కొడుకునూ తీసుకొని బీట్లకి తోలుకుపోయినాడు వైనతేయ. వీడికి మన సంగతి తెలియదులే అని ఈరన్న మంకుతనం చేయబట్టినాడు. వైనతేయ గట్టిగా ఒక గదుము గదిమేసరికి దారికొచ్చినాడు

“పెద్దరెడ్డి, గిత్తను తనకిచ్చెయ్యమని అడుగుతా ఉండాడు రా! ఆయనను మనం ఇంతిమ్మని గట్టిగా అడగలేము. దానికి జత కొనుక్కోని మనమే మన ఎలిపొలం రెండెకరాలు సేద్దిం చేసుకొని, బాడిగలకు కూడా గెడం కొట్టొచ్చు. కాని అంత స్తోమత యాడుండాది మనకు? ఈరన్న అంటే మనింట్లో పుట్టినాడు గాని, వానికి జత గిత్త త్యావాలంటే, గోరంట్ల మాదవ సామి తిర్నాలకు బోవాలి. పది పన్నెండు వేలు పెట్టాల”

“మరి ఎట్లా నాయినా?”

“మనమే గోరంట్లలో ఈరన్నను అమ్ముకోని వస్తే, అక్క పెండ్లికి ఆ దుడ్డు పనికి వస్తాది కదా అని ఆలోచిస్తా ఉండాను”

వైనతేయ ఆలోచించినాడు.

“అట్లా ఒద్దులే నాయినా! పెదరెడ్డికి చెడ్డయితాము. ఆయనకీ ఈరన్నను తోలిస్తే, నీవు రోజూ వాన్ని చూసుకోవచ్చు. వానిమీద ఎదారు (బెంగ) బడితే అమ్మ గూడ వచ్చి చూడవచ్చు అక్క పెండ్లికి రెడ్డినే సాయం చెయ్యమందాము”

అంత చిన్న వయసులో, వాడికున్న ఆలోచనలకు కోనేటయ్యకు అబ్బురమనిపించింది.

“నీవు చెప్పింది గుడ్క సలీసు గనే ఉంది కొడుకా” అన్నాడు.

చేనిలో తెల్లజొన్న వేసినారు. మధ్యలో కంది చెట్ల అక్కిళ్లు (వరుసలు). ఉన్నన్ని రోజులు చేనికి పోయి తానూ అమ్మతో, అక్కతో బాటు పని చేసేవాడు వైనతేయ.

ఒక రోజు తండ్రితో బాటు శేషశయనారెడ్డి గారింటికి వెళ్లాడు, కోటకొండకు. బెంగుళూరునుంచి, రెడ్డి గారి బిడ్డ, అల్లుడు వచ్చి ఉన్నారు. తాను పేరుపెట్టిన పిల్లవాడు పెద్దవాడై, సంగీతంలో శిక్షణ పొందుతున్నాడని, హరికథలు చెపుతాడని విని, చిన రెడ్డెమ్మ కౌసల్య సంతోషపడింది. వాడి మాట తీరు, కల్చర్ అన్నీమారినట్లు గ్రహించిందామె.

కోనేటయ్య మాంసం కూరకు మసాలా నూరియిస్తున్నాడు వైనతేయ. కౌసల్య వచ్చి, “అబ్బాయి, ఏదైనా మంచి పాట పాడుదువుగాని రా. మా ఆయన కూడా వింటాడు” అని పిలిచింది.

వెళ్లి హాల్లో కూర్చున్నారు అందరూ. శేషశయనా రెడ్డికి, ఆయన భార్యకూ – ‘యానాది పిల్లాడేంది. సంగీతం నేర్చుకోవడమేంది, మిడిమ్యాలం కాలాలు కాకపోతే?’ అని కొంచెం అసహనంగానే ఉంది. కాని, బిడ్డ అల్లుడు ఈ ఆధిపత్య భావన నుంచి ఎప్పుడో బయటపడినవారు. దానికి కారణం, వారు పెద్ద చదువులు చదివి, ఒక మహా నగరంలో ఉద్యోగం చేయడమే. చదువు, బయటి ప్రపంచంతో ఎక్స్‌పోజర్ వారికి విశాల దృక్పథాన్ని అలవర్చాయి.

“ఆ కుర్చీలో కూర్చో నాన్నా” అన్నది కౌసల్య.

పెదరెడ్డి ముఖం చిట్లించాడు. కాని వాడు కూర్చోలేదు. ‘అనువుగాని చోట

అధికులమన రాదు’ అని వానికి తెలుసు.

“వద్దు రెడ్డెమ్మా, నిలబడే పాడుతా” అన్నాడు వినయంగా.

“నన్ను అక్కా అని పిలువురా, పరవాలేదు!” అన్నదామె.

ఈసారి పెదరెడ్డిమ్మ ముఖం చిట్లించింది.

మరీ శాస్త్రీయమైతే వాళ్ళకు నచ్చకపోవచ్చని వాడికి తోచింది. కొంచెం లయ ప్రధానమ్గా సాగే, ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మ మొక్కటే’ అన్న, అన్నమయ్య కీర్తన అందుకున్నాడు.

కూతురు, అల్లుడు పాటను బాగా ఎంజాయ్ చేశారు. ఒక చరణంలో, “మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే, ఛండాలుడుండేటి సరిభూమి యొకటే”, “కడగి యేనుగు మీద గాయు యెండొకటే, పుడమి శునకము మీద బొలయు నెండొకటే” అని వస్తుంది.

కౌసల్య అడిగింది, “ఇది ఏ రాగం!?”

“బౌలి రాగం రెడ్డెమ్మా! ఆదితాళం”

పెదరెడ్డి అన్నాడు “ఆయన అట్ల రాసినాడు గాని, అందరూ ఒకటే.. ఎట్లా అయితారు? యాడుందే వాండ్లు ఆడ ఉండాల”

అల్లుడు జాలిగా మామవైపు చూశాడు. ఏదో అనబోతూంటే కౌసల్య కళ్ళతోనే వారించి ఇలా అంది ఇంగ్లీషులో

“ఫర్ జనరేషన్స్, దే హ్యావ్  బీన్ విత్ దట్ డిస్క్రిమినేటివ్ యాటిట్యూడ్. మహీ! బెటర్ నాట్ టు ఆర్గ్యూ విత్ దెమ్.”

మహీపాల్ రెడ్డికి అర్థమై, నవ్వినాడు.

“చాలా బాగా పాడినావు రా, వైనతేయ!” అన్నాడు.

“తిరుపతిలో చేరనీకె బోతాండాడు రెడ్డీ, మావోడు! ఆడ సంగీతం బడి ఉండాదంట, దేవస్తానం వాండ్లది. ఏడవ తరగతి వరకు ఆడనే చదువుకుంటాడంట. అంతా వాండ్ల దస్తగిరిసారు దయ. కౌతాళంలో వాని గురువుగారి దయ” అన్నాడు పాట చివర్లో వచ్చి అక్కడ నిలబడిన కోనేటయ్య.

“దటీజ్ వండర్‌ఫుల్!” అన్నాడు భార్యతో మహీపాల్ రెడ్డి. “ప్రాపర్ ట్రెయినింగ్ విల్ ఫర్దర్ ఎన్‌హాన్స్ హిజ్ ఆర్ట్” అన్నది కౌసల్య. మళ్లీ రెడ్డి, రెడ్డెమ్మ, మొగాలు మాడ్చుకున్నారు.

తండ్రి చూడకుండా, వాడి జేబులో వంద రూపాయలు పెట్టింది కౌసల్య. “బాగా చదువుకోరా. హరికథలు నేర్చుకో గాని, దానితోనే బ్రతకటం కష్టం. చదువుకుని ఉద్యోగం చేయి” అన్నది.

తర్వాత కొన్ని రోజులకే ఈరన్నను పెదరెడ్డికి యిచ్చేటట్లు, దానికి బదులుగా రమణమ్మ పెండ్లి ఖర్చులు మొత్తం ఆయనే భరించేటట్లు మాట్లాడుకున్నారు. అలా అయినా, తనకే లాభం అని శేషశయనారెడ్డికి తెలుసు.

కౌసల్య ఇచ్చిన నూరు రూపాయాల నోటు నాయినకిచ్చేసినాడు వైనతేయ. మరో వారం రోజుల్లోనే దస్తగిరిసారు, వాడిని వెంట పెట్టుకొని కౌతాళం చేరుకున్నాడు.

***

ఆంజనేయ శర్మగారు వీళ్ళ కోసం ఎదురుచూస్తున్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాలలో పని చేస్తు న్న తన మిత్రుడు షడ్డకుడు కైప సదాశివశర్మ గారికి ఆయన ఇదివరకే ఉత్తరాలు వ్రాసి ఉన్నాడు. మొన్ననే ఆయన దగ్గరనుంచి ‘అన్ని ఏర్పాట్లు చేసినాననీ, బయలుదేరి వచ్చేయమ’నీ ఉత్తరం వచ్చింది.

వస్తూనే శర్మగారి పాదాలకు నమస్కరించాడు వైనతేయ.

“విద్యావాన్ భవ! యశస్వీ భవ! నీ వినయమే నిన్ను ఉన్నతస్థాయికి తీసుకుని పోతుందిరా నాయనా!” అని దీవించాడాయన.

మర్నాడు ఉదయాన్నేవారి ప్రయాణం. శర్మగారు బయట ఏమి తినరు. బియ్యపు నూక ఉప్మా, పుట్నాల పొడి, తపేలాంట్లు చేసి యిచ్చింది శర్మగారి భార్య వల్లెలాంబ. తెల్లవారు జామున మూడున్నరకే లేచింది.

కౌతాళం నుంచి గుంతకల్‌కు మొదటి బస్సు నాలుగున్నర గంటలకు. వెళ్లేముందు గురుపత్నికి ప్రణమిల్లాడు వైనతేయ. ఆమె వాడిని గుండెలకు హత్తుకోని, దీవించింది.

“జాగ్రత్త నాయనా, కొత్త చోటు. నీవల్ల నీ సారుకు, స్వామికి మంచి పేరు రావాల” అన్నదామె. కాఫీలు తాగి బయలుదేరారు. వారు అలూరు మీదుగా 83 కి.మీ. ప్రయాణించారు. గుంతకల్ బస్టాండుకు ఆరున్నరకు చేరుకున్నారు.

అక్కడ నించి రిక్షాలో గుంతకల్ రైల్వే స్టేషన్ చేరుకొన్నారు. ఐదవ నంబరు ప్లాట్‌ఫారంపై ఉన్న గుంతకల్ – తిరుపతి ప్యాసెంజరు రైలు ఎక్కి  కూర్చున్నారు.

వైనతేయకు రైలు ఎక్కడం ఇదే మొదటిసారి. గుంతకల్ జంక్షన్ చాలా పెద్ద స్టేషను. ఇటు బెంగుళూరు, అటు సికింద్రాబాదు బొంబాయి, అటు మద్రాసు, వెళ్లే రైళ్ళకు కూడలి.

రైలు పెద్దగా రద్దీగా లేదు. వైనతేయను కిటిక దగ్గర కూర్చోమన్నాడు దస్తగిరిసారు. పావు తక్కువ పదికి ధర్మవరం జంక్షన్ వచ్చింది. కంచు చెంబుతో కుళాయిలో నీళ్లు పట్టి తెచ్చాడు సారు. అక్కడ రైలు పావు గంట ఆగింది. మధ్యలో అనంతపురంలో మాత్రం రెండు నిమిషాలే అగింది.

ముగ్గురూ బియ్యపు నూక ఉప్మా తిన్నారు. దస్తగిరిసారు టీ తాగాడు. తెల్లవారు జామునే లేవడం వల్ల వైనతేయ కళ్లు మూతలు పడుతున్నాయి. కిటికీనానుకునే జోగుతూ ఉంటే, దస్తగిరి సారు వాటిని తలను తన తొడ మీద పెట్టుకోని, సరిగ్గా పడుకోబెట్టాడు

రైలు కదిరి దాటింది, మదనపల్లె రోడ్ వచ్చింది ప్రతి స్టేషనులో ఆగుతూ ఉంది. ఎక్స్‌ప్రెస్ రైళ్ల కోసం, క్రాసింగ్‌ల కోసం ఎక్కడబడితే అక్కడ ఆపేస్తున్నారు. అది పీలేరు చేరుకునే సరికి రెండున్నర. అంటే గంటన్నర లేటు!

అకడ ముగ్గురూ తపేలాంట్లు తిన్నారు. బియ్యపుపిండి, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, పచ్చికొబ్బెర – కచ్చాపచ్చాగా దంచి కలిపి, తగినంత నీళ్లు పోసి, ముద్ద చేసి, ఒక కంచు తపేళాకు అపలివైపు పల్చగా తట్టుతూ, కరిపిస్తారు. కర్రల పొయ్యి లేదా బొగ్గుల పొయ్యి మీద ఆ కంచుగిన్నెను పెడితే గిన్నె ఆకారంలో తపేలాంటు కాలి, చక్కగా ఊడి వస్తుంది. రాయలసీమలో చాలా ప్రసిద్ధి పొందిన టిఫిన్ అది. బ్రాహ్మణులు ఎక్కువగా చేసుకుంటారు. తర్వాత దాన్ని పెనం మీదే వత్తి కాల్చుకోవడం మొదలుపెట్టారు. కాని తపేళాలో తట్టి చేస్తే వచ్చినంత రుచి రాదు. పాకాలలో చాలా సేపు ఆగింది రైలు. అలసంద మసాలా వడలు అక్కడ గంపలలో పెట్టుకోని అమ్ముతున్నారు.

శర్మగారు నవ్వుతూ, “మీరిద్దరూ తినండి, నాయనా!” అన్నారు.

చెరో నాలుగు తిన్నారు గురుశిష్యులు. అవి చాలా రుచిగా ఉన్నాయి. నంచుకోవడానికి అంత కారం లేని పచ్చిమిరపకాయ ఇచ్చాడు. మొత్తానికి తొమ్మిది గంటలకు, అంటే రెండు గంటలు ఆలస్యంగా రైలు తిరుపతి చేరింది.

రిక్షాలో శివశర్మగారింటికి చేరుకొన్నారు. ఆయన యిల్లు ‘బైరాగిపట్టెడ’ లో ఉంది. తిరుపతి నగరాన్ని విప్పారిన కళ్లతో చూడసాగాడు వైనతేయ.

సదాశివశర్మ గారిల్లు చిన్నది. కాని సొంతిల్లు. ఆయన తన తోడల్లుడు ఆంజనేయశర్మను ఆప్యాయంగా పలుకరించాడు. ఆయన భార్య వకుళమ్మ, వల్లెలాంబ, అక్కాచెల్లెళ్లు. వల్లెలాంబ పెద్దది.

వకుళమ్మ అందరికీ భోజనాలు వడ్డించింది. కులం అనేదే పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న ఆ దంపతులకు మనసు లోనే ప్రణమిల్లాడు దస్తగిరిసారు.

“రైల్లో ఏమి తిన్నారో, ఎప్పుడు తిన్నారో నాయనా, నిదానంగా కూర్చోండి” అన్నదామె.

కొబ్బరి, పెసర పచ్చడి, నల్ల నువ్వులపొడి, అరటికాయ ముద్ద కూర, చారు చేసింది ఆ అన్నపూర్ణమ్మ తల్లి.

“అన్నీ కౌతాళం అమ్మ చేసినట్లే ఉన్నాయి” అన్నాడు వైనతేయ.

“మీ అమ్మగారి చెల్లెలే కదా ఈమె? ఇద్దరూ మా అత్తగారి వద్ద వంట నేర్చుకొన్నవారే!” అన్నారు శర్మగారు నవ్వుతూ.

వరండాలో చాప పర్చుకుని గురుశిష్యులు నిద్రబోయినారు. శర్మగారికి హాల్లో నవారు మంచం ఏర్పాటు చేసినారు.

ఉదయం అందరూ హాల్లో కూర్చున్నారు. వకుళమ్మ అందరికీ కాఫీ యిచ్చింది.

సదాశివశర్మగారు అన్నారు.

“ఏదీ, ఒక పద్యమో, శ్లోకమో, కీర్తనో పాడమనండి అన్నయ్యా, మీ శిష్యుడిని. మీరు  ఉత్తరాల్లో వాడి ప్రతిభ గురించి అంతగా రాసింతర్వాత, వాడి గాత్రం వినాలని ఉంది.”

వకుళమ్మగారు కూడా కూర్చున్నారు.

వైనతేయ శర్మగారికి మొక్కి

“కల్యాణాద్భుత గాత్రాయా..” అన్న శ్లోకాన్ని బిలహరి రాగంలో ముందు ఆలపించి, తర్వాత అన్నమాచార్యుల కీర్తన, “ఎన్నడు విజ్ఞానమిక నాకు, విన్నపమిదే. శ్రీ వేంకటనాథా” పాడాడు.

“పాసిన పాయవు బంధములూ, ఆశ దేహమున్నన్నాళ్లు

తోసిన, తొలగవు, కోరికలూ, గాసిలి, చిత్తము కలిగినన్నాళ్లు”

అన్న చరణం పాడుతున్నపుడు ఆ పిల్లవాడి గొంతులో పలికిన వైరాగ్యం సదాశివశర్మగారికి అచ్చెరువు కలిగించింది. “ఇది ఏ రాగం నాయనా?” అని ఆయన అడిగితే

“శివరంజని రాగం స్వామి!” అని వినయంగా బదులిచ్చాడు.

“మీరిరువురూ ఈ పిల్లవాడి కోసం ఎందుకు ఇంత తపిస్తున్నారో నాకిపుడు అర్థమైంది. వీడు సామాన్యుడు కాదు. గరిమెళ్ల బాలకృష్ణ  ప్రసాద్ గారి తర్వాత, అంత భావయుక్తంగా ఆ కీర్తన పాడడం వీడికే సాధ్యమైంది” అన్నారాయన.

వైనతేయ వినయంగా ఆయనకు నమస్కరించాడు. సదాశివశర్మగారు ఇలా వివరించారు.

“అన్నయ్యా, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల మాకు అంత దూరమేమి కాదు. బాలాజీ కాలనీ అని ఉంది. అక్కడ ఇందిరానగర్, వేశాలమ్మ గుడి వీధిలో ఉందా కళాశాల.

మనవాడిని పార్ట్ టైం ఈవెనింగ్ కోర్సులో చేర్పిస్తాను. అడ్మిషన్ గురించి బాధ లేదు. చెప్పిపెట్టాను. రోజూ సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు గంటల వరకు హరికథ కోర్సు. సర్టిఫికెట్ కోర్సది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపు ఉంది ఆ సర్టిఫికెట్‌కు.

కాని, పార్ట్ టైం వాళ్లకు హాస్టల్ వసతి ఉండదు. మా బైరాగిపట్టెడ లోనే పక్కవీధిలో మున్సిపల్ హైస్కూలు ఉంది. అక్కడ అరవ తరగతిలో చేర్పిద్దాం. మా దేవస్థానం వారి సంక్షేమ వసతిగృహం కూడ దానికి అనుబంధంగా ఉంది. ఈ రెండేళ్లు అక్కడ ఉంటాడు.

బడి అయింతర్వాత సంగీత కళాశాలకు వెళతాడు. మూడు కిలోమీటర్లుంటుంది. ఒక సైకిలు కొనిస్తే సరి. రోజూ దాని మీద వెళ్లివస్తాడు” .

“తప్పకుండా కొనిద్దాము స్వామి” అన్నాడు దస్తగిరిసారు.

“పార్ట్ టైం కోర్సుకు రెగ్యులర్ ఆచార్యులు ఉండరు. ఎవరో ఒకరు ఆ సమయానికి వెళ్లి బోధిస్తారు. నేను పుల్ టైం విశారద డిప్లోమా కోర్సుకు వెళతాను, శాస్త్రీయ సంగీతం. అప్పుడపుడు దీనికి కూడా వెళ్తాను. నా మిత్రుడు ముప్పవరపు సింహాచలశాస్త్రిగారు పార్ట్ టైమ్ హరికథా కోర్సును పర్యవేక్షిస్తుంటారు. ఆయన గొప్ప హరికథా విద్వాంసుడు.”

“అయ్యో! ఆయన గురించి తెలియని వారెవరు?” అన్నారు శర్మగారు.

“ఆదివారాలు నా దగ్గరకు వస్తూండరా! అట్లే ఉదయం పూట ఒక గంట కూచుందాము. మా అన్నయ్య నీకు నేర్పిన విద్యకు నేను మెరుగులు దిద్దుతానులే” అన్నారు సదాశివశర్మగారు.

ఆ రోజే వెళ్లి పార్ట్ టైం హరికథ కోర్సులో చేరాడు వైనతేయ. బైరాగిపట్టెడలోని మున్సిపల్ హైస్కూలులో ఆరవ తరగతిలో చేరాడు. టిటిడి వారి వసతిగృహం కూడా పక్కనే.

దస్తగిరిసారు వాడికి మర్నాడు అట్లాస్ గోల్ లైన్ సైకిలు కొనిచ్చాడు. దగ్గర ఉంచుకోమని మూడు వందలిచ్చాడు. ఆ డబ్బును వకుళమ్మకిచ్చాడు వాడు. అవసరమైనపుడు తీసుకొంటానన్నాడు.

“ప్రతి ఆదివారం భోజనానికి మనింటికి వచ్చేయి నాయనా!” అని చెప్పిందామె.

వాడిని వదలిపెట్టి, తిరిగి వెళ్తూ ఉంటే, దస్తగిరిసారుకు, ఆంజనేయశర్మ గారికి మనసు ఆర్ద్రమైంది.

“ప్రతివారం జాబులు వ్రాస్తూండు. ముఖ్యంగా అమ్మా వాళ్లకు. జాగ్రత్త!” అని చెప్పి వెళ్లిపోయారు.

(ఇంకా ఉంది)

Exit mobile version