[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమారమణ’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము. డల్లాస్ లోని సిరికోన సంస్థ – నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది.]
[నాదనీరాజనం కార్యక్రమంలో హరికథాగానం చేసేందుకు దక్కిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటాడు వైనతేయ. ‘కుచేలోపాఖ్యానం’ కథని గొప్పగా చెప్పి అందరినీ ఆకట్టుకుంటాడు. పోతన పద్యాలను సందర్భోచితంగా ఉపయోగించుకుని హరికథని రక్తి కట్టిస్తాడు. ముందువరుసలో కూర్చున్న సదాశివశర్మగారు, వకుళమ్మగారు అబ్బురపడతారు. కృష్ణుడు, కుచేలుడి స్నేహబంధాన్ని అత్యంత హృద్యంగా ఆవిష్కరిస్తాడు వైనతేయ. కాలప్రవాహంలో ఐదేళ్ళు గడిచిపోతాయి. వైనతేయకు కోడుమూరు హైస్కూలుకు, దస్తగిరిసారుకు ఉళిందకొండ అప్పర్ ప్రైమరీ స్కూలుకు బదిలీ అవుతుంది. వైనతేయ విజయప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది. ప్రాచీన సాహిత్యంలోని ‘వ్యక్తిత్వవికాస పరిమళాలు’ అనే అంశం ఆధారంగా అతడు రూపొందించిన ‘వ్యక్తిత్వశిల్పము’ అనే హరికథ బహుళ పాచుర్యం పొందుతుంది. అతనికి ‘మోటివేషన్ మాస్టర్’ అని పేరు వస్తుది. వ్యక్తిత్వ వికాసం మీద, ఆంగ్లంలోనూ, తెలుగులోను చక్కని పుస్తకాలు రాస్తాడు. పబ్లిషర్స్ నుంచి రాయల్టీ కూడా వస్తూంటుంది. దస్తగిరిసారు చూసిన శర్మిష్ఠ అనే అమ్మాయిని పెళ్ళి చేసుకుని కాపురం పెడతాడు వైనతేయ. ఎన్నో ప్రబంధాలను కావ్యాలను, ఆంగ్ల నాటకాలను హరికథలుగా మలచి ప్రాచుర్యం లోకి తెస్తాడు. – ఇక చదవండి.]
ఖరగపూర్ తెలుగు సంఘం వారు శ్రీరామనవమి ఉత్సవాల్లో వైనతేయ హరికథాగానాన్ని ఏర్పాటు చేశారు. ‘సీతారామ దాంపత్యం’ అన్న హరికథను రూపొందించి, ఆ ఆదర్శ దంపతుల అన్యోన్యతను, అసాధారణ వ్యక్తిత్యాలను, విశదపరచాడు. అతడు శ్రీరామచంద్ర ప్రభువును గురించి పాడిన ప్రార్థనా శ్లోకం, రేవగుప్తి రాగంలో, సభికులను పరవశింప చేసింది. అది శ్రీరామరక్షాస్తోత్రం లోనిది. శ్రీ బుధ కౌశికముని విరచితము. సీతా సమేతదైన దాశరథిని మన కండ్ల ముందు నిలబెడుతుందా శ్లోకం. ప్రార్థనా శ్లోకాలు కూడా విభిన్నంగా, వినూత్నంగా, భావస్ఫోరకంగా ఉండే విధంగా జాగ్రత్త పడేవాడు వైనతేయ.
“ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం
పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్
వామాంకారూఢ సీతాముఖ కమలమిలల్లోచనం నీరదాభం
నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్”
సీతమ్మవారు గుడ్డిగా మగని అనుసరించ లేదనీ, అవసరమైనపుడు ఆయనను ప్రశ్నించేదనీ వైనతేయ చెప్పినపుడు సభికులు ఆక్షర్యపోయారు. స్వామికి ఆమె మీద పూర్తి విశ్వాసం ఉందనీ, అయినా లోకం దృష్టిలో ఆమెకు ఏ నిందా రాకుండా, అగ్నిపరీక్షకు ఆదేశించాడనీ చెప్పాడు. ఇలా ‘సీతారాముల దాంపత్యం’ ఆ పుణ్యదంపతులను కొత్త కోణంలో ఆవిష్కరించింది.
షేక్స్పియర్ నాటకాలలో బాగా ప్రాచుర్యం పొందిన కొన్నింటిని, మన నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి, హరికథలుగా రూపొందించాడు. ఒథెల్లో, హామ్లెట్, మర్చంట్ ఆఫ్ వెనిస్, కింగ్ లియర్, హెన్రీ ఫోర్ లాంటివి. అతడు తెలుగులో వ్రాసిన పద్యాలు, పాటలు, వాటికి కూర్చిన రాగాలు, ప్రజలను మంత్రముగ్ధులను చేసేవి.
మైసూరులో, శ్రీగణపతి సచ్చిదానంద స్వామి వారు నెలకొల్పిన దత్తపీఠంలో, వైనతేయ గానం చేసిన హరికథ ‘శ్రీదత్త విజయము’ దత్తాత్రేయ తత్త్వాన్ని, కులాతీతమైన ఆ మహనీయుని మహోన్నత మానవత్వాన్ని ఆవిష్కరించింది. పీఠాధిపతి వైనతేయ విద్వత్తుకు ముగ్ధులై, అతనికి ‘హరికథాహర్యక్ష’ అనే బిరుదును బహూకరించారు. వినమ్రుడై సచ్చిదానంద స్వామి వారికి ప్రణమిల్లాడు. ‘స్మర్తృగామి సనోవతు’ అన్న మకుటంతో, ‘దర్బార్ కన్నడ’లో అతడు పాడిన ‘దత్తస్తవము’ అలరించింది. ‘బెనారస్ హిందూ యూనివర్సిటీలో అతడు చెప్పిన ‘స్వామి వివేకానంద’ హరికథ అతనికి ఎంతో పేరు తెచ్చింది. మతము, మూఢభక్తి, పట్ల వివేకానందులవారి సాహసోపేతమైన వ్యాఖ్యలు వివరిస్తూ వైనతేయ సింహంలా గర్భించాడు.
“Your bhakti is nothing but sentimental Non-sense!”
“There is no religion for empty bellies”
విశ్వమానవులందరినీ సోదరసోదరీమణులుగా సంబోధించి, చికాగో సర్వమత సమ్మేళనంలో హిందూమత ప్రాశస్త్యాన్ని ఆయన ఎలా చాటి చెప్పాడో వైనతేయ ఉద్విగ్నభరితుడై అభినయించాడు. 1893లో స్వామి చెప్పిన మాటలను Recreate చేసి చూపాడు.
“I thank you in the name of the most ancient order of monks in the world, I thank you in the name of the mother of religions, and I thank you in the name of millions and millions of Hindu people of all classes and sects.”
“I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance. We believe not only in universal toleration, but we accept all religions as true.”
ఆయన ‘కోట్’ చేసిన ఒక మహాసత్యాన్ని వైనతేయ ఇలా చెప్పాడు. అతని గంభీరమైన స్వరం, స్పష్టమైన ఉచ్చారణ, స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్, బి.హెచ్.యు లోని ఆచార్యులను, విద్యార్థులను మంత్రముగ్ధులను చేశాయి.
“As the different streams having their sources in different places all mingle their water in the sea, so, O Lord, the different paths which men take through different tendencies, various though they appear, crooked or straight, all lead to Thee.”
బి.హెచ్.యు లోని తెలుగుశాఖ ఆహ్వానం మీద వైనతేయ వెళ్ళాడు. దాని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ (HOD) వరంగల్‌కు చెందిన మనోహర్ గారు. వివేకానందుని ఉపన్యాసానికి వైనతేయ వ్రాసిన తెలుగు పద్యాలను విని ఆయన ఆనందబాష్పాలు కార్చారు.
ఉ.:
ఆ చిరయోగిశ్రేష్ఠుల పరంపరకున్, మత రాజమాత
గాచెడు హైందవంబునకు కర్మసుభూమికి, భారతావనిన్
వీచిన విశ్వప్రేమకును, ప్రేమపు పుత్రుడ నేను, మీకిదే
నోచెద జోతలన్, సకలమున్నను భారత జాతి పంపునన్”
కల్యాణి రాగంలోని ఈ పద్యం సభికులకు శ్రవణానందమైంది. దస్తగిరిసారు హార్మనియం పదును తేలింది.
కం.:
మేదినికెల్లను తనదౌ
నౌదార్యము, సహన శీలమది పంచిన మా
వేదసుభూమికి చెందెద
నే దైనను మతము మాకు నెయ్యము గలుగున్
తే.గీ.:
వివిధ మార్గములన్నియు, విశ్వమతము
లెన్నియున్నను విశ్వాస రీతులన్ని
భిన్నమయ్యును, పరమాత్మ! నిన్ను జేరు
మార్గమున సాగి కైవల్య ప్రాప్తి నొందు!
విశ్వవిద్యాలయ ఉపకులపతివారి చేతుల మీదుగా వైనతేయకు ఘనసన్మానం జరిగింది. అదే సభలో అతనికి బి.హెచ్.యూ నుండి గౌరవ డాక్టరేట్‌ను బహూకరించారు. అలా, వైనతేయ, డా. వైనతేయ, హరికథాహర్యక్ష, మోటివేషన్ మాస్టర్ అయినాడు.
బెంగుళూరు, సి.పి. బ్రౌన్ సాహిత్య సమితి వారు అతనిని తమ వార్షికోత్సవానికి ఆహ్వానించారు. విశ్వజనీనమైన, హ్యుమన్ రెలెవెన్స్ ఉన్న టాపిక్‌ను, ఏదైనా, హరికథాగానం చేయమన్నారు. ‘ఒథెల్లో’ నాటకాన్ని హరికథగా రాశానని అసూయ, చెప్పుడు మాటలు వినడం, భార్య శీలాన్ని అనుమానించడం వంటి సార్వకాలీనమైన అంశాలు దానిలో ఉన్నాయని వారితో చెప్పాడు వైనతేయ. వారు సంతోషంతో అంగీకరించారు
మల్లేశ్వరం లోని ‘శ్రీకృష్ణదేవరాయ కళామందిరం’లో హరికథా ప్రదర్శన ఏర్పాటయింది.
అతడు చేసిన విఘ్నేశ స్తుతి చమత్కారంగా ఉండి అందరినీ నవ్వించింది.
శ్లో॥
“భూనాయకం వా ధననాయకం వా
భజన్ భువం వా ధనమేతి లోకే,
తద్విఘ్ననాథం న భజామి కిన్తు
సహస్ర శస్తం ప్రణమామి నిత్యమ్”
మిత్రులారా! చూసారా ఈ కవి గడుసుదనం! ఈయన అజ్ఞాతకవి. ‘భూ నాయకుడిని ప్రార్థిస్తే భూమిని, ధననాయకుడిని ప్రార్థిస్తే ధనాన్ని ఇస్తారు. కాని, విఘ్ననాయకుడిని పార్థిస్తే? విఘ్నాలిస్తాడేమో? బాబోయ్! వద్దు స్వామి! ఒక నమస్కారం పెట్టి ఊరుకుంటాను’ అంటున్నాడు.”
సభలు నవ్వులు పువ్వులై విరిశాయి!
“చెప్పేది ఇంగ్లీషు నాటకమైనా, మన వినాయకుడిని స్తుతించకపోతే ఎట్లా?” అనగానే మళ్లీ నవ్వులు!
“ఒథెల్లో నాటకం షేక్స్పియర్ రాసిన అద్భుత విషాదాంత నాటకం. 1603లో దీనిని ఆయన రాసినా, ఈ రోజుకూ దాని లోని ఇతివృత్తం సజీవంగానే ఉంది.
ఇందులో మూడు ముఖ్యపాత్రలు. ఒథెల్లో వెనిస్ సామ్రాజ్యానికి సేనాధిపతి, మూరిష్ జాతీయుడు. డెస్డిమోనా, ఒక ఉన్నత వంశీయుని కూతురు. అద్భుత లావణ్యం, సౌందర్యం, ఆమె సొంతం. దేశాన్ని ఎన్నో యుద్ధాల్లో విజీతగా నిలిపిన ఒథెల్లోను ఆమె ప్రేమిస్తుంది. అతడు అందగాడు కాదు. ఇరువురి జాతులు వేరు. వివాహం నిషిద్ధం. రాజుగారు వీళ్లను పిలిపిస్తారు.”
“ఎందుకమ్మాయీ! ఈ ఒథెల్లోను ప్రేమించావు? అందంలో, వంశంలో నీకంటే తక్కువ స్థాయివాడు కదా!” అంటారు రాజుగారు.
అప్పుడామె అంటుంది – “I loved him for the dangers he had passed.
మహారాజా!
కం.:
భీకరయుద్ధంబుల, తన
దౌ కరవాలంపు పటిమ, తన భూమికి దా
చౌకూర్చె విజయమీ తని
తౌకువ ప్రేమించితితని తెగువ వలచితిన్.”
రాజుగారు “శభాష్ తల్లీ!” అన్నారు.
“మరి నీవెందుకు ఈమెను ప్రేమించినావు, సేనానీ?” అని ఒథెల్లో నడిగారు.
“I loved her because she loved me!” అని అతని జవాబు.
సభలో చప్పట్లు మోగాయి.
ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. ‘భార్యా రూపవతీ శత్రుః’ అని మన వాళ్ళు చెప్పనే చెప్పారు. అతనిలో ఏదో తెలియని ఒక న్యూనతాభావం! కానీ, తన అనురాగంతో ఆ ఇల్లాలు దానిని మరువ చేసింది!
మూడవ పాత్ర ‘ఇయగో’. అతనికి రావల్సిన ఉన్నత పదవి ఒథెల్లో కొచ్చినందుకు ఇయగో అసూయతో రగిలిపోతుంటాడు. మిత్రులారా, అసూయ చాలా చెడ్డది. సుయోధనుడు దాని తోనే నశించాడు. దానికి తారతమ్యాలుండవు. తెలుగుజాతి గర్వించే దర్శకులు కె. విశ్వనాధ్ గారు ఈమధ్య ఒక సినిమా తీశారు. ‘స్వాతికిరణం!’ అందులో ఒక పెద్ద సంగీతవిద్వాంసుడిగా మమ్ముట్టిగారు నటించారు. ఆయన భార్యగా రాధికగారు అత్యంత ప్రశంసార్హమైన నటన ప్రదర్శించారు. తన దగ్గర సంగీతం నేర్చుకుంటున్న ఒక పది పన్నెండేళ్ల పిల్లవాడు తన కంటే బాగా పాడతాడని ఆయనకు అసూయ!
అంతెందుకు! తాను పని చేసే ఇంట్లో పనిమనిషికి ఆ ఇంటి అమ్మగారిని చూస్తే అసూయ! ఎందుకంటే అయ్యగారు ఆమెను ప్రేమగా చూసుకుంటారు. తన మగడేమో, తాగి వచ్చి తనను రోజూ కొడతాడు! తన సంపాదనను లాక్కుంటాడు.
దీనినే ప్రఖ్యాత ఆంగ్ల రచయిత ఫ్రాన్సిస్ బేకన్ చిన్న మాటలో చెప్పారు – envy takes no holidays! అని.
అంటే, అసూయకు సెలవుండవు! నిరంతరం అది మనిషి మనసులో పని చేస్తూనే ఉంటుంది.
అసూయాపరుడి మానసిక స్థితిని దుర్యోధన సార్వభౌముడిలా చెప్పాడు –
‘కంటికి నిద్రవచ్చునే సుఖంబగునే రతికేళి జిహ్వకున్
వంటకమిందునే, ఇతర వైభవముల్ పదివేలు మానసం
బంటునె, మానుషంబుగలయట్టి మనుష్యున కెంతవానికిన్
గంటకుడైన శాత్రవు డొకండు తనంతటివాడు గల్గినన్’
ఈ పద్యం శ్రీనాథునిది. ‘కాశీఖండం’ అనే కావ్యంలో వింధ్యపర్వతంతో చెప్పించాడు మహాకవి. దానిని యన్.టి.ఆర్ గారు తమ ‘దానవీర కరకర్ణ’లో వాడుకున్నారు, సందర్భోచితంగా!”
సభికులు అతన్ని అభినందించారు. ఒథెల్లోను తీసుకొచ్చి శ్రీనాథునితో, NTR తో ముడిపెట్టినందుకు.
“ఒథెల్లో మీద పగ తీర్చుకునేందుకు ఇయగో ఒక్ ప్లాన్ రచిస్తాడు. క్యాసియో అనే యువకుడిని, క్రమశిక్షణా చర్య క్రింద సైన్యం నుండి తొలగిస్తాడు సైన్యాధిపతి. డెస్డిమోనాను కలిసి వేడుకుంటే, ఆమె ఒథెల్లోకు చెప్పి, మళ్లీ ఉద్యోగం వేయిస్తుందని చెబుతాడు. ఆ పని మీద క్యాసియో రెండు మూడుసార్లు ఆమెను కలుస్తాడు. సహజంగానే ఆమె ఎవరితోనైనా చిరునవ్వుతో మాట్లాడుతుంది.
వారిని చాటు నుండి ఒథెల్లోకు చూపించి, ఇయగో వారిద్దరి మధ్య అక్రమసంబంధం ఉందనే అనుమాన బీజాన్ని ఒథెల్లోలో ప్రవేశ పెడతాడు. ఆ క్యాసియో అందగాడు!
భార్య చేసిన ద్రోహాన్ని తట్టుకోలేక ఆమెను గొంతు నులిమి చంపేస్తాడు. తర్వాత ఈ కుట్రలో మరో సూత్రదారి ఎమిలియా ద్వారా, డెస్డిమోనా నిర్దోషి అని తెలిసి, తానూ ఆత్మహత్య చేసుకుంటాడు!
ఈ కథను తెలుగు పద్యాలతో, పాటలతో వైనతేయ హృద్యంగా అభినయిస్తూ ఉంటే, సభికులు మైమరచిపోయారు.
ఒకాయన ఇలా అన్నాడు – “ఒకసారి ‘రంగశంకర’ ఆడిటోరియంలో బళ్ళారి రాఘవ గారి ఒథెల్లో ఏకపాత్రాభినయం చూశాను. అలాంటి రససిద్ధిని ఈ ప్రతిభావంతుడు మళ్ళీ కలిగిస్తున్నాడు” అని కంటనీరు పెట్టుకున్నాడు.
ఏ పాపమూ ఎరుగని డెస్డిమోనా భర్త చేతిలో చనిపోతుంటే సభికులు కదిలిపోయారు. కొందరు స్త్రీలు వెక్కివెక్కి ఏడ్చారు!
ఆమె చివరి మాటలివి –
ఎమిలియా అడుగు తుంది, భయభ్రాంతురాలై!
“O! who hath done this deed? ఎవరు చేశారీ ఘోరం?”
“No body, I myself. Farewell. Commend me to my kind Lord.”
భర్తను నిర్దోషిగా చెబుతుంది. తానీ ఆత్మహత్య చేసుకుంటున్నానంటుంది. నా భర్తకు నా గురించి మంచిగా చెప్పమని వేడుకుంటుంది. అది ఆమె చివరి కోరిక. ఆమె మాటలను వైనతేయ పద్యంగా మలచి ఆలపించిన తీరు సభికుల గుండెలను పిండేసింది.
భూపాలరాగమది.
ఉ.:
నాదగు ఈ పరిస్థితికి నాథుడు బాధ్యుడు కాడు, నేనిటుల్
కాదనుకొంటి జీవితము, కారు మరెవ్వరు దీని కారణం
బేదను చింత దక్కి నను ప్రేమను పంచెడు ధర్మపత్నిగా
నా దర మొప్ప జెప్పవలె; నా పతి కీవు ఎమిలియా! తగన్”
తప్పు తెలుసుకొన్న ఒథెల్లో తీవ్ర మానసిక వేదనకు గురిఅవుతాడు
“I kissed thee ere I killed thee. No way but this, Killing myself, to die upon a kiss.”
“Then must you speak, of one that loved not wisely, but too well.”
వైనతేయ కూర్చిన పద్యం, మోహనలో!
‘నిన్ను కడ తీర్చుటకు ముందు నీకు నేను
ముద్దు బెడితిని; నను నేను ముగియ జేతు
నిన్ను ప్రేమించితిని గాని, నేర్వనైతి
సుంత సువివేకమును బ్రేమ, సుదతి యందు!’
సభికులందరూ కథతో కనెక్ట్ అయిపోయారు అందులో లీనమయ్యారు. కారణం ఆ పాత్రలు దేశకాలాలకు అతీతమైనవి. వైనతేయ కెరీర్లో ఈ హరికథ హైలైట్‌గా నిలిచిపోయింది.
***
అమెరికాలో ఉంటున్న పారిశ్రామికవేత్త ఒకాయన బెంగుళూరుకు వచ్చి ఉండి, హరికథకు హాజరైనాడు. ఆయన పేరు సిద్ధరామప్ప. ఒథెల్లో నాటకాన్ని హరికథగా మలచిన తీరు, ప్రస్తావవశాన ఎన్నో ఇతర విషయాలు, సమయోచితంగా జొప్పించిన వైనం ఆయనకు నచ్చాయి. ఆయన ‘కాలా’ (కన్నడ అసోషియేషన్ ఆఫ్ లాస్ ఏంజిల్స్) లో క్రియాశీల సభ్యుడు. ఆయన సి. పి. బ్రౌన్ వారి వద్ద వైనతేయ వివరాలు సేకరించుకొని వెళ్ళాడు.
కథ చిపర వైనతేయ ఇంకా ఇలా చెప్పాడు –
“జెస్సికా చాస్టియన్ అనే నటి డెస్డిమోనా పాత్రను అద్భుతంగా నటించేవారు. అట్లే లారెన్స్ ఫిష్ బర్ష్, పాల్ రాబర్సన్ లాంటి ప్రసిద్ధ నటులు ఒథెల్లో పాత్రకు జీవం పోశారు.
షేక్స్పియర్ ‘కింగ్ లియర్’ నాటకాన్ని, 1949 లోనే కె.వి రెడ్డి గారు ‘గుణసుందరి కథ’ గా సినిమా తీశారు. ఇందులో కింగ్ లియర్గా గోవిందరాజుల సుబ్బారావు గారు అద్భుతంగా నటించారు. కస్తూరి శివరావు గారికి ‘స్టార్డమ్’ తెచ్చిన చిత్రమిది.
మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు రాసిన ‘రెండు రెళ్ళు ఆరు’ అన్న నవలను జంధ్యాలగారు అదే పేర సినిమా తీశారు. ఈ కథకు కూడ ప్రేరణ షేక్స్పియర్ కామెడీ లోని ‘Mistaken Identity’ అనే కాన్సెప్టే. చంద్రమోహన్, రజని, రాజేంద్రప్రసాద్, ప్రీతి ప్రధాన పాత్రధారులు. ఒకరిని చూసి వేరొకరిగా పొరపాటు పడటమే Mistaken Identity. దీని వల్ల హస్యం పండుతుంది. షేక్స్పియర్ రాసిన ‘ట్వల్త్ నైట్’ నుండి బహుశా ప్రేరణ పొంది ఉంటారని భావిస్తాను.”
ఇలా యువతరంలో గొప్ప క్రేజ్ ఏర్పడింది, వైనతేయ హరికథల పట్ల!
(ముగింపు వచ్చే వారం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.