[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమారమణ’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము. డల్లాస్ లోని సిరికోన సంస్థ – నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది.]
[వైనతేయ బి.ఎడ్ పూర్తవుతుంది. టి.టి.డి వారు, ‘శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్’ ప్రారంభించి దానిలో ‘సాదనీరాజనం’ అనీ కార్యక్రమం ప్రసారం చేయసాగారు. అందులో ‘కుచేలోపాఖ్యానం’ హరికథ చెప్పేందుకు దరఖాస్తు చేసుకుంటాడు వైనతేయ. ఆరునెలలు గడుస్తాయి. బనగానిపల్లె జడ్.పి. హైస్కూలులో ఇంగ్లీష్ స్కూలు అసిస్టెంట్‌గా ఉద్యోగం వస్తుంది. అపాయింట్‌మెంట్ ఆర్డర్ తీసుకుని దస్తగిరిసారు ఇంటికి వెళ్తాడు. ఆయనకూ, కాశింబీ అమ్మకు పాదాభివందనం చేస్తాడు. తర్వాత ఇంటికి వెళ్ళి అమ్మానాన్నలకి ఈ వార్త చెప్తాడు. తల్లిదండ్రులని ఉద్యోగాలు మానిపించి తనతో బనగానిపల్లె తీసుకువెళ్తానంటాడు. కోనేటయ్య, తిరుపాలమ్మ పని మానేసి కొడుకు దగ్గరకి వెళ్తామంటే, సంతోషంగా పంపిస్తాడు రామ్మునిగౌడ్. వాళ్ళకి కొత్తబట్టలు పెట్టి, పదివేల రూపాయలు నగదు బహుమతిగా ఇస్తాడు. దస్తగరిసారు ఆ ఊర్లో శిష్యుడికి ఇల్లు చేసి పెడతారు. అవసరమైన సామాన్లు కొంటారు. గ్యాస్ స్టవ్, సిలిండర్ తీసుకుంటారు. కాశింబీ గ్యాస్ స్టవ్ మీద వంట ఎలా చేయాలో తిరుపాలమ్మకి నేర్పిస్తుంది. తండ్రి పని లేకుండా ఉండలేను అంటే, ఇంటి ముందే చిన్న టిఫిన్ సెంటర్ పెట్టిస్తాడు వైనతేయ. యస్.వి.బి.సి ఛానెల్, తిరుపతి నుంచి నంద్యాల దస్తగిరిసారు ఇంటికి రిజిస్టర్డ్ లెటరు వస్తుంది. ‘నాదనీరాజనం’ కార్యక్రమంలో పాల్గొనడానికి వైనతేయ ఎంపికయ్యాడనీ, తేదీ కూడా ఖరారైందనీ ఆ ఉత్తరంలో ఉంటుంది. ఆ ఉత్తరం తీసుకుని వెళ్ళి శిష్యుడిని కలుస్తాడాయన. సదాశివశర్మగారికి ఉత్తరం రాస్తారు. కార్యక్రమానికి ఇంకా నెల రోజుల సమయం ఉంటుంది. కార్యక్రమానికి రెండు రోజుల ముందే రమ్మని శర్మగారు జవాబిస్తారు. తనతో పాటు తన వారందరికి ట్రైన్ టికెట్లు రిజర్వ్ చేయిస్తాడు వైనతేయ. అందరూ తిరుపతి చేరి దేవస్థానం వారు కేటాయించిన రాంబగీచా గెస్ట్‌హౌస్‍లో దిగుతారు. స్వామివారి దర్శనం చేసుకుంటారు. మరునాడు సదాశివశర్మ గారింటికి వెళ్తారు. నాదనీరాజనం ప్రోగ్రామ్‍లో అవకాశం రావడం చాలా కష్టమని చెబుతూ, ఎంపిక కమిటీలో తానూ సభ్యుడినేననీ, కానీ వైనతేయ తన శిష్యుడవడం వల్ల తాను ఆ కమిటీ నుంచి తప్పుకున్నాననీ ఆయన చెప్తారు. కుచేలోపాఖ్యానాన్ని తాను ఎలా ‘విభిన్నంగా’ ప్రదర్శించదల్చుకున్నాడో శర్మగారికి వివరిస్తాడు వైనతేయ. ఆయన కొన్ని సూచనలు చేస్తారు. ముగ్గురూ రిహార్సల్స్ చేసుకుంటారు. – ఇక చదవండి.]
నాద నీరాజనం చాలా పెద్ద వేదిక. సహజంగానే, స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు దానికి హాజరవుతారు. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం అది. యాంకర్ అముక్తమాల్యద గారు వైనతేయను సభికులకు పరిచయం చేశారు. దస్తగిరిసారును, జయరాములును కూడా.
వైనతేయ పూర్తి ఆత్మవిశ్వాసం తొణికిసలాడే వదనంతో ఉన్నాడు. ఏ మాత్రం నెర్వస్‌నెస్ లేదు అతనిలో. కళాకారుడికి కావలసింది అవే.
“భక్తులకు అందరికీ నమస్సులు. ఆ జగదోద్ధారకుడు, దేవదేవుని సన్నిధిలో హరికథాగానం చేసే భాగ్యం కలిగించినందుకు యస్.వి.బి.సి. ఛానెల్ వారికి కృతజ్ఞతలు. ‘కుచేలోపాఖ్యానం’ గొప్ప కథ. దానిని సినిమాలలో, ఇతర హరికథలలో, భగవంతునికి భక్తునికి గల అనుబంధంగా చూపించారు. కాని నేను దానిని ఇద్దరు బాల్య స్నేహితుల మధ్య అనుబంధంగా ఆవిష్కరిస్తాను. స్నేహితులు కాలక్రమాన ఏ స్థితిలో ఉన్నా వారి స్నేహం చెక్కుచెదరదని నిరూపిస్తుంది ఈ కథ.
ముందుగా విఘ్ననాధస్తుతి!”
రూములో, అన్ని పద్యాలకు, పాటలకు రాగాలను దస్తగిరిసారుతో చెప్పిఉన్నాడు.
“ఆర్యులారా, వినాయక స్తుతులలో, అన్నింటి కంటే నాకు నచ్చింది కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు రాసిన పద్యము. ఎటువంటి సంస్కృత పద భూయిష్టమైన సమాసాలు లేకుండా తేట తెలుగులో వ్రాశారు కరుణశ్రీవారు. ‘సింధుభైరవి’ రాగంలో దీనిని వినండి!”
సీ.:
ఎలుక గుఱ్ఱము మీద నీరేడు భువనాలు
పరువెత్తివచ్చిన పందెకాడు
ముల్లోకముల నేలు ముక్కంటి యింటిలో
పెత్తనమ్మొనరించు పెద్దకొడుకు
‘నల్ల మామా’ యంచు నారాయణుని పరి
యాచకాలాడు మేనల్లు కుఱ్ఱ
వడకుగుబ్బలి రాచవారిబిడ్డ భవాని
నూఱేండ్లు నోచిన నోముపంట
తే.గీ.:
అమరులం దగ్రతాంబూల మందు మేటి
ఆఱుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె
ఆంధ్రవిద్యార్థి లెమ్ము జోహారు లిడగ
~
“చూశారా! ఎంత చమత్కారంగా వర్ణించారో గణపయ్యను. ఇక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థించి, కథలోనికి వెళదాము. ఇది పోతన గారి పద్యం. కుచేలోపాఖ్యానం లోనిదే. దీనిని ‘తిల్లాంగ్’ చేశాను.”
సీ.:
ఇందీవరశ్యాము వందిత సుత్రాము,
గరుణాలవాలు భాసురకపోలు
గౌస్తుభాలంకారు గామితమందారు
సురుచిరలావణ్యు సురశరణ్యు
హర్యక్షనిభమధ్యు నఖిలలోకారాధ్యు
ఘనచక్రహస్తు జగత్ప్రశస్తు
ఖగకులాధిపయాను గౌశేయపరిధాను
బన్నగశయను నబ్జాతనయను
తే.గీ.:
మకరకుండల సద్బూషు మంజుభాషు
నిరుపమాకారు దుగ్దసాగరవిహారు
భూరిగుణసాంద్రు యదుకులాంభోధి చంద్రు
విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు గృష్ణు
వైనతేయ ఈ పద్యాన్ని గానం చేస్తుంటే, భక్తలు పరవశించారు. వారితో, “ఏడుకొండల వాడా! వేంకటరమణా! గోవిందా| గోవింద!” అని ముమ్మారు నినదింపజేశాడు. ఆ పద్యాన్ని విన్న, మూలవిరాట్టు ‘ఎంత బాగా రాశాడు పోతన్న! ఈ హరిదాసు కూడా ఎంత బాగా పాడాడు!’ అనుకుని ఉంటాడు.
సదాశివశర్మగారు ముందువరుసలో వకుళమ్మగారితో కూర్చుని ఉన్నారు. ‘ఏమి వీని పద్యాల ఎన్నిక. ఏ ‘కస్తూరీతిలకమో’ కాకుండా, ఎంత చక్కని పద్యాన్ని తీసుకున్నాడు!’ అనుకొన్నారు.
ఆ పద్యం చదువుతూంటే స్వామివారి దివ్యమంగళ విగ్రహం ప్రేక్షకుల కళ్ల ముందు సాక్షాత్కరించింది. ‘విజువలైజేషన్’ అనేది హరికథకు ప్రాణం.
“కుచేలునికి సుదాముడని పేరు. కృష్ణుడు, సుదాముడు, చిన్నపుడు సాందీపని మహర్షి ఆశ్రమంలో కలిసి చదువుకోన్నారు. ఆడి పాడినారు. ఆ ఆశ్రమం ఇప్పటికీ, ఉజ్జయినీ నగరంలో ఉంది. మహాకాలేశ్వరుని దర్శించిన వారంతా దానిని తప్పక సందర్శిస్తారు.
భార్య కోరిక మేరకు తన స్నేహితుడు శ్రీకృష్ణుని చూడడానికి బయలుదేరాడు సుదాముడు. తమ బాల్యస్మృతులను ఇలా గుర్తుకు తెచ్చుకుంటున్నాడు, వినండి!” అంటూ ఒక పాట అందుకోన్నాడు మోహన రాగంలో.
పల్లవి:
నల్లవాడు గొల్లపిల్ల వాడు వీడు
అల్లరిలో గొప్ప మల్లయోధుడు
బక్క వెధవా అని నన్ను గేలి చేయును సతము
మసిబొగ్గు రంగువాడని నేను పిలుతు
పండ్లు, ఫలములు తినుబండరములు ఏవైన
నాకు పెట్టక తాను తినడు వాడు (నల్ల)
వాడికంటే చదువులో నేను మిన్నగ నిల్తునని
కుళ్లుకోడెప్పుడు, కూర్మిపొగడు
పేదవానినటంచు వేలెత్తి చూపడు
వాని స్నేహమదియె పెన్నిధి నాకు (నల్ల)
వాని చూడ మిగుల కౌతుకంబయ్యెను
ఎటులున్నాడో! ఏమొ! నా నేస్తగాడు
చూడగానె ఒక్క టెంకి జెల్ల కొట్టి
కౌగిలించుకొందు గట్టిగాను (నల్ల)
~
కొంత జానపద రీతిలో సాగిన ఆ పాటకు జయరాములు తబలా అదరగొట్టాడు!
“భక్తులారా! శ్రీకృష్ణుడు మనకు దేవుడు గాని, కుచేలునికేం దేవుడు? ప్రాణస్నేహితుడంతే! యన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరావు గార్ల మహానటులు మనకు సార్లు. వారితో చిన్నతనంలో కలిసి చదువు కొని, ఆడిపాడిన వాళ్లకు వాళ్ల గొప్ప కాదు. ‘ఒరేయ్ రామూ, ఒరీయ్ నాగేశు! నీకు బుద్ధి లేదురా!’ అనగలరు! నిజమా కాదా చెప్పండి?”
సభలో ఒకటే నవ్వులు. “నిజమే! నిజమే!” అని కేకలు.
ప్రేక్షకులు లీనం చేయడమే కాకుండా, ఇన్వాల్వ్ చేస్తున్నట్లు సదాశివశర్మ గారు గమనించి, ఆనందించారు.
“కుచేలుడు ద్వారకానగరం చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు నివసిందే రమ్యదివ్యభవనం ప్రవేశద్వారం వద్ద కాపలాభటులు అతన్ని అడ్డగించారు. లోపలికి పోనివ్వలేదు. ఆయనకు కోపం వచ్చింది. ‘ఓరీ వివేకహీనులారా, నేను కృష్ణునికి బాల్యమిత్రుడిని. నేను తనను చూడడానికి వచ్చినానని, వెళ్లి వానితో చెప్పండి. వాడు మిమ్ములను తిట్టి, నన్ను తోడ్కొని వెళ్లగలడు’ అన్నాడు.”
భటులు పడీ పడీ నవ్వారు. “ఏమిటీ? బక్క బీద బాపనయ్యవు. నీవు మా స్వామివారికి మిత్రుడివా?” అన్నారు. తపతప చెంపలు వాయించుకుని, “స్వామి వారిని శ్రీకృష్ణుడనకుండా, కృష్ణుడంటున్నావు. వాడు, వీడని అగౌరవంగా మాట్లాడుతున్నావు. నీకంత మదమా?” అన్నారు.
“శుంఠల్లారా! బొత్తుగా ఇటువంటి బడుద్దాయిలను పెట్టుకున్నాడేమిరా మా నల్లోడు! వాడు మీకు ‘స్వామివారు’ కావచ్చు కాని నాకేమిరా? నాకు వాడు అనుంగు చెలికాడు” అన్నాడు సుదాముడు.
భక్తులు నవ్వును అదుపు చేసుకోలేకపోతున్నారు.
భటులు ఒకడు “ఒరేయ్! నాకెందుకో అనుమానం వస్తూంది. ఒకసారి వెళ్లిస్వామి వారికి విన్నవించరా!”
వాడు వెళ్లి స్వామికి సాగిలబడి, “దేవా! ఎవరో బక్క బ్రాహ్మడు వచ్చినాడు. మిమ్ములను వాడు అంటున్నాడు. ‘నల్లోడు’ అని కూడా అంటున్నాడు, ద్వారకాధీశా?” అని చెప్పాడు.
“పరమాత్ముడు పడీపడీ నవ్వాడు!”
దేశవ్యాప్తంగా యస్.వి.బి.సిలో ‘నాద నీరాజనం’ చూస్తున్న భక్తులు కూడా.
“అట్లా అన్నాడా! వాడు ఖచ్చితంగా నా మిత్రుడు సుదాముడే! వాడికి తప్ప, అంత చనువుగా నన్ను పిలిచే అధికారం ఇంకెవరికుంది? ఎక్కడ! నా ప్రాణస్నేహితుడెక్కడ?” అని పరుగు పరుగున బయటికి వచ్చాడు జగన్మోహనుడు.
చేతులు చాచి, “సుదామా! ఎన్నాళ్లకెన్నాళ్లకు? అంతా కుశలమేనా?” అని ముందుకు వస్తుంటే,
“చాల్లే ఆపు! నీ నటనలు! నీ భటులు నన్ను అనరాని మాటలన్నారు. వచ్చి గంట అయ్యింది. ముందు వీళ్లకు గడ్డి పెట్టు.” అన్నాడు కుచేలుడు కోపంగా.
భటులు ఆయన కాళ్ళ మీద పడిపోయారు! “విప్రోత్తమా! అజ్ఞానంతో మిమ్ములను అవమానించినాము. మమ్ము క్షమి౦పుడు.”
శాంతించాడు కుచేలుడు. శ్రీకృష్ణుడు ఆయనను గుచ్చి ఎత్తి కౌగిలించుకున్నాడు. సాదరంగా రుక్మిణీదేవి మందిరానికి తోడ్కొని వెళ్లాడు.
“పడకగదిలో హంసతూలికా తల్పం మీద తన ప్రక్కనే కూర్చొబెట్టుకొన్నాడు. అంతేగాని, సినిమాల చూపినట్లు అతని కాళ్లు కడిగి, పూలు పెట్టలేదు. స్నేహితుని ప్రేమిస్తారు గాని పూజిస్తారా ఎవరైనా?”
“మిత్రునికి ఎన్నో సపర్యలు చేసి, మేన గంధము పూసి, రుక్మిణీ దేవితో విసనకర్రతో విసిరించాడు కృష్ణయ్య. అప్పుడు అష్ట భార్యలు, విస్మయంతో ఇలా అనుకున్నారట.
ఉ॥
ఏమి తపంబు సేసెనొకొ! యీ ధరణీదివిజోత్తముండు తొల్
బామున! యోగివిస్ఫుర దుపాస్యకుఁడై తనరారు నీ జగ
త్స్వామి రమాధినాథు నిజతల్పమునన్ వసియించి యున్నవా
డీ మహనీయమూర్తి కెనయే మునిపుంగవు లెంతవారలున్?
నిజమే! భగవంతునికి భక్తుడవడం సరేగాని మిత్రుడవడం, అంత ప్రేమను పొందడం కుచేలుని ప్రత్యేకత.
ఆయనను దేవునిగా కాకుండా, ఇష్టసఖునిగా, చనువుగా చూడడం సుదామునికే చెల్లింది. అందుకే మనం సినిమాలలో చూసినట్లుగా, కుచేలుడు భక్తిపారవశ్యంతో, చేతులు మోడ్చి, వంగిపోయి, వంకరలు తిరుగుతూ, కళ్ల నీళ్లతో ప్రవర్తించలేదు.”
మళ్లీ నవ్వులు!
తన భార్యలను అందరినీ పరిచయం చేస్తే, కుచేలుడిలా అనుకున్నాడు – ‘ఒక్క భార్యనే పోషించలేకపోతున్నానే, వీడు ఇంతమంది భార్యలతో ఎలా నెట్టుకొస్తున్నాడో గదా!’
భక్తులు వైనతేయ పాయింట్ ఆఫ్ వ్యూకు బాగా కనెక్ట్ అయిపోయారు. అంత సహజంగా ఉంది కథనం.
“నా కోసం ఏమి తెచ్చినావు, కుచేలా?”
“మరచాను రోయ్! ఇదిగో, మీ చెల్లెలు, నీకు అటుకులు పంపింది, తిను.”
“ఏమిటీ! అటుకులా! నాకెంత యిష్టమో! ఏదీ? త్వరగా ఇవ్వరా! ఈ ముడి యింత గట్టిగా వేశావేమిటి?” అంటూ ఆత్రంగా అటుకులు తినసాగాడు కృష్ణుడు. పైగా “యివియ సకలలోకంబులను, నన్నును బరితృప్తింబొందింప జాలును” అన్నాడని పోతనగారు చెపుతున్నారు.
రెండవసారి పిడికిలితో తీసుకొంటుంటే రుక్మిణీదేవి ఇలా వారించింది.
కం॥
సొంపారగ నతనికి బహు
సంపదలందింప నివియ చాలును నిక భ
క్షింపవలదు త్రిజగ
త్సంపత్కర! దేవదేవ! సర్వాత్మ! హరీ!
అప్పుడు కుచేలునికి రుక్మిణీ దేవిపై కోపం వచ్చింది. “ఏవమ్మా ! నీ పేరేమి? రుక్మిణీ దేవి కదా! అయినా, మా వాడి తిండి మీద కూడా నీ పెత్తనమేమిటి? తిననివ్వు! ఎందుకు వద్దంటున్నావు?” అన్నాడు.
సభ గొల్లున నవ్వింది!
స్వామి చిరునవ్వుతో రుక్మిణిని చూశాడు.
‘‘సుదామా! చాలా కాలానికి కలిశాము. నీకేం కావాలో చెప్పు, సంపదలు, గోవులు, రత్నమాణిక్యాలు, భవనాలు, ఏవైనా సరే!’’
కుచేలుడు పకపకనవ్వి, “ఒరేయ్ నల్లోడా, నన్ను పరీక్షిస్తున్నావా? నాకు సంపద లెందుకురా? నీ స్నేహాన్నిమించిన సంపదేదిరా ఈ లోకంలో?” అన్నాడు.
“భక్తులారా! నిజమైన సంపద ఏమిటో తెలిసిందా!
శ్రీమద్రమారమణ గోవిందో హరి! ఏడుకొండలవాడా! వేంకటరమణా గోవిందా! గోవింద!”
భక్తులు పరవశులైనారు. నినదించారు ముమ్మారు.
“అయ్యలారా! కుచేలునికి తాను దరిద్రము అనుభవిస్తున్నానన్న స్పృహే లేదు. గృహస్థుడయ్యును ఆయన తపశ్శాలి. భార్య పోరు పడలేక వచ్చినాడు. కాని, ఆయన ఏదీ స్నేహితుడి నుండి ఆశించలేదు. ఆశిస్తే స్నేహితుడెలా అవుతాడు? యాచకుడవుతాడు!”
సభికుల చప్పట్లు!
“వెళుతూ కృష్ణునితో చెప్పాడు చెవిలో – “ఒరేయ్, వెళ్లొస్తా, భాగ్రత్త! నీ భార్యల వాలకం చూస్తే వంట వచ్చినట్లుగా లేదు. ఆ రుక్మిణమ్మ నిన్ను సరిగా తిననివ్వడం కూడా లేదు. పాపం! చిక్కిపోయినావు రా! ఒకరికి ఎనిమిది మందైతే ఇట్లాగే ఉంటుందేమో! సమయానికి ఇంత తింటూ ఉండరా! నీవసలే అమాయకుడివి!”
పరమాత్మకు ఆ మాటలకు కళ్ళు చెలమలయినాయి! మిత్రుని కౌగిలించుకుని, ప్రవేశ ద్వారము వరకు వచ్చి వీడ్కోలు పలికాడు. రథం ఆయన ఆఫర్ చేయలేదు. వద్దంటాడని, పైగా తిడతాడని తెలుసు!”
మళ్ళీ నవ్వులు.
ఆయిన యిల్లు చేరేసరికి పూరింటి స్థానంలో దివ్యభవనం. అయోమయంగా చూస్తుంటే, సకలాభరణ భూషితయైన ఆయన యిల్లాలు, చక్కని వస్త్రములు ధరించి ముద్దులొలుకుతున్న పిల్లలు ఎదురువచ్చారు.
“ఇదేమిటి? వద్దన్నా వినకుండా ఇవన్నీ సమకూర్చాడా వాడు? ఉండండి వాడి సంగతి తేలుస్తాను” అంటుంటే భార్య వారించి, నచ్చ చెప్పిందట. ఆ భోగభాగ్యాలన్నీ వారికే. కుచేలుడు స్నానమాచరించి, జపతపధ్యానములలో మునిగాడట.”
చివర, మంగళాశాసనంతో హరికథ ముగిసింది.
***
మరో ఐదేళ్లు గడిచాయి. వైనతేయకు కోడుమూరు హైస్కూలుకు, దస్తగిరిసారుకు ఉళిందకొండ అప్పర్ ప్రైమరీ స్కూలుకు ట్రాన్స్‌ఫర్ అయింది. ఈ అయిదేళ్లలో వైనతేయ విజయప్రస్థానం కొనసాగుతూనే ఉంది.
మన ప్రాచీన సాహిత్యంలోని ‘వ్యక్తిత్వవికాస పరిమళాలు’ అనే అంశం ఆధారంగా అతడు రూపొందించిన ‘వ్యక్తిత్వశిల్పము’ అనే హరికథ బహుళ పాచుర్యం పొందింది. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల వాళ్లు, ఎం.బి.ఎ. కాలేజీలవాళ్లు అతన్ని తమ సంస్థల్లో ఆ హరికథను చెప్పమని ఆహ్వానించసాగారు. అలా అది ఒక మోటివేషనల్ ఫోర్స్‌గా మారింది. ప్రొఫెషనల్ కాలేజీల సర్కిల్‌లో అతనికి ‘మోటివేషన్ మాస్టర్’ అని పేరు వచ్చింది. అదే పేరుతో వైనతేయ ఒక పుస్తకం వ్రాశాడు. తెలుగులో ‘జాగృతవాణి’ అనే వారపత్రిక, హైందవ సనాతన ధర్మానికి కట్టుబడి ఉండేది, దానిని సీరియల్‌గా ప్రచురించసాగింది. కేవలం హైందవ మతానికి చెందిన ప్రాచీన సాహిత్యం నుంచే కాకుండా, ఇంగ్లీషు సాహిత్యం నుంచి, బైబిల్, ఖుర్‌ఆన్ లోని మౌలిక సూత్రాలనుండి, ‘గురుగ్రంథ్ సాహిబ్’ గ్రంథం నుండి, ఇస్కాన్ సంస్థ సిద్ధాంతాల నుండి, అక్షరధామ్ భావజాలం నుండి, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఎన్నో విషయాలను, ఆసక్తికరంగా పొందుపరచాడు వైనతేయ. దానివల్ల ఆ పుస్తకానికి ‘విశ్వజనీనత’ కలిగింది. ‘ఏకంసత్; విప్రాః బహుధావదన్తి’ అన్న ఆర్యోక్తికి తార్కాణంగా నిలిచింది ఆ పుస్తకం. దానిని అతడే, ‘Personality Development: The Indian Perspective’ అన్న పేర, ఆంగ్లంలోకి అనువదించాడు. దానిని యస్. చాంద్ అండ్ కంపెనీ వారు ప్రచురించారు. దాని అమ్మకాల వల్ల వైనతేయకు వేలకొద్దీ రూపాయల రాయల్టీ రాసాగింది. ఇతర రాష్ట్రాలలో సైతం అతన్ని మోటివేషనల్ స్పీకర్‌గా ఆహ్వానించసాగారు. చేతన్ భగత్ అన్న ప్రసిద్ధ రచయిత దానిని ‘ది నీడ్ ఆఫ్ నేషన్’ అని ప్రశంసించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక దానిని సమాక్షిస్తూ, “a torch bearer to the Indian youth” గా అభివర్ణించింది. హరికథను ఇంకా ఎలా innovative గా మలచవచ్చో ఆలోచించ సాగాడు వైనతేయ. ఈలోపు అతనికి వివాహం కూడా అయింది. వధువును చూసింది కూడా దస్తగిరిసారే! ఆ అమ్మాయి పేరు శర్మిష్ఠ. వారిది ‘లంబాడీ తాండ’. పాణ్యం దగ్గర. ఆమె తండ్రి రాగ్యానాయక్ వ్యవసాయదారుడు. గొర్రెల పెంపకం కూడా ఉంది. శర్మిష్ఠ పాణ్యంలో ఇంటర్ వరకు చదివింది. పెద్దల ఆశీర్వాదంతో వారి వివాహం నంద్యాల ‘మహనంది’ క్షేత్రంలో జరిగింది నిరాడంబరంగా.
‘సంప్రదాయ సాహిత్యం, పురాణాలు, ఇతిహాసాల నుండే హరికథలు తయారయినాయి. ఆ మొనోటనీని బ్రేక్ చేయాలి..’ అనుకున్నాడు వైనతేయ.
గురజాడ వారి ‘కన్యాశుల్కం’ నాటకాన్ని హరికథగా మలిచాడు. దాని ప్రదర్శన శ్రీకాకుళంలో జరిగింది. గురజాడవారి అభిమానులు, దానికి న్యాయం చేశాడని ప్రశంసించారు. భవభూతి మహాకవి ‘ఉత్తర రామచరిత్రము’ను, దండి దశకుమార చరిత్రమును, శ్రీనాధుని శృంగారనైషధాన్ని, పెద్దనగారి మను చరిత్రను ఇలా ఎన్నో ప్రబంధాలను కావ్యాలను హరికథలుగా మలచి వాటికి మరింత ప్రాచుర్యము కలుగజేశాడు. మూలంలోని ప్రసిద్ధ పద్యాలను కథలో వాడుకొనేవాడు.
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.