[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమారమణ’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము. డల్లాస్ లోని సిరికోన సంస్థ – నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది.]
[వైనతేయ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో హె.ఇ.సి గ్రూపులో ఇంగ్లీషు మీడియంలో చేరుతాడు. మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా, రాను రాను ఇంగ్లీష్ మీడియం సులువవుతుంది. కాలేజీలో తెలుగు, ఇంగ్లీషు లెక్చరర్ల అభిమానాన్ని పొందుతాడు వైనతేయ. కాలం గడుస్తుంది. వైనతేయ 73 శాతం మార్కులతో ఇంటర్ పాసవుతాడు. కోనేటయ్య దంపతులు దస్తగిరిసారు అప్పు తీర్చేస్తారు. ఆర్థికంగా కొంత నిలదొక్కుకుంటారు. వైనతేయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, కడప ఆర్ట్స్ కాలేజీలో బిఎలో చేర్పిస్తాడు దస్తగిరిసారు. ఇక్కడ కూడా గురువులందరికీ ప్రియశిష్యుడవుతాడు వైనతేయ. ఒకసారి కడప టౌన్ హాల్ నరాల రామిరెడ్డిగారి అష్టావధానం జరిగితే వెళ్తాడు వైనతేయ. ఆయన ఆశువుగా పద్యాలను అలవోకగా చెప్పడం బాగా నచ్చేస్తుంది. కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ డే సాంస్కృతిక పోటీలలో పుట్టపర్తి వారి ‘శివ తాండవం’ లోని కొన్ని అద్భుత చరణాలను రాగయుక్తంగా అభినయిస్తాడు. అందరి మెప్పు పొందుతాడు. డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తవుతుంది. రెండో సంవత్సరంలో ఉండగా ప్రొద్దుటూరులో హరికథా సప్తాహం జరగనున్నదనీ, హరికథకులు తమ పేర్లు నమోదు చేయించుకోవాలనే ఓ ప్రకటన చూసి, ప్రొద్దుటూరుకు వెళ్తాడు. అక్కడ అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో హరికథా సప్తాహంలో పాల్గొనే వారి పేర్లు నమోదు చేసుకుంటున్న ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కరిస్తాడు. – ఇక చదవండి.]
“ఏం కావాల నాయనా?” అనడిగాడాయన.
“హరికథ చెప్పడానికి నా పేరు రాయించుకుందామని సామి” అన్నాడు వినయంగా.
“నీవా? హరికథ చెబుతావా?” అని ఆశ్చర్యపోయినాడాయన. ఈ ఆశ్చర్యాలు వైనతేయకు అలవాటే.
“నీ పేరు?”
“వైనతేయ సామి!”
“వయసు?”
“పంతొమ్మిదేండ్లు”
“ఊరు?”
“కడప. కడప ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నా.”
“సొంత ఊరు కడపేనా?”
“కాదండి. ‘యానాదుల దిబ్బ’ అనీ కర్నూలు జిల్లా ప్యాపిలి దగ్గర”
ఆయన కనుబొమలు ముడివడినాయి! భాష, ఆహార్యం, ఉచ్చారణ చూస్తే ‘అట్లా’ లేడు! ‘అయినా కులానికి విద్వత్తుకూ సంబంధం ఏముంది?’ అనుకున్నాడా సంస్కారి.
“ఏం కథ చెబ్తావు?”
“శంకరవిజయం అండి. ఆదిశంకరాచార్యుల వారి కథ!”
“అబ్బ! గట్టివానివేనే!” అని ముచ్చటపడాయన. ఆసక్తిని అణచుకోలేక “ఏదీ మా శివుని మీద ఒక పద్యమో శ్లోకమో చెప్పు నాయనా!” అన్నాడు. ఆయన కూర్చున అరుగు అమ్మవారి గుడిది. అక్కడ రాజరాజేశ్వరీ దేవి నిలుచున్న భంగిమలో దర్శనం ఇస్తూన్నది; ఒక చేతిలో కమలం ధరించింది. ఆమెకు నమస్కరించి,
“మీరు అనుమతిస్తే, అమ్మవారి మీద ఒక శ్లోకం చదువుతాను” అన్నాడు వైనతేయ.
“అట్లే గానీ నాయనా?” అన్నాడాయన.
వెంటనే గొంతు సవరించుకొని, శ్రీ లలితాసహస్రనామస్తోత్రము లోని ధ్యాన శ్లోకమును, భూపాలరాగంలో ఆలపించాడు. కౌతాళంలో ఆంజనేయ శర్మగారి భార్య వల్లెలాంబ రోజూ దాన్ని చదివేది వినీ, వినీ, అది వాడికి నోటికి వచ్చింది. వల్లెలాంబ లలితాదేవిని ఉపాసించేది. ఆమె గుర్తుకు వచ్చి, వైనతేయ హృదయం బరువెక్కింది. కన్నతల్లిలా ఆదరించిందా మహాయిల్లాలు!
శ్లో:
సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫుర
త్తారా నాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహమ్
పాణిభ్యామళి పూర్ణ రత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికామ్
వైనతేయ శ్లోకాన్ని ప్రారంభించగానే, పది పన్నెండు మంది భక్తులు వచ్చి, అక్కడ చేరి వినసాగారు. వారిని చూసి మరికొందరు చేరారు. వైనతేయ గాత్రం సుమధురం. యవ్వనారంభ స్థితి వల్ల అది ఇప్పుడిప్పుడే గాంభీర్యాన్ని సంతరించుకుంటూ ఉంది.
భక్తులు ఆనందంతో చప్పట్లు కొట్టారు! వారిలో ఒకాయన ముందుకు వచ్చి
“ఎవరు నాయనా నీవు? సాక్షాత్తు బాల నారదుడిలా పాడావే!” అని మెచ్చుకున్నాడు.
పేరు రాసుకున్నాయన చెప్పాడు “హరికథా సప్తాహానికి పేరు రాయించుకున్నాడు ఆడిటర్ గారు! ‘పిట్ట కొంచెం కూత ఘనం!’ అన్నది ఈ పిల్లవాడికి సరిగ్గా సరిపోతుంది!”
వచ్చినాయన పొద్దుటూరు లోని పేరున్న ఆడిటర్ రూపావతారం నాగరాజశర్మ గారు.
“ఈ శ్లోకం ఏ వృత్తమో చెప్పు నాయనా?” అన్నాడాయన.
“శార్దూల వృత్తమండి”
“మరి యతిప్రాసలు లేవే?”
“తెలుగులో ఉంటాయి గాని, సంస్కృతంలో ఉండవండి” అన్నాడు వాడు.
“అవును. నాకు తెలుసు. నీవేమంటావో అని అడిగాను. భేష్!” అని మెచ్చుకున్నాడాయన. జేబు లోంచి నూరు రూపాయల నోటు తీసి వాడికిచ్చాడు. వాడు వద్దన్నా వినలేదు.
“నీ విద్వత్తుకు విలువ కట్టలేను గానీ, నా సంతోషం కోసం తీసుకో!” అన్నాడా గుణగ్రాహి. ఆయనకు పాదాభివందనం చేశాడు వైనతేయ.
తర్వాత అగస్త్యేశ్వర స్వామివారిని దర్శించుకున్నాడు. స్వామి వారిని అగస్త్య మునీంద్రుడు పూజించాడని ఐతిహ్యం. ఆయనే ప్రతిష్ఠించాడని కూడా అంటారు. ఎనిమిదో శతాబ్దంలో ఆలయం నిర్మించబడిందట. శివలింగం 3 అడుగుల ఎత్తు ఉంది బూడిద రంగులో.
పుట్టపర్తివారు ఈ ఆలయం లోనే, ప్రదక్షిణాలు చేస్తూ, తమ శివతాండవ కావ్యాన్ని సృష్టించారని వైనతేయ చదివి ఉన్నాడు. ఆలయం బయట ఒకామె గుంట పొంగణాలు వేస్తున్నది. పన్నెండు పొంగణాలు ఐదు రూపాయలు. వాటిల్లోకి కొరివికారం పచ్చడి ఇచ్చింది. దేవాలయం ముందే బస్ స్టాప్ ఉంది. బస్సెక్కి, కడప చేరుకున్నాడు. అతడు హరికథా గానం చేయవలసిన తేదీ, సమయం, ఒక కాగితం మీద రాసి యిచ్చాడాయన. సరిగ్గా నెలరోజులుంది.
తర్వాత శుక్రవారం సాయంత్రం నంద్యాల చేరుకున్నాడు. నూనేపల్లెలో దిగి నవనంది విలాస్‌కు వెళతాడు ప్రతిసారీ. ఎందుకంటే అమ్మా, నాయన, విధులు పూర్తయి ఇల్లు చేరేసరికి రాత్రి పదవుతుంది.
రామ్మునిగౌడు వైనతేయను ఆదరంగా పలకరించినాడు. వైను షాపు ముందర బండి లోంచి అలసంద వడలు తెప్పించినాడు. రాత్రి అమ్మావాళ్లతో బాటు, చపాతీ, ఎగ్ మసాలా తిన్నాడు. మర్నాడుదయం అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో బేతంచెర్లకు బయలుదేరినాడు.
దస్తగిరి సారు ఇంట్లోనే ఉన్నాడు. సారుకు, కాశింబీ అమ్మకు మొక్కినాడు. ఆమె వాడిని అక్కున చేర్చుకుంది. సారుకింకా పది సంవత్సరాల సర్వీసు ఉంది. కాశింబీ వారికి అల్లం టీ ఇచ్చింది. టిఫిన్ ఉగ్గాని చేసింది.
సారుతో చెప్పాడు వైనతీయ, ప్రొద్దుటూరు హరికథా సప్తాహం గురించి. ఆయన చాలా సంతోషించినాడు.
“ఒరేయ్, వచ్చేది రెండో శనివారం. నేను పొద్దున్నే బయలుదేరి కడపకు పదిగంటల కల్లా వస్తాను. ఇద్దరం తిరుపతికి పోయి మన సదాశివశర్మ గారిని దర్శించుకుదాం. ఇప్పటి వరకు నీవు చెప్పినవి వేరు. ఇది పోటీ. ఆయన వద్ద కొంత మార్గదర్శకత్వం నీకు అవసరం.” అన్నాడు.
వైనతేయ సంతోషించాడు.
***
సి.పి. బ్రౌన్ గ్రంథాలయంలో, మధిర సుబ్బన్నదీక్షితులు గారు వ్రాసిన ‘శంకరవిజయం’ గ్రంథం దొరికింది వైనతేయకు. ‘కాశీమజిలీ కథలు’ వ్రాసి వినుతికెక్కిన మహనీయుడాయన. ఆ కథల ఆధారంగా తెలుగులో యన్టీఆర్, కాంతారావు నాయకులుగా ఎన్నో జానపద సినిమాలు నిర్మితమయినాయి. సుబ్బన్నగారి గ్రంథం వచనకావ్యం. దానిని క్షుణ్ణంగా చదివి, హరికథకు తగినట్లుగా దానిని వ్రాసుకున్నాడు. రోజూ రాత్రి 8గం వరకు లైబ్రరీ లోనే గడిపేవాడు. హాస్టల్లో అప్పటికి భోజనం వేళ దాటిపోతుంది. ఏడు రోడ్ల కూడలి లోని ఒక టిఫిన్ బండి దగ్గర ఇడ్లీలో దోసెలో తినేవాడు. బేతంచెర్లకు వెళ్లినప్పుడల్లా కోనేటయ్య కొడుక్కు కొంత డబ్బు ఇచ్చేవాడు పై ఖర్చులకు.
సుబ్బన్న గారి రచనను ఎలా ప్రదర్శించాలో ఒక అవగాహన వచ్చింది. దాన్ని సదాశివశర్మగారికి చూపిస్తే, మెరుగులు దిద్దుతారు. అనుకున్నట్లే దస్తగిరిసారు శనివారం కడపకు వచ్చాడు. ఇద్దరూ రైల్వే స్టేషనుకు వెళ్లి, సిద్ధంగా ఉన్న జయంతి జనతా ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రాజంపేటలో కూర్చోడానికి సీట్లు దొరికాయి.
వారు తిరుపతిలో దిగేసరికి ఒకటిన్నర. స్టేషన్ ఎదుట మురుగన్ భవన్‌లో భోజనం చేశారు.
డబ్బు వైనతేయ ఇవ్వబోతూంటే దస్తగిరిసారుకు కోపం వచ్చింది.
“ఏమిరా? అంతటోడివైపోయినావా అప్పుడే? గమ్మునుండు వెధవా!” అని తిట్టుడాయన.
“నా దగ్గర కూడా డబ్బులున్నాయని..” అని నసుగుతుంటే..
“ఉండనీ! రేపు నీకుద్యోగమొచ్చినాక నీవే పెడుదువుగాని” అన్నాడు ఆయన అభిమానంగా.
ప్రొద్దుటూరులో ఆడిటర్ నాగరాజశర్మగారు అమ్మవారిపై తాను పాడిన శ్లోకం విని నూరు రూపాయలిచ్చారని చెప్పాడు వినయంగా.
“ఇయ్యకపోతే ఆశ్చర్యపడాల!” అన్నాడు దస్తగిరిసారు.
సదాశివశర్మగారు రిటైరైనారు. వకుళమ్మగారు వైనతేయను చూసి కంటనీరు పెట్టుకుంది.
“ఎంతవాడివైనావు రా” అన్నది వాత్సల్యంతో.
“భోజనాలు చేసినారా నాయనా?” అనడిగిందా అన్నపూర్ణమ్మ తల్లి.
“కొంచెం మెంతి కూర పప్పు, చామదుంపల పొడి కూర ఉన్నాయి. వేడిగా అన్నం చేస్తా” అంటా వంటిట్లోకి వెళుతుంటే,
“అమ్మా, పొద్దు పోయిందని స్టేషన్ దగ్గర తిని వచ్చాము” అన్నాడు వైనతేయ. వాడి గొంతులో ఒక అపరాధ భావన!
“అయ్యో! మన యింటికి రాకుండా అదేం పనిరా?” అన్నదామె నొచ్చుకుంటూ.
ప్రొద్దుటూరు హరికథాసప్తాహం గురించి, తాను పాల్గొనబోతున్నట్లు, శర్మగారికి చెబితే, ఆయన సంతోషించారు.
“నాయనా, మంచి పని చేసినావు. పురస్కారం వస్తుందా రాదా అనే నిమిత్తం లేకుండా, మన విద్యను మనం ప్రదర్శించాలి. ఫలితం ఆ పరమాత్మకు వదిలేయాలి” అన్నారా విద్యన్మణి.
మధిర సుబ్బన్న దీక్షితులుగారి శంకరవిజయాన్ని, తాను హరికథగా అడాప్ట్ చేసుకుని వ్రాసుకున్నదాన్ని ఆయనకిచ్చాడు.
దస్తగిరిసారు అన్నాడు “స్వామి, మేము కొండకు వెళ్లి దర్శనం చేసుకొని వస్తాము, అయితే.”
“వెళ్లిరండి నాయనా, ఈ లోపల నేను వీడు తయారు చేసింది పరిశీలిస్తాను. మీరు, వకుళమాత గెస్ట్ హౌస్ మేనేజరు, నా శిష్యుడు కృష్ణస్వామి దగ్గరికి వెళ్లి నేను పంపించినానని చెప్పండి. వాడు మీకు దర్శనం చేయిస్తాడు.”
అప్పటికింకా తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనం అంత దుర్లభం గాలేదు.
వారు దర్శనం చేసుకొని వచ్చేసరికి రాత్రి తొమ్మిదయింది. నిత్యాన్నదాన సత్రంలో తినిపోతే వకుళమ్మగారు, శర్మగారు బాధపడతారని, వచ్చేశారు. వకుళమ్మగారు కందిపచ్చడి, ముల్లంగి పులుసు (సాంబారు) చేసి పేలాల వడియాలు వేయించింది. ఇద్దరికీ కొసరి కొసరి వడ్డించింది.
ఎందుకో మరి, తిరుపాలమ్మ, వల్లెలాంబ, వకుళమ్మ, ముగ్గురూ తన అమ్మల్లాగే అనిపిస్తారు వాడికి. అట్లే, దస్తగిరిసారు, అంజనేయ శర్మగారు, సదాశివశర్మగారు తన తండ్రి కోనేటయ్యలాగే అనిపిస్తారు.
భోజనాలయిన తర్వాత శర్మగారు శంకరవిజయాన్ని ఎలా ప్రదర్శిస్తే బాగుంటుందో సూచనలు ఇచ్చారు. చండాల రూపంలో పరమశివుడు శంకరునికి ఎలా కనువిప్పు కలిగించాడో చెప్పమన్నారు
ఆయన రాసిన స్తోత్రాలు గ్రంథాలను రేఖామాత్రంగా స్పృశించమన్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని, తల్లితో ఆయనకు గల అనుబంధాన్ని బాగా విశ్లేషించమన్నారు. ప్రార్థనలో ఈ శ్లోకాన్ని గానం చేయమని చెప్పారు.
శ్లో:
శ్రుతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్
నమామి భగవత్పాద. శంకరం లోకశంకరమ్
“దీన్ని భూపాలంలో పాడు. తర్వాత నీకు ఒక పుస్తకం ఇస్తాను. ‘కోడూరి విష్ణునందన్’ అన్న యువకుడు వృత్తిరీత్యా వైద్యుడు. ఆయనది నంద్యాలే. ఆయన తండ్రి కోడూరి శేషఫణిశర్మగారు మంచి పండితుడు. ఈ పిల్లవాడు వైద్య విద్యను అభ్యసిస్తున్న కాలంలోనే ‘ధర్మదండము’ అనే పద్యకావ్యాన్ని వ్రాసిన బాలమేధావి. దానికి బేతవోలు రామబ్రహ్మం గారు, సి. నారాయణరెడ్డి గారు ముందుమాట వ్రాసి ఆ చిరంజీవిని ఆశీర్వదించారు. అందులో 1001 పద్యాలున్నాయి!
దానిలో శంకరుని చరిత్రను నాటకీకరించిన భాగాలున్నాయి. కొన్ని పద్యాలను ఎంపిక చేసి టిక్కు పెట్టాను. సందర్భానుసారంగా వాటిని ఉపయోగించుకో. వాటిని ఏ రాగంలో పాడవలెనో, మనిద్దరం కలిసి నిర్ణయిద్దాము. మీ తిరుగు ప్రయాణం ఎప్పుడు?” అడిగారు శర్మగారు.
“రేపంతా ఉంటాము స్వామి! రేపు సాయంత్రం రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు వెళదామని.. రాత్రి కడపలో వీడి దగ్గరే ఉండి, ఉదయం బేతంచెర్లకు వెళతాను. సోమవారం సెలవు పెట్టినాను. స్కూళ్ళు తెరిచింతర్వాత నాకు ప్రమోషన్ మీద బదిలీ అవుతుందండి, అప్పర్ ప్రయిమరీ స్కూలు హెడ్మాస్టరుగా! ఎక్కడికి వేస్తారో మరి!” చెప్పాడు దస్తగిరిసారు.
“మనోవాంఛా ఫలసిద్ధిరస్తు!” అని ఆశీర్వదించారు శర్మగారు. వైనతేయకు ఈ ప్రమోషన్, బదిలీ విషయం తెలియదు.
మర్నాడంతా, కోడూరి విష్ణునందన్ ధర్మదండం లోని పద్యాలు ఎలా ట్యూన్ చేస్తే బాగుంటుందో శర్మగారు సూచించారు.
రాజా రవివర్మగారు చిత్రించిన తైలవర్ణ చిత్రాన్ని, శంకరులు తమ శిష్యులకు బోధన చేస్తున్న సన్నివేశాన్ని, ఉటంకించమన్నారు. సాక్షాత్తు శివుడే ఆదిశంకరులుగా అవతరించారని విశదం చేయమన్నారు.
‘శివరహస్యము’ అన్న గ్రంథంలోని శ్లోకాన్ని రాసి యిచ్చారు. కూర్మపురాణంలోని శ్లోకాన్ని కూడా.
“దుష్టాచార వినాశాయ పాతుర్భూతో మహీతలే
సఏవశంకరాచార్యః సాక్షాత్ కైవల్యనాయకః”
“కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలతోహితః
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం, భక్తానాం హితకామ్యయా”
గోవింద భగవత్పాదులు శంకరుని నీవు ఎవరు? అని అడుగగా, ‘దశశ్లోకి’ స్తోత్రం చెప్పారు. అందులో ముఖ్యమైన శ్లోకాన్ని రాసియిచ్చారు శర్మగారు.
“న భూమిర్న తోయం న తేజో
న వాయుర్మఖనేంద్రియం వా
న తౌషాం సమూహః
అ నై కాంతి కత్వా త్యుషుప్త్యెక
సిద్ధి స్త దేశానకోవ అష్టః శివః కేవలోహం!”
“నేను నింగిని కాదు, భూమిని కాదు, నీటిని కాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేనివాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తం గాని లేనివాడిని. నేను శివుడను. విభజన లేని జ్ఞాన సారాన్ని.”
శర్మగారి పాదాలకు నమస్కరించాడు వైనతేయ.
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.